[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘మంచం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
మంచం ఒకటే
వాటాదారులం ఇద్దరం
ఏ రేఖా విభజనల్లేవు
ఎలాంటి సరిహద్దుల్లేవు
సాఫల్యాల లెక్కలు
వైఫల్యాల బేరీజులు
సమీక్ష సమాలోచనలు
అన్నీ ఇచ్చోటి నుండే
పడగ్గది సామ్రాజ్యంలో
ఉభయ సింహాసనం
అంటే ద్విఛత్రాధిపత్యం
ఏ పోరులేని ఆధిపత్యం
మాటలు మంతనాలు
వ్యూహ రచనలు
భవిష్య రూపకల్పనలు
అన్నీ ఇక్కడి నుండే
నిరాశ నిస్పృహలకు
వైరాగ్యపు ఛాయలకు
నైరాశ్యపు వేదనలకు
సాక్ష్యం కూడా మంచమే
సుఖనిద్రకై శయనించే
భూతల స్వర్గమే అయినా
ఇరువురి వాద సంవాద
రంగస్థలం కూడా మంచమే