[సంచిక పాఠకుల కోసం ‘డౌట్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
చర్చిల్లో కొందరు ఫాదర్లు అబ్బాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే వార్తలు ప్రపంచానికి తెలియక ముందు చాలాకాలంగా ఆ వేధింపులు జరిగాయి. మతపెద్దలకి తెలుసు. గుట్టుగా ఉంచారు. విషయం పొక్కినా అది చర్చిల్లో ఉన్న ఫాదర్లకి, సిస్టర్లకి తెలిసింది కానీ బయటి ప్రపంచానికి తెలియలేదు. అబ్బాయిల తలిదండ్రులు అవగాహనలేమితో చూసీ చూడనట్టు వదిలేశారు. ‘డౌట్’ (2008) చిత్రం కథ 1960 దశకంలో జరిగినది. అమెరికాలోని ఒక స్కూల్లో తొలిసారిగా ఒక నల్లజాతి అబ్బాయి చేరతాడు. జాతివివక్ష రద్దు చేసిన తొలిరోజులవి. చట్టాల్లో రద్దు చేస్తే రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోవుగా. ఆ అబ్బాయి చుట్టూ ఉన్నవారందరూ తెల్లజాతి వారే. ఇతర విద్యార్థులు అతన్ని ఏడిపిస్తూ ఉంటారు. అతన్ని ఒక ఫాదర్ లైంగికంగా వేధిస్తున్నాడని ప్రిన్సిపాల్‌కి అనుమానం వస్తుంది. అసలే ఆ పిల్లవాడు ఎవరికీ ఏమీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అనుమానం (డౌట్) నిరూపణ అయ్యేదెలా? నిరూపణ కాకుండా శిక్ష వేయకూడదు కదా? ఇలాంటి సందిగ్ధావస్థలో ఆ ప్రిన్సిపాల్ ఏం చేసిందనేది కథ. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.
ఒక చర్చికి అనుబంధంగా ఉన్న స్కూల్లో ప్రిన్సిపాల్ సిస్టర్ అలోషియస్. యాభై ఏళ్ళుంటాయి. చాలా కఠినంగా ఉంటుంది. పిల్లలందరికీ ఆమె అంటే హడల్. చర్చిలో కొత్త ఫాదర్ పేరు బ్రెండన్ ఫ్లిన్. వయసులో చిన్నవాడైనా అధికారికంగా అతను సిస్టర్ అలోషియస్ కన్నా పైస్థాయి వాడు. అతను ఒక ఆదివారం చర్చిలో చేసిన ప్రసంగంలో సంశయం (డౌట్) గురించి మాట్లాడతాడు. “సంశయం ఉంటే భయపడకండి. నిస్సంశయస్థితి లానే సంశయస్థితి కూడా మనల్ని కలుపుతుంది. మీకు దారి తెన్నూ తెలియకపోతే మీలాగే ఎందరో ఉన్నారని గుర్తుపెట్టుకోండి” అంటాడు. ఇది సిస్టర్ అలోషియస్కి వింతగా ఉంటుంది. ఏ మతమైనా నమ్మకం గురించి చెబుతుంది కానీ సంశయం గురించి కాదు కదా. సోమవారం స్కూలు మొదలవుతుండగా ఫాదర్ ఫ్లిన్ విలియమ్ అనే విద్యార్థిని “చేతులు కడుక్కున్నావా?” అని చేయి పట్టుకుంటాడు. అతను విసురుగా “కడుక్కున్నాను” అని చేయి వెనక్కి లాక్కుంటాడు. అది సిస్టర్ అలోషియస్ చూస్తుంది. ఆమె ఏమైనా తనిఖీ చేయాలంటే చూపించమని అడుగుతుంది కానీ ముట్టుకోదు. ఫాదర్ పద్ధతి, విద్యార్థి స్పందించిన తీరు ఆమెకి విచిత్రంగా ఉంటుంది. తర్వాత ఆమె ఇతర సిస్టర్లతో మాట్లాడుతున్నప్పుడు “ఆయన సంశయం గురించి ప్రసంగానికి అర్థం ఏమిటి? ఆయనకి ఏమైనా సంశయాలున్నాయా? లేక ఇంకెవరికైనా సంశయాలున్నాయని ఆయన ఉద్దేశమా? ఎందుకైనా మంచిది, మీరందరూ స్కూలు వ్యవహారాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి” అంటుంది.
సిస్టర్లకి, ఫాదర్లకి చర్చి దగ్గరే నివాసం. సిస్టర్ జేమ్స్ స్కూల్లో ఎనిమిదో తరగతి పిల్లలకి సాంఘికశాస్త్రం బోధిస్తుంది. చిన్న వయసు. లోకం తీరు తెలియని అమాయకురాలు. ఒకరోజు విలియమ్ ఉదయం ప్రార్థన సమయంలో ముక్కు నుంచి రక్తం కారుతోందని ఇంటికి వెళ్ళిపోతాడు. సిస్టర్ జేమ్స్ అతని మీద జాలి పడుతుంది. అతనికి అకస్మాత్తుగా ముక్కు నుంచి రక్తం కారిందంటే సిస్టర్ అలోషియస్ నమ్మదు. “వాడు కావాలనే తనని తాను గాయపరచుకున్నాడు. స్కూల్ ఎగ్గొట్టడానికి వేషాలు. నువ్వు అమాయకురాలివి” అంటుంది. విలియమ్ నిజంగానే స్కూల్ ఎగ్గొట్టి సిగరెట్లు తాగుతాడు. సిస్టర్ అలోషియస్ కాఠిన్యంతో వారిని మార్చాలని ప్రయత్నిస్తుంటుంది. అయితే ఆమెకి కూడా జాలి ఉంది. ఒక సిస్టర్‌కి వయసు మీద పడటంతో కంటిచూపు ఆనక బాధపడుతూ ఉంటుంది. ఆమె పరిస్థితి బయటపడకుండా ఈమె కాపాడుతూ ఉంటుంది. బయటపడితే ఆమెని పంపేస్తారు. (అదేం పద్ధతో మరి!) మరో పక్క ఫాదర్ ఫ్లిన్ విద్యార్థులకి బాస్కెట్‌బాల్ నేర్పిస్తూ ఉంటాడు. మధ్యలో శుభ్రత గురించి చెబుతాడు. “గోళ్ళు కాస్త పొడుగ్గా ఉన్నా పర్వాలేదు. శుభ్రంగా ఉండాలి. నాకు గోళ్ళు పెంచుకోవటం ఇష్టం కానీ శుభ్రంగా ఉంచుకుంటాను” అంటాడు. ఇలాంటి విషయాలు చెబుతున్నప్పుడు విలియమ్ మీద ఎక్కువ దృష్టి పెడతాడు. మొత్తానికి విలియమ్ ఆకతాయి అని అందరికీ తెలుసు. ఇదిలా ఉండగా ఆ స్కూల్లో చేరిన తొలి నల్లజాతి కుర్రాడు డోనాల్డ్ మీద ఫాదర్ ఫ్లిన్ ఎక్కువ ఆప్యాయత చూపిస్తుంటాడు. చర్చిలో పార్థనల్లో సాయం చేయటానికి అతన్నీ, మరో కురాణ్నీ ఆల్టర్ బాయ్స్‌గా నియమిస్తాడు. తాను కూడా ఫాదర్ అవుతానని డోనాల్డ్ అతనితో అంటాడు.
ఎవరూ పూర్తిగా కఠినంగా ఉండరు. సిస్టర్ అలోషియస్కి ఎంతో అనుభవం ఉంది. ఆమె నిజానికి భర్త చనిపోయాక సన్యాసం తీసుకుని సిస్టర్ అయింది. ఢక్కాముక్కీలు తిని ఈ స్థాయికి వచ్చింది. ఎంతమందిని చూసి ఉంటుంది? ఆకతాయిగా ఉండే పిల్లల మీద కఠినంగా ఉంటుంది. ఉండాలి, తప్పదు. అయితే నిస్సహాయంగా ఉన్న వృద్ధ సిస్టర్ మీద జాలి చూపిస్తుంది. ఆమె గురించి చర్చి పెద్దలకి చెప్పాల్సిన బాధ్యత ఉన్నా చెప్పదు. ఫాదర్ ఫ్లిన్ తర్వాతి తరం వాడు. కాఠిన్యం కన్నా కలుపుగోలుతనం ముఖ్యం అనుకుంటాడు. పిల్లల్ని నవ్విస్తూ ఉంటాడు. రాత్రి భోజన సమయంలో అతని మాటలకు తోటి ఫాదర్లు పగలపడి నవ్వుతూ ఉంటారు. అదే సమయంలో సిస్టర్లు వేరే భోజనాల గదిలో మౌనంగా భోజనం చేస్తారు. అనవసరంగా మాట్లాడటం సిస్టర్ అలోషియస్కి నచ్చదు.
చలికాలం దగ్గరపడటంతో వాతావరణంలో మార్పులు వస్తూ ఉంటాయి. చలిగాలులు వీస్తూ ఉంటాయి. “ఈసారి గాలులు మరీ చిత్రంగా ఉన్నాయి” అంటుంది సిస్టర్ అలోషియస్. ఇది మారుతున్న సమాజానికి సూచన. కొత్తగాలులు ప్రవేశిస్తున్నాయి. ఫౌంటెన్ పెన్లు పోయి బాల్ పెన్లు వచ్చాయి. ఫాదర్ ఫ్లిన్ లాంటి వాళ్ళు సమాజాన్ని ధిక్కరిస్తారు. మారుతున్న కాలంతో మారాలంటారు. మగవాళ్ళు గోళ్ళు పెంచుకుంటే తప్పేమిటి అంటారు. సిస్టర్ అలోషియస్కి ఇవన్నీ నచ్చవు. పైగా చర్చిలో ప్రసంగం విన్న తర్వాత అతనికి ఆత్మనిగ్రహం లేదని ఆమెకి అనిపించింది. అతనేమో ఆమె మరీ చండశాసనురాలిలా ఉంటుందని అనుకుంటాడు. సిస్టర్ జేమ్స్ వీరిద్దరూ వారి వారి పంథాలో పిల్లల ఉన్నతినే కోరుకుంటున్నారు కదా అనుకుంటుంది. ఒకరకంగా ఫాదర్ ఫ్లిన్ వైపే మొగ్గు చూపుతుంది. అతను సిస్టర్ అలోషియస్ని ‘డ్రాగన్’ అని అంటే ఈమె నవ్వి ఊరుకుంటుంది. అయితే తాను మరీ అమాయకంగా ఉండకూడదని నిర్ణయించుకుంటుంది. పైగా సిస్టర్ అలోషియస్ అప్రమత్తంగా ఉండమని చెప్పింది.
ఒకరోజు సిస్టర్ జేమ్స్ పాఠం చెబుతుండగా ఫాదర్ ఫ్లిన్ డోనాల్డ్ (నల్లజాతి అబ్బాయి)ని రమ్మని కబురు పంపిస్తాడు. సిస్టర్ జేమ్స్ డోనాల్డ్ని పంపిస్తుంది. తర్వాత ఫాదర్ జేమ్స్ డోనాల్డ్ లాకర్లో (ప్రతి విద్యార్థికి వస్తువులు, పుస్తకాలు పెట్టుకోవటానికి లాకర్ ఉంటుంది) ఏదో పెట్టటం ఆమె చూస్తుంది. అదేమిటా అని చూస్తే.. డోనాల్డ్ లోపల తొడుక్కునే బనియన్. డోనాల్డ్ విచారంగా ఉండటం గమనించి ఆమె అతన్ని ఏమైందని అడుగుతుంది. అతను ఏమీ లేదంటాడు. దీంతో ఆమెకి అనుమానం బయల్దేరుతుంది. సిస్టర్ అలోషియస్ దగ్గరకి వెళుతుంది. “డోనాల్డ్ గురించి మాట్లాడాలి” అంటుంది. అతను నల్లజాతి వాడు కాబట్టి అతన్ని ఇతర విద్యార్థులు ఏడిపిస్తారని సిస్టర్ అలోషియస్ ముందే ఊహించింది. ఆమె లోకానుభవం అటువంటిది. “ఎవరైనా అతన్ని కొట్టారా? ఈరోజు కాకపోతే రేపైనా అతన్ని కొడతారు. అప్పుడు వెంటనే నాకు చెప్పు” అంటుంది. సిస్టర్ జేమ్స్ “అతన్ని రక్షించటానికి ఫాదర్ ఫ్లిన్ ఉన్నాడు” అంటుంది. ఆ మాట వినగానే సిస్టర్ అలోషియస్కి ‘నా అనుమానం నిజమైంది’ అనే భావన కలుగుతుంది. ఆత్మనిగ్రహం లేక ఫాదర్ ఫ్లిన్ డోనాల్డ్ని లైంగికంగా వేధిస్తున్నాడని అనుకుంటుంది. “ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే నాకు చెప్పమని అడిగాను కానీ అలాంటిదేదీ జరగకూడదనే ఆశించాను. జరగకూడనిదే జరిగిందన్నమాట” అంటుంది. సిస్టర్ జేమ్స్‌కి కంగారు పుడుతుంది. “అయ్యో! అది కాదు నేను చెప్పేది. ఎవరినైనా అనుమానంతో చూస్తే నేను దేవుడికి దూరమౌతున్నట్టు ఉంటుంది” అంటుంది. “తప్పుని పరిశీలించటమంటే దేవుడికి దూరంగా వెళ్ళటమే కానీ అది కూడా ఆయన సేవలో భాగమే. ఏం జరిగిందో చెప్పు” అంటుంది సిస్టర్ అలోషియస్.
సిస్టర్ జేమ్స్ తాను చూసిందంతా చెబుతుంది. డోనాల్డ్‌తో మాట్లాడినపుడు అతని దగ్గర మద్యం వాసన వచ్చిందని కూడా చెబుతుంది. సిస్టర్ అలోషియస్ “డోనాల్డ్ని అందరూ ఒంటరిని చేశారు. దాంతో ఫాదర్ ఫ్లిన్కి అవకాశం దొరికింది” అంటుంది. సిస్టర్ జేమ్స్ “అసలేం జరగలేదేమో” అంటుంది. సిస్టర్ అలోషియస్ “కొన్నేళ్ళ క్రితం వేరే చర్చిలో పని చేసినపుడు ఇలాగే ఒక ఫాదర్ ఉండేవాడు. కానీ అప్పుడు ఫాదర్ స్కల్లీ అనే ఆయన దృఢంగా వ్యవహరించాడు. ఇక్కడా ఆ పరిస్థితి లేదు. అంతా మగాళ్ళ రాజ్యమే. మనమే ఏదో ఒకటి చేయాలి” అంటుంది. ఆమెకి ఇంతకు ముందే ఇలాంటి వ్యవహారం తెలుసు. దాంతో ఆమె కచ్చితంగా ఫాదర్ ఫ్లిన్ తప్పు చేశాడని నిర్ధారణకి వస్తుంది. సిస్టర్ జేమ్స్‌కి ఇలాంటి వ్యవహారాలు తెలియదు. ఆమె మనసు వికలమైపోతుంది.
సిస్టర్ అలోషియస్ ఫాదర్ ఫ్లిన్ని తన ఆఫీసు గదికి రమ్మంటుంది. క్రిస్మస్ కార్యక్రమం గురించి మాట్లాడాలంటుంది. సిస్టర్ జేమ్స్‌ని కూడా రమ్మంటుంది. వారు వచ్చాక సిస్టర్ అలోషియస్ ఆఫీసు గది తలుపు పూర్తిగా వేయకుండా కాస్త తెరచి ఉంచుతుంది. ఫాదర్ ఫ్లిన్ నేరుగా వెళ్ళి ఆమె కూర్చునే కుర్చీలో కూర్చుంటాడు. ‘నా స్థాయి నీ కంటే ఎక్కువ’ అని గూఢంగా చెప్పటమన్నమాట. సిస్టర్ జేమ్స్ టీ కలుపుతుంది. అతను చక్కెర ఉందా అని అడుగుతాడు. చక్కెర తీసుకోవటం జిహ్వచాపల్యం అని సిస్టర్ అలోషియస్ అభిప్రాయం. అతను చక్కెర ఎక్కువ వేసుకుంటాడు. అతనికి ఇంద్రియనిగ్రహం తక్కువ అనే ఆమె అభిప్రాయం ఇంకా బలపడుతుంది. అతను గోళ్ళు పొడుగ్గా పెంచుకోవటం కూడా ఆమె గమనిస్తుంది. సాధారణంగా ఆడవాళ్ళు గోళ్ళు పెంచుకుంటారు. అతను బాల్ పెన్ను వాడటం కూడా ఆమె గమనిస్తుంది. బాల్ పెన్ను సౌకర్యంగా ఉంటుంది కానీ దానితో అందంగా రాయలేరని ఆమె నమ్మకం. ఆమె డోనాల్డ్ విషయం ఎత్తుతుంది. డోనాల్డ్ని క్లాసు నుంచి పిలిపించిన రోజు అతను తిరిగి వచ్చాక విచారంగా కనిపించాడని, ఆ రోజు ఏం జరిగిందని అడుగుతుంది. “అది గోప్యమైన విషయం” అంటాడు ఫాదర్ ఫ్లిన్. అతని ముఖంలో కంగారు ఏమీ కనిపించదు. “నేనేం అడుగుతున్నానో మీకు తెలుసు. మీరు మీ భావాలు ముఖంలో కనపడకుండా దాస్తున్నారు. ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి” అంటుందామె. “నాకు ఈ విషయంపై మాట్లాడటం ఇష్టం లేదు. మీరు ఏమన్నా అడగాలంటే పెద్ద ఫాదర్‌ని అడగండి” అని వెళ్ళబోతాడు. ఫాదర్లందరూ కలిసిపోయారని సిస్టర్ అలోషియస్ భావన. అందుకే ఆమె వదలకుండా “ఆ పిల్లాడి దగ్గర మద్యం వాసన వచ్చింది” అంటుంది. అతను “ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి” అంటాడు. “కుదరదు” అంటుందామె. “పనివాడు డోనాల్డ్ని ఆల్టర్ వైన్ (పవిత్రమైన బ్రెడ్ తిన్నాక తాగే మదిర) తాగుతుండగా పట్టుకున్నాడు. అందుకే నేను డోనాల్డ్ని పిలిపించాను. అతను ఏడిచాడు. తనని ఆల్టర్ బాయ్‌గా తీసేయవద్దని ప్రాధేయపడ్డాడు. నేను ఒప్పుకున్నాను” అంటాడతను. సిస్టర్ జేమ్స్ “హమ్మయ్య! అంతే కదా. ఇప్పుడంతా తేటతెల్లమయింది” అంటుంది ఆనందంగా. అతను సిస్టర్ అలోషియస్తో “మీకు అర్థమయింది కదా?” అంటాడు. ఆమె “అవును” అంటుంది. కానీ అక్కడితో ఆమె ఆ విషయం వదలదు.
తాను అప్రమత్తంగా ఉండాలని సిస్టర్ జేమ్స్ తన అనుమానాన్ని సిస్టర్ అలోషియస్కి చెప్పింది. కానీ అనవసరంగా ఆమెకి చెప్పానని తర్వాత బాధపడుతుంది. అయితే చెప్పకుండా ఉంటే ఇంకేం అనర్థాలు జరుగుతాయో అని ఆమె భయం. ముందు నుయ్యి, వెనక గొయ్యిలా ఆమె పరిస్థితి ఉంటుంది. అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలని చెప్పేసింది. సిస్టర్ అలోషియస్ పాత అనుభవాలని దృష్టిలో పెట్టుకుని ఫాదర్ ఫ్లిన్ అపరాధి అని నిర్ధారణ చేసేసింది. అది సమంజసమేనా? ఇదీ ఒక రకమైన వివక్షే. అతను సంప్రదాయాలను పాటించడు కాబట్టి నీతిమాలినవాడు అనుకోవటం తప్పు. ఎలాంటి వారినైనా ఆధారం లేకుండా దోషుల్ని చేయకూడదు. సిస్టర్ జేమ్స్ అతను నిర్దోషి అని నమ్ముతుంది. ఒకవేళ సిస్టర్ అలోషియస్ పట్టుబట్టి అతన్ని దోషిగా నిలబెడితే సిస్టర్ జేమ్స్ అంతరాత్మ ఆమెని క్షమించదు. డోనాల్డ్ ఆల్టర్ వైన్ తాగాడు కాబట్టి అతన్ని ఆల్టర్ బాయ్‌గా కొనసాగించకూడదు. అది నియమమని సిస్టర్ అలోషియస్కి తెలుసు. ఆమెకి నియమాలు పాటించటం చాలా ముఖ్యం. ఫాదర్ ఫ్లిన్ డోనాల్డ్ మీద జాలితో తాను ఆ విషయం బయటపెట్టలేదని అంటాడు. సిస్టర్ అలోషియస్ పట్టుబట్టడంతో అతను ఆ విషయం బయటపెట్టాడు. డోనాల్డ్ తాగాడా? లేక ఫాదర్ ఫ్లిన్ తాగించాడా? ఎలా తెలుస్తుంది? దీనికి పరిష్కారం ఏమిటి?
ఈ చిత్రం మొదట నాటకంగా ప్రదర్శింపబడింది. నాటక రచయిత జాన్ పాట్రిక్ షాన్లీ స్క్రీన్‌ప్లే రాసి తానే ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మహానటిగా పేరు పొందిన మెరిల్ స్ట్రీప్ సిస్టర్ అలోషియస్గా నటించింది. అత్యద్భుతంగా నటించింది. ఫాదర్ ఫ్లిన్గా ఫిలిప్ సీమోర్ హాఫ్మన్, సిస్టర్ జేమ్స్‌గా ఏమీ యాడమ్స్ నటించారు. తర్వాత వచ్చే డోనాల్డ్ తల్లి పాత్రలో వయోలా డేవిస్ నటించింది. అందరికీ ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి.
ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.
ఫాదర్ ఫ్లిన్ గదిలోంచి వెళ్ళిపోయాక సిస్టర్ అలోషియస్ “అతని అంతు చూస్తాను” అంటుంది. సిస్టర్ జేమ్స్ “ఆయన నిజం చెబుతున్నాడని నేను నమ్ముతున్నాను” అంటుంది. “ఏం కాదు. త్వరగా పరిష్కారమైపోతే బాదరబందీ ఉండదని నీ ఆశ” అంటుంది సిస్టర్ అలోషియస్. “మీకు ఆయనంటే ఇష్టం లేదు. ఆయన టీలో చక్కెర ఎక్కువ వేసుకోవటం నచ్చలేదు. ఆయన బాల్ పెన్ను వాడటం నచ్చలేదు. అందుకని ఆయన ఘోరం చేశారని మిమ్మల్ని మీరు నమ్మించుకుంటున్నారు” అంటుంది సిస్టర్ జేమ్స్ కన్నీళ్ళతో. తన కారణంగా అతను దోషిగా నిలబడటం ఆమె భరించలేకపోతుంది. అయినా సిస్టర్ అలోషియస్ వినదు. డోనాల్డ్ తల్లికి ఫోన్ చేసి తనని కలవమని చెబుతుంది. ఈ లోపల డోనాల్డ్ని ఆల్టర్ బాయ్‌గా తొలగిస్తారు. ఆ ఆదివారం సిస్టర్ జేమ్స్ ఒంటరిగా బయట కూర్చుని ఉంటే ఫాదర్ ఫ్లిన్ ఆమెతో మాట్లాడతాడు. “నాలో కారుణ్యం ఉంది. మీలో కారుణ్యం ఉంది. సత్ప్రవర్తన పేరు చెప్పి ఆ కారుణ్యం మీ బలహీనత అని చెప్పేవాళ్ళు ఉంటారు. నమ్మకండి” అంటాడు. “నాకంతా అయోమయంగా ఉంది” అంటుందామె. “మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు దారీ తెన్నూ తెలియని పరిస్థితి వస్తుంది” అంటాడతను. సంశయం గురించి అతను చేసిన ప్రసంగంలో ఇదే మాట అన్నాడు. ఆమెకది గుర్తొచ్చి “అది కూడా మనల్ని కలుపుతుంది” అంటుంది. ఆ మాటతో సాంత్వన పొందుతుంది. ఇందులో అర్థం ఏమిటంటే దేవుడు మన నమ్మకాన్ని పరీక్షిస్తాడు. అప్పుడు ధైర్యంగా నిలబడాలి కానీ అధైర్యపడకూడదు. ఇంతకీ డోనాల్డ్ బనియన్ ఫాదర్ ఫ్లిన్ ఎందుకు అతని లాకర్లో పెట్టాడు? అదే మాట సిస్టర్ జేమ్స్ అడుగుతుంది. ఆల్టర్ బాయ్‌గా పని చేసే వాళ్ళు దుస్తులు మార్చుకుంటారు. అలా మార్చుకునేటపుడు డోనాల్డ్ బనియన్ మరచిపోయాడని, అతను మరింత అవమానపడకూడదని తానే లాకర్లో పెట్టానని ఫాదర్ ఫ్లిన్ అంటాడు. సిస్టర్ అలోషియస్ పిలిచి ప్రశ్నించాక అతను డోనాల్డ్‌కి దూరంగా ఉంటాడు కానీ ఒకరోజు విలియమ్ కావాలని డోనాల్డ్ పుస్తకాలు కింద పడేస్తే ఫాదర్ ఫ్లిన్ అతన్ని సముదాయిస్తాడు.
డోనాల్డ్ తల్లి మిసెజ్ మిల్లర్ సిస్టర్ అలోషియస్ని కలవటానికి వస్తుంది. డోనాల్డ్ ఈ స్కూల్లో ఎనిమిదో తరగతి పూర్తి చేస్తే మంచి హైస్కూల్ (తొమ్మిది నుంచి పెన్నెండు తరగతులు ఉండే స్కూల్) లో ప్రవేశం వస్తుందని మిసెజ్ మిల్లర్ ఆశ. అందుకే పబ్లిక్ స్కూల్ మాన్పించి ఇక్కడ చేర్పించింది. ఆమె “ఆల్టర్ బాయ్‌గా తొలగించటంతో డోనాల్డ్ బాధపడ్డాడు. వైన్ తాగాడు కాబట్టి అది సబబే. మా ఆయన వాడిని కొట్టాడు. ఆయనకి వాడు ఈ స్కూల్లో చేరటమే ఇష్టం లేదు. ఇతర విద్యార్థులు ఏ ఆకతాయి పనులు చేస్తారో అని భయం. కానీ ఫాదర్ ఫ్లిన్ జాగ్రత్తగా చూసుకుంటున్నారు” అంటుంది. ఆమె పనికి తిరిగి వెళ్ళాలి కాబట్టి ఆమెతో పాటు కాస్త దూరం నడుస్తానని సిస్టర్ అలోషియస్ బయల్దేరుతుంది. “ఒక సమస్య వచ్చింది” అంటుంది. మిసెజ్ మిల్లర్ “ఏదో ఉండకపోతే మీరు పిలవరు. జూన్ దాకా వదిలేయండి. ఎలాగైనా వాడిని ఈ తరగతి పూర్తి చేయనివ్వండి. తర్వాత మంచి హైస్కూల్లో చేరితే కాలేజీ అవకాశాలు మెరుగవుతాయి” అంటుంది. “అందులో ఏం ఇబ్బంది లేదు. ఫాదర్ ఫ్లిన్ డోనాల్డ్‌తో అసభ్యంగా ప్రవర్తించాడని నా అనుమానం” అంటుంది సిస్టర్ అలోషియస్. “అనుమానమేనా? ఆధారం లేదా? అయితే ఆయనేం చేయలేదేమో. జూన్ దాకా వదిలేయండి” అంటుంది మిసెజ్ మిల్లర్. సిస్టర్ అలోషియస్కి వింతగా ఉంటుంది. “ఆయన డోనాల్డ్‌కి వైన్ ఇచ్చాడని నా అనుమానం. నేను చెబుతున్నది మీకు అర్థం కావట్లేదా?” అంటుంది సిస్టర్ అలోషియస్. “నాకు అర్థమయింది. ఆయనే వైన్ ఇస్తే డోనాల్డ్ని ఆల్టర్ బాయ్‌గా ఎందుకు తొలగించారు? ఆయన్ని ఎందుకు శిక్షించలేదు? అయనకి పదవి ఉందనా?” అంటుంది మిసెజ్ మిల్లర్. అసలు విషయం వదిలేసి ఆమె ఏదో మాట్లాడుతోందని “అతను మీ అబ్బాయిని లోబరుచుకున్నాడు” అంటుంది సిస్టర్ అలోషియస్. “అలాగే కానివ్వండి. జూన్ దాకా వదిలేయండి” అంటుంది మిసెజ్ మిల్లర్. సిస్టర్ అలోషియస్ నిర్ఘాంతపోతుంది.
తర్వాత మిసెజ్ మిల్లర్ “మీకు నియమాలు తెలుసు కానీ జీవితం గురించి తెలియదు. ఆయన తప్పుడు పని చేశాడంటున్నారు. మంచి కూడా చేస్తున్నాడు కదా? కొందరు అబ్బాయిలకి అదే ఇష్టమేమో” అంటుంది. సిస్టర్ అలోషియస్ అయోమయంగా చూస్తుంది. “మావాడి స్వభావమే అంత. దేవుడు వాడినలా సృష్టిస్తే వాడేం చేస్తాడు? ఆ కారణంగానే వాళ్ళ నాన్న వాడిని కొడతాడు. పబ్లిక్ స్కూల్లో వాడిని చంపేస్తారని ఇక్కడ చేర్పించాను. వాళ్ళ నాన్నకి వాడంటే ఇష్టం లేదు. ఇక్కడ పిల్లలకి వాడంటే ఇష్టం లేదు. ఒక్క మనిషి వాడిని ఆదరించాడు. దాని వెనకాల ఏదో కారణం ఉండి ఉండవచ్చు. వాడి బాగోగులు చూసుకోవటానికి ఒకరు ఉండాలి. వాడికి దారి చూపించాలి. ఈయన అదే పని చేస్తున్నాడు. జూన్ దాకా వదిలేయండి” అంటుంది మిసెజ్ మిల్లర్. సిస్టర్ అలోషియస్ “ఇది నాకు సమ్మతం కాదు. డోనాల్డ్ని స్కూలు నుంచి తీసేస్తాను” అంటుంది. “వాడు కావాలని ఏం చేయలేదుగా. మీ మాట నెగ్గించుకోవటానికి నా కొడుకుని శిక్షిస్తారా? కావాలంటే ఆ ఫాదర్‌ని తీసేయండి” అంటుంది మిసెజ్ మిల్లర్. “అదే నా ప్రయత్నం” అంటుంది సిస్టర్ అలోషియస్. “నా నుంచి ఏం ఆశిస్తున్నారు?” అంటుంది మిసెజ్ మిల్లర్. అప్పుడు సిస్టర్ అలోషియస్కి అర్థమౌతుంది మిసెజ్ మిల్లర్ చేయగలిగిందేమీ లేదని. కొడుకు లైంగిక వేధింపులకి గురవుతున్నాడని తెలిస్తే ఆమె ఫిర్యాదు చేస్తుందని అనుకుంది కానీ తన కొడుకు స్వలింగప్రియుడని ఆమే చెప్పింది. అప్పట్లో ఈ విషయాల మీద అవగాహన తక్కువ. ఎయిడ్స్ లాంటి భయంకర వ్యాధులు లేవు. కాబట్టి అది పెద్ద విషయం కాదని ఆమె అనుకుంది. పైగా నల్లజాతి వారికి అవకాశాలు తక్కువగా ఉండేవి. జీవితమే ఒక పోరాటంగా ఉంటే ఇలాంటి విషయాలు ఎందుకు పట్టించుకోవాలని ఆమె వాదన. ఇది ఇప్పటి దృష్టితో చూస్తే తప్పే. అప్పట్లో సామాజిక పరిస్థితులు వేరు.
సిస్టర్ అలోషియస్ ఆధారాలు లేక మిసెజ్ మిల్లర్‌ని పిలిపించింది. ఆమెకి విషయం తెలిస్తే కొడుకుని బుజ్జగించి అడుగుతుంది, అప్పుడు విషయం తెలుస్తుంది అనుకుంది. కానీ డోనాల్డ్ స్వలింగప్రియుడని అనటమే కాక ఫాదర్ ఫ్లిన్ తప్పు చేసినా తాను పట్టించుకోనని ఆమె అనటంతో సిస్టర్ అలోషియస్కి దారి లేకుండా పోయింది. ఒక్కోసారి మనం వేసే పథకాలు బెడిసికొడతాయి. ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే పోరాటం కొనసాగించవచ్చు. సిస్టర్ అలోషియస్ అదే చేయాలని నిశ్చయించుకుంటుంది. కానీ ఆమె ఎంచుకున్న పద్ధతి ప్రశ్నార్థకమవుతుంది.
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
మిసెజ్ మిల్లర్ సిస్టర్ అలోషియస్ని కలవటం ఫాదర్ ఫ్లిన్ చూస్తాడు. సిస్టర్ అలోషియస్ తిరిగి వచ్చాక అతను ఆమె ఆఫీసు గదికి వస్తాడు. “నా మీద మీకు ముందు నుంచే అపనమ్మకం. ఎందుకు?” అంటాడు. “నాకు మనుషులు ఎలాంటివాళ్ళో తెలుసు” అంటుందామె. “డోనాల్డ్ని వాళ్ళ నాన్న కొడతాడు కాబట్టి వాడు క్లాసులో విచారంగా ఉన్నాడేమో. నేనే తప్పు చేశానని ఎందుకు అనుకుంటున్నారు?” అంటాడతను. “మీరు విలియమ్ చేయి పట్టుకోవటం, అతను చేతిని వెనక్కి లాక్కోవటం నేను చూశాను” అంటుందామె. “అంతేనా? దాంట్లో ఏముంది? ఇలాంటి చిన్న విషయాలని పెద్దవిగా చేసినందుకు మిమ్మల్ని తొలగించమని బిషప్‌కి చెబుతాను” అంటాడతను. “నేను మీ పాత చర్చికి ఫోన్ చేశాను. అక్కడ ఒక సిస్టర్‌తో మాట్లాడాను. మీరు ఐదేళ్ళలో మూడు చర్చిలు మారారు” అంటుందామె. అతనికి ఆవేశం వస్తుంది. “నేను ఏ అబ్బాయినీ వేధించలేదు” అంటాడు గట్టిగా. ఆమె ఇంకా గట్టిగా “మీరు వేధించారని నా గట్టి నమ్మకం. అవసరమైతే మీరు ఇంతకు ముందు పని చేసిన చర్చిలన్నిట్లో వాకబు చేస్తాను. ఎక్కడో ఒక తల్లో, తండ్రో కూడా ముందుకు రాకపోరు” అంటుంది. “మీరు ప్రమాణస్వీకారం చేసినపుడు ఈ చర్చికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేశారు. మీకు చర్చి నియమాలు ఉల్లంఘించే అధికారం లేదు” అంటాడతను. “నాకు నరకం వచ్చినా పర్వాలేదు. నేను చేయవలసింది చేసి తీరతాను” అంటుందామె. అతను కాస్త తగ్గుతాడు. “మీరే పాపం చేయలేదా?” అంటాడు. “చేశాను. దానికి కన్ఫెషన్ కూడా చేశాను” అంటుందామె ఉద్వేగంగా. “నేను చేసిన పాపానికి కూడా నేను కన్ఫెషన్ చేసి స్వస్థత పొందాను. మనిద్దరమూ ఒకే తానులో గుడ్డలం” అంటాడతను. “కాదు. కరిచే కుక్క ఎప్పటికీ మారదు” అంటుందామె. అంటే తాను చేసిన పాపం పొరపాటున చేసినదని, అతని పాపం అతని స్వభావంలో భాగమని ఆమె ఉద్దేశం. మళ్ళీ ఆమె “మీరు ఈ గది వదిలి వెళ్ళకపోతే నేనే వెళతాను. వెళితే ఇక ఆగను” అంటుంది. అతను ఆమెని ఆగమంటాడు. అతనిలో అంతర్మథనం జరుగుతూ ఉంటుంది. “మీకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. నేను చెప్పినా మీకు అర్థం కాదు” అంటాడు. “మీరు వేరే చర్చికి వెళ్ళిపోండి” అంటుందామె. కొన్నాళ్ళకి అతను చర్చి వదిలి వెళ్ళిపోతాడు.
సిస్టర్ జేమ్స్ తన అన్నగారికి ఆరోగ్యం బాగాలేదని అతని దగ్గరకి వెళుతుంది. ఫాదర్ ఫ్లిన్ వెళ్ళినపుడు ఆమె అన్నగారి దగ్గర ఉంటుంది. ఆమె తిరిగి వచ్చి సిస్టర్ అలోషియస్తో మాట్లాడుతుంది. “ఫాదర్ ఫ్లిన్ ఏ తప్పూ చేయలేదని నమ్ముతున్నాను” అంటుంది. సిస్టర్ అలోషియస్ “బిషప్ ఫాదర్ ఫ్లిన్కి వేరే చర్చిలో పాస్టర్ పదవి ఇచ్చారు” అంటుంది. “మీరు వారికేం చెప్పలేదా?” అంటుంది సిస్టర్ జేమ్స్. “ఇక్కడి పెద్ద ఫాదర్‌కి చెప్పాను. కానీ ఆయన నమ్మలేదు” అంటుంది సిస్టర్ అలోషియస్. “మరి ఫాదర్ ఫ్లిన్ ఎందుకు వెళ్ళిపోయారు?” అంటుంది సిస్టర్ జేమ్స్. “ఆయన పాత చర్చిలో ఒక సిస్టర్ తో మాట్లాడానని చెప్పాను. నాకు అతను చేసిన అకృత్యాలు తెలిశాయని చెప్పాను. కానీ నేను ఎవరితోనూ మాట్లాడలేదు” అంటుంది సిస్టర్ అలోషియస్. “అబద్ధం చెప్పారా?” అని విస్తుపోతుంది సిస్టర్ జేమ్స్. “అవును. అతను గతంలో తప్పులు చేశాడు కాబట్టే భయపడ్డాడు. అతని రాజీనామాయే దానికి రుజువు” అంటుంది సిస్టర్ అలోషియస్. కానీ తర్వాత ఆమెలో భావోద్వేగం రేగుతుంది. “సిస్టర్ జేమ్స్. నాకెన్నో సంశయాలున్నాయి” అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. సిస్టర్ జేమ్స్ ఆమె దగ్గరకి వచ్చి ఆమెని సముదాయిస్తుంది. ఇక్కడితో చిత్రం ముగుస్తుంది.
ఫాదర్ ఫ్లిన్ డోనాల్డ్ని వేధించాడా లేదా అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. కానీ సిస్టర్ అలోషియస్ అబద్ధం చెప్పవలసి వచ్చింది. చివరికి తాను చేసింది న్యాయమేనా అని కుమిలిపోయింది. ఏ జరిగిందనేది ఒక్కొక్కరూ ఒక్కోలా ఊహించవచ్చు. నాకు తోచినది ఇక్కడ చెబుతాను. ఫాదర్ ఫ్లిన్ కూడా స్వలింగప్రియుడే. అతను గతంలో పురుషులతో సంబంధాలు పెట్టుకున్నాడు. అయితే కన్ఫెషన్ చేశాడు. మళ్ళీ అలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. డోనాల్డ్ని కూడా అతను వేధించలేదు. నిజమైన కరుణ చూపించాడు. స్వలింగప్రియత్వం వేరు, చిన్నపిల్లలను వేధించటం వేరు. మొదటిది తప్పు కాదు. రెండవది ఘోరమైన తప్పు. సిస్టర్ అలోషియస్ తానొక సిస్టర్‌కి ఫోన్ చేస్తే ఆమె కొన్ని విషయాలు చెప్పిందని అనేసరికి అతను భయపడ్డాడు. ఆ విషయాలు బయటపడితే తన ఉద్యోగానికి ప్రమాదం అని అతని భయం. అప్పట్లో స్వలింగప్రియత్వం నేరమని అనుకునేవారు. అందుకే అతను రాజీనామా చేశాడు. నిజానికి సిస్టర్ అలోషియస్ అతనికి వేరే చర్చిలో ఉద్యోగం దొరకకుండా చేద్దామనుకుంది. కానీ ఎవరూ ఆమె మాట నమ్మలేదు. నమ్మలేదంటే అతను స్వలింగప్రియుడని తెలియదని కాదు. తెలిసే ఉంటుంది. అయితే అతను ఇప్పుడు పూర్తి బ్రహ్మచర్యం పాటిస్తున్నాడని వారి నమ్మకం. ఫాదర్లు అందరూ బ్రహ్మచారులే. వారు నిగ్రహంగా ఉండటం లేదా? అలాగే అతనూ. సిస్టర్ అలోషియస్కి కూడా ఈ సంశయమే వచ్చింది. అతను నిగ్రహం కలవాడే అయి ఉంటాడని తర్వాత అనిపించింది. గతంలో చేసిన తప్పులే ప్రాతిపదిక అయితే ఆమె కూడా గతంలో పాపం చేసింది. మరి అతన్ని దోషిగా ఎలా చూడగలదు? అందుకే ఆమెకి దుఃఖం మిగిలింది. పైగా అబద్ధం చెప్పిన దోషం కూడా వచ్చింది.