Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మలుపులు తిరిగిన జీవితాలు-22

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]

[అదో పార్కు. మూలగా ఓ యువతి బల్ల మీర కూర్చుని తన ప్రియుడి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కొద్దిసేపయ్యాకా, అతను పాట పాడుకుంటూ వస్తాడు. కాసేపు అవీఇవీ మాట్లాడుకున్నాకా, ఆమె అతనికి తన గతం గురించి చెప్పాలనుకుంటుంది. సంతోషంగా సాగుతున్న వర్తమానంలో, గతం గురించి ఎందుకు అని అతను దాటవేస్తాడు. మరోసారి తప్పక వింటానని చెప్తాడు. కాసేపు కూర్చున్నాకా వెళ్దామంటుంది. అతని బైక్ మీద ఎక్కి బయల్దేరుతుండగా, డాక్టర్ ఇందిరా దేవి తన కారులో ఆ పార్కు దగ్గరకి వస్తుంది. ఆ యువతీయువకులు ఆమెను చూడలేదు కానీ, ఆమె వాళ్ళిద్దర్నీ గమనించింది. ఆ యువతి ఆమె కూతురు సింధు. ఇక పార్కులో కూర్చునే మూడ్ లేక ఇంటికి వెళ్ళిపోతుంది ఇందిర. అప్పటికింకా సింధు ఇంటికి రాలేదు. ఇందిర తన గతం గురించి, తన విఫల ప్రేమ గురించి గుర్తు చేసుకుంటుంది. తను ప్రేమించిన నవీన్ తననెలా మోసం చేసాడో గుర్తు చేసుకుంటుంది సింధు జీవితం తన నేస్తం సుమిత్ర  జీవితంలా కాకూడదని అనుకుంటుంది. కాసేపయ్యాకా ఇల్లు చేరిన సింధుని ఎందుకాలస్యమైందని అడిగితే, బ్యాంకులో మీటింగ్ ఉందని అబద్ధం చెబుతుంది. సరే వెళ్ళి ఫ్రెష్ అయి అన్నం తినమని చెప్తుంది ఇందిర. నీవు లేకుండా నేనెప్పుడైనా తిన్నానా అని సింధు అడిగితే, తనకి ఒంట్లో నలతగా ఉందని, తిననని చెబుతుంది ఇందిర. సింధుని భయపెట్టి కాకుండా, సంయమనంతో మార్చాలని అనుకుంటుంది. – ఇక చదవండి.]

అధ్యాయం 43

క్క మీద అటు ఇటు దొర్లుతోందే కాని ఇందిరకి నిద్ర పట్టడం లేదు. వర్తమానంలో జరిగిన విషయం భూత కాలపు తలపులు తడుతోంది. సింధు జీవితం, సుమిత్ర జీవితంలా అవకూడదు. అని అనుకుంటున్న ఆమె కళ్ళెదుట ఒక్కసారి నవీన్‌ రూపం నిలిచింది.

పేరుకు తగ్గట్టు నవీన్‌ నవీన భావాలు కలవాడు. తన బాల్యంలో కుటుంబ నేపథ్యం ఎలా ఉండేదంటే తన తల్లి చిన్నప్పుడే చనిపోయింది. మాతృప్రేమ కోసం తల్లాడిపోయేది తన చిన్నారి హృదయం.

తండ్రి తిరిగి పెళ్ళి చేసుకున్నాడు. మారుటి తల్లి ఉపేక్ష. ఇంట్లో ప్రేమ రాహిత్య వాతావరణం. తన భావోద్వేగాలు ఎవరితో పంచుకోవాలి. తండ్రి లాయరు. అతని జీవితం అంతా కోర్టుకి సంబంధించిన కేసులు క్లైంట్లు న్యాయవాద పుస్తకాల మధ్య గడిచిపోయింది.

ప్రేమానురాగాలు ఎండమావి. ఒక్కొక్కోసారి తనకి బాధనిపించేది. దుఃఖం అనిపించేది. స్కూలుకి వెళ్ళినా ఒంటరిగా కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చేది. అలాంటి సమయంలో ఓ అమృత హస్తం తన తల నిమిరి తన బాధనంత పోగొట్టడానికి ప్రయత్నించేది.

ఆ అమృత హస్తమే తాను పేరు మరిచిపోయింది కాని ఓ ఉపాధ్యాయుడు. అతను తనను ఓదార్చేవారు. ధైర్యం చెప్పేవారు. తనలో ఆత్మ స్థైర్యాన్ని నింపేవారు. అతను ఒక్కొక్క పర్యాయం తనతో అన్న మాటలు ఇప్పటికీ గుర్తే.

“మన జీవితంలో బాధకరమైన సంఘటనలు ఎప్పుడేనా ఎవరికైనా జరుగుతాయి. అలాంటి సమయంలో భావోద్వేగానికి లోనై ఏడుస్తూ కూర్చోకూడదు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అంతే కాని బాధపడ్తూ కూర్చుంటే ఎలాంటి ఫలితం ఉండదు. జీవితంలో ఎప్పుడూ మంచి జరగాలనుకోవాలి. మంచి గురించే ఆలోచించాలి. అన్నీ మన మంచికే అనుకోవడం మంచిదే అయితే వాస్తవికంగా ఆలోచించాలి. జీవితంలో ఆశావాదం ఉండాలి కాని నిరాశావాదం ఉండకూడదు. అదీ వాస్తవ ఆశావాదం ఉండాలి. అదే అలవరుచుకోవాలి. అయితే తీవ్రమైన ఆశావాదం, నిరాశావాదం పనికి రావు. వాస్తవిక అశావాదం ఉండాలి,” అనేవారు.

అంత చిన్న వయస్సులో అతని మాటలు తనకు సరిగా అర్థం అయ్యేవి కాదు. కాని మాస్టారు గారు తను అలా ఏడవకూడదు ధైర్యంగా ఉండు అని చెప్తున్నారు అని అర్థమయేది.

ఒక్కొక్క పర్యాయం తను ఇతర పిల్లల్తో తన జీవితాన్ని సరిపోల్చుకుంటూ అందరూ ఎంత సంతోషంగా ఉన్నారు. తను మాత్రం సంతోషంగా లేను అని అనుకుంటే మాస్టారు “ఇందూ! మనలో చాలా మంది నీలాగే ఆలోచిస్తారు. మాట్లాడుతారు. ఇతరులతో తమ జీవితాన్ని సరిపోల్చుకుంటూ నిరుత్సాహంగా నిరాశగా ఉంటారు. ఇది సరియైన ఆలోచన కాదు. సరియైన దృక్పథం కాదు,” అని అనేవారు.

ఒక్కొక్కసారి తను బాగా చదవలేకపోయేది. పరిక్షల్లో మార్కులు తగ్గేవి. చదివినది మరిచిపోయేది. దానికి ఫలితం ఇంట్లో చీవాట్లు. అది తలుచుకుని తను బాధపడేది. అప్పుడు కూడా మాస్టారే ఓదార్పే తన బాధనంతా తీసేసేది.

“ఇందూ! చాలా మంది తల్లిదుడ్రుల తమ పిల్లల్ని ఇతర పిల్లల్తో పోలుస్తారు. ఇలా చేయడం వలన పోటీతత్వం పెరుగుతే పరవాలేదు. అలా జరగనప్పుడు పిల్లలు నిరుత్సాహానికి గురవుతారు. అసహనానికి గురవుతారు. అందరి తెలివితేటలూ ఒక్కలా ఉండవు. ఒక్కసారి వింటే కొందరికి గుర్తు ఉండిపోతుంది. మరికొందరు ఎంత చదివినా మరిచిపోతారు. ఇంటి వాతావరణం, పిల్లల మానసిక స్థితి అన్నీ దీనికి ముఖ్య కారణం మార్కులు, ర్యాంకులు విషయం. అయితే అంతే ఎంత తెలివైన వాడయినా పరీక్ష వ్రాసే సమయంలో అనారోగ్యం కారణం చేతో మరో కారణం చేతో అతని మార్కులు తగ్గచ్చు. అలాంటి సమయంలో వాళ్ళని ఎదుటి వాళ్ళతో సరిపోల్చుకూడదు. మనల్ని మనతో పోల్చుకోవాలి.”

మాస్టరు గారి మాటలే తనకి మనోధైర్యాన్ని ఇచ్చాయి. ఇంటర్‌ పాసైన తరువాత ఎమ్‌సెట్‌లో తనకి ఎమ్‌.బి.బి.యస్‌లో సీటు వచ్చినప్పుడు మాస్టారి ఆశీర్వాదం తీసుకోడానికి వెళ్ళింది.

ఆ సమయంలో ఆయన “ఇందూ! సంకల్ప బలం ఉంటే మనం దేనినైనా సాధించవచ్చు. మనం వృద్ధి చేసుకోవల్సింది. మంచి పనులు, మంచి అలవాట్లు, మనోధైర్యం, పట్టుదల. ఇవి ఉంటే నీవు దేనినైనా సాధించగలవు” అన్నారు.

అంత వరకూ మాస్టారు గారి మాటలే తనని ముందుకు నడిపించాయి. ప్రేమ రాహిత్యం లేకుండా చేసాయి. వైద్య వృత్తిలో ప్రవేశించాక తనలోని, నిరాశని, ప్రేమ రాహిత్యాన్ని తొలగించినవాడు నవీన్‌. అదే నవీన్‌ కుమార్‌ పేరు తగ్గట్టు అతనివన్నీ నవీన భావాలే.

ఆ భావాలకి ఆమడ దూరంలో ఉండే తనకీ అంత గాఢమైన మంచి స్నేహం ఎలా ఏర్పడిరదో తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యమే. సరదాగా మాట్లాడేవాడు, జోక్‌లు వేసేవాడు. ఎంత గంభీరంగా ఉన్న వాళ్ళేనయినా అతను వేసే జోక్‌లకి నవ్వుకుండా ఉండేవారు కాదు. అంత సరదా మనిషి.

హైస్కూలు చదువు సమయంలో మాస్టరు గారి ధైర్య వచనాలు, వైద్య విద్యలో నవీన్‌ తనకి ఆహ్లాదకరమైన వాతావరణంలోకి తీసుకెళ్ళడం ఇవన్నీ జీవితంలో తనని ముందుకు నడిపించాయి.

జీవితంలో చాలా మంది స్నేహితులవుతూ ఉంటారు కాని అందరూ మంచి స్నేహితులు అవలేరు. ముఖ్యమైన మన మంచి మిత్రుడు మనలో ఉన్న అత్యుత్తమ ప్రతిభను గుర్తించి పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. తనలో ఉన్న జ్ఞాపక శక్తికి కూగా పదును పెడ్తారు.

అమ్మాయిలకి ఆడ స్నేహితులే ఉండక్కరలేదు. మంచిని కోరే మగ స్నేహితులున్నా పరవాలేదు. ఒక్కొక్క సారి తను అనుకునేది. మగ, ఆడ అనేది మన ప్రవర్తన నైతికతను బట్టి ఉంటుంది అని తను అనుకునేది. అన్నీ బాగానే ఉన్నా నవీన్‌లో ఉన్న ఒక్క గుణం తనకి నచ్చేది కాదు. అదే అతనిలో ఉన్న స్వార్థ భావాలు, చంచల స్వభావం.

ఏ మనిషీ అన్నీ సుగుణాలతో ఉండడు. అన్నీ దుర్గుణాలతో ఉండడు. ఈ గుణాలన్నీ వాళ్ళ వాళ్ళ బలహీనతలు అని తను అనుకునేది. హౌస్‌ సర్జన్‌ చేస్తున్న సమయంలో ఇద్దరి మనస్సులో తాము దాంపత్య జీవితంలో ఒకటయితే బాగుంటుంది అన్న ఆలోచన ఇద్దరి మనస్సులోనూ వచ్చింది. దానికి ఫలితమే ఒక రోజు ప్రశాంతమైన వాతావరణంలో ఒకరి భావాలు మరొకరు తెలియజేసుకున్నారు.

ఇప్పటి ప్రేమికులకి ప్రేమ కన్నా ఆకర్షణ ఎక్కువ. ఆ ఆకర్షణ మత్తులో పడి ప్రేయసి తన సర్వస్వం ప్రేమికుడికి సమర్పించుకుంటుంది. ఆ తరువాత జరగరానిది జరిగుతే కుమిలిపోతుంది. పెళ్ళి చేసుకోడానికి ప్రేమికుడు తిరస్కరిస్తే ప్రాణాలు తీసుకుంటుంది. సుమిత్ర చేసింది ఇంచు మించు ఇలాంటి తప్పే.

తను మాత్రం మానసికంగా తన మనస్సుని నవీన్‌కి అంకితం చేసేందే కాని శారీరకంగా అతనికి దూరంగానే ఉంది. ఇప్పుడు ఆలోచిస్తే అలా ఉండటం మంచిదయిందని అనిపిస్తుంది తనకి.

“ఏంటి ఇందూ! ప్రేమికులం అన్న మాటే కాని ఓ ముద్దూ ముచ్చటా లేదు. ముద్దు అక్కరలేదు కనీసం నీ శరీరాన్ని కూడా ఇప్పటి వరకూ తాకనీయ లేదు” అనేవాడు.

“అవన్నీ లైసన్సు పొందిన తరువాతే, అదే పెళ్ళి అయిన తరువాతే” అని తను నవ్వుతూ అనేది.

నవీన్‌లో ఈ మధ్య ఏదో మార్పు. తనకి తెలియని మార్పు. ఆ మార్పుకి కారణం తను అడిగింది. “మా ఇంట్లో పరిస్థితులు బాగులేవట. నన్ను ఓ పర్యాయం రమ్మంటున్నారు” అన్నాడు.

అతను వెళ్ళాడే కాని తన మనస్సు ఏదో కీడును శంకిస్తోంది. అయినా మాస్టారు మాటలు ఆ సమయంలోనూ గుర్తుకు వస్తున్నాయి. ‘నిరాశావాదం వదిలిపెట్టి ఆశావాదాన్ని అలవర్చుకోవాలి. దృఢసంకల్పం మనలో ఉండాలి. మనోనిబ్బరం ఉండాలి’ అని.

సెలవు పెట్టి వెళ్ళిన నవీన్‌ మేనమామ కూతుర్ని పెళ్ళి చేసుకుని వచ్చాడు. మేనమామ కట్నంగా నర్సింగ్‌ హోమ్‌ కట్టి ఇయ్యడమే కాకుండా వాళ్ళ కొత్త సంసారానికి అవసరమైన అన్నీ హంగులూ సమకూర్చాడు.

ఇది విని తను డిప్రెషన్‌కి లోనయింది. చాలా క్రుంగిపోయింది. వారం రోజులు వరకూ మామూలు మనిషి అవలేకపోయింది. ఎందుకిలా అయింది, ఎందుకిలా అయింది అని తనని తాను ప్రశ్న వేసుకుంది. అతని బలహీనత, చంచల స్వభావం తెలిసిన నీవు ఎందుకలా బాధపడ్తావు మనస్సు తనని హెచ్చరించింది. ఆ సమయంలో కూడా మాస్టారి మాటలే తనకి స్పూర్తినిచ్చాయి తనలో మనో ధైర్యం నింపాయి.

మరిచిపోడానికి ప్రయత్నం చేస్తుండగా ఓ రోజు నవీన్‌ తన రూమ్‌కి వచ్చాడు తను ముఖం తిప్పుకుంది.

“సారీ ఇందూ!” అన్నాడు.

“సారీ చెప్పినంత సులువుగా మనుష్యుల మనసును శాంతింప చేయలేవు నవీన్‌!”

“నువ్వంటే నాకు ఇష్టం. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ.”

“అలాంటప్పుడు మరో అమ్మాయి మెడలో ఎలా తాళి కట్టావు?”

“పెద్దవాళ్ళ మాట కాదనలేక.”

“అప్పుడు నేను గుర్తుకు రాలేదా?”

“ఇప్పుడు ఏం కొంప మునిగిపోయింది? లివింగ్‌ టుగెదర్‌ అదే సహజీవనం చేద్దాం. అవతల కట్టుకున్న దానితో ఉండొచ్చు. ఇవతల ప్రేమించినదాన్ని సంతోషపెట్టచ్చు.”

“వాట్‌ ఆర్‌యూ టాకింగ్‌ నవీన్‌? నేను.. నేను.. నీ ఉంపుడు కత్తెగా ఉండాలా?”

ఇప్పుడయితే అందరూ సహజీవనం చేస్తున్నారు. ఆ సంస్కృతి వచ్చింది కాని పాతిక సంవత్సరాల క్రితం ఈ సంస్కృతిని ఈసడించేవారు.

“నేను అన్నదానిలో తప్పేం ఉంది?”

“తప్పులేదంటున్నావేుటి? నీవు అన్నది ఎంత తప్పో నీకు తెలియటం లేదు. నీ మీద నాకు ప్రేమ చచ్చిపోయింది. నీవు నాకు అవసరం లేదు. మరి నా దగ్గరకు రావడానికి ప్రయత్నించకు. మాట్లాడ్డానికి ప్రయత్నించకు. గెటౌట్‌!” గట్టిగా అరిచింది ఇందు బయటకి నవీన్‌కి దారి చూపిస్తూ. మారు మాట్లాడకుండా అతను బయటకు నడిచాడు. ఇలా తన జీవితంలో వివాహ జీవితానికి తలుపులు మూతలు పడ్డాయి.

ఆలోచనా ప్రపంచం నుండి బయట పడింది ఇందిర. రాత్రి రెండు గంటలయింది. కళ్ళు మండుతున్నాయి. అన్యమనస్కంగా పక్క మీద అటు ఇటు దొర్లుతోంది.

అధ్యాయం 44

తెల్లవారు జాము మూడు గంటల వరకూ ఇందిరకు నిద్రపట్టలేదు. కళ్ళు మండుతున్నాయి. తలనొప్పిగా ఉంది. మాత్ర వేసుకుని పడుకుంది. నిద్ర పట్టెటప్పటికి చాలా సేపు అయింది. ఉదయం తొమ్మిది గంటలయినా లేవలేదు. సింధుకి ఆత్రుతగా ఉంది. ఆందోళనగా ఉంది. ఎందుకో అమ్మ అశాంతిగా కనబడుతోంది. దేని గురించో బాధపడుతోంది. దీని కంతటికీ కారణం తనై ఉంటుందా? ఆమె మనస్సులో ప్రశ్న.

“అమ్మా.. అమ్మా!!!” ఇందిరను లేపింది సింధు. బలవంతాన్న కళ్ళు తెరిచింది ఇందిర. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాత్రంతా నిద్రలేనట్లు. కనురెప్పలు బరువుగా మూసుకుపోతున్నాయి.

“అమ్మా! వొంట్లో బాగులేదా? నేను ఈ రోజు బ్యాంకుకి సెలవు పెడ్తున్నాను. లేచి బ్రష్‌ చేయ్యి. కాఫీ కలిపి తెస్తాను,” అంది సింధు.

“అవసరం లేదు. నీ పని నీవు చేసుకో! కొద్ది సేపు ఉన్నాక లేస్తాను. ఈ రోజు హస్పటల్‌కి వెళ్ళను,” అంది ఇందిర.

అమ్మ ఏదైనా అందంటే ఆ మాట మీదే కట్టుబడి ఉంటుంది. ఆమె స్వభావం పూర్తిగా తనకి తెలుసు. అమ్మకి మాట అంటే మాటే అని అనుకున్న సింధు వాచ్‌‌మన్‌ అప్పల స్వామితో “అమ్మని జాగ్రత్తగా చూసుకో!” అంది. అలాగే అన్నట్టు తలూపాడు అప్పలస్వామి.

సింధు వెళ్ళిన తరువాత ఇందిర లేచింది. బ్రష్‌ చేసి గోరు వెచ్చని నీళ్ళు వొంటి మీద పోసుకుంటూ ఉంటే ఎంతో హాయిగా ఉంది. కొద్దిగా రిలీఫ్‌ లభించింది. కాఫీ చేసుకుని తాగుతూ కొద్ది రోజులు ఇలాగే బింకంగా ఉండాలి. తను ఇలా ఎందుకు ఉందో తను చెప్పకుండా సింధుకు తెలియాలి. అప్పుడే దాపరికం లేకుండా విషయాన్ని చెప్పగలదు. ఇది ఇందిర ఆలోచన.

సింధు బ్యాంకుకి వెళ్ళిందే కాని మనసు మనసులో లేదు. ఏదో పొగొట్టుకున్నట్టు ఉంది. బ్యాంకులో అన్నీ పొరపాట్లే చేస్తోంది. “సింధూ! నీకొటి అయింది ఈ రోజు. అన్నీ తప్పులే చేస్తున్నావు. ఆరోగ్యం బావుందా?” శేషు అడిగాడు.

“ఆరోగ్యం బాగానే ఉంది మనసే బాగులేదు?”

“ఎందుకు?”

“ఎందుకేంటి అమ్మకి ఎవరి ద్వారానో మన విషయం తెలిసిందేంటో? ఆమె ప్రవర్తన వేరుగా ఉంది,” అంటూ రాత్రి తను ఇంటికి వెళ్ళినప్పటి నుండి తను ఉదయం బ్యాంకుకి వచ్చినంత వరకూ జరిగింది వివరించింది సింధు శేషుకి.

“అమ్మ బాబోయ్‌! చంపావు.”

“నీవే అలా అంటే నా పరిస్థితి ఏంటి? నీకు ఏదైనా సొల్యూషను చెప్తావని నేను అనుకున్నాను,” అంది సింధు.

“దీని గురించి తరువాత ఆలోచిద్దాం. ఈ రోజు నీవు టిఫిన్‌ తెచ్చుకోనట్టుంది. నా టిఫిన్‌లో షేరు చేసుకుందువు గాని పద.. పద,” అన్నాడు శేషు.

“నాకు తినాలనిపించటం లేదు.”

“నా కోసమేనా నీవు తినాలి ప్లీజ్‌! నా మాట కాదనకు” ప్రాధేయపడ్తున్నట్లు అన్నాడు శేషు. మరి బెట్టు చేయక అతని వెనుక వెళ్ళింది సింధు.

“సిందూ! నీ వర్కు కూడా నేనే చూసుకుంటాను. నీవు అలా స్టాఫ్‌ రూమ్‌లో రిలాక్సు అవు. నేను మేనేజరు గారికి చెప్తాను” అన్నాడు శేషు. అలాగే అని తలూపింది సింధు.

స్టాఫ్‌ రూమ్‌లో రిలాక్సు అవుతున్న సింధు ఆలోచిస్తోంది. ఇన్నాళ్ళ వరకూ నా గతం గురించి ఆలోచించలేదు. ఈ మధ్యనే శేషుకి తన గతాన్ని  చెప్పుదామనుకుంది. ఎందుకంటే అతను తనని ప్రేమించాడు. పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాడు. నిజమైన ప్రేమికుల మధ్య దాపరికాలు ఉండకూడదు. శేషు తన గురించి వినడానికి అనాసక్తి చూపించడం వల్ల చెప్పలేకపోయింది.

తన గతంలో ఏముంది కనుక అంత గొప్పగా చెప్పుకోడానికి అందరి జీవితాల్లా అందరి బాల్యాల్లా తన బాల్యం అంత గొప్పది కాదు. తనకి ఇంకా లీలగా గుర్తుకు వస్తోంది. తను ఓ అనాథ ఆశ్రమంలో పెరుగుతోంది. అక్కడ వున్న పిల్లలకి ఆశ్రమ పెద్దలే అమ్మానాన్నలు. అలా ఏదో గాలివాటం బ్రతుకు బ్రతుకుతున్న తన జీవితంలో ఓ మలుపు.

డాక్టరు ఇందిర గారు ఆశ్రమానికి వచ్చారు. “ఆవిడ నిన్ను పెంచుకుంటారుట. ఈ రోజు నుండి ఆవిడే మీ అమ్మ ఆవిడతో వాళ్ళ ఇంటికి వెళ్ళు సిందూ” ఆశ్రమ నిర్వాహకులు అంటున్నారు.

తనకి అంతా కొత్త కొత్తగా ఉంది. బెరుకు బెరుకుగా ఆవిడ దగ్గరకి తను వెళ్ళింది ఆవిడ రెండు చేతులూ చాచి తనని తన హృదయానికి హత్తుకుంది. ఆమె గుండెల్లో తల ఉంచి సేద తీర్చుకుంటూ ఉంటే అదోరకమైన హాయి.

ఇంటికి వెళ్ళిన తరువాత తను ఆవిడ్ని “అమ్మగారూ.. అమ్మగారూ!” అని పిలిచేది. ఆ పిలుపు విన్న ఇందిర గారు “అలా పిలవొద్దు. అమ్మా! అని పిలువు” అన్నారు. ఆ రోజు నుండి తను ఆవిడ్ని అలాగే పిలిచేది. ఆవిడ కూడా తనని కన్న కూతురు కన్నా ఎక్కువుగా చూసుకునేది. అప్పటి నుండి ఇప్పటి వరకూ తన జీవితం ఇలాగే సాగింది.

“సింధూ! ఆర్‌ యూ ఓకే!” అన్నాడు శేషు. “ఊు !!!” అంది తలూపుతూ. ఇద్దరూ ఇళ్ళకి బయలుదేరారు.

ఇంట్లో పరిస్థితి మామూలే. ఇందిరా దేవి ముభావంగా ఉంటోంది. సింధు ఎంత కల్పించుకుని మాట్లాడుదామన్నా ఆవిడ అవకాశం ఇయ్యడం లేదు. ఆవిడ పని ఆవిడ చేసుకుపోతూ ఉంటే, సింధు తన పనులు తను చేసుకుపోతోంది. ఇది భరించలేకపోతోంది సింధు. ఆమె మనసు నీటితో తడిసిన బట్టలా బాధతో బరువెక్కుతోంది.

ఓ రోజు తెల్లవారు జామున ఇందిరా దేవి కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు పట్టుకుని సింధు వెక్కి వెక్కి ఏడుస్తోంది. తృళ్ళిపడి లేచింది ఇందిరా దేవి. “నా వల్ల తప్పుంటే తిట్టమ్మ, కొట్టమ్మ, అంతేకాని నీవిలా మౌనంగా, ముభావంగా ఉంటే నేను భరించలేనమ్మా!” అంటూ ఆవిడ కాళ్ళను తన కన్నీటితో తడిపెస్తోంది సింధు.

ఇన్నాళ్ళు తను కన్నకూతురిలా చూసుకున్న సింధు ఇలా ఏడవడం ఇందిరా దేవి సహించలేకపోయింది. ఎంత పాషాణ హృదయమేనా సింధు బాధ ఏడుపు చూసి చలించక తప్పదు.

వెంటనే ఇందిరా దేవి లేచి కూర్చుని సింధు తలని తన హృదయానికి ఆప్యాయతగా హత్తుకుంది. ఆమె హృదయంలో తల ఉంచి వెక్కి వెక్కి ఏడ్చింది సింధు. కొంతసేపయ్యాక బాధంతా కన్నీటి రూపంలో ప్రవహించి సింధు హృదయం తేలిక పడింది.

“జీవితంలో మొదటిసారిగా నీ దగ్గర అబద్దం చెప్పానమ్మా! ఆ రోజు శేషుతో కలిసి పార్కుకి వెళ్ళేను. అతను మా బ్యాంకులో పనిచేస్తున్నాడు. నన్ను ఇష్టపడుతున్నాడు,” గడగడ పాఠం వల్లిస్తున్నట్టు అంది సింధు.

“నాకు తెలుసు. తెలుసుకున్నాను. ఊహించాను.”

“నేను అబద్దం చెప్తున్నా నిలదీయకపోవడం నీ ఔదార్యం, నీ గొప్పతనం అమ్మా! మరొకరయితే వెంటనే నిలదీసేవారు.”

“నిలదిస్తే నీవు మరికొన్ని అబద్దాలు చెప్పే దానివి. ఇలా అబద్దాల మీద అబద్దాలు చెప్పుకుపోతే పాడయ్యేది నీ జీవితమే. నీ తప్పు నీ అంతట నీవు తెలుసుకోవాలనే నేను ఇన్నాళ్ళూ అలా ఉన్నాను. మనిషి అన్నవాడు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పులు చేస్తాడు. ఆ తప్పులు సరిదిద్దుకుని తన జీవన మార్గంలో పయనిస్తే పరవాలేదు. ఆ తప్పుల్నే తన జీవన బాటగా మలుచుకుంటే జీవితం అస్తవ్యస్తంగా తయారవుతుంది. సుమిత్ర కూడా అలాగే తన జీవితాన్ని తప్పులు చేసి అర్ధాంతరంగా ముగించింది,” ఇందిరా దేవి అంది.

అమ్మ మాటి మాటికి ఆ సుమిత్రా దేవి ప్రస్తావన తెస్తుంది. ఇంతకీ ఆ సుమిత్రా దేవి ఎవరు? ఆవిడ జీవితంలో ఏం జరిగి ఉంటుంది? ఇలా ఆలోచిస్తోంది సింధు.

కాని సింధు అడక్కుండానే ఇందిరా దేవి జీవితంలో జరిగిన సంఘటన గురించి వివరించడం మొదలు పెట్టింది.

(ఇంకా ఉంది)

Exit mobile version