Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మలుపులు తిరిగిన జీవితాలు-18

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]

[సులోచన తన గతాన్ని తలచుకుంటూ ఉంటుంది. ప్రేమ సమాజంలో పెరుగుతున్న ఆడపిల్లల ఎదుగుదలని గుర్తు చేసుకుంటుంది. వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉండేవో గుర్తుచేసుకుంటుంది. బయట సమాజంలో ఉన్న కౌమార వయస్సు పిల్లల్లా, ఆశ్రమంలోని పిల్లలు దురుసుగా ప్రవర్తించలేరనీ; యువతీ యువకులు నైతికతను తప్పి ప్రవర్తించరని భావిస్తుంది. ఎందుకంటే వారికి ఆశ్రమాల్లోని పెద్దలు నైతిక విషయాలు కట్టుబాట్లను నూరిపోస్తారు. సుందరంతో తన చిన్ననాటి పరిచయం, ఆ అభిమానం హద్దుల్లోనే ఉండి, పెద్దయ్యాకా, పెళ్ళి చేసుకోవాలనుకోవడం గుర్తొస్తాయి సులోచనకి. సుందరం వెళ్ళి ఆశ్రమం పెద్దల అనుమతి పొందడం, తన పెళ్ళి జరిగిపోవడం జ్ఞాపకమొస్తాయి సులోచనకి. ఇంతలో సుందరం వచ్చి, పలకరిస్తే వర్తమానంలోకి వస్తుంది. ఎక్కడిదాకా వచ్చావు గతంలో అని భర్త అడిగితే, మన పెళ్ళి వరకూ అని చెబుతుంది. – ఇక చదవండి.]

అధ్యాయం 35

మాజంలో కొంతమంది ఉంటారు. వాళ్ళు మూర్ఖంగా ఉంటారు. మొండిగా ఉంటారు. తాము చెప్పిందే సరియైనదని మొండిగా వాదిస్తారు. ఎదుటివాళ్ళు యథార్థం చెప్పినా అంగీకరించరు. ఇలా మొండిగా ఉండడం, వితండ వాదన చేయడం తమ బలం అనుకుంటారు కాని ఇది వాళ్ళ బలహీనత మాత్రమే. ఆ కోవకు చెందిన మనిషి సుమతి.

శేషు ఎం.బి.ఏ చేసిన తరువాత బ్యాంకు పరీక్షలు వ్రాసి బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు. శాంతి డిగ్రీ చివర సంవత్సరంలో ఉంది. అందుకే ఇప్పటి నుండి శాంతికి పెళ్ళి ప్రయత్నాలు చేయాలని సుమతి ఆలోచన.

“మా నాన్నగారు చనిపోయిన సంవత్సరం లోపున శాంతికి పెళ్ళి చేద్దామంటే ‘చిన్న పిల్ల, దానికి పెళ్ళేంటి’ అని అన్నారు. ఇప్పుడు అది డిగ్రీ పూర్తి చేయబోతోంది. ఇప్పటికే చాలా ఆలస్యమయింది. మా పిన్ని ఈ విషయం గురించే పదే పది సార్లు పెళ్ళి ప్రస్తావన తెస్తోంది. సుకుమార్‌తో శాంతి పెళ్ళి జరిపించుదాం!” రామ్మూర్తితో సుమతి ముక్తసరిగా అంది.

“శాంతికి ఇప్పటి నుండి పెళ్ళి చేయాలని నాకు లేదు. ఉన్నది మనకి ఆడపిల్ల ఒక్కర్తే. పెళ్ళయ్యాక ఎలాగూ చుట్టం చూపుగా వస్తుంది. పెళ్ళి కాకముందే మన దగ్గర ఉంటుంది. రెండు సంవత్సరాలు పోనీ!” రామ్మూర్తి అన్నాడు.

ఆ మాటలు సుమతికి రుచించలేదు. ముఖం చిట్లించింది. ఆమె మనస్సు కోపంతో భగ్గుమంటోంది. “అయితే నేను మా పిన్నికిచ్చిన మాట సంగతి?”

“నీవు బాగా పరిస్థితుల్ని ఆలోచించకుండా ఇచ్చిన మాట కోసం నా కూతుర్ని బలి పశువును చేయలేను.”

“లక్షణంగా పెళ్ళి చేద్దామంటున్నాను కాని దాని జీవితం నాశనం చేస్తానని నేను అనటం లేదు. ఈ జన్మలో మీరు అలాంటి సంబంధం తేగలరా? మంచి ఆస్తిపరుల ఇంటికి కోడలిగా వెళ్తే శాంతి సుఖపడ్తుందని నా ఆలోచన. ఎప్పుడు నా మాటకానిచ్చారు? శాంతి మీ ఒక్కరికే కూతురు కాదు నాకు కూడా కూతురే. దాని బాగోగులు మీకెంత ముఖ్యమో నాకూ అంతే ఈ విషయం మరిచిపోవద్దు.”

“శాంతి నా కూతురు కనకనే బాగా ఆలోచించి సరియైన నిర్ణయం తీసుకుంటున్నాను. ఆస్తిపాస్తులు ముఖ్యం కాదు, యోగ్యుడు బుద్ధిమంతుడు అయిన వాడికి ఆస్తిపాస్తులు, హోదా లేనివాడికైనా ఇచ్చి పెళ్ళి చేద్దామనుకుంటున్నాను.”

“అయితే మా పిన్ని కొడుకు సుకుమార్‌ అయోగ్యుడు, చెడ్డవాడా?” నిలదీస్తూ అడిగింది సుమతి రామ్మూర్తిని.

“నేనలా అనలేదు కాని సుకుమార్‌ని చూడగానే అతని మీద నాకు మంచి అభిప్రాయం కలగలేదు.”

“మీ చూపులో వక్రత ఉంది. ఒకళ్ళ మీద మనం ఏర్పరుచుకున్న భావాన్ని బట్టే చూపు ఉంటుంది. మీకు వాడి మీద మంచి అభిప్రాయం కలగకపోవచ్చు నాకు మాత్రం వాడి మీద పూర్తి నమ్మకం ఉంది.”

సుమతి ఇలా మొండిగా వాదిస్తూ ఉంటే రామ్మూర్తికి చెప్పనలవి కానంత కోపం వచ్చింది. అయినా తమాయించుకుని “సుమతీ నేను చెప్పింది అర్థం చేసుకోవేుటి? బాగా ఆలోచించకుండా, మంచి చెడ్డలు చూడకుండా చేసిన ఎన్నో పెళ్ళిళ్లు ఎన్నో అనర్థాలకి దారితీస్తున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. వింటున్నాం. ఇలాంటి పెళ్ళిళ్ళు చేయడమంటే ఆడపిల్లని అత్తవారింటికి పంపడం కాదు. నరకానికి పంపడమే. ఈ విషయం మరిచిపోకు,” సహనం కోల్పోయిన రామ్మూర్తి అసహనంగా అన్నాడు.

సుమతిలో కూడా సహనం పాలు తగ్గింది. “అయితే మా తమ్ముడికి శాంతినిచ్చి పెళ్ళి చేయనంటారు.”

“అవును.”

“నేను వాళ్ళకి మాట ఇచ్చాను. నా మాటకు విలువ లేదా?”

“మరే విషయంలోనైన మాట ఇచ్చినా అది వేరే విషయం. ఈ పెళ్ళి అనేది నా కూతురి భవిష్యత్తు సమస్య. నా కూతురు భవిష్యత్తు బాగుండాలని ఓ తండ్రిగా కోరుకుంటున్నాను. శాంతి జీవితాన్ని అశాంతిమయం చేయలేను.”

“నా కూతురు సుఖం నాకక్కరలేదా? మీ ఊహలన్నీ భ్రమ మాత్రమే. నేనూ నా కూతురు సుఖపడాలని అనుకోవటం లేదా? శాంతి సుఖంగా కాపురం చేసుకుంటూ ఉంటే చూసి ఆనందించాలన్న కోరిక నాకు మాత్రం లేదా?” సుమతి కంఠంలో దుఃఖం జీర.

“లేదని నేను అనటం లేదు. మీ పిన్నివాళ్ళ మంచి చెడు గురించి బాగా తెలియవు మనకి. నీవు కూడా నా ప్రమేయంతో సంబంధం లేకుండా వాళ్ళకి మాటిచ్చావు. నన్నొక పనికిమాలిన వాడ్ని చేసి శాంతి మీద సర్వాధికారాలూ నీకే ఉన్నట్టు మాటిచ్చావు. అది నాకు అవమానం కాదా?” నిలదీసినట్టు అడిగాడు రామ్మూర్తి. పశ్చత్తాపం పడడానికి బదులు విసురుగా భర్త వేపు ఓ పర్యాయం చూసింది.

“నా మాటకు మీరు విలువ ఇస్తారన్న నమ్మకంతో వాళ్ళకి మాట ఇచ్చాను. ఇప్పుడు తెలుస్తోంది. నా మాటకు ఏ మాత్రం విలువ లేదని. నా మాటను గడ్డిపోచలా, కరివేపాకులా తీసి పారేస్తారని నేను అనుకోలేదు,” రోషం, దుఃఖం కలబోతలో కరుకుగా అంది సుమతి.

“నీ మాటకు ఆ సమయంలో విలువ ఇయ్యబట్టే నన్ను కనుక్కోకుండా మీ పిన్నీ వాళ్ళకీ మాట ఇస్తూ ఉంటే ఊరుకుండి పోయాను.”

“మీ ఉద్దేశం నాకు తెలుసు. మీ స్నేహితుడు కొడుకు సుధాకర్‌కి ఇచ్చి పెళ్ళి చేద్దామనే కదా మీ ఉద్దేశం.”

“ఇప్పటి వరకూ నాకు ఆలోచనే రాలేదు. ఇప్పుడు నీ నోటితోనే అంటున్నావు కనుక చెప్తున్నాను. నా కూతుర్ని నా స్నేహితుడు కొడుకు సుధాకర్‌కిచ్చి పెళ్ళి చేస్తాను” దృఢంగా అతను అలా అంటున్నప్పుడు స్థిర భావాన్ని తెలియ చేస్తూ అతని దవడ ఎముక కదిలింది.

“ఆ కులం గోత్రం లేని వాళ్ళకి నా కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేయడానికి నేను అంగీకరించను.” స్థిరంగా పలికింది ఆమె కంఠం. ఆమె అంటున్న సమయంలోనే సుధాకర్‌ రామ్మూర్తి ఇంటికి రావడం ఆ మాటలు వినడం ఒకేసారి జరిగాయి. సుధాకర్‌ ఆ మాటలు విని మాన్పడిపోయాడు. చాలా బాధతో అతని మనస్సు భారమయింది. మరి లోపలికి వెళ్ళకుండా వెనక్కి తిరిగాడు.

ఒక్క శేషు తప్ప ఎవ్వరూ అతడ్ని చూడలేదు. సుధాకర్‌ని వెనక్కి పిలుద్దామనుకున్నాడు కాని. ఈ సమయంలో సుధాకర్‌ మానసిక స్థితిని ఊహించిన శేషు సుధాకర్‌ని పిలవడం విరమించుకున్నాడు.

తల్లి మీద శేషుకి విపరీతమైన కోపం వచ్చింది. “అమ్మా! నీవు ఎప్పుడు పరువు.. పరువు అంటావు కాని నీ కూతురు జీవితం నీకు బాగుండాలని అనిపించదా? ఆ సుకుమార్‌ని చూడగానే అతడి మీద నాకు మంచి అభిప్రాయం కలగలేదు. వాళ్ళ మంచి చెడ్డలు తెలియకుండా మాటివ్వడం నాకు నచ్చలేదు,” శేషు నిక్కచ్చిగా అన్నాడు.

కొడుకు మాటలు విన్న సుమతి ఒక్కసారి నిశ్చేష్టురాలయింది. ఇన్నాళ్ళూ తనని సమర్థిస్తూ తన ప్రవర్తనకి వత్తాసు పలికి తండ్రిని ద్వేషించిన కొడుకు ఇప్పుడు ఇలా మాట్లాడ్డం ఆమెకి నచ్చలేదు.

“సుకుమార్‌ మామయ్యలో నీవేం చెడ్డతనం చూశావు?” తీక్షణంగా అడిగింది సుమతి.

“మనుష్యుల మనోభావాలు, వారి ప్రవర్తన అన్ని ఇట్టే కనిపెట్టవచ్చు” శేషు అన్నాడు.

“ఏంటి కనిపెట్టావురా?” ఈసడింపుగా అంది సుమతి. కొడుకు తనకి సపోర్టుగా నిలవడం రామ్మూర్తికి ఆనందాన్ని కలిగించింది.

“నా కూతురికి సుకుమార్‌తో పెళ్ళి జరిపిస్తాను,” మొండిగా అంది సుమతి.

“అయితే నాది ఒక మాట.”

“ఏంటి?”

“మనిద్దరం వాళ్ళ ఊరు వెళ్దాం. అక్కడ పరిసరాలు, మనుష్యులు, వారి తీరుతెన్నులు, మనస్తత్వాలు చూద్దాం. సంతృప్తి కలిగిన పక్షంలో నీ మాట ప్రకారమే అవుతుంది. లేని పక్షంలో నాన్నగారి మాట ప్రకారం జరగాలి. ఇష్టమేనా?” తల్లిని అడిగాడు శేషు. మౌనంగా ఊరుకుంది సుమతి.

తుఫాను వచ్చి వెల్సినంత ప్రశాంతత ఏర్పడింది ఆ ఇంటిలో. తన పెళ్ళి గురించి తల్లిదండ్రుల మధ్య చెలరేగుతున్న యుద్ధ జ్వాల శాంతించినది అనిపించింది శాంతికి. ఆమెది ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. అంతకు మునుపు సుధాకర్‌ గురించి ఆమె ఆలోచించలేదు కాని, తండ్రికి తల్లికి మధ్య సుధాకర్‌ ప్రస్తావన రావడంతో సుధాకర్‌తో బాల్యంలో తను గడిపిన రోజులు గుర్తుకు వస్తున్నాయి.

తాత్కాలికంగా ప్రశాంతత ఏర్పడినా భవిష్యత్తులో సుమతి తొందరబాటు నిర్ణయంతో ఎటువంటి అనర్థాలు దాపరిస్తాయో అని అనుకుంటూ నిట్టూర్పు విడిచాడు రామ్మూర్తి.

అధ్యాయం 36

దుర్గమ్మ వాళ్ళకి వస్తున్నట్టు మొదటి తెలియ చేయకుండా శేషు తల్లిని తీసుకుని దుర్గమ్మ వాళ్ళూ ఉంటున్న గ్రామానికి బయలుదేరాడు. బస్సు దుమ్ము రేపుకుంటూ గ్రామ బస్టాండులో ఆగింది. తల్లీ కొడుకు గ్రామం వేపు బయలుదేరారు.

పొలాల మధ్య విశాలమైన భవనం. అది సుకుమార్‌ పామ్‌‌హౌస్‌. ఏ మాత్రం అవకాశమున్నా తన అందుబాటులో ఉన్న ఆడదాన్ని ఆ పామ్‌‌హౌస్‌కి తెప్పించుకుని అనుభవించి వదిలేసేవాడు. తనకి సేవ చేయడానిక తన పనులు చక్కబెట్టడానికి మగ నౌకర్లకి బదులు ఆడవాళ్ళనే నియమించుకోడం బట్టి అతడెంత రసికుడో ఇట్టే అర్థమవుతోంది. మద్యం, ఆడదాని పొందు ఇదే అతని దినచర్యలో ఓ భాగం.

తన కోరిక తిరస్కరించిదన్న కోపంతో తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఆ గ్రామ స్కూలు పంతులమ్మను మానభంగం చేసి బయటపడ్డ ఘనుడు సుకుమార్‌. ఎంతైనా ఆ గ్రామ సర్పంచు ఇతని స్నేహితుడు. ఆ పంతులమ్మ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ధర్మం ఓడిపోయింది. ధర్మాన్ని అధర్మం మీద పడి అణచి వేసింది. ఆ అధర్మం క్రింద ధర్మం నలిగిపోయి తన అస్తిత్వాన్ని కోల్పోయింది.

ఇలాంటి సంఘటనలు కొన్ని గ్రామాల్లో మామూలు విషయమే. కొత్తవాళ్ళకి ఇలాంటి సంఘటనలు గగుర్పాటు కలిగిస్తే పాతవారికి రోజూ చూస్తున్న వ్యవహారమే అన్న నిర్లిప్త భావం కలుగుతుంది.

“ఎవరింటికి బాబూ మీరు ఎల్తున్నది.”

“దుర్గమ్మ గారింటికి,” శేషు సమాధానమిచ్చాడు.

“ఆల్ల ఇల్లు ఈ నైను చివర్లో ఉంది. అల్లది సూస్తున్నారు కదా అది సుకుమార్‌ గారి పామ్‌‌హౌస్‌,” ఆ గ్రామస్థుడు అన్నాడు.

“అమ్మా! ఓసారి చూసి ఇంటికి వెళ్దాం,” అన్నాడు శేషు. ఆ గ్రామస్థుడు కంగారుపడ్డాడు, “ఇప్పుడు ఎల్లద్దు బాబూ!” అన్నాడు.

“ఏమి?”

“ఆ బాబు ఎటువంటి పరిచితిలో ఉన్నాడో?”

“అంటే?”

“నాను సెప్పలేను బాబు!” అన్నాడు. గ్రామస్థుడు అలాగనేసరికి శేషులో కుతూహలం పట్టుదల పెరిగాయి. మొదట పామ్‌‌హౌస్‌ వేపు తల్లిని తీసుకుని బయలుదేరాడు.

తలుపు తట్టాడు శేషు. “ఎవరు?” సుకుమార్‌ గొంతు విసుగ్గా వినిపించింది. జవాబియ్యకుండా తిరిగి తలుపు తట్టాడు శేషు. ఆ సమయంలో అతని బాహు బంధంలో నలుగుతున్న నాగరత్నమ్మని పక్కకి నెట్టి వేసాడు. నాగరత్నమ్మ మొగుడు చనిపోయి సంవత్సరం అవుతోంది. ఆమెకి లైను వేశాడు సుకుమార్‌.

గబగబా నాగరత్నమ్మని పెరటి వేపు నుండి పంపించి వేసాడు. బట్టలు సర్దుకుని తలుపు తీసాడు. ఎదురుగా సుమతి శేషు. సుకుమార్‌కి ముచ్చమటలు పట్టాయి.

“ఏంటి ఇంటికి వెళ్ళకుండా ఇలా వచ్చారు?”

“ఇంటికి వెళ్తూ పామ్‌‌హౌస్‌ ఓ పర్యాయం చూద్దామని,” శేషు అన్నాడు.

“తరువాత చూడవచ్చు,” సుకుమార్‌ అన్నాడు,

“ఇప్పుడు చూడ్డానికి నీకేమైనా అభ్యంతరమా?” శేషు ప్రశ్నించాడు.

“నో, నో. రండి చూద్దురు గాని” అంటూ లోనికి తీసుకెళ్ళాడు. తన పడక గది మాత్రం దగ్గర ఆపేశాడు. మొట్ట మొదట శేషు తల్లిని తీసుకుని ఆ పడక గదిలోకే అడుగు పెట్టాడు. మద్యం బాటిళ్ళు, చెదిరిపోయిన పక్క మీద వాడిపోయిన పువ్వులూ, సిగరెట్టు పీకలు సెంటు వాసనలు.

సుకుమార్‌ ముఖం పాలిపోయింది. సుమతీ, శేషు ఏు మాట్లాడలేదు. ఆ గదిలో నుండి బయటపడి మిగతా పరిసరాలు పరికిస్తున్నారు.

కొంతమంది రంగుటద్దాల మాటున వాస్తవిక పరిస్థితుల్ని చూడలేరు. భ్రమలో జీవిస్తారు. తమ భ్రమ పటాపంచలయినప్పుడు వారు భావోద్వేగానికి లోనవుతారు. సుమతి పరిస్థితి ఇప్పుడు అంతే.

ఆమెలో అంతకుమునుపున్న భ్రమలు కొద్దికొద్దిగా సడలిపోతున్నాయి. వాస్తవిక పరిస్థితులు చూడ్డానికి ఆమెకి అవకాశం కలిగింది. ఆమెలో ఆత్మ సంఘర్షణ ఆరంభమయింది. తను తన భర్త యడల ప్రవర్తించిన తీరు బాధ కలిగిస్తోంది.

కొన్ని సందర్భాల్లో మన ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. కొంత కాలం గడిచాక విషయం తలుచుకుని ఆశ్చర్చపోతాం. బాధపడ్తాం. స్పృహలో ఉండే అలా ప్రవర్తించామా అని అనుకుంటాం. ఏ పనైనా స్పృహతో చైతన్యంతో చేస్తే అక్కడ పశ్చాత్తాపానికి అవకాశం ఉండదు. అలా కాకపోతేనే పశ్చాత్తాపం. మనిషి మెలుకువుగా ప్రవర్తిస్తే ఆగ్రహం, కోపం అసూయ మోహం, ద్వేషం ఉండవు. ప్రేమ ఉంటుంది. సత్యం వికసిస్తుంది. మనిషి మనసుకి కళ్ళుంటాయి. ఉద్వేగాలకి తావు ఉండదు. మనం చైతన్యంలో ఉండకపోతే కళ్ళు మూసుకుపోతాయి.

జీవితంలో అనేక సందర్భాల్లో అనుకున్నవి, అనుకోనివి జరుగుతూ ఉంటాయి. జీవితంలో ఎత్తుపల్లాలు అనేకం. జీవితంలో అనేక మంది తారసపడ్తారు. కొంతమంది మన జీవితంపై ప్రభావం చూపుతారు. కొంతమంది కొద్దిసేపు కనబడి ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంటారు. ఆ ప్రభావితం మంచిదయితే అంతగా చెప్పుకో అక్కర లేదు. అదే చెడ్డదయితే అందరికీ మంచి కలగ చేయనది అయితే దాన్ని గురించి బాగా ఆలోచించాలి.

వాస్తవిక పరిస్థితుల్ని ఒక్కొక్కటీ గమనిస్తున్న సుమతి పిన్ని దుర్గమ్మ గురించి ఆలోచిస్తోంది. తల్లి భావోద్వేగాల్ని గమనిస్తున్నాడు శేషు. తల్లి భ్రమలన్నీ తొలిగిపోతున్నాయి. వాస్తవిక తను గ్రహిస్తోంది అని అనుకున్న అతను తల్లితో “ఎవరూ మనకి నచ్చిన పద్ధతిలో ఉండరు. ఒక్కొక్కరి మానసిక ఉద్వేగాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. వాటిలో మనకి నచ్చిన అంశాలు తీసుకోవాలి. నచ్చని వాటిని తీసివేయాలి. నచ్చిన అంశాలు లేకపోతే పూర్తిగా వాళ్ళకి దూరంగా ఉండాలి,” శేషు అన్నాడు.

“ఇక్కడ నీకు నచ్చనివి ఉన్నా ఏం మాట్లాడకుండా ఉండటమే మంచిది. మన భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవాలి. అలా కాకుండా వాటిని బహిర్గతం చేసుకుంటే మాటా మాటా పెరిగి కలహాలకి దారి తీయటమే తప్ప మరేంలేదు. మౌనం అంత ఉత్తమమయినది మరి ఏం లేదు,” తల్లికి హితబోధ చేసాడు శేషు.

ఇంటికి వెళ్ళిన తరువాత దుర్గమ్మ చాలా హైరాన పడిపోయింది. కంగారు పడిపోయింది. “అమ్మాయ్‌! ఇలా వస్తున్నట్లు ముందుగా చెప్పొద్దు! అయినా ముందర ఇంటికి రాకుండా పామ్‌‌హౌస్‌కి వెళ్ళడం ఏంటి? తరువాత నేనే చూపించే దాన్ని కదా!” అంది.

“వస్తూ ఉంటే పామ్‌‍హౌస్‌ కనిపించింది. అందులో మామయ్య ఉంటాడని ఒకతను కనిపించి చెప్తే వెళ్ళాం,” అన్నాడు శేషు.

సుమతి మౌనం వహించింది. దీనికి సుకుమార్‌ వ్యవహారం అంతా తెలిసిపోయిందా? ఇదీ దుర్గమ్మ ఆరాటం. తల్లీ కొడుకుని ఎన్నో విధాలుగా మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు దుర్గమ్మ, సుకుమార్‌.

(ఇంకా ఉంది)

Exit mobile version