[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]
[రాము పరీక్షకి హాజరవడానికి స్కూలుకి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా, కూరలు తెమ్మని బలవంతం చేస్తుంది అనసూయ. ఆమెతో వాదించి ఉపయోగం లేదని భావించిన రాము, కూరలు తెచ్చిచ్చి, స్కూలుకి చేరేసరికి పావుగంట ఆలస్యం అవుతుంది. ఎందుకు లేటయ్యిందని అవధాని మాస్టారు అడిగితే, అసలు కారణమే చెప్తాడు. రాము ఇంటి పరిస్థితులపై అవగాహన ఉన్న ఆయన, జాలిపడి, లోపలికి రానిస్తారు. తమ పరిస్థితికి ఎదురి తిరిగి ఉపయోగం లేదని, సర్దుకుపోవాలని రాము తల్లి శాంతమ్మ నేర్పుతుంది. మర్నాడు ఉదయం రాము చదువుకుంటుంటాడు. మామయ్య కొడుకు రంగ నిద్ర లేచొస్తాడు. రాము బుద్ధిమంతుడిలా చదువుకోడం చూసి అతన్ని హేళన చేస్తాడు. రాము చెల్లెలు సుమతికి అత్తన్నా, బావన్నా గిట్టదు. చదువుకుంటున్న రాముని మరో పని చెప్పి, అక్కడ్నించి లేపుతుంది అనసూయ. స్కూల్లో సైన్స్ మాస్టారు క్లాసులో మానవ జీవితంలో వచ్చిన వివిధ దశల గురించి వివరిస్తుంటే, రాము ఆలోచనల్లో పడతాడు. బాల్య, కౌమార యవ్వన దశలలో ఆలోచనలెలా ఉంటాయో చెప్తారు. వృద్ధాప్యంలో మానసిక స్థితి ఎలా ఉంటుందో వివరిస్తారు. ఆయన చెప్పిన విషయాలను దృష్టిలో ఉంచుకుని, జాగ్రత్తగా నడుచుకోవాలనుకుంటాడు రాము. – ఇక చదవండి.]
అధ్యాయం 5
సెకెండ్లు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా, గంటలు రోజులుగా, రోజులు నెలలుగా నెలలు సంవత్సరాలుగా ఇలా కాలం దొర్లిపోతోంది. సంక్రాంతి పండుగ వచ్చింది. పట్నాలలో ఆ పండుగ సందడ్లు అంత ఎక్కువుగా అగుపించకపోయినా పల్లెల్లో మాత్రం సంక్రాంతి సంబరాలు బాగానే ఉన్నాయి. పల్లెపడుచుల గొబ్బి పాటలు, డుడూ బసవన్నల బాకాల శబ్దాలు, రంగు రంగుల ముగ్గులతో ప్రతీ ముంగిట, కొత్త అల్లుళ్ళే కాకుండా పాత అల్లుళ్ళ రాకతో గ్రామ వాతావరణం మహా సందడిగా ఉంది. దాసరి పాటలు, తెల్లవారు జామున మేలుకొలుపు వాళ్ళ పాటలు, శకుని పక్షివాడి డమరక శబ్దం ఇవన్నీ సంక్రాంతి పండుగు సమయంలో ప్రత్యేక ఆకర్షణ.
“ముగ్గుల మధ్య గొబ్బెమ్మలను ఉంచి గొబ్బి పాటలు ఎందుకు పాడుతారో తెలుసా?” చక్రాల్లాంటి తన కళ్ళను చకచకా తిప్పుతూ అంటోంది సరోజ. ఆమె వేపు కుతూహలంగా చూస్తూ “ఎందుకేంటి?” అందరూ ఒకే పర్యాయం అడిగారు.
సుమతి మనస్సు వారి సంభాషణ వేపు లేదు. పద్మజ మెడలో నున్న రాళ్ళ నెక్లేసు వేపు తదేకంగా చూస్తోంది. అది గమనించిన పద్మజ “ఇది మా నాన్న ఇచ్చిన సంక్రాంతి కానుక” అంది. ఆమె మున్సబు గారి ఒక్కగాని ఒక్క కూతురు. తనూ తన తల్లిదండ్రులకి ఒక్కగాని ఒక్క కూతురే. కాని ఏు ప్రయోజనం? తనకి ఏ ముద్దూ ముచ్చటా తీరటం లేదు. తన తండ్రి పేకాటలో ఆస్తినంతా తగల బెడ్తున్నాడు. వర్షాలు పడితేనే పంటలు పండేవి. రెండు మూడు సంవత్సరాల నుండి పంటలు సరిగా పండటం లేదు. దానికి తోడు అత్తయ్యా, బావ రావడంతో కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగింది. ఖర్చులు పెరిగాయి. సుమతి ఆలోచన్లు ఇలా సాగిపోతున్నాయి.
“సుమతి మన మాటలు వినటం లేదు” సరోజ అంది. అందరి దృష్టి సుమతి మీదే. “వింటున్నాను, చెప్పండి.” అంటూ సుమతి అందరి వేపు చూసింది.
“వాళ్ళ బావ గుర్తుకు వచ్చి ఉంటాడు,” గిరిజ అంది.
“అదేు లేదు,” అంది సుమతి యథాలాపంగా.
“గొబ్బిళ్ళను పెట్టి పాటలు పాడుతూ దాని చుట్టూ తిరుగుతే గొబ్బెమ్మ సంతోషించి, అందగాడు, గుణవంతుడు, అయిన భర్తను ప్రసాదిస్తుందట” చేతులు గాలిలోకి తిప్పుతూ అంటోది వనజ. ఆమె మాటలకి అందరూ పకపకా నవ్వారు. వాళ్ళ నవ్వుల్లో జత కలిపింది సుమతి. కాని ఆమె ఆలోచన్లు వేరేగా ఉన్నాయి.
‘పద్మజ రోజు రోజూ కొత్త కొత్త నగలు వేసుకుంటోంది. రకరకాల ప్యాషను దుస్తులు ధరిస్తుంది. ఆమెకి చిన్నప్పుడే వాళ్ళ బావతో పెళ్ళి చేయబోతారని మాటలు కూడా అయిపోయాట. అతను చాలా బాగుంటాడుట. ఇంజనీరింగు చదువుతున్నాడుట. అతనికి పద్మజ అంటే మహా ఇష్టమట. వాళ్ళ అత్తయ్య వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళట’ సుమతి ఆలోచన్లు ఇలా సాగుతున్నాయి.
“ఏంటే సుమతీ! ఆ దీర్ఘాలోచన్లు? కొంపదీసి మీ బావ గురించి కాదు కదా?” గిరిజ ఎకసెక్కం ఆడింది.
“అది ఎవరి గురించి ఆలోచిస్తుంది? వాళ్ళ బావ గురించే దాని ఆలోచన అంతా,” పద్మజ చమత్కారంగా అంది.
“అనుభవం మీద చెప్తున్నావే!” సరోజ కామెంటు. వెంటనే పద్మజ ముఖం సిగ్గుతో ఎర్రబారింది.
“అవునే సుమతి మీ బావకి నిన్నిచ్చి పెళ్ళి చేస్తారుట కదూ!” గిరిజ ప్రశ్న. ఆ ప్రశ్న తనకి నచ్చలేదన్నట్టు ముఖం పెట్టింది సుమతి. తన అత్తయ్య, బావల ప్రతిరూపాలు కళ్ళెదుట కదలాడాయి. అతి సామాన్య స్థితిలో, నిరాశా, నిస్పృహలతో కాలం వెళ్ళబోస్తున్న ముఖాలు కళ్ళెదుట కదలాడగానే సుమతికి ఒక్కసారి వారి మీద హ్యేయభావం కలిగింది.
వెంటనే ఆ దృశ్యం మారిపోయి పద్మజ, ఆమె బావ రూపాలు అగుపించాయి. పట్టు బట్టలతో వంటెడు నగలతో పద్మజ కలకల్లాడుతూ అటు ఇటు తిరుగుతుంటే దర్జాగా, ఠీవీగా రాజకుమారుడులా ఉన్న ఆమె బావ పద్మజ కళ్ళలో కళ్ళు పెట్టి తన్మయత్వంగా చూస్తున్నాడు, పద్మజా అంతే.
“నీ ఆలోచన్లు బంగారం కాను. ఇంతకీ నీకు మీ బావంటే ఇష్ఠమేనా?” సరోజ అడిగింది. ఆమె మాటలు వినగానే రంగి, పాలేరు అప్పన్న మాటలు గుర్తుకు వచ్చాయి సుమతికి.
“మన సుమతమ్మ చానా అదుష్టవంతురాలు. సిలకలాంటి మన రామం బాబు మొగుడవబోతాడు. అన్ని పన్లు సిటికెలో సేసెస్తాడు ఆ బాబు. తన ఆడదాన్ని సక్కగా సూసుకుంటాడు,” పాలేరు భార్య రంగి తన భర్త అప్పన్నతో అంది.
“నీవు సెప్పేది నిజమేనే రంగీ! ఆలిద్దరూ పాలూ, నీల్లలా కలిచిపోతారే, మొగుడు పెల్లాలంటే అలా ఉండాలి” నవ్వుతూ అన్నాడు అప్పన్న అటు పక్కకి ఏదో పని మీద వచ్చిన అనసూయ వారి మాటలు వింది. వెంటనే ఆమె ముఖం కోపంతో అరుణిమ దాల్చింది.
‘పనివాళ్ళు పని వాళ్ళలా ఉండాలి. అంతే కాని ఈ ఎకసెక్కా లేంటి? అనవసరపు మాటలేంటి? వీళ్ళు నెత్తికెక్కి కూర్చున్నారు. ఇది తనకి నచ్చదు. పనివాళ్ళని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. అంతేకాని హద్దు మీరితే వారి ప్రవర్తనకి అడ్డుకట్ట వేయాలి’ ఇలా అనుకుంటోంది అనసూయ.
“ఏంటర్రా! చేయవల్సిన పనులు మానేసి ఇలా అనవసరపు మాటలు మాట్లాడుతున్నారు,” ఆమె మాటల్లో కరుకుతనం గమనించి రంగి, అప్పన్న తొట్రుపడ్డారు. భయపడ్డారు కూడా.
“ఏటీనేదమ్మా! మన సుమతమ్మ సానా అదృష్టవంతురాలు సిలకలాంటి రామం బాబు పెనిమిటిగా రాబోతున్నాడు, అనుకుంటున్నాము. అవును కదా మావా?” అంది రంగి బెరుకు బెరుకగా.
“అవును.. అవును..” అన్నాడు అప్పన్న.
వాళ్ళ మాటలు వినగానే అనసూయ మనస్సు కోపంతో కుతకుతలాడిరది. “ఒసే పిడత మొగం దానా, ఆ ముద్ద పప్పుకి నా బంగారు కొండనిస్తానా? మాటలాడేదేదో జాగ్రత్తగా మాట్లాడండి. మరో పర్యాయం ఇటువంటి మాటలు మాట్లాడవద్దు,” హుకుం జారీ చేసి వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది అనసూయ.
“బుగతమ్మకి సానా కోపం వచ్చింది. ఆల్లంటే ఆ అమ్మకి నచ్చదు,” అంది రంగి అప్పన్నతో. “ఆవిడ అట్టానే మాటాడతాది. అయినా పెద్ద వాళ్ళ ఇసయాలు మనకు ఎందుకు?” రంగిని హెచ్చరించాడు అప్పన్న. శాంతమ్మ, రాముల వేపు జాలిగా చూస్తూ అప్పన్నని అనుసరించింది రంగి.
“ఏుటే నీ ఆలోచన్లు? ఇంతకీ మీ బావంటే నీకు ఇష్ఠమేనా” రెట్టించింది సరోజ.
సరోజ మాటలుతో రంగి, అప్పన్న సంభాషణ, తన తల్లి సమాధానం సుమతికి గుర్తుకు వచ్చాయి. “ఛీ.. ఛీ..! నేనా ముద్ద పప్పుగాడిని పెళ్ళి చేసుకోను,” మూతి మూడు వంకర్లు తిప్పుతూ అంది సుమతి. అందరూ ఆమె ముఖం వేపు విస్తుపోతూ చూశారు.
“మా నాన్నగారితో మీ నాన్నగారు నిన్ను మీ బావకిచ్చి పెళ్ళి చేస్తానని అన్నారుట. అందుకే అలా అన్నాను. నా మాటలు పట్టించుకోవద్దు సుమతి,” సరోజ వేడికోలు.
‘తన తండ్రి అలా అన్నాడా? అదే నిజమయితే తన జీవితం ఈ జన్మలో ఇంతే. తను ఊహించుకున్నవేవీ జరగవు. తన జీవితం వడ్డించిన విస్తరి కాదు. పుట్టినింట్లో తన కోరికలు ఎలాగూ తీరటం లేదు. మంచి హోదా ఆస్తి, అంతస్తూ ఉన్న వాడిని చేసుకుంటేనే తన కోరికలు సరదాలు తీరుతాయి. పద్మజలాంటి జీవితం గడపాలన్న తన కలలు సడలీ కృతం అవుతాయి. లేకపోతే పగటి కలలుగానే మిగిలిపోతాయి. పేక మేడల్లా కూలిపోతాయి’ ఇలా ఆలోచిస్తోంది సుమతి మనస్సు.
“అవునే సుమతీ! నేనో విషయం అడుగుతాను ఏమీ అనుకోనంటే.”
“అడుగు.”
“మీ బావ, అత్తయ్య అంటే అసలే మీ అమ్మకి ఇష్టం ఉండదు కదా! ఈ పెళ్ళికి మీ అమ్మ అంగీకరిస్తుందా?”
“ఇక ఈ విషయం ఇంతటితో వదిలిపెడ్తారా? మా అత్తయ్య, బావంటే నాకు గిట్టదు. వాళ్ళకి ఏ ఆస్తిపాస్తులున్నాయిని ఆ పిడత మొగంవాడ్ని పెళ్ళి చేసుకుంటాను,” కోపంగా అంది సుమతి.
“అది నేను ఒప్పుకోను. మీ బావ చాలా బుద్ధిమంతుడు. అంతే కాదు చాలా తెలివైనవాడు,” గిరిజ అంది. తనని ఆటపట్టిస్తున్న మిత్ర బృందంపై సుమతికి చాలా కోపం వచ్చింది. “అయితే నీవే ఆ గుణవంతుడ్ని బుద్ధిమంతుడ్ని పెళ్ళాడ వచ్చు కదా!” అంది సుమతి. ఆ మాటలకి గిరిజ తప్ప అందరూ పకపకా నవ్వారు. గిరిజ ముఖం పాలిపోయింది. వాళ్ళ మాటలు వయస్సుకి మించిన మాటల్లా ఉన్నాయి.
పరిస్థితిని – వాతావరణాన్ని గమనించిన సరోజ ఆ గంభీర వాతావరణాన్ని పూర్వ స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నించి సఫలీకృతురాలయింది. కన్నె పిల్లలు గొబ్బి పాటలు పాడుతున్నారు. ఆ పాటలకు అనుగుణంగా అడుగులేస్తున్నారు. సుమతి మనస్సు మాత్రం నిలకడగా లేదు. అడుగులు తడబడ్తున్నాయి. తప్పుగా అడుగులేస్తోంది.
“సుమతీ! నీ మనస్సు బాగోనట్టుంది. ఆట చాలిద్దాం,” పద్మజ అంది.
“అవునే నీరసంగా ఉంది. ఆట ఆపుచేద్దాం,” అందరూ ముక్త కంఠంతో అన్నారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళడానికి సిద్దపడ్డారు.
“పద్మజా! ఈ నెక్లేస్ ఎప్పుడు చేయించుకున్నావే?” ఉండబట్టలేక అడిగింది సుమతి.
“మొన్న వేసవి సెలవులకి మా అత్తమ్మ గారింటికి వెళ్తే అత్తమ్మ చేయించింది.” ఇలా అంటున్నప్పుడు పద్మజ ముఖంలో అతిశయం తొంగి చూసింది. పద్మజ మాటలు మిగతా కన్నె మనస్సుల్లో లిప్త కాలం ఈర్ష్య అనే మనోవికారాన్ని కలిగించాయి.
“అయితే మీ అత్తమ్మ కోడలి పిల్లని కొంగున ముడి వేసుకుంటోందన్న మాట,” గడసరి సరోజ చమత్కారంగా అంది. ఆ మాటలకి అందరూ పకపకా నవ్వారు.
“మా నాన్నగారు కూడా నాకు నగలు చేయిస్తానంటే నేనే వద్దన్నాను,” బడాయి మాటలు మాట్లాడ్డం అలవాటు లేని సుమతి తడబడ్తూ అంది.
సుమతి ఇంటి పరిస్థితి తెలిసిన ఆ మిత్ర బృందం సుమతి వేపు జాలిగా చూసారు. వాళ్ళ వంక చూడకుండా మరి అక్కడ ఉండకుండా ఇంటి వేపు అడుగులు వేస్తోంది సుమతి.
పెరటిలో పువ్వుల మొక్కల దగ్గర మోకాలిలో ముఖం పెట్టుకుని సుమతి దీర్ఘంగా ఆలోచిస్తోంది.
తన తండ్రి బావతో తన పెళ్ళి జరిపిస్తానని అందరితో అంటున్నాడా? అలా అయితే తన జీవితం నరకమే. కూతురు ఇలా దీర్ఘాలోచనలో మునిగి తేలడం అనసూయ మునుపెన్నడూ చూడలేదు. కూతుర్ని అనునయిస్తూ విషయం రాబట్టింది.
విషయం విన్న అనసూయకి భర్త మీద చెప్పలేనంత కోపం వచ్చింది. “నీకు ఎవరు చెప్పారు?” కూతుర్ని ప్రశ్నించింది.
“సరోజ చెప్పింది” సుమతి సమాధానం.
“మీ నాన్నగారు అనుకున్నంత మాత్రాన్న అయిపోతుందా? మీ నాన్న రానీ, తాడో పేడో తేలుస్తాను” కోపంతో బుసలు కొడ్తూ అంది. తల్లి భరోసాకి సుమతి మనస్సు తేలికపడింది.
అధ్యాయం 6
కాలచక్రం గిర్రున తిరుగుతోంది. ఆ కాలంతో పాటే మనిషి జీవితంలోనూ, మనుగడలోని అనేక మార్పులు. పేకాటలో భుజంగరావు ఆస్తి అంతా హారతి కర్పూరలా హరించుకు పోయింది. మొదట్నించి కమ్యూనిస్టు భావాలకి ఆకర్షితుడయిన రంగ ఆ ఇంటిలో ఇమడలేక పోయాడు. అందుకే ఇల్లు విడిచి వెళ్ళి పోయాడు.
రామం టీచరు ట్రైనింగ్ పూర్తి చేసి మిషనరీ స్కూల్లో టీచరుగా చేరాడు. స్కూలు దగ్గరే ఓ రూమ్ తీసుకుని ఉంటున్నాడు. నెమ్మదిగా, తల్లిని కూడా తన దగ్గరికి తీసుకుపోవాలన్న ఆలోచనలో ఉన్నాడు.
ఇంటి పరిస్థితుల ప్రభావం వల్ల తన కలలు కలలుగానే మిగిలి పోయాయి. తన కోరికలు నీటి బుడగల్లా టప్పున పేలిపోయాయి, అని అనుకుంటున్న సుమతి నిరాశ, నిశ్పృహలో కూరుకుపోయింది. వయస్సు పెరిగినా ఆమె మనస్సు మాత్రం పెరగలేదు. జీవితంతో రాజీ పడలేక పోతోంది.
ఆస్తిపాస్తులతోపాటు అహంకారం, దర్జా, ఠీవీ అంతా పోయిన భుజంగరావుకి ఒక వేపు పశ్చత్తాపం, మరో ప్రక్క బాధ. ఈ పరిస్థితులకి కారణం తన స్వయంకృతాపరాదమే. తనే కారకుడు. అంతే కాదు తను తన అక్క చెల్లెలకి, మేనల్లుడికి పెట్టిన బాధలు ఇన్నీ అన్నీ కావు. ఆ ఉసురు ఊరికే పోలేదు, అనుకుంటూ పశ్చత్తాపం పడ్తూ కన్నీరు పెట్టుకునేవాడు భుజంగరావు.
ఇంటి ఆర్థిక పరిస్థితులు తలక్రిందులవడం, కొడుకు ఇల్లు వదిలి పెట్టి వెళ్ళిపోవడం, వీటినన్నింటిని తట్టుకోలేని అనసూయ మనో వ్యాధితో మంచం పట్టింది. రోజుకి పది సార్లయినా శాంతమ్మని క్షమించమని దీనంగా అడుగుతుంది.
అనసూయ పరిస్థితికి శాంతమ్మ చలించిపోయింది. ఆమె చేసిన తప్పులన్నీ క్షమిస్తున్నాను అని మాట కూడా ఇచ్చింది.
మృత్యువుతో పోరాడుతున్న భార్య వంక జాలిగా బాధగా కళ్ళల్లో కన్నీరు నింపుకుని చూస్తూ ఆమె చెంత కూర్చుని ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు భుజంగరావు. సుమతికి, రామంకి పెళ్ళి జరిపించమని ఆ తరువాత తను సంతోషంగా కన్ను మూస్తానని భుజంగరావుని కోరింది అనసూయ.
భార్య కోరిక విని చలించాడు భుజంగరావు. భార్య లేని ఒంటరి జీవితం తలంపుకు రాగానే అతనికి భయం వేసింది. ఆ ఆలోచన అతని శరీరాన్నంతటిని గగుర్పాటుకి గురి చేసింది.
“నీవు కోరిన విధంగా సుమతి రామం పెళ్ళి జరిపిస్తాను కాని నన్ను ఒంటరి వాడ్ని చేసి మాత్రం నీవు వెళ్ళిపోవద్దు. అనూ! ఆ ఆలోచనే నన్ను అధైర్యుడ్ని చేస్తోంది.” ఆమె వేపు కళ్ళల్లో కన్నీరు చిప్పిల్లాడుతూ ఉండగా దీనంగా చూస్తూ అన్నాడు భుజంగరావు. అతడ్ని ఆమె ఓదారుస్తూ ఉంటే, ఆమెను అతడు ఓదారుస్తున్నాడు. ఆ ఇద్దరూ ఒకర్ని మరొకరు ఓదార్చుకోడంలో ఓ విధమైన వింత అనుభూతిని అనుభవిస్తున్నారిద్దరూ.
అనసూయ మాటలు విన్న శాంతమ్మకి ఆమె తమని ఈసడిస్తూ అన్న మాటలు గుర్తుకువచ్చాయి. శాంతమ్మ భావాల్ని అర్థం చేసుకున్న అనసూయ అంతకు పూర్వం వాళ్ళని అన్న మాటల్ని పెట్టిన చిత్రహింసల్ని మరిచిపోమని ప్రాధేయపడింది. చచ్చిన పాముని ఇంకా చంప వద్దని శాంతమ్మని వేడుకుంది అనసూయ.
అనసూయ ఇష్ట ప్రకారం సుమతికి, రామానికి పెళ్ళి జరిపిస్తానని శాంతమ్మ అనసూయకి మాట ఇచ్చింది. అనసూయ గతాన్ని మరిచిపోమంది కాని గతాన్ని మరచిపోవడం సాధ్యం అవుతుందా? అవదు. మరిచిపోయినట్టు నటించడం తప్ప అనుకుంటోంది శాంతమ్మ.
కుటుంబంలో వచ్చిన మార్పుల వల్ల అందరిలో మార్పు వచ్చింది. మారనిదల్లా సుమతి మాత్రమే. తన స్నేహితురాళ్ళ జీవితంతో తన జీవితాన్ని సరిపోల్చుకుంటూ కుమిలిపోతోంది. కూతురి మనోభావాలు కనిపెట్టిన అనసూయ జాలిగా ఆమె వేపు చూసి దీర్ఘంగా నిట్టూర్పు విడిచింది. సుమతిలో పెద్ద పెద్ద ఆశలు కల్పించి దాని జీవితాన్ని తనే ఇలా అశాంతి పాలు చేసిందని మనసులో కుమిలిపోతోంది అనసూయ. కూతుర్ని దగ్గరికి పిలిచింది.
“పాపా! నీవు చెప్పకపోయినా నీ భావాలు నాకు తెలుసు. నీలో ఇలాంటి పెద్ద పెద్ద ఆశలు కల్పించడానికి కారకురాల్ని నేనే. మన పరిస్థితులు ఇలా తలక్రిందలవుతాయని నేను అనుకోలేదు. బాధపడకుండా ఉన్న దాన్తోనే సంతృప్తి పడ్డం నేర్చుకో,” అంది. కూతుర్ని రాజీ మార్గంలో నడవమని చెప్తున్న తల్లి గొంతుకలో అంతులేని ఆవేదన, పశ్చత్తాపం, నిరాశ.
సుమతి తల్లి మాటలు వింది కాని మౌనం వహించింది. కూతురి మౌనం ఆ తల్లిని మరింత మనస్తాపానికి గురిచేసింది. “నా పరిస్థితి, మీ నాన్నగారి పరిస్థితి చూస్తున్నావు కదా! ఇటువంటి పరిస్థితుల్లో జీవితంలో రాజీ పడ్డం నేర్చుకుని బావని పెళ్ళి చేసుకో,” అంది. అలా అంటున్న సమయంలో అనసూయ చాలా ఆయాసపడుతోంది. అయితే సుమతి మాత్రం పరిస్థితుల్తో రాజీ పడలేకపోతోంది. అందుకే ఇబ్బందిగా ముఖం పెట్టింది. ఇది చూసి గాఢంగా నిట్టూర్పు విడిచింది అనసూయ.
సుమతితో తన పెళ్ళి ప్రస్తావన రుచించలేదు రామ్మూర్తికి. ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించాక రాము, రామం అని పిలుస్తున్న వారు రామూర్తీ అని పిలుస్తున్నారు. తాము ఆ కుటుంబంలో పడ్డ చిత్రహింసలు, అవమానాలు, అన్నీ తల్లికి గుర్తుకు తెచ్చాడు. “అలాంటి ఇంటిలో పెరిగిన పిల్లనా నీవు కోడలుగా చేసుకుందామనుకుంటున్నావు?” అన్నాడు తల్లితో.
నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని చెప్తున్న కొడుకు వేపు సూటిగా చూస్తోంది శాంతమ్మ. ఆమె చూపులకి తట్టుకోలేక తలదించుకుని ఆలోచిస్తున్నాడు ఆ కొడుకు. తనకి ఊహ వచ్చినప్పటి నుండి చూస్తున్నాడు. జీవితంతో తన తల్లి ఏం సుఖపడిరది? ముఖ్యంగా ఈ ఇంట్లోని, ఈ మనుష్యుల మధ్య.
“రామూ! నీ ఆలోచన్లు నీ భావాలు నాకు తెలుసు. అయితే ఒక్క విషయం. ముఖ్యంగా మనం మన సుఖ సంతోషాలే చూసుకుంటే ఎలా? మామయ్య పరిస్థితి చూస్తున్నావు కదా! కోరిక తీరకుండా అశాంతితో అత్తయ్య కన్నుమూస్తే ఆమె ఆత్మకి శాంతి ఉండదు. ఆమె మారింది. తన ప్రవర్తనకి బాధ పడుతోంది. బాధపడ్తున్న వాళ్ళని మరింత బాధపెట్టకూడదనే మనస్తత్వం నాది. ఆమె చివరి కోరిక మీ ఇద్దరికి పెళ్ళి జరిపించాలని. అసలే ఇంటి పరిస్థితి ఏం బాగులేదు. సుడిగుండంలో చిక్కుకున్న నావలా తయారయింది ఇంటి పరిస్థితి. ప్రతీ మనిషిలో స్వార్థం ఉంటుంది. ఆ స్వార్ధం ఒక మంచి పనికి అదీ మేలు జరిగే పనికి అయితే ఆ స్వార్థంలో తప్పులేదు. మన స్వార్థమే మనం చూసుకుంటే ఎలా? అత్తయ్య కోరిక స్వార్థమే అవచ్చు. మన ఆలోచన్లు, విధానంలో కూడా స్వార్థముంది.
మన స్వార్థాన్ని పక్కన పెట్టి మన వాళ్ళ బాగు గురించి ఆలోచించడమే మన పని ఇప్పుడు. రంగ ఇల్లు వదిలి వెళ్ళినప్పటి నుండి మామయ్యా, అత్తయ్యా మరింత డీలా పడిపోయారు. ఆర్థికంగా శారీరకంగా, మానసికంగా కృంగిపోతున్న మామయ్య జీవితానికి చుక్కానిపై సరియైన మార్గంలో వాళ్ళను తీసుకువెళ్ళడమే ఇప్పుడు నీ కర్తవ్యం.”
గంభీరంగా అన్న తల్లి మాటల్ని విన్నాడు ఆ కొడుకు. తనకి హాని, కష్టం కలిగించిన వాళ్ళని క్షమించి ఆదరించమంటోంది తల్లి. అయితే మామయ్యా వాళ్ళు తమకి పెట్టిన ఇక్కట్లు తల్లి మరిచిపోయినా తను మాత్రం మరిచిపోలేక పోతున్నాడు. ఇదే విషయం తల్లితో చెప్పాడు. కొడుకు మాటలు ఆమె హృదిలో క్షోభను మిగిల్చాయి.
“సుమతి స్వభావం తెలుసు. నీకు అది తెలిసి ఉండి కూడా నన్ను ఈ పెళ్ళికి ఒప్పుకోమంటున్నావు. తల్లికి తగ్గ కూతురు సుమతి. సుమతిని పెళ్ళి చేసుకుని నేను ఏు సుఖపడగలను? ముఖ్యంగా నా ఉద్దేశం గురించే అడుగుతున్నారే కాని సుమతి ఆలోచన్లు ఎలా ఉన్నాయో ఎవరూ కనుక్కోలేదు. రేపొద్దున్న మా ఇద్దరి భావాలు, ఆలోచన్లు కలవకపోతే జీవితాంతం బాధే మిగులుతుంది.”
ఆవేదనగా అపనమ్మకంతో స్థిరంగా మాట్లాడుతున్న కొడుకు మాటలు విని అతనిలో కొరవడిన ఆత్మస్థైర్యం, కలిగించడానికి నిరాశ అనే నీలి నీడల్ని తొలగించడానికి ప్రయత్నిస్తోంది శాంతమ్మ.
“సుమతి ఇంకా చిన్న పిల్ల. క్రమంగా అదే పరిస్థితుల్ని అర్థం చేసుకుంటుంది.”
“ఏమో! నాకు మాత్రం నమ్మకం లేదు.”
కొడుకు మాటలు శాంతమ్మలో అసహనం కలగడానికి కారణమయ్యాయి. కొడుకు తన మాటను గౌరవిస్తాడు అని అనుకుంది కాని ఇలా తృణీకరిస్తాడని కలలో కూడా అనుకోలేదు. అందుకే ఆమెలో అసంతృప్తి, నిరాశ పేరుకున్నాయి. దానికి ఫలితమే కొడుకు మీద కాస్తంత కోపం కూడా కలిగింది.
“అవునురా! నీవు నా మాట ఎలా వింటావు? పెద్దవాడి వయ్యావు. నీవు నీ బాగోగులు నీవే చూసుకునే స్థాయికి ఎదిగి పోయావు. ఇప్పుడు మేము నీకు కనబడం. మా మాటలు నీకు అంత కన్నా లక్ష్యం లేదు. అందుకే అన్నారు అడ్డాల్లో బిడ్డలు కాని గడ్డాలొచ్చాక బిడ్డలా అని” తన కొడుకు తన మాట కాదంటున్నాడన్న ఉక్రోషంలో – కోపంతో నిష్ఠూరాన్ని తెలియ చేస్తూ అంది శాంతమ్మ కొడుకుతో.
“అమ్మా!!!” తల్లి నిష్ఠూరపు మాటలకి తల్లడిల్లిన రాము అవేదనగా అరిచాడు. బాధగా కణతలు నొక్కుకుంటూ క్షణ కాలం కళ్ళు మూసుకున్నాడు.
“నేను తల్లిగా ఆదేశించటం లేదు. అంతకన్నా ఆజ్ఞాపించటం లేదు. పరిస్థితుల్ని అర్ధం చేసుకోమని బతిమాలుతున్నాను.”
తల్లి మాటలు కొడుకుని విచలితుడ్ని చేసాయి. తల్లి లేకపోతే తను లేడు. తన జన్మకి, ఉన్నతికి కారకురాలు తల్లి. ఆమె ఋణం తాను తీర్చుకోలేడు. తన కోసం ఎంత కష్టపడింది? ఎన్ని నిందలు, అవమానాలు భరించింది. వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన ఆమెను తను బాధించలేడు. తల్లిగా ఆమె తన కర్తవ్యం నిర్వర్తించినప్పుడు కొడుకుగా తను తన కర్తవ్యం నెరవేర్చాలి, అని ఆలోచిస్తున్న ఆ కొడుకు “మీ ఇష్ట ప్రకారమే జరగనీ!” అంటూ శూన్యంలోకి చూస్తూ అన్నాడు.
కొడుకు మాటలు విన్న తరువాత ఆ తల్లి మనస్సు తేలిక పడింది. మరు క్షణంలోనే ఏదో అస్పష్టమైన బాధ, ఆవేదన. కొడుకు ముఖకవళికలు చూస్తే ఈ పెళ్ళి వాడికి ఇష్టం లేదనిపిస్తోంది. తను సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని వాడికిష్టంలేని పని చేయిస్తోంది. ఇది నిండు నూరేళ్ళు కాకపోయినా బ్రతికి ఉన్నంత వరకూ ఉండే జీవిత సమస్య. తన బలవంతంపై ఈ పెళ్ళికి అంగీకరించాడు కాని మనస్ఫూర్తిగా అంగీకరించలేదు. తను కొడుకు మెడలు వొంచి వాడి చేత సుమతి మెడలో మూడు ముళ్ళూ వేయించటం లేదు కదా! తిరిగి ఆమెలో మరో భావం. తన పిచ్చి కాని ఇలా ప్రశ్నించుకోవడం ఏంటి? ‘తప్పదు. చితికి పోతున్న బ్రతుకుల్ని బాగు చేయాలంటే ఒక్కొక్క పర్యాయం మనకి ఇష్టం లేని పని కూడా చేయవల్సి వస్తుంది,’ అని అనుకుంటూ ఆమె అచటి నుండి కదలిపోయింది.
ఇవతల రామం మనస్సు చికాగ్గా ఉంది. పొలం గట్టున పరధ్యానంగా ఆలోచిస్తున్నాడు. స్కూలుకి సెలవులు ఇయ్యటం వలన గ్రామానికి వచ్చాడు. ఎదురుగా ఉన్న చెరువులో గులకరాళ్ళు వేస్తున్నాడు. ఆ రాళ్ళు వేయగానే నీరు వలయాలు మాదిరిగా చెల్లా చెదురు అవుతోంది. అతని మనస్సులో కూడా అస్తవ్యస్తమైన ఆలోచన్లు అనే వలయాలు చోటు చేసుకున్నాయి.
“రామూ!”
ఆ పిలుపుకి తల పక్కకి తిప్పి చూశాడు. ఎదురుగా మామయ్య. మేనల్లుడి ముఖంలో కదలాడుతున్న భావాల్ని కనిపెడ్తూ గంభీరంగా నిలబడ్డాడు భుజంగరావు.
“ఏుటి మామయ్యా!”
“నేను ఒక్క మాట అడుగుతాను వెంటనే జవాబు చెప్పాలి. సూటిగా చెప్పాలి. ఆలస్యంగా జవాబు చెప్తే నీకు ఇష్టం లేదని అనుకుంటాను,” గంభీరత సలపకుండానే అన్నాడు భుజంగరావు.
మామయ్య ఏు అడుగుతాడో రామానికి తెలుసు. అయితే ఏం చెప్పాలో అన్నదే అతని సమస్య. అయితే ఆ భావం కనబడనీయకుండా “ఏంటి మామయ్యా! నీవు అడగవల్సింది?” అన్నాడు.
“నేను ఏం అడుగదల్చుకున్నానో ఆ విషయం మీ అమ్మ ద్వారా నీకు తెలిసే ఉంటుంది”.
ఒక్క క్షణం మౌనం వహించి రామం ఆలోచిస్తున్నాడు. తన మామయ్య పూర్తిగా వృద్ధావస్థలోకి అడుగుపెట్టక పోయినా జీవితంలో అతనికి తగిలిన ఎదురు దెబ్బలు, చింతలు అతనికి ముసలి రూపాన్ని తెచ్చి పెట్టాయి. మామయ్యకి ఏం జవాబు ఎలా ఏమని ఇవ్వాలి, అని ఆలోచిస్తూన్నాడు.
“మాట్లాడవేు రామం?”
“అది కాదు మామయ్యా!..!”
“మరి చెప్పక్కర్లేదు. నాకు తెలుసు ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదని. నా భ్రమ కాని మేు చేసిన పాపిష్టి పనులకి, మిమ్మల్ని పెట్టిన చిత్రహింసలకి ఇలా అడిగే హక్కు మాకు లేదు,” నిరాశా భావం వ్యక్తం చేస్తూ అన్నాడు భుజంగరావు. మామ, అల్లుడు మధ్య కొంత సేపు మౌనం రాజ్యమేలింది.
“నీకూ అమ్మకి జరిగిన సంభాషణ విన్నాను నేను. నీకు ఇష్టం లేని పెళ్ళి చేసుకుని నీ జీవితాన్ని అశాంతి చేసుకోవడం నాకూ ఇష్టం లేదు,” అన్నాడు భుజంగరావు.
అప్పటికీ రామం నోటంట మాట పెగల్లేదు. ఆలోచిస్తున్నాడు. రంగ ఇల్లు వదిలి వెళ్ళినప్పటి నుండి మామయ్యకి కడుపు నిండా తిండిలేదు. కంటి నిండా కునుకు లేదు. మనశ్శాంతి లేక దిగుల్తో కృంగిపోతున్నాడు. తను అంతకు మునుపు చేసిన చేతలకి సిగ్గుతో – పశ్చత్తాపంతో కుమిలి పోతున్నాడు. దానికి తోడు కూతురి పెళ్ళి సమస్య కృంగదీస్తోంది.
“నేను సుమతిని పెళ్ళి చేసుకుంటాను.” ఇలా అంటున్న సమయంలో రామం ఈ పెళ్ళి విషయంలో తన విముఖతను బలవంతాన్న హృదయపు అడుగు పొరల్లో దాచేసేడు. ఎంత తన భావాల్ని దాచుకోడానికి ప్రయత్నం చేసినా ఆ భావాల్ని అర్థం చేసుకున్నాడు భుజంగరావు.
“మొదట సుమతి అభిప్రాయం కనుక్కో మామయ్యా! ఇది ఒక రోజు, రెండు రోజుల సంబంధం కాదు. జీవితాంతం కలిసి బ్రతుకు బ్రతికే సమస్య” రామం అన్నాడు.
“అది ఇంకా చిన్న పిల్ల. జీవితం గురించి లోతుగా ఆలోచించే శక్తి దానికి లేదు,” అన్నాడు భుజంగరావు. అయితే రామం మాత్రం మామయ్య మాటల్తో పూర్తిగా ఏకీభవించలేక పోతున్నాడు. అయిష్టం గానే తన సమ్మతిని తెలియ చేశాడు.
(ఇంకా ఉంది)
విజయనగరం వాస్తవ్యులైన శ్రీ గూడూరు గోపాలకృష్ణమూర్తి హిందీ ఉపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. వారు రాసిన కథలు వివిధ వార్తపత్రికల్లో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు సంకలనంగా వెలువడ్డాయి.