[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘మనసుని ఓడనివ్వకు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
కష్టాలు ఎన్ని రానీ
కన్నీళ్ళు ఎన్ని రాలనీ
కలతలు కలవరపెట్టనీ
కలలన్నీ కరిగిపోనీ
కథగా మిగిలిపోనీ
కదలక శిలవై పోనీ
కనుపాపే మోసం చేయనీ
కడగండ్లే శాశ్వతమైపోనీ
మనసుని మాత్రం ఓడనివ్వకు
వసి వాడనివ్వకు
మనసు అనే మందారాన్ని
తుదికంటా తుంచేయకు
సమస్యలకు సమాధి చేయకు
మనసుని నెగ్గించాలి
దాని కోసం దేనికైన సిద్ధపడాలి
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.