ఆ రోజు…
నీ చిరునవ్వుల వెన్నలతో
నా హృదయం నిశీధిలో
ఆనందం వెలుగులు పరిచావు!
నీ కొంటె చూపుల మత్తులో
నా గుండె గల్లంతైన వేళ…
కస్తూరి పరిమళాల చందనంతో
నీ పాదాలను అభిషేకించాను!
నా కోసం…
నువ్వు అన్నీ వదులుకున్నావని
నీ కోసం…
నన్ను నేనే వదులుకున్నాను!
చలిపొద్దుల్లో…
కౌగిలి పద్దులు రాశావు!
నీ బుగ్గల్లో సిగ్గుల మొగ్గలు
విరబూసిన వేళ…
నా ఎద కుంపటిలో సేదదీరి
వేడి సెగలు రగిలించావు!
నీ తనువులోని రస సౌందర్యం
వెన్నెల నిండిన సముద్రమై
నన్ను నీతో కలిపేసుకున్న
అమృత ఘడియల్లో…
విశ్వవిజెతలా పొంగిపోయాను!
నా జీవన ఆనంద నందనంలో
జ్ఞాపకాల మోడుల్ని మిగిల్చి
విషాదం లోయల్లోకి నెట్టేసి
సుదూర తీరాలకు వెళ్ళిపోయావు!
దశాబ్దాలు గడిచినా
నన్ను చేరుకుంటావనే ఆశ మాత్రం
ఆకాశంలా పెరిగిపోయింది!
ప్రేయసీ…!
ఈ చలి పొద్దులలో
మంచుతో బాటు
మధుర జ్ఞాపకాలను
మదిలో నింపుకొని
వెచ్చటి ఊహల శిబిరంలో
నీ కోసం…
కోటి జతల కన్నులతో ఎదురుచూస్తూ…!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.