[మండుతున్న ఎండల గురించి నానీలు అందిస్తున్నారు పారుపల్లి అజయ్ కుమార్.]
సూర్యుడి కోపం
భూమికి తాపం
తరువులు పెంచితే
తరుగును తపనం..
~
ఎండలకు
నేలంతా నెర్రిచ్చే
మేఘం దిగొచ్చేలా
మల్హర్ రాగం పాడండి..
~
ప్రాణకోటికి జీవాధారం
సూర్యుడే
కన్నెర్ర చేస్తే
ప్రాణులన్నీ విలవిలా..
~
ఎదురు చూస్తున్నా
వాన చినుకు కోసం
దాహం తీరని
చాతక పక్షిలా..
~
మండే ఎండలు
వీడ్చే గాడ్పులు
బుగ్గి చేస్తున్నాయ్
పేదవారి బతుకులను..
~
దినదిన గండం
బతుకొక నరకం
మండుటెండల్లో
కూలోళ్ళ వెతలు..
~
నీరింకిపోయిన బావి
ఆశగా యెదురు చూస్తున్నది
కురిసే
వానకోసం..
~
ఆకాశంలో మబ్బులు లేవు
నేలపై నీళ్ళు లేవు
మండే ఎండల
కాలం ఇది..
~
పిట్టగోడ మీద
పిచ్చుకల కేరింతలు
గిన్నెలో నీరంతా
తాగాయి మరి..
~
కర్ఫ్యూ పెట్టలేదు
గానీ రోడ్లన్నీ నిర్మానుష్యం
భానుడి
భగభగలకు..
శ్రీ పారుపల్లి అజయ్ కుమార్ పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకులు. ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణవాసి.
సాహిత్యం అంటే ఇష్టం. నవలలు చదవటం మరీ ఇష్టం. పదవి విరమణ తరువాత సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మంలో ‘పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట – చావా రామారావు మినీ రీడింగ్ హాల్’ పేరిట ఒక చిన్న లైబ్రరీని తమ ఇంటి క్రింది భాగంలో నిర్వహిస్తున్నారు. సుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి. నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు.. రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు.
ఉచిత లైబ్రరీ.. మంచినీరు, కుర్చీలు, రైటింగ్ ప్యాడ్స్, వైఫై, కరెంటు అంతా ఉచితమే. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల దాకా ఉంటారు.