[2024 క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా వి. నాగజ్యోతి గారు రచించిన ‘మరో ఉగాది’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
పరుగుల జీవనంలో
వచ్చే ఎన్నో పండుగలు.
ఇల్లాలి వంటింటి మెనూలో
భాగమౌతూ తరలి పోతాయి
మొక్కుబడి పూజలో మరొక నైవేద్యంలో
ఆరురుచులను కలిపే క్రమంలో
వేపపువ్వు ఏటికొకసారి
గ్రామ దేవతలా వెలిగిపోతుంది
తెలుగు సంవత్సరాల పేర్లు తెలియకున్నా
ఉగాది పేరుతో ఆ ఒక్కరోజు
కొత్త సంవత్సరం పేరు మాత్రం
రామనామం కన్నా మిన్నగా
రాష్ట్రం నలుమూలలా వినిపిస్తుంది.
ఆ ఒక్కరోజు రాశిఫలాలు
లూజు కనెక్షన్ వున్న బల్బులా
కొందరికి ఉన్నతమైన వెలుగుని
మరికొందరికి చీకటి దృశ్యాన్ని
కొందరికి నిరాశ నిస్పృహలతో
తర్కించుకునే అవకాశాన్ని
తాత్కాలిక జాగ్రత్తలను కలగచేస్తుంది
ఏ ఏడు పేరు మారినా మా జీవితాలు
మారవంటూ రైతన్న
తన కన్నితల్లి కన్నా మిన్ననైన తల్లికి
చమటతో స్నానమాడించి
ఆనందంగా ఆమెను చూసి
మురిసిపోతాడు
రక్త సంబంధం వెలవెలపోయేలా
కాడెడ్లు తోడుగా నిలిచి
మూగజీవుల ప్రేమ ఎంత గొప్పదో
తెలియచేస్తాయి.
శ్రీమతి వరికేటి నాగజ్యోతి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు. పదవ తరగతి వరకే చదువుకున్న నాగజ్యోతి గారు దక్షిణ భారత హిందీ పరీక్షలలో భాషాప్రవీణ, హిందీ టైపింగ్ పరీక్షలు లోయర్, హైయ్యర్ పాసయ్యారు. వివాహానంతరం ఢిల్లీకి వచ్చి గృహస్థురాలి బాధ్యత స్వీకరించారు. సాహిత్యాభిలాషి. వీరు రాసిన కథలు, కవితలు, పద్యాలు పలు అంతర్జాల పత్రికలలో ప్రచురించబడ్డాయి.
పుస్తక సమీక్షలు కూడా చేస్తూ వుంటారు. ఇన్నేళ్ళ తరువాత కోవిడ్ కాలంలో శ్రీ పూసపాటి గురువుగారు, శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి ద్వారా పద్య రచన, ప్రాథమిక వ్యాకరణం నేర్చుకున్నారు. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి సహకారంతో – ఆప్త మిత్రులు శ్రీ ధరణిగారు, సన్నిహితులు, తమ శ్రీవారి ప్రోత్సాహం వలన ‘చిట్టి తల్లి’ పద్య శతకం రాసారు.
గత పదిహేను సంవత్సరాలుగా ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ నివాసి.