[సంచిక పాఠకుల కోసం ‘లీవ్ ద వరల్డ్ బిహైండ్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
సైబర్ నేరాలు – ఈ మాట వినగానే వెన్నులో చలి పుడుతుంది. ఎప్పుడు ఎవరు ఏ రూపంలో మన డబ్బు కాజేస్తారో అని అందరం హడిలిపోతున్నాం. ఇక దేశాల మీద సైబర్ దాడులు జరిగితే? పరిణామాలు ఎలా ఉంటాయో ఊహకే అందదు. కళాకారులు ఊహిస్తారు. అలా ఊహించిన చిత్రమే ‘లీవ్ ద వరల్డ్ బిహైండ్’ (2023). మనం ఎంతగా యంత్రాల మీద ఆధారపడిపోయామనే దాని మీద కూడా వ్యాఖ్యానం ఉంటుంది ఈ చిత్రంలో. ఒళ్ళు జలదరించే విషయమేమిటంటే జాగ్రత్తపడే వైపు కన్నా మన జీవితాలు అల్లకల్లోలమయ్యే వైపుకే మనం దగ్గరగా ఉన్నాం. ఇప్పటికే ఆలస్యమయిందేమో! ఇక కృత్రిమ మేధ పుంజుకుంటే ఎలా ఉంటుందో? ‘లీవ్ ద వరల్డ్ బిహైండ్’ అంటే ‘ప్రపంచాన్ని వదిలి సాగిపో’ అనే అర్థం వస్తుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. తెలుగు శబ్దానువాదం కూడా అందుబాటులో ఉంది.
న్యూయార్క్ నగరంలో ఉండే అమాండా అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలో పనిచేస్తుంది. మనుషుల స్వభావాలని అధ్యయనం చేయటం ఆమె పని. ఈ క్రమంలో ఆమెకి మనుషులంటే నమ్మకం పోయింది. ఒకరోజు ఆమె రోజువారీ జీవితం మీద విసుగుతో హఠాత్తుగా విహారయాత్రకి వెళ్ళాలని నిశ్చయించుకుంటుంది. కుటుంబంతో కలిసి వెళ్ళాలని ఆన్‌లైన్‌లో దగ్గరలో ఉన్న ఒక ప్రశాంతమైన ద్వీపం మీద సముద్రతీరానికి దగ్గర ఒక హోమ్ స్టే అద్దెకి తీసుకుంటుంది. ఆమె భర్త క్లే కాలేజీలో ప్రొఫెసర్. వారి పిల్లలు ఆర్చీ, రోజ్. ఆర్చీకి పదహారేళ్ళు, రోజ్‌కి పదమూడేళ్ళు. క్లే విహారయాత్రకి ఒప్పుకుంటాడు. పిల్లలు సరే సరి. అందరూ కలిసి కార్లో బయల్దేరుతారు. రోజ్ తన ట్యాబ్‌లో ‘ఫ్రెండ్స్’ అనే సీరీస్ చూస్తుంటుంది. ‘ఫ్రెండ్స్’ ఇరవై ఏళ్ళ క్రితం ముగిసిన ఒక కామెడీ సీరీస్. అప్పట్లో చాలా ప్రజాదరణ పొందింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పటికీ నవతరం వారితో సహా ఎంతో మంది చూస్తుంటారు. నాక్కూడా ఈ సీరీస్ అంటే చాలా ఇష్టం. న్యూయార్క్ నగరంలో ఉండే ఆరుగురు స్నేహితుల కథ ఇది. ప్రేమ, కుటుంబం లాంటి విషయాల చుట్టూ అల్లిన కథ. నిజ జీవితానికి కాస్త దూరంగానే ఉంటుంది కానీ ఆహ్లాదంగా ఉంటుంది. రోజ్‌కి ఈ సీరీస్ అంటే చాలా ఇష్టం. ఓటీటీలో సీరీస్ చివరి సీజన్ చూస్తూ ఉంటుంది. ఇంతలో కారులోని వైఫై ఆగిపోతుంది. రోజ్ చూసే ఎపిసోడ్ ఆగిపోతుంది. ఏదో జరిగిందన్నమాట!
ఏదన్నా ప్రమాదం జరిగినపుడు మనం కొద్దిలో తప్పించుకున్నవారి గురించి, అనుకోకుండా ఆ ప్రమాదంలో చిక్కుకున్నవారి గురించి వింటూ ఉంటాం. ఇది అత్యంత సహజం. ఆధ్యాత్మికవేత్తలు దైవనిర్ణయం వల్ల కొందరు తప్పించుకుంటారని, కొందరు అసంకల్పితంగా చిక్కుకుంటారని అంటారు. ఉదాహరణకి రైలు ప్రమాద సంఘటనలో ఒక వ్యక్తి చివరి నిమిషంలో ప్రయాణం మానుకోవటం, ఒక వ్యక్తి చివరి నిమిషంలో రైలెక్కి ప్రమాదం బారిన పడటం జరుగుతూ ఉంటాయి. 2008లో ముంబయి దాడులు జరిగే సమయానికి కొంచెం ముందు నా పరిచయస్థుడు ఒకాయన రైలెక్కి దిల్లీ బయల్దేరాడు. ఆ రైలు వెళ్ళాక కాసేపటికి అదే రైల్వే స్టేషన్‌లో దాడి జరిగింది. ఈ చిత్రంలో కూడా అమాండా అప్పటికప్పుడు విహారయాత్ర ప్రణాళిక వేసిందంటే అది దైవనిర్ణయం. సైబర్ దాడుల్లో ముందు ప్రభావితమయ్యేది నగరాలే. అమాండా కుటుంబం నగరం దాటి వెళ్ళిపోతుంది.
‘ఫ్రెండ్స్’ సీరీస్‌లో ఒక కాఫీ షాప్ ఉంటుంది. అక్కడ స్నేహితులు కలిసి కబుర్లు చెప్పుకోవటం ఒక అలవాటు. వైఫై ఆగిపోవటంతో రోజ్ ట్యాబ్ పక్కన పడేస్తుంది. ఉన్నట్టుండి “నాన్నా. మనం తిరిగి వెళ్ళాక నన్ను ‘ఫ్రెండ్స్’ కాఫీ షాప్‌కి తీసుకెళ్ళు” అంటుంది. క్లే “అది నిజం కాఫీ షాప్ కాదు. అదో సెట్టు” అంటాడు. మనకి నిజ జీవితం ఒకటి, డిజిటల్ జీవితం ఒకటి. కొందరు రెండోదే నిజమనుకుంటారు. ఉత్తుత్తి స్నేహితులు సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలు చూసి అదే నిజమనుకుంటారు. ఎవరైనా ఆనందకరమైనవే పెడతారు కానీ కలతల గురించి పెట్టరు కదా? వారి జీవితమే బావుంది అనుకోవటం ఎంత మూర్ఖత్వం! మానవ జీవితమంటేనే సుఖదుఃఖాల కలయిక. అన్నీ తట్టుకోవాలి. అంటే సుఖాన్ని కూడా తట్టుకోవాలి. మరీ పొంగిపోకూడదు.
అమాండా బుక్ చేసిన హోమ్ స్టే అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో ఇళ్ళన్నీ విసిరేసినట్టు దూరం దూరంగా ఉంటాయి. విచిత్రమేమిటంటే మనుషులు ఆన్‌లైన్‌లో ఇళ్ళు తేలిగ్గా అద్దెకి మరొకరికి ఇచ్చేస్తారు. మనిషిని చూడనంతవరకు. ‘ఎయిర్‌బీఎన్‌బీ’ లాంటి ఆప్‌లు వాడేవారికి ఇది తెలిసినదే. ఆ మనిషే బయట తారసపడితే ముందు అనుమానంగానే చూస్తారు. మళ్ళీ కథలోకి వస్తే ఇంట్లో వైఫై పని చేయదు. అమాండా వంటకి కావలసిన సరుకుల కోసం సూపర్ మార్కెట్‌కి వెళుతుంది. అక్కడ ఒకతను బాటిళ్ళ కొద్దీ నీళ్ళు, క్యాన్ల కొద్దీ నిలవ ఉండే ఆహారపదార్థాలు కొనుక్కుని వెళుతుంటాడు. అంటే అతనికి రానున్న ప్రమాదం గురించి తెలిసిందన్న మాట. అమాండా తిరిగి వచ్చాక అందరూ కలిసి బీచ్‌కి వెళతారు. అమెరికాలో బీచ్ అయినా వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్ళు లాంటి చెత్త ఉంటుంది. ప్లాస్టిక్ చెత్త ఎంత పెరిగిపోయిందో చూస్తూనే ఉన్నాం. అమెరికా లాంటి చోట్ల రీసైక్లింగ్ చేస్తారు. మన దేశంలో ఇది సరిగ్గా జరగదు. పైగా ఇతర దేశాల చెత్త ఇక్కడ పారేస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధంలో చిత్తశుద్ధి లేకపోతే మనకే నష్టం. చిరువ్యాపారులకి కాగితం సంచులు తక్కువ ధరకి ఇవ్వాలి. లేకపోతే వారు పలుచని పాస్టిక్ సంచులు వాడటం ఆపరు. ‘ప్లాస్టిక్ వాడకం మానండి’ అంటే మన దేశంలో వినేవారు తక్కువ.
రోజ్ బీచ్‌లో నడుస్తుంటే సముద్రంలో దూరంగా ఒక ఓడ కనిపిస్తుంది. తర్వాత బీచ్‌లో భోజనం చేసేటప్పుడు ఆమె ఆ ఓడనే చూస్తూ ఉంటుంది. అది నేరుగా తీరం వైపు వస్తూ ఉంటుంది. కాసేపటికి మరీ దగ్గరకి వచ్చేస్తుంది. అదో ఆయిల్ ట్యాంకర్. ఆ ఓడ మరీ దగ్గరకి రావటం చూసి అమాండా అందరినీ లేపుతుంది. అందరూ పరుగున పక్కకి తప్పుకుంటారు. ఆ ఓడ తీరం మీదకి వచ్చేస్తుంది. ఇసుకలో ఇరుక్కుపోయి ఆగిపోతుంది. సైబర్ దాడి చేస్తే ఓడలు కూడా దారి తప్పిపోతాయి. ఒకప్పుడు ఓడల ప్రయాణ వ్యవస్థ వేరుగా ఉండేది. ఇప్పుడంతా కంప్యూటరీకరణ జరిగిపోయింది. ఆ కంప్యూటర్‌ని తప్పుదోవ పట్టిస్తే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఓడ తీరం మీదకి వచ్చే దృశ్యం ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఇలా కథలో భాగంగా ఉండాలి.
అమాండా కుటుంబం కాస్త భయానికి గురవుతుంది కానీ ఇదేదో అనుకోని సంఘటన అని సర్దుకుపోతుంది. బీచ్ భద్రత చూసే అధికారులకి కూడా ఏమీ తెలియదు. అమాండా కుటుంబం తమ బసకి తిరిగివస్తారు. దారిలో స్టార్‌బక్స్ కాఫీ షాపు కనపడుతుంది. “అదిగో స్టార్‌బక్స్” అంటుంది అమాండా, అదేదో హరివాసమైనట్టు. ఈ పెద్ద చెయిన్ షాపులు పర్యావరణానికి చేసే హాని అంతా ఇంతా కాదు. ఈమధ్య వచ్చిన వార్త- స్టార్‌బక్స్ కొత్త సీఈఓ వారి హెడ్‌క్వార్టర్స్ ఉండే నగరంలో కాక 800 వందల మైళ్ళ దూరంలో ఉన్న నగరంలో ఉంటాడట. అతనికో జెట్ విమానం ఇచ్చారట. అవసరమైతే అతను జెట్ ఎక్కి వస్తాడట. ఎంత ఇంధనం వృథా? దీని వలన పర్యవరణానికి హాని కాదా? అందరికీ నీతులు చెప్పే అమెరికా వాళ్ళు వేసే వేషాలివి. మనం స్టార్‌బక్స్ కాఫీయే తాగాలా? స్థానికంగా కాఫీ షాపుల్లేవూ? ఇంటికొచ్చాక పిల్లలు స్విమింగ్ పూల్లో జలకాలాడుతూ ఉంటారు. అమాండా క్లేతో “వీళ్ళు చూడు. ఆ ఓడ సంగతి మర్చిపోయారు. కొత్త ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోయారు” అంటుంది. పిల్లలకి ఏకాగ్రత ఎంత తగ్గిందో ఆ మాటల్లో తెలుస్తుంది. ఏమైనా అనుకోనిది జరిగితే ఆశ్చర్యపోరు. కాసేపటికే ‘ఇది బోరు. ఇంకోటి పెట్టు’ అంటారు. పిల్లలకి పుస్తకాలు అలవాటు చేయాలి. తలిదండ్రులు వారి కోసం సమయం కేటాయించాలి. లేకపోతే వచ్చే తరాలు నిర్వీర్యమైపోతాయి. కాసేపటికి అమాండాకి కిటికీలోంచి చూస్తే లాన్ అంచున రెండు లేళ్ళు కనపడతాయి. క్లేకి చూపిస్తుంది. ఇద్దరూ చూసి ముచ్చటపడతారు.
ఆ రాత్రి పిల్లలు పడుకున్నాక అమాండా, క్లే జెంగా ఆట ఆడుతూ ఉంటారు. తలుపు కొట్టిన చప్పుడు అవుతుంది. తలుపు తీస్తే జార్జ్ అనే అతను, అతని కూతురు రూత్ అక్కడ ఉంటారు. రూత్ పొట్టిగా ఉంటుంది కానీ ఆమెకి ఇరవై ఐదు ఏళ్ళు ఉంటాయి. జార్జ్ తాను ఆ ఇంటి యజమానిని అంటాడు. ఫోను పని చేయట్లేదు కాబట్టి ముందుగా ఫోన్ చేయటం కుదర్లేదు అంటాడు. అమాండా, క్లేల ఫోన్లు కూడా పని చేయట్లేదు. అమాండాకి అపనమ్మకం. క్లే ఇంకా మనుషుల్ని నమ్మేరకం. వారిని ఇంట్లోకి రమ్మంటాడు. జార్జ్‌కి క్లాసికల్ మ్యూజిక్ అంటే ఇష్టమనీ, న్యూయార్క్ ఫిల్హార్మానిక్ (క్లాసికల్ సంగీతాన్ని ప్రోత్సహించే సంస్థ) బోర్డులో సభ్యుడని తెలుస్తుంది. జార్జ్, రూత్ ఫిల్హార్మానిక్‌లో ఒక ప్రదర్శన చూసి వస్తుంటే విద్యుత్తు సరఫరా ఆగిపోయిందని, తమ అపార్ట్‌మెంట్ 14వ అంతస్తులో ఉందని, జార్జ్ మోకాలి నొప్పి కారణంగా మెట్లెక్కాలంటే భయపడటం వలన ఇక్కడికి వచ్చామని రూత్ అంటుంది. వాళ్ళు ఆ ఇంట్లో ఉంటామంటే అమాండా అభ్యంతరం చెబుతుంది. జార్జ్ అద్దె డబ్బు సగం తిరిగి ఇచ్చేస్తానంటాడు. అక్కడే ఉన్న బీరువా సొరుగు తాళం తీసి డబ్బులు తీస్తాడు. ఇదంతా చూసి క్లే అతన్ని నమ్ముతాడు. అమాండా మాత్రం నమ్మదు. అతన్ని పక్కకి తీసుకెళ్ళి “ఇదేదో మోసంలా ఉంది” అంటుంది. రూత్ అమాండా పద్ధతి చూసి వ్యంగ్యబాణాలు వేస్తూ ఉంటుంది. తాము నల్లజాతి వారం కాబట్టి అమాండా తమని నమ్మట్లేదనే అర్థం వచ్చేట్టు మాట్లాడుతుంది. అమాండా జార్జ్‌ని గుర్తింపు కార్డు చూపించమంటే కంగారులో ప్రదర్శన దగ్గర కోటు మర్చిపోయానని (ప్రదర్శనలప్పుడు ప్రేక్షకులు కోట్లు బయట పెట్టుకుంటారు, గుళ్ళలో చెప్పులు బయట స్టాండ్ లో పెట్టుకున్నట్టు), గుర్తింపు కార్డు అందులో ఉందని అంటాడు. “నీ భార్య గురించి చింత లేదా?” అంటే ఆమె పని మీద మొరాకో వెళ్ళిందని అంటాడు. ప్రదర్శన అయ్యాక ఇంటికి వెళుతుంటే విద్యుత్తు ఆగిపోయిందని చెప్పి, ఇప్పుడు ప్రదర్శన దగ్గరే కంగారులో కోటు మర్చిపోయానంటాడేమిటి? అతన్ని నమ్మవచ్చా?
రుమాన్ ఆలమ్ రాసిన ‘లీవ్ ద వరల్డ్ బిహైండ్’ అనే నవల ఆధారంగా శామ్ ఇస్మాయిల్ స్క్రీన్‌ప్లే రాసి దర్శకత్వం వహించాడు. అమాండాగా జూలియా రాబర్ట్స్, క్లేగా ఈతన్ హాక్, జార్జ్‌గా మహెర్షలా ఆలీ నటించారు. అందరూ బాగా నటించారు. మహెర్షల్లా ఆలీకి రెండు ఆస్కార్ అవార్డులు ఎందుకొచ్చాయో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. జూలియా రాబర్ట్స్ ఒక నిర్మాత. ఒకప్పటి అందాల తార ఇప్పుడు కథాబలమున్న చిత్రాలు నిర్మించటం ముదావహం. విజువల్ ఎఫెక్ట్స్ బావుంటాయి. సమాచార వ్యవస్థలో మార్పులు, హై పిచ్ శబ్దాలు జంతువుల్ని, పక్షుల్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూపటానికి విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించారు. ఒక దృశ్యంలో ఫ్లెమింగో పక్షులు స్విమింగ్ పూల్లో దిగి ఈత కొడతాయి. మరో దృశ్యంలో లేళ్ళు, దుప్పులు గుంపుగా వస్తాయి. ఇవన్నీ విజువల్ ఎఫెక్ట్స్‌తో చేసినవి. చాలా సహజంగా ఉంటాయి.
ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.
అమాండా జార్జ్‌తో మాట్లాడతుండగా రూత్ టీవీ ఆన్ చేస్తుంది. అన్ని చానళ్ళలో ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ అని సందేశం వస్తూ ఉంటుంది. అది చూసి అందరికీ పరిస్థితి ఎంత గంభీరంగా ఉందో అర్థమవుతుంది. క్లే జార్జ్‌తో “మీరు ఈ రాత్రి బేస్‌మెంట్‌లో ఉండండి. రేపు ఏం జరిగిందో కాస్త స్పష్టత వస్తుంది. సూర్యుడి వెలుగులో అన్నీ భిన్నంగా కనిపిస్తాయి” అంటాడు. బేస్‌మెంట్‌లో కూడా అన్ని వసతులూ ఉంటాయి. కానీ రూత్‌కి తమ ఇంట్లోనే బేస్‌మెంట్‌లో ఉండటం నచ్చదు. “వాళ్ళని ఎలాగైనా పంపించేయాలి” అంటుంది. “భయపెడితే అసలే వెళ్ళరు” అంటాడు జార్జ్. అంటే బయట పరిస్థితులు బాగా లేవని తెలిస్తే వదిలి వెళ్ళరని అతని భావం. అతను కాస్త గాభరాగా ఉంటే ఆమె “మీ క్లయింటు ఏం చెప్పాడు?” అంటుంది. అతను “విషయం తెలియకుండా ఎక్కువ ఆలోచించకూడదు” అంటాడు. ఎవరా క్లయింటు? జార్జ్ ఏం దాస్తున్నాడు? అమాండా క్లేని “ఆ ఓడ గురించి వాళ్ళకి ఎందుకు చెప్పలేదు?” అని అడుగుతుంది. “అప్పటికే ఉన్నవి సరిపోనట్టు అది కూడా ఎందుకు అని ఊరుకున్నాను. నువ్వెందుకు చెప్పలేదు?” అంటాడతను. “చెప్తే ఉపద్రవమేదో వచ్చిందని రూఢి అయిపోతుందని భయమేసింది” అంటుందామె. పైకి అననంత మాత్రాన జరిగేది ఆగుతుందా? జార్జ్ క్లయింటు చెప్పిన విషయం దాచినట్టే ఆమె కూడా ఈ విషయం దాచింది. మానవ స్వభావం ఇంతే.
మర్నాడు పిల్లలకి జార్జ్, రూత్‌ల గురించి చెబుతుంది అమాండా. రోజ్‌కి ‘ఫ్రెండ్స్’ చూసే అవకాశం లేదని ఆదుర్దాగా ఉంటుంది. ఆర్చీ రూత్‌ని దొంగచాటుగా ఫోటోలు తీస్తుంటాడు. పదహారేళ్ళ కుర్రాడికి అందమైన అమ్మాయి కనపడితే అంతే కదా? క్లే దినపత్రిక దొరుకుతుందేమో అని కారులో బజారుకి వెళతాడు. జార్జ్ తన కారులో మూడు మైళ్ళ అవతలున్న పరిచయస్థుల ఇంటికి వెళతాడు. క్లే దారి తప్పుతాడు. అతనికి ఒక స్త్రీ కనపడుతుంది. స్పానిష్ భాష మాట్లాడుతుంది. ఏడుస్తూ సాయం అడుగుతుంది. అతను గాభరాగా వచ్చేస్తాడు. తర్వాత అతనికి ఆకాశంలో డ్రోన్ ఒకటి వందలకొలదీ ఎర్ర కాయితాలు జారవిడవటం కనపడుతుంది. ఆ కాయితాలు రెపరెపలాడుతూ అతని కారు మీద పడతాయి. అతను భయభ్రాంతుడవుతాడు. ఇంటికి తిరిగి వస్తాడు. జార్జ్ వెళ్ళిన ఇల్లు చిందరవందరగా ఉంటుంది. ఆ ఇంట్లో శాటిలైట్ ఫోన్ ఉందని జార్జ్‌కి తెలుసు. అది తీసుకుని సిగ్నల్ కోసం చూస్తాడు. అది కూడా పనిచేయట్లేదు. సాధారణంగా సెల్ ఫోన్లు పనిచేయకపోయినా శాటిలైట్ ఫోన్లు పని చేస్తాయి. జార్జ్ పక్కనే ఉన్న బీచ్ దగ్గర ఏదో కనిపించి అక్కడికి వెళతాడు. అక్కడ ఒక విమానం శకలాలు, శవాలు ఉంటాయి. అతను చూస్తుండగానే మరో విమానం అక్కడ కూలుతుంది. అతను తప్పించుకుంటాడు. జార్జ్ ఇంటికి వచ్చి “శాటిలైట్లని కూడా నిర్వీర్యం చేసేశారు” అంటాడు అమాండాతో. ఆమె నమ్మదు. అతను “ఓ విమానం కూలిపోవటం చూశాను. అది రెండోది” అంటే ఆమె నిర్ఘాంతపోతుంది. జార్జ్ భార్య ఆరోజు విమానంలో మొరాకో నుంచి తిరిగి రావల్సి ఉంది. విమానం కూలిందని తెలిసి రూత్‌ని నిస్పృహ కమ్మేస్తుంది. ఇంతలో హై పిచ్‌లో ఒక శబ్దం వినిపిస్తుంది. భరించలేక ఎక్కడున్న వాళ్ళు అక్కడ చెవులు మూసుకుంటారు. ఆ శబ్దానికి అద్దాలలో పగుళ్ళు పడతాయి.
ఈరోజుల్లో అన్నీ కంప్యూటర్లతో అనుసంధానమై ఉన్నాయి. ఆ కంప్యూటర్లను నియంత్రించగలిగితే వ్యవస్థలని కుప్పకూలేలా చేయవచ్చు. కానీ అన్ని వ్యవస్థలనీ ఒకేసారి నిర్వీర్యం చేశారంటే అది పకడ్బందీగా చేసిన పని. ఇది సాధ్యమా? అసాధ్యమైతే కాదు. విమానాలని నియంత్రణలోకి తీసుకుని ‘ఆటో పైలట్’ మోడ్‌లో పెడితే విమానాన్ని కూలిపోయేలా చేయవచ్చు. ఉపగ్రహాలని అదుపులోకి తీసుకుంటే సమాచార వ్యవస్థ కూలిపోతుంది. విద్యుత్తు ప్లాంట్లని అదుపులోకి తీసుకుంటే విద్యుత్తు సరఫరా ఆగిపోతుంది. మరి ఆ శబ్దమేమిటి? అది తర్వాత తెలుస్తుంది. ఎర్ర కాయితాలు ఏమిటి? దాని మీద అరబిక్ భాషలో ఏదో రాసి ఉంటుంది. ఆర్చీ దాన్ని చూసి “నేనొక కంప్యూటర్ గేమ్‌లో చూశాను. ఆ కాగితం మీద ఉన్నదంతా నాకు తెలియదు కానీ పెద్ద అక్షరాలలో ఉన్నది మాత్రం ‘అమెరికా నశించాలి’ అని” అంటాడు. దాంతో అమాండా, క్లే పిల్లలని తీసుకుని అమాండా చెల్లెలి ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. జార్జ్ ఆపటానికి ప్రయత్నిస్తాడు. “నగరంలోకి వెళ్ళటం కన్నా ఇక్కడుండటమే మంచిది” అంటాడు. రూత్ మాత్రం “వాళ్ళని వెళ్ళనీ” అంటుంది. వాళ్ళు బయల్దేరుతారు. హైవే మీద కార్లు ఆగిపోయి ఉంటాయి. అమాండా కారు దిగి ఆ కార్ల దగ్గరకి వెళుతుంది. అ కార్లలో ఎవరూ ఉండరు. అవన్నీ స్వయంచాలిత కార్లు. ఇంతలో ఒక కారు వస్తున్న శబ్దం వినిపిస్తుంది. క్లే ఆ కారుని ఆపటానికి వెళతాడు. అమాండాకి విషయం అర్థమవుతుంది. ఈ కార్లని కూడా నియంత్రణలోకి తీసుకుని వాటిని హైవే మీద వదిలారు (ఇలా నియంత్రణలోకి తీసుకోవటం సాధ్యమా? ఏమో!) అవి వేగంగా వచ్చి ఒక దాన్నొకటి గుద్దుకుని ఆగిపోతున్నాయి. అమాండా క్లేని కారు ఎక్కించుకుని, కారు వెనక్కి తిప్పి, ఎదురుగా వస్తున్న కార్లని తప్పించుకుంటూ తిరిగి జార్జ్ ఇంటికి వస్తుంది. పరిస్థితి ఎంత విషమంగా ఉందో అందరికీ అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో మనుషుల మనోభావాలు, స్వభావాలు ఎలా ఉంటాయో మిగతా కథలో చూపిస్తారు.
అమాండా వేరే ఇల్లు అద్దెకి తీసుకోవటం, యజమానుల్ని లోపలికి రానివ్వటానికి అభ్యంతరం చెప్పటం, తర్వాత తన సొంత ఇంటికి వెళ్ళలేకపోవటం ఇవన్నీ ప్రతీకాత్మకంగా ఉంటాయి. అమెరికా వేరే దేశాలని కాపాడతానని అక్కడికి వెళుతుంది. అక్కడి వారి హక్కులను హరిస్తుంది. ఇది ఇంతవరకు జరిగిన చరిత్ర. ఇలా కొనసాగితే అమెరికాకి తన దేశమే మిగలదు అనే సూచనగా అమాండా తన ఇంటికే వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత “గ్రీన్‌ల్యాండ్ మా దేశభద్రతకి కీలకం. అందుకని ఆ దేశాన్ని కొనేస్తాం” అన్నాడు. గ్రీన్‌ల్యాండ్‌లో సైనిక స్థావరం ఏర్పాటు చేస్తే రష్యాని నిలువరించటం తేలిక అవుతుంది. అందుకని దేశాన్నే కొనేస్తారా? ఆ దేశప్రజల అభిప్రాయం అవసరం లేదా? ఎప్పుడూ సైన్యాన్ని విస్తరించటమే కానీ ఇతర దేశాలతో సత్సంబంధాలు పెట్టుకుందామని ఎందుకు అనుకోరు? అమెరికా ఆధిపత్య ధోరణికి వ్యతిరేకించేవారు ఆ దేశంలోనే ఉన్నారు. వారికి ప్రతీక క్లే. కానీ వారు కూడా ఇతరులతో పాటు శిక్ష అనుభవించవలసిందే.
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
పిల్లలిద్దరూ పడుకుంటారు. కానీ వారికి నిద్రపట్టదు. పెద్దలు మాట్లాడుకుంటూ ఉంటారు. క్లే, రూత్ బయట ఉంటే జార్జ్, అమాండా లోపల ఉంటారు. జార్జ్ స్టాక్ మార్కెట్ నిపుణుడు. మార్కెట్ ఎలా ఉండబోతోందో అంచనాలు వేయటం అతని పని. “ఇది మాత్రం అంచనా వేయలేకపోయాను” అంటాడు. అమాండా “మరీ నిరాశపడకండి. ఆలోచిస్తే మార్కెట్‌తో సహా అంతా భ్రాంతే. మీరు గాల్లో లెక్కలు వేసి, గాల్లోనే డబ్బు లావాదేవీలు చేసి, గాల్లోనే స్వర్గం చూపిస్తారు” అంటుంది. “నా పని అంత క్లిష్టమైనదేం కాదు. మనుషులను అధ్యయనం చేయటమే నా ప్రధాన బాధ్యత” అంటాడతను. ఆమె పని కూడా అదే. “అయితే మిమ్మల్ని చూసి జాలిపడతాను. మనుషులు దారుణమైనవాళ్ళు. నేనే ఉదాహరణ. మీ పట్ల దారుణంగా ప్రవర్తించాను” అంటుందామె. ఆమెకి తన మీద తనకి కూడా అసహ్యం ఉంది. కొందరు ఈ ప్రపంచమే నన్నిలా మార్చింది అంటారు. కొందరు అలా మారినందుకు లోలోపల బాధపడుతూ ఉంటారు. కొందరు అలా మారటం కన్నా మౌనంగా ఉండటం మంచిదనుకుంటారు. అమాండా రెండో కోవకి చెందినది. మొదటి కోవ కన్నా నయం.
అమాండా అసలు విషయం అడుగుతుంది. “మీరిక్కడికి అసలు ఎందుకు వచ్చారు? మీ మోకాలి నొప్పి వల్ల అని మాత్రం చెప్పకండి” అంటుంది. జార్జ్ అసలు విషయం చెబుతాడు. “నా క్లయింటు ఒకాయన డిఫెన్స్ కాంట్రాక్టరు. నేనంటే అతనికి మంచి అభిప్రాయం ఉంది. ఒకసారి ఇద్దరం బాగా తాగాక విదేశాల్లో జరిగే ఒక సమావేశానికి నన్ను తీసుకెళ్ళాలని ఉందని అన్నాడు. ఆ సమావేశంలో ప్రపంచాన్ని శాసించే దుష్ట సమూహం ఉంటుందని చెప్పాడు. నేను అదొక జోక్ అనుకున్నాను. నిన్న ప్రదర్శనకి ముందు ఆయన ఫోన్ చేశాడు. అతని డబ్బు ఒకచోటికి బదిలీ చేయమని చెప్పాడు. చాలా పెద్ద మొత్తం. ఆ విషయం మాట్లాడాక మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అని అడిగాను. ఆయన కొన్నాళ్ళు విదేశానికి వెళుతున్నానని చెప్పాడు. ‘మీ దుష్ట సమూహాన్ని కలవటానికి వెళుతున్నారా?’ అని హాస్యంగా అన్నాను. అతను నవ్వలేదు. కుళ్ళు జోకులు వేసినా నవ్వేవాడు ఈసారి నవ్వలేదు. ‘జాగ్రత్త’ అని మాత్రం అన్నాడు. నా మీద జాలిపడుతున్నట్టు అనిపించింది. అది నా బుర్రని తొలిచేయటం మొదలుపెట్టింది” అంటాడు. “అంటే ఆ మనిషి తన బృందంతో కలిసి ఇదంతా చేయిస్తున్నాడా?” అంటుందామె సంభ్రమంగా. “అదేం కాదు. నిజం అంత కన్నా భయంకరం. అదేంటంటే ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నా ఫ్రెండ్ లాంటి కొంత మందికి సమాచారం అందుతుంది అంతే. ఈ రోజుల్లో అంతకన్నా భాగ్యం లేదు” అంటాడు. అమాండా కుంగిపోతుంది. అతను ప్రదర్శన దగ్గర కోటు మర్చిపోవటానికి కారణం అతని ఫ్రెండ్ అనుకోకుండా ఇచ్చిన ప్రమాద సూచన. ఇలాంటి దాడులు జరిగితే ప్రభుత్వాలకి తెలియకుండా ఉండదు. ఇదో ప్రచ్ఛన్న యుద్ధం. యుద్ధభూమిలో కాకుండా సైబర్ భూమిలో చేసే యుద్ధం. ప్రభుత్వంతో పాటు కొందరికి సమాచారం తెలుస్తుంది. అంతెందుకు? పెద్ద నోట్ల రద్దు జరిగినపుడు కొందరు పెద్దమనుషులకి ముందే తెలిసింది. వాళ్ళు బంగారం కొనుగోలు చేసుకున్నారు. ఇంత పెద్ద దాడి జరిగితే తెలియకుండా ఉంటుందా? బలిపశువులు సామాన్య ప్రజలే. జార్జ్ తన భార్య తిరిగి రాదని అంటాడు. మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనవని అంటాడు. అతని అనుభవం నేర్పిన పాఠమది. కొన్నిసార్లు నిజాలు నిష్ఠూరంగా ఉంటాయి. ఆమోదించి సాగిపోవాలి. మరో పక్క క్లే రూత్‌కి తాను ఒక స్త్రీ సాయమడిగినా ఆమెని నడిరోడ్డు మీద వదిలి వచ్చానని చెబుతాడు. ఒకరికొకరు సాయం చేసుకోలేని పరిస్థితులు కూడా వస్తాయి. ఆ స్థానంలో ఉంటే గానీ తెలియదు. ఎవర్నీ తప్పు పట్టలేం. ఆ రాత్రి మళ్ళీ హై పిచ్ శబ్దం వినిపిస్తుంది.
మర్నాటికి ఆర్చీ జబ్బు పడతాడు. వాంతి చేసుకుంటాడు. అతని పళ్ళు ఒక్కొక్కటీ ఊడిపోతాయి. అమాండా హాస్పిటల్‌కి వెళదామంటుంది కానీ హాస్పిటల్‌కి వెళ్ళాలంటే హైవే మీద వెళ్ళాలి. అది సాధ్యం కాదు. జార్జ్ తనకి తెలిసిన వ్యక్తి దగ్గరకి తీసుకెళతానంటాడు. అతను సూపర్ మార్కెట్లో నీళ్ళు, ఆహారపదార్థాలు భారీగా కొన్న వ్యక్తి. అతని పేరు డేనీ. అతని దగ్గర మందులు ఉంటాయని జార్జ్ నమ్మకం. మరో పక్క రోజ్ కనపడకుండా పోతుంది. అమాండా, రూత్ రోజ్‌ని వెతకటానికి వెళతారు. వారికి దగ్గర్లోని అడవిలో ఒక షెడ్ కనిపిస్తుంది. రోజ్ అక్కడ లేదు. అమాండాకి నిరాశ కలుగుతుంది. మాటా మాటా పెరుగుతుంది. రూత్ “మా అమ్మ ఎక్కడో ఒక సముద్రంలో పడి ఉండవచ్చు. నాకూ బాధగానే ఉంది” అంటుంది. అమాండా “నాకూ సానుభూతి ఉంది” అంటుంది. “మరి ఎప్పుడూ కోపంగా ఎందుకుంటారు?” అంటుంది రూత్. “నా ఉద్యోగంలో మనుషుల స్వభావాలు తెలుసుకుంటూ ఉంటాను. మనుషులు ఇతరుల్ని ఎలా మోసం చేద్దామా అనే చూస్తుంటారు. అలా ఆలోచిస్తున్నారని కూడా వారికి తెలియదు. నేనూ అంతే. జీవరాశులనన్నిటినీ క్షోభపెడుతున్నాం. చేసిందంతా చేసి ఇప్పుడు మాత్రం పర్యావరణ రక్షణ పేరుతో పేపర్ స్ట్రాలు వాడి అంతా సవ్యంగా ఉందనే భ్రమలో ఉన్నాం. కానీ అంతరాంతరాల్లో మనకి తెలుసు మన జీవితాలు బూటకమని. అందరం కలిసి ఒక సామూహిక భ్రమలో ఉన్నాం. నాకు మళ్ళీ మనుషుల్ని నమ్మాలని ఉంది” అంటుంది అమాండా. మనుషుల్ని నమ్మలేకపోవటం తప్పేం కాదని నా అభిప్రాయం. ఈ రోజుల్లో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఆధారాలు అడగటం తప్పు కాదు. అలాగే మనల్ని వేరే వారు నమ్మకపోతే భరించాలి. అవమానం అనుకోకూడదు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే జార్జ్ శ్వేతజాతికి చెందినవాడు అయి ఉంటే అమాండా తొందరగా అతన్ని నమ్మేదా? అవునేమో! అందుకే ఆమె తనని తాను అసహ్యించుకుంటోంది.
క్లే, జార్జ్ ఆర్చీని తీసుకుని డేనీ ఇంటికి వెళతారు. డేనీకి జార్జ్ తెలుసు కానీ జార్జ్‌ని, క్లేని తలుపుకి దూరంగా నిలబడమంటాడు. అతను అత్యవసర పరిస్థితుల కోసం సన్నద్ధంగా ఉండటం ఎప్పుడూ అవసరమే అని నమ్ముతాడు. అందుకే అవసరమైన వస్తువులు నిలవ చేసుకున్నాడు. ఈ పరిస్థితుల్లో ఎవర్నీ నమ్మలేనంటాడు. తుపాకీ పట్టుకుని బయటకి వస్తాడు. ఆర్చీ పరిస్థితి చెబితే “ఆ శబ్దం వచ్చింది కదా. దాని ద్వారా రేడియేషన్ వచ్చి ఉంటుంది. దాని వల్లే ఈ జబ్బు. ఇది యుద్ధం. ఎప్పటి నుంచో గుసగుసలు వినపడుతున్నాయి” అంటాడు. ఏమిటని అడిగితే “రష్యా వాళ్ళు అమెరికా నుంచి తమ దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించుకున్నారు. పేపర్లో వచ్చింది. మీరు చదివితే కదా! ఇప్పుడు చేయగలిగింది లేదు. నా కుటుంబాన్ని నేను రక్షించుకుంటాను. అందరం ఇంట్లో కూర్చోవటమే. దేవుడ్ని నమ్మితే ప్రార్థన చేసుకోవటమే” అంటాడు. జార్జ్ ఆర్చీ కోసం మందు అడుగుతాడు. డేనీ “నా దగ్గర మందు ఉందో లేదో నీకు అనవసరం” అంటాడు. “మా కర్మకి మమ్మల్ని వదిలేస్తావా?” అంటే “అందరం ఎవరి కర్మకి వారం మిగిలాం” అంటాడు. తుపాకీతో బెదిరిస్తాడు. జార్జ్ కూడా తుపాకీ తీస్తాడు. “మందు ఇచ్చేదాకా వెళ్ళం” అంటాడు. మందు అందుబాటులో ఉండి కూడా ఆర్చీకి ఇవ్వలేకపోవటం అతనికి మింగుడుపడదు. జార్జ్ లాంటి మనవాతామూర్తులు కూడా ఉంటారు. చివరికి క్లే బతిమాలగా వెయ్యి డాలర్లు తీసుకుని డేనీ మందు ఇస్తాడు. మనిషి ధనాశకి అంతులేదు.
డేనీ ఇంకో విషయం కూడా చెబుతాడు. “కొరియన్లో చైనీయులో చేసిన దాడి ఇది” అంటాడు. క్లే తన దగ్గర ఉన్న ఎర్ర కాయితం చూపిస్తాడు. “ఇది అరబిక్‌లో ఉంది. కాబట్టి ఇరాన్ వాళ్ళు కావచ్చు” అంటాడు. “ఇలాంటివే కొరియన్ భాషలోనో, చైనీస్ భాషలోనో నా స్నేహితుడొకడికి దొరికాయి. మనం ఎందరో శత్రువులని తయారు చేసుకున్నాం. వాళ్ళంతా కలిసిపోయినట్టున్నారు” అంటాడు డేనీ. అప్పుడు జార్జ్ కి ఏం జరుగుతోందో అర్ధమవుతుంది. ఇలా కల్లోలం సృష్టిస్తే దేశ ప్రజలు ఒకరి మీద ఒకరు తిరగబడతారు. తిండీ, మందులూ లేకపోతే ఏం చేస్తారు? అంతర్యుద్ధం వస్తుంది. బయటివారు ఎవరూ ఏం చేయకుండానే దేశం నాశనమవుతుంది. మరో పక్క రూత్ అడవి నుంచి చూస్తే దూరంగా సముద్రం అవతల ఉన్న నగరం కనిపిస్తుంది. విస్ఫోటనాలు జరుగుతూ ఉంటాయి. అమాండా అది చూసి మ్రాన్పడిపోతుంది. ఇదంతా జరుగుతూ ఉండగా రోజ్ అడవి దగ్గరున్న ఒక ఇంటికి వెళుతుంది. తలుపుకున్న అద్దం పగలగొట్టి తాళం తీసి లోపలికి వెళుతుంది. ఆ ఇంట్లో బంకర్ ఉంటుంది. అంటే యుద్ధం వస్తే కొన్ని నెలలు క్షేమంగా ఉండటానికి చేసుకున్న ఏర్పాటు. తిండి పదార్థాలు, వేరే అవసరమైన వస్తువులు, వినోద సామగ్రి ఉంటాయి. ఆమెకి ‘ఫ్రెండ్స్’ డీవీడీలు దొరుకుతాయి. డీవీడీ పెట్టుకుని చూడటం మొదలుపెడుతుంది. ఇక్కడితో చిత్రం ముగుస్తుంది.
అమెరికా ఆధిపత్య ధోరణి మీద వ్యాఖ్యానంలా ఈ చిత్రం ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చటం, ప్రజాస్వామ్యం పేరుతో ఆ దేశాలని నాశనం చేయటం, తమకి లాభం లేదంటే వదిలేయటం వారికి మామూలే. ఇలా ఉంటే ఎప్పటికైనా శృంగభంగం తప్పదు. అది ఎలా ఉండవచ్చో ఊహించి రాసిన నవలకి చిత్రరూపమిది. అంతర్యుద్ధం వచ్చినా కొందరు పౌరులు బతికి ఉంటారు. వేరే దేశం ఆక్రమించుకోవచ్చు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయి. కాలచక్రం ఇలాగే ఉంటుంది. ఆధ్యాత్మిక మూలాలు ఉన్న భారతదేశంలో ఇలాంటి పరిణామాలు జరగవు. భారతదేశం ఇప్పటివరకు వేరే దేశాన్ని ఆక్రమించటానికి ప్రయత్నించలేదు. అదే మన బలం.