[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]
[మంచం మీద వాలిన ఇందిరకి నిద్రపట్టదు. సింధు జీవితం సుమిత్ర జీవితంలా అవకూడని భావిస్తుంది. ఆమెని నవీన్ గుర్తొస్తాడు. తన బాల్యం గుర్తొస్తుంది. చిన్నతనంలో తాను ఎదుర్కున్న కష్టాలు జ్ఞాపకం వస్తాయి. తనకి ధైర్యం చెఫ్పి ముందుకు నడిపిన మాస్టారుని తలచుకుంటుంది. కానీ ఆయన పేరు గుర్తురాదామెకు. ఎంబిబిస్ చదువుతున్నప్పుడు పరిచయమైన నవీన్‌ని ఇష్టపడడం, అతను తనని మోసం చేయడం అన్నీ గుర్తు చేసుకుంటుంది. చాలాసేపు నిద్ర రాకా, ఆలస్యంగా పడుకున్న ఇందిర ఉదయం తొమ్మిదైనా లేవకపోయేసరికి సింధు బలవంతంగా లేపుతుంది. ఒంట్లో బాలేదా అని అడిగి, తాను బ్యాంకుకి సెలవు పెట్టి ఇంట్లో ఉంటానని అంటుంది. అవసరం లేదు, వెళ్ళమని చెప్పి ఇందిర తన పనులలోకి దిగుతుంది. బ్యాంకుకి వెళ్ళిన సింధు ఏకాగ్రత లేక ఎన్నో తప్పులు చేస్తుంది. దాంతో శేషు ఆమెను మేనేజర్ అనుమతి తీసుకుని ఆమెను స్టాప్‌రూమ్‌లో కూర్చోమని చెప్పి, ఆమె పని తను చేస్తాడు. తాను ఓ అనాథననీ, తనని ఇందిరగారు ఓ ఆశ్రమం నుంచి తెచ్చుకుని పెంచుకున్నారని శేషుకి చెప్పాలని అనుకుంటుంది. కానీ శేషు అవేవి వినడు. సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతుంది సింధు. ఇందిర తనతో మూడు రోజుల పాటు ముభావంగా ఉండడంతో, ఏడుస్తూ తనని క్షమించమని వేడుకుంటుంది. ఇందిర ఆమెను దగ్గరకు తీసుకుంటుంది. అప్పుడు శేషుని ప్రేమిస్తున్న సంగతి ఇందిరకి చెబుతుంది సింధు. అప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలను చెప్పడం మొదలుపెడుతుంది ఇందిర. – ఇక చదవండి.]
అధ్యాయం 45
“సుమిత్ర మా పెద్దమ్మ కూతురు” అంటూ మొదలు పెట్టింది ఇందిరా దేవి. “అది నా కన్నా ఐదారు సంవత్సరాలు పెద్ద. అయినా ఆ వయస్సు మా ఇద్దరి మధ్యా అడ్డుగోడలుగా నిలవలేదు. ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకోడానికి, ఒకరి మనోభావాలు మరొకరు పంచుకోడానికి మా మధ్య అడ్డు గోడలుగా నిలవలేదు.
అయితే సుమిత్ర కొన్ని ఆలోచనలు భావాలు విపరీతంగా ఉండేవి. వాటిని నేను ఆమోదించలేకపోయే దాన్ని. ‘ఇందూ మగవాడు పెళ్ళి సమయంలో ఆడదాని మెడలో మూడు ముళ్ళూ వేస్తాడు. కాళ్ళకి మట్టెలు తొడుగుతాడు. మరి ఆడది మగవాడికి ఏం చేస్తుంది’ అనేది ఒక పర్యాయం.
మరోసారి ‘ఇందూ! భర్త చనిపోతే ఆడదాన్ని విధవరాలుగా మార్చే సమయంలో బొట్టు చెరిపేసి, గాజులు చితక్కొట్టి, పుస్తులు లాగేసి, పువ్వులు నలిపేసి ఆ తంతు చేసి భర్త చనిపోయిన ఆడదానికి మనస్తాపం కలిగిస్తారు. ఇది అమానుషం కాదా? మధ్యలో వచ్చినవి పుస్తెలు మాత్రమే. చిన్నప్పటి నుంచి బొట్టు పెట్టుకుంటోంది. గాజులు వేసుకుంటోంది. పువ్వులు పెట్టుకుంటోంది. మరి భర్త చనిపోయిన తరువాత వాటిని ఎందుకు నిషేధించాలి? మరో విషయం భార్య చనిపోతే మగవాడికి పెళ్ళి చేయడానికి ముందుకు వస్తారు కాని కొన్ని కుటుంబాల్లో భర్త చనిపోయిన ఆడదానికి పెళ్ళి చేయడానికి ఎందుకు ప్రయత్నించరు?
పిల్లలున్న మగవాడ్ని పెళ్ళి చేసుకోడానికి పెళ్ళి కాని కన్నెపిల్లే కావాలి. పిల్లలున్న విధవను ఎందుకు పెళ్ళి చేసుకోడు,’ ఇలాంటి విపరీత భావాలు, విపరీత ఆలోచనలు, విపరీత మాటలు సుమిత్రవి.
సుమిత్ర ప్రవర్తన చాలా మందికి నచ్చేది కాదు. అంతెందుకు మా ఇంట్లో వాళ్ళు అదే మా నాన్నగారు, మా మారుటి తల్లి, పెద్దమ్మ గారింటికి నన్ను పంపించడానికి ఇష్టపడేవారు కాదు. అయినా నేను ఇంట్లో మారాం చేసి సెలవులు ఇస్తే చాలు పెద్దమ్మ గారింటికి వెళ్ళేదాన్ని. నేను తప్ప సుమిత్ర మాటలు ఎవ్వరూ వినడానికి ఇష్టపడేవారు కాదు.
‘మన సమాజ పరిస్థితి విచిత్రంగా ఉంటుంది ఇందూ! మగపిల్లవాడ్ని వారసుడు అని అందలం ఎక్కిస్తారు. ఆడపిల్లను ఈసడిస్తారు. ఆడపిల్లల తల్లిని ఈసడిస్తారు. మగపిల్లాడి తల్లికి హారతులిస్తారు. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకి పాల్పడుతారు. ఆడపిల్ల అయినా, మగపిల్లవాడు అయినా పుట్టుకకి కారణం కేవలం మగ, ఆడ ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. వరసగా ఆడపిల్లలు పుడితే ఆ నేరం కేవలం ఆడవాళ్ళ మీద నెట్టి వేస్తారు కాని దీన్లో మగవాడి ప్రమేయం కూడా ఉందనుకోరు.’
ఇలా మాట్లాడేది. అందుకే సుమిత్ర మాటల విధానం ఎవరికీ నచ్చేది కాదు. మగవాళ్ళు ఆడే ఆటలు ఆడేది. వస్త్రధారణ కూడా అంతే. ‘ఇది ఆడదయిపోయింది కాని మగవాడయి పోవల్సింది,’ పెద్దమ్మ గొణుక్కునేది.
సుమిత్ర బాల్యం అలా గడిచిపోయింది. మరి పెద్దయ్యాక అదే డేరింగ్ డాషింగ్. అదే తీరు. అదే వ్యవహర శైలి. ఆడ, మగ అందరితో చనువుగా మాట్లాడేది. ఏదైనా తప్పుంటే నిలదీసేది నిక్కచ్చిగా మాట్లేడేది. ముక్కు సూటిగా ఎదుటివాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించేది.
ఎవరి మీదా ఆధారపడకుండా డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఓ ప్రైవేటు కంపెనీలో ప్రవేశించింది. అక్కడా అదే తీరు. తన వ్యవహార శైలి మార్చుకోలేదు. నాగరికత వెర్రితలలు వేసినప్పుడు సమాజంలో నీతి నియమాలు, నిజాయితీ అన్నది పనికి రాని నాణేలుగా మారిపోతాయి.
తన కన్నా చిన్న వయస్సులో ఉన్న అబ్బాయిని ప్రేమించింది. అది ప్రేమో తెలియదు. ఆకర్షణో తెలియదు. ఆ అబ్బాయి కూడా త్రికరణ శుద్ధిగా ప్రేమించాడా అంటే అదీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే నేటి సమాజంలో ప్రతీ ఒక్కరూ స్వంత ప్రయోజనాల కాంక్షతో ఎదుటి వాళ్ళను వాడుకుంటారు. ఎదుటివాళ్ళ వల్ల ప్రయోజనం ఉంటే నిస్సిగ్గుగా మన వెంట పడుతారు. ఎదుటివాళ్ళ వల్ల ప్రయోజనం లేకపోతే వెంటనే అదృశ్యమవుతారు. అటువంటివారు తమ స్వప్రయోజనాలకే ఎదుటి వారిని పావులుగా చేసుకుంటారు. ఎదుటి వాళ్ళ వలన ప్రయోజనం పొందిన తరువాత వదిలేసే స్వార్థపరులు.
లేకపోతే డిగ్రీ పాసైన శ్రీకాంత్ తన కన్నా పెద్దదయినా సుమిత్రను ఇష్టపడడం ఏుటి? ఆమెను ప్రేమించడం ఏంటి? ఉద్యోగం సద్యోగం లేని అతడ్ని సుమిత్ర కూడా ఇష్టపడి శ్రీకాంత్‌ను ఎం.బి.ఏ తన స్వంత ఖర్చుతో చదివించడానికి ప్రయత్నించడం ఇవన్నీ సుమిత్ర తొందరబాటు నిర్ణయాలు అని నాకనిపించింది.
తప్పులు మీద తప్పులు చేస్తూనే ఉంది సుమిత్ర. ఆ అబ్బాయి గురించి పూర్తిగా తెలుసుకుందా అంటే అదీ లేదు. వాళ్ళ వాళ్ళ గురించి వాకబు చేసిందా అదీ లేదు. గుళ్ళో పెళ్ళి చేసుకుంది. నేను వెళ్ళాను. నేను సాక్షినైనంత మాత్రాన్న సరిపోతుందా. చిన్న పిల్లదాని సాక్షమేంటి అని కొట్టి పారేస్తారు. గుళ్ళో పెళ్ళంటే చట్టబద్ధతలేని పెళ్ళి. అది అక్రమ సంబంధం క్రిందే లెక్కకు వస్తుంది. వాళ్ళకి పుట్టిన పిల్లలు అక్రమ సంతానమే. అదే రిజిష్టారు సమక్షంలో పెళ్ళి చేసుకుని ఉంటే చట్టబద్ధత వచ్చి ఉండేది. పుట్టిన పిల్లలకి భద్రత అన్ని హక్కులు ఉండేవి.
ఎవరి జీవితాలు ఏ ఏ దశలో ఎన్నెన్ని మలుపులు తిరుగుతాయో ఎవరూ చెప్పలేరు. మనిషి జీవితం అనుభవాల రాశి. ఆ అనుభవాలతో వాళ్ళు తమ జీవితాల్ని మార్చుకుని బాగుపడవొచ్చు లేకపోతే విచ్ఛిన్నమవచ్చు.
సుమిత్ర దేవుడు సమక్షంలో గుళ్ళో పెళ్ళి చేసుకుంది అంటే ఎవరు నమ్ముతారు? దానికి సాక్షమేది? లోకం దృష్టిలో సుమిత్ర, శ్రీకాంత్ సహజీవనం చేస్తున్నారు. వారిది అక్రమ సంబంధం. అందుకే వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. ఇరుగుపొరుగు వాళ్ళు చులకనగా చూసేవారు. హేళన చేసేవారు. వెనక నవ్వుకునేవారు. ఈ పరిస్థితి శ్రీకాంత్‌కి కొంత బాధ కలిగించినా సుమిత్ర లెక్క చేసేది కాదు.
శ్రీకాంత్ ఎం.బి.ఏ పూర్తి చేశాడు. ఒక పాపకి తండ్రి కూడా అయ్యాడు. అయితే అతనిలో ఏదో అసంతృప్తి. తప్పు చేసానన్న బాధ. ఏదో తెలియని నూన్యతా భావం. నిరాశ జీవితంలో నిరాశా నిశ్పృహలకు లోనయ్యే వారి జీవన విధానంలో అపనమ్మకం నెలకొంటుంది. తను ఆశించిన జీవితానికి అనుభవిస్తున్న జీవితానికి మధ్య వ్యత్యాసం. ఎక్కువయినపుడు కలిగే ఆందోళన ఒత్తిడి మూలంగా మానసికంగా, కృంగిపోతారు. ఒక్కొక్క పర్యాయం అనారోగ్యం పాలు కూడా అవుతారు.
ఒక్క్కొ పర్యాయం శ్రీకాంత్ ఆలోచన్లు నెగిటివ్‌గా సాగేవి. సుమిత్ర తనని చదివించింది. చట్టబద్ధత లేని పెళ్ళి చేసుకున్నారు. ఆమె పైన మగాళ్ళతో కూడా చనువుగా ఉంటుంది. ఏమో ఈ పుట్టిన పిల్ల తన వల్ల పుట్టిందన్న గ్యారంటీ ఏంటి? ఇలాంటి అపనమ్మకం అతనిలో బలపడుతోంది. అందుకే పుట్టిన పాపను దగ్గరకు తీసుకోలేకపోతున్నాడు. తండ్రి ప్రేమను పంచలేకపోతున్నాడు.
అందుకే వారిద్దరి మధ్యా ఈ విషయమంపై వాదవివాదాలు కలతలు రావడం ఆరంభించాయి. మనిషి ఎన్నో అనుకుంటాడు. పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకుంటాడు. ఏదో సాధిద్దామనుకుంటాడు. ఎన్నెన్నో పనులు చేద్దామనుకుంటాడు. అందుకే జీవితం నీటి బుడగ లాంటిది. అందని జీవితాలు సుఖంగా ముగయవు అనుకోని మలుపులు.
జీవితం ఒక ఆటలాంటిది. గెలుపెంత సహజమో అంతే సహజం ఓటమి కూడా. ఓటమి నుండి పాఠాలు నేర్చుకుంటూ గెలిచే వరకూ ఆడుతూనే ఉండాలి. ఈ ప్రపంచంలో సమస్యలు అని మనుష్యులెవరూ ఉండరు. సమస్యల వల్ల కృంగిపోని మనుష్యులూ ఉండరు.
సమస్యలు ఒక్కసారిగా చుట్టుముడ్తాయి. శ్రీకాంత్ ఎం.బి.ఏ పూర్తి చేసాడు. మంచి ఉద్యోగం వస్తుంది. ఎవరి మీదా ఆధారపడి బ్రతకక్కర్లేదు అని అనుకున్నాడు. అయితే అతను అనుకున్నట్టు జరగలేదు. ఉద్యోగం ఎండమావే అయింది.
తను సుమిత్ర తెచ్చిన డబ్బు మీదే ఆధారపడి బ్రతుకుతున్నానన్న నూన్యతా భావం. పుట్టిన పిల్లకి పాలు డబ్బాలకేనా ఖర్చు పెట్టడానికి పైసా కూడా సంపాదన లేదు. పైపెచ్చు సుమిత్రనే తన ఖర్చులకి అడుక్కునే పరిస్థితి. ఇలా ఆలోచిస్తూ క్రుంగుబాటుకి గురవుతున్నాడు.
పులి మీద పుట్రలా సుమిత్ర పని చేస్తున్న కంపెనీ నష్టాల్లో నడుస్తోంది. కొంతమంది స్టాఫ్‌ని తగ్గిద్దామనుకున్నారు. అలా స్టాఫ్‌ను తగ్గించే క్రమంలో సుమిత్ర ఉద్యోగం పోయింది. సుమిత్ర మిగతా విషయాల్లో ఎలా ఉన్నా సిన్సియర్‌గా పని చేస్తుంది. యాజమాన్యం సుమిత్రకి ఉద్యోగం ఇద్దామనుకున్నా సుమిత్ర డాషింగ్ నేచరు తెలిసిన స్టాఫ్ ఆమెకి ఉద్యోగం ఈయనీయలేదు. ఇలా సుమిత్ర జీవితం రోడ్డున పడిరది. మానసికంగా కృంగిపోయింది. అసహనం పెరిగిపోయింది ఆమెలో.
జీవితంలో సమస్యలు వస్తే మనిషి అధైర్యంతో వెనకడుగు వేస్తాడు. అప్పుడు మానసికంగా కృంగి పోతాడు. శారీరకంగా బలహీనుడవుతాడు. మనలో శక్తి తగ్గుతుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆత్మ విశ్వాసం దెబ్బ తింటుంది. బెదిరి వెనకడుగు వేస్తాం. అలా కాకుండా మన విశ్వాసం ఎప్పుడూ నిశ్చలంగా చెక్కు చెదరకుండా మౌనంగా మనస్సుకి సమాధానం చెప్పే విధంగా స్థిరంగా ఉండాలి.
కాని సుమిత్ర మానసిక స్థితి అలా లేదు. ఆమెలో రోజురోజుకి అసహనం పెరుగుతోంది. తన మీద తనకే అసహనం. శ్రీకాంత్ మీద అసహనం. పుట్టిన పిల్ల మీద అసహనం. ఉద్యోగం పోయింది. డబ్బు అయిపోతోంది. శ్రీకాంత్‌కి ఉద్యోగం లేదు. ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది.
అందుకే శ్రీకాంత్‌తో వాద వివాదానికి దిగేది చీటికీ మాటికీ. అతడ్నికించ పరిచే విధంగా మాట్లాడేది. అవమానించేది. చిన్నబుచ్చేది. అర్థంపర్థంలేని మాటలు విసిరేది. పాముకి పాలు పోసి పెంచితే విషం కక్కుతోంది అని అనేది. ‘అవసరం ఉన్నంత వరకూ నేను ఓడ మల్లయ్యని. నా అవసరం తీరుతోంది కాబట్టి నేను బోడి మల్లయ్యను’, ఇలా తనని తాను కించపరుచుకునేది, అతడ్ని కించపరిచేది. ఆమె మానసిక పరిస్థితి ఇలా ఉండేది.
‘చదువుకున్న వాడివి ఏదేనా చిన్న ఉద్యోగమేనా చూసుకోవచ్చు కదా. పాపకి పాల డబ్బాల ఖర్చుకేనా వస్తుంది?’ అని శ్రీకాంత్‌ను రెచ్చగొటేది.
ఆమె తీరుకి విసిగిపోయాడు శ్రీకాంత్. అతనిలో తెగింపు వచ్చింది. దాని ఫలితమే అతను కూడా వాద వివాదానికి దిగేవాడు. ‘నువ్వు చాలా మందితో తిరుగుతావు. ఆ పాప నాకు పుట్టింది అన్న గ్యారంటీ ఏంటీ?’ బాంబు పేల్చాడు.
అతను ఇలా అంటాడని ఎప్పుడూ సుమిత్ర ఊహించలేదు. కాని శ్రీకాంత్ అలా అనేటప్పటికి పిచ్చి కోపంతో ఊగిపోయింది. ‘ఏంటి పేల్తునావురా త్రాష్టుడా!’ అంటూ అతని చొక్కా పట్టుకుని గుంజింది. అతనూ ఓ స్థిర నిర్ణయంలో ఉన్నాడు, ‘ఈ రోజు నుండి నీకూ నాకూ ఏ సంబంధం లేదు. రాం.. రాం..!’ అంటూ తన సామాన్లు పట్టుకుని బయటపడ్డాడు. ఇలా వాళ్ళ సంబంధం విచ్ఛిన్నమయింది. ఇదంతా సుమిత్ర స్వయంకృతాపరాధమే. సుమిత్ర స్థితి మరింత దిగజారింది.
పరిస్థితులు ఇలా తారుమారు అవుతాయని ఆమె ఊహించలేదు. జీవితంలో ఏదో వెలితి. ఒంటరితనం. క్రుంగుబాటు. తన చుట్టూ ఉన్న వాళ్ళ అవహేళన ఇవన్నీ తట్టుకోలేకపోతోంది. అంత డాషింగ్ నేచరు ఉన్న సుమిత్ర శ్రీకాంత్ వెళ్ళిన తరువాత ఏదో శూన్యం. రోజు రోజుకి దుర్భరమవుతున్న జీవితం. కన్నవాళ్ళు కడుపులో పెట్టుకుని ఆదరించలేని పరిస్థితి.
చివరికి ఆమెలో ఓ స్థిర నిర్ణయం. ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయం. అంత ధైర్యస్థురాల్ని కూడా పరిస్థితులు ఇలా డీలా పరిచాయి. ఆత్మహత్యలకి, డిప్రెషన్ హత్యలు ఇంకా చాలా అనర్థాలకి కారణం మనిషి తనలో తాను అర్ధం చేసుకోకపోవడం. అందరి మధ్యా ఉన్నా కూడా ఒంటరితనంతో కుమిలి పోవడం తమ కష్టాలు, జీవితంలో వచ్చే నష్టాలు చెప్పుకోలేని దయనీయ స్థితిలో ఇలా ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. ఇదే నడుస్తున్న నేటి చరిత్ర.
సుమిత్ర అనాథ ఆశ్రమంలో పిల్లను చేర్పించి ఒకవేళ నేను వస్తే నాకు ఆ పిల్లను అప్పగించమని అంగీకార పత్రం వ్రాసి వాళ్ళకి ఇచ్చింది. నా పేరున కూడా ఓ ఉత్తరం వ్రాసి నాకు పంపింది. ఆ ఉత్తరం నాకు అందేలోపేనే సుమిత్ర ఆత్మహత్య చేసుకుందన్న వార్త. ప్చ్.. పూర్ సుమిత్ర. దాని జీవితమంతా ఎండమావే.
నేను జీవితంలో స్థిరపడిన తరువాత ఆశ్రమానికి వెళ్ళి ఆ అమ్మాయిని తెచ్చుకున్నాను. ఆ అమ్మాయివే నీవు సింధూ. నీ కన్న తల్లి సుమిత్ర.”
ఇందిర చెప్పిన విన్న తరువాత సింధు మనసు బాధతో భారమయింది. అలా నిశ్చేష్టురాలయినట్టు అలా ఉలుకూ పలుకూ లేకుండా అలా ఉండి పోయింది.
అధ్యాయం 46
“సింధూ.. సింధూ..!” అంటూ భుజం తట్టింది ఇందిర. షాక్ నుండి కోలుకుంది సింధు. “ఆర్ యూ ఓకే..!” అంది ఇందిర. “ఊఁ!!!” అంది సింధు. తేరుకుని “మన జీవన ప్రయాణంలో ఎన్నో క్లిష్టమైన మలుపులు ఉంటాయి. వాటిని దాటుకుంటూ సవాళ్ళను ఎదుర్కుంటూ ముందుకు సాగుతేనే అసలైన జీవితం. తన జీవితంలో ఇన్ని మలుపులున్నాయి అని తను అనుకోలేదు. అయితే సుమిత్ర తన తల్లి అన్న తలంపు తనకి సంతృప్తినీయటం లేదు.
ఎందుకంటే సుమిత్ర స్వభావానికి ఇందిరమ్మ స్వభావానికి తను విన్న దాని బట్టి చాలా తేడా. ఇందిరమ్మదంతా దూరదృష్టి, సహనం, ఓర్పుతో పాటు ఎదుటి వాళ్ళకి ప్రేమను పంచడం, అనురాగం వాత్సల్యం చూపించడం ఈ గుణాలన్నీ ఉన్నాయి.
సుమిత్ర జీవితంలో డాషింగ్ మాత్రమే కాని పరిస్థితులు ఒక్కసారి తారుమారయితే కుంగిపోవడం, వ్యతిరేక పరిస్థితుల్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం తనకి నచ్చలేదు. ఇందిరమ్మ తనని సాకబట్టి కాని లేకపోతే అనాథాశ్రమంలో అనాథగా తన జీవితం ఎన్ని మలుపులు తిరిగేదో.
అనాథ అయిన తనకు మాతృ ప్రేమను పంచి ఇచ్చింది ఇందిరమ్మ. అలాంటి అమ్మను తను వంచించింది. అబద్ధం చెప్పింది. ఇది తనను తాను క్షమించుకోలేదు. సుమిత్ర జీవితాన్ని తాను సమర్థించలేకపోతోంది. ఎంత డాషింగ్ నేచర్ అయినా ఏంటి లాభం? తన కన్నవాళ్ళ మన్ననల్ని పొందలేక పోయింది. తనతో కలిసి బతికిన శ్రీకాంత్ మనస్సు నొప్పించి అతనికి దూరమయింది.
పైకి చెప్పుకోలేక మానసికంగా నలిగిపోయింది. అదీ ఉద్యోగం పోయిన తరువాత. అప్పుడే ఆమెలో అసహనం పెరిగిపోయింది. సహనం చచ్చిపోయింది. ఇరుగుపొరుగు వాళ్ళు తను శ్రీకాంత్‌తో కలిసి బ్రతుకుతున్న బ్రతుకును హేళన చేస్తుంటే చులకనగా చూస్తుంటే తట్టుకోలేకపోయింది.
“సింధూ! నీవు సుమిత్ర గురించి ఆలోచిస్తున్నావు కదూ!”
“అవును”
“అందరిలోనూ బలాలూ ఉంటాయి. బలహీనతలూ ఉంటాయి. మనం మన బలాల్ని ఒప్పుకున్నంత సులువుగా బలహీనతల్ని ఒప్పుకోము. సుమిత్ర కూడా తన బలహీనతల్ని ఒప్పుకోలేకపోయింది. ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకోలేకపోయింది. దానికి ఫలితమే బలవంతపు చావు.”
“నేను సుమిత్ర కూతురు కంటే ఇందిరమ్మ కూతురుగా ఉండాలనే కోరుకుంటాను.”
“అది సరియైన ఆలోచన కాదు. మన జీవితంలో నెగిటివ్, పాజిటివ్‌గా ఆలోచన్లు ఉంటాయి. పాజిటివ్‌ని ఆమోదించినంతగా నెగిటివ్ ఆలోచన్లు ఆమోదించలేము. అది మన మనస్థితిని బట్టి ఉంటుంది. నీకు తెలియని విషయం ఒకటి చెప్తున్నాను. ఇంత ప్రశాంతంగా ఉంటున్న నా జీవితంలో కూడా చీకటి కోణాలున్నాయి,” ఇందిరమ్మ మాటలకి విస్మయంగా చూసింది సింధు ఆమె వేపు.
నవీన్ ఉదంతం వివరించింది ఇందిర. “నా తల్లి చనిపోవడం. నా తండ్రి నన్ను పట్టించుకుకోకపోవడం. మారుటి తల్లి నిరాదరణ ప్రేమ రాహిత్య జీవిత సమయంలో మాస్టారు గారి ఓదార్పు మాటలు నా మనస్సుకి ఎంతో ఊరటని ఇచ్చేవి. నా బాధంతా మరిచిపోయేదాన్ని. ఆ తరువాత వైద్య విద్య అభ్యసిస్తున్న సమయంలో నవీన్ మాటలు అమృత గుళికల్లా అనిపించేవి. నా బాధల్ని సమస్యల్ని మరిచిపోయాను. ప్రేమ రాహిత్యం నుండి బయట పడ్డానికి అతడ్ని ఆత్మీయుడుగా భావించాను. స్నేహం చిక్కబడింది. ఏదో తెలియని ఆకర్షణ. అతని మీద ప్రేమ భావం. ఆకర్షణకి, ప్రేమకి తేడా ఉంది. ఆకర్షణ క్షణికం ప్రేమ శాశ్వితం.
ఈనాటి అమ్మాయిలు ఆకర్షణనే ప్రేమ అనుకుని తమ సర్వస్వం ప్రేమికుడు అనేవాడికి సమర్పిస్తున్నారు. అది ప్రేమ కాదు. ఆకర్షణ అని అనుకోవటం లేదు. దానికి ఫలితం అనుభవించేది ఆడదే. ప్రకృతి కూడా ఆడదానికి ప్రతికూలమే. తన కోరిక తీర్చుకున్న మగవాడు చక్కగానే ఉంటాడు. ఆడదే నష్టపోతుంది శీలం పోగొట్టుకుని.
నేనూ నవీన్ మానసికంగా ఒకటయ్యాము కాని శారీరకంగా ఒకటవడానికి నేను ఇష్టపడలేదు. అలా చేయకపోబట్టే అతను తిరిగి పెళ్ళి చేసుకుని నన్ను మోసం చేసినా నేను చలించలేదు. అతని సహజీవన ప్రస్తావన బాహటంగా తిరస్కరించి అతడ్ని అన్ని కఠినమైన మాటలు అని నా జీవితం నుండి వెళ్ళగొట్టాను. అది నేను శారీరకంగా కలవకుండా నిగ్రహంతో ఉండటం వలన సాధ్యమైనది. అది మాస్టారు నాకు నేర్పిన పాఠం.
ఈనాటి ఎంతమంది అమ్మాయిలు ఈ నిగ్రహాన్ని పాటిస్తున్నారు? అలా పాటించకపోబట్టే మోసపోతున్నారు. దగాబడ్తున్నారు. నయవంచకుల కబంద హస్తాల్లో నలిగిపోతున్నారు. నేడు ఈ టీనేజ్ ప్రేమ సినీమాలు, ఇంటర్నెట్‌లు, సెల్‌ఫోన్లలో కొన్ని యాప్స్, ఇవన్నీ యువతను పెడదారి పట్టిస్తున్నాయి. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కల్చరు పాశ్చత్య సంస్కృతి డేటింగ్‌ను గుర్తుకు తెస్తుంది,” ఇందిర సింధుకి ఇలా చెప్పుకుపోతోంది.
సింధు ఆలోచిస్తోంది. పార్కులో తను శేషు గురించి ఆలోచిస్తున్న సమయంలో కూడా ప్రేమ, ఆకర్షణ గురించి చర్చించుకుంది. ఇందిరమ్మ చెప్పినట్టు ప్రేమ ఆకర్షణ వేరు వేరు. తనకి శేషుకి మధ్య ఉన్నది ఆకర్షణ కాదు. ప్రేమ అని అనుకుంది.
“నీవూ, ఆ శేషూ త్రికరణ శుద్ధిగా ప్రేమించుకున్నట్లయితే, ఒకరికి మరొకరు ఇష్టం అయితే మీ ప్రేమ సఫలీకృతమయి మీరిద్దరూ వివాహ బంధంలో ఒకటయ్యేటట్లు చేస్తాను. అయితే అతని ప్రేమ నవీన్ లాంటిదయితేనే వస్తుంది సమస్య అంతా.”
“మీ మార్గదర్శకం నాకు కావాలి అమ్మా,” సింధు అంది.
“సింధూ! ఒక్క విషయం. ఒక్కొక్క పర్యాయం మనం అనుకున్నది ఒకటి అయింది. ఒకటి అవుతుంది. నేను నవీన్‌ని త్రికరణ శుద్ధిగా ప్రేమించాను. అతను హోదా, అంతస్తు డబ్బు వచ్చే అమ్మాయిని పెళ్ళాడి డబ్బుకి అమ్ముడైపోయాడు. నన్ను కేవలం ఉంపుడుకత్తెగా ఉండి తనకి లైంగికానందం ఇవ్వమన్నాడు. అందుకై సహజీవనం చేద్దాం అన్నాడు. మొదట అతను ప్రేమించింది డబ్బుని. లైంగికానందం కోసం నన్ను.
శ్రీకాంత్‌లో స్వార్థం ఉంది. తనకన్నా పెద్ద వయస్సుయినా తనని చదివిస్తానని ఆశపెట్టింది. తను బాగా చదివి, మంచి ఉద్యోగం సంపాదించవచ్చు అనే ఆ కోణంలో స్వార్థంగా ఆలోచించాడు. ఆ తరువాత ఆత్మభిమానం మనిషిగా మారి సుమిత్ర ప్రవర్తన నచ్చక ఆమె నుండి వేరవడానికి ప్రయత్నించాడు. అతనిదీ అవకాశవాదమే.
ఇక సుమిత్ర విషయానికి వస్తే తను ఏం చెప్పినా చేస్తాడు, తను ఎలా నడుచుకోమంటే అలా నడుచుకుంటాడు, తన దగ్గర ఓ కీలు బొమ్మలా పడి ఉంటాడు అని అనుకుని తన కన్నా వయస్సులో చిన్నవాడయిన శ్రీకాంత్‌ను పెళ్ళి చేసుకుంది.
సుమిత్ర ఉద్యోగం పోకుండా ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి. ఉద్యోగం పోవడంతో ఆమెలో అసహనం పెరిగిపోయింది. అదే శ్రీకాంత్, సుమిత్ర మధ్య అడ్డుగోడగా నిలిచి, చిలికి చిలికి గాలి వాన అయి ఇద్దరూ విడిపోడానికి కారణం అయింది. ఇవతల శ్రీకాంత్ తిరస్కరణ, అవతల ఆర్థిక కష్టాలు వీటిని భరించలేకే ఆత్మహత్యకి పాల్పడింది.
సుమిత్రకి ఆమె ప్రవర్తన వల్ల కన్నవాళ్ళ ఆదరాభిమానాలు లభించలేదు. నాకు నా తల్లి చిన్నప్పుడే చనిపోవడం వల్ల నాకు నావాళ్ళ ఆదరాభిమానాలు లభించలేదు. ఇక్కడ మా ఇద్దరి జీవితాల్లో సమానతే. ప్రేమ విషయంలోని అంటే నవీన్ స్వార్థం వల్ల మా ప్రేమ ఫలించలేదు. సుమిత్ర అసహనంతో శ్రీకాంత్‌ని కించపరచడం వల్ల వాళ్ళ జీవితాలూ సమాంతర రేఖలుగా మిగిలి ఆ తరువాత ఆ రేఖ చెరిగిపోయింది,” నిట్టూర్పు విడుస్తూ అంది ఇందిర.
(ఇంకా ఉంది)
విజయనగరం వాస్తవ్యులైన శ్రీ గూడూరు గోపాలకృష్ణమూర్తి హిందీ ఉపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. వారు రాసిన కథలు వివిధ వార్తపత్రికల్లో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు సంకలనంగా వెలువడ్డాయి.