Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరుగునపడ్డ మాణిక్యాలు – 112: దిదీ

[సంచిక పాఠకుల కోసం ‘దిదీ’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

టీనేజీ అంటేనే ఒక కల్లోల సమయం. సొంత దేశంలో కాక వేరే దేశంలో ఉంటే ఇంకా కష్టం. అక్కడి సమాజంలో ఇమడాలి, శరీరంలో ఇమడాలి, కుటుంబంలో ఇమడాలి. ఒక్కొక్కరి అనుభవం ఒక్కోలా ఉంటుంది. తలిదండ్రులకి కూడా సవాలే. అయితే ఇలాంటి కథలు చూస్తే ‘నాలాగా ఎందరో ఉన్నారు’ అనే భావన కలుగుతుంది. తప్పులు అందరూ చేస్తారు, వాటి నుంచి పాఠాలు నేర్చుకుని సాగిపోవాలి కానీ క్రుంగిపోకూడదు అనే ధైర్యం వస్తుంది. తైవాన్ నుంచి అమెరికా వెళ్ళిన ఒక కుటుంబంలో కుర్రాడి కథ ‘దిదీ’ (2024). కుటుంబం విలువని మరోసారి గుర్తు చేసే చిత్రం ఇది. ఈ చిత్రం జియో సినిమాలో లభ్యం. తెలుగు శబ్దానువాదం కూడా అందుబాటులో ఉంది. శబ్దానువాదం బావుంది.

2008వ సంవత్సరం. వేసవి సెలవులు. క్రిస్ పద్నాలుగేళ్ళ కుర్రాడు. ఎనిమిదో తరగతి ముగించాడు. తొమ్మిదో తరగతికి వేరే స్కూల్లో చేరాలి. అతని కుటుంబం తైవాన్ నుంచి అమెరికా వలస వచ్చింది. అతని తండ్రి తైవాన్ తిరిగి వెళ్ళి అక్కడే పని చేస్తున్నాడు. డబ్బు పంపిస్తాడు. క్రిస్ తల్లి, నానమ్మ, అక్కతో అమెరికాలో ఉంటాడు. క్రిస్ ముద్దు పేరు దిదీ. నానమ్మ దిదీని గారాబం చేస్తుంది. తిండి ఎక్కువ తినమంటుంది. “నేను పెట్టకపోతే వీడు మరీ పీలగా ఉండేవాడు” అంటుంది అతని తల్లితో. టీనేజీ రావటంతో దిదీ కాస్త ముభావంగా ఉంటాడు. అక్కతో కీచులాడుతూ ఉంటాడు. ఆమె బట్టలు దొంగిలించి వేసుకుంటాడు. ఆమె త్వరలో కాలేజీకి వేరే ఊరికి వెళ్ళబోతోంది. “నువ్వు వెళ్ళిపోతే నేను హాయిగా ఉండొచ్చు” అంటాడు. అతని తల్లి చిత్రకారిణి. కానీ దాని మీద పెద్దగా ఆదాయం రాదు. దిదీకి ఫహాద్ అనే పాకిస్తానీ అబ్బాయి మంచి స్నేహితుడు. ఇంకా ఇద్దరు స్నేహితులు ఉంటారు. ఇద్దరూ వలస వచ్చినవారి పిల్లలే. ఒకరిది ఇండియా, ఒకరిది కొరియా.

అప్పట్లో సోషల్ మీడియా తొలిదశలో ఉంది. దాని దుష్ప్రభావాలు కూడా మొదలయ్యాయి. దిదీ వీడియోలు యూట్యూబ్‌లో పెడుతూ ఉంటాడు. అందులో చాలా వరకు స్నేహితులతో చేసే అల్లరిచిల్లరి చేష్టలే ఉంటాయి. దిదీకి స్కేటింగ్ మీద ఆసక్తి. స్కేటింగ్ విన్యాసాలు చేస్తూ వీడియోలు తీస్తాడు. అతనికి మ్యాడీ అనే అమ్మాయి అంటే ఇష్టం. కానీ ఆమెతో మాట్లాడాలంటే జంకు. ఆ అమ్మాయి తండ్రి అమెరికన్, తల్లి చైనీస్. తండ్రి అమెరికన్ కావటంతో ఆమెకి ఆధిక్యభావం ఉంటుంది. ఆమెకి మైస్పేస్ అనే సోషల్ మీడియాలో పేజి ఉంటుంది. దిదీ అప్పుడప్పుడు ఆ పేజికి వెళ్ళి ఆమె పోస్టులు చూస్తూ ఉంటాడు. ఒక పార్టీలో దిదీకి ఆమె తారసపడుతుంది. సరదాగా మాట్లాడుతుంది. “నిన్ను స్కూల్లో చూశా” అంటుంది. దిదీ “ఆ స్కూలు పెద్ద బోరు” అంటాడు పోజు కొడుతూ. ఏదీ నచ్చట్లేదని చెప్పటం టీనేజీ పిల్లలకి అలవాటు. “నాకు నచ్చింది” అంటుంది మ్యాడీ. దిదీకి ఏమనాలో తెలియదు. “ఫేస్‌బుక్‌లో నన్ను యాడ్ చేసుకో” అంటుంది మ్యాడీ చివరికి. వ్రతం చెడ్డా ఫలితం దక్కినట్టుంటుంది దిదీకి. తర్వాత చాటింగ్‌లో ఆమెకి నచ్చిన సినిమాయే తనకి నచ్చిందని అబద్ధం చెబుతాడు. ఆమె చూస్తుండగా మొనగాడిలా వేరే కుర్రాడితో కలబడతాడు. చిన్న దెబ్బలు తగిలించుకుని ఇంటికి వస్తాడు. కుర్రాళ్ళు వేసే వేషాలే ఇవన్నీ. నానమ్మ కంగారుపడిపోతుంది.

ఒకరోజు దిదీకి తనకంటే పెద్దవాళ్ళయిన కుర్రాళ్ళు పరిచయమవుతారు. అందరూ అమెరికన్లు. వాళ్ళు స్కేటింగ్ చేస్తుంటారు. దిదీ తాను స్కేటింగ్ వీడియోలు తీస్తానని అంటాడు. డోనవన్ అనే కుర్రాడు “నీ యూట్యూబ్ ఐడీ ఇవ్వు. నీ వీడియోలు చూస్తాను” అంటాడు. దిదీ ఐడీ ఇస్తాడు. పరుగుపరుగున ఇంటికి వచ్చి యూట్యూబ్‌లో పిల్ల చేష్టల వీడియోలు డిలీట్ చేస్తాడు. ఆ వయసులో స్నేహితులు పనికిరాని వాళ్ళలా కనపడతారు. ఇంట్లో వాళ్ళు ఎందుకూ కొరగానివారిలా కనపడతారు. పెద్ద కుర్రాళ్ళని చూసి వారిలా ఉండాలని దిదీ లాంటి కుర్రాళ్ళ ఆరాటపడుతుంటారు. దిదీ తల్లి ఒక పెయిటింగ్ వేసి ఒక పోటీకి పంపుతుంది. తాను, దిదీ సముద్రతీరంలో ఉన్న పెయింటింగ్ అది. దిదీని చూడమంటే అతను చూసి “అందులో నేను తింగరివాడిలా ఉన్నాను” అంటాడు. అమ్మ బాధపడుతుందని ఆలోచించడు. దిదీని నానమ్మ అతని స్నేహితులతో కూడా సరదాగా ఉంటుంది. అతను బయట గొడవలు పడితే అతని తల్లిని తిడుతుంది. “నా కొడుకు ఇక్కడ ఉంటే ఇలాంటివి జరిగేవా?” అంటుంది. దిదీకి ఇదో తలనొప్పి.

ఇదిలా ఉండగా దిదీకి వేరే తైవాన్ అబ్బాయిలతో పోలిక ఒక కొత్త సమస్యలా వచ్చిపడుతుంది. అతని తల్లి స్నేహితురాలు తన కొడుకు బ్యాడ్‌మింటన్, సాకర్ ఆడతాడని, మంచి మార్కులు తెచ్చుకుంటాడని చెబుతుంది. దిదీ తల్లి “మా అబ్బాయి స్కేటింగ్ చేస్తాడు. వీడియోలు తీస్తాడు” అంటుంది. “యాంగ్ లీ (అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తైవాన్ దర్శకుడు) లాగన్నమాట” అంటుంది ఆ స్నేహితురాలు. అదో వెటకారం. దిదీ తల్లి అమాయకురాలు. “అవును. వీడు నా బుజ్జి యాంగ్ లీ. ఒకరోజు ఆస్కార్లలో నాకు కృతజ్ఞతలు చెబుతాడేమో” అంటుంది. దిదీ మౌనంగా ఉంటాడు. ఆ స్నేహితురాలు అదే అదనుగా చావుదెబ్బ కొడుతుంది. దిదీతో “కళాకారుడిగా పేరు గడించటం కష్టం. మీ అమ్మనే చూడు” అంటుంది. ఆమె తెలివికి దిదీ తల్లి మనసు చివుక్కుమంటుంది కానీ నవ్వి ఊరుకుంటుంది. అవతలివారిని చులకన చేయటం కొందరికి ఎంత ఆనందమో! ఆ స్నేహితురాలు అక్కడితో ఊరుకోక “దిదీ పీశాట్‌కి ప్రిపేర్ అవుతున్నాడా? ఇప్పటికే లేటయింది. మావాడి టీచర్ దగ్గరకి పంపించు” అంటుంది. మనకి ఎమ్‌సెట్, ఐఐటీ జెఈఈ ఉన్నట్టే అక్కడ పీశాట్, శాట్ ఉంటాయి. ఎనిమిదో తరగతి నుంచే ఉరుకులూ పరుగులూ. దిదీ నానమ్మకి.. గొడవల్లో వాడికి కన్నో కాలో పోతే మంచి పెళ్ళాం రాదని, వంశం అంతరించిపోతుందని బాధ. అమ్మకేమో పోటీ పరీక్షలు బాగా రాయకపోతే ఉద్యోగం రాదని బాధ.

ఈ నానమ్మలు, అమ్మలు, ఆంటీలు ఏమనుకున్నా మ్యాడీ తనని ఇష్టపడుతోందని దిదీ తనకి తాను సర్ది చెప్పుకుంటాడు. మ్యాడీతో డేట్ కి వెళతాడు. ఇద్దరూ చీకటి పడ్డాక ఒక పార్కులో కలుసుకుంటారు. ఎవరూ లేని చోట కూర్చుంటారు. మ్యాడీ ఏవేవో ప్రశ్నలు అడుగుతుంది. దిదీ జంకుతూ ఉంటాడు. మ్యాడీ “ఏషియన్ అయినా నువ్వు నాకు నచ్చావు” అంటుంది. ఆమె తల్లి కూడా ఏసియనే. కానీ తండ్రి అమెరికన్ అని ఆమె గర్వం. జాత్యహంకారం వేళ్ళూనుకుపోతే ఇలాగే ఉంటుంది. కాసేపటికి మ్యాడీ హద్దు దాటి దిదీ మర్మాంగస్థానాన్ని తాకుతుంది. దిదీ కంగారుపడతాడు. ఆమె వెనక్కి తగ్గుతుంది. దిదీకి తల తీసేసినట్టుంటుంది. అయినా ఎవరికీ ఏమీ చెప్పడు. ఒకరోజు దిదీ స్నేహితుడు ఫహాద్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి మాల్‌కి వెళుతూ దిదీని తీసుకువెళతాడు. మరో అమ్మాయి కూడా ఉంటుంది. ఫహాద్ కట్టుకథలు చెబుతూ అందర్నీ నవ్విస్తాడు. దిదీకి కట్టుకథలు చెప్పటం తెలియదు. ఒక అమ్మాయి ఏదన్నా అనుభవం చెప్పమని అడిగితే తన స్నేహితులతో కలిసి చచ్చిపోయిన ఉడుతతో ఆడుకున్న ఆటల గురించి చెబుతాడు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు పాపం. ఫహాద్ వద్దంటూనే ఉంటాడు. దిదీ చెప్పింది విని అమ్మాయిలు అవాక్కయి ఉండిపోతారు. దిదీ కంగారులో బూతు మాట మాట్లాడతాడు. ఫహాద్ సిగ్గుతో కుంచించుకుపోతాడు. తర్వాత దిదీని వదిలేసి ఆ అమ్మాయిలని తీసుకుని వెళ్ళిపోతాడు.

చిన్నప్పుడు ఇబ్బంది పెట్టే విషయాలు అందరికీ జరుగుతాయి. కానీ ఎవరికీ చెప్పుకోరు. ఆ వయసు అలాంటిది. నా చిన్నప్పటి సంగతి ఒకటి గుర్తుకొస్తూంది. నేను మా ఇంటికి దూరంగా ఉన్న మైదానానికి ఒక స్నేహితుడ్ని తీసుకువెళ్ళాను. చుట్టూ రాళ్ళూ రప్పలూ ఉన్నా ఆ మైదానం మాత్రం నీటుగా ఉండేది. అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని నాకు తెలియదు. భద్రత కూడా ఉండేది కాదు. అక్కడ భూమిలో నీటుగా తవ్విన గొయ్యిలో చిన్న ఇనప యంత్రాల్లాంటివి ఏవో ఉంటే చూస్తున్నాం. ఇంతలో ఒకతను వచ్చి “ఇక్కడికెందుకు వచ్చారు?” అని మా ఇద్దర్నీ చెంపదెబ్బలు కొట్టాడు. నా వల్ల నా స్నేహితుడికి దెబ్బలు తగిలాయని నాకెంతో బాధేసింది. ఇంటికి వచ్చాక మౌనంగా ఉంటే మా అమ్మ “ఏదో మందు మింగినవాడిలా ఆ మొహం ఏమిటి?” అని అడిగింది. మనం చెప్పకపోయినా తల్లికి తెలిసిపోతుంది (ఏం జరిగిందో మా అమ్మకి నేను చెప్పలేదు. ఎందుకో తెలియదు!) దిదీ అమ్మ కూడా “ఏమైనా ఉంటే చెప్పు” అంటుంది. దిదీ విసుక్కుంటాడు. పిల్ల చేష్టలు చేసే వయసు దాటిపోయింది. ‘పెద్ద’ చేష్టలు చేసే వయసు రాలేదు. మ్యాడీ ఏదో చేయబోతే బెదిరిపోయాడు. స్నేహితులు పెద్ద పెద్ద మాటలు మట్లాడతారు. తను వాళ్ళని అందుకోలేక వెనకబడ్డాడు. దీనికి తోడు తాను అమెరికన్ అయి ఉంటే బావుండేదని తన మీద తనకే వివక్ష! ఇదిలా ఉండగా తల్లి బలవంతం మీద పీశాట్ కోచింగ్‌కి వెళ్ళటం మొదలుపెడతాడు దిదీ. “ఇదే మంచిది” అని తల్లి చెబుతుంది. ఇలాంటి కథల్లో పిల్లవాడు చివరికి ఒక విజయం సాధించాడని చూపించి ముగించటం మామూలే. అక్కడే ఈ చిత్రం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.

ఈ చిత్రానికి షాన్ వ్యాంగ్ స్క్రీన్‌ప్లే రాసి దర్శకత్వం వహించాడు. అతని స్వానుభవంతో ఈ చిత్రం తీశాడని నాకనిపించింది. అతను కూడా తైవాన్ నుంచి వచ్చి అమెరికాలో పెరిగాడు. అతని లాగే చిత్రంలో దిదీ ఇంటిపేరు కూడా వ్యాంగే. దిదీగా ఐజాక్ వ్యాంగ్, దిదీ తల్లిగా జోన్ చెన్, దిదీ అక్కగా షర్లీ చెన్, ఫహాద్‌గా రవుల్ దియాల్, మ్యాడీగా మహేలా పార్క్ నటించారు. ఈ చిత్రానికి సన్‌డ్యాన్స్ చిత్రోత్సవంలో ఆడియన్స్ అవార్డ్ వచ్చింది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

దిదీ తల్లి పోటీకి పంపిన పెయింటింగ్‌ని నిర్వాహకులు తిరస్కరిస్తారు. ఆమె బాధపడుతుంది. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. ఎవరి కష్టాలూ చిన్నవి కావు! ఒకరోజు ఆమె అత్తగారితో గొడవపడుతుంటే దిదీ చూస్తాడు. “నా కొడుకు కష్టపడి డబ్బు పంపకపోతే మనమందరం రోడ్డు మీద పడేవాళ్ళం” అంటుంది అత్తగారు. “ఈ ఇల్లు ఇల్లులా ఉందంటే కారణం నేను, ఆయన కాదు. నన్ను దెప్పటం మానకపోతే మిమ్మల్ని ఇంట్లోంచి గెంటేస్తాను. గుర్తుంచుకోండి” అంటుంది దిదీ తల్లి. ఇంట్లో పరిస్థితులు అప్పటి దాకా పట్టించుకోని దిదీకి ఇది షాక్‌లా తగులుతుంది. ఇదిలా ఉండగా మ్యాడీ ఒకరోజు దిదీకి చాటింగ్‌లో మెసేజ్ పంపిస్తుంది. “నా మీద కోపం వచ్చిందా?” అంటుంది. దిదీ “నాకు సిగ్గుగా ఉంది” అని టైపు చేస్తాడు కానీ ఇంతలో మనసు మార్చుకుంటాడు. మ్యాడీ నుంచి మెసేజ్‌లు రాకుండా బ్లాక్ చేసేస్తాడు. తను చేసింది తప్పా ఒప్పా అనేది ఆలోచించుకునే లోపే అతనికి డోనవన్ నుంచి మెసేజ్ వస్తుంది. స్కేటింగ్ వీడియోలు తీస్తావా అని అడుగుతాడు. దిదీకి ఇంకేమీ పట్టదు. మ్యాడీ లేకపోతే ఏం? ఫహాద్ స్నేహం వదిలేస్తే ఏం? పరుగున డోనవన్ దగ్గరకి వెళతాడు. ఆ వయసులో ఏదో రకంగా గుర్తింపు కావాలి అంతే. పైగా డోనవన్ తనకంటే వయసులో పెద్దవాడు. వాళ్ళతో చేరితే ఇక పిల్లకుంకల సాపత్యం ఎందుకు? దిదీ అక్క అతన్ని డోనవన్, అతని స్నేహితులు ఉన్న చోటికి కారులో తీసుకెళ్ళి దిగబెడుతుంది. ఇంట్లో పరిస్థితి నుంచి వీలైనన్ని రోజులు తమ్ముడిని కాపాడాలని ఆమె ప్రయత్నం. కానీ అపరిచితులైన పెద్ద కుర్రాళ్ళతో అతను స్నేహం చేస్తున్నాడని తెలిసి “పిచ్చి పనులేం చేయకు” అని హెచ్చరిస్తుంది. ఎంతైనా అతని కన్నా ఆమె పెద్దది. లోకం తీరు అతని కన్నా బాగా తెలుసు. డోనవన్, అతని స్నేహితులు స్కేటింగ్ చేస్తుంటే దిదీ వీడియోలు తీస్తాడు.

దిదీ ఒకరోజు డోనవన్, అతని స్నేహితులతో కలిసి నడుస్తూ వెళుతుంటే కాస్త దూరాన ఫహాద్ కనిపిస్తాడు. అతని గర్ల్‌ఫెండ్ కూడా ఉంటుంది. ఫహాద్ “ఎక్కడికెళ్తున్నావ్?” అంటే “పార్టీకి” అంటాడు దిదీ. “మేం రావచ్చా?” అంటాడు ఫహాద్. దిదీతో మళ్ళీ స్నేహం కలుపుకోవాలని అతని ఆరాటం. దిదీ “కారులో చోటు లేదు” అంటాడు. ఆరోజు ఫహాద్ అతన్ని వదిలి వెళ్ళినందుకు ఇది ప్రతీకారం అన్నమాట. ఫహాద్ సరేలే అంటాడు. దిదీ డోనవన్‌తో పార్టీకి వెళతాడు. అక్కడ డోనవన్, అతని స్నేహితులు గంజాయి సిగరెట్లు కాలుస్తూ ఉంటే దిదీ కూడా కాలుస్తాడు. ఒక సందర్భంలో వాళ్ళందరూ అతన్ని “ఏషియన్ క్రిస్, ఏషియన్ క్రిస్” అంటూ ప్రోత్సహిస్తూ ఉంటారు (క్రీడల్లో “ఇండియా ఇండియా” అని నినాదాలు చేసినట్టు). ఇందులో దురుద్దేశం ఏమీ లేదు. కాకపోతే అతను ఏషియావాడని అనటం అవసరం లేదు. దిదీ “నేను సగం ఏషియన్‌ని” అంటాడు. అంటే అతని ఉద్దేశం అతని తలిదండ్రుల్లో ఒకరు అమెరికన్ అని. అది అబద్ధం. కానీ తాను అమెరికన్‌ని అని చెప్పుకుంటే వారు ఆదరిస్తారని అతని ఆశ. గంజాయి కాల్చటం వల్ల దిదీ ఇంటికొచ్చి వాంతి చేసుకుంటాడు. అతని అక్క ఆ సంగతి తల్లికి తెలియకుండా అతన్ని కాపాడుతుంది. కొన్నాళ్ళకి ఆమె కాలేజీకి వెళ్ళిపోతుంది. తమ్ముడికి ఇష్టమైన తన స్వెటర్ అతని కోసం వదిలి వెళుతుంది. తోబుట్టువులు దెబ్బలాడుకుంటారు కానీ అందులో ఉన్నది ప్రేమే.

తమ కుటుంబం గురించి అబద్ధాలు చెప్పటం చాలామంది పిల్లలకి అలవాటే. ఇక్కడ నా చిన్నప్పటి సంగతి మరోటి చెప్పాలి. స్కూల్లో ఒకసారి టీచరు అందరి ముందూ నన్ను లేపి “మీ అమ్మ ఏం చదువుకున్నారు?” అని ఇంగ్లీషులో అడిగింది. ఆ టీచరు “ఇంట్లో ఇంగ్లీషు మాట్లాడండి” అని చెప్పేది. ఇది 80వ దశకం. ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది కానీ అప్పుడే తెలుగుని చులకనగా చూసేవారు కొందరు టీచర్లు. నేను హైదరాబాదులో చదువుకున్నాను. హైదరాబాదులో ఈ జాడ్యం ముందే వచ్చిందేమో. ఇప్పుడు ఎలా వెర్రితలలు వేసిందో చూస్తూనే ఉన్నాం. మన తెలుగువాళ్ళకి ఉన్న తెగులే ఇది. ఆ టీచరు ముందు పరువు పోకూడదని నేను “మా అమ్మ ఇంటర్ చదివారు” అని చెప్పాను. నిజానికి మా అమ్మ చదివినది ఐదో తరగతే. దిదీ “సగం ఏషియన్‌ని” అని చెప్పటం కూడా ఇలాంటిదే. ఒత్తిడిలో చిన్నప్పుడు అబద్ధాలు చెబితే దానికి సమాజమే కారణం. సమాజం ఒత్తిళ్ళు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గటం లేదు. సమాజమంటే ఎవరో కాదు, మనమందరమూ!

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

అక్క వెళ్ళిపోవటంతో దిదీ మరీ ఒంటరివాడైపోతాడు. ఒకరోజు డోనవన్ తన స్నేహితులతో దిదీ ఇంటికి వస్తాడు. దిదీ తీసిన తమ స్కేటింగ్ వీడియోలు చూపించమంటాడు. వాటిలో ఏవీ వాళ్ళకు నచ్చవు. అసలు లోపం దిదీ తీతలోనే ఉంది. అతని వీడియోలు తీయటంలో మెళకువలు తెలియవు. చిన్నప్పుడు ఫ్రెండ్స్‌తో తీసిన వీడియోలు వేరు, ఇప్పుడు డోనవన్ బృందం ఆశించిన వీడియోలు వేరు. “ఇవేం పనికి రావు” అంటారు వాళ్ళు. దిదీ గుండె జారిపోతుంది. ఇంతలో దిదీ తల్లి అతని గదిలోకి వస్తుంది. అందరికీ హలో చెబుతుంది. డోనవన్ స్నేహితుడు అక్కడున్న పెయింటింగులు చూపించి “ఇవి మీరే వేశారా? చాలా బావున్నాయి” అంటాడు. ఆమె సంబరపడుతుంది. వయసు పెరిగినా గుర్తింపు కోరుకోవటం అనేది మాత్రం పోదు. పొగడ్త చెవిటివాడికి కూడా వినపడుతుంది. ఆ అబ్బాయి “మీరేమో ఏషియన్, మరి మీ భర్త అమెరికనా?” అంటాడు. ఆమె “కాదు. ఆయనా ఏషియనే” అంటుంది. వాళ్ళందరూ దిదీతో “మరి నువ్వు సగం ఏషియన్‌నని చెప్పావు?” అంటారు కాస్త నెమ్మదిగా. దిదీ తల్లికి బయటికి పంపించేస్తాడు. “ఇలాగే విసిగిస్తుంది” అంటాడు. డోనవన్ “మీ అమ్మ గురించి అలా మాట్లాడకు” అంటాడు. తర్వాత “వీడి పద్ధతి ఏం బాలేదు” అనుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. దిదీకి భూమి బద్దలైనట్టు ఉంటుంది. తానెందుకూ పనికిరానని, తనంటే ఎవరికీ ఇష్టం లేదని అనుకుంటాడు.

ఫహాద్‌తో చాటింగ్ చేయాలని అనుకుంటాడు. కానీ ముందు మైస్పేస్‌లో ఫహాద్ ఫ్రెండ్స్ లిస్ట్ చూస్తాడు. అందులో బెస్ట్ ఫ్రెండ్స్‌ని వేరుగా చూపించే వెసులుబాటు ఉంది. కానీ ఆ బెస్ట్ ఫ్రెండ్స్‌లో దిదీ పేరు ఉండదు. దిదీ హతాశుడవుతాడు. సోషల్ మీడియాతో వచ్చే దుష్ప్రభావాలు ఇలాగే ఉంటాయి. ఇంతకు ముందు కొన్ని విషయాలు ఇద్దరు మనుషుల మధ్యే ఉండేవి. గొడవపడితే వారిద్దరి మధ్యే ఉంచుకునేవారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రపంచానికి తెలిసే లాగ లిస్టులో నుంచి పేరు తీసేయటం లాంటివి చేస్తున్నారు. ముఖాముఖీ మాట్లాడుకోవటం లేదు. ఒక్క క్లిక్‌తో ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు’ అని ప్రపంచానికి తెలిసేలా చేసేస్తున్నారు. టీనేజీలో తొందరపాటు ఎక్కువ. సోషల్ మీడియా వల్ల అది ఎన్నో మానసిక సమస్యలకి దారి తీస్తోంది. పిల్లలకి స్కూల్ వయసులో సోషల్ మీడియా లోకపోవటమే మంచిది. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. దిదీ కూడా మ్యాడీని ఒక్క క్లిక్‌తో బ్లాక్ చేశాడు. క్లిక్ చేయాలంటే వేలుంటే చాలు. ముఖాముఖీ మాట్లాడాలంటే ధైర్యముండాలి.

దిదీ కోచింగ్‌కి వెళ్ళే చోట మ్యాడీ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. అతనికి మ్యాడీ దిదీ గురించి అంతా చెప్పేసింది. అతను దిదీని “నువ్వు గే కాబట్టే మ్యాడీని ముద్దు పెట్టుకోలేదు” అని ఏడిపిస్తాడు. దిదీ వాడిని కొడతాడు. వాడి తరఫు పెద్దవాళ్ళు దిదీ తల్లికి ఫిర్యాదు చేస్తారు. ఆమె దిదీని చీవాట్లేస్తుంది. దిదీ “నాన్న ఉంటే నేను బాగుపడేవాణ్నేమో. ఆయన డబ్బు పంపిస్తుంటే నువ్వు ఇంట్లో కూర్చుని మబ్బులు గీసుకుంటున్నావు. నువ్వే పనికిమాలినదానివి” అని అరుస్తాడు. ఆమె చేయి ఎత్తుతుంది కానీ ఆగిపోతుంది. దిదీ పారిపోతాడు. రాత్రంతా పార్కులో ఉంటాడు. పొద్దున్న ఇంటికి వస్తాడు. తల్లితో “నేను రాత్రంతా రాకపోయినా నువ్వు వెతకలేదు” అంటాడు. “మీ అక్క ఒకసారి ఇలాగే పారిపోయింది. మూడు రోజుల తర్వాత వచ్చింది. దాంతో పోలిస్తే నువ్వు చాలా సౌమ్యుడివి. నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసు” అంటుందామె. ఇది మనకి వింతగా ఉంటుంది. ఆమె ధైర్యం ఏమిటో? తర్వాత ఆమె “నా జీవితం ఇలా ఉందేమిటా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. మీ నాన్నని పెళ్ళి చేసుకోకపోతే ఎలా ఉండేది? నేను సొంతంగా అమెరికా వచ్చేదాన్నేమో. సొంతంగా ఒక ఆర్ట్ స్టూడియో పెట్టుకునేదాన్నేమో. అదో కల. కానీ మీ అక్క, నువ్వు ఎదుగుతూ, స్నేహాలు చేస్తూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటే మీరే నా కల అనిపిస్తుంది. మిమ్మల్ని చూసి గర్వపడతాను. ఒక్కోసారి కష్టంగా ఉంటుంది, కాదనను” అంటుంది. పిల్లలు సొంతంగా పనులు చేసుకుంటుంటే అదో అద్భుతం. ‘నా పిల్లలేనా ఇదంతా చేస్తోంది’ అనిపిస్తుంది. సృష్టిలో వింత అది. ఇంకో వింత ఏమిటంటే ఇదో గొలుసులా ముందుకి వెళుతుంది కానీ చక్రంలా ఉండదు. పిల్లల పెరిగి పెద్దయ్యి పిల్లల్ని కన్నాక తమ పిల్లల్ని చూసి అబ్బురపడతారు కానీ తమ తలిదండ్రులకి తాము కూడా అంతే కదా అనే ఆలోచన రాదు. దిదీకి అది తెలుసుకునే అవకాశం రావటం ఒకరకంగా అదృష్టం. ఎవరూ లేకపోయినా తల్లి ఎప్పుడూ ఉంటుంది.

ఇక్కడితో చిత్రం ముగియదు. దిదీ హైస్కూల్లో చేరతాడు. అక్కడ మ్యాడీ కనిపిస్తుంది. దిదీ ఆమె దగ్గరకి వెళ్ళి “నీకు చాటింగ్‌లో జవాబు చెప్పనందుకు సారీ. కాస్త బిజీగా ఉన్నాను. నీకిష్టమైతే మనం మళ్ళీ ఫ్రెండ్స్ అవ్వచ్చు” అంటాడు. మరో సినిమా అయితే మ్యాడీ ఒప్పుకుందని చూపించేవారేమో. ఇక్కడ మ్యాడీ “నువ్వు నా ఫ్రెండ్‌ని కొట్టావు” అని వెళ్ళిపోతుంది. అన్నీ మనకి అనుకూలంగా జరగవు. ఉన్నదానితో సర్దుకుపోవాలి. అలాంటి ఫ్రెండ్స్ ఉన్న మ్యాడీతో కలవకపోవటమే మంచిది. దిదీ ఒక నిట్టూర్పు విడిచి సాగిపోతాడు. అతనికి ఫహాద్ కనిపిస్తాడు. ఇద్దరూ దూరం నుంచే పలకరించుకుంటారు. దిదీ స్కూల్లో ఫొటోగ్రఫీ క్లబ్‌లో చేరతాడు. ఏ కళైనా అంచెలంచెలుగా నేర్చుకోవాలి. ఇన్స్టాగ్రామ్‌లో రీల్స్ చేసేసి గొప్ప కళాకారులైపోయామనుకుంటే పొరపాటు. చివరికి దిదీ తల్లి అతన్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టటంతో చిత్రం ముగుస్తుంది. జీవితం ఇంకా ముందుంది. చిన్న చిన్న అడుగులు వేయాలి కానీ అన్నీ ఒకేసారి అయిపోవాలంటే కుదరదు. దేవుడిచ్చిన కుటుంబాన్ని ఆసరా చేసుకుంటే ప్రయాణం సాఫీగా ఉంటుంది.

Exit mobile version