[బాలబాలికల కోసం ‘మంత్రఫలితం’ అనే కథ అందిస్తున్నారు పి. రాజేంద్రప్రసాద్.]
దక్షుడనేవాడు తన ఊరైన రామాపురం లోనే కాక చుట్టు పక్కల పది పదిహేను ఊళ్లలో మంచి హస్తవాసి గల వైద్యుడిగా పేరు పొందాడు. నిజానికి దక్షుడి కుటుంబం వైద్యుల కుటుంబం కాదు. అతడి తండ్రి రామయ్య వ్యవసాయదారుడు. పది ఎకరాల కొండ్ర ఉన్నా కొడుకు దక్షుడు చదువుకొని బాగా విజ్ఞానం సంపాదించి ఏ రాజోద్యోగమో చేయాలని ఆయన బాగా ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆయన అంచనాలు తారుమారై దక్షుడికి చదువుమీద అంత శ్రద్ధ కలుగలేదు. గురువులు చెప్పే పాఠాలు దక్షుడి బుర్రకెక్కక పోయేవి. పాఠశాలకు వెళుతున్నానని ఇంట్లో అబద్ధాలు చెప్పి ఊరిలోని అల్లరి పిల్లలతో కలిసి తిరుగుతూ ఉండేవాడు.
ఒక రోజున తన నేస్తాలు తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయాక పాఠశాల మూసివేసే సమయం ఇంకా మించకపోవడంతో ఏమీ తోచక అలా అలా వెళుతూ తెలియకుండానే ఊరి పక్కనున్న అడవిలోకి ప్రవేశించాడు దక్షుడు. ఆ అడవిలోని చెట్లూ, చేమలూ చూసుకుంటూ నడుచుకుంటూ పోతున్నప్పుడు అతడికి ఒక చోట ఒక పెద్ద మర్రి చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉన్న ఒక ముని కనిపించాడు. ఊరిలో అటువంటి వారిని ఎప్పుడూ చూడని అతడికి ఆ మునిని చూస్తే ఆశ్చర్యం కలిగింది. అతడు నిశ్చలంగా కదలకుండా ఏదో దైవ జపం చేస్తూ ఉండడం చిత్రంగా తోచి ఆతడినే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో ఎవరూ ఊహించని ఒక దుస్సంఘటన జరిగింది. పక్షి గుడ్ల కోసమో మరెందుకో చెట్టు పైకి పాకిన ఒక పాము పట్టు తప్పి ఆ మునీశ్వరుడి చేతిపై పడింది. పడిందే తడవుగా ఆ అదురుకు ఆ మునినే పడగెత్తి కాటు వేయబోయింది.
ఇదంతా గమనించిన దక్షుడు తటాలున ముందుకు దూకి అత్యంత ధైర్య సాహసాలతో ఆ పామును చేతితో పట్టుకొని దూరంగా విసరి వేశాడు. తపోభంగమైన ముని కళ్ళు తెరిచి జరిగిన సంఘటనను తెలుసుకున్నాడు. దక్షుడి ధైర్య సాహసాలు అతనిని అమితంగా ఆకర్షించాయి. ఆతడు అత్యంత వాత్సల్యంతో ఆ కుర్రవాడి వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నాడు. అతనిని ప్రేమతో ఆశీర్వదించి “నాయనా! నీవు ఈ రోజు నాకు ప్రాణదానం చేశావు. ఇందుకు బదులుగా నీకు నేనేదైనా ఉపకారం చేయదలిచాను. నీకేం కావాలో కోరుకో. నా తపశ్శక్తి ధారపోసి నీకు కావలసినది ఇస్తాను.” అన్నాడు. అందుకు దక్షుడు సంతోషించాడు కానీ తనలాంటి వాడి కోసం ఆ ముని తన తపశ్శక్తి ధారపోస్తాననడం అతనికెందుకో నచ్చలేదు.
చివరికి అతనిలా అన్నాడు “స్వామీ! మీకు ఆపద కలిగిన సమయంలో అనుకోని విధంగా నేనిక్కడ ఉన్నాను. కాబట్టి మీకు సహాయం చేయగలిగాను. నాలాంటి సామాన్యుని కోసం ఎంతో కాలంగా తపస్సు చేసిన ఫలితాన్ని నాకు ధారపోయనవసరం లేదు. మీకు ఆపద సమయంలో సహాయం చేయగలగడం నాకు ఎంతో తృప్తినిచ్చింది. ఈ విధంగానే నా జీవితమంతా ఇతరులకు సహాయమూ, సేవా చెయ్యగలిగేటట్టు ఆశీర్వదించండి.” అన్నాడు వినయంగా.
ఆ కుర్రవాడి మాటలకు ఆ మునికి మహదానందం కలిగింది. ఆయన సంతోషంతో దక్షుణ్ణి చూస్తూ ఇలా అన్నాడు. “నాయనా! ఫలాపేక్షరహితంగా నువ్వు కోరుకున్న కోరిక నాకు చాలా సంతోషాన్నిచ్చింది. నువ్వు ఒక పని చెయ్యి. రోజూ నా దగ్గరకు క్రమం తప్పకుండా వస్తూ ఉండు. ఈ అడవిలో ప్రాణాలు కాపాడేవీ, మనుష్యుల అనారోగ్య బాధల నుండి విముక్తి కలిగించేవీ అయిన అనేక వేర్లూ, వనమూలికలూ ఉన్నాయి. నీకు వాటినన్నిటినీ చూపిస్తాను. వాటితో నీవు పదిమందికీ వైద్యం చేసి నీ సేవాభిలాషను పూర్తిగా తీర్చుకోవచ్చును.”
దక్షుడు తన అదృష్టానికి ఎంతో సంతోషించి అలాగే వస్తానని ఆయనకి మాటిచ్చి ఆ రోజుకు ఆయన వద్దనుండి శలవు తీసుకున్నాడు. అయితే అతను బయలుదేరే ముందర ముని అతనిని ఈ విధంగా హెచ్చరించాడు. “చూడు నాయనా! నీవు నేర్చే ఈ వైద్య విద్య నువ్వు నిస్వార్థంగా చేసినంత కాలం నీకు మంచి ఫలితాన్నిస్తుంది. నీలో స్వార్థం ప్రవేశించిననాడు నీకు ఈ విద్య ఏ మాత్రమూ పనిచేయదు సరి కదా, మరచిపోయే ప్రమాదం కూడా ఉన్నది.” అంటూ హెచ్చరించాడు. అందుకు మనసారా సమ్మతించిన దక్షుడు ఆ మర్నాటి నుండి క్రమం తప్పకుండా అడవికి వచ్చి వారం రోజులలోనే మొత్తం వైద్య విద్యనంతా నేర్చుకున్నాడు. అతని విద్య పూర్తయిన రోజు ముని దక్షుడికి ఒక మంత్రం ఉపదేశించి, ప్రతిరోజూ వైద్యం ప్రారంభించేముందు ఆ మంత్రం ఒక సారి పఠించి ఆ విద్యను నిస్వార్థంగా ఉపయోగించమని చెప్పి పంపేశాడు.
వైద్య విద్య నేర్చుకుని వచ్చిన మరునాడే ఊళ్ళో ఒక వ్యక్తికి పాము కరిచి ప్రాణాపాయస్థితిలో ఉన్నాడన్న విషయం దక్షుడు తెలుసుకుని అక్కడికి వెళ్లి ముని చెప్పిన మంత్రం మనసారా పఠించి తన కూడా తెచ్చిన మందు వేయగానే ఆ వ్యక్తి కోలుకున్నాడు. ఇంత చిన్న కుర్రవాడు ఇలాంటి పని ఎలా చేయగలిగాడో అని ఆ ఊరి జనమంతా ఆశ్చర్యపోయారు. దక్షుడు మాత్రం ఇదంతా ముని ఆశీర్వదించి ప్రసాదించిన మంత్ర మహిమేనని నమ్మాడు. మరి కొద్ది కాలానికే ఊరంతా భయంకరమైన అతిసార వ్యాధి ప్రబలింది. దక్షుడు చూస్తూ ఊరుకోక ఇల్లిల్లూ తిరిగి ఊరిలో ఆ వ్యాధితో బాధ పడుతున్నవారందరికీ ఉచితంగా మందులిచ్చాడు. ప్రతిరోజూ మంత్రపఠనం మాత్రం మరచిపోలేదు. అతని వైద్యం ఫలించి ఊరిలో ప్రాణ నష్టమేమీ జరుగకుండా ఆ వ్యాధి పూర్తిగా సమసిపోయింది. అంతటితో ఊరిలోని జనానికి దక్షుడి వైద్యం మీద బాగా విశ్వాసం కుదిరింది. మొదట్లో ఒక్కొరొక్కరుగా వచ్చిన జనం కొద్దికాలంలోనే రోజూ అనేకమంది అతడి దగ్గరికి వైద్యానికి రాసాగారు. ఇలాగ అతడి ఖ్యాతి చుట్టుపక్కల ఊళ్లంటిలోనూ వ్యాపించింది. వయస్సులో చిన్నవాడైనా దక్షుడు వైద్యం చెయ్యడంలో గొప్ప పేరు గడించాడు. ఎంత పేరు వచ్చినా ఎటువంటి క్లిష్టమైన వ్యాధిని కుదిర్చినా అతడు మాత్రం ఎవరి దగ్గరా చెయ్యి చాచి ఇంత అని అడిగేవాడు కాదు. జనం అతనికి కృతజ్ఞతతో ఇచ్చే పండ్లూ మాత్రం వారి తృప్తి కోసం తీసుకునేవాడు.
కొన్నేళ్ళు గడిచాయి. దక్షుడికి యుక్తవయసు రావడంతో వాడి తండ్రి ఒక అందమైన అమ్మాయినిచ్చి వివాహం చేయించాడు. రత్నకుమారి ధనవంతుల కుటుంబంలోంచి వచ్చింది. ఆమె తండ్రి వ్యాపారస్థుడే కాక పరమ లోభి కూడాను. ఎవరి దగ్గర ఎంత డబ్బు ఎలా గుంజాలో బాగా తెలిసినవాడు. చిన్నప్పటి నుండీ తండ్రి, డబ్బును సంపాదించే విధానం చూస్తూ పెరిగిన రత్నకుమారికి తండ్రివలెనే ధనవ్యామోహం ఉన్నది. దక్షుడు ఏ రోగి దగ్గరా ఇంత అని డబ్బులడగకుండా వైద్యం చేయడం ఆమెకు నచ్చలేదు. ఆమె దక్షుణ్ణి తను చేసే వైద్యానికి ప్రతిఫలంగా ధనాన్ని తీసుకోమనీ, లోకమంతా అందరు వైద్యులూ చేసే పని అదేననీ రోజూ చెప్పసాగింది.
దక్షుడు మొదట్లో ఆమె మాటలను అంతగా లెక్కచేయలేదు. కానీ ఆమె తను పట్టిన పట్టు విడవలేదు. ప్రతిరోజూ భోజన సమయంలోనూ, వారి ఏకాంత సమయం లోనూ కూడా అదే విధంగా పోరసాగింది. చెప్పగా చెప్పగా ఇక విసుగెత్తి భార్య తృప్తి కోసం దక్షుడు తను చేసే వైద్యానికి ధనం తీసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. కానీ తనంతట తాను వ్యాధిగ్రస్థుల దగ్గరనుండి తీసుకోలేక, వసూలు చేసే పనికి భార్యనే నియోగించాడు. ఆమె మరింత సంతోషించి రోగుల వద్ద ముక్కు పిండి ధనాన్ని వసూలు చేయసాగింది. ఇలాగ ధనాన్ని వసూలు చేయడంతో వారి ఇంట ధనం చేరింది. అయితే ధనం పెరగడంతో పాటు దక్షుని వైద్య పాటవం అందుకు వ్యతిరేక దిశలో సన్నగిల్లుతూ వచ్చింది. ముందులాగ రోగులకు అతనిచ్చే ఔషధాలు అద్భుతంగా పనిచేయటం లేదు. మంచి కంటే చెడు తొందరగా వ్యాపిస్తుంది కాబట్టి, దక్షుడి వైద్యానికి రోగాలు కుదరడం లేదనే మాట అత్యంత వేగంగా వ్యాపించింది. దక్షుడి దగ్గరికి వైద్యం కోసం వచ్చేవాళ్ళు రోజు రోజుకీ తగ్గిపోయి ఒక దశలో రోజుకు ఒకరిద్దరు కూడా రావడం మానేశారు. దక్షుడికి మనశ్శాంతి పూర్తిగా కరువయ్యింది.
ఇదిలా ఉండగా ఒక రోజు కొంతమంది విషప్రయోగం జరిగిన ఒక రోగిని దక్షుడి వద్దకు తీసుకు వచ్చారు. దక్షుడు విశ్వప్రయత్నం చేసినా గాని ఆ రోగి కోలుకోకపోగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినాడు. ఆ రోగిని తీసుకువచ్చిన జనం దక్షుణ్ణి నిందించి రోగిని వేరే వైద్యుని వద్దకు తీసుకొని పోయారు. తను కొద్ది రోజులుగా భార్యతో పాటు ధన వ్యామోహంలో పడి రోజూ వైద్యం ప్రారంభించే ముందు మంత్రజపం చేయటం లేదని అతనికి గుర్తు వచ్చింది. ఆ రాత్రి దక్షునికి విచారంతో, లేని పోని ఆలోచనలతో నిద్రపట్టలేదు. భార్య మాట విని తను రోగులనుండి ధనానికి ఆశపడడం వల్లనే ఇదంతా జరిగిందనీ, జరుగుబాటుకు లోటులేని తను వైద్యం ద్వారా ధనసంపాదన చేయబూనడం వల్లనే తన వైద్యం ఫలించడం లేదనీ తోచింది.
మరునాడతడు ఉదయమే లేచి అడవిలోకి పోయి తనకీ వైద్యవిద్య నేర్పిన ముని దగ్గరికి వెళ్లి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి జరిగిన విషయమంతా చెప్పాడు. అందుకు కొంత చింతించిన ఆ ముని దక్షునితో ఇలా అన్నాడు. “నాయనా! విచారపడకు. నువ్వు చేసిన తప్పేమిటో నీకు తెలిసింది. పశ్చాత్తాపపడ్డావు. ఏ తప్పు జరిగినా పశ్చాతాపమే అందుకు సరియైన పరిహారం. ఇప్పటికైనా నీవు మరల నిస్వార్థంగా కనుక సేవ చేయదలచుకుంటే నేను తిరిగి నీకు ఒక నివారణ మంత్రం ఉపదేశిస్తాను. నీవు ప్రతీ దినమూ వైద్యం ప్రారంభించే ముందు ఆ మంత్రం పఠించి మొదలుపెట్టు. నీకు జయం కలుగుతుంది.” అని మంత్రోపదేశం చేసి పంపేశాడు.
దక్షుడు తృప్తి పొందిన మనస్సుతో మరల తన ఇంటికి చేరి మునీశ్వరుడు చెప్పినట్టు ప్రతి రోజూ వైద్యం ప్రారంభించేముందు మంత్రం పఠించి మునుపటిలాగే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయసాగాడు. మరి కొద్ది రోజులలోనే అతని పూర్వ వైభవం తిరిగి వచ్చింది. అతడు మరల మునీశ్వరుని దర్శించుకొని “స్వామీ! మీరు చెప్పిన మంత్రం నిత్యమూ పఠిస్తూ నిస్వార్థంగా వైద్యం చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎంతో తృప్తిగా ఉన్నాను. మీకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికని మీ చెంతకు వచ్చాను. నన్ను ఆశీర్వదించండి.” అంటూ ప్రణమిల్లాడు. ముని అందుకు సంతోషించి “విజయీభవ! నాయనా! ఇకనుండి నువ్వు ఆ మంత్రం పఠించనవసరం లేదు. రోజూ నిస్వార్థంగా వైద్యం చేయి. నీకు శుభం జరుగుతుంది.” అంటూ ఆశీర్వదించాడు. దక్షుడు తృప్తి పొందిన మనస్సుతో తన ఊరికి పయనమయ్యాడు.
తను దక్షుడికి రెండు సార్లు ఉపదేశించిన మంత్రాల వల్ల కాక దక్షుని సద్బుద్ధి, దుర్బుద్ధుల వల్లనే జీవితంలో అతనికి రెండుసార్లు ఉన్నతీ, మధ్యలో అధోగతీ కలిగాయని తెలిసిన ముని మాత్రం మనసులోనే నవ్వుకున్నాడు.