Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మనసుకు మరమ్మతు

[శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల రచించిన ‘మనసుకు మరమ్మతు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

ఇంట్లో అడుగు పెడుతూనే “అమ్మా అమ్మా” అంటూ పిలిచాడు భాస్కర్.

దేవుని గదిలో సంధ్యా దీపం పెడుతోంది, భవాని. దేవుని గట్టును ఎత్తుగా కట్టించుకుంది. తను కుర్చీలో కూచుని దీపం వెలిగిస్తోంది. కొడుకు పిలుపు విని కుర్చీని కొంచం జరిపుకుని లేవబోయినదల్లా మోకాళ్ళ చిప్పలు ఖణేల్ మనేసరికి, కొద్ది సేపు అలాగే నిలబడి పోయింది,

భర్త వచ్చాడని కాఫీ, ఫలహారం తెచ్చి అందించింది భ్రమర. “అమ్మా”, అంటూ మరొకసారి పిలిచాడు భాస్కర్.

“అత్తయ్యకు ఈ మధ్య సరిగా వినిపించటం లేదండీ! మొన్న నేను బజారు కెళ్ళి వచ్చి, ఎన్ని సార్లు డోర్ బెల్ కొట్టినా అత్తయ్యకు వినిపించనే లేదు, చాలా సేపటికి కాని గడియ తీయనేలేదు..”

భ్రమర మాటలకు భాస్కర్, “అమ్మకు మోకాళ్ళ నొప్పి, ఆ చివర నుంచి మెల్లిగా నడచి వచ్చి తలుపు తీసే సరికి ఆలస్యం అయి ఉంటుంది, వినిపించక పోవడం ఏమిటి..” అంటుండగా భవాని నడుం మీద చేతులానించుకుని నడచి అక్కడకు వచ్చింది.

అమ్మను చూడగానే “అమ్మా మోకాళ్ళ నొప్పి ఎక్కువగా ఉందా.. డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నాను. సర్జరీ తప్పదంటున్నాడు.. అన్నట్టు కాటరాక్ట్ సర్జరీ తరువాత ఎలా వుంది. కళ్ళ మసక ఇప్పుడు లేదు కదా..” అమ్మను అడిగాడు భాస్కర్.

భాస్కర్ మాటలకు కిసుక్కున నవ్వింది భ్రమర.

“ఏమిటీ ఇప్పుడు అత్తయ్యకు మోకాళ్ళ సర్జరీ చేయిస్తారా! ఆవిడ అవయవాలనన్నింటినీ ‘రిపేర్’ చేయిస్తున్నారా! కళ్ళ సర్జరీ అయింది, పోయిన సంవత్సరమే కదా స్టంట్ వేయించుకున్నారు. పళ్ళ నొప్పి! ఏదీ నమలలేక పోతున్నానంటూ పళ్ళు కట్టించుకున్నారు. ఇప్పుడు కాళ్ళకు సర్జరీ, అత్తయ్య ఒళ్ళంతా ఏదో మోటారు బండికి గేరేజ్‌లో అయినట్టు మరమ్మతు అవుతోంది..” భ్రమర యథాలాపంగా మాట్లాడుతున్నా ఆ మాటలు అమ్మను బాధిస్తాయని ఆమె మాటలకు అడ్డు పడుతూ “సరేలే ఈ కాఫీ కప్పు లోపలకి తీసుకెళ్ళు” అంటూ, ఆమె ధోరణిని మార్చాడు భాస్కర్.

“అమ్మా! నేను పైకి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను”, అంటూ ఆ వాతావరణాన్ని తేలికపరచాడు భాస్కర్.

***

భాస్కర్ వెళ్ళగానే భవాని తన గదిలోకి నడచింది. భ్రమర అన్న మాటలకు ఆమె అంతగా నొచ్చుకోలేదు. ఆ మాటలన్నీ నిజమేకదా! అనుకుంది. తన దేహం అంతా ఇప్పుడు మరమ్మతులలో ఉంది. ఇలా ఎప్పటి కప్పుడు అమర్చుకోక ఉంటే వికలాంగురాలయేదా! ఈ ఊహ కలిగేసరికి గతంలో తన సహోద్యోగి నాగరాజు గుర్తుకు వచ్చాడు.

భవాని ఉపన్యాసక వృత్తిలో ఉన్నప్పుడు, ఎంతో చురుకైన అధ్యాపకురాలిగా పేరు తెచ్చుకుంది. అందగత్తె అనిపించుకోకున్నా చక్కని అవయవ సౌష్టవంతో, పొందికైన కట్టు, బొట్టుతో, సౌమ్యమైన మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంది. భవాని పని చేసే కళాశాలలో నాగరాజు మాస్టారు, అంధుడు. భవాని ఆయనను ఎంతగానో గౌరవించేది. కళ్ళు కనిపించకున్నా బుద్ధి బలంతో, మేధా శక్తితో అందరివలె తానూ, ఈ పదవిని అందుకోవడం ఆతని కృషిని ఎంతగానో ప్రశంసించేది. ఆతనితో మాటలాడే సందర్భంలో అతని లోకజ్ఞతకు విస్తుపోయేది. విద్యార్ధులకు పాఠం చెప్పేటప్పుడు, కొత్తగా వచ్చిన పుస్తకాల ఆధారాలను గురించి ప్రసంగిస్తుంటే ఆతని విద్యాసక్తిని గమనించి ‘మనిషికి ఆత్మబలం ఉంటే ఏదైనా సాధించ వచ్చును కదా!’ అనుకునేది.

ఆ సంవత్సరం రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయుని ఎన్నికకు, దరఖాస్తు చేయమని స్వయంగా అందుకు కావలసిన సంసిద్ధతలను చేసింది. కళాశాల అధ్యాపకులందరితో నాగరాజు మాస్టారు గారి వృత్తి నిబద్ధతను, కార్య దక్షతలను గూర్చి, వారి అభిప్రాయాలను సేకరించింది. విద్యార్థులందరి చేత ఈ మాస్టారు చెప్పే పాఠ్య బోధన ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుందో, వారి పరీక్షలలో మాస్టారు గారి బోధన తమ విజయాలకు ఎంతగా సహకరించిందో, మాష్టారిచ్చిన మార్గదర్శనానికి, కృతజ్ఞతలను తెలిపిన విద్యార్థుల సాక్ష్య పత్రాలను సేకరించి కమిటీకి సమర్పించింది.

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపన్యాసకునిగా పురస్కారం పొందుతున్న వేళ నాగరాజు మాస్టారు సభలో తన పేరును చెప్పి కృతజ్ఞతలందించినప్పుడు తెలియని తృప్తిని పొందింది.

అంగ వైకల్యం జన్మతహ ప్రాప్తించిన వారు, బాల్యం నుండి సామాజికంగా, వ్యక్తిగతంగా అనేక కఠిన సమస్యలను ఎదుర్కొని తామూ ఇతరులకు ఎందులోనూ తీసిపోమని నిరూపించుకుని సఫలతను పొందుతున్నారు. వారికి మనో వైకల్యం లేకపోవడమే వారి ఆత్మశక్తికి కారణం. భవాని ఇప్పుడు దైహికంగా దారుఢ్యం కోల్పోయింది. కాని మానసికంగా ఎప్పుడూ క్రుంగిపోలేదు, మంచంలో పడి మూలుగుతూ ఉండక తన దేహంలో పునరుజ్జీవనం పాదుకొల్పుకుంటోంది. వ్యక్తిగా తనను గౌరవించుకుని వీలయినంతగా, కుటుంబానికి. ఇతరులకు సహాయపడదలచింది.. భవాని ఆలోచనలలో ఉండగానే భ్రమర వచ్చింది.

“అత్తయ్యా, నా మాటలు మీకేమైనా కలత కలిగించాయా. నన్ను క్షమించండి. మీ దేహం మరమ్మత్తులను కోరినా మీ మనసు మల్లె పరిమళాన్ని వీడదు. అమ్మ గర్భం లోంచి ఎంత లేత మనసుతో పుట్టారో ఇప్పటికీ ఆ లాలిత్యం అలాగే ఉంది. మనో ధైర్యంతో మీరు మాకిచ్చే సలహాలు, మాకు తోడు నీడగా ఉండి మా క్షేమాన్ని సదా కోరే మీ మనసుకు మరమ్మత్తు ఎప్పుడూ రాదత్తయ్యా!” అంది.

“భోజనం చేద్దురుగాని రండి, భాస్కర్ మీ కోసం ఎదురు చూస్తున్నాడు” అంది.

కోడలి చేయి పట్టుకుని లేచి మెల్లగా భోజనానికి కదిలింది భవాని.

భాస్కర్ భ్రమర పలికిన మాటల్లోని తొందరపాటును సరిదిద్ది ఉంటాడు. కొడుకు ఇంగితాన్ని భవాని మనసులోనే మెచ్చుకుంది.

Exit mobile version