[శ్రీ వీరేశ్వర రావు మూల రచించిన ‘మానవ బంధాలు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
మానవ బంధాలన్నీ
ఆర్ధిక బంధాలే అన్న
మార్క్స్ మాటలకి ముచ్చట పడిపోతాం!
ఎక్కువ తక్కువ
లెక్కలయ్యాక
వలసపక్షిగా స్ధిరమయ్యాక
జన్మను ఇచ్చిన వాళ్ళు
ఆశ్రమవాసులయ్యాక
బంధాలు గురించి వెతకడమంటే
రాతిలో తేమను తోడడమే!
నాతి లిప్‌స్టిక్ నవ్వులకు
భాష్యాలు చెప్పడమే?
ప్రభుత్వాలు వాగ్ధానాలు గుమ్మరించి
గద్దె నెక్కాక,
నేతలు మూటలన్నీ స్విస్‌లో
జమ అయ్యాక
వెయ్యిలో ఒకడికి శిక్ష పడుతుంది!
మీడియా అచ్చే దిన్ అని వంత పాడుతుంది
ఏళ్ళ తరబడి
స్వేదం
వెయ్యి రూపాయిల పిఎఫ్
పింఛనుగా
ఘనీభవిస్తుంటే,
పేగుబంధాలు
ఎక్కువ రాని పింఛను గురించి
ప్రేలాపనలు
ప్రారంభమయ్యాక
విశ్వవీధిలో
భారతం దూసుకుపోయిందని
అంటే
అవాక్కయిపోతాడు సామాన్యుడు!
డబ్బు డబ్బుని ప్రేమిస్తుంది
వస్తు ప్రపంచంలో కొలతలు
వస్తు సేకరణ తోనే
ప్రారంభమవుతాయి!
విలువలు లుప్తమవుతాయి!
సాయం చెయ్యని చేతులు
సైబర్ నేరగాళ్ళకి
లక్షలు సమర్పించు కుంటాయి!
తృష్ణలన్నీ మృగతృష్ణలన్నీ అయ్యాక,
సత్యమేదో జీవన సంధ్యా సమయానికి,
అవగతమయ్యాక
ఏది శాశ్వతం అని
మీమాంస మొదలయినా
వేలు రెండో పురుషార్థం దగ్గర ఆగిపోతుంది!