[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన అంబల్ల జనార్దన్ గారి ‘మందు కంటే మత్తెక్కించేవి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


“మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ‘సేవా స్పర్శ’ వాలాంటీర్లకు పత్రికా విలేఖరులకు ఇతర ఆహ్వానితులకు స్వాగతం. మా సంస్థ స్థాపించి సంవత్సర కాలం ముగిసిన సందర్భంలో ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. సేవ స్పర్శ ముఖ్య ఉద్దేశం, మందు కంటే ఎక్కువ మత్తెక్కించే మాదక ద్రవ్యాలకు యువతను దూరంగా ఉంచాలన్నదే. గత సంవత్సర కాలంలో మా సంస్థ, మీ అందరి సహకారంతో మాదక ద్రవ్యాల వితరణ కొంత మట్టుకు నివారించగలిగింది. కొంత మంది మాదక ద్రవ్య పీడితులకు పునరావాసం విషయమై సహాయ, సహకారాలు అందించాము. అయినా డ్రగ్ మాఫియా అంత తొందరగా ఓటమి ఒప్పుకోనందున, చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. మా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ స్వతంత్ర గారిని సభనుద్దేశించి ప్రసంగించవచ్చుసిందిగా కోరుతున్నాను.” ‘సేవా స్పర్శ’ కార్యదర్శి శ్రీ దేవేష్ గారు తన స్వాగత ప్రసంగం ముగించారు.
శ్రీ స్వతంత్ర గారు సభను ఉద్దేశిస్తూ “ఆహూతులు అందరికీ స్వాగతం. సుస్వాగతం. మన దేశంలో వేళ్లూనుకుపోయిన మాదక ద్రవ్యాల బెడదను తొలిగించడం, మన యువతను ఆ మహమ్మారి బారి నుండి కాపాడుకోవడం, ‘సేవ స్పర్శ’ ముఖ్య ఉద్దేశాలు. మాదక ద్రవ్యాల దుష్పరిణామాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, ముఖ్యంగా యువతను వాటి బారినుండి రక్షించడం, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని పునరావాస శిబిరాలకు తరలించి వారిని, జన స్రవంతిలోకి తీసుకురావడం. పాఠశాలల దగ్గర కాలేజీ దగ్గర, వితరణ చేసేవారిని గుర్తించి వారిని పోలీసులకు అప్పగించడం, సేవా స్పర్శ కార్యక్షేత్రాలు. మా వలంటీర్లుగా కాలేజీ విద్యార్థులు, సేవా దృక్పథం కలిగిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగులు.. గృహిణులు మొదలైన వారంతా ఉన్నారు. గత సంవత్సరం మేము మాదక ద్రవ్యాల పీడను అరికట్టడానికి ఎంతో కొంత కృషిచేశామని చెప్పడానికి మాకే సందేహం లేదు. మొదట మీకు చెప్పాల్సింది ఏంటంటే, నేను కూడా మాదక ద్రవ్యాలకు బానిసయి పునరావాసం పొందినవాణ్ణే. నా లాగ ఇంకొందరు, ముఖ్యంగా యువత, డ్రగ్ మాఫియా వాళ్ళకు బానిసలు కాకుండా చూడాలనే ఉద్దేశంతో నేను ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సందర్భంగా మీరు అనుమతిస్తే నా నేపథ్యం వివరిస్తాను.”
“అలాగే వివరించండి. మాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది”. అని ఒక పత్రికా విలేఖరి అన్నాడు. స్వతంత్ర గారు కొనసాగించారు.
“మా నాన్నగారు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. నాకు జేబు ఖర్చులకు కొదవ లేకపోవడంతో నేను చదువుపై అంత శ్రద్ధ పెట్టక, ఇతర కలాపాలకు ప్రాముఖ్యత నిచ్చాను. స్నేహితులతో పార్టీలు, షికార్లలో మునిగిపోయేవాణ్ణి. అయితే ఆటల్లో మాత్రం నేను చాలా ముందంజలో ఉండేవాడ్ని. అది గమనించి, మా నాన్న గారు, నా డిగ్రీ అవగానే నన్ను పటియాలాలోని నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో ఒక సంవత్సర కోర్సులో చేర్పించారు. అక్కడ మొదటి మూడు నెలలు బాగానే గడిచాయి. ఆ తర్వాతే నా పతనానికి నాంది పడింది.
పొరుగు దేశం నుండి మాదక ద్రవ్యాలు విరివిగా దిగుమతి చేసుకుంటున్న పంజాబ్ లోని డ్రగ్ మాఫియా నన్ను, తన కబంధ హస్తాల్లోకి తీసుకుంది. ఇక నేను ఆటల ట్రైనింగ్‌పై ఆసక్తి చూపక, మాదక ద్రవ్యాలకు బానిసనయ్యాను. పగలు, రాత్రి డ్రగ్స్ తీసుకోవడంలోనే మునిగిపోయాను. అలా కూరుకుపోయిన మూడు నెలల తర్వాత ఇన్స్టిట్యూట్ అధికారులు, మా నాన్నగారికి ఫిర్యాదు చేసి నన్ను ఇన్స్టిట్యూట్ నుండి డిబార్ చేశారు. మా నాన్న గారు వెంటనే పటియాలా వచ్చి, నన్ను ఈ హైద్రాబాద్‌కి తరలించారు. ఇక్కడ ఒక పేరుపొందిన పునరావాస కేంద్రంలో చేర్చారు.
ఐదు నక్షత్రాల హోటల్‌కు ఏమాత్రం తీసిపోని సౌకర్యాలున్న ఆ పునరావాస కేంద్రంలో నా మాదకద్రవ్య సేవన అలవాటును మాన్పించడానికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. మొదటి 15 రోజులైతే నేను వారిని చాలా ఇబ్బందులకు గురి చేశాను. చేతిలో ఏది ఉంటే అది వారిపై విసరడం, గోడకు తలను కొట్టుకోవడం, అప్పుడే ఏడవడం, మళ్లీ నవ్వడం, అలా ఎంతో వైలెంట్‌గా ప్రవర్తించాను. డ్రగ్స్ నాకు దొరకకపోయేసరికి విపరీతమైన ఒత్తిడికి గురై, అలా ప్రవర్తించాను. క్రమక్రమంగా సమూహ చికిత్స, నైపుణ్య తర్ఫీదు, డీటాక్స్ మందులు, యోగ, ఆటలు, సామూహిక సమావేశాలు, చర్చలు, మొదలైన పునరావాస చర్యలతో నేను మామూలు మనిషినయ్యాను. అదీ గాక నా జీవనశైలికి దగ్గరగా ఉన్న ఆ ఐదు నక్షత్రాల సౌకర్యాలు నాకు బాగా నచ్చాయి. అందుకే నా పునరావాసం ఊపందుకుంది. వారు నాకు, ప్రియమైన ఆటలో మంచి తర్ఫీదు నిచ్చి ఆరు నెలల్లో నన్ను మామూలు మనిషిని చేశారు. నేను మళ్ళీ నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ స్పోర్ట్స్‌లో చేరాను. అక్కడ సంవత్సరం పాటు తర్ఫీదు తీసుకొని హైదరాబాద్ తిరిగొచ్చాను. మా నాన్నగారి పరిచయాల వల్ల నాకు ఒక జాతీయ బ్యాంక్‌లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చింది.
ఆ సమయంలోనే హైదరాబాద్‌లో మాదక ద్రవ్య సేవన రాకెట్ ఉదంతం బయట పడింది. ఆ విషయంలో మీడియా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. అప్పుడు దిగివచ్చిన ప్రభుత్వం, ఒక ఉన్నత పోలీసు అధికారితో విచారణ జరిపించింది. అందులో ఎందరో రాజకీయ నాయకులు, సినిమా నటులు, ఇతర ఆడవారు, మగవారు అలా చాలా మంది మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారారని తేలింది. అయితే వారు ప్రముఖులు, ధనవంతులు అవ్వడం వల్ల తమ ధనం, పరపతితో ఆ విచారణ రిపోర్ట్ బయటికి రాకుండా చర్యలు తీసుకున్నారు. అది అలాగే అణచబడింది. అది నాకు నచ్చలేదు. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వ యంత్రాంగంలో మాదక ద్రవ్యాల సమస్యకు అంత తొందరగా పరిష్కారం కుదరదని అనిపించింది. అదీ గాక మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని ఛీదరించుకోకుండా వారిని సేవ స్పర్శతో అక్కున చేర్చుకోవాలనిపించింది. అందుకే ఈ ‘సేవా స్పర్శ’ సంస్థను స్థాపించాను. ఈ సంస్థ స్థాపన తర్వాత మా బ్యాంకు ఉద్యోగులు, వారి ద్వారా వివిధ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు వలంటీర్లుగా చేరారు. మా ఉద్దేశ్యాలు నచ్చి కొందరు విశ్రాంత ఉద్యోగులు కూడా మాతో కలిసి వచ్చారు.
మా నాన్నగారి పరిచయాలతో కొందరు దాతలు ఆర్థిక సహాయం అందించారు. ఇంకా అందిస్తూనే ఉన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని కంపెనీలు మాకు క్రమం తప్పకుండా నిధులు సమకూరుస్తున్నాయి. మీరంతా మా సంస్థ భాగస్వాములుగా ఉండి మమ్మల్ని ముండుకు నడిపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. చంద్రునికో నూలుపోగులా, గత సంవత్సరం, మాదక ద్రవ్యాలను వితరణ చేస్తున్న వారిని గుర్తించడానికి తమ అమూల్యమైన సహకారం అందించిన కొందరు వాలంటీర్లను సన్మానించడం మా విధి. అలాగే మా సేవా కార్యక్రమాల్లో మీరు మరింత చొరవతో భాగస్వాములైతే, మన ‘సేవా స్పర్శ’ కార్యక్రమాలను మరింత విస్తరించి, ఇంకొంత చురుకుగా సాగి పోవచ్చని నా అభిమతం. దయచేసి భోజనం చేసి వెళ్లండి. ధన్యవాదాలు.” స్వతంత్ర గారి ఉపన్యాసంతో సభ ముగిసింది.
దాదాపు ఇరవై మంది వాలంటీర్లను జ్ఞాపికలతో, ప్రమాణపత్రాలతో సన్మానించారు. అలాగే పునరావాసం కల్పించిన సంస్థల ప్రతినిధులను కూడా సత్కరించారు.
ఆ తర్వాత ఇంకొంత మందిని తమ కార్యకలాపాలలో భాగస్వాములుగా చేర్చుకునే ఉద్దేశ్యంతో ‘సేవా స్పర్శ’ సంస్థ, ఓ పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో, మాదక ద్రవ్యాల దుష్పరిణామాల అవగాహన సదస్సు నిర్వహించింది. ఆ విషయమై ఎంతో అనుభవం ఉన్న శ్రీ సారథి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. వారు తమ ప్రసంగంలో..
“మన దేశంలో మాదక ద్రవ్యాల వినియోగం గురించి ఎయిమ్స్ నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ (NDDTC) వారి 2018 లోని సర్వే ప్రకారం, పది నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య ఉన్న బాలలు, యువకులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు. అంటే ఆ వయసు ఉన్నవారిలో 6.06 శాతం మరియు 18 నుంచి 75 మధ్య వయసు ఉన్న వారిలో 24.71 శాతం మంది మాదక ద్రవ్యాల బారిన పడ్దారు. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ, మాదక ద్రవ్య నిరోధక, పునరావాస కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం చేస్తుంది. ఆ పథకం ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 285559 మందికి లబ్ది కల్పించారు. దాంట్లో మన తెలుగు రాష్ట్రాల వాటా దాదాపు ఇరవై రెండు వేల మంది. మాదక ద్రవ్యాల సేవనం అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన నషా ముక్త భారత్ అభియాన్ (ఎన్.ఎం.బి.ఎ.) కోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి తవర్ చంద్ గెహ్లాట్ 26 జూన్ 2021 న ఆవిష్కరించారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారతా శాఖ సహాయ మంత్రులు కృష్ణపాల్ గుర్జార్, రాందాస్ అథావలే, రతన్ లాల్ కటారియాల సమక్షంలో వెబ్సైట్ ఆవిష్కరణ జరిగింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నివారణ దినం సందర్భంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తు మందులు, మాదక ద్రవ్యాలనుంచి ప్రపంచాన్ని విముక్తి చేసేందుకు, వాటి దుర్వినియోగాన్ని నివారించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మాదక ద్రవ్యాల డిమాండ్‌ను తగ్గించేందుకు, వాటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాలకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తోంది.” సారథి గారు నీళ్లు తాగి తన ఉపన్యాసం కొనసాగించారు.
“మాదక ద్రవ్యాలు, మత్తుపదార్థాలు తీసుకుంటున్న వారిలో ఎకువ శాతం మంది ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. టీబీ, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులతో మంచం పడుతున్నారు. మత్తు పదార్థాలు సరదా కోసం అలవాటు చేసుకొని వాటికి బానిసలై అతిచిన్న వయసులోనే వృద్ధులుగా కనిపించేవారు కొందరుంటే, ఇంకొంత మంది జీవచ్ఛవాల్లా కాలం గడుపుతున్నారు. ముప్పై సంవత్సరాల క్రితం యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లడం అరుదుగా ఉండేది. ప్రస్తుతం, మాదక ద్రవ్యాలకు యువత బానిసవుతున్నది. చిన్న వయసులోనే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నది. మారుమూల ప్రాంతాల్లో గంజాయి భూతం జడలు విప్పుతున్నది. విద్యార్ధుల జీవితాలను మత్తులో ముంచేస్తున్నది. మత్తుకు బానిసగా మారిన యువతను టార్గెట్ చేసుకున్న గంజాయి మాఫియా, చివరకు వారినే ఏజెంట్లుగా మార్చి చాపకింద నీరులా తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నది. డ్రగ్స్‌కి అలవాటుపడ్డవారు సామాజిక సంబంధాలను సైతం కోల్పోతున్నారు. సన్నిహితులకు దూరంగా గడుపుతూ, తరచూ ఉద్రేకానికి లోనవుతుంటారు. డ్రగ్స్‌లో అనేక రకాలుంటాయి. ముక్కు ద్వారా పీల్చేవి, నోటితో, ఇంజెక్షన్ల రూపంలో తీసుకునేవి. పొగపీల్చేవి. మొదలగునైనవి. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కాలేజీ, పాఠశాలల్లో వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఆరా తీయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాగా, మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం. సందర్భంగా డ్రగ్స్ వాడకంతోనే దుష్పరిణామాలు, వచ్చే జబ్బులు, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రముఖ స్పెషల్ ఎడ్యుకేటర్ (మెంటల్ రిటార్డేషన్), రిహబిలిటేషన్ సైకాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సెలర్ డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి పలు విషయాలు వెల్లడించారు.
మాదక ద్రవ్య నిరోధక చర్యల గురించి కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతో చొరవ తీసుకుంటోంది. దేశంలో మాదక ద్రవ్యాల వినియోగదారుల సంఖ్య ఆరుకోట్లకు పైగానే ఉందని, మాదక ద్రవ్యాలను వినియోగదారుల్లో ఎక్కువ మంది పదినుంచి పదిహేడేళ్ల వయస్సు కలిగిన వారేనని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ సమగ్ర సర్వే తెలియజేస్తున్నట్టు మంత్రి గెహ్లోట్ చెప్పారు. మాదకద్రవ్యాల వినియోగ కట్టడి వ్యవహారాల్లో తమ మంత్రిత్వ శాఖ నోడల్ శాఖగా పనిచేస్తుందని అన్నారు. మాదక ద్రవ్యాలు, వాటి దుష్పరిణామాలు తదితర సమస్యల పరిష్కారానికి తమ శాఖ ఎన్నో చర్యలు తీసుకుందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టే జాతీయ కార్యాచరణ కార్యక్రమం (ఎన్.ఎ.పి.డి.డి.ఆర్.) కింద దేశవ్యాప్తంగా 500 స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. దేశాన్ని మాదకద్రవ్య రహితంగా తయారు చేసే కార్యక్రమాల్లో ఈ స్వచ్ఛంద సంస్థలన్నీ క్రియాశీలంగా పాల్గొంటున్నాయన్నారు. మాదక ద్రవ్యాల దుష్పరిణాలను తెలియజెప్పేందుకు ఈ స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు ప్రతి ఇంటికీ, ప్రతి గ్రామానికి, ఆయా గ్రామాల సమీప ప్రాంతాలకు వెళ్లారని, మాదక ద్రవ్యాల వినియోగంతో బాధితులైన వారికి పునరావాసం కల్పించేందుకు వంలటీర్లు సహాయపడ్డారని కేంద్రమంత్రి వివరించారు. దేశంలో కోవిడ్ వైరస్ వ్యాప్తి సంక్షోభం తలెత్తినప్పటికీ, ‘నశా ముక్త భారత్ అభియాన్’ పథకం కార్యకలాపాలు పూర్తి స్థాయిలో మంచి ఊపుతో కొనసాగాయని అన్నారు. మాదక ద్రవ్యాల బెడదను ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే నివారించగలం కాబట్టి, నశా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాల్లో సామాన్య ప్రజలు కూడా పాలుపంచుకోవాలని కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ చర్యలతో పాటు సేవా స్పర్శ లాంటి సామాజిక సంస్థలు కూడా మాదక ద్రవ్య నిరోధక ఉద్యమంలో పాలు పంచుకుంటే మన ప్రజలకు మేలు జరుగుతుంది. సరిఐన పునరావాస చర్యలు తీసుకుంటే మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని మళ్లీ జన స్రవంతిలోకి తీసుకురావచ్చు. ఈ సందర్భంలో ప్రముఖ సినీ నటుడు సంజయ్ దత్ ఉదంతం మన కళ్ళ ముందు ఉంది. అతను ఒకప్పుడు మాదక ద్రవ్య సేవనలో మునిగినప్పుడు, అతని తల్లిదండ్రులు మంచి పునరావాస కేంద్రంలో చేర్పించారు. ఇది జరిగి పాతిక సంవత్సరాలకు పైనే అవుతుంది. అతను ఇంకా సినిమాల్లో చురుగ్గా నటిస్తూనే ఉన్నాడు. సేవా స్పర్శ లాంటి ఎన్నో లాభరహిత సంస్థలు కూడా ఈ యజ్ఞంలో సమిధలౌతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వారికి నా అభినందనలు. శుభాకాంక్షలు” సారథి గారు తన ఉపన్యాసం ముగించారు.
ఆ తర్వాత స్వతంత్ర గారు ‘సేవా స్పర్శ’ కార్యక్రమాలను మరింత విస్తరించారు. కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పి వారి నుండి ఆర్థిక సహాయం కూడా మంజూరు చేయించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపి ప్రభుత్వం ద్వారా మాదక ద్రవ్య బానిసలకు ఉచిత పునరావాస కేంద్రాల స్థాపనలో చొరవ తీసుకున్నారు. అలా ‘సేవా స్పర్శ’ మాదక ద్రవ్య బెడదను అరికట్టడానికి ఊడుత సాయం అందిస్తోంది. అలాంటి ఇంకెన్నో సంస్థల, వాటి సారథులుగా ‘స్వతంత్ర’ల అవసరం మన దేశానికి ఉంది.
