[శ్రీమతి షామీర్ జానకీదేవి రచించిన ‘మనసు పలికిన గీతం..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కన్నది.. తనలాగా తన కూతురు ఒక గుమాస్తా ఉద్యోగం చెయ్యకూడదని ఇంజనీరింగ్ చదివించింది.. కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చెయ్యాలని తన కల..
కూతురు అనూష చక్కగా చదువుకుంది.. క్యాంపస్‌లో ఉద్యోగం తెచ్చుకుంది.. ప్రతి రోజూ కూతురుని మెడలో ఐడి కార్డుతో, సూటులో ఒక ఎమ్.ఎన్.సి.లో పని చేస్తుంటే చూడాలనే తన కోరిక తీరినందుకు ఎంతో తృప్తిగా ఫీల్ అయింది అపర్ణ.. ప్యాంట్, షర్ట్, షూస్‌లో కూతురు అలా వెళ్తుంటే ఆ తల్లి కళ్ళల్లో వెలుగులు ఆనందానికి సంకేతంలా ఉండేవి. ఆ ఆనందానికి వెల ఉన్నదా? అమ్మాయి, అబ్బాయి ఎవరైనా ఒకటే అని ఇద్దరమ్మాయిలతో గడుపుతున్న సుఖప్రదమైన జీవితం తమది..
అపర్ణ, రమేష్ ఇద్దరూ ఒక ప్రైవేటు కంపెనీలో గుమాస్తాలుగా పని చేస్తున్నారు.. వారికి ఇద్దరమ్మాయిలు.. అనూష, శిరీష.. అనూష ఇంజనీరింగ్ పూర్తిచేసి ఎమ్.ఎన్.సి.లో ఉద్యోగం చేస్తోంది.. శిరీష ఇంటర్ చదువుతోంది.. తనకు మెడిసిన్ చదవాలని కోరిక..
చెల్లెలు మెడిసిన్‌లో చేరిన తరువాతనే తన పెళ్ళి అని అనూష ఇంట్లో ముందే అల్టిమేటమ్ ఇచ్చింది.. ఆడపిల్లలు ఎంత చదివినా పెళ్ళి తప్పదు.. ఖర్చు ఎవరూ పంచుకోరు..
“మమ్మీ.. మీరు ఇప్పుడే పెళ్ళి అనవద్దు.. నాకు ఇష్టమైన జీవితం.. నన్ను కొంచెం అనుభవించనీయండి..” అంటూ తల్లిని ముందే ప్రిపేర్ చేసింది..
“లేదు అనూ.. నేను ఇప్పుడే పెళ్ళి చేయాలని అనుకోవటం లేదు.. 22 సంవత్సరాలకే నీకు ఉద్యోగం వచ్చింది.. అది మన అదృష్టం.. నీకు 25 సంవత్సరాల తరువాత చూస్తాను.. సరేనా..” అంటూ కూతురికి హామీ ఇచ్చింది..
ఆ రోజు ఆఫీసులో రమేష్‌కు ఒక ఫోన్ వచ్చింది.. “రమేష్ గారూ.. నా పేరు శ్రీనివాసరావు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాను.. మాకు ఇద్దరు అబ్బాయిలు.. పెద్దవాడు కిరణ్ మీ అమ్మాయి చేసే కంపెనీ లోనే పని చేస్తున్నాడు.. రెండో వాడు అమెరికాలో ఎమ్.ఎస్. చేస్తున్నాడు.. మా కిరణ్‌కు మీ అమ్మాయి బాగా నచ్చింది.. మనము ఒకసారి కలుసుకుందామా..” అతని స్వరంలో అభ్యర్థన వినగానే వెంటనే కాదని చెప్పలేక పోయాడు…
“సార్ మీరేమీ ఆలోచించకండి.. అంతా అనుకూలం అనుకుంటేనే ముందుకు పోదాం..” మధ్యే మార్గం సూచించాడు అతను..
“సరే సార్.. ఈ ఆదివారం కలుసుకుందాము.. మీకు లొకేషన్ పంపిస్తాను..” అన్నాడు రమేష్..
వెంటనే భార్యతో ఈ విషయం చెప్పాడు.. తను ఏమీ మాట్లాడలేకపోతోంది.. ఇద్దరూ కలిసి ఈ విషయం అనూషకు చెప్పొద్దు అనుకున్నారు..
***
అనుకున్నట్లుగానే శ్రీనివాసరావు ఆదివారం వచ్చాడు.. తన ఫ్రెండ్ అని చెప్పి ఇంట్లో వాళ్ళకు పరిచయం చేసాడు.. అందరితో చక్కగా మాట్లాడాడు..
అనూషను చూడగానే కొడుక్కి అంతలా ఎందుకు నచ్చిందో అర్థమైంది.. సన్నజాజి మొగ్గలా నాజూకుగా ఉన్న ఆమెను చూడగానే ‘ఆహా’ అనిపిస్తుంది.. అందమైన జడ, బంగారు వర్ణం, నవ్వుతుంటే ముత్యాల వంటి పలువరుస.. ఒకసారి చూస్తే చూపు తిప్పుకోలేని అందం.. అందుకే కొడుక్కి అంతగా నచ్చింది అని అనుకున్నాడు శ్రీనివాసరావు..
“అనూషా ఇలా రామ్మా..” అంటూ పిలిచి కూర్చోమని చెప్పాడు..
“మా అబ్బాయి కిరణ్ మీ ఆఫీసులోనే చేస్తాడు.. మీ ప్రాజెక్టు మేనేజర్.. తెలుసా?” అడిగాడు..
“తెలుసు అంకుల్.. నేను అదే ప్రాజెక్టులో ఉన్నాను..” నవ్వుతూ అన్నది అనూష..
సగం పని అయినట్లుగా అనుకున్నాడు.. “రమేష్ గారూ.. మనం తరువాత కలుసుకుందాము.. అమ్మా! వస్తాను..” అంటూ అపర్ణకు కూడా చెప్పి వెళ్ళిపోయాడు..
పిల్లలిద్దరూ షాపింగ్ అంటూ బయటకు వెళ్ళిపోయారు.. రమేష్ అపర్ణలు ఇద్దరూ ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడ్డారు.
“మంచి సంబంధం.. ఒప్పుకుందాం అపర్ణా..” భార్యని ఒప్పించే ప్రయత్నం చేసాడు..
“ముందు మనం వెళ్ళి అబ్బాయిని వాళ్ళ ఇంటిని చూసి వద్దాం.. జాతకాలు అవీ కుదిరితే అప్పుడు అనూషను ఒప్పిద్దాం..” అన్నది.. ఇదేదో బాగుంది అనుకుని “సరే” అన్నాడు రమేష్…
ఒక మంచిరోజు చూసుకుని ఇద్దరూ శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళారు.. ఆ ఇంటి వాతావరణం చూడగానే ఇద్దరూ మురిసిపోయారు.. అతని భార్య శారద కూడా ఎంతో బాగా మాట్లాడింది.. మగ పిల్లవాడి తల్లినన్న భేషజమే లేదు..
కిరణ్ కూడా బాగా మాట్లాడాడు.. అతని బయోడేటా తీసుకుని మంచి మ్యాచ్ అనుకుంటూ ఇంటికి వచ్చారు..
ఇంటికి వస్తూ త్రోవలో తెలిసిన పురోహితుడికి జాతకం ఇచ్చి చూడమని చెప్పారు.. రాగానే అప్పుడే ఇంటికి వచ్చిన అనూష “ఎక్కడికెళ్ళారు?” అంటూ యక్ష ప్రశ్నలు.. ఇక తనకు చెప్పక తప్పలేదు..
“కిరణ్ ఇంటికి వెళ్ళాము.. అబ్బాయి చాలా బాగున్నాడు.. మీ ఇద్దరి జోడీ బాగుంటుంది.. జాతకాలు కలిస్తే మన అదృష్టం.. నువ్వు ఉద్యోగం కూడా చెయ్యవచ్చు..” అంటూ చెపుతున్న శ్రీనివాసరావు మొహంలో ఆనందం చూసి ఏమీ మాట్లాడలేక పోయింది.
ఎలా ‘నో’ చెప్పాలో అనూషకు అర్థం కాలేదు.. తనకు కూడా కిరణ్ అంటే ఇష్టం కానీ బయటకు చెప్పలేదు.. మౌనంగా తన రూములోకి వెళ్ళిపోయింది..
ఇద్దరి జాతకాలు బాగా కలిసాయి.. ఒక రోజు ఫార్మల్గా పెళ్ళిచూపులు అరేంజ్ చేసారు..
“మాకు కట్న కానుకలు ఏమీ వద్దు.. అమ్మాయి లక్ష్మీదేవిలా మా ఇంటికి వస్తోంది.. భగవంతుడు మాకు బాగానే ఇచ్చాడు.. పెళ్ళి ఖర్చు కూడా ఇద్దరం పంచుకుందాం..”
శ్రీనివాసరావు మాటల్లో నిజాయితీకి ఆశ్చర్యపోయాడు రమేష్.. ఇలా కూడా ఉంటారా అనుకున్నాడు..
“బావగారూ.. మీ పెద్ద మనసుకు మీ రుణం ఎలా తీర్చుకోవాలి..?” ఆనందంతో కళ్ళు వర్షించాయి..
“ఇది మన ఇంటి ఆహ్వానం.. కలిసి చేద్దాం.. సరేనా..” అంటూ రమేష్‌ను గట్టిగా హత్తుకొని వెళ్ళి పోయారు..
ఇరువైపులా అంతా చూసుకుంటూ ఒక శుభ ముహూర్తాన వివాహం చేసారు..
శారదకు కూతురు లేదనే బెంగ తీరిపోయింది.. ఇద్దరూ చక్కగా కలిసిపోయారు.. ఆ రోజు అట్లతద్ది అంటూ లీవ్ పెట్టించింది.. కాళ్ళకు చేతులకు గోరింటాకు.. చూసిన తనకే ముద్దుగా అనిపించింది అనూషకు.. తల్లి ఉద్యోగం, తమ చదువులు తరువాత తన ఉద్యోగంతో ఇలాంటి ఆనందాలకు దూరమైన ఆమె స్త్రీ హృదయం పులకరించింది.. అటు ఉద్యోగం చేస్తూ తల్లి మనసు, ఇటు ఆచారాలు పాటిస్తూ అత్త మనసు గెలుచుకున్న అనూష మనసు ఆనందంతో పరవశించింది.