Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరుగునపడ్డ మాణిక్యాలు – 110: అటోన్‌మెంట్

[సంచిక పాఠకుల కోసం ‘అటోన్‌మెంట్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

ప్రాయశ్చిత్తం (అటోన్‌మెంట్) ఒక్కొక్కరూ ఒక్కోలా చేసుకుంటారు. క్షమాపణ చెప్పుకోవటం సాధారణ విషయం. అవతలి వారికి అపకీర్తి వస్తే క్షమాపణ ఒక్కటే సరిపోదుగా. ఆ అపకీర్తి పోవాలి. దానికీ మార్గాలు ఉన్నాయి. ఒక్కోసారి ఆ మార్గాలు కూడా మూసుకుపోతాయి. అప్పుడు ఏది దారి? ఇలాంటి ప్రశ్నలతో వచ్చిన చిత్రం ‘అటోన్‌మెంట్’ (2007). ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. పెద్దలకు మాత్రమే. విచిత్రమేమిటంటే ఈ చిత్రంలో ఒక ముఖ్యపాత్ర ఒక పదమూడేళ్ళ పిల్ల. ఆ పిల్లే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.

ఆ పిల్ల పేరు బ్రయనీ. కథ 1935లో ప్రారంభమవుతుంది. ఇంగ్లండ్‌లో ఒక ఊరు. వేసవికాలం. ఉష్ణతాపం ఎక్కువగా ఉంటుంది. బ్రయనీ సంపన్నుల బిడ్డ. కథలు రాయటం ఇష్టం. ఆమెకి ఒక అక్క, ఒక అన్న. అక్క పేరు సెసీలియా. తండ్రి, అన్న వ్యాపారం మీద లండన్‌లో ఉన్నారు. వారు తల్లి దగ్గర ఉంటారు. వారి మహలు హౌస్‌కీపర్ (ఇంటి నిర్వహణ చూసే సేవకురాలు) కొడుకు రాబీ. తోటపని చేస్తాడు. బ్రయనీకి రాబీ అంటే ఆకర్షణ. చిన్నప్పుడు ఇలాంటి ఆకర్షణలు మామూలే. సెక్స్ అంటే తెలిసీ తెలియని వయసు. సెసీలియాకి రాబీ మీద కోపమని బ్రయనీకి అనుమానం. ఎందుకో తెలియదు. సెసీలియా అడిగినా చెప్పదు. వారి అన్న లండన్ నుంచి ఇంటికి వస్తున్నాడు. అతని కోసం బ్రయనీ టైపురైటర్ మీద ఒక నాటిక రాస్తుంది, అతను ముందు ప్రదర్శించాలని. ఆమె కజిన్లు వారి ఇంట్లోనే ఉంటారు. లోలా అనే పదిహేనేళ్ళ అమ్మాయి, ఇద్దరు కవల అబ్బాయిలు. వారి చేత నాటికలో నటింపజేయాలని బ్రయనీ ప్రయత్నం. కవలలు మాట వినరు. పనివాడు డానీ రిహార్సల్ జరుగుతుండగా చూడాలని వస్తాడు. అతను లోలా మీద కన్నేశాడు. రిహార్సల్ సవ్యంగా జరగటం లేదని బ్రయనీకి అసహనంగా ఉంటుంది.

ఆ సమయంలో బ్రయనీ కిటికీ లోనుంచి బయటకి చూస్తే ఫౌంటెన్ దగ్గర రాబీ “జాగ్రత్త!” అని సెసీలియా మీద అరవటం కనపడుతుంది. సెసీలియా తన పైదుస్తులు విప్పి లోదుస్తులలో ఫౌంటెన్ చెరువులో దిగుతుంది. తర్వాత బయటికొస్తుంది. రాబీ ముఖం తిప్పుకుంటాడు. సెసీలియా పక్కన ఉన్న ఫ్లవర్ వాజ్ తీసుకుని రాబీ చేతిలో ఉన్న వస్తువేదో లాక్కుని అతన్ని దాటి వచ్చేస్తుంది. బ్రయనీ చూసింది ఇంతమాత్రమే. అసలేం జరిగిందనేది వెంటనే దర్శకుడు ప్రేక్షకులకి చూపిస్తాడు. సెసీలియా రాబీని బయట చూసి ఫ్లవర్ వాజ్ పట్టుకుని బయటకి వస్తుంది, ఫౌంటెన్ చెరువులో నీళ్ళు వాజ్‌లో నింపాలనే మిషతో, ఇంట్లో నీళ్ళు లేనట్టు. రాబీ ఆమెతో పాటు వెళతాడు. “మా అన్నతో పాటు పాల్ అనే స్నేహితుడు వస్తున్నాడు. లక్షాధికారి” అంటుందామె. “ఈ పువ్వులు అతని కోసమా?” అంటాడు రాబీ. “అయితే ఏం?” అంటుందామె. అతను ఊరుకుంటాడు. “డాక్టరవ్వాలని అనుకుంటున్నావటగా? ఆరేళ్ళు చదవాలి” అంటుందామె. అతను ఆరేళ్ళు తనకి దూరమవుతాడని ఆమె బాధ. “మీ నాన్న డబ్బు తిరిగిచ్చేస్తాలే” అంటాడతను. ఆమెకు మనసు చివుక్కుమంటుంది. “అది కాదు నేనన్నది” అని ఆమె ఫౌంటెన్ దగ్గరకి వెళ్ళి వాజ్‌ని నీళ్ళలో ముంచబోతుంది. “నాకివ్వు” అని అతడు లాక్కోబోతాడు. ఆమె వెనక్కి లాగుతుంది. వాజ్ ముక్కలయి ఒక ముక్క అతని చేతిలో ఉంటుంది. ఒకటి నీళ్ళలో పడుతుంది. ఒకటి ఆమె కాళ్ళ దగ్గర పడుతుంది. ఆమె కోపంతో కదలబోతుంటే అతను ఆ ముక్క ఆమె కాలికి గుచ్చుకుంటుందని “జాగ్రత్త!” అంటాడు. ఆమె కోపంగా నీళ్ళలోకి దిగి అక్కడున్న ముక్కని తీసుకుని పైకి వస్తుంది. పల్చని లోదుస్తులు తడవటంలో ఆమె ఒంపుసొంపులన్నీ కనపడుతుంటాయి. ఆమె కావాలనే ఒక క్షణం అలా నిలబడిపోతుంది. అతను మర్యాదగా తల తిప్పుకుంటాడు. తర్వాత ఆమె అతని చేతిలోని ముక్క లాక్కుని విసవిసా వచ్చేస్తుంది.

వారిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. ఎవరూ బయటపడి చెప్పరు. ఆమె పైకి ఇష్టం లేనట్టు నటిస్తుంది. అమ్మాయిలకి మామూలేగా. అతను తనకి దూరంగా కాలేజీకి వెళ్ళిపోతాడని ఆమె బాధ. అందుకు అతని మీద అలక. బ్రయనీ ఆమెకి అతనంటే ద్వేషమని అనుకుంటుంది. కిటికీలో నుంచి ఈ సంఘటన చూసినప్పుడు రాబీ సెసీలియా మీద అరిచాడని, ఆమె ఎందుకో బట్టలు విప్పిందని, తర్వాత నీళ్ళలోనుంచి బయటకి వచ్చి కోపంగా వచ్చేసిందని మాత్రమే చూసింది. రాబీ తప్పుగా ప్రవర్తించాడని అనుకుంది. నిజానికి బ్రయనీకి రాబీ అంటే ఇష్టం. పిల్లల మనస్తత్వం విచిత్రంగా ఉంటుంది. రాబీ సెసీలియాకి దగ్గరవటం కంటే దూరమవటమే బ్రయనీకి ఇష్టం. అలా దూరం కావటానికి దోహదపడటానికి ఎంత దూరమయినా వెళ్ళటానికి సిద్ధంగా ఉంటుంది.

సెసీలియా అన్న, పాల్ వస్తారు. సెసీలియా అన్న రాబీని ఆ రాత్రి భోజనానికి రమ్మంటాడు. అది తెలిసి ఆమె అన్నతో “ఎందుకు రమ్మన్నావు?” అంటుంది. అంతా నటన. పాల్‌కి లోలా పరిచయమవుతుంది. ఆమెని ఆకర్షించటానికి ప్రయత్నిస్తాడు. కవలలిద్దరూ ఇంటికి వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ వారి తలిదండ్రులు అంత క్రితమే విడాకులు తీసుకున్నారు. అందుకని లోలా వారు ఇంటికి వెళ్ళటానికి వీల్లేదని అంటుంది. వారు అయోమయంలో ఉంటారు. అక్క మీద అక్కసు చూపిస్తూ ఉంటారు. మరో పక్క బ్రయనీ మహలుకి దూరంగా వెళ్ళి కథ రాసుకుంటూ ఉంటుంది. రాబీని మనసులో పెట్టుకుని గోముఖ వ్యాఘ్రంలాంటి ఒక మనిషి కథ రాస్తుంది. రాబీ ఇంటికి వెళ్ళి సెసీలియాకి క్షమాపణగా ఒక ఉత్తరం టైపు చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏం రాయాలో తెలీక కాగితాలు నలిపి పారేస్తూ ఉంటాడు. నిస్పృహ వచ్చి ఒక కాగితం మీద ఆమెతో పచ్చి శృంగారం చేయాలని ఉందని టైపు చేస్తాడు. మళ్ళీ నవ్వుకుని ఆ కాగితాన్ని మడిచి పక్కన పెట్టేస్తాడు. పెన్ను తీసుకుని వేరే కాగితం మీద “ఈ మధ్యాహ్నం నేను ప్రవర్తించిన తీరు చూసి నన్ను పిచ్చివాడని అనుకున్నా తప్పు లేదు. నీ సమక్షంలో నా బుద్ధి పని చేయదు. అందుకు కారణం వేసవితాపం అయితే కాదు. నన్ను మన్నించవా?” అని రాస్తాడు. చెప్పీ చెప్పనట్టు ఆమె తనని సమ్మోహితుణ్ని చేసిందని చెబుతాడు.

కాసేపటికి మహలుకి వెళ్ళటానికి తయారవుతాడు. ఉత్తరం కవర్లో పెట్టుకుని బయల్దేరతాడు. అయితే అతను కవర్లో పెట్టింది ముందు రాసిన అసభ్యమైన ఉత్తరం! మహలు సమీపిస్తుండగా అతనికి బ్రయనీ కనిపిస్తుంది. ఆ ఉత్తరాన్ని సెసీలియాకి ఇమ్మని బ్రయనీకి ఇస్తాడు. ఆమె అది తీసుకుని పరుగున వెళుతుంది. ఇచ్చిన తర్వాత రాబీకి అది తప్పు(డు) ఉత్తరమని స్ఫురిస్తుంది. కానీ ఏం చేయలేడు. బ్రయనీ ఆ ఉత్తరం చదివేస్తుంది. ఆమెది చిన్న వయసు. అర్థం చేసుకునే సామర్థ్యం లేదు. ఆమె అందరు ఆడపిల్లల్లాగే తన ఈడు ఉన్న మరో ఆడపిల్ల లోలా దగ్గరకి వెళుతుంది. ఇద్దరూ కలిసి తమకున్న మిడిమిడి జ్ఞానంతో రాబీని ‘సెక్స్ మేనియాక్’ (కామాతురుడు) అని తేల్చేస్తారు. బ్రయనీ ఏమీ ఎరగనట్టు ఉత్తరం సెసీలియాకి ఇచ్చేస్తుంది. సెసీలియా ఉత్తరం చదువుతుంది. ఆమె మొదటి ఆలోచన ‘బ్రయనీ చదవలేదు కదా’ అని. కానీ హడావిడిలో ఏం చేయలేక ఊరుకుంటుంది.

రాబీ వచ్చినపుడు సెసీలియా తలుపు తీస్తుంది. అతను “ఆ ఉత్తరం పొరపాటున నీకు చేరింది” అంటాడు. ఆమె గంభీరంగా ఉంటుంది. ఇద్దరూ లైబ్రరీలోకి వెళతారు. ఆమె “ఎప్పటి నుంచో ఉన్నదిది. ఫౌంటెన్ దగ్గరా అదే. నువ్వు కాలేజీకి వెళ్లిపోతే నేను నిశ్చింతగా ఉండొచ్చని అనుకున్నాను. ఎంత పిచ్చిదాన్ని. నాకన్నా ముందర నీకు తెలిసింది కదా?” అంటుంది. ఆమె కళ్ళు చెమర్చుతాయి. అతను ఆమెని ముద్దుపెట్టుకుంటాడు. మోహావేశంతో ఇద్దరూ శారీరకంగా కలుస్తారు. ఇద్దరూ “ఐ లవ్యూ” చెప్పుకుంటారు. అప్పుడే బ్రయనీ లోపలికి వస్తుంది. వాళ్ళిద్దరినీ చూస్తుంది. ఇద్దరూ తడబడి సర్దుకుని వెళ్ళిపోతారు. బ్రయనీ అతను ఆమెని బలాత్కరించాడని అనుకుంటుంది.

ప్రేమిస్తే మాత్రం హద్దులు ఉండక్కరలేదా అనే ప్రశ్న వస్తుంది. జరిగింది తప్పా ఒప్పా అనే చర్చ ఇక్కడ ఉద్దేశం కాదు. అది జరిగింది అంతే. అది చూసిన చిన్నపిల్ల మీద ఎలాంటి ప్రభావం పడిందో వేరే చెప్పక్కరలేదు. దురదృష్టకరమైన సంఘటన. సమయం దొరికితే సెసీలియా బ్రయనీకి నచ్చజెప్పేదేమో. కానీ విధివశాత్తూ ఆ అవకాశం రాదు. బ్రయనీ తన అపరిపక్వత కారణంగా వారి ఎడబాటుకి కారణమవుతుంది. కొన్నేళ్ళకి గానీ ఆమెకి తాను చేసిన పొరపాటు అర్థం కాదు. ఎవరిదీ పూర్తిగా తప్పు లేదు. అలాగని ఎవరూ నిర్దోషులు కాదు. మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయని అంటారు. దానికి కారణం కళ్ళు కాదు. పూర్తి సమాచారం లేని మెదడు. ఇక్కడ అంతా విధి వలన జరిగింది. ఏ ఒక్క సంఘటన కాస్త వేరుగా జరిగినా పరిణామాలు వేరుగా ఉండేవి.

ఇయన్ మెక్‌ఎవన్ రాసిన నవల ఆధారంగా క్రిస్టఫర్ హ్యాంప్టన్ స్కీన్‌ప్లే రాయగా జో రైట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రాబీగా జేమ్స్ మెక్‌ఎవాయ్, సెసీలియాగా కైరా నైట్లీ, బ్రయనీగా సర్ష రోనన్ నటించారు. సర్షకి ఇది తొలి చిత్రం. తొలి చిత్రంతోనే ఉత్తమ సహాయనటిగా ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. ఇప్పుడు ఆమె ప్రఖ్యాత నటి. ఈ చిత్రం స్క్రీన్‌ప్లే కి కూడా అస్కార్ నామినేషన్ వచ్చింది. చిత్రంలో నేపథ్యసంగీతం డారియో మారియనెల్లీ అందించాడు. ప్రేమలోని మాధుర్యం, వియోగంలోని దుఃఖం, యుద్ధంలోని విషాదం ఇవన్నీ మనసుకు హత్తుకునేలా సంగీతం ఉంటుంది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

భోజనాల దగ్గర బ్రయనీ రాబీని కోపంగా చూస్తూ ఉంటుంది. సెసీలియా ఏం జరుగుతుందో అని కంగారుపడుతూ ఉంటుంది. ఓపక్క భోజనాలు జరుగుతుండగానే కవలలిద్దరూ ఉత్తరం రాసిపెట్టి ఇంటి నుంచి పారిపోతారు. బ్రయనీకి ఆ ఉత్తరం దొరుకుతుంది. అందరూ తలోవైపుకీ వెళ్ళి వెతుకుతారు. బ్రయనీ కూడా మహలు పరిసరాల్లో వెతుకుతుంది. ఒకచోట ఆమెకి లోలాని ఎవరో నేల మీద అదిమిపట్టి ఉండటం కనపడుతుంది. బ్రయనీ రావటంతో అతను పారిపోతాడు. అతని ముఖం బ్రయనీకి కనపడదు. లోలా వణికిపోతూ ఉంటుంది. “అతను రాబీయే కదా? మా అక్క మీద కూడా దాడి చేశాడు” అంటుంది బ్రయనీ. లోలా “నా కళ్ళు మూసేశాడు. ఎవరో మరి” అంటుంది ఏడుస్తూ. “అతనే. నాకు తెలుసు” అంటుంది బ్రయనీ. పోలీసులకి “రాబీయే చేశాడు. నా కళ్ళారా అతని ముఖం చూశాను” అని చెబుతుంది. పోలీసులకి పనివాడు డానీ మీద కూడా అనుమానం వస్తుంది. కానీ బ్రయనీ.. రాబీ సెసీలియాకి రాసిన ఉత్తరం చూపిస్తుంది. దానితో అందరికీ రాబీ మీద అనుమానం బలపడుతుంది. రాబీ కవలలని తీసుకుని తిరిగివస్తాడు. సెసీలియా అడ్డుపడుతున్నా పోలీసులు అతన్ని అరెస్టు చేస్తారు. బ్రయనీ మేడ మీద కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. బ్రయనీ అలా చూస్తుండగా నేపథ్యంలో టైపురైటర్ శబ్దం వినిపిస్తూ ఉంటుంది. బ్రయనీ సృష్టించిన అభూతకల్పన అనే భావం స్ఫురిస్తుంది.

కథ నాలుగేళ్ళు ముందుకెళుతుంది. రెండో ప్రపంచయుద్ధం జరుగుతూ ఉంటుంది. రాబీకి శిక్ష పడింది కానీ సైన్యంలో చేరితే విడుదల చేస్తామనటంతో అతను సైన్యంలో చేరతాడు. యుద్ధభూమికి వెళ్ళేముందు అతను సెసీలియాని కలుసుకుంటాడు. ఆమె ఒక హాస్పిటల్లో నర్సుగా పని చేస్తూ ఉంటుంది. తన కుటుంబంతో సంబంధాలన్నీ తెంచేసుకుంది. అంత సంపన్నుల బిడ్డ ఆ స్థితిలో ఉండటం రాబీకి దుఃఖం తెప్పిస్తుంది. “నువ్వు నాకేమీ ఋణం లేవు. మన మధ్య ఉన్నది లైబ్రరీలో ఆ కొన్ని క్షణాలే” అంటాడు. ఎంత విషాదం! వారు తొలిసారి ప్రేమ బాసలు చేసుకున్న వెంటనే వియోగం బారిన పడ్డారు. వారు ప్రేమికులుగా కలిసి ఉన్నది కొన్ని క్షణాలే. అయినా ఒకరినొకరు మరువలేరు. పైగా సెసీలియాకి అపరాధభావం. ఆమెకి తోడుగా ఉండే పరిస్థితి కాదు అతనిది. అతని కోసం ఆమె జీవితాన్ని ధారపోసింది. అది అతనికి రంపపుకోత. ఆమె తనని మరచిపోవాలని కోరుకుంటాడు. అమరప్రేమికులకి అది సాధ్యమా? ఆమె అతన్ని సముదాయిస్తూ “మరలి రా! నా కోసం మరలి రా!” అంటుంది. ఇద్దరూ సెలవు తీసుకుని విడిపోతారు. ఆమె బస్సులో వెళుతూ అతన్ని చూస్తూ ఉంటుంది. బస్సు మలుపు తిరిగేవరకు అతను పరుగుపెడతాడు. తర్వాత ఫ్రాన్స్‌లో యుద్ధరంగానికి వెళతాడు. కొన్నాళ్ళకి సంయుక్త సేనలు జర్మనీ సేనల ధాటికి వెనకడుగు వేస్తాయి. సముద్రతీరంలోని డన్‌కర్క్ దగ్గర వారిని రక్షించి బ్రిటన్‌కి తరలించటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అది 1940వ సంవత్సరం.

బ్రయనీకి ఇప్పుడు పద్దెనిమిదేళ్ళు. తాను చేసిన తప్పు ఆమెకి అవగాహనకి వస్తుంది. సెసీలియాకి ఇష్టం లేకుండా రాబీ తప్పుడు పని చేస్తే సెసీలియా కలవరపడేది కదా. ఎవరికీ చెప్పకపోయినా ముఖంలో బాధ ఉండేది కదా. అలాంటిదేమీ ఆమె ముఖంలో లేదంటే ఆమెకి సమ్మతమనే అర్థం అని బ్రయనీ తెలుసుకుంటుంది. ఫౌంటెన్ దగ్గర అక్క అతని ముందర తడిబట్టలతో నిలబడిందంటే ఆమె అతన్ని కవ్వించిందని అర్థమవుతుంది. అది ప్రణయకలహమే కానీ ఆగ్రహం కాదని తెలుస్తుంది. అక్క కుటుంబాన్ని వదిలి వెళ్ళిందంటే ఆమెకి అతని మీద ఎంత ప్రేమ ఉందో అవగతమవుతుంది. బ్రయనీ అక్క చిరునామా కనుక్కుని ఉత్తరం రాస్తుంది. అక్కని కలుసుకుంటానంటుంది. ఆమె కాలేజీకి వెళ్ళకుండా నర్సు ట్రెయినింగ్‌లో చేరింది. “ఇది ఒక రకమైన ప్రాయశ్చిత్తమేమో” అని సెసీలియా రాబీకి ఉత్తరం రాస్తుంది. అయినా ఆమె బ్రయనీని కలవటానికి ఇష్టపడదు. బ్రయనీది తెలియక చేసిన తప్పు అని అనలేం. ఆమె రాబీని లోలా దగ్గర చూడలేదు. చూశానని చెప్పటం తప్పు. సెసీలియా పోలీసులతో “బ్రయనీ చెప్పింది నమ్మకండి. అది ఊహాలోకంలో ఉంటుంది” అంటుంది. బ్రయనీకి కథలు రాయటం ఇష్టం. కథలో మలుపులు ఉండాలి. ఇదీ ఒక మలుపే అని తేలిగ్గా చెప్పేసింది. కానీ ఇవి జీవితాలు. రాబీ బంగారు భవిష్యత్తు జైలుపాలయింది. సెసీలియా అతని కోసం ఒంటరిగా మిగిలింది. పదమూడేళ్ళ వయసులో మంచేదో చెడేదో తెలియాలి. విషాదమేమిటంటే మంచీ చెడూ తెలిసినా ప్రేమపక్షులు ముక్కులు రాసుకుంటుంటే పొడుచుకుంటున్నాయని అనుకుంది. మిగతా కథ తనే అల్లేసింది. అయితే ఈ కథలు అల్లే లక్షణమే తర్వాత ఆమెకు ఉపయోగపడుతుంది.

రాబీ కూడా సెసీలియాకి ఉత్తరాలు రాస్తాడు. “మన కథకి కొనసాగింపు వస్తుంది. నేను తిరిగివస్తాను. తలెత్తుకుని నీతో నడుస్తాను” అంటాడు. అతను డన్‌కర్క్ చేరుకునే సరికి సముద్రతీరంలో వేలాది సైనికులు తరలింపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అతను పైకి బాగానే ఉంటాడు కానీ లోపల గాయాలు ఉంటాయి. గాయాల ప్రభావంతో జ్వరం ముదిరి కాసేపటికి భ్రాంతిలోకి వెళ్ళిపోతాడు. తల్లిని చూసినట్టు భ్రమపడతాడు. అతని తోటి సైనికుడు అతన్ని ఒక బంకర్‌లోకి తీసుకువెళతాడు. అక్కడ రాబీ నిద్రపోతాడు కానీ నిద్రలోనే అరుస్తూ ఉంటాడు. యుద్ధం ఎప్పుడూ పీడకలలనే మిగులుస్తుంది. అతనికి తోటి సైనికుడు ఒక శుభవార్త చెబుతాడు. మర్నాడు ఉదయమే పడవల్లో బ్రిటన్ వెళ్ళబోతున్నామని. డన్‌కర్క్ బీచ్‌లో జరిగే సన్నివేశాలని అద్భుతంగా తెరకెక్కించారు (తర్వాత ‘డన్‌కర్క్’ అనే సినిమా వచ్చింది). అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో, సైనికుల మనఃస్థితి ఎలా ఉందో.. నిడివి ఎక్కువున్న ఒక్క షాట్‌లో చూపించారు. పరిస్థితులకి ప్రతీకగా ఒక పెద్ద పడవ శిథిలమై ఒడ్డున ఉంటుంది. ఒక బంకర్లో సైనికుల కోసం సినిమా ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ తెర వెనకకి రాబీ చేరతాడు. తెర మీద ఒక ప్రేమ సన్నివేశం వస్తూ ఉంటుంది. రాబీ తన ప్రేయసిని తలచుకుని దుఃఖపడతాడు. వెనక తెర మీద జంట, ముందు చేతుల్లో ముఖం దాచుకుని ఒంటరిగా రాబీ ఉండే ఆ షాట్ అతని మనఃస్థితిని ప్రతిబింబిస్తుంది. సినిమా అనే కళ ఇలాంటి చోట్లే శిఖరాలను అందుకుంటుంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

రాబీ డన్‌కర్క్ చేరుకునే సరికే బ్రయనీ నర్సుగా పనిచేస్తుంటుంది. ఆమెలో పశ్చాత్తాపం గూడు కట్టుకుని ఉంటుంది. పనిలో ఎంత నిమగ్నమయినా ఆమె వేదన తగ్గదు. సెసీలియాకి ఉత్తరం రాసినా జవాబు లేదు. రాత్రివేళ ఎవరికీ తెలియకుండా ఆమె కథలు రాస్తుంటుంది. ఆ కథల్లో ఆ గతమే తొంగిచూస్తుంటుంది. ఒకరోజు కొందరు సైనికులు గాయపడిన సైనికులని ఆసుపత్రికి తీసుకువస్తారు. అందులో ఒక ఫ్రెంచ్ సైనికుడు ఉంటాడు. తలకి గాయమైంది. బ్రయనీ అతని పక్కనే ఉంటుంది. అతను తన ప్రేయసిని తలచుకుంటూ ఉంటాడు. కాసేపటికి అతను మరణిస్తాడు. రాబీ పరిస్థితి ఏమిటో అని బ్రయనీకి భయంగా ఉంటుంది. ఈలోగా లోలా పాల్‌ని పెళ్ళి చేసుకుంటోందని తెలుస్తుంది. బ్రయనీ పెళ్ళికి వెళుతుంది. అక్కడ ఆమెకి అర్థమవుతుంది, లోలా మీద లైంగిక దాడి చేసినది పాలేనని! పాల్ చేసిన తప్పు వల్ల రాబీకి శిక్షపడింది. రాబీ కాకపోతే మరో పనివాడిని ఇరికించి పాల్ తప్పించుకునేవాడు. లక్షాధికారి కదా! లోలా కూడా మౌనంగా ఉండిపోయింది. డబ్బు మహిమ!

ఇంత జరిగాక ఇంక బ్రయనీ ఆగలేక సెసీలియాని కలుసుకోవటానికి ఆమె ఇంటికి వెళుతుంది. సెసీలియా పుల్ల విరిచినట్టు మాట్లాడుతుంది. బ్రయనీ “అందరికీ నిజం చెప్పేస్తాను. కేసు మళ్ళీ తెరవమంటాను” అంటుంది. “నువ్వు నమ్మదగిన సాక్షివి కావు. నీ మాట ఎవరూ వినరు” అంటుంది సెసీలియా. “కనీసం అమ్మా, నాన్న, అన్నలకి నిజం చెబుతాను” అంటుంది బ్రయనీ. “వాళ్ళకది అనవసరం. నువ్వు చేసిన నిర్వాకం వల్ల వాళ్ళు గతాన్ని దులిపేసుకున్నారు” అంటుంది సెసీలియా. ఇంతలో రాబీ లోపలి నుంచి వస్తాడు. బ్రయనీని మొదట గుర్తుపట్టకపోయినా తర్వాత గుర్తుపడతాడు. ఆమె మీద నిప్పులు కక్కుతాడు. “ఎంత చదువుకున్నా నన్ను నౌకరు లాగే చూశారు. నమ్మకూడదన్నట్టే చూశారు. అంతా కుమ్మక్కై నన్ను బలిపశువుని చేశారు” అని అరుస్తాడు. సెసీలియా అతన్ని ఆపుతుంది. సాంత్వనపరుస్తుంది. రాబీ “నువ్వు తప్పుడు సాక్ష్యం ఇచ్చానని ఒక ఉత్తరం లాయరుకి ఇవ్వు” అంటాడు. “డానీ ఏం చేశాడో కూడా రాయి” అంటుంది సెసీలియా. “డానీ తప్పేం లేదు. పాల్‌ది తప్పు. అతను లోలాని పెళ్ళి చేసుకున్నాడు” అంటుంది బ్రయనీ. రాబీ, సెసీలియా అవాక్కయి ఉండిపోతారు. సెసీలియా “ఇప్పుడిక లోలాని సాక్ష్యం చెప్పటానికి ఎవరూ బలవంతపెట్టలేరు. పాల్ తప్పించుకున్నట్టే” అంటుంది. భార్యాభర్తలు ఒకరికి మీద ఒకరు సాక్ష్యం చెప్పే అవసరం లేదని చట్టం ఉంది. రాబీని నిస్సత్తువ ఆవరిస్తుంది. “లాయరుకి ఉత్తరం రాయి. తర్వాత మమ్మల్ని మా మానాన వదిలెయ్” అంటాడు. బ్రయనీ క్షమాపణలు కోరి వచ్చేస్తుంది. బ్రయనీ ఉన్న సన్నివేశాలలో అప్పుడప్పుడూ నేపథ్యంలో టైపురైటరు శబ్దం వినిపిస్తూ ఉంటుంది. రాబీ యుద్ధభూమి నుంచి రాగానే బ్రయనీని ఎందుకు పిలిపించలేదు? ఆమె పశ్చాత్తపపడుతోందని తెలుసు కదా? ఆమె వచ్చే దాకా ఎందుకు ఆగాడు? ఎందుకంటే ఇదంతా బ్రయనీ కల్పన! టైపురైటర్ శబ్దం ఈ విషయానికి సూచన. ఆమె అసలు సెసీలియాని కలవటానికి వెళ్ళలేదు. ఆమెని కళ్ళలో కళ్ళు పెట్టి చూసే ధైర్యం బ్రయనీకి లేదు.

రాబీ డన్‌కర్క్‌లో గాయాల వల్ల మరణించాడు. సెసీలియా శత్రువుల బాంబు దాడిలో మరణించింది. వారిద్దరూ మళ్ళీ కలుసుకోలేదు. బ్రయనీ తర్వాతి కాలంలో ఒక రచయిత్రి అయింది. కానీ చాలా ఏళ్ళ వరకూ ఈ కథ రాయలేదు. ముసలితనంలో రాసింది. తను చేసిన పొరపాటు వల్ల వారిద్దరూ దూరమై మళ్ళీ కలుసుకోకుండానే మరణించారు. అందుకని ఆమె వారిద్దరూ మళ్ళీ కలుసుకున్నట్టు కథకి ముగింపు ఇచ్చి ప్రాయశ్చిత్తం చేసుకుంది. బ్రయనీకి ప్రాణాంతక వ్యాధి వచ్చింది. అందుకని ఎప్పుడో మొదలుపెట్టిన కథ చనిపోయేలోగా పూర్తి చేయాలని ఈ నవల రాసింది. తన పేరు సహా పాత్రల పేర్లేవీ మార్చలేదు. నవల పేరు ‘అటోన్‌మెంట్’ (ప్రాయశ్చిత్తం). నవల విడుదల సందర్భంగా ఇంటర్వ్యూలో ఆమె “జరిగింది జరిగినట్టు రాశాను” అంటుంది. కానీ కాసేపటికి నిజం చెప్పేస్తుంది. ఇది లైలా మజ్నూ, రోమియో జూలియట్ లాంటి విషాద ప్రేమకథ. కానీ బ్రయనీ తన నవలలో వారికి అమరత్వాన్ని ఇచ్చింది. కొన్నాళ్ళకి తరం మారుతుంది. కొత్త తరాలు రాబీ, సెసీలియా కథ సుఖాంతమైందనే అనుకుంటాయి. కథలు అల్లే లక్షణం బ్రయనీకి ఇలా ఉపయోగపడింది.. ఆమెకి మాత్రమే ఉపయోగపడింది.

Exit mobile version