Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరో తెలుగుసూర్యుడు పీటర్ పెర్సివాల్-1

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘మరో తెలుగుసూర్యుడు పీటర్ పెర్సివాల్’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది మొదటి భాగము.]

తెలుగు భాషాభివృద్ధిలో భాగస్వామి అయిన ఆంగ్లేయులలో బ్రౌన్ తరువాత అంతటి వాడు పీటర్ పెర్సివాల్. ఆయన తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి దినవర్తమానివారపత్రికకు సంపాదకుడుగా నడిపించాడు. భారతదేశంలో మొదటిసారిగా ప్రొఫెసర్ అనే బిరుదు నామం పొందిన తొలి వ్యక్తి ఆయనే! ఇంగ్లీషు తెలుగు నిఘంటువు నిర్మించాడు. తెలుగు సామెతలను ఇంగ్లీషులోకి తెచ్చాడు. ఇంత చేసినా ఒక్క తెలుగు పండితుడూ పీటర్ పెర్సివాల్‌ని స్మరించక పోవటం విచిత్రం.

పీటర్ పెర్సివాల్

ఆయన మద్రాస్ నగరంలో స్థిరపడటంతో తమిళులు ఆయన పట్ల ఎక్కువ ఆదరం చూపించారు. ఆయన జన్మించి ఇప్పటికి 220 యేళ్లయ్యింది. కానీ, సమగ్రంగా ఆయన జీవిత చరిత్రను వివరించే పుస్తకం తెలుగులో వచ్చినట్టు లేదు. యేర్కాడులో ఆయన స్వంత ఎస్టేట్‌లో ఉన్న ఆయన సమాధి తప్ప తమిళనాడులో కూడా ఆయన స్మారక చిహ్నం ఏదీ లేదు. మన భాష కోసం మనం చేస్తున్నది స్వల్పమే అయినా, పరాయి పండితులు మన భాషపట్ల అభిమానం చూపించి, ప్రావీణ్యం సంపాదించి గ్రంథ రచనలు, నిఘంటువులు, వ్యాకరణ సూత్రాలు, అమూల్యమైన రచనలకు ఆంగ్లానువాదాలు చేసినవారిని కనీసం సంస్మరించుకోలేకపోవటం బాధాకరం!

రెవరెండ్ డా॥ పీటర్ పెర్సివాల్’ 19వ శతాబ్దంలో ఇంగ్లండు, శ్రీలంక, భారతదేశాల్లో ఒక సంస్కర్తగా, ఒక హిందూ అభిమానిగా, భారతీయభాషా సంస్కృతుల ప్రేమికుడుగా, ప్రత్యేకించి తెలుగు తమిళ భాషల్లో పాండిత్యం కల క్రైస్తవుడుగా ప్రసిద్ధి చెందిన దైవీ మానవుడు. జన్మతః క్రైస్తవుడైనప్పటికీ ఉద్యోగధర్మంగా క్రైస్తవ ప్రచారం చేసినప్పటికీ, శ్రీలంకలోనూ, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనూ తెలుగు, తమిళ భాషా సంస్కృతుల వికాసం కోసం పెర్సివాల్ గారు చేసిన కృషి అనన్యసామాన్యమైనది. ఆయనకు తమిళం, తెలుగు భాషలు అభిమాన విషయాలు. ప్రజలలో మానసిక, సాంస్కృతిక వికాసం కలిగించాలనే తపనతో పనిచేసిన సంస్కర్త ఆయన! ఉద్యోగధర్మాన్ని సాకుగా పెట్టుకుని శ్రీలంకలో అతిసామాన్య తమిళ ప్రజలలో జాగృతిని కలిగించారు.

సామాన్య తెలుగు ప్రజల నుడులకు, నానుడులకు సమానమైన ఆంగ్ల ప్రయోగాల్ని గుదిగ్రుచ్చి, తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు రూపొందించాడు. తెలుగు రాని బ్రిటిష్ అధికారులకు, తెలుగేతరులకు తెలుగు భాషతో సాన్నిహిత్యం కలిగింప చేసిన భాషాసేవకు డాయన!

బ్రిటను గ్రేట్ బ్రిటనుగా ఉన్న రోజుల్లో పెర్సివాల్ 220 యేళ్ళ క్రితం 24 జులై, 1803న ల్యాంకాషైర్ లోని ప్రెస్ట్‌విచ్‌లో జన్మించాడు. తనకు 20 యేళ్ళొచ్చేవరకూ మాత్రమే ఇంగ్లండులో గడిపాడు. ఆ తరువాత ఆయన యావజ్జీవితం తెలుగు తమిళ భాషాభ్యున్నతికే వెచ్చించాడు. చాలామంది యూరోపియన్ పండితులతో పోలిస్తే ప్రజలతోనూ, వారి భాషా సంస్కృతులతోనూ, ఆచార వ్యవహారాలతోనూ మమేకమైన ఏకైక వ్యక్తిగా రెవరెండ్ పీటర్ పెర్సివాల్‌ని చెప్పుకోవాలి

తొలిరోజులు:

13, డిసెంబరు 1824న పెర్సివాల్ ఇంగ్లండ్ లాంకాషైర్ దగ్గర తన స్వగ్రామం ప్రెస్ట్‌విచ్‌లో మేరీ ఫ్లెచర్‌ని వివాహం చేసుకున్నాడు. తరువాత 1826లో వెస్లేయన్ మెథడిస్ట్ మిషనరీ పక్షాన మతప్రచారకుడిగా ఉద్యోగం కుదరటంతో భార్యాసమేతంగా జాఫ్నా(శ్రీలంక-ఆనాటి సిలోన్, సింహళం) వచ్చాడు. జాఫ్నాలో ఆయన ప్రతీ విజయానికి మేరి సహకారం ఉంది. ముఖ్యంగా 1834లో ఆడపిల్లల బోర్డింగ్ స్కూల్ నిర్మాణ నిర్వహణలో ఆమె పాత్ర ఎంతైనా ఉందని చెప్తారు.

1837లో సెయింట్ పీటర్ చర్చిని పునరుద్ధరించాడు. ఉద్యోగధర్మాన్ని పాటిస్తూనే సమాజ సంస్కరణ కార్యక్రమాలు చేపట్టాడు. సమస్యలకు మూలం అవిద్యేనని గుర్తించాడు. అవిద్య, అనారోగ్యం, ఆకలి ఈ మూడింటికీ శాశ్వత పరిష్కారాలు చూపితేనే వ్యక్తుల జీవనస్థాయి పెరుగుతుందని భావించాడు. ఆమేరకు శక్తివంచనలేకుండా పనిచేశాడు.

వీళ్లు క్రైస్తవం లోకి మారతారా లేదా అనే కోణంలోంచి కాకుండా, వీళ్ల జీవన ప్రమాణం పెంచటం ఎలా అనే కోణంలోంచి ఆలోచించి సంఘ ఉద్ధరణ కోసమే పనిచేశాడు. మతంలోకి మారిన వారి సంఖ్య తక్కువగా ఉన్నా, క్రైస్తవం పట్ల సాభిమానంగా ప్రజలున్నారని గమనించబట్టే మిషనరీ యాజమాన్యం పెర్సివాల్‌ని ఏమీ అనలేకపోయింది. మంచి చేసి చూపిద్దాం, మన మంచిని చాటి చెపుదాం. మతం లోకి మారటం అనే స్వేచ్ఛని వ్యక్తికే వదిలేద్దాం అనే ధోరణిలో ఆయన సంస్కరణకే ప్రాధాన్యతనిస్తూ పనిచేశాడు.

అప్పటికి 23 యేళ్ళ యువకుడాయన. కుర్రాడని జనం లెక్కచేయకపోవటం, క్రైస్తవ పెద్దల సహకారం లేకపోవటంతో, కొత్తల్లో కష్టాలు ఎదుర్కొన్నాడు. తమిళం, తెలుగు నేర్చుకుని ప్రజల భాషలోనే ఉద్యోగధర్మం నెరవేర్చాడు. మేలిమి తెలుగులోనూ, సెందమిళం లోనూ మాట్లాడి, ఎక్కువ మందిని ఆకర్షించ గలిగాడు. క్రైస్తవమత విషయాల్ని తెలుగు, తమిళ భాషల్లో బోధించగలిగాడు. ఈ రెండు భాషలూ తనకు పట్టుబడటం కోసం పట్టుదలతో కృషి చేశాడు. కాబట్టే, తమిళంలోకి కింగ్ జేమ్స్ బైబిల్ అనువాదం చేయగలిగాడు.

జాఫ్నాలో విద్యాలయాల స్థాపన

1830లో ఆయన్ని వెలేయన్ మెథడిష్ట్ మిషన్ జాఫ్నా నుంచి కలకత్తాకు ట్రాన్స్‌ఫర్ చేసింది. రెండేళ్ల తరువాత తిరిగి జాఫ్నా బదిలీ చేశారు. కలకత్తాలో ఉన్న రెండేళ్ళలోనే బెంగాలీని బాగా నేర్చుకున్నాడు. బెంగాలీయుల ద్వారా భాషకు సంబంధించిన విషయాలు, సామెతలు, జాతీయాల గురించి బాగా తెలుసుకున్నాడు. తిరిగి జాఫ్నాకి వస్తూనే, అక్కడి సెయింట్ పీటర్స్ చర్చిని, లూథరన్ చర్చిని మరమ్మత్తులు చేయించి పునరుద్ధరించాడు.

ఆ సమయంలో కోల్‌బుక్ కమీషన్ సూచనల మేరకు మతసంస్థలు తమ దృష్టిని విద్యావ్యవస్థ మీదకు మళ్లించాయి. జాఫ్నాలో స్కూళ్లు నెలకొల్పి, నిర్వహించే బాధ్యత పెర్సివాల్కి అప్పగించారు. తన మనసులో అంకురించిన సంస్కరణ భావాల్ని ఆచరణలోకి తేవటానికి ఆయనకు అవకాశం అలా అందివచ్చింది. అయితే అది అంత తేలికగా సమకూరిన అవకాశం కాదు.

1840 నాటికి క్రైస్తవ మిషనరీలలో స్థానిక భాషలు మాట్లాడగలిగిన కొత్త బోధకులు తయారయ్యారు. వీళ్లలో ఎక్కువ మంది ఇంగ్లీషు నేర్చిన స్థానికులు కాగా, తెలుగు తమిళం లాంటి స్థానిక భాషలు నేర్చిన ఆంగ్లేయులు కూడా ఉన్నారు.

1వ శతాబ్దినాటి సెయింట్ పాల్ (అపోష్టల్ పాల్) అనుసరించిన బోధనా పద్ధతుల్ని శ్రీలంకలోనూ భారత దేశంలో తమిళ, తెలుగు కన్నడ మళయాళ ప్రాంతాల్లోనూ అనుసరించసాగారు. ఈ ప్రయోగం హిందూ ప్రవచనకారుల ప్రవచనాలను పోలి ఉండటాన హిందువుల్ని మతంలోకి ఆకర్షించటానికి బాగా ఉపయోగపడిందని మిషనరీ సంస్థలు గుర్తించాయి. పెర్సీవాల్ లాంటి మేథావులు హైందవ ఆధ్యాత్మిక గ్రంథాల్ని బాగా ఆకళింపు చేసుకోవటాన అచ్చంగా అదే పద్ధతిలో క్రీస్తు బోధనలను వివరించటం ప్రారంభించారు. ఇది తమిళులను ఎక్కువగా ఆకర్షించినట్టు కూడా గుర్తించారు.

పెర్సివాల్ మార్గాన మిషనరీ

పెర్సివాల్‌ని అనుసరిస్తూ వాట్సన్, హూలేలాంటి కొత్త తరం బోధకులు తయారయ్యారు. పెర్సివాల్ వ్రాసిన Land Of The Vedas India Briefly Described గ్రంథంలో (1854) హైందవ ధర్మాల గురించి వివరించిన తీరు గమనిస్తే హిందూ ఆధ్యాత్మికతని ఆయన క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడని గమనించ గలుగుతాం.

వ్యక్తి తన నడతని మార్చుకుని శుద్ధ పరిశుద్ధాత్మ కలిగినవాడిగా మారినప్పుడే క్రైస్తవం లోకి అనుమతించేవాడట పెర్సీవాల్. ఈ విధానం వలన ఉన్నత జీవిగా పరిపూర్ణత్వం పొందాలంటే క్రైస్తవం లోకి రావాలనే ప్రచారాన్ని ఎక్కువగా చేశాడు. అప్పటి వరకూ ఎలా జీవించినా అప్పటి నుండీ ఉన్నతుడిగా మారి బాప్టైజ్ కావాలనే విధానాన్ని అనుసరించాడు. క్రైస్తవం స్వీకరించి Elijah Hoole గా మారిన ఒక బ్రాహ్మణ పూజారి తాను క్రైస్తవుడిగా మారటానికి పెర్సివాల్ సూచనల్ని ఏ విధంగా పాటించిందీ ఇలా వివరించాడు:

I now declined to take upon me the management of the Hindoo temple, of which my father was manager and gave over the silver and gold, jewellery and ornaments, drapery and brazen wares belonging to the temple with title deeds and other documents to the wardens of the temple who were subordinate to my father – I also relinquished the charge of all the estates of the temple – on the 15th of April 1845. I publicly renounced heathenism and was admitted a member of Christ’s visible church by the rite of baptism administered by Peter Percival.” (Modern Sannyasins, Parallel Society and Hindu Replications by Charles A. Hoole). మా నాన్నగారి నిర్వహణలో ఉన్న హిందూ దేవాలయ నిర్వహణను నేనింక ఎంత మాత్రమూ చేపట్టనని ప్రకటిస్తున్నాను. దేవాలయానికి సంబంధించిన వెండి బంగారపు వస్తువులు, ఆభరణాలు, దేవుడి వస్త్రాలు, ఇతర దేవాలయ సంబంధ వస్తుసామగ్రి, ఆలయానికి సంబంధించిన అధికార పత్రాలు, వీటన్నింటినీ మా నాన్నగారి కింద పనిచేసిన ఉద్యోగులకు అప్పగిస్తున్నాను. ఈ 1845 ఏప్రియల్ 15 నుండీ ఆలయ ఆస్తుల బాధ్యతల నుండి పూర్తిగా విముక్తుణ్ణౌతున్నాను. నేను బహిరంగంగా ఆటవిక ఆలోచనలతో కూడిన మతాన్ని వదులుకుని అందరికీ చేరువగా ఉన్న చర్చిలో సభ్యుడినయ్యాను. పీటర్ పెర్సివాల్ గారి ద్వారా బాప్టిజం పొంది ఉన్నాను ఇలా ప్రకటించాడాయన.

అధికారుల ఒత్తిడి

ఇంత ఖచ్చితత్త్వంతో మనసా వాచా కర్మణా క్రీస్తుని నమ్మి క్రైస్తవంలోకి రావాలనేది పెర్సివాల్ పెట్టిన నియమం. ఇలాంటి నియామాలు పెడితే క్రైస్తవ స్వీకర్తల సంఖ్య పెరగదని మిషనరీ సంస్థ ప్రముఖులు పెర్సివాల్ విధానాన్ని విమర్శించసాగారు. తాము ఇలా హిందూ భూమి మీద కాలు మోపగానే తండోపతండాలుగా జనం అలా వచ్చి చేరిపోతారనేది అత్యాశ అని Comprehensive Tamil and English Dictionary” గ్రంథంలో Miron Winslow పేర్కొన్నాడు. జాఫ్నాలో తమిళులు క్రైస్తవులుగా మారటం తేలికైన విషయం కాదంటూ జాఫ్నాలోని ఊడూవిల్లిలో తన అనుభవాలను అమెరికన్ బోర్డుకి మిరాన్ విన్‌స్లో వివరిస్తూ ఒక నివేదిక పంపాడట. పెర్సివాల్ సహా చాలా మంది ఇతర మిషనరీ ప్రతినిధులు ఇదే మాట చెప్పటంతో లండన్ మిషనరీ అధికారులు కొంత మెత్తబడ్డారు.

Modern Sannyasins, Parallel Society and Hindu Replications గ్రంథంలో పెర్సివాల్‌కి సమకాలీనంగా బట్టికలోవాలో బోధకుడిగా ఉన్న Ralph Scott గురించి కొన్ని వివరాలందించింది. అతను 1840-1847 మధ్య కాలంలో బట్టికలోవ అడవుల్లో పరమ అడవి మనుషులుగా జీవించేవారిని, కొండగుహల్లో నివసించే ఆదిమవాసుల్ని, జంతువులకన్నా హీనంగా జీవించే మనుషుల్ని క్రైస్తవం లోకి తెచ్చాడట. అలా చెయ్యాలని పెర్సివాల్ మీద పై అధికారుల ఒత్తిడి సహజంగానే వచ్చింది. కానీ, పెర్సివాల్ అలాంటి అట్టడుగు మానవుల్ని తాత్కాలిక ఆకర్షణల ద్వారా కాకుండా, చదువు నేర్పి ఙ్ఞానవంతుల్ని చేయటం ద్వారా క్రైస్తవుడిగా మార్చాలంటూ, విద్యాలయాల నిర్మాణం పై దృష్టి సారించాడు.

1834లో జాఫ్నాలో మగపిల్లకు సెంట్రల్ స్కూల్‌ని, ఆడపిల్లలకు బోర్డింగ్ స్కూల్‌ని, కొన్ని శిక్షణా సంస్థల్ని నెలకొల్పాడు. “Scott and Percival were not divided on the question of ultimate aim, which was conversion to Christianity. But they were sharply divided on the question of short-term aims and methods” అని ఈ గ్రంథం పెర్సివాల్ పనితీరుని సమర్థించింది. అడ్డదారుల్లో మతమార్పిడులు శాశ్వత ప్రయోజనాన్ని ఇవ్వలేవని పెర్సివాల్ వాదించాడని తాత్పర్యం!

విద్యాదానం

శ్రీలంక విషయానికొస్తే అంతకుమునుపు పోర్చుగీసులు డచ్చివాళ్లూ శ్రీలంకలో జనసామాన్యం మీద జరిపిన దౌష్ట్యాలు ఇంకా అక్కడి ప్రజల ఙ్ఞాపకాల్లో ఒక పీడకలగా నిలిచే ఉన్నాయి. అందుకనే, సేవా మార్గాన స్కూళ్లూ, ఆసుపత్రులు, శిక్షణా సంస్థలే క్రైస్తవాదరణ పెంచగలవనే అభిప్రాయానికొచ్చాడు పెర్సివాల్. సువార్త, ఆహారదానం ఇవి రెండూ విస్తృతంగా జరగాలని ఆయన గట్టిగా సూచించాడు.

ఇక్కడ ఏ తమిళుడైనా నా బోధనని వింటావా అనడిగితే నాకు తింటానికి బియ్యం ఇస్తావా?’ అని ఎదురు అడుగుతాడుఅని వివరించాడట. పరిశుద్ధాత్మ గురించి మనం చెప్తుంటే కడుపు నిండటం గురించి వాళ్లు ఆలోచిస్తున్నారన్నాడు.

జోసెఫ్ నైట్ అనే బోధకుడు 1818లో తొలి బోధకుడుగా జాఫ్నా వచ్చాడు. ఆయన ఎవరింటికైనా వెడితే చాలు, ఆ ఇంట్లో వాళ్లు ఇంటిని శుద్ధి చేసుకుని బావి దగ్గర స్నానం చేసేవాళ్లట. బోర్డింగ్ స్కూళ్ళలో చేరిన విద్యార్థులు కూడా స్నానం వగైరా శుద్ధి పాటించేవాళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో పెర్సివాల్ లండన్ మిషనరీలు ఆశించిన స్థాయిలో క్రైస్తవుల సంఖ్యని పెంచటం కష్టంగానే భావించాడు. “It is not from the priesthood that they have anything to fear, but from the Brahmanical system, coupled with the Oriental aversion to change and the cementing influence of caste.” (Quoted in Tennent, Christianity. 164-165) అని పెర్సివాల్ అభిప్రాయపడ్డాడు.

అలాంటి స్థితి నుండి పెర్సివాల్ నెలకొల్పిన విద్యా సంస్థల్లోకి విద్యార్థులు క్రమేణా చేరటం, పెర్సివాల్ బోధనలను వినేవారి సంఖ్య పెరుగుతూ రావటం ఇవన్నీ పెర్సివాల్ వ్యక్తిత్వం వలనే సాధ్యం అయ్యాయి. గడియారాలు అందుబాటులోకి రావటంతో ఒక టైంటేబుల్ ప్రకారం విద్యార్థి చదవటం, నిమిషాలు సెకన్ల ప్రకారం వ్యవహరించటం జనానికి బాగా నచ్చాయి. సమయపాలన అనేది క్రమశిక్షణలో ఒక భాగం అయ్యింది. సర్వజన సమానత్వం అనేది దక్షిణభారత దేశంలోకన్నా ముందుగా శ్రీలంకలో ప్రారంభం కావటానికి పెర్సివాల్ సహన పూర్వకంగా అనుసరించిన విధానాలే కారణంగా మిషనరీ సంస్థలు గుర్తించాయి.

జాఫ్నా బైబిల్ రచన

మిషనరీ విద్యాసంస్థల కృషి వలన ఆంగ్లం బాగా నేర్చి, క్రైస్తవ భావజాలం కలిగిన తమిళ పండితులు ఎక్కువ కాసాగారు. సైన్సు, ఫిలాసఫీ, మతం, చరిత్ర గ్రంథాలు తమిళంలోకి అనువాదం అయ్యాయి. 1832లోనే జాఫ్నా బైబిల్ సొసైటీ బైబిల్ తమిళ అనువాదం పనిని చేపట్టవలసిందిగా పెర్సివాల్‌ని కోరింది.

కింగ్ జేమ్స్ బైబిల్ని కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ (The King James VersionKJV) అని కూడా పిలుస్తారు. ఆధునిక ఆంగ్ల భాషలోకి చేసిన అనువాద గ్రంథం ఇది. ప్రొటెస్టంట్ సంస్కరణ సమయంలో దీన్ని ఇంగ్లండ్ చర్చి అధికార గ్రంథంగా (authorized version -AV) పరిగణించారు. 1611లో అప్పటి ఇంగ్లండు చక్రవర్తి ఆరవ కింగ్ జేమ్స్ ఇంగ్లండ్ చర్చి కోసం ఈ ఆంగ్లానువాదం చేయించాడు. ఇందులో ఓల్డ్ టెస్టమెంట్ 39 పుస్తకాలు, అపోక్రిఫా (క్రీ.పూ. 200-400 మధ్య కాలం నాటి కథలు-14పుస్తకాలు), న్యూ టెస్టమెంటు 27 పుస్తకాలు మొత్తం 80 పుస్తకాల సంపుటి ఇది. ఆంగ్లం మాట్లాడే జాతుల సంస్కృతీ వికాసం ఈ పుస్తకంలో ప్రముఖంగా కనిపిస్తుంది. పరమ పవిత్రగ్రంథంగా ఈ కింగ్ జేమ్స్ వెర్షన్ బైబుల్ని పరిగణిస్తారు. దాని అనువాద బాధ్యత పెర్సివాల్‌కి అప్పగించారు.

మద్రాసు విశ్వవిద్యాలయం తొలి పట్టభద్రుల్లో ఇద్దరు శ్రీలంకలో ఈ మిషనరీ స్కూళ్లలో చదివినవారే! కర్రోల్ విశువనాథ పిళ్ళే తరువాత మార్నింగ్ స్టార్ అనే ఇంగ్లీషు, తమిళ భాషల్లో వెలువడే పత్రికకు సంపాదకుడయ్యాడు. జె.ఆర్. ఆర్నాల్డ్‌గా ప్రసిద్ధుడైన ఎ. సదాశివమ్ పిళ్ళై లాంటి అనేకులు క్రైస్తవంలోకి మారినవారే! సదాశివమ్ పిళ్ళై మూడేళ్ళ వయసులో క్రైస్తవం తీసుకున్నాడట.

1834లో తొలుతగా జాఫ్నా సెంట్రల్ స్కూలు అలాగే, బాలికల కోసం వేయంపడి బాలికల పాఠశాల నెలకొల్పాడు. జాఫ్నా జిల్లాలో శ్రీలంక ఉత్తరకొనలో ఉన్న పాయింట్ పెడ్రో (Paruththith-thu’rai) దగ్గర వెలేయన్ మెథడిష్ట్ బాలికల ఉన్నత పాఠశాల, హార్ట్‌లే కళాశాల ప్రారంభించాడు. 1845 నాటికి ఈ విద్యా సంస్థని బ్రిటిష్ పాలకులు మెచ్చుకుని, పెర్సివాల్కు 400 పౌండ్ల పారితోషికం ఇచ్చారు. మత ప్రచారకులకు ఇలాంటి సేవలకోసం ప్రత్యేకంగా పారితోషికాలు అరుదు. ఇంగ్లండ్ చర్చి Decon గా కూడా నియమితుడయ్యాడు. ఆ సమాజంలో డీకాన్ (దైవసేవకుడు) అనేది ఒక గొప్ప హోదా. బ్రిటిష్ మహారాణి ప్రత్యేకంగా ఆయన్ని ప్రశంసించింది కూడా!

క్రైస్తవుడిగా మారిన ఎలిజా హూలే అనే తమిళ బ్రాహ్మణుడు, హిందువుగానే ఉన్న శివతత్త్వ పరాయణుడు ఆరుముగం అనే ఆరుముఖ నావలర్ ఈ ఇద్దరూ పెర్సివాల్‌కు అసిస్టెంట్లుగా సహకరించారీ విషయంలో!

1850లో జాఫ్నాలో కింగ్ జేమ్స్ బైబిల్ గ్రంథానికి తొలి తమిళ అనువాదం ప్రచురించాడు. ఇది పెర్సివాల్‌కు అమితమైన కీర్తి తెచ్చింది. ఒకవిధంగా ఇది పెర్సివాల్‌కి తమిళం తెలుగు భాషలు, వారి సంస్కృతుల స్వరూప స్వభావాలను అర్థం చేసుకోవటానికి ఎంతగానో ఉపకరించింది. ఈ ప్రయత్నం తెలుగు తమిళ నిఘంటువుల రూపకల్పనకు, సామెతలు జాతీయాల సేకరణకు ప్రేరేపించింది. అందుకోసం ఆయన ప్రత్యేకంగా భాషాధ్యయనం ప్రారంభించాడు.

పెర్సివాల్ లాగానే సి.పి. బ్రౌను కూడా బైబిల్ తెలుగు అనువాదం చేశాడు. 1851లో దాన్ని వెలువరించటానికి అనుమతి కోసం మద్రాసు బైబిల్ సొసైటీ కమిటీకి పంపాడు. కానీ, వాళ్లు దాన్ని తిరస్కరించారు. “కమిటీ సభ్యులు అసూయాపరులు, వాళ్లెవరికీ తెలుగు తెలియదుఅని బ్రౌన్ వ్రాశాడు. ఆ కమిటీ సభ్యుల్లో ఒక తమిళ పండితుణ్ణి కూడా బ్రౌన్ ప్రస్తావించాడు. ఆ తరువాత బ్రౌను అనారోగ్యంతో లండను వెళ్లిపోయాడు.

బ్రౌన్ వెళ్లిపోయాక ఆ అనువాదాన్ని పైపైన మార్పులు చేసి, 1860లో మెస్సర్స్ గోర్డాన్ & ప్రిచ్చెట్ట్ పేరుతో అచ్చు వేశారు. కానీ, ఎక్కడా బ్రౌన్ పేరు అచ్చు వెయ్యలేదు. “but the phraseology shows that many pages are printed from the version prepared in my house” అంటూ నొచ్చుకున్నాడు బ్రౌన్. (మణిమంజరి ఆగష్టు1994).

బ్రౌన్ ఎదుర్కొన్న సమస్యనే పెర్సివాల్ కూడా ఎదుర్కొన్నాడు. పెర్సివాల్ అనువదించిన తమిళ బైబిల్‌ని జాఫ్నా బైబిల్, పెర్సీవాల్ బైబిల్, తమిళ బైబిల్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. కానీ, లండను పెద్దలు దాన్ని తిరస్కరించారు. ఐదేళ్ల శ్రమ తర్వాత 1850లో అమెరికన్ మిషన్ ప్రెస్సు ప్రచురణగా అది వెలువడింది. కానీ, ‘టెంటేటివ్ గ్రంథంఅన్నారు. ఆనాటి రాజకీయాలకు బ్రౌనూ, పెర్సివాల్ ఇద్దరూ సమానంగానే బలయ్యారు.

జాఫ్నాలోని క్రైస్తవ తమిళులు కొందరు ఇటీవల పెర్సివాల్ గారి తమిళ బైబిల్ మీద కొత్త దాడి ప్రారంభించారు. ఆయన శిష్యుడుఆర్ముగ నావలర్వీరశైవుడు కావటాన ఈ గ్రంథం కుల దురహంకారంతో కూడుకున్నదనేది ఈ దాడి సారాంశం. ఈశ్వరుడు, పరమాత్మ లాంటి పదాలు బైబుల్లో కనిపించటానికి ఈ ఆర్ముగం కారకుడని వారి ఆగ్రహం.

పెర్సివాల్ గురించిన సమాచారం అంతా తమిళ రచయితలు వ్రాసింది లేదా తమిళ రచయితలు చెప్పిన సమాచారం ఆధారంగా ఆంగ్లేయులు రాసినవే దొరుకుతున్నాయి. అందువలన ఆయన తమిళానికి మాత్రమే సేవ చేసినవాడుగా కనిపిస్తాడు. తెలుగు నిఘంటు నిర్మాణం తెలుగు సామెతల గ్రంథరచన, తెలుగు పత్రికకు సంపాదకత్వం వహించటం ఇలాంటివి చేసిన ఆయనకు తెలుగుతో కూడా అంతటి ప్రావీణ్యం ఉందన్నది తిరుగులేని సత్యం. కానీ, తెలుగువారికి పట్టని తనం అనేది జాస్తిగానే ఉండటాన ఆయన కృషిని అప్పుడూ ఇప్పుడు కూడా ఎవరూ పట్టించుకోలేదు.

జాఫ్నాలోనే తెలుగుతో పరిచయం

పెర్సివాల్ 1852లో జాఫ్నా నుండి లండన్ వెళ్లిపోయి, 1954లో ఇండియాకి తిరిగి వచ్చాడు. వచ్చీ రాగానే దినవర్తమణి అనే వారపత్రికకు సంపాదకత్వం వహించాడు. ఈ పత్రిక తమిళంలోనూ తెలుగులో కూడా వెలువడింది. తెలుగు తెలియకుండా తెలుగుపత్రికకు సంపాదకత్వం ఎలా వహిస్తాడు? ఒక ఆంగ్లేయుడు అప్పటికప్పుడు తెలుగు నేర్చుకుని పత్రిక పెట్టడం అసాధ్యం. జాఫ్నా లోనే ఆయన తెలుగు బాగా నేర్చి ఉండాలి. నేర్పిందెవరో తెలీదు. జాఫ్నాలోనే తెలుగు నేర్చుకుని ఉంటే, అక్కడ తెలుగు ప్రజలు కూడా ఆనాడు గణనీయంగా ఉండి ఉండాలి. వారి గురించిన అధ్యయనం జరగలేదు.

శ్రీలంకలో సంచార జాతిగా జీవించే అహికుంటకలనే ప్రజలు తాము తెలుగువారిమని చెప్పుకుంటారు. తమని తెలుగువారిగానే పిలవమని వారు కోరుతుంటారు. ప్రస్తుతం వాళ్లు పాముల్ని ఆడిస్తూ, సంచార జీవులుగా పొట్టపోసుకుంటున్నారు. బాగా వెనకబడిన జాతిగా ఉన్నారు. బట్టికలోవా, జాఫ్నా ప్రాంతాల్లో వీరి సంచారం ఎక్కువ. తమిళులు వీళ్ళని కురవర్లని, ఆంగ్లేయులు సీంహళజిప్సీలని పిలుస్తుంటారు. 2008లో ఈనాడు దినపత్రిక తమ ప్రతినిధిని పంపి శ్రీలంకలోని ఈ అహికుంటికల గురించి కొంత సమాచారం సేకరించి ప్రచురించింది కూడా! బహుశా జాఫ్నాలోని ఈ తెలుగువాళ్లని పెర్సివాల్ స్థిరనివాసం కలిగిన జీవులుగా, నాగరికులుగా మార్చటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉండాలి. లేకపోతే ఆయనకు శ్రీలంకలో తెలుగు భాషతో పరిచయం అసాధ్యం. తమిళంతోపాటు తెలుగునూ అభిమాన విషయంగా చేసుకోవటానికి పెర్సివాల్‌కి జాఫ్నాలో సహకరించింది ఎవరనేది ఎక్కడా రికార్డు కాలేదు.

నావలర్ లాంటి తమిళ పండితులకు తెలుగుతోనూ పరిచయం ఉండి ఉండవచ్చు కూడా! ఈ అనుమానానికి ఒక ఆధారం ఉంది. అహికుంటికలనే తెలుగువారు వీరశైవులు. నవాలార్ కూడా పరమ శివభక్తుడు. శైవం అహికుంటికల్ని నవలార్ని దగ్గర చేసి ఉండవచ్చు.

పెర్సివాల్ జీవిత చరిత్రని తమిళులు మాత్రమే తవ్వితీశారు. 170 యేళ్ల క్రితం తెలుగు ఆంగ్లం నిఘంటువు వ్రాసినా ఆయన్ని తెలుగువారు పట్టించుకోకుండా వదిలేరు. అందుకనే ఆయన జీవితంలో తెలుగుకు సంబంధించిన చారిత్రక అంశాలేవీ వెలుగులోకి రాలేదు. ఆయన రూపొందించిన తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, ఆయన అనేక సంవత్సరాలు నడిపిన దినవర్తమణి పత్రికలు మాత్రమే ఈ తెలుగు సూర్యుడి జీవితానికి ఆధారాలుగా మిగిలున్నాయి. ఇవి తక్కువ సాక్ష్యాలేమీ కాదు.

నావలర్ కథ

నల్లూరు ఆరుముగం పిళ్లే అనే ఆరుముక నావలర్(1822-1879)

నావలర్ పెర్సివాల్‌కి ఇష్టశిష్యుడు. వెల్లలార్ అనే వ్యవసాయదారుల సామాజిక వర్గానికి చెందినవాడు. క్రైస్తవ రచనల తమిళ అనువాదానికి పెర్సీవాల్‌కి సహకరించినవాడు. పెర్సివాల్ ప్రిన్సిపాల్‌గా ఉన్న వెస్లేయన్ సెంట్రల్ స్కూల్లో 1834లో ఇంగ్లీషు చదివాడు. ఈ స్కూలే తరువాత జాఫ్నా సెంట్రల్ కాలేజీగా మారింది. చదువయ్యాక ఆ స్కూల్లోనే 1838లో ఉపాధ్యాయుడిగా చేరే అవకాశం ఇచ్చాడు పెర్సివాల్. ప్రాధమిక విద్య చదువుకునేవారికి ఆంగ్లాన్ని, హైస్కూల్లో చదువుకునే వారికి తమిళాన్ని బోధించేవాడు. 1841లో బైబిల్ అనువాద సంఘంలో అసిస్టెంట్‌గా పనిచేయటానికి కుదిరాడు.

విబూధి రేఖలు ధరించి నడిచే శివుడిలా బోర్డింగ్ స్కూలుకి వెళ్లి పాఠాలు చెప్పేవాడు. ఇతని వేషభాషల్ని చూసి మిషనరీ పెద్దలకు మొదటి నుండీ అనుమానమే! క్రీస్తు గురించి ఆయనకు ఎంత తెలుసో ఈశ్వరుడి గురించి కూడా అంత బాగానూ తెలుసు. కానీ, ఏసు వెనుక వెళ్ళటానికి సిద్ధపడలేదు. అలాగని ఏసు పట్ల ద్వేషం కూడా ప్రదర్శించలేదు.

పెర్సివాల్ జాఫ్నా వదలి వెళ్ళక మునుపే తన మిషనరీ ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. రెట్టింపు జీతం ఇస్తానని ఉద్యోగంలో కొనసాగమని పెర్సివాల్ కోరినా ఆయన అంగీకరించలేదు. కానీ, పెర్సివాల్‌తో సత్సంబంధాలు ఆజన్మాంతం కొనసాగించాడు. అతనిలోని నిర్మలమైన భక్తిని పెర్సివాల్ ఇష్టపడటమే ఇందుకు కారణం.

శ్రీలంకలో శైవప్రవర్తకుడుగా నావలర్ ప్రసిద్ధి పొందాడు. నావలర్ అంటే బోధకుడు అని! పెర్సివాల్ జాఫ్నా నుండి నిష్క్రమించిన తరువాత నావలర్ హిందూ పాఠశాలల్ని నెలకొల్పాడు. శైవ పాఠశాలలుగా అవి ప్రసిద్ధి పొందాయి. పెర్సివాల్ వద్ద చదువుకున్నవాడు కాబట్టి, బైబిల్ గురించిన పూర్తి పరిఙ్ఞానం ఉన్నవాడు కాబట్టి, శైవ సాహిత్యంతో తులనాత్మక అధ్యయనం చేయటానికి ఆయనకు బాగా వీలు కుదిరింది. అందువలన ఆయన క్రైస్తవ మిషనరీలను ప్రతిఘటించి వారితో తర్కం, వేదాంతం మొదలైన విషయాలమీద వాదనకు తలపడేవాడు. ఏకపక్షంగా మతమార్పిడులు జరక్కుండా సమర్థవంతంగా ఎదుర్కోగలిగాడు. బైబిల్ అనువాద సమయంలో అచ్చు యంత్రంతో ఏర్పడిన పరిచయం వలన శైవ సాహిత్యాన్ని అచ్చువేసి ప్రచారం చేశాడు. శైవ మార్గాన అక్కడి ఆదిమజాతి ప్రజల్ని విద్యావంతుల్ని, చైతన్య వంతుల్ని చేయటానికి పూనుకొన్నాడు. జాఫ్నాలో మరొక సంస్కర్తగా ఆయన ఎదిగాడు.

బహుశా పెర్సివాల్ క్రైస్తవ ప్రచారానికి అనుసరించిన మార్గం, ఆయన శిష్యుడిగా తాను పొందిన అనుభవాలు ఈ విషయంలో అతనికి బాగా ఉపకరించి ఉంటాయి. జాఫ్నాలో పెర్సివాల్ వదలి వెళ్లిన సంస్కరణ కార్యక్రమాల్ని శైవమార్గంలో నావలర్ కొనసాగించాడు. ఒక సంస్కర్తగా ప్రసిద్ధి పొందాడు. సన్యసించి, శంకరాచార్య మార్గాన్ని అనుసరించాడు. మఠాలు నెలకొల్పాడు. శైవప్రకాశ విద్యాలయాలను స్థాపించాడు. ఈ మఠాల్ని క్రైస్తవ మిషనరీల విధానంలో టైంటేబుల్ పాటించటం లాంటి విధానాల్లో నడిపించాడు. వాడుక తమిళంలో పాఠ్యపుస్తకాలు తయారు చేశాడు. క్రిస్టియనైజేషన్‌కి వ్యతిరేకంగా శాంస్క్రిటైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాడని నావలర్ గురించి తమిళ చరిత్రకారులు వ్రాశారు. కులవ్యవస్థకి వ్యతిరేకంగా నిలబడ్డాడు. నావలర్ విధానాలకు బ్రాహ్మణులు అధిక సంఖ్యలో మద్దతిచ్చి అతని సన్యాస విధానాన్ని సమర్థించటం విశేషం.

‘ది లాండ్ ఆఫ్ వేదాస్’ రచన

జాఫ్నాలో పాతికేళ్లు గడిపి, తన కల అనదగిన బైబిల్ అనువాదాన్ని పూర్తి చేశాక ఇంక పెర్సివాల్‌కి తన ద్వారా నెరవేరవలసిన ఇతర కార్యాలెన్నో ఉన్నాయనిపించింది. ఎప్పటినుండో తెలుగు తమిళ భాషల కోసం పాటుపడాలనే బలమైన కోరిక ఆయన్ని ఆ దిశగా మార్పుకోసం ప్రేరేపించసాగింది. క్రీస్తు పట్ల తన నమ్మకంలో మార్పులేనప్పటికీ, ఎల్లకాలం మతప్రచారకుడిగా జీవించటానికి ఆయన మనసు అంగీకరించ లేదు. జాఫ్నాలో 22 యేళ్లు, కలకత్తాలో మూడేళ్లు వెలేయన్ మిషనరీతో ఉన్న అనుబంధం తెంచుకుని లండను వెళ్లిపోయాడు.

విద్యారంగం మీద ఉత్సాహంతో 1852లో సెయింట్ ఆగస్టీన్స్ కాలేజీ (కాంటర్బరీ)లో ఆచార్యుడిగా చేరాడు. ఆ రోజుల్లో విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ కళాశాల ఒక శిక్షణాలయంగా ఉండేది. 1854లో ఇంగ్లండులోని వివిధ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల ఆహ్వానం మీద సందర్శకాచార్యుడిగా భారతీయ సంస్కృతి గురించి ఉపన్యాసాలిచ్చాడు. ఈ ఉపన్యాసాల్నిLand Of The Vedas: India Briefly Describedపేరుతో పుస్తకంగా ప్రచురించాడు. లండన్ విశ్వవిద్యాలయం దానికి డాక్టరేట్ ప్రదానం చేసిందని చెప్తారు.

లండన్‌లో ఆయన ఎక్కువ కాలం ఇమడలేకపోయాడు. ఆయన మనసు ఇండియా వైపే లాగుతోంది. తమిళ తెలుగు భాషల కేంద్ర స్థానమైన మద్రాసులో స్థిరపడాలనే గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇండియా వచ్చి, 1854-56 మధ్యకాలంలో ఎస్.పి.జి.(Society for the Propagation of the Gospel in Foreign Parts) మిషనరీ సభ్యుడిగా చేరాడు. 1856లో ఆ పదవిని కూడా వదిలేసి మద్రాస్ డయాసీస్‌లో చర్చి ఆఫ్ ఇంగ్లాండ్ ప్రీస్ట్గా నియమితుడయ్యాడు. అదే సమయంలో ఆయన కుమారుడు శామ్యుయేల్ పెర్సివాల్ అక్కడ డీకాన్‌గా నియమితుడయ్యాడు. తండ్రీ కొడుకులకు ఒకేసారి ఒకేచోట ఉన్నత పదవులు లభించటం విశేషం. మైలాపూర్ సెయింట్ థామస్ అధికార ప్రతినిథిగా (Incumbent) కూడా పెర్సివాల్ వ్యవహరించాడు. తరువాత మద్రాసు ప్రెసిడేన్సీ కాలేజీలో దేశీయభాషల ఆచార్యుడిగా పనిచేశాడు. ప్రెసిడెన్సీ కాలేజిలో సంస్కృత ఆచార్యుడుగా పనిచేశాడు. ఈ విధంగా ఆయన సంస్కృతం, బెంగాలీ, తెలుగు, తమిళ భాషల్లో ఆరితేరిన ఆచార్యుడయ్యాడు.

(సశేషం)

Exit mobile version