[శ్రీ కోవెల సుప్రసన్నాచార్య రచించిన ‘మనుచరిత్ర – వేయిపడగలు ప్రాగ్రూప పరిశీలన’ అనే ప్రత్యేక వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]
దక్షిణాపథంలో కాకతీయ రాజ్యం, ఇతర రాజ్యాలు ఇస్లాం దండయాత్రల వల్ల పడిపోయిన తర్వాత ఒక సంక్షోభం తలెత్తింది. హిందూ ధర్మాన్ని ఏదో విధంగానైనా తిరిగి నిలబెట్టవలెననే ఆకాంక్ష అన్ని వర్గాలలోనూ ఎగిసిపడుతున్న సమయమది. విద్యారణ్యులు ఈ ఉద్యమంలో ప్రధాన వ్యక్తి. ఆయన విజయనగర సామ్రాజ్య స్థాపన చేయటం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అంతకుముందే మత పరివర్తన చెందిన హిందూ సేనానులను తిరిగి హిందువులుగా మార్చివేసే సాహస సఫల ప్రయత్నం చేశారు. హరిహర బుక్కరాయల ఆధ్వర్యంలో సామ్రాజ్యం స్థాపించడమే కాక శాశ్వతమైన మూల ద్రవ్యంగా వేదాలకు భాష్యం నిర్మించే ప్రయత్నం ప్రారంభించారు. 50 మందికి పైగా వేదవేదాంగవేత్తలను సమీకరించి వారి సహాయంతో అవిరళంగా ఈ కార్యాన్ని కొనసాగించారు. ఈ సందర్భంలోనే రాచకొండ, కొండవీడు మొదలైన రాజ్యాలు తమ పాలుగా సాంస్కృతిక, ఆర్ష సంబంధమైన కార్యాలను కొనసాగించాయి.
ఈ కాలంలోనే శ్రీనాథుడు ‘ధరియింపనేర్చిరి దర్భపెట్టెడు వ్రేళ్ల లీల మాణిక్యాంబులీయకములు’ ఇత్యాది వర్ణనల్లో ఆహితాగ్నులైన వేద పండితుల కుటుంబాలు ఎట్లా సంపన్నమైనవో విస్తారంగానే చెప్పారు. ‘అంగోద్వర్తన వేళ నీవు దరహాసాంకురముల్ చూసి నా అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా’ అని ప్రశ్నించినప్పుడు ఆమె తన కొడుక్కి ఈ అంగుళీయకాన్ని గారాబంగా ఇచ్చినట్టు తెలియవస్తున్నది. ఈ విధంగా తరువాతి తరాలలో ఆహితాగ్నుల కుటుంబాలలో లాలస, కాముకతలు యథేచ్ఛగా ప్రవేశించాయి. గుణనిధి నుండి నిగమశర్మ కథ దాకా ఈ వివేక భ్రష్ట సంపాతములు జరుగుతూ వచ్చాయి.
ఈ అల్లకల్లోలాన్ని ఆపి వేయడానికి ఆర్షమైన జీవన మార్గాన్ని నిర్దేశించడానికి తెలుగు సాహిత్యంలో ఒక మహా పురుషుడు అవతరించాడు. అతని పేరు అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర ఈ మొత్తం యుగానికి మూలమైన దీపస్తంభం వంటిది. ప్రవరుడు ఒక ఆదర్శమైన, సంపన్నమైన, అధ్యయన, అధ్యాపన నిరతమైన అపరిగ్రహ హృతమున్న ఒక పరంపరకు చెందిన వాడు. ఆయన అగ్ని ఉపాసన ఎంత గొప్పది అంటే, ఎంతగా తీర్థయాత్రలు చేయవలెననే కోరిక ఉన్నా వాటిని అణచుకొని అగ్నిహోత్ర ఉపాసనకే పరిమితమైనవాడు. ఆయన జీవితంలో ఒక సిద్ధుడు ప్రవేశించడం, ఆ సిద్ధుడు తన శక్తుల చేత తీర్థయాత్రలన్నీ చేయగలగటం తెలుసుకొని, తానూ అలా తీర్థయాత్రలు చేయవలెనని ఉబలాటపడ్డాడు. బదరికాది క్షేత్రాలు దర్శించాడు. కానీ, ఆయనకు ఒక చిక్కు ఎదురైంది. మానవుల కంటే అతీత శక్తులు కొన్ని ఉన్నా, దేవజాతి స్త్రీ అయిన వరూధిని, ఆయన మీద మోహం ప్రకటించి పొందు కోరింది. ప్రవరుడికి ఇంతకు ముందటి దీక్షకు ఎదురుగా లాలస వచ్చింది. ప్రవరుడు చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. కామమే కోరదగిన పదార్థమని ఆమె ప్రతిపాదించగా, పైబడగా అతనిలోని భీరుడు బయటకుచ్చిఆమెను త్రోసి, తానుపాసించిన అగ్ని సహాయముతోనే ఇల్లు చేరుకున్నాడు. ఇక్కడ ప్రవరుడు చెప్పిన ‘దివిషడ్వర్గము నీ ముఖంబునన ప్రీతిన్ దాల్చు’ అన్న పద్యం.. వేదాలలోని రహస్యమైన అగ్ని సూక్తాలను, వాటి తాత్పర్యాన్ని తెలియజేస్తుంది. ఆధునిక కాలంలో శ్రీ అరవిందులు hymns to mystic fire అన్న గ్రంథంలో ఈ మంత్రముల లోతులను వెల్లడించారు.
ఉపనిషత్తులతో రుషికల్పులైనవారు ‘యత్రధీరాః పరిజానంతి యోనిమ్’ అనగా ఇక్కడ ధీరులనగా జ్ఞానులు, స్థిత ప్రజ్ఞులు. వీరు అంతర్ముఖత్వము చేత సృష్టి మూలాలను రహస్యాన్ని తెలుసుకుంటారు. ఇక్కడ ధీర శబ్దము వాడటం రుషులతో సమానులని చెప్పటం తాత్పర్యం. తైత్తిరీయ ఉపనిషత్తులో ఆనందవల్లిలో ఆనందానుభవం ప్రమాణమును నిర్ణయిస్తూ తొలి దశ అయిన మనుష్యానందమునకు ప్రమాణముగా ఒక వ్యక్తి నిర్ణయింపబడ్డాడు. ఇక్కడ ప్రవరుడు ఆనందవల్లి చెప్పిన మనుష్యానందమునకు ప్రమాణమైన వ్యక్తికి ప్రతీకగా సృష్టింపబడ్డాడు.
మనుచరిత్రలోని కథనం ధర్మమునకు, కామమునకు నడుమ జరిగిన సంఘర్షణే. ఆధునిక కాలంలో త్రోసుకు వస్తున్న పాశ్చాత్య నాగరికతా ప్రభావంతో గుడిపాటి వెంకటాచలం లాంటి వారి సాహిత్య సృజనతోపాటు, ఆర్ష ధర్మ భావనకు విరుద్ధంగా త్రిపురనేని రామస్వామి, నార్ల వెంకటేశ్వరరావు, ముద్దు కృష్ణ లాంటి వారి రచనలు ఒక భూకంపం వంటి స్థితిని కలిగించాయి. ఈ స్థితి నుంచి నేటి సాహిత్య చైతన్య సుదర్శన చక్ర సంచాలకులుగా విశ్వనాథ సత్యనారాయణ ఎదిగి వచ్చాడు. నర్తనశాల కావచ్చు, ఏకవీర కావచ్చు, కిన్నెరసాని పాటలు కావచ్చు, చెలియలి కట్ట కావచ్చు, వేయిపడగలు కావచ్చు.. ఆయన గ్రంథజాలమంతా వివాహమును.. చేతోమోహ కుర్యానదీ మర్యాదాకృతి తీర్చు యోగము (రామాయణ కల్పవృక్షం) గా భావించినవే. చేతోమోహ కుర్య హద్దులలో నడుచుకున్నప్పుడు ఆ జీవుడు దానిని యోగముగా కొనసాగించి చివరకు ముక్తిని పొందెదరు. వివాహమునకు పారమార్థికమైన ప్రయోజనమును ఇంత స్పష్టంగా ప్రతిపాదించిన వారు మరెవరైనా ఉన్నారేమో నాకు తెలియదు.
విశ్వనాథ రచనలకు ముఖ్యముగా వేయిపడగలను, మనుచరిత్రను ఒక ప్రాగ్రూప పరిశీలనగా స్వీకరించినప్పుడు దీని రహస్య మూలాలు వ్యక్తం కాకుండా ఉండవు.
నవల ఆరంభంలో రామేశ్వరశాస్త్రి నాలుగు వర్ణముల వారిని వారి వారి వృత్తులలో నిలబెట్టుటకు ప్రయత్నించి క్వాచిత్కముగనే సాఫల్యం పొందాడు. ఎక్కువ సందర్భములలో విఫలమయ్యాడు. వర్ణాశ్రమ ధర్మాన్ని నిలబెట్టడంలో కొంతవరకు ధర్మారావులలోను, చాలా వరకు గిరికలోను ఆయన సంకల్పం సఫలమైనట్టు గోచరిస్తుంది. హరప్పనాయుడు, తండ్రి మార్గమునుండి బయటకు వచ్చి ముంచుకుని వచ్చుచున్న పాశ్చాత్య నాగరికతా ప్రవాహ తీవ్రతను తట్టుకొని ధర్మ మార్గమునకు చేరుకొని దానిలో ముక్తి బిందువు వరకు ప్రయాణించి గలిగినాడు. మంగమ్మ పాత్రలో కామ భావ ప్రవృత్తికి లొంగిపోయి, అర్థ కామములకు దాస్యము చేయుట కొంతవరకు వరూధినికి సమానమైన లక్షణమని చెప్పవచ్చు. మాయా ప్రవరుడు ఉన్నది ధర్మేతరమైన కామము కోసం. తాను వాంఛలు తీర్చుకొనుటకు ఎన్ని పిచ్చి వేషములు వేయగలడో ఈ పాత్ర నిరూపిస్తుంది. స్వరోచి బహుభార్యాత్వ లక్షణమును పక్షుల చేత వెక్కిరింప జేసి ఆధునిక కాలంలో మనిషి ఎంతగా పతనమైనాడో తెలియజేస్తుంది. ఈ విధంగా కొన్ని వైరుధ్యములను పక్కకు పెట్టినను ప్రధాన భావముల మధ్య సామ్యము సిద్ధించుచున్నట్లు మనకు గోచరిస్తున్నది.
పెద్దన 16వ శతాబ్దంలో చెప్పిన అంశము సంప్రదాయ మార్గముననే నడిచినది. కానీ, వేయిపడగలు ఆధునిక ప్రపంచం యొక్క విస్తృతిని, వైవిధ్యమును, వైరుధ్యాలను కూడా వాడిగా వేడిగా సాగిన చర్చలతో వ్యాఖ్యానించింది. చివరకు భారతీయ వ్యవసాయ మార్గము పాశ్చాత్య భావ సంపర్కము చేత ఎట్లు అతలాకుతలమైందో పసరిక మరణం ద్వారా సూచింపబడింది. అట్లాగే పారిశ్రామిక విప్లవం తర్వాత మనిషి నాగరకత పేరుమీద ప్రకృతిని విధ్వంసం చేస్తూ తన జీవన మార్గమును ఎట్లా విషమయం చేసుకుంటున్నాడో పృషన్నిధి, ఆదివటం కథ నిరూపించింది. మన సంస్కృతి యొక్క పరమార్థం వినోదము కాదని, మోక్షమే దాని లక్ష్యమని గిరిక జీవిత చరిత్ర తెలియజేస్తుంది. అందువల్లనే కళాసాధన మార్గం ఎంత మధురమైనదో తెలియజేయుటకు ఈ నవలలోని 29వ అధ్యాయం ఒక మహాకావ్యం వలె, ఒక భవభూతి నాటకం వలె కొనసాగింది. మనుచరిత్రలో కామభావ ప్రాధాన్యం, కామభావ విస్తృతి వరుసగా వరూధిని, మాయా ప్రవరుడు, స్వరోచి అన్న పాత్రల ద్వారా విస్తారముగా చెప్పబడినా, చివరకు స్వరోచి తన తప్పును తెలుసుకొని ధర్మ మార్గమునకు చేరుకోవటం, ధర్మారావు పాత్రకు సమగ్ర సంస్కృతిమీద కల అభిమానము, అధికారము… అతని అంతశ్చేతనలో గల గురుభావము ద్వారా ధర్మ పద్ధతిలోనికి పరివర్తన చెందటం నవల లక్ష్యాన్ని మనుచరిత్ర లక్ష్యంతో ముడివేస్తుంది.
కోవెల సుప్రసన్నాచార్య ప్రఖ్యాత కవి, విమర్శకులు. పలు గ్రంథకర్త. శ్రీ అరవిందో తత్వ చింతానామృత పానమత్తుడు. ప్రౌఢ గంభీరం వారి కవితా విమర్శ.