Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మనసుతో మాటాడు!

[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘మనసుతో మాటాడు!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

నాకు నా మనసు తోడు
కలత పడితే ఓదారుస్తుంది
కన్నీరు వస్తే తుడిచివేస్తుంది
జీవితంలో వెలుగునీడలు సహజమే
అని అనుభవం చెబుతుంది
నిన్ను నిన్నుగా ప్రేమించు
నీ కోసం నువ్వే సేదతీరు
గతాన్ని మర్చిపో
ధైర్యమనే స్నేహాన్ని తోడు తెచ్చుకో
అది నిన్ను గుండెకు హత్తుకుంటుంది
ఎదుటివారి సహకారం లేకుంటే
జీవితం సఫలం కాదు
అది నీ తప్పు కాదు
నీ విలువ తెలియని మనిషిని
దూరంగానే వుంచు
అర్థం చేసుకుంటే ఆదరించు
మనసుకి శాంతినిచ్చేది సంగీతం
ఆహ్లాదం కలిగించేది ప్రకృతి అందం
నీ మనసులోకి వచ్చే ఆలోచనలు
డైరీలో రాసుకో
అది నీతో పంచుకుంటుంది
మనసుకి కార్బన్ కాపీ వంటిది డైరీ
అది ఎప్పుడైనా రాసుకోవచ్చు నీ ఇష్టం
గడిచినవి ఇప్పటివి రేపటివి
సంక్షిప్తం చేసుకో
మనసు తేలికపడుతుంది
మనసుకి మలినం అంటదు
అద్దం మీద మరకను తేలికగా తుడిచివేయి
రెండిటికి పోలికలు ఒకటే
విరిగిపోతే అతుక్కోవు
ఎప్పటికీ పదిలంగా చూసుకో!

Exit mobile version