[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘మనసులో రిమోటు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నిద్రేమో
తడిలేని ఎడారి
మడిలేని మొలక
కలేమో
దరిలేని ప్రవాహం
దారి తప్పిన ప్రయాణం
రాత్రేమో
వరస తెలీని చుట్టం
రమ్మనలేము పోమ్మనలేము
చూపులేమో
వెల్తురులో చిగురిస్తాయి
చీకట్లో వాడిపోతాయి
పాపం కళ్ళదేముంది
రెప్పలు తెరిస్తే మిలమిల
మూసేస్తే విలవిల
ఎవర్ని నమ్మను
కళ్ళేమో ఆకాశంలో
మబ్బుల్లేకుండా చినుకులు కురిపిస్తాయి
చూపులేమో
అరచేతిలో వైకుంఠాన్ని దర్శింప చేస్తాయి
రాత్రేమో రోజుకోసారి
వస్తూ పోతూ వుంటుంది
కలేమో
చేతికందదు చేరువవ్వదు
చిగురించదు చిరిగిపోదు
పాపం నిద్రే
అవసరమయినవాడికి అందదు
అవసరంలేని వాడిని వదలదు
అయినా
రిమోటు వాడి మనసులో దిగబడి వుంటే
ఏ మనిషయినా ఏం చేస్తాడు
నియంత్రించలేడు నిదానించనూలేడు
నిభాయించుకోవాలి అంతే
కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత