Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మనోమాయా జగత్తు-12

పోడూరి కృష్ణకుమారి గారు వ్రాసిన నవల ‘మనోమాయా జగత్తు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 12వ అధ్యాయం.

“అయితే మీరిద్దరూ కూడా నీలాంబరీ దేవిని చూడ్డానికి వచ్చారన్నమాట” అన్నాడు యోగి.

అప్పటికి అందరూ ఒకరికి ఒకరు ఎలా తెలుసో చెప్పేసుకోడం అయిపోయింది. వినాయకరావుగారి స్నేహితుడి కూతురిని ట్రీట్ చేసిన సైకియాట్రిస్టుగా యోగి పరిచయం అయ్యాడు. తరవాత తరవాత ఇద్దరి మధ్యా వయసు తేడాతో ప్రమేయం లేకుండా స్నేహం పెరిగింది. వినాయకరావు మల్లిప్రోలు వెళ్లినా, యోగి కాకినాడ వచ్చినా కలిసుకోవడం పరిపాటి. ఆ స్నేహం తోనే నీలాంబరి వచ్చినప్పుడు మీటింగయి పోయాక తనింట్లో రెస్టుతీసుకుని పొద్దున్నే కాకినాడ తిరిగి వెళ్ళమని ఆహ్వనించాడు.

“కాదు మేం నీలాంబరిని చూడ్డానికి రాలేదు” తల అడ్డంగా తిప్పింది సిరి.

అందరూ కొంచెం వింతగా చూసారు. “మరెందుకొచ్చారే అల్లరికా?” వాణి దబాయించింది. చెప్పనా? అన్నట్టు విరివైపు కొంటెగా చూసింది సిరి.

“ఎందుకొచ్చామంటే గోరింకల రామనాధాన్ని కలుసుకోడానికి” అంది విరి. అనేసి పకపకా నవ్వేసింది. సిరిక్కూడా నవ్వాగలేదు. ఇద్దరూ జరిగిందంతా పెద్ద వాళ్ళకి చెప్పారు. అందరూ తేలిగ్గా నవ్వేసారు. “ఏమీ ప్రమాదం జరగలేదు కాబట్టి ఇలా నవ్వుకుంటున్నాం. కానీ విరీ, మీ ఇద్దరినీ ఎవడైనా మోసం చేసి ఏదైనా జరిగుంటే ఏమయ్యేది?” భయంగా అంది వాణి.

“నీకేదో బాగా జనరల్ నాలెడ్జ్ ఉందనుకున్నాను. కంప్యూటర్ విజర్డ్ లాగా ఇంట్లో ఉన్నంతసేపు దాని ముందే కూచుంటావ్ ఏవేవో చదువుతావ్. తీరా చేసి నీ తెలివి తేటలింతేనా? మెడిసిన్ చదవడమంటే అలా ఏవో నాలుగు మూలికలు నూరడం, శొంఠి అరగదియ్యడం నేర్చుకుంటే చాలనుకున్నావా? దాంతో డాక్టరువైపోదామనుకున్నావా?” కొంచెం కేకలేసింది సుశీల.

“డాక్టరైపోవడం అంత తేలికనుకోలేదు కానీ ఎమ్‌బిబిఎస్ చదివే లోపల కొంచెం నాటువైద్యం కూడా నేర్చుకుందాం అనుకున్నాను” కొంటెగా ముఖం పెట్టి అంది విరి.

“తంతాను పిచ్చిగా వాగావంటే!”

“అబ్బ! అయిపోయినదానికి ఇప్పుడ బిపి తెచ్చుకోకమ్మా. ఏ ప్రమాదం జరక్కుండా నేనడ్డుకున్నాను కదా?” సిరి సుశీల కోపం తగ్గించడానికి ప్రయత్నించింది.

“నిన్ను కూడా టోపీ వేసేద్దామని చూసింది కదా. ఈ పిల్లకింత సాహసం పనికిరాదు” మొట్టికాయ వేసింది. విరి నేర్పుగా తప్పించుకోడంతో మొట్టి కాయ్ సోఫామీద వృధాగా పడిపోయింది.

“ఇంక ఊరుకో సుశీలా, దాని తప్పు అది తెలుసు కుందికదా” అంది వాణి.

“మొత్తానికి మీరు మీ అంతట మీరే ఈ సాహస యాత్ర చెయ్యాలని పూనుకోనందుకు చాలా సంతోషం. ఆడపిల్లలకే కాదు మగపిల్లలకి కూడా రక్షణ కరువైంది ఈ రోజుల్లో” అన్నాడు యోగి.

అందరూ ఒప్పుకున్నారు. కిడ్నాపులూ, చైల్డ్ ఎబ్యూజ్ మొదలైన విషయాల మీద సంభాషణ మళ్ళింది. బయటినించి మైకుల్లో భజన పాటలు ఉధృతంగా వినిపిస్తున్నాయ్. జనంగోల కూడా గాల్లో సముద్రఘోష లాగా తేలి తేలి వచ్చిచెవుల్లో పడుతోంది.

నేను మాత్రం తక్కువా అన్నట్టు బల్ల మీది సెల్ ఫోను ఘొల్లున మోగి పిలిచింది. యోగి ఫోనందుకుని నిగమ్ పేరు చూసి “హలో సార్!” అన్నాడు. “యోగి, నాకో ఇన్పర్మేషన్ కావాలి. ఏదైనా ఎమర్జెన్సీ

వస్తే మీ హస్పిటల్‌లో ఒకేసారి ఎంత మందికి వైద్యం చెయ్యలరు?” అనడిగాడు.

యోగికి నవ్వొచ్చింది “ఒక్క పేషెంటుకంటే ఎక్కువ హాండిల్ చెయ్యలేను. ఎందుకంటే ఇవాళ కాంపౌండర్ కనకరత్నం అయిపు లేడు. మా నర్స్ లీవులో ఉంది. ఇంక నలుగురు హెల్త్ వర్కర్స్‌ని కూడగట్టుకున్నా కూడా నేను చేసేదేం ఎక్కువ ఉండదు.”

“ఇప్పుడు మల్లిప్రోలులో లక్షకు పైగా జనం చేరినట్టు నా సమాచారం. ఇంకా జనం వస్తున్నారు. అవతల నీలాంబరి సన్నప్రోలు (ఊరుపేరు కల్పితం) గ్రామంలో ఉండిపోయింది. ఇంకా బయల్దేరలేదు. మల్లిప్రోలులో బహిరంగసభ ఇంకా మొదలవలేదని తెలిసి జనం లారీలు కుదుర్చుకుని ఇంకా బయల్దేరి వస్తున్నారు. ఊరిచివర మా పోలీసులతో బాటు వచ్చిన రెండు ఏంబులెన్స్‌లు పారామెడిక్స్‌తో పాటు ఉన్నాయి. చాలవేమో. ఆ ఏంబులెన్స్, పారామెడిక్స్ సాయంతో మీరెంతమందిని హాండిల్ చెయ్యగలరు?” ఆత్రంగా అడుగుతున్నాడు నిగమ్.

“జనం లక్షదాటితే నేను, మీ పారా మెడిక్సూ చెయ్యగలిగిందేమీ లేదు. పారిపోవడం తప్ప. నా సలహా ఏమిటంటే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కనీసం ఓ యాభైమందిని కాకినాడకి ఎయిర్ లిఫ్ట్ చెయ్యగలిగేలా ఏర్పాట్లు చెయ్యగలిగితే చెయ్యండి. ఇంక లేదంటే ఇక్కడ నేను తీసుకునేవి తీసుకోగా మిగిలిన కేసులు మీరు కాకినాడ వరకూ ఎలాగోలా ఇంకా ఏంబులెన్సులు ఏర్పాటు చేసి పంపాల్సిందే. అక్కడైతే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉంది, ఇతర హాస్పిటల్సూ ఉన్నాయి”

“సరే. మీ సలహా బాగుందికానీ, చూడాలి వీలవుతుందేమో. ముందు ఇంకా వీలయినన్ని ఏంబులెన్సులు, డాక్టర్లనీ రెడీ చెయ్యాలి” నిగమ్ ఫోన్ కట్ చేసాడు.

“ఇంకా నీలాంబరి ఊళ్ళో అడుగుపెట్టినట్టు లేదు” అన్నాడు వినాయకరావు.

వాణి, సుశీల తాము ఫ్లాస్కుల్లో తెచ్చిన కాఫీలు కప్పుల్లో పోసి అందరికీ అందించారు.

“ఇక్కడే పిక్నిక్ అయిపోతోంది. మనం కూడా జనం లోకి వెడదాం. నీలాంబరి కాకపోయినా మా జి.రామనాధం అయినా కనిపిస్తాడేమో వెతుకుదాం” అంది విరి.

“లాబం లేదండి అమ్మాయిగారూ. జనం లోకి వెళ్ళడం ఇప్పుడింక ఎవరి సెక్యం కాదండి” అంటూ లోపలికొచ్చాడు సూరయ్య. “అదేంటోనండయ్యగారూ, నిముష,నిముషా నికీ వరదనీరొచ్చి పడ్డట్టు పడిపోతున్నారు. అందరికీ ఈ మల్లిప్రోలే దొరికిందా? అన్ని ఊళ్ళూ తిరుగుతుంది నీలాంబరమ్మ అని చెప్తున్నారుగా. ఆళ్ల ఊరొచ్చినప్పుడు దర్శనం చేసుకోచ్చుగా? ఊరికే ఆ తొక్కిసలాటలో అక్కడ పడుండడం ఎందుకు, డాక్టరుగారికి కాఫీ టైము కూడా అవుతోందన్చెప్పి వచ్చేసానండి” లోపలికెళ్ళి అందరికీ ఇంకో రౌండు కాఫీలు కలుపుకొచ్చి ఇచ్చి తను కూడా ఓకప్పు తెచ్చుకున్నాడు సూరయ్య.

“అతను చెప్పింది కరెక్టే. దాదాపుగా చుట్టుపక్కల పల్లెలన్నీ తిరుగుతుంది అని మొదటే ప్రోగ్రామ్ తయారుచేసుకున్నార్ట కదా. ఇప్పటికి ఈ వారంలో కవర్ చెయ్యాల్సినవి సగం అయ్యేపోయాయి. ఇంక ఎందుకు జనానికి ఈ ఆత్రుత?” వినాయకరావు కూడా ఒప్పుకున్నాడు.

“కానీ ఇంకో విషయం కూడా చెప్పుకుంటున్నారండయ్యగారూ. ఇవాళ మందులు చాలా పట్టుకొస్తున్నార్ట. అన్నీ ఇక్కడే పంచి పెట్టడమైపోతే పై ఊళ్ళకెళ్ళేటప్పటికి ఏమీ మిగలవు అన్న ఆత్రం కొద్దీ వొచ్చి పడిపోతున్నారండి” సూరయ్య మరో సమాచారం అందించాడు.

“బాగుంది. ఇంతమంది వొచ్చి ఇలా తొక్కిసలాట చేసేస్తే అసలెవరికీ దక్కకుండా పోతాయేమో వాళ్ళు తెచ్చిన మందులు” అన్నాడు వినాయకరావు.

“మందులైనా అన్ని ఊళ్ళకీ కొన్ని కొన్ని తీసుకువెడతారేమో కదా. ఏ ఊరు వాళ్ళు ఆ ఊరిలోనే ఎవరి మందులు వాళ్ళే తీసుకోవచ్చుగా” వాణి మరో ప్రశ్న సంధించింది.

సూరయ్య అందుకున్నాడు. “అంటే నీలాంబరమ్మ ఇలా ఎన్నికల యాత్రకి వొస్తుందీ అని ప్లానేసుకున్నప్పట్నించీ ఆమెగారి మనుషులు ఊరూరూ తిరుగుతూ ఏవని ప్రచారం చేసారంటేనమ్మా, ఒక్కొక్క ఊళ్ళో ఒక్కో రకం జబ్బుకి మందులు పంచిపెడతారు అని చెప్పుకుంటూ తిరిగారమ్మా. అంటే, సామర్లకోటలో గుండె జబ్బులోళ్ళకి మందిస్తే, పిఠాపురంలో కడుపునెప్పోళ్ళకి, తాడేపల్లిగూడెంలో తలనెప్పోళ్ళకి అలా ఒక్కో ఊళ్ళో ఒక్కో జబ్బుకు మందిస్తాం అన్నారమ్మా. అందుకని ఒక్కో ఊళ్ళో ఒక్కోరకం జబ్బుల వాళ్ళందరూ చేరుతున్నారమ్మా” శ్రోతలకుచాలా ఆశ్చర్యం వేసింది

“మరి ఇంతమంది రోగులను పరీక్షించి రోగనిర్ధారణ చేసేది ఎవరు?” ఆశ్చర్యంగా అడిగింది వాణి.

“అబ్బే ఇన్ని వేలమంది చేరిపోతే ఇంక పరీక్షలెవరు చేస్తారమ్మా? మనం చెప్పుకునేవి మనం చెప్పుకుంటే వాళ్ళు మందిచ్చేస్తారన్నమాట” ఆ మాత్రం గ్రహించలేరా అన్నట్టు చూస్తూ అన్నాడు సూరయ్య.

“జబ్బుకు మందివ్వడం అంటే అంత తేలికా? రోగిని ఏమీ పరీక్షచెయ్యకుండా నాకు దగ్గు, నాకు కడుపు నొప్పి అంటే చాలు మందిచ్చేస్తారన్నమాట. నమ్మే అమాయకులుంటే ఏమైనా చెప్తారు నమ్మిస్తారు” వాణికి సూరయ్య చెప్పిన సమాచారం కొరుకుడు పడలా.

“అయితే మనఊళ్ళో ఏం జబ్బుకి మందిస్తున్నారు?” వినాయకరావు అడిగాడు.

“మానసిక వ్యాధులంటారు గదండయ్యగారూ, మెంటల్ జబ్బులు. ఆ మెంటల్ జబ్బులకి మందులు పంచి పెడతార్ట. మా డాక్టరుగారు అసలు చాలా బాగా వైద్యం చేస్తారండి మెంటల్ జబ్బులకి. కానీ నీలాంబరమ్మది మూలికా వైద్యంవంటకదండీ. ఇంగ్లీషు డాక్టర్లిచ్చే మందులు వేడి చేస్తాయండి. ఇలాంటి వైద్యం కడుపు చలవ చేస్తదండి. అంతా చెప్పుకుంటున్నారు.”

“అయ్యబాబోయ్! అంటే మన ఆంధ్రప్రదేశ్‌లో ఇన్నివేల మంది మెంటల్ పేషెంట్లున్నారా?” విరి ఒక్క కేక పెట్టింది.

“మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో కాదు ఈ విడత కేవలం ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే. దాన్ని బట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన లెక్కలు ఆలోచించుకో” అన్నాడు యోగి.

“వావ్!” గుండె జారిపోయినట్టు కుర్చీలో వెనక్కి వాలిపోయింది విరి. అందరూ నవ్వారు.

“కానీ కఢుపునొప్పో తలనొప్పో ఏదైనా దాని కారణం తెలియకుండా ఎలా మందులిస్తారు? అప్పటికి నొప్పి తగ్గినా అసలు కారణానికి వైద్యం జరగకపోతే ఆ నొప్పి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది కదా. వీళ్ళు మందులు ఏ బేసిస్ మీద ఇస్తారు?” సిరి సందేహం అజిగింది.

“కరెక్ట్ సిరీ! అడగాలిసిన ప్రశ్న అడిగావు. మెంటల్ జబ్బులంటే కూడా అందరికీ ఒకరకంగానే ఉండవు. శరీరానికి ఎన్ని రకాల జబ్బులు రావడానికి అవకాశం ఉందో మనసుకీ అన్ని రకాల జబ్బులు న్నాయి. ఫలానా మల్లిప్రోలులో మానసిక జబ్బులకు మందిస్తాము అని ప్రకటించాక నీలాంబరి రావడానికి మూడు నాలుగురోజుల ముందు ఏ వైద్యశిబిరం లాంటిదో నిర్వహించి రోగులను మానసిక వైద్యులు పరీక్షించి మందులు నిర్ణయించి ఉచిత పంపిణీ ఆవిడ వచ్చాక ఆవిడ చేత చేయించవచ్చు. అదేదీ లేకుండా, కాస్త మెంటలోళ్ళందరూ ఓ లైన్లో నిలబడండి. అని చేతికొచ్చిన మందులు తీసి పంచి పెట్టుకుంటూ పోవడం అదేం వైద్యం? అసలు ఆ మందులవల్ల జబ్బులు తగ్గుతాయంటే ఎలా నమ్ముతారు?” యోగి జనాల అమాయకత్వం తలుచుకు చింతిస్తూ అన్నాడు.

“అవన్నీ నాకు తెలీదండయ్యగారూ, కానీ ఇందాక నీలాంబరమ్మ ఇచ్చిన మందుల వల్ల తమ రోగాలు ఎలా తగ్గిపోయాయో ఒక్కొక్కళ్ళూ స్టేజిమీద కొచ్చి మైకులో చెప్తున్నారు. నిజంగా తగ్గక పోతే వాళ్ళంతా అలా ఎందుకు చెప్తారండీ?” అన్నాడు సూరయ్య.

“అదీ పాయింటే. ఏమేం జబ్బులు తగ్గాయని చెప్పారు?” కుతూహలంగా అడిగింది విరి.

“ఒక్కోళ్ళూ ఒక్కోటి చెప్పారు నాకవన్నీ బుర్రకెక్క లేదు కానండీ, ఒకావిడ మాత్రం తన కొడుక్కి రెండేళ్ళుగా నిద్రపట్టని జబ్బుందని చెప్పిందండి. నిన్న రాత్రి కాకినాడనించి భక్తుల్ని తీసుకు బయల్దేరిన ట్రక్కులో మధ్యలో అదేదో ఊళ్ళో రాత్రి ఒంటిగంట దాటాక ఎక్కారటండి ఆవిడ, ఆవిడ కొడుకు. ఎక్కీ ఎక్కంగానే ట్రక్కులో అందరూ నిద్రకి పడ్డారటండి. కానీ ఈవిడ కొడుక్కి నిద్ర పట్టదుకదండి అలా కళ్ళు తెరుచుక్కూచుననున్నాడటండి. ఒకాయన పేరు సుందరం అని చెప్పాడ్టండి. నీలాంబ్రమ్మ కనిపెట్టిన మందు అన్చెప్పి ఏదో మందిచ్చాడ్టండి. అంతే. రెండేళ్ళుగా నిద్రపోనోడు క్షణంలో గుర్రెట్టి నిద్రోయాట్టండి. కానీ తమాషా ఏంటంటే తరవాత ఆ సుందరం తెల్లారాక కనపడ్డాడ్ట కానీ పలకరిస్తే నువ్వెవరవమ్మా ఎప్పుడూ సూడ్లేదే అంటాడంట. అక్క డందరూ అనేదేంటంటే నీలాంబరమ్మే ఆ సుందరం అనే ఆయన రూపంలో వొచ్చి ఆవిడ కొడుక్కి మందిచ్చిందని. మహత్యవండి! మందుకన్నా ఆ తల్లి మహత్యాలెక్కువ పని చేస్తాయండి” కాఫీ కప్పు కిందపెట్టి చేతులు పైకెత్తి దండంపెట్టి ఎందుకో గాని చెంపలు వేసుకున్నాడు.

“సుందరం రూపంలో ఎందుకొచ్చింది నీలాంబరమ్మ? తన రూపంలోనే ఎందుకు రాలేదు?” మరో పాయింటు లేవనెత్తింది విరి.

“బావుందండి అమ్మాయిగారూ, తన రూపంలోనే వచ్చుంటే అప్పటికప్పుడు మీటింగెట్టేసి బహిరంగ సబల్చేసేసి నానాగోలా చేస్తారుకదండీ జనం. ఆ అర్దరాత్రికి ఆ కుర్రాడు నిద్రపోవడం చూపించాక తన మహత్యం సంగతి కచ్చితంగా జనానికి తెలుస్తుంది” ఖచ్చితంగా చెప్పాడు సూరయ్య.

“అదీ నిజమే” ఒప్పేసుకుంది విరి.

“ఏంటి విరీ, నువ్వు కూడా నీలాంబరి మహత్యాలు నమ్మేస్తున్నావా? ఇంత తేలికా నిన్ను నమ్మించడం?” వాణి ఆశ్చర్యపోయింది.

“అతని లాజిక్ నేను మెచ్చుకుంటున్నాను. నిజమే కదా? నీలాంబరి తన రూపంలోనే వస్తే అప్పటి కప్పుడు మీటింగులు పెట్టేసి నానా గగ్గోలు అయిపోతుంది ఎవరికీ రెస్టులేకుండా” విరి సమాధానం విన్నవాళ్ళకి నవ్వొచ్చింది.

“సూరయ్యా, నువ్వూ ఇంత అమాయకుడివని నేను అనుకోలేదు. ఒక్కరోజు నిద్ర పట్టేసరికి ఆ పేషంటుకు నిద్ర పట్టని రోగం ఇంక తీరిపోయిందని అనుకుంటున్నావా? అవేవో నిద్రమాత్రలయ్యుంటాయి”

యోగి మాటలు పూర్తికాకుండానే సూరయ్య అందుకున్నాడు. “అవేం ఇంగ్లీషు మందుల్లా మాత్రలు కావటండి. అరిటాకులో చుట్టిన లేహ్యంటండి”

‘ఆకులో లేహ్యం!’ యోగి ఉలిక్కిపడ్డాడు. వీరేశం తాత కూడా ఇలాగే ఆకులో లేహ్యం అలవాటు చేసుకున్నాడు. “ఆ లేహ్యం ఎలా ఉంది? నువ్వెవరిదగ్గరైనా చూసావా?” సూరయ్య ముఖంలోకి చూస్తూ అడిగాడు.

“చూడలేదండి కానీ బాగా పవర్ఫుల్లని చెప్పుకుంటున్నారండందరూ. అసలు రెండేళ్ళుగా నిద్రంటే ఏంటో మర్చిపోయినోడు ఒక్క డోసు పడంగానే గుర్రెట్టి నిద్ర పోయాడంటే మందు పవరూ, సరిగ్గా లారీలో ప్రత్యక్షమై ఎవరికివ్వాలో ఆరికే ఇచ్చిందంటే మాత మహత్యమూ కాక ఇంకేంటండి?”

“ఏదో ఒకటి. సరే. ఒక రాత్రి నిద్రపోయాడు. మళ్ళీ ఆ సమస్య అతనికి రాదని ఎందుకనుకుంటున్నావు?”

“ఒక్కరాత్రి కాదండి. ఆ లేహ్యం వారానికి సరిపడా ఇచ్చిందటండి. వారం తర్వాత ఇంక నిద్ర సమస్యే రాదటండి.”

“వారం తరవాత వీళ్ళెక్కడో ఆవిడెక్కడో! వారం తరవాత ఆ సమస్య మళ్ళీ వచ్చిందనుకో అప్పుడతని కేవిటిదిక్కు?” సుశీల అడిగింది.

“ఏవోనండి నేనంత దూరం ఆలోచించలేదు” అన్నాడు సూరయ్య కొంచెం చిన్నబుచ్చుకున్నట్టు మొహం పెట్టుకున్నాడు. ‘అసలు నమ్మనోళ్ళకి ఏం చెప్పినా ఒకటే’ అని గొణుక్కున్నాడు.

విరికి జాలేసింది. “కానీ యోగీ అంకుల్, అసలు మన దేశపు ఆయుర్వేదం వైద్యాన్ని మరీ అంత తేలిగ్గా కొట్టెయ్యకూడదు. ఆయుర్వేదం విదేశాల్లో కూడా చాలా పాప్యులర్. అసలు చాలా యూరోపియన్ కంట్రీస్‌లో ఆయుర్వేదిక్ మెడికల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. యూకెలోను, స్పెయినూ, జర్మనీ లాంటి చోట్లా, యుఎస్ లోను, ఇంకా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. చాలా చోట్ల ఉన్నాయి. ఆయుర్వేద విధానాల మీద రిసెర్చ్ జరుగుతోంది” అంది కళ్ళింతింత చేసుకుని.

“అవునంకుల్. ఇదిగో ఇవాళ్టి పేపర్ చూడండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి ఆయుర్వేదం మందులు చాలా బాగా పనిచేస్తాయని అమెరికాలోని యూనివర్సిటీల్లో జరిపిన రీసెర్చి వల్ల ఖచ్చితంగా తేలింది” న్యూస్ పేపర్లో ఆ వార్త పడ్డ పేజీని తెరిచి చూపిస్తూ అంది సిరి.

“అవును. కాదనట్లేదు. హోలిస్టిక్ మెడిసిన్, కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ పేర్లతో రకరకాల ఇన్‌స్టిట్యూషన్స్ విదేశాల్లో వెలుస్తున్నాయి. చాలా దేశాల్లో మన ఆయుర్వేదం లాగానే రకరకాల దేశీయ వైద్య విధానాలున్నాయి. వాటిని కూడా ఒక పధ్ధతిలో చదివి ఏ మాత్రం గోప్యత లేకుండా ఇప్పుడు అల్లోపతీ వైద్యంలాగానే చేస్తే ఫలితాలు తెలుస్తాయి. ఇప్పుడు నీలాంబరిని చూడు. ఆవిడెక్కడా ఆయుర్వేద కళాశాలలో చదవలేదు. హిమాలయాల్లో సాధుసన్యాసుల దగ్గర నేర్చుకున్నానంటుందిట. ఫైన్. పోనీ తనిచ్చే మందులేమిటో దేనితో తయారు చేసిందో బహిర్గతం చెయ్యచ్చుగా. అదీ ఉండదు. సాధారణంగా అల్లోపతీయే కాదు ఆయుర్వేదం మందుల సీసాలమీద కూడా చూడు వాటి కంపోజిషన్ రాసి ఉంటుంది. ఇలా సొంతంగా ఏదో మంత్రాలు మహత్యాలు కూడా కలబోసి చేసిన మందులకే ఏ పేరూ ఉండదు. అరిటాకులో లేహ్యం అని తప్ప మరో పేరుండదు” అన్నాడు యోగి.

“అదీ నిజమే” ఒప్పుకున్నాడు వినాయకరావు.

“పేరు రాసిన లేబుల్ ఉన్నా లేకపోయినా మందు పనిచేస్తుంది కదా అంకుల్?” విరికి ఇంకా ఏదో తెలుసుకోవాలని ఉంది. యోగి మాట్లాడుతుంటే అతను చెప్తున్న తర్కం నిర్దుష్టంగానే ఉన్నా, సూరయ్య మాటలు కూడా కొంతకాకపోతే కొంతైనా లాజికల్‌గా ఉన్నాయనిపిస్తోంది.

“నీలాంబరి ఇంకో మనిషి రూపంలో వచ్చిందోలేదో కానీ ఉపకారమే జరిగిందికదా? చాలాకాలంగా నిద్రపోని మనిషి సుబ్బరంగా గుర్రుపెట్టి నిద్రపోయాడు అదీ అక్కడ కనబడుతున్న రిజల్ట్. దానికి ఎక్స్‌ప్లనేషన్ ఏమిటి?” అడిగింది.

“అదేదో బాగా స్ట్రాంగ్‌గా ఉండే నిద్రమాత్రలో లేక మత్తుమందులో ఏదైనా తైలంలో కలిపి ఇచ్చి ఉండచ్చుగా? అప్పటికి నిద్ర తప్పకుండా వస్తుంది. దానికి అలవాటు పడితే ఇవాళ రెండు మాత్రల తైలంతో నిద్రొస్తుంది. తరవాత తరవాత ఆ డోసు పెంచితే తప్ప నిద్ర రాదు. అదో వ్యసనం అవుతుంది. వాళ్ళు మందులు మందులు అన్చెప్పి ఏమిస్తున్నారో ఎవరికి తెలుసు?” వినాయకరావ్ మనవరాలి సందేహం తనకు తెలిసినంతలో తీర్చడానికి ప్రయత్నించాడు.

యోగి నిగమ్ నంబరు నొక్కి అతనితో మాటాడాలని ప్రయత్నించాడు. ఎంగేజ్డ్ వస్తోంది. నెంబరు కొడుతూనే వినాయకరావు, విరి మాటలు విన్నాడు.

ఫోన్ పక్కన పెట్టి “నేనొకటి చెప్తున్నా జాగ్రత్తగా విను విరీ. అసలు నిద్రపట్టక పోవడం జబ్బునే తీసుకో. దాన్నే నిద్రలేమి అంటారు. దానికి ఇంగ్లీషు ‘ఇన్‌సోమ్నియా’ అన్న పేరు మీకీ తెలుగు పేర్లకన్నా బాగా పరిచయం అయ్యుంటుంది. ఆ ఇన్సోమ్నియా అనేది ఒక జబ్బు నిజమే. కానీ ఆ జబ్బు బారిన పడడానికి చాలా కారణాలుంటాయి. ఆ కారణాలేమిటో తెలుసుకుని నివారించాలి కానీ కేవలం ఆ పూటకి నిద్ర పట్టేందుకు మందివ్వడం మంచిపధ్ధతి కాదు.. ఇన్సోమ్నియా లోనే చాలా రకాలుంటాయి. ప్రైమరీ ఇన్సోమ్నియా, స్లీప్ ఏప్నియా, సికాడియన్ రిథమ్ డిసార్డర్, రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్, నాక్టర్నల్ మయోక్లోనస్, నైట్ మేర్ డిసార్డర్, స్లీప్ టెర్రర్ డిసార్డర్ ఇలా అనేక రకలుంటాయి, అనేక కారణాలుంటాయి.”

“అబ్బ! ఒక్క ఇన్సోమ్నియా లోనే ఇన్ని రకాలున్నాయా! ఇన్సోమ్నియా అంటే నిద్రరాకపోవడం అని తెలుసు కానీ మళ్ళీ దాంట్లో రకాలున్నాయని ఎప్పుడూ వినలేదు” సిరి ఆశ్చర్య పడుతూ అంది.

“ఇంకా ఉన్నాయి చెప్పాలంటే రాపిడ్ ఐ మూవ్ మెంట్ డిసార్డర్, స్లీప్ పెరాలిసిస్, స్లీప్ వాకింగ్, డిలేడ్ స్లీప్ ఫేజ్ సిండ్రోమ్ ఒక్కటి కాదు. రకాన్ని బట్టి, కారణాన్ని బట్టి సైకోథెరపీ ఇవ్వడం, మందులు వాడడం ఇంకా చాలా ఉంటుంది. ఒక మాత్రతోనో ఇంజక్షన్ తోనో తీరిపోయే సమస్యలు కావివి. మరి ఒక పొట్లం ఇచ్చి వారంరోజుల్లో సమస్య మటుమాయం అవుతుందని చెప్పడం చెప్పారు నీలాంబరి మనషులు. మరి వారంలో తగ్గక పోతే ఎప్పుడు రావాలి, ఏమి చెయ్యాలి అని మాత్రం చెప్పలేదు.”

“అయితే అంతా మోసం అంటారా?”

“నేననక్కర్లేదు. కాస్త ఆలోచిస్తే ఎవరికైనా తెలుస్తుంది.”

“కానీ అంకుల్, ఇప్పుడు మనం వాడే మందులలో కూడా వాటిలో ఏఏ కెమికల్స్ ఉన్నాయి, కాంపొజిషన్ ఏమిటి మొదలైన వివరాలు రాసి మాత్రం ఏం ప్రయోజనం? మన దేశంలో చాలా మంది చదువు రాని వాళ్ళే. చదువొచ్చినా కూడా ఆ మందులో ఏముందో చదువుకుని వేసుకునే వాళ్ళెవరూ ఉండరు. ఒకవేళ చదివినా ఏం అర్థమవుతుంది? డాక్టరు ఆ మందువేసుకోమని రాసిచ్చారు కాబట్టి వేసుకుంటారు. మరి అలాంటప్పుడు ఆ సీసాల మీదా మాత్రలమీదా ఆ కెమికల్స్ పేరు రాసి మాత్రం ప్రయోజనం ఏమిటి?” అని అడిగింది సిరి.

“పేషంటు చదవలేకపోయినా అసలా మందేమిటో తెలుసుకునే అవకాశం ఉంది కదా. అతను చదవలేక పోతే ఇంకోళ్ళ చేత చదివించుకుంటాడు. ఏమిటో డాక్టరుని అడిగి తెలుసుకుంటాడు. డాక్టరుకి తనేం రాస్తున్నాడో తెలుస్తుంది. ఏదైనా తేడా వస్తే, అంటే ఆ మందుకి రియాక్షనేదైనా వస్తే ఏంచెయ్యాలో చదువుకున్న డాక్టర్ కెవరికైనా తెలుస్తుంది. ఆ మందేసిన డాక్టరే కాక ఎవైలబుల్‌గా ఉన్న ఏ డాక్టరు కైనా ఆ మందేమిటి రియాక్షన్ ఎందుకొచ్చిందీ తెలుస్తుంది. ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ చెయ్యగలుగుతాడు. ఇప్పుడు ఇలా ఆకుల్లోను పువ్వుల్లోను చుట్టి ఇచ్చిన మందులు వికటిస్తే ఇంక అంతే సంగతులు.”

యోగి చెప్తున్నది ఆకళింపు చేసుకుకోడానికి సూరయ్యకి టైమ్ పట్టింది. ‘మందు తీసుకుని ఎవరి ఊళ్ళకి వాళ్ళెళ్ళిపోయాక వీళ్ళకి ఏంటయిందో ఏంటో చూడాలంటే ఇన్ని వేలమందీ ఇంక హైదరాబాదు నీలాంబరమ్మ కుటీరానికి వెళ్ళాల్సిందేనన్న మాట. మరసలు ఆ కుటీరంలో ఇంతమందికి చోటుంటుందా? రానిస్తారా?’ ఆలోచించుకుంటూ కూచున్నాడు సూరయ్య.

మైకులో వినిపిస్తున్న భజనలు స్పీడందుకున్నాయి. చాలా మంది శ్రోతలు కూడా గొంతు కలుపుతున్నట్టు రకరకాల గొంతులు గట్టిగా వినిపిస్తున్నాయ్. పాట స్పీడు పాడే వాళ్ళ ప్రమేయం లేనట్టుగా క్షణక్షణానికీ ఎక్కువైపోతోంది. జనాన్ని కంట్రోల్ చెయ్యడానికి భారీగా తరలి వచ్చిన పోలీసులు కాబోలు వాళ్ళ మైకుల్లో జనానికి ఏవో సూచనలివ్వడం కూడా వినిపిస్తోంది.

ఆలోచన ఎంతకీ తెగక తల విదిలించాడు సూరయ్య. “అయితే అయ్యగారూ, ఇలాంటి తెలుగు మందులు కూడా వికటిస్తాయాండీ?” సాగదీసుకుంటూ అడిగాడు.

“బాబో! రక్షించండి! బాబో! ఈ మందేదో వికటించేసింది పిల్లాడు ఏదో లాగయిపోతున్నాడు రక్షించండి బాబో! బాబోయ్! దేవుడోయ్!” అన్న కేకలు, ఏడుపులు వినిపించాయ్. స్పీకర్లలో పాటలాగి పోయి ఏడుపులు, కేకలు, ఆర్తనాదాలు వనిపిస్తున్నాయ్.

తన ప్రశ్నకు జవాబులాగా వీధిలోంచి ఎక్కడి నించో వస్తున్న అరుపులు విని “అయ్యబాబోయ్ ఏదో అయింది!” అని తను కూడా అరుస్తూ వీధిలోకి పరుగెత్తాడు సూరయ్య. యోగి, వినాయకరావు కూడా గబగబా లేచి బయటకు నడుస్తూ “మీరెవరూ అనవసరంగా బైటికి రావడానికి సాహసించకండి. ఆ గొడవేంటో చూసేసొస్తాం” అని హెచ్చరించి వెళ్ళారు.

ముందూ వెనకా చూడకుండా పరిగెట్టుకుంటూ సభ జరుగుతున్న ప్రాంగణం వైపు పోతున్నాడు సూరయ్య. యోగి, వినాయకరావు చకచకా అడుగులు వేస్తూ నడుస్తున్నారు. సభాస్థలం దగ్గర పడుతున్న కొద్దీ హాహకారాలు ఎక్కువవుతున్నాయి. జనం ఏడుపూ గోలా విపరీతంగా చెవులు బద్దలుకొడుతున్నట్టున్నాయి. కొన్ని ఇళ్ళల్లో ఓపిక లేకో, తొక్కిసలాటకి భయపడో సభకు వెళ్ళని వాళ్ళు తలుపులు తీసి చూస్తున్నారు. రోడ్డుమీద యోగిని చూసిన వాళ్ళు “డాక్టరుగారో! ఏటయిందండి? ఆ ఏడుపులేంటండి?” అని అఢుగుతున్నారు.

అతనికి మాత్రం ఏం తెలుసు? “అంకుల్, మీరు ఇంటికి వెళ్ళిపోండి. అక్కడ తొక్కిడి ఎలా ఉందో మనకు తెలియదు. వెళ్ళామంటే ఇరుక్కు పోతామేమో. మీరు ముందు వెనక్కెళ్ళిపోయి వాళ్ళకి సాయంగా ఉండండి. తలుపులు వేసేసుకోండి” అన్నాడు యోగి.

సరే అంటూ వెనక్కి తగ్గాడు వినాయకరావు. ఇంతలో దడదడమంటూ మనషులు పరిగెడుతున్న అడుగుల చప్పుడు బలంగా వినపడింది.

“మీరు వెళ్ళి మాత్రం ఏం చేస్తారు డాక్టరుగారూ, మీరూ వచ్చెయ్యండి ఇదేదో పెద్ద గొడవే జరిగే లాగా ఉంది. పోలీసులు చూసుకుంటారు మనలాంటి వాళ్ళం వెళ్ళి చేసేదేం లేదు” యోగి చెయ్యిపట్టుకున్నాడు వినాయకరావు. ఒక్క క్షణం ఆలోచించాడు. ‘నిజమే నేను మాత్రం అంత మందిలో చేసేదేముంది?’ వినాయకరావుతో పాటు వెనక్కి తిరిగాడు యోగి.

సూరయ్య అయిపులేడు. సాయంత్రపు వెలుగు పల్చబడుతోంది. ఏదో పెద్ద దొమ్మీ జరుగుతున్నట్టు అరుపులూ కేకలు. ‘అయ్యో!’’ “కొడుకా!’ ఏడుపులు. చాలా పెద్ద ప్రమాదమే జరుతోంది అనుకున్నారు వీదిలో జనాలు. ఎవరిమానాన వాళ్ళు గబగబా తలుపులు వేసేసుకుంటున్నారు. మైకుల్లో హాహకారాలు ఆర్తనాదాలతో పాటు పోలీసుల కేకలు కూడా వివనిపిస్తున్నాయి. యోగి, వినాయకరావు వేగంగా నడుచుకుంటూ ఇంటి దగ్గరకెళ్ళిపోయారు. గేటు చప్పుడుకు కిటికీలోంచి వీళ్ళని చూసిన సుశీల తలుపు తెరిచి వీళ్ళు లోపలికి రాగానే వేసేసింది.

“ఏమవుతోంది? ఏమవుతోంది? మీరు అక్కడదాకా వెళ్ళారా?” అంటూ ప్రశ్నల పరంపర కురిపించారు సిరి,విరి.

“ఏమో వీదులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. సభ జరుగుతున్న స్థలం నుంచి చాలా పెద్ద గోల వినిపిస్తోంది. పోలీసులు తప్ప అక్కడకెళ్ళి మామూలు వాళ్ళం ఎవరం ఏమీ చెయ్యలేమనిపించింది. ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు కూడా తలుపులు వేసేసుకుని కిటికీల్లోంచి భయంగా చూస్తున్నారు. మేం వెనక్కొచ్చేసాం” జరిగింది చెప్పాడు వినాయకరావు.

“అసలు మనం ఇందాకటి నించీ మన కబుర్లలో పడి టీవీ గాని రేడియోగాని పెట్టుకోడమే మర్చిపోయాం. అదేదో ఆన్‌లో ఉంచుంటే అసలు ఎలా మొదలైందో తెలిసేదేమో.”

యోగి టీవీ ఆన్ చేసాడు, జరుగుతున్న దొమ్మీలో కేబుల్ కట్ అయిపోయింది కాబోలు. ఏమీ రాలేదు. నల్లస్క్రీన్ తప్ప. యోగి కేబుల్ లాగేసి దూరదర్శన్ పెట్టాడు. ఏదో కార్యక్రమం వస్తోంది. “సరే ఇంక ఏడింటి వార్తల్లో మల్లిప్రోలులో ఏం జరిగిందో చెప్తారు అప్పుడుగానీ మనకేం తెలియదు. కట్టెయ్యకండి టీవీ ఆన్ లోనే ఉంచండి” అన్నాడు వినాయకరావు.

యోగి సెల్ తీసి “మా నాన్నగారికి ఫోన్ చేస్తా. మన ఊళ్ళో ఏం జరుగుతోందో అక్కడ లైవ్ కవరేజ్ ఇస్తూ ఉండి ఉంటారు” అని నంబర్ నొక్కాడు.

అవతలినించి “ఆ ఏరా యోగి, నీలాంబరి వచ్చిందా? మీరంతా చూసారా?” అని అడిగాడు యోగి తండ్రి కేశవరావు.

“మీరే మాకు చెప్పాలి. ఇక్కడ కమ్యూనికేషన్స్ బంద్.” అంటూ జరిగింది చెప్పాడు.

“అయ్యయ్యో! అంత గొడవగా ఉందా? ఉండు నేను ఏ చానెల్లో అయినా మీ ఊరి న్యూస్ చూపిస్తున్నాడేమో సర్ఫింగ్ చేసి చూసి చెప్తా” అని కట్ చేసాడాయన.

“అంటే ఇక్కడింత జరుగుతున్నా ప్రపంచానికి ఇంకా వార్త చేరలేదన్నమాట. ఈ రోజుల్లో మల్లిప్రోలు వార్త ఎవరూ పట్టించుకోకపోవడం చాలా విచిత్రంగా ఉంది” అన్నాడు వినాయకరావు.

“కనీసం నీలాంబరి ఇప్పుడు సభ జరుపుతున్న సన్నప్రోలు గ్రామం నించి లైవ్ కవరేజ్ జరుగుతూ ఉంటుంది కదా అదైనా చూడమని చెప్తా మా నాన్నగారికి. అప్పుడు అక్కడ మల్లిప్రోలు గొడవ గురించి కూడా ఏమైనా మెన్షన్ చేస్తారేమో వినమంటా” యోగి మళ్ళీ ఫోనందుకున్నాడు.

అతను డయల్ చేసే లోపే అదే మోగింది. “ఆఁ నాన్నా, ఏమిటి న్యూస్?” ఆత్రంగా అడిగాడు.

“నేను పెట్టిన ఛానల్స్‌లో స్క్రోల్ లో మల్లిప్రోలు గ్రామంలో నీలాంబరి కోసం ఎదురుచూస్తున్న భక్తులు సహనం కోల్పోయి గొడవ చేస్తున్నారు. వారికి మంచి నీటి సరఫరా కూడా సక్రమంగా చెయ్యలేకపోతున్నారు సభ నిర్వాహకులు అనే వస్తోంది అంతకంటే డీటెయిల్స్ ఏమీ రావట్లేదు” అన్నాడు కేశవరావు.

“మరి సన్నప్రోలులో నీలాంబరి సభ లైవ్ వస్తోంది కదా అక్కడినించి ఆవిడ మా ఊరివాళ్ళకి సంయమనం పాటించమని సందేశం ఇవ్వట్లేదా? ఆలస్యానికి ఆవిడదేగా బాధ్యత. మీరేదైనా ఛానెల్లో చూడండి ఎక్కడో ఒకచోట నీలాంబరి సభ కవరేజి వస్తూంటుంది” అన్నాడుయోగి.

“అదేంటి నీకు తెలియదా? నీలాంబరి సన్నప్రోలు కూడా చేరలేదు” అన్నాడు కేశవరావు.

“వాట్? తమాషాగా ఉందే.”

“ఊఁ. సన్నప్రోలులో అసలు చిన్న సభే ఏర్పాటు చేసారుట. మీ మల్లిప్రోలులోనే ఆ ప్రాంతంలో కెల్లా పెద్ద బహిరంగసభ ఏర్పటైంది. అందుకే అక్కడికి విపరీతంగా ఏ గోదావరి పుష్కరాలకో చేరినంత మంది జనం చేరుతున్నారని పొద్దున్నంతా వార్తలొచ్చాయి. అయితే మధ్యాన్నం నించీ నీలాంబరి సన్నప్రోలు చేరలేదని ఇంక లైవ్ కటాఫ్ చేసి నీలాంబరి వచ్చాకే కవరేజ్ ఇస్తామని ఏవేవో ప్రకటనలొచ్చాయి. టైమ్ ఫిల్లింగ్ కోసం వేరే ఏవో ప్రోగ్రాములు చూపిస్తున్నారు” జరుగుతున్నదంతా చెప్పాడు కేశవరావు. ఆయన చెప్పినదంతా అందరికీ చెప్పాడు యోగి.

“ఇదేదో పెద్ద గొడవలోనే చిక్కుకునుంటుంది నీలాంబరి” అన్నాడు వినాయకరావు. విరి తన సెల్ తీసి ఏవో నంబర్లు నొక్కడం మొదలెట్టింది.

“ఏయ్ ఎవరికి ఫోన్ చేస్తున్నావ్?” సుశీల కోపంగా కేక పెట్టింది.

“ఆ గోరింకల రామనాధాన్ని కాంటాక్ట్ చెయ్యడానికి చూస్తున్నావా?”

“అబ్బ! అమ్మా, ఎందుకంత కోపం? నేను మూర్ఖురాలినే కానీ మరీ అంత మూర్ఖురాలిని కాదు. మన ఫ్రెండు సురేష్ ఏమయినా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలడేమోనని చూస్తున్నాను” అంది.

గబుక్కున విరి చేతిలో సెల్ లాక్కుని తన బేగ్ లో పడేసుకుంది సుశీల. “నువ్వేం పెత్తనం చెయ్యక్క ర్లేదు. ఇంక పెద్దవాళ్లు చూసుకుంటారు. అసలే చస్తుంటే సంధిమంత్రంలా నువ్వొకత్తివి” విసుక్కుంది సుశీల.

విరి మూతి ముడుచుకు కూచుంది.

తలుపులు మూసి ఉన్నాకూడా బైట జనఘోష వినిపిస్తూనే ఉంది. ఎవరికీ ఏమీ మాట్లాడాలనిపించలేదు. ఏడయింది. టీవీలోంచి వార్తల ముందు వచ్చే సిగ్నేచర్ మ్యూజిక్ మొదలయింది. వార్తలొస్తున్నాయి. ఏదో ఒకటి తెలుస్తుంది. అందరూ తలలు టీవీ వైపు ఆత్రంగా తిప్పారు.

కరెంటు పోయింది. ఇల్లంతా చీకట్లు కమ్ముకున్నాయి.

“ఓ వాటీజ్ దిస్! మనక్కావలసినప్పుడే కరెంటుండదు?” చిరాగ్గా అంది సిరి.

ఉన్నట్టుండి మిన్ను విరిగి మీద పడుతున్న దడదడ శబ్దం ఆకాశం లోంచి వినబడింది.

“ఏదో ఎయిర్ ప్లేన్.” సిరి అరిచింది.

“కాదు హెలికాప్టర్”

“నీలాంబరి దిగుతోందేమో” అన్నాడు వినాయకరావు.

హెలికాప్టర్ చప్పుడును మించి జనాల హాహకారాలు ఆకాశాన్ని తాకాయి.

(సశేషం)

Exit mobile version