Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మంచి ఆలోచనలు మనకుండాలోయ్!

[శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన ‘మంచి ఆలోచనలు మనకుండాలోయ్!’ అనే నాటికని అందిస్తున్నాము.]

~

పాత్రలు:

క్రాంతి (పు): 25 సంవత్సరాలు

ఆనందరావు (పు): 45 సంవత్సరాలు

ప్రజ్ఞ (స్త్రీ): 23 సంవత్సరాలు

సౌందర్య (స్త్రీ): 23 సంవత్సరాలు

భాగ్యం(స్త్రీ): 40 సంవత్సరాలు

***

పక్షుల కిలకిలారావాలు వినిపించాలి. పిల్లలు ఆడుకుంటున్న శబ్దాలు. అదొక పార్కు అని తలపించాలి.

~

క్రాంతి: ఓ! ఆనందరావు మామయ్యా! రండి! రండి! ఇలా కూర్చోండి. నా ప్రక్కన.

ఆనందరావు: బాగున్నావా క్రాంతీ? బాగుంటావులే. నిన్ను చూస్తుంటేనే తెలుస్తోంది.

క్రాంతి: మీరు అమెరికాలో ఉన్నారని అన్నారు. ఎప్పుడు వచ్చారు?

ఆనందరావు: రెండు రోజులయింది. ఈ మట్టి మీద నడిచి, ఈ నేల మన వాసన పీల్చి, ఇక్కడ మన భాషలో నాలుగు తెలుగు మాటలు వింటే.. కానీ నా మనసు శాంతపడలేదు అనుకో.

క్రాంతి: మన దేశం, మన ప్రాంతం, మన భాష మీద అభిమానం అలాంటిది కదు మామయ్యా!

ఆనందరావు: అబ్బ! మామయ్యా! ఎంత ఆప్యాయమైన పిలుపు? ఈ ‘అంకుల్, అంకుల్!’ అనే మాట వినలేక చచ్చిపోతున్నాననుకో!

క్రాంతి: నిజమే! మన పిలుపుల్లో ఆప్యాయత తొణికిసలాడుతుంది.

ఆనందరావు: దాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు? బిచ్చగాడు కూడా ధర్మం చెయ్యండి అంకుల్ అనే.

క్రాంతి (నవ్వుతూ): హఁ! హఁ! హఁ!

ఆనందరావు: పెద్దోడు లేదు, చిన్నోడు లేదు, అందర్నీ అంకుల్ అనటమేనోయ్ విడ్డూరంగా.

క్రాంతి: జనం అలా అలవాటు పడిపోయారు మామయ్యా.

ఆనందరావు: ఏమైనా ఇలాంటి చెడ్డ చెడ్డ అలవాట్లను మనకు మనమే మార్చుకోవాలి క్రాంతీ. ఏమంటావ్?

క్రాంతి: అంతే కద మామయ్యా! ఎవరో వచ్చి మార్చాలని చూడటంలో అర్థం లేదు.

ఆనందరావు: బాగా చెప్పావు. ఇంతకీ నీ పెళ్ళి విషయం ఎంత దాకా వచ్చింది?

క్రాంతి: అమ్మాయిలకు ముప్పై వేలు జీతం నెలకు వస్తే చాలదట. కనీసం అరవైవేలు ఉంటే కానీ చేసుకోమంటున్నారు.

ఆనందరావు: పిదప కాలం.. పిదప బుద్ధులు.

క్రాంతి: అలా రావాలంటే నాకు ముప్పై వయసు రావల్సిందే.

ఆనందరావు: అవునురా క్రాంతీ! ముప్పై ఏళ్ళ అంటే ఇదివరలో ముదిరిపోయిన బెండకాయ అనేవాళ్ళం.

క్రాంతి: ఇప్పుడందరికీ ఆ వయసుకే పెళ్ళిలకు అవుతున్నాయి. కారణాలు ఏమైనా.

ఆనందరావు: డేటింగ్ లంటూ తిరగటం, ఏదో నచ్చని విషయం చూసుకుని విడిపోవటం.. ఏమిటో?!

క్రాంతి: మన సాంప్రదాయం కాని దాన్ని పట్టుకుని వేళ్ళాడడం నాకూ ఇష్టముండదు మామయ్యా.

ఆనందరావు: భార్యాభర్తలయితే ఒకరిలో ఒక తప్పు కనిపించితే సర్దుకుపోతారు. డేటింగ్‌‍లో అది ఉండదుగా.

క్రాంతి: నిజం చెప్పారు.

ఆనందరావు: అవన్నీ లేకుండానే పెళ్ళిళ్ళు చేసుకుని ఇప్పటి దాకా మేము సంసారాలు చెయ్యట్లా?

క్రాంతి: పెళ్ళి చేసుకున్నాక కూడా విడిపోవటాలు ఎక్కువయి పోతున్నాయి. అసలు పెళ్ళి అంటేనే భయం వేస్తోంది!

ఆనందరావు: భలే వాడివే క్రాంతీ. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులోకి రానివ్వకు.

క్రాంతి: ఏమో!

ఆనందరావు: ఎక్కడో నీ కోసం ఓ మంచి అమ్మాయి పుట్టి పెరిగే ఉంటుంది. దొరుకుతుందిలే.

క్రాంతి: ఎప్పుడో? ఎవరికెవరు రాసి పెట్టి ఉందో ముందే తెలిసిపోతే ఈ వెతుకులాట తప్పుతుంది కద మామయ్యా.

ఆనందరావు: ఎంత ఆశరా?

క్రాంతి: ఆశ కాదు అత్యాశే! సరదాకి అన్నానులే. సరే! బయలుదేరుతాను.

ఆనందరావు: అత్తయ్యకి చెప్పి, నేనూ నీ కోసం సంబంధాలు వెతుకుతాను.

క్రాంతి: అలాగే మామయ్యా!

ఆనందరావు: నువ్వు వస్తావా? కాసేపు ఇక్కడ కూర్చుంటావా?

క్రాంతి: ఒక పదినిముషాలు కూర్చుని వస్తాను. మీరు వెళ్ళండి.

***

జేగంటలు వినిపించాలి, గుడి వాతావరణం ప్రతిఫలించేలా..

~

ప్రజ్ఞ: సౌందర్యా! మొన్న నీకు వచ్చిన సంబంధానికి ఒప్పుకున్నావా? లేదా?

సౌందర్య: లేదే! వాళ్ళకు ఉద్యోగం చెయ్యాలట. నాకైతే చెయ్యటం ఇష్టం లేదు.

ప్రజ్ఞ: అవునే! ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలు చెయ్యాలనుకుంటే ఎలా?

సౌందర్య: ఆస్తి ఉండటం, ఉండకపోవటం కాదే! ఇంట్లో పని, బయట పని మన మీద పడుతోందిగా.

ప్రజ్ఞ: నువ్వు చెప్పేదే కరెక్టే. ఇద్దరూ ఉద్యోగాలకి వెళ్ళేప్పుడు అన్ని పనులూ ఇద్దరూ చేసుకోవాలిగా.

సౌందర్య: అలా అందరూ అనుకోవటం లేదు. మనం ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలనే చదువుకున్నాము.

ప్రజ్ఞ: అది నిజమే కదా!

సౌందర్య: రెండు పడవల మీద కాళ్ళు వేసి నేను ప్రయాణం చెయ్యలేనే.

ప్రజ్ఞ: అంతేలే! మన ఓపికను బట్టే మన భావాలు కూడా.

సౌందర్య: అవునే, నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అవి కలిసిన వాళ్ళనే పెళ్ళి చేసుకోవాలని.

ప్రజ్ఞ: మనకు మాత్రం ఉండవా? కట్నాలకు కట్నాలు కావాలంటారు, ఉద్యోగమూ చెయ్యాలంటారు ఈ మగవాళ్ళు.

సౌందర్య: అందుకేగా అసలు కట్నం అడిగే మగవాడిని నేను పెళ్ళి చేసుకోకూడదనుకుంటున్నాను.

ప్రజ్ఞ: అలా ఎవరుంటున్నారే! అమ్మాయి బాగుంటే కాస్త కట్నం తగ్గిద్దామమకుంటున్నారు. అంతవరకే.

సౌందర్య: లేదు లేవే! కొందరు తమ ఖర్చుతో కూడా వెళ్ళి చేసేసుకుంటున్నారు అమ్మాయి బాగుంటే.

ప్రజ్ఞ: అలా కొందరే! అక్కడక్కడ!

సౌందర్య: అమ్మాయిలు తగ్గాక అబ్బాయిల ఆలోచనలు కూడా మారుతున్నాయిలే.

ప్రజ్ఞ: అదే పూర్తిగా మారాలంటున్నాను.

సౌందర్య: అది అసాధ్యంలే. నరనరాలలో ప్రాకిపోయిన సాంప్రదాయాన్ని కొంచెంకొంచెమే వదల కొట్టాలి.

ప్రజ్ఞ: ప్రారంభించాంగా.

సౌందర్య: మనలా అందరూ అనుకోవాలిగా.

ప్రజ్ఞ: అలా అందరూ అనుకొంటే దీన్ని ఎప్పుడో సాధించేవాళ్ళం.

సౌందర్య: లేదు లేదు అనుకొని ఎన్నాళ్ళు ఊరుకుంటాం? ఇకనుంచైనా మనం నిర్ణయించుకోవాలి.

ప్రజ్ఞ: అవునే.

సౌందర్య: ఇక వెళదామా?

ప్రజ్ఞ: పద!

***

ఆనందరావు: భాగ్యం! వంటింట్లో నీ సర్దుడు ఇంకా అవలేదా?

భాగ్యం: వచ్చేస్తున్నానండీ.

ఆనందరావు: పార్కులో క్రాంతి కలిసాడు. మంచి సంబంధం చూస్తానని చెప్పాను.

భాగ్యం: ఎవరయినా మీకు తెలిసిన వాళ్ళున్నారా?

ఆనందరావు: ఆఁ!

భాగ్యం: (ఆత్రంగా) ఎవరండీ?

ఆనందరావు: మన ప్రజ్ఞ అయితే ఎలా ఉంటుందంటావ్?

భాగ్యం: భేషుగ్గా ఉంటుంది

ఆనందరావు: వాళ్ళూ మంచి సంబంధం కోసం ఎదురుచూస్తున్నారు.

భాగ్యం: ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు సరిపోతారనిపిస్తోంది.

ఆనందరావు: క్రాంతి అలా అనగానే నాకు మనసులో ప్రజ్ఞే గుర్తు వచ్చింది. నేనయితే పేరు చెప్పలేదు.

భాగ్యం: వాళ్ళను కూడా కదిపి వాళ్ళిష్టం కూడా తెలుసుకున్నాక చెబుదాం. తొందరపడకండి.

ఆనందరావు: సరే లే.

భాగ్యం: ఇలాగే అంటారు. గబుక్కున చెప్పేస్తారు. ఎవరు మిమ్మల్ని నమ్ముతారు?

ఆనందరావు: పెళ్ళైనప్పటి నుంచీ ఇదే పాట.

భాగ్యం: (కాస్త వ్యంగ్యంగా) మరే!

ఆనందరావు: ఏం చేస్తాం? నీకు నేను, నాకు నువ్వేగా!

భాగ్యం: పిల్లలు మనల్ని కాదనుకున్నాక ఇలా అనుకోక మరెలా అనుకుంటాం?

ఆనందరావు: అందుకే కదా! పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతలని రాయలేం అని అన్నారు పెద్దవాళ్ళు.

భాగ్యం:  వాళ్ళంత బాధ్యతారహితంగా ఉంటుంటే మనమేమీ అనకపోవడం తప్పు కాదాండీ.

ఆనందరావు: పిచ్చిదానా! అన్నీ తెలిసి – వాళ్ళు అలా మాట్లాడుతుంటే మనమేం అనగలం?

భాగ్యం:  అసలు తల్లి తండ్రులను చూడమని ఈ పిల్లలు ఎలా చెప్పగలుగుతున్నారండీ?

ఆనందరావు: అందుకేగా పిల్లలు లేని వారు మనలాంటి వారిని చూసి బాధపడటం మానేస్తున్నారు.

భాగ్యం: అవునండీ.

ఆనందరావు: ఇంకో విడ్డూరం విన్నావా? శైలజ, సుబ్రమణ్యంకి ఈ మధ్యేగా పెళ్ళయింది.

భాగ్యం: అవును

ఆనందరావు: వాళ్ళు అసలు పిల్లలనే కనరట.

భాగ్యం: అదేం చోద్యమండీ?

ఆనందరావు: పెద్దయ్యాక వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకపోతే భరించే శక్తి మాకు లేదన్నది వాళ్ళ వాదన.

భాగ్యం: ఇలా అనుకుంటే సృష్టి ఆగిపోదటండీ.

ఆనందరావు: ఈ యువతరం ఆలోచనలు ఎటు పోతున్నాయో.. అర్థం కావటం లేదు.

భాగ్యం: బాగా చెప్పారు. గర్భం దాల్చినప్పటి నుంచే కడుపులో పిల్లల కదలిక ఎంత అనుభూతి ఇస్తుంది?

ఆనందరావు: అనుభవిస్తే కదా తెలియటానికి.

భాగ్యం: వాళ్ళ బుజ్జి బుజ్జి చేతులు, బుజ్జి కాళ్ళు, వాళ్ళు చేసే అల్లరి పనులు. ఎంత బాగుంటాయో.

ఆనందరావు: మనకు సాయపడాలని వాళ్ళు పడే తాపత్రయం అన్నిటికన్నా ఇంకా బాగుండేది.

భాగ్యం: అంత ప్రేమా పెళ్ళాం కొంగు తగలగానే ఎలా మాయమయిపోతుందో?

ఆనందరావు: రెక్కలు రాగానే పక్షులు ఎగిరిపోవా? ఇదీ అంతే!

భాగ్యం: అలా అనుకోలేక పోవటమే మన దౌర్భాగ్యం.

ఆనందరావు: ఎందుకలా బాధపడతావు? అసలు వాడు మనకి పుట్టలేదనుకో.

భాగ్యం: అలా ఎలా అనుకోగలం? ఈ వయసులోనేగా అండ దండ కావల్సింది?

ఆనందరావు: అందుకేగా ఊరికో వృద్ధాశ్రమం వెలుస్తోంది.

భాగ్యం: అది ఈ సమస్యకు పరిష్కారం కాదండీ.

ఆనందరావు: నాకు మాత్రం అది తెలియదా? ఇప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి.

భాగ్యం: పరిస్థితులు అనేవి మనం కల్పించుకొనేవేగా. ఈ వృద్ధాశ్రమాలు అసలు ఉండకూడదు.

ఆనందరావు: సరేలే! ఇప్పుడు అవే చాలామందిని కాపాడుతున్నాయి.

భాగ్యం: అలాంటివి ఉన్నంతవరకూ ఇలాంటి వారిలో మార్పు రాదని నా నమ్మకం.

ఆనందరావు: ఎంతమంది తల్లి తండ్రులను నడిరోడ్డులో వదిలిపెట్టి వెళ్ళిపోవటం లేదు? వాళ్ళనేమంటావు, అది చెప్పు?

భాగ్యం: అంతే లెండి. మంచి బుద్ధి లేని వారికి మంచి ఆలోచనలు ఎలా వస్తాయి?

ఆనందరావు: రేపు వాళ్ళ పిల్లలు అదే తీరులో ప్రవర్తించినప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు.

భాగ్యం: అంటే మనలాంటి తల్లితండ్రులకు ఈ ఒంటరితనం బాధ తప్పదంటారు.

ఆనందరావు: భాగ్యం! అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తావే!

భాగ్యం: ఏం చెయ్యనండీ! పిల్లాడినీ, వాడి ప్రేమనూ మరిచిపోవటం నా తరం కావటం లేదు.

ఆనందరావు: నా వల్ల మాత్రం అవుతుందా?

భాగ్యం: మరి నాకు అలా చెబుతారేం?

ఆనందరావు: ఇంకోలా చెప్పటానికి ఏం లేదు కనుక.

భాగ్యం: మొన్నటి దాకా మన అవసరమే వాడి అవసరం అన్నట్లు ఉండేవాడుగా.

ఆనందరావు: అబ్బా! భాగ్యం! పదే పదే అదే మాటా! వదిలెయ్!

భాగ్యం: కడుపుతీపి అంతలా వదిలేసేది కాదండీ.

ఆనందరావు: సరే బాధపడు.

భాగ్యం: మీకు లాగా గుంభనంగా ఉండటం నాకు చేతకావటం లేదండీ.

ఆనందరావు: మేము కన్నీళ్ళు పెట్టుకుంటే నవ్వుతారు(రే).

భాగ్యం: ఎలాగయినా మీకు గుండె నిబ్బరం ఎక్కువ.

ఆనందరావు: అదేం కాదు. నేను కూడా నీలా డీలా పడితే నువ్వు తట్టుకోలేవు.

భాగ్యం: వాడెంత మాటన్నాడు? వాడు సంతోషంగా ఉంటే మనం చూడలేక పోతున్నామా?

ఆనందరావు: వాడు వెళ్ళాం మోజులో ఉన్నాడు. ఏదో మాట్లాడుతున్నాడు.

భాగ్యం: అలా అని ఎంతమాట పడితే అంత మాట అనెయ్యటమేనా అని.

ఆనందరావు: వాడు అంత ఆలోచించగలిగితే మనమింత బాధ పడాల్సిన అవసరమే లేదుగా

భాగ్యం: ఏమిటోనండీ, భగవంతుడు మన కిలాంటి కష్టం రాసాడేమిటో?

ఆనందరావు: ముందు జన్మలో ఏదో పాపం చేసి ఉంటాం. ఈ జన్మలో అనుభవిస్తున్నాం.

భాగ్యం: అంతేనంటారా?

ఆనందరావు: కర్మ ఫలం అనుభవించక తప్పదు.

భాగ్యం: ఎన్నాళ్ళ మనకీ బాధలు?

ఆనందరావు: అది తీరిపోయేంత వరకే.

భాగ్యం: అలాగే ఉంది.

***

క్రాంతి: ప్రజ్ఞా!

ప్రజ్ఞ: ఊఁ!

క్రాంతి: ఆనందరావు గారు, భాగ్యం గార్ల వల్ల మనమో ఇంటి వాళ్ళమయ్యాం.

ప్రజ్ఞ: అవును క్రాంతీ..

క్రాంతి: వాళ్ళ రుణం తీర్చుకునేది కాదు.

ప్రజ్ఞ: తీర్చుకోవచ్చు.

క్రాంతి: ఎలా?

ప్రజ్ఞ: మన తల్లి తండ్రులను ప్రేమగా మానుకోవడం ద్వారా.

క్రాంతి: బాగా చెప్పావు ప్రజ్ఞా!

ప్రజ్ఞ: వాళ్ళు పొందలేని ఆనందాన్ని ఎదుటి వారిలో చూసైనా సంతోషపడదాం అనుకొనే వాళ్ళు అలాగే ఉంటారు.

క్రాంతి: మనకు చెప్పకపోయినా వాళ్ళ మనసులో భావన అదే! నాకు తెలుసు.

ప్రజ్ఞ: మా అమ్మావాళ్ళకు నేనొక్క దాన్నే కూతుర్ని. నేను కాక వాళ్ళనెవరు చూసుకుంటారు?

క్రాంతి: అవును. మీ అమ్మా నాన్నలనే మనతోనే ఉండమందాం. మా వాళ్ళు ఎలాగూ నాతోనే ఉంటారు. అందరం కలిసే ఉందాం.

ప్రజ్ఞ: అమ్మా వాళ్ళు ఈ మాట వింటే ఎంతో సంతోషపడతారు.

క్రాంతి: వారి ఆనందమే కదా మనకు కావల్సింది.

ప్రజ్ఞ: మీలా అల్లుళ్ళు అందరూ ఆలోచిస్తే ఎంత బాగుంటుంది?

క్రాంతి: అలా ఆలోచించటం మాట తర్వాత. ముందు వాళ్ళంతా కలిసి నా మీదకు దండయాత్రకు రాకుండా ఉంటే అదే పదివేలు.

ప్రజ్ఞ: అలాగంటారా?

క్రాంతి: కాదా మరి అందరూ ఒంటి కాయ శొంఠి కొముల్లా ఒంటరి కాపురాలు కోరుకుంటుంటే..?

ప్రజ్ఞ: (మాట కలుపుతూ) ఉమ్మడి కుటుంబంలా కలసి ఉండమంటున్నాం. కష్టమే మరి.

క్రాంతి: పాత ప్యాషన్లు ఇప్పుడు కొత్త ఫ్యాషన్లుగా అవతారం ఎత్తడంలా.. ఇదే అంతే!

ప్రజ్ఞ: అలా మారితే ఎందరో తల్లి తండ్రుల్లో ఉన్న వ్యథ తీరిపోతుంది సుమా!

క్రాంతి: జరగబోయేది అదే ప్రజ్ఞా.

ప్రజ్ఞ: మీ మాటలు వింటుంటే నా మనసుకు ఎంత హాయిగా ఉందో!

క్రాంతి: చెడు ఆలోచనలను ఎప్పుడయితే మనం ప్రక్కకు పెడతామో అప్పుడు మనకు ఈ శాంతి వద్దన్నా దొరుకుతుంది.

ప్రజ్ఞ: నిజమే క్రాంతీ! మంచితోనే మన ప్రయాణం అనుకుంటే అందరూ బాగుపడతారు.

క్రాంతి: మనతో పాటూ మన దేశం కూడా!

ప్రజ్ఞ: అవునవును. భలే చెప్పారు.

క్రాంతి: మన మొక్కరం ఇలా అనుకుంటే సరిపోదు ప్రజ్ఞా! అందరూ కలిసి మనతో నడవాలి.

ప్రజ్ఞ: అప్పుడే కదా కలిసి ఉంటే కలదు సుఖంలో గొప్పతనం తెలిసేది?

క్రాంతి: అదే కదా మనం అందరికీ చెప్పాలనుకున్నది.

(క్రాంతి, ప్రజ్ఞ కలిసి నవ్వుతారు ఇద్దరూ!)

సమాప్తం

Exit mobile version