[డా. లక్ష్మీ రాఘవ రచించిన ‘మామయ్య’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“మీ మామయ్య ఇందాక ఫోను చేశారు. రేపు మిమ్మల్ని కలవడానికి వస్తానని..” ఆఫీసు నుండీ రాగానే రాధిక అన్నమాట నచ్చలేదు శ్రీహరికి.
“ఎందుకు వస్తాడు? ఏదో డబ్బు కోసమే అయిఉంటుంది. నేను ఆఫీసు పని మీద బయటికి వెళ్లానని చెప్పు.”
“ఆయన రాత్రికి ఇక్కడే ఉంటానంటే..”
“ఏదోలా వెళ్లిపోయేలా చూడు..” అంటూన్న శ్రీహరిని అదోలా చూసింది.
“ఇంతకు మునుపు రెండుసార్లు వచ్చారు. డబ్బుకోసమే అయినా రెండువేలు, మూడువేలు మాత్రమే కదా తీసుకున్నారు. అది మనకు పెద్ద ఇబ్బందేం కాదు. ఎంతయినా మీ మేనమామ కదండీ..” రాధిక మాటలు పూర్తికాకనే
“నీవు నాకు చెప్పక్కరలేదు..” విసురుగా అన్నాడు శ్రీహరి.
పెళ్ళయి యాడాది గడచినా శ్రీహరి అర్థం కావటం లేదు రాధికకు. తన అమ్మపుట్టింటి వారు వస్తే అతనికి ఇష్టం ఉండదు. ఒక్కసారి మామయ్య కొడుకు సూరి ఆఫీసు కు వస్తే అటే పంపించాడు ఊరికి. ‘అదేంటి ఇంటికి రాకుండా వెళ్ళి పోయాడు’ అని రాధిక ఆశ్చర్య పోయింది.
“ఇంటర్వ్యూ ఉంది అని సలహా అడగడానికి వస్తే చెప్పి పంపేశాను. ఇంటికి వస్తే ఇక్కడే ఉండి ఇంటర్వ్యూలు చూసుకుంటానంటాడు. ఉద్యోగం వచ్చిందా తిష్ట వేసేరకం..”
“అలా ఎందుకు అనుకోవాలి. మీరు మంచి సలహాలు చెబుతారని వచ్చి ఉండచ్చు. ఈ కాలంలో ఉద్యోగం రాగానే ఇండిపెండెంట్‌గా ఉండాలని అనుకుంటారు కానీ ఎవరి దగ్గరా ఉండరు..”
“నీకు వాళ్ళ సంగతి తెలీదు. వూరుకో” అన్నాడు శ్రీహరి రాధికకు అడ్డుపడుతూ.
మరి మాట్లాడదల్చుకోలేదు రాధిక. అప్పట్లో అయితే డబ్బులు అరువు తీసుకోవడం, ఎగవేయడం అంతా జరిగేదేమో. ఇప్పుడు అందరూ ఆర్థికంగా ఎదిగారు, ఎదుగుతున్నారు ఇలాటి సమస్యలు తక్కువ. శ్రీహరికి ఏమి అనుభవం జరిగిందో.. తెలియదులే అనుకుoది.
ఆ రాత్రి శ్రీహరి “నాన్న అమ్మను ఇష్టపడి చేసుకున్నాడు. నాన్నమ్మకేమో అమ్మ వాళ్ళు మా కంటే కాస్త బీదవారని, పెట్టుపోతలు సరిగా చేయలేదని తక్కువ చూపు ఉండేది. ఒకసారి నా చిన్నప్పుడు మామయ్య నన్ను ఎత్తుకుని ‘ఎంతైనా నా అల్లుడు’ అన్నాడని నాన్నమ్మ చాలా కోప్పడింది. అప్పటినుండీ అమ్మ కూడా పుట్టింటి వారు వచ్చినా ముభావంగా ఉండేది. బహుశా నాకు మనసులో అలాటి భావన కలగడానికి అదే కారణమేమో. క్షేమం విచారించడానికి కాకుండా డబ్బుల కోసం ముందు కూడా వచ్చేవాడు. అందుకే..” వివరణ ఇస్తూ చెప్పాడు రాధికకి. ఆ వివరణతో విషయం తెలిసినా అయిన వారిని దూరం చేసుకోకూడదనే రాధిక అభిప్రాయం. అందుకే
“మామయ్య మీరు విసుక్కుంటున్నా మళ్ళీ వచ్చారంటే చాలా అత్యవసరం కూడా ఉండచ్చు లేదా మీరు ఆర్థికంగా స్థిరంగా ఉన్నారన్న భావన కావచ్చు. అక్క కొడుకు అని ఇష్టంతో కూడిన చనువు ఉండచ్చు కదా. ఒకసారి ఆ కోణం లో ఆలోచించండి”
“ఇష్టం ఉంటే వూరికే పలకరించవచ్చు. ఎప్పుడు వచ్చినా డబ్బు లావాదేవీలేనా?” అన్న శ్రీహరికి జవాబు ఇవ్వడానికి మాటలు దొరకలేదు రాధికకు.
మరురోజు మామయ్య వస్తే “శ్రీహరి బిజీగా ఉన్నాడు ఇంకా రెండురోజులు మిమ్మల్ని కలవలేక పోవచ్చు” అని చెబితే వెంటనే వెళ్ళిపోయాడు.
వారం తర్వాత ఊరి నుండీ హటాత్తుగా మామయ్య వస్తే శ్రీహరి ఇంట్లోనే ఉన్నాడు.
తప్పనిసరి పలకరింపులు అయ్యాక ఇద్దరికీ టీ ఇచ్చి వంటింట్లోకి వెళ్లబోతున్న రాధికతో
“అమ్మా రాధికా, నీవు వచ్చి కూర్చుంటావా? కొంచెం మాట్లాడేదుంది.” అన్న మామయ్య మాటలకి ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది. ‘ఏదో పెద్దరాయే వేస్తాడు’అనుకున్నాడు శ్రీహరి. రాధిక వచ్చి కూర్చుంది.
“నేను పోయినసారి వచ్చినప్పుడే చెప్పాలనుకున్నా నీవు దొరకలేదు శ్రీహరీ. నా కూతురు రాణి పెళ్ళికి నా దగ్గర ఉన్న ఎకరా పొలం అమ్మకానికి పెడదామని ప్రయత్నిస్తూ ఉంటే ఒక నిజం బయటకు వచ్చింది.” ఆపిన మామయ్యకి అప్రయత్నంగా గ్లాసులో నీళ్ళిచ్చింది రాధిక.
“మీ అమ్మ పెళ్లప్పుడు పుట్టింటి కట్నంగా అర ఎకరం రాశాడు మా నాయన. మీరు ఆస్తిపరులు. ఒక అర ఎకరం ఇస్తామంటే బాగుండదని వూరుకున్నడేమో. నాకు కూడా చెప్పలేదు. ఇప్పుడు పొలం అమ్మడానికి పాస్ బుక్కులు చేయించడానికి తిరుగుతుంటే కొంత మీ అమ్మ పేరున వున్నదని బయటపడింది. ఇన్ని రోజులకి మా తరఫున ఏదో కొంత ఇవ్వచ్చునన్న సంతోషం కలిగింది. అమ్మ పేరు ఉంది కాబట్టి వారసుడిగా నీ పేరుకు బదిలీ అవుతుంది. ఆ బదిలీ ప్రక్రియ కోసం నీవు రావాలి. మిగిలిన అర ఎకరం అమ్మితే రాణి పెళ్లి చెయ్యచ్చు. నేను సూర్య దగ్గరికి వెళ్ళిపోతాను..” అని చెప్పాక సోఫాలో వెనక్కి వాలాడు మామయ్య. రాధిక శ్రీహరి వైపు చూసింది. శ్రీహరి లేచి వంటింట్లోకి వెళ్ళి ఫ్రిజ్‌లో చల్లని వాటర్ బాటల్ తెచ్చుకుని..
“మామయ్య, బదిలీ ప్రక్రియ మీరు ప్రారంభించండి. ఎప్పుడు నా అవసరం ఉంటుందో అప్పటికి వస్తాను..” అని ఆగితే రాధిక టక్కున తలెత్తి శ్రీహరిని చూసింది.
“ఇంకొక్క మాట మామయ్యా. ఆ అర ఎకరమూ అమ్మకానికి పెడదాం.. కానీ అమ్మాక ఆ డబ్బులతో రాణి పెళ్లి జరుగుతుంది. మీ భాగం అమ్మకండి. అది మీకు ఉపయోగపడుతుంది.” అంటూన్న శ్రీహరిని తడి కళ్ళతో చూశాడు మామయ్య.
శ్రీహరి లేచి మామయ్య పక్కన కూర్చుని “మామయ్యా, మంచి మనసుతో మా భాగం గురించి చెప్పారు. మాకన్నా మీకు ఆ డబ్బు అవసరం ఉంది. ఇది మా అమ్మ తరఫున మేనకోడలికి గిఫ్ట్ అనుకోండి.” అంటూన్న శ్రీహరి చేతులు పట్టుకున్న మామయ్య ముందుకు వంగి శ్రీహరిని కౌగలించుకున్నాడు.
ఆ దృశ్యం అద్బుతంగా అనిపించింది రాధికకు!
అంతర్గతంగా శ్రీహరిలో వచ్చిన మార్పు రాధికకు స్పష్టంగా కనిపించి భర్తను ప్రేమగా చూసింది.