మనిషే ఐతే మనసే వుంటే మంచి కోసం పాటుపడాలి.
తోటిమనిషికి తోడుగా మంచి మార్గం చూపించు.
వూరికే ఏదీరాదని కష్టపడితేనే ఫలితం ఉంటుందని నిరూపించు.
సోమరిగా ఉచిత పథకాలకు ఎగబడితే ఎందుకూ కొరగావు.
సులువుగా డబ్బు సంపాదించాలని నీచమైన పనులు చేయకు .
చదువే లక్ష్యంగా జ్ఞానం సంపాదించు.
డబ్బుతో పోల్చరానిది నిజాయితీ… అదే నీకు రక్ష.
చీమవంటి చిన్న జీవినుంచి పాఠాలునేర్చుకో.
గర్వంతో ఎవరినన్నా హేళన చేస్తే నీకూ గర్వ భంగం కాగలదు.
అందని ఆకాశానికి నిచ్చెనవేస్తే కిందపడటం తప్పదు.
అందుబాటులోవున్న అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకు.
అందరూ పుట్టుకతో వైభోగం పొందలేరు కానీ కృషి ఉంటే సాధ్యమే.
బంధువులకు నిన్ను చూస్తే ద్వేషం, స్నేహితుడికి మాత్రమే హితం.
ఎవరిని దగ్గిరచేసుకోవాలో ఎవరికి దూరంగా ఉండాలో తెలుసుకోవడమే వివేకం.
అందనిది దూరంగా వున్నదీ ఆకర్షణీయం ఐతే అందిన మరుక్షణం చులకన.
నువ్వు ఎవరికీ సాయపడకపోతే నష్టంలేదు…. ఎవరికీ కష్టం మాత్రం కలిగించద్దు.
సమస్యలు లేని జీవితం ఉండదు…. సహనంతో అధిగమించాలి.
జీవితం చాలా విలువైంది….భద్రంగా కాపాడుకోవాలి.
భరించలేని బాధ అనుకున్నది ఒక్క క్షణం భరిస్తే ఆ తర్వాత అధిగమించవచ్చు.
పరీక్ష పోయిందనో, ప్రేమ విఫలమైందనో ప్రాణాలు తీసుకోవద్దు… ఆ రెండూ తిరిగి వస్తాయి ప్రాణాలు రావు.
చదువుకునే వయసులో చదవాలి…. ఆ కాలం వృథాగా గడిచిపోతే…. ముళ్ళ దారి ముప్పు.
సమయం విలువైంది…. దాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. …. మంచికైతే విజయం నీదే.
ప్రతిరంగంలో మంచి చెడువుంటాయి…. చెడును దూరంపెట్టి మంచినే ఎంచుకో.
ఎవరూ పిల్లలను దూరం చేసుకోవద్దు…. ఆ తరువాత కావాలన్నా వారు దగ్గిర కాలేరు.
మీ రక్షణ వారికీ అవసరం వారిని కాపాడుకోటం మీ బాధ్యత.
స్కూలు బాగాలేదనో కాలేజీ బాగాలేదనో పిల్లలను మార్చకండి….
మీరు ఇంట్లో చదువు చెప్పండి. అది బాధ్యత.

నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.