Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరో తెలుగుసూర్యుడు పీటర్ పెర్సివాల్-2

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘మరో తెలుగుసూర్యుడు పీటర్ పెర్సివాల్’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది రెండవ భాగము.]

దినవర్తమాని పత్రిక సంపాదకుడు

సమయంలో భారత దేశంలో పౌరసేవలు, సైన్యసేవలకు సంబంధించిన పెద్దమనుషుల కమిటీ ఒకటి ఏర్పడింది. Stokes, Sim, Chamier, and Colonels Brown, Pears, Bell వీళ్లు ఈ కమిటీలో ఉన్నారు. వీళ్లు స్థానిక మాతృభాషల్లో సామాజిక, రాజకీయ, సాహిత్య పత్రికలను నడపాలని ప్రతిపాదించారు. తమిళ పత్రికల సంపాదకత్వం కోసం ఈ కమిటీవారు తన సహకారాన్ని కోరారని తన తమిళ సామెతల గ్రంథం ముందుమాటల్లో పెర్సివాల్ పేర్కొన్నాడు. అది తనకు ఎంతో ఇష్టమైన కార్యం కూడా! ఆ కాలంలో యురోపియన్లు నడిపిన పత్రికలకు ఈ చారిత్రక నేపథ్యం ఉంది.

దినవర్తమాని పత్రికా సంపాదకత్వం ఆయన ఉన్నతికి ఒక నిదర్శనంగా నిలిచింది. కేవల ప్రభుత్వ బాకా పత్రికలా కాకుండా, తెలుగు, తమిల భాషా సంస్కృతుల వేదికగా ఆయన ఆ పత్రికల్ని తీర్చిదిద్దాడు. నావలర్ ఈ పత్రికలో మారుపేర్లతో క్రైస్తవమార్గాన్ని విమర్శిస్తూ వ్రాసిన వ్యాసాల్ని కూడా అందులో ప్రచురించేవాడట. ఆరోజుల్లో దినవర్తమాని తెలుగు పత్రికకు 700 కాపీలు సర్క్యులేషన్ ఉండేదిట. వార్తలు, విఙ్ఞానం, కథలు, వివిధ సామాజిక అంశాల మీద వ్యాసాలతో వారపత్రికగా నడిచేదని పరిశోధకులు వి. లక్ష్మారెడ్డి గారు (వికిపీడియా) పేర్కొన్నారు. లిటిల్ బోర్న్, మైలాపూర్ చిరునామాలో ఆ ప్రెస్సు ఉన్న ఇంట్లోనే పెర్సివాల్ కాపురం ఉండేవాడు.

మద్రాస్ విశ్వావిద్యాలయ తొలి రిజిష్ట్రార్

The Church in Madras’ (p.399) గ్రంథంలో పెర్సివాల్ 1856లోనే అన్ని మతసంస్థలతోనూ బంధాలు తెంచుకుని సంస్కృత ఆచార్యుడుగా, మద్రాస్ విశ్వవిద్యాలయ రిజిష్ట్రారుగా పనిచేసినట్టు ఉంది.

1839 లో ఏర్పడిన మద్రాస్ విశ్వవిద్యాలయం జార్జి నోర్టాన్ అధ్యక్షుడిగా ఏర్పడిన బోర్డు పాలనలో పనిచేయటం ప్రారంభించింది. అయినా, 14 యేళ్ళ తరువాత గానీ దానికొక రూపం రాలేదు. 1854లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా చట్టం చేయటంతో ఈ విశ్వవిద్యాలయం పరిపూర్ణమైనట్టు మద్రాస్ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో ఉంది. దాని తొలి రిజిష్ట్రార్ మన ప్రొఫెసర్ పీటర్ పెర్సివాల్ గారే! భారతదేశంలో ప్రొఫెసర్ అనే బిరుదు నామం తొలిగా స్వీకరించి ఆయన రిజిష్ట్రార్ బాధ్యతలను చేపట్టాడని చెప్తారు. రిజిష్ట్రారుగా పీటర్ పెర్సివాల్ ఈ మద్రాస్ విశ్వవిద్యాలయాన్నిలండన్ విశ్వవిద్యాలయం పద్ధతిలో నడిపించాడనీ, ఆయన వేసిన పునాదులే ఈ విశ్వవిద్యాలయ ప్రగతికి ఎంతగానో తోడ్పడ్డాయనీ భావించవచ్చు.

తమిళ సామెతల సేకరణ:

పెర్సివాల్ జాఫ్నాలో ఉన్న కాలంలోనే, 1942లో తమిళ సామెతలకు ఆయన చేసిన ఇంగ్లీషు అనువాదం వెలువడింది.

ప్రజావాక్కే బ్రహ్మవాక్కు (Vox Populi, vox Dei) అనే నానుడి ద్రావిడ భాషల సామెతలకు వర్తిస్తుంది. ఒక సామెతని ఉదహరించటం అంటే, దేవుడి శాసనంగా ప్రజలు పాటిస్తారు. ఎవరో సామెతని రూపొందిస్తాడు. దాన్ని ప్రజలు వాడకంలో పెడతారు. వాటికొక ప్రామాణికత ఏర్పడుతుంది. అదే దైవశాసనంగా మారుతుందిఅని తమిళ సామెతల పుస్తకం ముందుమాటలో వ్రాశాడు పెర్సివాల్.

1830లో వెస్లేయన్ మిషనరీని స్థాపించటం కోసం ఆయన్ని కలకత్తాకు బదిలీ చేసిన సమయంలో Rev. Duff అనే బ్రిటిష్ మత ప్రచారకుడు బెంగాలీ సామెతల్ని సేకరించి వాటి ఇంగ్లీషు అనువాదాన్ని ప్రచురించటాన్ని సన్నిహితంగా చూశాడు. రెండేళ్ల తరువాత జాఫ్నాకు తిరిగి వెళ్ళాక తానుకూడా తమిళ తెలుగు సామెతల సేకరణ ఆరంభించాడు 1840లో తమిళ సామెతల్ని ఆంగ్లానువాదంతో  ప్రచురించాడు.

తెలుగు సామెతల గ్రంథత్యాగం

దినవర్తమాని పత్రిక సంపాదకుడిగా ఉన్న సమయంలో తెలుగు సామెతలు సేకరించి పంపవలసిందిగా ఆయన తెలుగు పాఠకులకు పిలుపునివ్చాడు. ఆ పిలుపుకు తెలుగు ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో వాటిని సేకరించి పంపేవారు. వాటిని ఆయన పదిలపరిచాడు. Captain M.W. Carr 1868లో ఆంధ్రలోకోక్తిచంద్రికఅనే సామెతల సంకలనాన్ని తెచ్చాడు. మద్రాసు ప్రభుత్వ అనువాదకుడు రావిపాటి గురవయ్య ఆయనకు సహకరించాడు. ఈ గ్రంథం కోసం తాను సేకరించిన సామెత లన్నింటినీ నాకు అందించినందుకు రెవరెండ్ పి. పెర్సివాల్ గారికి ధన్యవాదాలుఅంటూ, కెప్టెన్ కార్ర్ పెర్సివాల్‌కి కృతఙ్ఞతలు చెప్పటాన్ని బట్టి, ఈ గ్రంథం పెర్సివాల్ చేసిన త్యాగఫలం అనే చెప్పాలి.

అప్పటికి పెర్సివాల్ ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ, ఆయన చేతినిండా తమిళ గ్రంథాలకు సంబంధించిన పనులు పెట్టుకోవటంతో తన సేకరణలోని తెలుగు సామెత లన్నింటినీ కెప్టేన్ కార్ర్ గారికి ఉచితంగా ఇచ్చేశాడు. భాషకు మేలు జరగాలన్నదే ఆయన కోరిక. స్వార్థంతో వాటిని తన దగ్గరే ఉంచుకుని అచ్చువేయలేకపోతే తెలుగు భాషకు అన్యాయం జరుగుతుందనేది ఆయన భయం.

తెలుగు ఇంగ్లీషు నిఘంటు నిర్మాణం

పెర్సివాల్ అపారమైన కృషి చేసింది నిఘంటు నిర్మాణాల విషయంలోనే! ఆయన చరిత్ర అంతా తమిళులమధ్య తమిళ పండితుల మధ్య మాత్రమే గడిచినట్తు కనిపిస్తుంది. కానీ, ఆయన తెలుగు కోసం కూడా అమితంగా పాటుపడ్డాడు. తెలుగు ఇంగ్లీషు నిఘంటు నిర్మాణానికి ముందు సి పి బ్రౌన్, కాంబెల్‌ మారిస్‌, మామిడి వెంకయ్య మొదలైన వాళ్లు తెలుగులో నిఘంటువులు కూర్చారు.

నిఘంటు నిర్మాణానికి పూనుకోవటం అంటే భాషమీద ఎంతో పట్టు ఉంటేగానీ సాధ్యం కాదు. మరి, పెర్సివాల్ గారికి అంత తెలుగు ఎలా అబ్బిందీ?, “తెలుగు భాషాధ్యయనంఎలా ఛేశాడు?, ఎక్కడ చేశాడనే వివరాలేవీ తెలీవు. జాఫ్నాలోనే పాతికేళ్లపాటు తమిళాన్ని అధ్యయనం చేసేందుకు ఉద్యోగం ఆయనకు సహకరించింది. మరి తెలుగు ఎలా నేర్చాడు? కావ్యాలతో పరిచయం ఆషామాషి కాదు కదా!

సి.పి. బ్రౌన్ గారు అధికార దర్పం కలిగిన జ్యుడిషియల్ అధికారి. సామాన్యులు గానీ, కవి పండితులుగానీ ఆయన దగ్గరకు నేరుగా వెళ్లేందుకు జంకేవాళ్లు. అయినా పండితవర్గాన్ని చేరదీసి వాళ్లకు స్వంత డబ్బులిచ్చి కావ్యాల్ని పరిష్కరించటం లాంటివి తన పర్యవేక్షణలో సక్రమంగ అజరిగేలా చూశాడు. వంద పద్యాలు రాస్తే ఆరు రూపాయలు ఇచ్చేవాడని, తప్పు రాస్తే తప్పుకి అర్థరూపాయి ఫైన్ వేసేవాడని ఇలా బ్రౌన్ గురించి అనేక కథనాలున్నాయి.

కానీ, పెర్సివాల్ అధికారి కాదు. దొరగారు (కలెక్టరు) కూడా కాదు. ఒక మత పెద్ద. అంతే! ఒక పక్క తమిళాన్ని, మరో పక్క తెలుగుని సమానంగా అధ్యయనం చేశాడు. ప్రాచీన గ్రంథాలు కావ్యాలు, శతకాల్లోంచి పదాలు ఏరుకుంటే గానీ నిఘంటువు నిర్మాణం పూర్తి కాదు. అయితే, పెర్సివాల్ జనంతో మమేకమైన వ్యక్తి కాబట్టి, జనసామాన్యం మాట్లాడే అనేక పదాల్ని తన నిఘంటువులో చేర్చాడు. ఈ పదాల్లో ఆనాటి తమిళనాడులోని తెలుగువారు మాట్లాడే పదాలు ఎక్కువ కనిపిస్తాయి.

ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వయసులో పెర్సివాల్ కన్నా ఐదేళ్ళు పెద్ద! ఆయన భారతదేశానికి ఉన్నతాధికారిగా వచ్చాడు. సంస్కృతంతో పరిచయం ఉన్న కుటుంబం ఆయనది. తెలుగు నేలపైన ఉద్యోగం చేయటాన తెలుగంటే ప్రేమ పెంచుకున్నాడు. కానీ, పెర్సివాల్ పరిస్థితి వేరు. ఈయన మతప్రచారానికి వచ్చాడు. తమిళనేలపైన తమిళుల మధ్య జీవించాడు. కానీ, జనసామాన్యంలోకి వెళ్లి, తెలుగు కూడా క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. బ్రౌన్, పెర్సివాల్ ఈ ఇద్దరి కృషికీ భాషాభిమానమే ఆలంబన.

1818లో తొలి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు రూపొందించిన విలియం బ్రౌను, 1852లో తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు రూపొందించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌను, 1862లో పెర్సివాల్ తెలుగు ఇంగ్లీషు నిఘంటువునీ నిర్మించారు. ఈ ముగ్గురికీ నిఘంటు నిర్మాణం అనేది ఒక వ్యక్తిగతమైన అంశమే తప్ప ఉద్యోగ బాధ్యత కాదు. వృత్తి వ్యాపకాలకు సమయం పోగా, తీరిక వేళల్లో మాత్రమే తెలుగు గురించి ఆలోచించ గలిగేవారు. విలియం బ్రౌన్ ఆ విషయాన్ని తన నిఘంటువు ముందుమాటల్లో వ్రాసుకున్నాడు కూడా! కానీ, ప్రజలతో కలగలిసి, వారిభాషని దగ్గరగా గమనించే అవకాశం సిపి బ్రౌనుకు కొంత ఉండగా, పెర్సివాల్‌కి నిరంతరం ఉండేది. దాన్ని ఆయన సద్వినియోగపరిచాడు. ప్రజలతో, పండితులతో, రచయితలతో సంబంధాలు పెరగటానికి దినవర్తమణి పత్రిక కలిసొచ్చింది. బ్రౌనుకి లేని అవకాశం ఇది.

పెర్సివాల్ మొదట 1861లో తమిళ్-ఇంగ్లీషునిఘంటువునీ, తర్వాత 1862లో తెలుగు-ఇంగ్లీషు నిఘంటువునీ ప్రచురించాడు. ఒక విదేశీయుడు ఏడాది వ్యవధిలో రెండు వేర్వేరు భాషల్లో బృహన్నిఘంటువులను వెలువరించగలగటం అనితరసాధ్యం. అనేక విధాలుగా ఈ నిఘంటువులో మెరుగైన అంశాలున్నాయి. అయితే, ఆనాటి తెలుగు పండితులు దీన్ని దాదాపు పట్టించుకోలేదనే చెప్పాలి.

పెర్సివాల్ రూపొందించిన తమిళ ఇంగ్లీషు నిఘంటువు1867లో రెండవ ముద్రణనీ, 1869లో మద్రాస్ విద్యాశాఖ వారి కోసం మూడవ ముద్రణనీ ఇలా ఆయన జీవితకాలంలో 5సార్లు పునర్ముద్రణ పొందింది. కానీ, వీరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు మాత్రం అలాంటి భాగ్యాన్ని పొందలేదు. అలాగని 1854లో వెలువడిన బ్రౌన్ నిఘంటువు కూడా బ్రౌన్ మరణానంతరమే రెండవ ముద్రణకు నోచుకుంది. తమిళులు ఇచ్చినంత ఆదరణ ఆనాటి తెలుగు ప్రజల్నుండి బ్రౌనుకీ రాలేదు, పెర్సివాలుకీ రాలేదు. లోపం మనదా? ఆ మహనీయులదా?

కొత్తపల్లి వీరభద్రరావు గారు మన వారికి ఋణగ్రస్తులగుట తెలిసినట్టు, కృతఙ్ఞతను తెలియ జేయుట అంతగా తెలియదు గనుక, నైఘంటికులలో అనేకులు బ్రౌను దొరను ఉపయోగించుకుని మాటాడక మిన్నకుండిరిఅని ఆం.ప్ర. సాహిత్య అకాడెమీ కోసం వ్రాసిన సి.పి. బ్రౌన్ (1798-1884)పుస్తకంలో వ్యాఖ్యానించారు. పెర్సివాల్ విషయంలోనూ ఇలానే మన పండితులు మాటాడక మిన్నకుండిరికదా!

నిఘంటువుల రూపకల్పనలో తనకు సాయం చేసిన పండితుల్ని గురించి బ్రౌను “these instructors were familiar with Sanskrit Grammar, but were less ready to solve questions as to the syntax of their mother-tongue” – “వాళ్లకి సంస్కృత వ్యాకరణంతో ఉన్న పరిచయం మాతృభాషతో లేదు. తెలుగుకి సంబంధించిన ప్రశ్నలకి సమాధానం చెప్పటానికి వారికి అంత సంసిద్ధత లేదు. ఈ దురవస్థకు ఇదే కారణంఅని వ్రాశాడు. సంస్కృతం వస్తే తెలుగు వచ్చినట్టే ననే దురభిప్రాయం పండితుల్లో కొందరిలో ప్రబలి ఉందనేది దీనిమీద కొత్తపల్లి వీరభద్రరావుగారి వ్యాఖ్య.

బ్రౌను ఎక్కువగా ఆంధ్రదీపిక, ఆంధ్ర భాషార్ణవము, ఆంధ్రభాషాభూషణము, ఆంధ్రనామ సంగ్రహము, కర్కంబాడి నిఘంటువు, ఓరుగల్లు పదజాలము లాంటి గ్రంథాలమీద ఆధారపడ్డాడు. పెర్సివాల్ అలా కాకుండా, అన్ని వర్గాల ప్రజల నాలుకల మీద ఆడే పదాల మీద ఆధారపడ్డాడు. ఈ తేడా ముఖ్యమైనదే!

భాషా సాహిత్య సేవ

1861లో తమిళ-ఇంగ్లీషు నిఘంటువు, 1862లో తెలుగు ఇంగ్లీషు నిఘంటువు ప్రచురణ,1867లో ఇంగ్లీషు-తమిళం నిఘంటువు ప్రచురణ, 1874లో తమిళ సామెతల ఆంగ్లానువాద గ్రంథం పునర్ముద్రణ, 1876లో ఇంగ్లీషు తమిళ నిఘంటువు పెంపుచేసి పునర్ముద్రణ, 1877లో తమిళ సామెతల గ్రంథం, అలాగే తమిళ నిఘంటువు పునర్ముద్రణలు పొందాయి. 1880 జలదేవత (Undine) తమిళ అనువాదం ప్రచురణ అయ్యింది. 1891లో వినోద రసమంజరి తమిళ అనువాదం అచ్చయ్యింది. 1893లో తమిళ నిఘంటువు ఇంకోసారి పునర్ముద్రణ జరిగింది. ఆఖరి రోజుల్లో నలదమయంతి ఆంగ్లానువాదం, Aphorisms of the Poet-Saint Auvayar” పేరుతో (అవ్వయార్ వచనాలు) ఆంగ్లీకరించాడు.

బ్రిటిష్ ప్రభుత్వం వారే ప్రోత్సహించటంతో 1855లో పెర్సీవాఅల్ దినవర్తామణి పత్రికను ప్రారంభించాడని చరిత్రాకారులు చెప్తారు. తమిళ ప్రజా జీవితం, భాష, సంస్కృతి, అక్కడి రాజకీయ పారామాఇన అంశాలు, పాలనా సంబంధమైన విషయాలను ఈ పత్రికద్వారా ప్రజలకు అందచేయటం ప్రభుత్వం వారి లక్ష్యం. ఈ పత్రిక జనాదరన పొందటంతో పెర్సివాల్ దినవర్తమణి పేరుతోనే తెలుగు పత్రికని కూడా స్థాపించాడు. Little Bourne, Luz, Mylapore చిరునామాతో ఈ పత్రిక వెలువడేదట. అది ఆనాటి పెర్సివాల్ గారి ఇంటి అడ్రసే! ఈ ఇంట్లో ఉన్నప్పుడే పెద్ద కుమార్తె ఎలిజాబెత్ ఆన్న్ వివాహాన్ని రాబర్ట్ బ్రూస్ ఫూటేతో జారిపించాడు. వారిద్దరికి ఎలిజబెత్ సోఫియా మేరి అనా పాప పుట్టింది కూడా ఆ ఇంట్లోనే! ఆ తర్వాత యేర్కాడ్ వెళ్ళి అక్కడ స్థిరపడ్డడాయన.

ఆఖరి రోజులు

తమిళనాడు సేలం జిల్లాలో ఏర్కాడుఅనేది షెవరొయ్స్ పర్వతశ్రేణిలో ఒక హిల్ స్టేషన్. సర్వారాయుడనే గ్రామదేవత పేర్న సర్వారాయన్ కొండ లవి! ఊటీలాగా చల్లగా ఉండే ప్రదేశం. 1620 మీటర్ల ఎత్తున ఉంది. పెర్సివాల్ తన భార్య మరణం తరువాత మద్రాసు నుండి ఈ ఏర్కాడుకు తరలి వచ్చేశాడు.

సేలం నుండి 5 మైళ్ల ఘాట్ రోడ్డు ప్రయాణం. సరస్సులు, జలపాతాలు, వెదురుపొదలు, ఎర్రచందనం మొక్కలు, రకరకాల పక్షుల వింత వింత కిలకిలారావాలతో ప్రయాణం ఆహ్లాదకరంగా ఉండేది.

1871 నుండీ మరణించే వరకూ మిలిటరీ మహిళా అనాథ శరణాలయానికి చాప్లైన్ (సైన్యం పక్షాన మతాధికారి) గా వ్యవహరించాడు. జలదేవత (undine) గ్రంథానికి తమిళ అనువాదం చేశాడు. వినోద రసమంజరి అనే తమిళ గ్రంథం వెలువరించాడు. 1878లో తమిళ సామెతల గ్రంథం కూడా పునర్ముద్రణ పొందింది. స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ లైబ్రరీలో ఈయన రచనలు ఉన్నాయి. మొత్తం 13 పుస్తకాలు వ్రాశాడు.

తన కుమారుడు శామ్యుయేల్ పెర్సివాల్ మరణం తరువాత పెర్సివాల్ చాలా క్రుంగిపోయడు. ఆ తరువాత ఏడాది తిరక్కుండానే 13 జూలై 1882 న, 80వ యేట విరేచనాల వ్యాధితో పెర్సివాల్ కాలధర్మం చెందాడు.

అల్లుడే ఆప్తమిత్రుడు

పెర్సివాల్ గారి పెద్దల్లుడు రాబర్ట్ బ్రూస్ ఫూటె. చరిత్రకారులకు ఆయన భారతదేశ పురావస్తు చరిత్ర పితామహుడిగా తెలుసు. కానీ ఆయన పెర్సివాల్ గారి అల్లుడని, పుత్రసమానుడని అంతకు మించి ఆప్తమిత్రుడనీ ఎక్కువ మందికి తెలీదు. పెర్సివాల్ గారి అంతిమక్షణాల వరకూ అంటుకుని ఉన్న స్నేహితుడాయన.

రాబర్ట్ బ్రూస్ ఫూటే (22 సెప్టెంబర్ 183429 డిసెంబర్ 1912) అనే పేరు భారత దేశపు పురావస్తు చరిత్ర పితామహుడుగా చిరస్మరణియమైనది. తెలుగు నేలమీద అత్యంత ప్రాచీనకాలపు మానవుడి అవశేషాల్ని కనుగొని తెలుగు జాతి అత్యంత ప్రాచీనమైనదని నిరూపించిన మహనీయుడాయన. ఆంగ్లేయుడు, భూగర్భశాస్త్రవేత్త (జియాలజిష్టు) పురావస్తు చరిత్రవేత్త (ఆర్కియాలజిష్టు). జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పక్షాన భారతదేశంలో చరిత్ర పూర్వయుగాలకు చెందిన పురావస్తు ఆధారాలను తొలిసారిగా వెలికి తీసి, భారతదేశపు ప్రాచీన చరిత్ర పితామహుడు (father of Indian prehistory) గా ప్రసిద్ధుడైనాడాయన. .

Man and Environment (Vol-33, Issue no.-1-2) లో రాబర్ట్ బ్రూస్ ఫూటే జీవాన విశేషాలు కొన్ని ఉన్నాయి. ఫూటే గురించిన ఎవరికీ తెలియని విశేషాలు (untold story of Foote) పేరుతో ఈ కథానం ప్రచురితం అయ్యింది.

ఫూటే ఎవరు?

భారత పురావస్తు చరిత్ర పితామహుడు రాబర్ట్ బ్రూస్ ఫూటే

భారతదేశపు ప్రాచీనత అనే కలశాన్ని రెండు చేతుల్తో పుచ్చుకుని అవతరించిన సైంటిస్టు, స్కాలర్ ఆయన. చరిత్ర చెప్పినవాడి చరిత్ర తెలియకపోవటం చరిత్రకు చేసే అపచారమే అవుతుంది. ప్రసిద్ధ చరిత్రకారులకు కొంత తెలిసిఉండవచ్చేమో గానీ జనసామాన్యానికి తప్పక తెలిసి ఉండాల్సిన పేరు ఆయనది.

రాబర్ట్ బ్రూస్ ఫూటే కుమారుడు హెన్రీ బ్రూస్ ఫూటే కాగా, మనుమాడు డా. జాన్ బ్రూస్ ఫూటే వెల్లడించిన అనేక విశేషాలు ఈ చరిత్ర పితామహుడి గురించి కొంత తెలుసుకునేందుకు ఉపకరించాయి. పీటర్ పెర్సివాల్ సోదరుడ్ జాన్ అనే ఆయన కూడా కొన్ని కొత్త సంగతులు వెల్లడించారు. వీటన్నింటినీ క్రోడీకరించి మాన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ పత్రికలో ఫూటేగారి జీవిత చరిత్ర ప్రచురితమయ్యింది.

ఫూటే గారికి భారతీయ సంస్కృతి గురించిన పరిచయం చేసినవాడు పెర్సివాల్ గారే! అలా ఏర్పడిన పరిచయం ఆ ఇద్దర్నీ మామా అల్లుళ్ళను చేసింది. ఫూటేకి తమ పెద్దమ్మాయి ఎలిజబెత్ ఆన్న్ పెర్సివాల్‌ని ఇచ్చి ఘనంగా పెళ్లిచేశాడు పెర్సివాల్.

ల్యాండ్ ఆఫ్ వేదా పుస్తకాన్ని పెర్సివాల్ ప్రచురించిన్ కొద్దికాలానికి ఫూటే భారతదేశానికి వచ్చాడు. వస్తూనే ఆయనకు పెర్సివాల్ రచనలతోనూ ముఖాముఖీ ఆయనతోనూ పరిచయం అయ్యింది. భారతదేశ చరిత్ర, సంస్కృతి, ప్రాచీనతాలా గురించిన అవగాహన కలగటానికి పెర్సివాల్ గారితో ఏర్పడిన సాన్నిహిత్యం ఆయనకు ఎంతగానో తోడ్పడింది. చరిత్ర పితామహుడనిపించుకోగల సామర్థ్యం ఫూటే గారికి కలగటానికి కావాల్సిన పునాదులు వేసింది పెర్సివాలే! 1842లో తమిళ సామెతలు, జాతీయాలు, 1867లో ఆంగ్లో తెలుగు నిఘంటువు, ఇంకా అవ్వయ్యార్ లాంటి ప్రముఖుల రచనలకు ఆంగ్లానువాదాలు పెర్సివాల్‌ని భారతీయతకు దగ్గర చేయగా ఫూటేగారిని అందులో భాగం చేశాయి.

కుమారుడి దుర్మరణం

అన్ని భౌతిక వాంఛలకూ అతీతంగా నిష్కామ కర్మయోగిగా జీవించినప్పటికీ పెర్సివాల్ గారు భవ బంధాలకు బందీ కాక తప్పలేదు. 1881లో ఆయన కుమారుడు రెవరెండ్ శామ్యూల్ పెర్సివాల్ హఠాత్తుగా మరణించాడు. కుమారుని మరణం పెర్సివాల్ గారిని బాగా కుంగదీసింది. ఆ తరువాత ఏడాది తిరక్కుండానే పెర్సివాల్ కాలం చేశారు.

ఫూటేగారు పెర్సివాల్ గారిపట్ల ఆకర్షితుడు కావటానికి సంస్కృతి, చరిత్రల పట్ల ఆ ఇద్దరికీ గల ఆసక్తి, అభినివేశాలే కారణం. భారతదేశంలో జాతీయత, భాష, సంస్కృతి, మతం ఇవన్నీ ప్రాంతనికి ప్రాంతానికీ వేర్వేరుగా కనిపించినా ఏకాత్మత అనే సూత్రం ఈ దేశీయుల్ని కట్టిపడేసిందని పెర్సివాల్ భావించిన విషయం ఫూటే గారిని బాగా ఆలోచింపచేసింది. పురావస్తు విశేషాల్లో కూడా ఈ ప్రాంతీయ బేదాలను ఆయన గుర్తించ గలిగారు.

రెండో అల్లుడు సామెతల సేకర్త

పెర్సివాల్ గారి రెండో అమ్మాయి అన్నె ఫ్లెచర్‌ని 1882 జూలై 11న ఆల్ఫ్రెడ్ సైమండ్స్ కిచ్చి వివాహం చేశారు. సైమండ్స్ చాలా కాలం మామగారి దగ్గరే ఉండి, తరువాత మద్రాస్ జైల్ సూపరెండెటుగా వెళ్ళాడు. సైమండ్స్, ఫూటే ఈ తోడల్లుళ్లు ఇద్దరూ మంచి స్నేహితులు. ఫూటే రచనల్లో సైమండ్స్ ప్రస్తావన చాలా చోట్ల ఉన్నాదని చరిత్రకారులు వ్రాశారు. సైమండ్స్ క్కూడా భారతీయ బాషా సంస్కృతుల పట్ల ఎనలేని అభిమానం ఉంది. ఆయన తమిళ సామెతల సేకర్త కూడా!

ఫూటేకి తెలుగు బాగా వచ్చు

మారుమూల ప్రాంతాల్లో పురావస్తు తవ్వాకాలకు వెళ్ళేందుకు స్థానికులతో సంభాషణ, వారిని అంగీకరింపచేయటం, వారి సహకారాన్ని పొందటం చాఅలా అవసర అవుతాయి. ఆయనకు తెలుగు తమిళ భాషలతో గల పరిచయం ఇందుకు ఎంతగానో సహకరించింది. ఈ రెండు భాషలూ గడగడా మాట్లాడటానికి మామగారు పెర్సివాల్ తోడ్పాటు ముఖ్యమైందని వేరే చెప్పనవసరం లేదు. అల్లుడయ్యే నాటికి సైమండ్స్ భూగర్భ శాస్త్రవేత్త.

భార్య సహకారం

ఫూటేగారితో ఎలిజాబెత్ ఆన్న్ వివాహం 1862 జూన్ 7న జరిగింది. వివాహాల రికార్డులో విలియమ్ హెన్రీ ఫూటే కుమారుడైన రాబర్ట్ బ్రూస్ ఫూటే పట్టభద్రుడని, మద్రాస్ జియోలాజికల్ సర్వేలో అసిస్టెంట్ జియాలజిష్టుగా ఉన్నాడనీ ఉంది. సెయింట్ థోమ్ (St. Thomas)లో వారి వివాహం జరిగింది. పెళ్ళినాటికే ఫూటే పల్లవరం, అత్తిరామ్‌పక్కమ్ లలో పురావస్తు నిక్షేపాలను కనుగొని వార్తల్లో నిలిచాడు. ఆయన కనుగొన్న పురావస్తువుల రేఖా చిత్రాలను భార్య ఎలిజబెత్ చక్కగా గీసి ఇచ్చేది. ఆ పరిశోధనా వ్యాసానికి ఫూటేతో సమానంగా ఎలిజబెత్తుకీ పేరొచ్చింది. ఆమె ఆ విధంగా సహకరించిందని అనేక పరిశోధనా పత్రాల్లో “..the great majority of the 27 plates illustrating my paper were drawn by my wife and are excellent likenesses of the implements though very coarsely lithographed..” ఇలా పేర్కొన్నాడాయన.

ఫూటేగారికి భార్యా వియోగం

కాలం ఇలా మూడు పరిశోధనలు ఆరు పురావస్తువులుగా సాగుతుండగా 1870 జూన్ 30న ఫూటే గారి భార్య, పెర్సివాల్ గారి పెద్దమ్మాయి ఎలిజబెత్ ఆన్న్ లివర్‌లో గడ్డ కారణంగా అకస్మాత్తుగా మరణించింది. సెయింట్ జార్జి సిమెటరీలో ఆమె భౌతిక దేహాన్ని ఖననం చేశారు. భార్య మరణం తరువాత ఫూటే గారు ఎలిజా మెలిస్సాని మారుపెళ్లి చేసుకున్నప్పటికీ, పెర్సివాల్‌కు దూరం కాలేదు. పెర్సివాల్ తన వీలునామాలో ఫూటేని ట్రస్టీగా పెట్టి ఎస్టేట్ నిర్వహణా బాధ్యతలన్నీఅప్పగించాడంటే ఆ అల్లుడిపైన ఉన్న ఆయన నమ్మకం అంతటిది!

మరణించే నాటికి ఎలిజబెత్ ఆన్న్‌కి నలుగురు చిన్నపిల్లలు. హెన్రీ బ్రూస్‌కి ఏడేళ్లు. ఎలిజబెత్ సోఫియాకి ఐదేళ్లు. వివియన్‌కి మూడేళ్లు. నెలలవాయసులో వయలెట్ అన్నే ఉంది. ఎలిజబెత్ మరణించే సమయానికి ఫూటేగారు మద్రాసుకు దక్షిణాన ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో తవ్వకాల్లో ఉన్నారు. ఆయన జీవితంలో జరిగిన ఈ విషాదం ప్రభావం తన పరిశోధనల మీదా పడలేదు. ఆయన 1870లో ఒక రచనలో భార్య మరనాని ప్రస్తావించాఅడే తప్ప తన వ్యక్తిగత విషాదాన్ని ఎక్కడా బైటకు చెప్పుకోలేదు.

ఫూటేగారి పెద్దకొడుకు

పెద్దవాడు హెన్రీ బ్రూస్ ఫూటే పుట్టిన సమయంలో ఫూటేగారు కర్నూల్ ప్రాంతంలో పురావస్తు పరిశోధనల నిమిత్తం తవ్వకాల్లో ఉన్నారు. ఇక్కడ ఆయన కనుగొన్న విశేషాలే భారతదేశ ప్రాచీనచరిత్రను ఒక మలుపు తిప్పాయనే చెప్పాలి. ఆయన్ని చరిత్ర పితామహుడిగా చేసినవి కూడా ఇక్కడి పరిశోధనలే!

బిడ్డ పుట్టిన తరువాత చర్చికి తీసుకు వెడితే అక్కడ మంత్రజలంతో అభిషేకించి బిడ్దని చర్చిలో భాగంగా ప్రకటిస్తారు. ఆ బిడ్డకు నామకరణం చేస్తారు. ఇదంతా బాప్టిజం ప్రక్రియ. పెద్ద మనుమడు హెన్రీ బ్రూస్ ఫూటేని బాప్టైజ్ చేసే కాఅర్యాక్రమానికి రెవరెండ్ పీటర్ పెర్సివాల్ గారే అఫిసియేటింగ్ మినిస్టర్‌గా వ్యవహరించారు. ఆయన ఆశీర్వాద బలమే కావచ్చు, 1880లో 17 యేళ్ళ వయసుకే హెన్రీ బ్రూస్ రాయల్ మిలిటరీ అకాడెమీలో జెంటిల్ మాన్ కేడెట్‌గా చేరారు. 1882లో లెఫ్టినెంట్ గానూ, 1891లో మేజార్ గానూ, 1911లో లెఫ్టినెంట్ కల్నాల్ గానూ అయ్యారు. 1893లో ఆయన్ని ఆర్డినెన్స్ డిపార్ట్‌మెంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. బెంగాల్లో ఈషాపూర్ రైఫిల్ ఫ్యాక్టరీకి సూపరెండెంట్ అయ్యారు. 1932లో తానువు చాలించారు.

1884లో తాన ఉద్యోగానికి శలవుపెట్టి హెన్రీ తన తండ్రి ఫూటే గారికి సహకరించేందుకు కర్నూలు వచ్చాడట. మద్రాస్ గవర్నర్ గ్రాంట్ డఫ్ఫ్ గారు ఈ మేరకు తండ్రిని అనుసరించవలసిందిగా హెన్రీని అనుసరించాడట. కర్నూల్లోవి తండ్రీ కొడుకులు కలిసే కనుగొన్నారని చెప్తారు. “..he had afforded me great assistance in exploring and excavating different caves, and had thereof gained a knowledge of the country and of the people whom he had to employ in the further explorations” అని రాసుకున్నారు తన కుమారుడి గురించి ఫూటే! “The efficient way in which he carried out the very arduous piece of work confided to him fully justified the confidence with which I had recommended him to His Excellency Mr. Grant Duff, and will I trust be recognized by the authorities” అని తన కుమారుడి గురించి రాసారాయన.

ఫూటే గారి నలుగురు పిల్లలూ పురావస్తు పరిశోధనల్లో తండ్రికి తోడ్పడినవారే! ఏ ఏ పరిశోధనకు తనపిల్లల్లో ఎవరు ఏవిధంగ తోడ్పడ్డారో ఆయన ప్రస్తావించారు కూడా! తన మనుమలు, మనుమరాళ్లలో  భాష, సంస్కృతి చరిత్రలపట్ల అవగాహనని, వాటిపట్ల అభిమానాన్ని కలిగించటానికి పెర్సివాల్ చేసిన కృషి ఇందుకు ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు.

పిల్లలు, మనుమలు, మనుమరాళ్లతో వయో వృద్ధులైన ఫూటే దంపతులు. మనుమరాలి పెళ్ళి సందర్భంగా తీసిన ఫోటో ఇది. మధ్య వరుసలో కుడి నుండి 5వ వ్యక్తి ఫూటే!

భారతీయత పట్ల అభిమానం

లండన్ వదిలి ఇండియాలో ఉద్యోగానికి కుదిరిన ఆంగ్లేయ అధికారుల్లో భారతీయత పట్ల, ఇక్కడి భాషా సంస్కృతులపట్ల ఇంతటి అభిమానం కలిగిన వ్యక్తులు అరుదు. మామగారు పెర్సివాల్, అల్లుడుగారు ఫూటే వారి వారి మార్గాల్లో తెలుగు తమిళ సంస్కృతుల  ప్రాచీనతను వెలికితీసి లోకానికి పరిచయం చేయటానికి నిబద్ధతతో పనిచేశారు. ఒక విధంగా పెర్సివాల్ స్థాయిలో ఫూటే గారి భార్యలు, పిల్లలు కూడా అంతే నిబద్ధతతో పనిచేయటాన్ని మనం ఘనమైన విషయంగా గుర్తించాలి.

1873లో వియన్నాలో జరిగిన పురావస్తు ప్రదార్శనలో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఫూటేగారు ప్రాతినిధ్యం వహిస్తూ, భారతదేశంలోని పురావస్తు సంపదను ప్రదర్శనకు సిద్ధం చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు. తను స్వయంగా కనుగొన్న పురావస్తువుల్ని ప్రత్యేకంగా ప్రదర్శన పెట్టారు.

1874లో తిరిగి రావటానికి ముందు తన మేనమామ గిఫ్ఫార్డ్ వెల్స్ గారి కూతురు ఎలిజా మెలిస్సా వెల్స్‌ని వివాహం చేసుకున్నాడు. ఫూటే గారి అదృష్టం కొద్దీ ఆ అమ్మాయి కూడా పురావస్తు పరిశోధనా రంగంమీద ఇష్టం ఉన్న వ్యక్తే కావటం ఆయనకు కలిసి వచ్చింది. ఎలిజా మెలిస్సా వెల్స్ ద్వారా నలుగురు పిల్లలు కలిగారు. మొత్తం 8మంది సంతానాన్ని ఎలీజా మెలిస్సా చక్కగా సాకుతూనే భర్త పరిశోధనలకు సహకరించేది.

1873లో వియన్నాలో జరిగిన ప్రదర్శనలో ఫూటే గారు వెలికి తీసిన పురావస్తువుల్ని కొనటానికి లక్షల్లో సొమ్ము ఇస్తామన్నారు కానీ, ఫూటే అందుకు ఇష్టపడక తన సేకరణలన్నీ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి మ్యూజియంకి ఇచ్చేశాడు. వారు వాటిని కలకత్తాలోని ఇండియన్ మ్యూజియంకు తరలించారు. అక్కడినుండి అవి అన్యాక్రాంతం అయ్యాయని చరిత్రకారులు బాధపడ్తుంటారు. కొన్నింటిని మద్రాస్ మ్యూజియంకి ఇచ్చానని, కేవలం ఖర్చుల నిమిత్తం 33,000 రూపాయలు మాత్రమే  తీసుకున్నట్టు వీలునామాలో పేర్కొన్నారు. ఫూటే గారి వీలునామాలో ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలు, ఆయన ఎదుర్కొన్న అనేక సమస్యలు, ఆయన ఆర్జించిన విషయాలు అన్నీ స్పష్టంగా ఉన్నాయి.

పెర్సివాల్ పెద్దల్లుడు రాబర్ట్ బ్రూస్ ఫూటేఆయనకు నిజమైన జీవన సహచరుడు. భారతీయ పురావస్తు శాస్త్ర పితామహుడిగా ఫూటేని దేశప్రజలు గౌరవిస్తారు. పెర్సివాల్ మనుమడు, ఫూటే పెద్ద కొడుకు హెన్రీ బ్రూస్ ఫూటే.. తండ్రి అంతటి పురావస్తు శాస్త్రవేత్త. కర్నూలు, బళ్లారి దగ్గర ఆదిమ మానవుడి పురావస్తు ఆధారాలు వెలుగులోకి తేవటంలో ఈ తండ్రీ కొడుకుల పాత్ర గొప్పది. మద్రాసు దగ్గర పల్లవరం, కర్నూలు, బళ్ళారిలలో ఆదిమ మానవుడి అవశేషాలను కనుగొని తెలుగు, తమిళ నేలల ప్రాచీనతను లోకానికి చాటిన మహనీయుడాయన. తెలుగు తమిళ నేలల పైన తొలి మానవుల అవశేషాలను కనుగొన్న ఆ కుటుంబం పట్ల మనం మరింత గౌరవాన్ని ప్రదర్శించి ఉండవలసింది.

యేర్కాడులో పెర్సివాల్ సమాధి హోలీ ట్రినిటీ చర్చ్ శ్మశానంలో రెవ్. పీటర్ పెర్సివాల్, ఆయన అల్లుదు రాబర్ట్ బ్రూస్ ఫూటే సమాధులు (సేకర్త: శాంతి పప్పు)

పెర్సివాల్, ఫూటే మామా అల్లుళ్ల బంధాన్ని వివరించాలంటే  మాటలు చాలవు. ఒకరిపట్ల ఒకరికి అమితమైన గౌరవం, ఆత్మీయత లున్నాయి. భారతీయ సంస్కృతి, చరిత్ర, భాషల మీద ఇద్దరికీ ప్రత్యేక అభిమానం ఉండటమే వీరి స్నేహ బంధానికి ప్రధాన కారణం. భార్య చనిపోయినా, తన మేనమామ కూతుర్ని రెండో వివాహం చేసుకున్నా ఫూటేగారు పెర్సివాల్ గారికి దూరం కాలేదు. ఆజాన్మాంతం ఆయన సాన్నిహిత్యాన్ని వదల్లేదు. జీవితకాలం ఆ ఇద్దరూ బంధువులుగా కాక స్నేహితులుగానే గడిపారు.

పెర్సివాల్, ఫూటే – ఇద్దరి సమాధులూ ఏర్కాడు చర్చి ఆవరణలో పక్కపక్కనే నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి! నిజానికి, బ్రూస్ ఫూటే కలకత్తాలో మరణిస్తే అక్కడే దహనం చేసి, అస్తికల్ని తెచ్చి మామగారి సమాధి పక్కనే మరో సమాధి నిర్మించారని శాంతి పప్పుఅభిప్రాయపడ్డారు.

ఫూటే సమాధిపైన “I have fought a good fight, I have finished my course, I have kept the faith” అనే వాక్యం వ్రాసి ఉంది. బహుశా ఒక పురావస్తు శాస్త్రవేత్తగా బైబిల్ ప్రబోధించిన సృష్టివాదానికి భిన్నమైన చారిత్రక వాస్తవాలను వెలువరించటాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ మాటలు పలికి ఉంటాడని, ఆ మాటల్నే సమాధిపైన వ్రాశారనీ చెప్తారు.

తెలుగు రాని తెలుగు వారికోసం నిఘంటువు

19వ శతాబ్ది ప్రథమార్థంలో మూడు ముఖ్యమైన తెలుగు ఇంగ్లీషు నిఘంటువులు వెలువడ్డాయి. తెలుగు భాషకోసం యూరోపియన్లు పాటుబడ్డ కాలం అది. డి ఎఫ్ కార్‌మైఖేల్ రూపొందించిన వైజాగ్‌పటం జిల్లా మాన్యువల్, గోర్డాన్ మకెంజీ రూపొందించిన కృష్ణాజిల్లా మాన్యువల్ (1883), హెన్రీ మోరిస్ రూపొందించిన గోదావరి జిల్లా మాన్యువల్ (1878) జాన్.ఎ.సి బాస్వెల్ రూపొందించిన నెల్లూరు జిల్లా మాన్యువల్ (1873), జెడిబి గ్రిబిల్ రూపొందించిన కడప జిల్లా మాన్యువల్ (1875) మొదలైనవి ఈ నాటికీ తెలుగు వారికి పాఠ్యగ్రంథాలే! ఈ మహనీయమైన కృషి ఆనాడు జరిగి ఉండకపోతే తెలుగువారి చరిత్ర అరకొర అయ్యేదేమో..! కర్నూలు జిల్లా డెప్యూటీ కలెక్టరుగా ఉన్న నరహరి గోపాలకృష్ణమ చెట్టి రూపొందించిన కర్నూలు జిల్లా మాన్యువల్ చదివితే చరిత్రలో రాయలసీమ ముఖచిత్రం ఆవిష్కృతమౌతుంది.

1818లో తొలి తెలుగు-ఇంగ్లీషు డిక్షనరీ వెలువరించిన విలియం బ్రౌను, 1854 తరువాత వరుసగా తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు మరియు మిశ్రభాషా నిఘంటువులు వెలువరించిన సి.పి.బ్రౌను తరువాత అంతగా ఇటు తెలుగు భాషకూ, అటు తమిళ భాషకూ సేవ లందించిన రెవరెండ్ డా. పీటర్ పెర్సివాల్ మరో తెలుగు సూర్యుడే!

గాజుల లక్మీనరసు చెట్టి లాంటి తెలుగు ప్రముఖులు ప్రజాచైతన్యం కోసం ఎంత కృషి చేస్తున్నా, తెలుగు ప్రజల్లో పెద్దగా చలనం రాని పరిస్థితి ఆనాటిది. నాడే కాదు నేటికీ ఈ పరిస్థితిలో మార్పు రాలేదు.

తెలుగు ఇంగ్లీషు నిఘంటు రూపకల్పనలో పెర్సివాల్ సామాన్య ప్రజల భాష మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాడు. కవిపండితుల ప్రయోగాల జోలికీ, సంస్కృత పదాల జోలికీ వెళ్లకుండా, రోజువారీగా మనం మాట్లాడుకునే పదాలకు సమానమైన ఇంగ్లీషు పదాలను ఈ నిఘంటువులో ప్రధానంగా అందించాడు. మౌలికంగా ఇది యూరోపియన్లకు, తెలుగేతరులకు తెలుగు పదాలను పరిచయం చేసేందుకు ఉద్ధేశించిన తెలుగు నిఘంటువు. ఆనాటి అవసరం అది! తెలుగు వారికి తెలుగు పదాలనే పరిచయం చేయాల్సిన ఈనాటి మన పరిస్థితుల్లో, తెలుగు పేరెత్తితే అమెరికాలో ఉద్యోగాలు రావనే అపోహలో జీవిస్తున్న మన జనసామాన్యం కోసం పెర్సివాల్ రూపొందించిన ఈ నిఘంటువు నేటి అవసరం తీర్చేదిగా ఉంటుంది. తెలుగు రాని తెలుగు వారికోసం పెర్సివాల్ నిఘంటువు సిద్ధంగా ఉంది!

(సమాప్తం)

Exit mobile version