[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]
[ఉదయం తొమ్మిది గంటలు కావడంతో పాఠశాల వాతావరణం సందడిగా ఉంటుంది. వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. రామ్మూర్తి మాస్టారు ఇన్విజిలేటర్‍గా తనకు కేటాయించిన గదిలోకి వెళ్తారు. సిన్సియారిటీకి మారుపేరైన ఆయనను చూడగానే చాలా మంది విద్యార్థులు తమని కాపీ చేయనివ్వడని తిట్టుకుంటారు. ఆయన మౌనంగా అందరికీ ప్రశ్నాపత్రాలు, ఆన్సర్ షీట్లు ఇచ్చి, గదిలో తిరుగుతూంటారు. పావుగంట గడిచాకా, గోపాలం రొప్పుతూ పరిగెత్తుకొస్తాడు. మాస్టారుగారికి నమస్కారం చేస్తూ గుమ్మం దగ్గరే నిలబడిపోతాడు. ఎందుకింత ఆలస్యమైందని అడిగితే, మా అత్త కూరలకని బజారుకి పంపిందని చెప్తాడు గోపాలం. అతని ఇంటి పరిస్థితి తెలిసిన రామ్మూర్తి, లోపలికి పిలిచి పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. గోపాలం గురించి తాను విన్న సంగతులను గుర్తు చేసుకుంటుంటే, ఆయనకి తన బాల్యం గుర్తొస్తుంది. పరీక్ష అయిపోయాకా, పేపర్లు ఆఫీసుకో అప్పజెప్పి, స్టాఫ్ రూమ్ లోకి అడుగుపెడుతుంటే, తన గురించి తోటి టీచర్లు హేళనగా మాట్లాడుకోడం విని బాధపడతారు. ఇంటికి వెళ్ళినా గోపాలం ఆలోచనలు ఆయనని వదలవు. తాను కూడా అదే విధంగా, తండ్రిని కోల్పోయి, అత్తామామల పంచన ఉండి, అనేక కష్టాలు అనుభవించిన వైనం జ్ఞప్తికి వస్తుంది. చిన్నప్పుడు తన అత్త అనసూయ కూడా పరీక్షల రోజులలో తనకి రకరకాల పనులు చెప్పి, పరీక్షకి ఆలస్యంగా వెళ్ళేట్టు చేసేది. అమ్మ శాంతమ్మ – అత్తకి మామయ్యకి ఎదురుచెప్పకూడని ఖచ్చితంగా చెప్పింది. ఓసారి పరీక్ష రోజున, సరిగ్గా పరీక్ష సమయానికి కాస్త ముందుగా, పొలంలో ఉన్న మామయ్యకి భోజనం కేరేజ్ ఇచ్చి పంపమని పంపిస్తుంది అత్త. పొలానికి వెళ్తూ, తమ సమస్యల గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా నడుస్తున్న రాము, రాయి తగిలి కిందపడతాడు. అన్నం నేలపాలవుతుంది. అది చూసిన మావయ్య భుజంగరావు – రాముని గొడ్డుని బాదినట్టు బాదుతాడు. ఆ రాత్రి రాముకి జ్వరం వస్తే, డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళమని శాంతమ్మ అడిగితే, తన వద్ద డబ్బులు లేవంటాడు భుజంగరావు. అప్పటివరకు భద్రంగా దాచుకున్న తన మంగళసూత్రాలని అమ్మేసి ఆ డబ్బుతో కొడుక్కి వైద్యం చేయించమని అన్నయ్య భుజంగానికి ఇస్తుంది శాంతమ్మ. – ఇక చదవండి.]
అధ్యాయం 3
“ఒరే రామిగా! కూరగాయల షాపుకి వెళ్ళి కూరలు తెచ్చిపో!’’ అనసూయ పురమాయించింది. రామానికి ఈ రోజు లెక్కలు పరీక్ష. తొందర స్కూలుకి వెళ్ళాలి. ఇదే విషయం చెప్పాడు రామం. “ఆఁ ఇంతోటి బోడి పరీక్ష. కూరగాయలు తెచ్చి వెళ్ళు” అంది. ఆమెలో అహం తొంగి చూస్తోంది.
అహంకారం ఓ ముళ్ళ పొద. అది ఉంటే ప్రాణ మిత్రుల్ని కూడా శత్రువులుగా మార్చేస్తుంది. తన వాళ్ళ దగ్గర కూడా అహంకారం చూపిస్తారు అహంబావులు. మంచి పనులను చెడగొట్టేది అహంకారమే. మంచివాళ్ళను అది కలిసి పని చేయనీయదు. అహంకారం ఉన్న చోట దుఃఖం నీడలా వెంటాడుతుంది. అహంకారం లేకపోతే శాంతి, సామరస్యం, సహకారం, ప్రేమ, సంతోషం తాండవిస్తాయి.
అందుకే మనిషిలో అహంకారం ఉండకూడదు. పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా మనకి తోచినట్లు మాట్లాడకూడదు. ఇతరులు చెప్పే విషయాలు అపార్థం చేసుకోకుండా దానిలో నిజం గ్రహించాలి. ఇతరులతో మర్యాదగా మసలటం మరిచిపోకూడదు. పట్టుదలతో శత్రుత్వాన్ని పెంచే పరుష పదజాలం వాడకూడదు.
మంచి గుణాలే లేవు అనసూయలో. అందుకే ఆమెతో వాదనకి దిగడం మంచిది కాదు. మొదట పని చూడాలి అని అనుకున్న రామం సంచి పట్టుకుని కూరగాయల షాపుకి వెళ్ళాడు.
షాపు నుండి వచ్చి స్కూలుకి వెళ్ళేప్పటికి పరీక్ష ఆరంభించి పదిహేను నిమిషాలు అయిపోయింది. గబగబా తన రూమ్ దగ్గరికి వెళ్ళి వణకే కాళ్ళతో ద్వారం దగ్గర నిలబడ్డాడు. “ఏరా రామం పరీక్ష వ్రాయడానికి ఇప్పుడా రావడం?” అవధాని మాష్టరుగారు అడిగారు.
“అత్తమ్మ కూరగాయలు తెమ్మనమంది. అవి తెచ్చేప్పటికి ఆలస్యం అయింది’’ నీళ్ళు నముల్తూ అన్నాడు రామం. అవధాని మాష్టరుగారికి అతని కుటుంబ పరిస్థితులు అన్నీ తెలుసు కాబట్టే వెంటనే రామం పరీక్ష వ్రాయడానికి అనుమతించారు.
అవధాని మాష్టారు రామం వాళ్ళు ఉంటున్న దగ్గరే ఉంటున్నారు. అతనికి అనసూయ మనస్తత్వం గురించి తెలుసు. ఆమె మనస్తత్వం చాలా విచిత్రమైనది. ఎప్పుడూ తన మాటే నెగ్గించుకోవాలని చూస్తుంది. తనది పై చేయిగా ఉండాలనుకుంటుంది. ఎదుటివాళ్ళ మీద పెత్తనం చెలాయించాలి. అధికారం చూసాలన్నదే ఆమె వ్యామోహం. ఇది మంచి లక్షణం కాదు. జంతు లక్షణం అని అనుకుంటారు అవధాని మాష్టారు అనసూయ గురించి.
ఆవిడకి అంత అహంకారం పనికి రాదు. ఈ అహం అన్ని సందర్భాల్లో అందరి దగ్గరా, అన్ని వేళలా మనల్ని వదలదు. ఈ అహం దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది. ఒక్కొక్క సందర్భంలో బాధ్యతల భారాన్ని పెంచుతుంది. కొన్ని సందర్భాల్లో నిస్సహాయతను కూడా కలిగిస్తుంది. తప్పుడు మాటలు పలికిస్తుంది. తొందరబాటు నిర్ణయాలు తీసుకునేటట్లు చేస్తుంది. సమస్యల్ని ఇంకా కష్టతరంగా చేస్తుంది. అందుకే అహం మంచిది కాదు తిరిగి అనుకున్నారు అవధాని మాష్టారు.
కాలం నిరంతరం జరిగిపోతూనే ఉంటుంది. అది ఆగదు. దానికి నిలకడలేదు. కదిలిపోయే కాలం వెనక్కి మళ్ళదు. అతి విలువైన కాలాన్ని వృథా చేసుకోకుండా జీవితాన్ని ఆస్వాదించాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కొందరనుకుంటే కాలం మారుతున్నా బ్రతుకుల్లో మార్పులే లేవు అని అనుకున్న వారు మరికొందరు.
కాలం పరుగులు పెడ్తున్నా శాంతమ్మ జీవితంలో ఏ మార్పూ లేదు. ఆమె పాచి పని చేయడంలో నిమగ్నురాలయింది. పశువుల దగ్గర వున్న పేడను తీసి ప్రోగు చేసింది. పశువులకి మేత వేసింది. పేడతో పిడకలు పెట్టింది. ఒకానొక సమయంలో ఈ పనులు అన్నీ ఇంట్లో పనివాళ్ళు చేసేవారు. ఇప్పుడు ఆ పనులన్నీ తను చేయవల్సి వస్తోంది. దీన్నే అంటారు పువ్వులమ్మే చోట కట్టెలు అమ్ముకోవడం అని.
ప్రస్తుతం తనున్న ఈ పరిస్థితుల్లో సహనం వహించడం ముఖ్యం. సహనం వహించడం అంటే భయపడ్డం కాదు. విరక్తి చెందడం కాదు. చేతకానితనం అంతకన్నా కాదు. ఎంత కష్ట పరిస్థితినైనా భరించగలిగే స్థితి సహనం. మనకి ఏది ఇబ్బంది కలిగిస్తుందో దాని పట్ల సానుకూలంగా ఆలోచించడమే సహనం. ఇది నిగ్రహ శక్తి. మానసిక పరిపక్వత గల స్థితి. ఎదుటి వారిలో గల ఏ గుణం మనకు కోపం తెప్పించి సహనాన్ని పోగొడుతుందో దానిని మనలోకి ఆవహింప చేసుకోవడమే సహనం. ఇలా సాగుతున్నాయి శాంతమ్మ ఆలోచన్లు.
ఆ ఉదయ కాలంలో రామం పుస్తకం పట్టుకుని కూర్చుని చదువుకుంటున్నాడు. అనసూయ భుజంగరావు నిద్ర లేవలేదు. మెలుకువ వచ్చినా నిద్ర నటిస్తున్నారు. కూతురు సుమతి కూడా తల్లికి తగ్గ కూతురే. అన్నీ పైపై ఆలోచనలే. అందరికన్నా ఉన్నతంగా ఉండాలన్న ఆలోచనే సుమతివి. అటువంటి భావాలికి తావియ్యని వాడు అనసూయమ్మ కొడుకు రంగడు.
రంగ ఇంటి లోపల నుండి బయటకు వచ్చాడు. రామం బుద్ధిమంతుడిలా కూర్చుని చదువుకోవడం అతనికి నచ్చలేదు.
“ఒరే బావా! ఏంటిరా ఇది? నీలాంటి పుస్తకాల పురుగుని మార్చడం ఎవరి తరం కాదు. ఎప్పుడూ చదువుతూ కూర్చోడమేనా జీవితమంటే? ఇలా చదువుతూ కూర్చుంటే మనస్సు మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇది మనిషిని క్రుంగుబాటుకి గురి చేస్తుంది. ఆరోగ్యం దెబ్బ తింటుంది. అందుకే రిలాక్సుగా ఉండటం మంచిది’’, అన్నాడు.
రంగ మాటలకి రామం చిన్నగా నవ్వాడు. కాని ఆ నవ్వులో జీవం లేదు. “రంగా నీ జీవిత మార్గమే వేరు. నా జీవిత విధానం వేరు. నాకు కొన్ని బాధ్యతలున్నాయి. మా అమ్మ పడ్తున్న కష్టాలు చూస్తున్నావు కదా! ఆ కష్టాలు తొలగిపోయి అమ్మ కళ్ళల్లో ఆనందం నేను చూడాలి. ఆమెకి సాంత్వన కలిగించాలి. అలా చేయాలంటే మంచి భవిష్యత్తు ఉండాలంటే విద్య అవసరం అన్నాడు రామం.
తన ఇంట్లో రామం పరిస్థితి ఎలా ఉందో రంగకి కూడా తెలుసు. వాళ్ళు పడ్తున్న కష్టాలు కన్నీళ్ళు తెలుసు. ఇది చాలా అన్యాయం. అమానుషం అని అనుకుంటాడు ఒక్కొక్క సమయంలో. తన అత్తమ్మని, బావని తన వాళ్ళు బానిసలకన్నా హీనంగా చూడ్డం నచ్చదు. తన వాళ్ళ మీద చాలా కోపం వస్తుంది. ఒక్కొక్క సమయంలో అయితే తను ఏు చేయలేడు. ఎందుకంటే తను కూడా ఆ ఇంట్లో అస్వతంత్రుడు. అయితే తన అత్తమ్మ, బావ మెతక వైఖరి కూడా నచ్చటం లేదు రంగకి.
సుమతి మనస్సులో కూడా తన తల్లిదండ్రులు విషభీజాలు నాటారు. చెల్లెలికి కూడా వీళ్ళంటే చులకనే. తనకి ఇలాంటివి నచ్చవు కాబట్టే తనంటే తల్లిదుడ్రులకు కిట్టదు. తన చెల్లెలికి ఆ పేరుకి బదులుగా కుమతి అని పేరు పెట్టినా బాగుండును. ఆ పేరుకు తగ్గది కాదు దాని స్వభావం.
వీళ్ళు గంగి గోవులాంటి మనుష్యులు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవడం, నిందల్ని భరించడం వీళ్ళ బలహీనత. ఇలాంటి వాళ్ళను మార్చలేము. తన కుటుంబ సభ్యుల్ని మార్చలేము అని అనుకుంటున్నాడు రంగ.
“ఏుటిరా రంగా! నీ బావకి హితబోధ చేస్తున్నావు?” తండ్రి మాటలకి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు రంగ. అయినా ఏం చలించలేదు.
“ఎంత హితబోధ చేసినా ఫలితం ఉంటే కదా చెప్పడానికి’’, కొడుకు గొంతులో వెటకారం.
“నా దగ్గరా నీ వెటకారం మాటలు? నీవు చెడిపోవడమే కాకుండా వాడ్ని కూడా చెడగొడుతున్నావు. చంపేస్తాను జాగ్రత్త. తిక్కతిక్కగా ఉందా?’’ భుజంగరావు కొడుకు మీద విరుచుకు పడ్తున్నాడు. రంగ మరి మాట్లాడకుండా తండ్రిపై వచ్చిన కోపాన్ని తమాయించుకుంటూ బయటకు నడిచాడు.
“ఒరే రామిగా! వాడి పైత్యం మాటల్ని వొంటికి పట్టించుకున్నావంటే వాడిలా జులాయిలా తయారవుతావు. నీవు అలా తయారయితే ఊరుకునేది లేదు. ఇంటి నుండి గెంటెస్తాను జాగ్రత్త,’’ హుకుం జారీ చేసిన భుజంగరావు వేప పుల్ల నముల్తూ నూతి గట్టు వేపు దారి తీసాడు.
అదే సమయంలో శాంతమ్మ ఎండిన పిడకల్ని గంపలో పేరుస్తోంది. అంత వరకూ చదువాపి తల్లి చేస్తున్న పనిని గమనిస్తున్న రామం తిరిగి పుస్తకంలో తలదూర్చాడు. మామయ్యకి మాటలకి ఏు సమాధానం ఇయ్యలేదు.
“ఒరే రామిగా! సుమతికి కనకాంబరాలు కొయ్యాలి,’’ పూల మొక్కల్ని చూపిస్తూ అంది అనసూయ.
“నేను కోస్తాను వదిన. వాడ్ని చదువుకోని,’’ శాంతమ్మ అంది.
“అబ్బో! కొడుకు మీద ఎంత మమకారం? నీ కొడుకేమీ కందిపోడు,’’ కటువుగా అంది. “వాడు పువ్వులు కోస్తాడు. నీవు ఈ బట్టలకి సబ్బు పెట్టి ఉతుకు’’ అంటూ శాంతమ్మ ముందు బండెడు బట్టలు పడేసింది అనసూయ. రామం పుస్తకాలు మూసేసి పూలు కోయడానికి పూల చెట్ల దగ్గరికి వెళ్తూ ఉంటే శాంతమ్మ బట్టలకి సబ్బు పెట్టడానికి తయారయింది.
ఇంతలో సుమతి అటువేపు వచ్చింది. “ఒరే బావగా! ఆ పువ్వులు కొయ్యడం ఆపు చేసి నాకు హోమ్ వర్కు పూర్తి చెయ్యి!’’ సుమతి రామాన్ని ఆజ్ఞాపించింది. వస్తున్న కోపాన్ని తమాయించుకుంటూ సహనం ప్రదర్శించాడు రాము.
అధ్యాయం 4
ఆ రోజు నేచురల్ సైన్సు మాష్టారు పాఠం చెప్తున్నారు. మానవ జీవితంలో వచ్చిన వివిధ దశల గురించి వివరిస్తున్నారు. “మనిషి జీవితంలో బాల్య దశ దాటిన తరువాత యవ్వనావస్థకి చేరుకునే సమయంలో వచ్చే దశ కౌమార దశ. ఇది బాల్యానికి యవ్వన దశకి మధ్య వచ్చే దశ. ఈ దశే ఎంతో కీలకమయినది. ఈ దశలో ఆడ, మగ పిల్లల్లో కలిగే శారీరక మానసిక మార్పులు, హార్మోన్ల ప్రభావం వలన వారిలో కలిగే అలజడలు, ఉద్వేగ భావాల్ని ఇంట్లో వాళ్ళు పిల్లల్ని గమనించి వారికి గైడెన్సు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు తమ మానసిక ఆందోళనను, భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేరు. తమ భావాల్ని ఆందోళనని ఎదుటివారితో పంచుకోలేరు. అందుకే ఈ దశ వారికి తల్లిదుడ్రుల సహకారం ఉండాలి.
ఇప్పుడు మీరందరూ కౌమార దశలో ఉన్నారు. అందుకే మీరు ఈ దశ గురించి అవగాహన పెంచుకోవాలి. ఈ దశలో ముఖ్యంగా క్రుంగుబాటు ఉంటుంది. అంటే నిరాశ, నిస్పృహ కలుగుతాయి. వాటిని మీ దరిదాపులకి రానీయకూడదు. ఈ టినేజ్ వాళ్ళు తమని ఇతరులతో పోల్చుకుని కుమిలి పోవడం, తమని ఎవరూ ప్రేమగా, అభిమానంగా చూడలేదని బెంగ పడిపోవడం, తమ సమస్యలకి చావే పరిష్కారమని తొందరబాటు నిర్ణయాలు తీసుకోవడం, భ్రమ పడటం, కోపతాపాలు ప్రదర్శిస్తూ ఒంటికి గాయాలు చేసుకోవడం, ప్రతీ చిన్న విషయానికి అబద్ధాలు చెప్పడం, వ్యసనాల బారిన చిక్కుకోవడం, ఇవీ లక్షణాలు. ఇవి డిప్రెషన్ లక్షణాలు. కౌమారాన్ని ఇది కుదేలు చేస్తోంది.’’
సైన్సు మాష్టారు చెప్పుకుపోతున్నారు. కొంతమందికి మాష్టారు చెప్పింది అర్థమవుతోంది. మరి కొంతమందికి అర్థం కావడం లేదు. ఒక్కటి మాత్రం వాళ్ళకి అర్థం అయింది. ఈ దశలో నిరాశ నిస్పృహ చెందకూడదు. ఈ వయస్సులో శారీరకంగా మానసికంగా కొన్ని మార్పులు సంభవిస్తాయి అని అర్థం చేసుకున్నారు. మాష్టారు తిరిగి చెప్తున్నారు.
“పదహారు సంవత్సరాల వయస్సు ఉరికే జలపాతం లాంటిది. దూకుడెక్కువ. ఆలోచన్లు తక్కువ. మీరందరి పరిస్థితి అదే. మీకు భ్రమలెక్కువ. బాధ్యతలు తక్కువ. ప్రపంచం తన చుట్టూ తిరుగుతోందనుకుని మిడిసిపడ్తూ ఉంటారు. సంపాదన ఏం లేకపోయినా కోరికలు మాత్రం ఎక్కువే. ఆ వయస్సు అలాంటిది. ఇదంతా హార్మోన్ల ప్రభావం.
ఆ తరువాత దశే యవ్వన దశ. ఇరవై అయిదు వయస్సులో నిరాశావాదిగా మారుతాడు. ఆశావాదం కామాలా ఊరిస్తూ ఉంటుంది. ఈ వయస్సు నదీ ప్రవాహం. కొంత దూకుడు తగ్గుతుంది. కొంత ఆలోచన పెరుగుతుంది. కొన్ని భ్రమలు తొలగిపోతాయి. కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. ఎవరికీ మనల్ని గమనించకోలేనంత తీరిక ఉండదని అర్థం అయిపోతుంది. పదహారు సంవత్సరాల వయస్సు వికాస చౌరాస్తా అయితే ఇరవై అయిదు సంవత్సరాలు కెరియర్ కూడలి. పదహారు సంవత్సరాలు వయస్సులో విజయాలుండవు. అపజయాలుండవు. అయితే పాతిక సంవత్సరాల వయస్సులో కొందర్ని ఎంతో కొంత విజయం వరించి ఉంటుంది కొందర్ని.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బాల్య దశలో కూడా కొంత మంది క్రుంగుబాటుకి గురవుతారు. దీనికి కారణం పెద్దలు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడమే. ఆ ఒత్తిడ్తి చదువు గురించి. అది తట్టుకోలేకే కొంత మంది పిల్లలు కడుపు నోప్పో, తలనొప్పో అని మిష చూపి బడి మానేస్తారు. వీళ్ళలో డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది. పిల్లల విషయంలో తల్లిదండ్రుల ఆలోచనలు పెరుగుతాయి. చదువులో తమ పిల్లలు అందరికన్నా ముందుండాలన్న ఆలోచనతో రోజులో ఎక్కువ సమయం చదవమని వాళ్ళ మీద ఒత్తిడి పెంచుతారు. పిల్లల శక్తి సామార్థ్యాలను, అభిరుచుల్ని లెక్కలోకి తీసుకోవటం లేదు. తల్లిదండ్రుల అంచనాలను సఫలీకృతం చేయాలన్న ప్రయత్నంలో కల్లాకపటం తెలియని చిన్నారులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అది డిప్రెషన్‌గా మారుతోంది. అంతేకాదు తల్లిదుడ్రులు సామాన్య జ్ఞానం కల తమ పిల్లల్ని తెలివైన పిల్లల్తో సమానంగా మార్కులు తెచ్చుకోవాలని వత్తిడి తెస్తున్నారు. కొంతమంది పిల్లలు మంకు పట్టు పడ్తారు. వ్యసనాలకి బానిస అవుతారు. ఎక్కువ తిండిపోతులుగా మారుతారు. అతి నిద్రకి లోనవుతారు. ఇవన్నీ డిప్రెషన్ ప్రాథమిక లక్షణాలు.”
మాష్టారు చెప్పడం ఆపు చేశారు. అందరు విద్యార్ధులు ఆత్మవిమర్శ చేసుకోవడం ఆరంభించారు. మాష్టారు చెప్పింది నిజమే బాల్యావస్థలో తల్లిదండ్రులు బాగా తెలివైన విద్యార్ధిలా మార్కులు తెచ్చుకోవాలని, వారితో తమని సరిపోలుస్తూ ఒత్తిడి తెచ్చేవారు. కొంతమంది ఉన్నారు అనుకుంటున్నారు.
మాష్టారు తిరిగి ఆరంభించారు. “ఆ తరువాత దశ యవ్యనం దాటి, వృద్దాప్యంకి మధ్యనున్న నడి వయస్సు దశ. ఈ దశలోని వారు జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని, స్థిరంగా నిలచిన వారు వీరు. ఇవన్నీ వాళ్ళకి అలవాటు అయిపోయినవే అని శాంతంగా స్థిరంగా ఉంటారు. సమస్యలు వీళ్ళకి అలవాటు అయిపోవడం వల్ల చలించరు.
ఇక ఆఖరి దశ కూడా కొంత ప్రమాదకరమైనదే. కొంత జాగ్రత్త కూడా అవసరం. ఎవరో ఒకరి ఆసరా కూడా అవసరమే. ఈ అవస్థే వృద్ధావస్థ. ఈ వయోవృద్ధుల్ని చూసుకుంటే బతుకు పోరాటంలో అలసి సొలసిపోతున్నారు. ప్రేమ రాహిత్యం, భవిష్యత్తు పట్ల అనిశ్చితస్థితి, దీర్ఘకాలిక ఒంటరితనం, గృహ హింస, ఆర్థిక సమస్యలు, ఆర్థిక సంస్థల మోసాలు, ఇవన్నీ వీళ్ళని కుంటుబాటుకి కారణాలు అవుతున్నాయి. ఆడవాళ్ళలో డిప్రెషన్ ఎక్కువుగా ఉంటుంది. వీళ్ళకి ఏ బాధ వచ్చినా మౌనంగా భరిస్తారు. ఎంత పెద్ద కష్టం వచ్చినా తమ మనస్సులోనే కుమిలి పోతున్నారు. ఏకాకిగా ఉండటం వల్ల వీళ్ళకి డిప్రెషన్ ఎక్కువతుంది.
ఈ వృద్ధావస్థలో మనస్సు దుర్బలంగా ఉన్నప్పుడు అనేక వ్యతిరేక ఆలోచనలు చోటు చుసుకుంటాయి. అర్థంలేని భయాలు, అనవసరమైన ఊహాలు, ఆలోచనలు బుర్రలో చోటు చేసుకుంటాయి. వీటిని ఆత్మనిగ్రహం ద్వారా ఆ ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్ట వేయవచ్చు. క్రుంగుబాటు బాధితులకి తమ మనస్సులోని భావాల్ని ఆలోచనల్ని – బాధల్ని నైపుణాల్ని పంచుకోడానికి ఓ తోడంటూ దొరికితే బుర్రలో ఉన్న చెత్త ఆలోచన్లు తొలిగిపోతాయి.
అబ్బాయిలూ ఇదీ మానవ జన్మలోని దశలు. వాటి లక్షణాలు. ముఖ్యంగా మీరందరూ కిశోరా వస్థలోను ప్రారంభ యవ్వనావస్థలో ఉన్నారు. జాగ్రత్తగా ఈ లక్షణాల్ని గుర్తు పెట్టుకుని, బలహీనతలకి గురవకుండా బలాల్ని పెంచుకుంటూ జీవితం గడపడం నేర్చుకోండి’’ సైన్సు మాష్టారు అన్నారు. ఇంతలో బెల్ మోగడంతో విద్యార్ధులు పొలోమని బయటకు వచ్చారు.
సైన్సు మాష్టారు మానవ జీవితంలోని దశల గురించి ఎంత బాగా చెప్పారు? అతను చెప్పినట్లే తల్లిదుడ్రుల పిల్లల చదువు విషయంలో ఎదుటి వారితో సరిపోల్చుకోవడం మానెయ్యాలి. చదువులు ఒత్తిడి వల్ల క్రుంగుబాటు సహజం. అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లు బాగా అర్థం అయ్యేలా పాఠం చెప్పారు. ఇవి విద్యార్ధుల స్పందన సైన్సు మాష్టారి పాఠం గురించి.
అయితే రామానిది ఒకటే ఆలోచన. కౌమార దశలో ఉన్న తనకి ఎలాంటి పరిస్థితులు ఎదురయినా ఆత్మస్థైర్యంతో ఎదుర్కొడానికి తను సిద్ధం. అయితే తన తల్లికి మాత్రం వృద్ధావస్థలో ఎటువంటి సమస్యలూ ఉత్పన్నమవకూడదు. ‘నా కోసమే, నా బాగు కోసమే బ్రతుకుతున్న నా తల్లి క్షేమంగా సంతోషంగా ఉండాలి’ అనుకుంటూ ఇంటి దారి పట్టాడు.
(ఇంకా ఉంది)
విజయనగరం వాస్తవ్యులైన శ్రీ గూడూరు గోపాలకృష్ణమూర్తి హిందీ ఉపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. వారు రాసిన కథలు వివిధ వార్తపత్రికల్లో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు సంకలనంగా వెలువడ్డాయి.