విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.
***
ఆ రోజు తల్లి నుండి వచ్చిన ఉత్తరాన్ని అపురూపంగా చదువుకుంటూన్నాడు రామూర్తి. ‘‘ఎక్కడ నుండి ఆ ఉత్తరం?’’ సుందరం అడిగాడు. ‘‘అమ్మ వ్రాసిన ఉత్తరం.’’
‘‘అమ్మ వ్రాసిన ఉత్తరం నీకు సంతోషం కలిగిస్తోందా?’’
‘‘ఎందుకు కలిగించదు. అమ్మ గురించి నీకు తెలుసో తెలియదో కాని సృష్టిలో అమ్మ ఒక విలక్షణమైన వ్యక్తి. మన జన్మకి కారకురాలు ఆమే. సహనానికి మూరు పేరు అమ్మ. ఆమె తన పిల్లలకు నిజమైన మార్గదర్శి. వేదనలో ఆనందాన్ని పంచి ఇస్తుంది. ఆమె చల్లని ఒడిలో మొదలైన తొలి అడుగులో తనబాటును బ్రతుకు బాటలో పొరపాట్లను సరిదిద్దే సమర్థురాలు ఆమె. తన పిల్లలు మంచి మార్గంలో నడిచేందుకు ఆమె పవిత్రమూర్తిగా మారుతుంది. అలాంటి త్యాగమూర్తి ఋణం తీర్చుకోలేము. అమ్మ వలనే పిల్లల జీవితాలు ఆనందమయంగా సాగుతాయి.
అమ్మతో ఉన్న అనుబంధం గొప్పది, అన్ని అనుబంధాల కంటే. ఎన్నో ఇంటి బాధ్యతలు నెరవేరుస్తూ తన కుటుంబ అవసరాలు తీరుస్తూనే తన పిల్లల కోసం ఆరాటపడుతుంది. తన కుటుంబం అంటే అమ్మకి ప్రాణం. ఆమె పిల్లలకి తినిపించిన గోరుముద్దలు ఎవరు తినిపించగలరు? ఆమె పాడిన లాలి పాటల్లో ఉన్న మాధుర్యానికి కరిగిపోయి నిద్రలోకి జరుకుంటారు పిల్లలు. ఆమె తన కుటుంబ సభ్యుల ఆలనా పాలనా చూసుకోడానికి తహతహలాడుతుంది. అటువంటి అమ్మ నిజంగా దేవతే.’’
రామూర్తి తన తల్లి గురించి ఇలా చెప్పుకుపోతున్నాడు. పరిసరాలను మరిచిపోయి. అతను చెప్తున్నది వింటున్న సుందరంలో భావోద్వేగం. ఇన్నాళ్ళ నుండి మనసు అడుగు పొరల్లో దాచుకున్న బాధంతా సుడులు సుడులుగా బయటకు వస్తోంది. దు:ఖం ఆపుకోలేకపోతున్నాడు. ఒక్కసారి బోరున విలపిస్తున్నాడు.
ఈ హఠాత్ పరిణామానికి స్తంభించిపోయాడు సుందరం. ఇన్నాళ్ళు గలగలమని పారే సెలయేరులా ఉండే సుందరం, తను అందర్నీ నవ్విచే సుందరం ఇలా డీలా పడి విలపించడం రామూర్తికి ఆశ్చర్యం కలిగించింది.
***
ఆసక్తిగా చదివించే ఈ ధారావాహిక వచ్చే వారం నుంచి.
చదవండి.. చదివించండి..
మలుపులు తిరిగిన జీవితాలు