[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘మానవ మృగాల విశృంఖల హేల!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆ నడిరేయి నిశ్శబ్దంలో
నాలుగు గోడల నడుమ ఆ ‘అమ్మ’ రోదన
‘బంగాళాఖాతం..’
సముద్రఘోషలో కలిసి పోయింది!
మానవ మృగాల వికృత వికార చేష్టలను
ఎదిరించి నిలువలేని నిస్సహాయురాలై
మృత్యుగహ్వరంలో
విగత జీవిగా కనిపించిన దృశ్యం..
కన్నులలో బడబాగ్నిని రగిల్చి
హృదయాన్నినిప్పుల కొలిమిగా మార్చింది!
నా గుండె గోడలను
పదునైన శూలాలతో
ఛిద్రం చేస్తున్నారు కిరాతకులెవ్వరో!
మనసు గదులు రక్తసిక్తమై
వేదనా రుధిరం వరదలై
నా అంతరంగం నుండి
ప్రవాహ వేగంతో పరుగులు తీస్తోన్న వేళ..
నా మది మూగగా విలపిస్తోంది!
విశ్వమానవ జగతికి
సుగంధ పరిమళాలు వెదజల్లే
సుమనోహర వికసిత కుసుమాలు
కర్కశ మనుష్య జాతి
రాతి పాదాల క్రింద
నలిగి నశించి పోవలసిందేనా?
అమ్మ..
ఎవరికైనా అమ్మేగా!?
మరి..
బిడ్డకు పాలిచ్చే తల్లి రొమ్ములో
శృంగారాన్నిమాత్రమే చూస్తూ
కామాంధుడై..
మానసిక వికలాంగుడై..
అమ్మను చెరబట్టే దుస్థితికి
దిగజారి పతనమైపోయాడు..
సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకొని
శూన్యాకాశంలో..
విచిత్రాలను.. వింతలను
ఆవిష్కరిస్తోన్న..
ఆధునిక మానవుడు!!!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.