Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మలుపులు తిరిగిన జీవితాలు-24

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]

[తన గతాన్ని గూర్చి సింధూకి చెప్పడం మొదలుపెడుతుంది ఇందిర. సుమిత్ర తన పెద్దమ్మ కూతురు అని చెప్పి, సుమిత్ర ఆలోచనలు వయసుకి మించి ఉండేవని, ఆమె చర్యలను ఆమె తల్లిదండ్రులు హర్షించేవారు కాదని చెబుతుంది. డేరింగ్ డాషింగ్‌గా ఎదిగిన సుమిత్ర డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం సాధించదని, తనకన్నా చిన్న వయసువాడైన శ్రీకాంత్‌ని ప్రేమించి గుళ్ళో పెళ్లి చేసుకుందని చెప్తుంది. గుళ్ళో పెళ్ళంటే చట్టబద్ధతలేకపోయిందని, రిజిస్ట్రార్ సమక్షంలో పెళ్ళి చేసుకుని ఉంటే చట్టబద్ధత ఉండేది, పుట్టే  పిల్లలకి భద్రత, హక్కులు ఉండేవని అంటుంది. శ్రీకాంత్‌కి ఎంబిఎ పూర్తయినా ఉద్యోగం రాదు. అతను నిరాశనిస్పృహలకు లోనవుతాడు.ఈలోపు వారికి పాప పుడుతుంది. మరో వైపు సుమిత్ర పనిచేసే కంపెనీ నష్టాలకు లోనయి, ఆమె ఉద్యోగం పోతుంది. ఆర్థిక ఇబ్బందులు వారి మధ్య కలతలు రేపుతాయి. సుమిత్రని, పాపని వదిలేసి శ్రీకాంత్ వెళ్ళిపోతాడు. పాపని అనాథాశ్రమంలో ఇచ్చి, ఇందూ పేర ఉత్తరం రాసిచ్చి, సుమిత్ర బలవన్మరణానికి పాల్పడుతుంది. ఉత్తరం అందిన ఇందిర ఆ అనాథాశ్రమానికి వెళ్ళి పాపని తెచ్చుకుంటుంది. ఆ పాపే సింధు. ఇవన్నీ విన్న తరువాత సింధు మనసు బాధతో నిండిపోతుంది. అప్పుడు ఇందిర సింధూని ఓదార్చి తన జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయిన నవీన్ గురించి చెప్తుంది. సింధూ, శేషూ త్రికరణ శుద్ధిగా ప్రేమించుకున్నట్లయితే, ఒకరికి మరొకరు ఇష్టం అయితే వారిద్దరూ వివాహ బంధంలో ఒకటయ్యేటట్లు చేస్తానని మాటిస్తుంది.]

అధ్యాయం 47

నస్సులో ఎలాంటి అలజడులు ఉన్నా, మనస్సు చంచలంగా ఆవేశంగా ఉన్నా అశాంతితో గడపవల్సి వస్తుంది. ఆలోచనాపరంపర నుండి బయటకు రావాలంటే మనస్సుని నిశ్చలంగా ఉంచుకోవాలి. వ్యతిరేక ఆలోచన్లు కూడా మనస్సుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అలాంటి సమయంలో ఆత్మస్థైర్యం కోల్పోతారు. మనస్సులో ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి. ఇది మానసిక అశాంతికి దోహదం చేస్తుంది. అనుకూల దృక్పథంతో ముందుకు సాగడానికి మనసులో స్థిరమైన ఆలోచనా ధోరణి ఉండాలి. డోలాయమాన మానసిక స్థితి ఉండకూడదు. మానసిక దృఢత్వం సాధించినప్పుడే మనసు నుండి వ్యతిరేక భావాలను తొలగించుకోగలగాలి.

సుమతి మనస్సులో తెలియని అలజడి. ఏదో బాధ, పశ్చత్తాపం, అశాంతి. తను తన భర్త యడల ప్రవర్తించిన ప్రవర్తన తలుచుకుని మనస్సు కుంచించుకుపోతోంది. ఆమె మనస్సు నిశ్చలంగా లేదు. ఇన్నాళ్ళు తను వ్యతిరేక ఆలోచన్లతోనే గడిపింది. ఇలాంటి ఆలోచన్లు మంచివి కాదు అన్నీ అవే ఆలోచన్లు వస్తున్నాయి. మనస్సు మీద ఒత్తిడి పెరుగుతోంది. ఏదో తెలియని మానసిక అశాంతి. అనుకూల దృక్పథంతో ముందుకు సాగాలనుకున్నా సాధ్యపడటం లేదు. స్థిరమైన ఆలోచన విధానం లేకుండా పోతోంది. మానసిక దృఢత్వం సడలిపోతోంది.

“మీ జీవితం అశాంతి పాలు చేసాను ఇన్నాళ్ళూ” అంటూ రామ్మూర్తితో పదే పదే అంటూ ఉండేది. నిద్రలో కూడా అవే మాటలు. పశ్చత్తాపంతో ఆమె దహించుకుపోయేది. దానికి ఫలితమే మానసిక రోగం. పిచ్చి చూపులు చూడ్డం నోట్లో ఏదో గొణుక్కోవడం, ఇదే ఆమె దినచర్య.

సుమతి పరిస్థితి రామ్మూర్తిని అవేదనకి గురి చేస్తోంది. సుందరంతో చెప్తే “భయపడద్దు మొదట డాక్టరికి చూపించు. అవసరమైతే నేను వస్తాను,” అని ధైర్యం చెప్పాడు సుందరం ఫోనులో రామ్మూర్తికి. చివరకు డాక్టరికి చూపించడానికి నిశ్చయించుకున్నాడు రామ్మూర్తి.

ఇందిరా నర్సింగ్‌ హోమ్‌ గురించి విన్నాడు రామ్మూర్తి. వాళ్ళకి దగ్గరగా ఉన్న నర్సింగ్‌ హోమ్‌ అదే. సుమతిని తీసుకుని నర్సింగ్‌ హోమ్‌కి బయలు దేరాడు రామ్మూర్తి.

హాస్పటల్‌ ముందు భాగంలో పెద్ద హాలు. ఆ హాలులో కుర్చీలు. అందులో కూర్చున్నారు పేషంట్లు. ఒక్కొక్కరిని టోకెన్‌ ప్రకారం ఇందిర దగ్గరికి పంపిస్తోంది నర్సు.

నర్సు రామ్మూర్తిని, సుమతిని లోపలికి పంపింది. “నమస్కారం అమ్మా!” అన్నాడు రామ్మూర్తి. నమస్కారం కూర్చోండి. ఏదో వ్రాసుకుంటూ తల పైకెత్తిన ఇందిర ఒక్కసారి నివ్వెరబోయింది. ఒక్క క్షణం. విస్మయంతో పాటు ఆశ్చర్యం.

ఆమెలో గతం తాలూకా ఆలోచన్లు. “మాస్టారూ..! మీరా?” చిన్నగా గొణుగుతూ కూర్చున్న ఆమెకి ఏవేవో జ్ఞాపకాలు. ఆమె కనుకొలుకుల్లో చప్పున కన్నీరు పైకుబుకడానికి సిద్ధంగా ఉంది. రామ్మూర్తి మాస్టార్ని కూర్చోమని చెప్పి చప్పున ఆమె లోపలికి వెళ్ళింది. తను రాగానే డాక్టరమ్మ ఇలా లోపలకి వెళ్ళడం రామ్మూర్తికి ఆశ్చర్యం కలిగించింది. సుమతి కూర్చున్న కుర్చీ ప్రక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు. ఓ పర్యాయం రుమాలుతో ముఖం తుడుచుకున్నాడు.

తిరిగి వచ్చిన డాక్టర్‌ ఇందిర “మాస్టారూ!” అని పిలిచింది. పరిచయం అయిన కంఠంలా అనిపించింది. “నేను ఇందూని గుర్తు పట్టలేదా?” అంది. గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నం చేస్తున్న అతను గతంలోకి వెళ్ళాడు.

విద్యార్ధికి ఉపాధ్యాయుడుకి ఉన్న తేడా అదే. ఎన్నో సంవత్సరాలు తరువాత కూడా ఉపాధ్యాయుల్ని విద్యార్ధులు గుర్తు పెట్టుకోగలరు కాని. ఉపాధ్యాయులు మాత్రం అలా చేయలేరు. దానికి కారణం వారిలో శారీకరంగా వచ్చిన మార్పు వల్ల.

“గుర్తు వచ్చిందా మాస్టారూ!”

గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించిన అతనికి ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఒక్కసారి కళ్ళెదుట కదలాడిరది. స్కూల్లో చెట్టు క్రింద కేరియర్‌ విప్పి ఉంది. పది సంవత్సరాల అమ్మాయి మోకాళ్ళ మధ్య తల ఆన్చి కూర్చుని ఉంది. ఆమె కళ్ళలో కన్నీటి తెర తళుక్కుమంటోంది. స్టాఫ్‌ రూమ్‌ కిటికీలో నుండి బయటకు తొంగి చూస్తున్న రామ్మూర్తి మాస్టరు గారికి ఈ దృశ్యం ఆశ్చర్యం కలిగించింది. అతను అప్పుడే కొత్తగా ఉపాధ్యాయుడుగా ఆ స్కూలుకి వచ్చాడు.

మాస్టారు యాంత్రికంగా అటు వేపు నడిచాడు. ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి చూసేసరికి అలా కూర్చున్న అమ్మాయి ఇందిర అని తెల్సింది అతనికి.

“ఇందూ!”

ఆమె తలపైకెత్తి చూసింది. ఆ కళ్ళలో కన్నీరు.

“ఇందూ ఏడుస్తున్నావా?” అలా అంటున్న అతనికి ఆమె కన్నీరు చూడగానే మనస్స వికలమయింది. ఆ అమ్మాయి కన్నీరు తుడుచుకుంది.

“ఇందూ అన్నం తినమ్మా!” అన్నారాయన.

“ఉహూ!!!”

“నేను తినిపించనా.”

“…..”

రామ్మూర్తి మాస్టారు అన్న ముద్దల్ని ఆమె చేతిలో ఉంచి తినిపిస్తున్నారు అతను. అలా అతను తినిపిస్తూ ఉంటే ఆమెకి సంతోషంగా ఉంది. తృప్తిగా ఉంది. ఆ అన్నం ముద్దలు అమృతంలా అనిపించాయి ఆమెకి. అతని వద్ద ఆత్మీయత పొందగలుగుతోంది.

“అమ్మ జ్ఞాపకం వచ్చింది. అమ్మ చనిపోయింది.”

“మీ అమ్మ చనిపోయిందా?” బాధగా అన్నారాయన.

“ఊఁ..!” అంది ఇందు.

రామ్మూర్తి మాస్టారి మనస్సు, ఇందూ తల్లి చనిపోయందన్న మాట వినగానే, కలుక్కుమంది. ప్రతీ వాళ్ళకి అమ్మ అందరి కన్నా ప్రాణప్రదమైన వ్యక్తి. చిన్నప్పుడు ఆమె తినిపించిన గోరు ముద్దలు, పాడిన లాలి పాటలూ పెద్దయినా మనస్సుల మెదులుతూనే ఉంటాయి. అమ్మతో అనుబంధం మనకి ఎంతో, మనకి జన్మ నిచ్చిన తల్లి ఋణం ఎప్పటికీ తీర్చుకోలేము. అందుకే కష్టకాలంలో మన నోటివెంబడి మొట్టమొదటి వచ్చిన పదం అమ్మ. ఆమెకి సాటిరాగల వారెవరూ ఉండరు ఈ భూమి మీద. తరువాత స్థానం తండ్రిది. తండ్రి తన పిల్లల భవిష్యత్తు కోసం పగలూ, రాత్రీ కష్టపడుతూనే ఉంటాడు.

అందుకే మన నోటంట అమ్మానాన్న, తల్లీదండ్రీ అనే శబ్దాలు వస్తాయి. తండ్రి గురించి తెలియని తన తల్లి సంరక్షణలో పెరిగాడు. తల్లి తన పిల్లలకి ఎలా ప్రేమను పంచి ఇస్తుందో, ఆ మాతృమూర్తి విలువ తనకి తెలుసు.

ఆ తరువాత స్టాఫ్‌ రూమ్‌లో ఇందూ విషయం ప్రస్తావనకి తెచ్చాడు రామ్మూర్తి మాస్టారు మిగతా ఉపాధ్యాయుల దగ్గర.

“ఆ అమ్మాయి గురించా? పాపం ఆ అమ్మాయి చాలా దురదృష్టవంతురాలు. ఆ అమ్మాయికి ఐదు సంవత్సరాల వయస్సులో తల్లి చనిపోయింది. తండ్రి లాయరు. భార్య చనిపోయిన తరువాత అతను తిరిగి పెళ్ళి చేసుకున్నాడు. ఎప్పుడూ కేసులు, క్లైంట్లు, లాసంబంధించిన పుస్తకాలు ఇదే అతని ప్రపంచం. డబ్బుంది. కార్లు, నౌకర్లు ఇంత వైభవోపేత జీవితం అతనిది. బిజీ జీవితం. తన కూతురు గురించి పట్టించుకునే తీరికే లేదు అతనికి.

ఇందూ మారుటి తల్లి ఇందూనసలు పట్టించుకోదు. ఆమె లోకంలో ఆమె ఉంటుంది. ఇంటిలో ప్రేమరాహిత్యమైన వాతావరణం.

పోనీ ఇరుగుపొరుగు పిల్లల్తో కలిసి ఆడుకోవాలని ఆమెకున్నా బయటకు వెళ్ళకుండా అనేక ఆంక్షలు. లంకంత కొంపలో ఓ గదిలో ఏకాంత జీవితం ఆ అమ్మాయిది.” కృష్ణమూర్తి మాస్టారు రామ్మూర్తికి వివరించారు.

ఇదంతా విన్న రామ్మూర్తి గారి మనస్సు అంతా ఆవేదన. మరిచిపోవలనుకున్నా మర్చిపోలేని ఇందూ మోకాలు మీద తల ఉంచి ఏడుస్తున్న దృశ్యం అగుపడ్తోంది.

రోజు రోజుకి రామ్మూర్తి మాస్టారికి ఇందూ మధ్యనున్న సంబంధం బలపడుతోంది. అతనికి ఇందూ మీద వాత్సల్యం. తన తండ్రి కూడా తన మీద ఇంత వాత్సల్యం చూపించలేదే? ఇదే ఆమెలో ఉన్న భావోద్వేగం. తనకి ఇంటిలో దొరకని ఆప్యాయతానురాగాలు మాస్టారి వలన లభిస్తున్నాయి తృప్తి ఆమెకి.

రోజులు గడుస్తున్నాయి. కాలం పరుగులు పెడుతోంది. ఆ కాలంతో పాటే మనిషి మనుగడలో అనేక మార్పులు. మనిషి మనస్తత్వంలో అనేక మార్పులు. టెన్తులో ఇందుకు స్కూలు ఫస్టు వచ్చింది.

“ఇదంతా మీ చలువే!” అంది ఇందు.

“లేదు.. లేదు. ఇదంతా నీ కృషి” అన్నారు రామ్మూర్తి మాస్టారు.

మాస్టారు గారి వలనే తన అశాంతిమయ జీవితంలో శాంతి లభించి బాగా చదువుకోడానికి అవకాశం లభించిందని ఇందిర భావన.

ఆ తరువాత తండ్రి హైదరాబాద్‌లో ప్రాక్టీసు పెట్టడం వలన ఇందూ హైదరాబాద్‌ వెళ్ళిపోయింది. ఆ తరువాత ఇందిర చదువు ధ్యాసలో పడింది. డాక్టరు కోర్సు చదవాలనేదే ఆమె అభిలాష. చదువులో పడిపోవడం వలన రామ్మూర్తి మాస్టార్ని మరిచిపోలేదు కాని ఉత్తరాలు వ్రాయడానికి అవకాశం లేకపోయింది. ఫోను చేద్దామంటే నెంబరు తెలియలేదు.

ఇందూ వెళ్తున్న సమయంలో రామ్మూర్తి మాస్టారు అన్న మాటలు ఇందిర ఎప్పటికీ మరచిపోదు. “ఇందూ! ఇప్పుడు నీవు పెద్దదానివయ్యావు. మొదట నీకు తారసపడిన మనుష్యులు ఎటువంటి వారో తెలుసుకో. ఆ తరువాత పరిస్థితుల్ని అర్ధం చేసుకుని మసలుకో. ఈ మాస్టరు గార్ని మరిచిపోవు కదూ!” ఓ కూతురు అత్తవారింటికి మొదటసారిగా వెళ్తున్నప్పుడు కూతురికి సుద్దులు చెప్తున్న తండ్రిలా అన్నారు మాస్టారు గారు. ఇందిర చప్పున వొంగి అతని పాదాలకి నమస్కరించింది.

ఆలోచనా తెరలు తొలగిపోయాయి. అతను ఆలోచనా ప్రపంచంలో విహరిస్తూ ఉంటే ఆమె అతని ముఖం వేపు చూస్తూ అలా కూర్చుంది తన సీటులో.

“మీరు నాకు తినిపించిన గోరు ముద్దలు గుర్తుకు వచ్చాయా మాస్టారూ!” నవ్వుతూ అంది ఇందిర. అతనూ నవ్వారు తృప్తిగా.

అధ్యాయం 48

“మాస్టారూ! ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే అదంతా మీరిచ్చిన స్పూర్తి. చలువ. ఆ రోజు మా అమ్మ చనిపోయిన జ్ఞాపకాల నుండి నా మనస్సును మరల్చి నాకు నా ఇంట్లో లభించని ఆదరాభిమానాలు, ప్రేమ అన్నీ పంచి ఇచ్చారు. నా దృష్టిని చదువు వేపు మరల్చారు. నేను  తండ్రి తాలూకా ఆప్యాయతానురాగాలు పొందలేకపోయిన దురదృష్టువంతురాల్ని అనుకుంటున్న సమయంలో తండ్రి అందచేయవల్సిన ఆప్యాయతానురాగాలు మీరు అందించారు. నేను మీ కూతుర్ని కాకపోయినా, నేను మిమ్మల్ని మాస్టారూ! నేను తండ్రిలా భావిస్తున్నాను”

“అది నీ మంచితనం ఇందూ!”

“నా చిన్నతనంలో నాకు మీ ఆప్యాయతానురాగాలు నాకు లభించాయి. ఇప్పుడూ తిరిగి నాకు లభిస్తే నా అంత అదృష్టవంతురాలు ఉండదు. ఇది నా స్వార్థం కాదు. నాకు జీవితంలో నెరవేరని కోరిక,” అంటూ అతనికి పాదాభివందనం చేసింది. ఆమె తలను ఆప్యాయతగా నిమిరారు ఆయన.

“ఇందూ!”

“ఏుటి మాస్టారూ! నీ కుటుంబం గురించి చెప్పలేదు.”

“చెప్పడానికి ఏం ఉంది మాస్టారూ! నేను నా కుమార్తెతో కలిసి ఉంటున్నాను.”

“మరి నీ భర్త?”

“లేడు.”

“లేడా..?”

“అవును.”

“కారణం?”

“ఇలాంటి వాటికి ఎన్నో కారణాలు. హైస్కూలులో చదువుతున్నప్పుడు మీరు నాకు మీ ఆప్యాయతానురాగాలు పంచి ఇచ్చారు. నేను మెడిసిన్‌ చదువుతున్న సమయంలో ఆ లోటు భర్తీ చేశాడు నవీన్‌. నన్ను కష్ట సమయంలో ఓదార్చేవాడు. ధైర్యం ఇచ్చేవాడు. సమస్య వచ్చినప్పుడు సలహా ఇచ్చేవాడు. విచారంగా ఉన్నప్పుడు నవ్విచేవాడు. ఊరట కల్పించేవాడు. ఆపద సుడిగండంలో చిక్కుకున్నప్పుడు అండగా నిలిచేవాడు.

ఓ మంచి స్నేహితుడంటే ఇలా ఉంటాడు అనుకునే రోల్‌ మోడలుగా నిలిచాడు నవీన్‌. కష్టనుఖాల్ని ఒకరితో ఒకరు పంచుకోవడం వల్ల స్నేహ బంధం గట్టిపడుతుంది. సహాయ సహకారాలు వెల్లు విరుస్తాయి. నిజమైన మిత్రులు ఒకరి కోసం మరొకరు త్యాగం చేసెందుకు పోటీ పడతారు. స్నేహం అంత గొప్పది. అలసిపోయినప్పుడు ఒత్తిడితో సతమతమవుతున్నప్పుడు, ఏవైనా సమస్యలు చుట్టు ముట్టి వేదిస్తున్నప్పుడు ప్రతీ ఒక్కరికీ గుర్తుకు వచ్చేది స్నేహితుడే.

ఆ స్నేహ బంధంలో వ్యాపార, ఆర్థిక విషయాలకు చోటు ఉండకూడదు. ఆ స్నేహబంధంలో నిస్వార్ధం ఉండాలి. నిష్కలంక నిర్మల ప్రేమ ఉండాలి. నేనూ నవీన్‌ కష్టాల్లో పాలు పంచుకున్నాము. సుఖాల్లో పాలు పంచుకున్నాము. అధైర్య సమయంలో ధైర్యం ఇచ్చాయి. నిరాశ సమయంలో ఆశను కల్పించాయి.

అజ్ఞానమనే అంధకారన్ని జ్ఞానమనే కాంతుల్ని వెలిగించే వారే నిజమైన గురువులాగే నేను నిజమైన స్నేహితురాలిగా త్రికరణ శుద్ధిగా అతడ్ని మంచి మిత్రుడుగా భావించాను. మా ఇద్దరి మధ్యా ఆ స్నేహబంధం దట్టమైన లతలా చిక్కబడి అది ప్రేమ బంధంగా మారింది. మెడిసన్‌ పూర్తి చేసి జీవితంలో స్థిరపడిన తరువాత ఇద్దరం దాంపత్య బంధంలో ఒకటవుదామనుకున్నాం.

ప్చ్‌..! కొన్ని కొన్ని సందర్బాల్లో మనం అనుకున్నవి జరగవు అని ఆ తరువాత కాని తెలుసుకోలేక పోయాను. అనుభవాలు అయితే మనకి వాటి గురించి తెలియదు. అనుభవాలు మనకి అద్భుతమైన పాఠాలు నేర్పుతాయి.

మనిషిలో పరిస్థితుల ప్రకారం మార్పు సహజం. మనిషిలో మార్పు కాదు. మనిషి ప్రేమలో కూడా మార్పు. త్రికరణ శద్ధి లేని ప్రేమ నిలవదు. జీవితంలో ప్రేమానుభం ఒక్కసారైనా పొందిన వాళ్ళు ఏ కారణం వల్లనో ప్రేమకు దూరమయితే విలవిల్లాడిపోతారు. ఇదే ప్రేమ రాహిత్యం, ప్రేమించినప్పుడు మనిషి తాము ప్రేమించిన వ్యక్తి కోసం, వాళ్ళ ఆనందం కోసం త్రికరణశుద్ధిగా ఏమైనా చేయడానికి సంసిద్ధులవుతారు.

అయితే ఇలాంటి ప్రేమ ఇరవైపులా ఉండాలి. అద్భుతంగా ఉండాలి. ఆరోగ్యప్రదంగా ఉండాలి. ఏకపక్షమై ఉండకూడదు. ప్రలోబాలకి లొంగనిదై ఉండాలి. జీవితంలో ప్రేమించిన వాళ్ళతోనే ఉండాలన్న నైజం ఉండాలి. ప్రేమ విఫలమవుతే మిగిలింది ప్రేమ రాహిత్యమే. నా ప్రేమ ఏకపక్షంగా మిగిలిపోయింది. అదే నా బాధ.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రేమలో దగాపడి ఏకాకిగా మిగిలి పోయాను. అదృష్టం ఏంటంటే ప్రేమ గుడ్డిది అంటారు. ఆ ప్రేమ మత్తులో పడి శారీరక సంబంధాన్ని పెట్టుకోకపోవడమే నా అదృష్టం. కేవలం మానసిక బంధమైన ప్రేమే మా మధ్య ఉన్నది.

నవీన్‌ మామయ్య కూతురు మెడలో మూడు ముళ్ళూ వేసాడు. మేనమామ ఆస్తులకి దాసోహమడయ్యాడు. ఈ లోకంలో ఎంతటి వాడైనా ధనం దగ్గర లొంగని వాడుండడు. అన్నాళ్ళ మా స్నేహబంధాన్ని మరిచిపోయాడు. ప్రేమ బంధం ఆ సమయంలో అతనికి అగుపించలేదు.” చెప్పడం ఆపింది ఇందిర.

“అయ్యో! ఎంత పని అయిందమ్మా నీ జీవితంలో?” రామ్మూర్తి మాస్టారు బాధగా అన్నారు.

“అంతటితో వదిలిపోయిందా? పెళ్ళి చేసుకున్న తరువాత నా దగ్గరకు వచ్చి తను ప్రేమబంధం వదులుకోలేడుట. అవతల పెళ్ళి చేసుకున్న భార్య ఉన్నా సహజీవనం చేస్తూ ప్రేమబంధం ఇద్దరు కొనసాగిద్దాం అని అన్నాడు.

అతని మాటలు నాకు వెగటుగా ఉన్నాయి. అసహ్యం కలిగించాయి. పిచ్చి కోపాన్ని తెప్పించాయ్‌! అంత స్నేహబంధం నాకు ఆ సమయంలో  గుర్తుకురాలేదు. గెటౌట్‌ అని గట్టిగా అరిచి ఇక ఎప్పుడూ ముఖం చూపించ్దని గట్టిగా చెప్పాను. ఇంతటితో ప్రేమ అధ్యాయం ముగిసిపోయింది” నిట్టూర్పు మధ్య అంది ఇందిర.

“ఎంత అనర్థం జరిగిపోయింది ఇందూ నీ జీవితంలో. పగవాళ్ళకైనా ఇటువంటి జీవితం వద్దు. చిన్నప్పుడూ నీ జీవితంలో ప్రేమ రాహిత్యమే. ఇప్పుడు ఇంతేనా?” రామ్మూర్తి మాస్టారు బాధగా అన్నారు.

“ఏం చేయగలం మాస్టారు? ఇదంతా విధి విలాసమనుకోవడమే. ఈ రోజుల్లో డబ్బు, పలుకుబడి, హోదా ఇవే మనిషికి కావాలి. ఇవే మనిషిని పిచ్చివాడ్ని చేస్తాయి. అందుడ్ని చేస్తాయి. అవి ఉన్నవాడికే సమాజం విలువ ఇస్తుంది. మానవత్వం మనిషితనం అన్నది ఇప్పుడు హస్యాస్పదంగా మారిపోయాయి. ఎంతమందిని మొసం చేస్తే అంత తెలివైనవాడు ఈ రోజుల్లో కాదు ఆ రోజుల్లో కూడా. డబ్బు సంపాదనే ముఖ్యం. నిజాయితీ, విలువలు నీతి గురించి మాట్లాడినవాడు పిచ్చివాడు క్రింద జమ.”

“నీవు చెప్పింది పూర్తిగా నిజం ఇందూ!”

“నా జీవిత అధ్యాయం అంతటితో ముగిసిపోలేదు. పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్ళి చేసుకున్న పెద్దమ్మ కూతురు సుమిత్ర ఒక ఆడపిల్లకు తల్లి అయి ఆ తరువాత పరిస్థితుల ప్రభావం వల్ల పెళ్ళి చేసుకుని, పరిస్థితుల కారణం వల్ల ఆ పుట్టిన పిల్లను అనాథాశ్రమంలో చేర్పించి ఆత్మహత్య చేసుకుంది. ఆ పిల్లను నేను తీసుకొచ్చి ఆ పిల్లకు మాతృప్రేమ అందిస్తున్నాను,” ఇందిర నిట్టూర్పు మధ్య అంది.

‘వీళ్లిద్దరి మధ్యా ఎంత అనుబంధం ఉంది! నేను అతడ్ని ఎంత మానసికంగా హింసించాను. అతని జీవితంలో ఆనందం, శాంతి లేకుండా చేసాను,’ మనస్సులో అనుకుంటోంది సుమతి వాళ్ళ మాటలు విన్న తరువాత.

“మనం మాటల్లో పడి అమ్మగారి సంగతే మరిచిపోయాం, రండి అమ్మా! ఆ రూమ్‌లోకి రండి,” అంటు సుమతిని టెస్టు చేయడానికి రూమ్‌లోకి తీసుకెళ్ళింది ఇందిర. ఆమె ఏం చెప్తుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు రామ్మూర్తి మాస్టారు.

“మాస్టారూ! అమ్మగారికి ఎలాంటి అనారోగ్యం లేదు,” ఆ మాట వినగానే అమ్మయ్య అని అనుకున్నారు రామ్మూర్తి మాస్టారు.

“అయితే ఆవిడ మానసికంగా బాధపడుతున్నారు. ఏ విషయం గురించో మథనపడుతున్నారు. పశ్చత్తాప పడుతున్నారు. నా స్నేహితురాలు కోమల గొప్ప సైకియాట్రిస్ట్ ఉంది. పేరుకు తగ్గట్టు కోమలి మనస్సు చాలా కోమలమైనది. ఎంతో ఓపిక, సహనం కలది. నేను ఫోను చేసి చెప్తాను. కోమలి దగ్గరకి తీసుకెళ్ళండి. అమ్మగారిలో ఉత్సాహం వస్తుంది. ఆనందంగా ఉంటారు” ఇందిర అంది. కోమలి అడ్రస్సు ఇచ్చింది.

“రేపే తీసుకు వెళ్తాను” అన్నారు రామ్మూర్తి మాస్టారు అక్కడ నుండి బయలుదేరుతున్న సమయంలో.

(ముగింపు వచ్చే వారం)

Exit mobile version