[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]
[సులోచన తన గతాన్ని తలచుకుంటూ ఉంటుంది. చిన్నప్పుడు తానే విధంగా ప్రేమ సమాజంలో వచ్చి చేరిందో గుర్తు చేసుకుంటుంది. ప్రేమ సమాజం పనిచేసే తీరును తలచుకుంటుంది. అక్కడి అనాథలు, వృద్ధులు, స్వచ్ఛంద సేవకులు, నిర్వాహకుల ఔన్నత్యం తదితర అంశాలను పునశ్చరణ చేసుకుంటుంది. వృద్ధులను ఎదిగిన పిల్లలు చూసుకోవడం వారికి మానసికంగా ఎంత భరోసా ఇస్తుందోనని అనుకుంటుంది. ప్రేమ సమాజం రోజూవారీ కార్యక్రమాలను గుర్తు చేసుకుంటుంది. చిన్నప్పుడు ప్రేమ సమాజంలో సుందరంతో స్నేహం ఎలా కల్సిందో జ్ఞాపకం చేసుకుంటుంది. ఒకరి గురించి ఒకరికి చెప్పుకుని సాంత్వన పొందిన వైనాన్ని గుర్తుచేసుకుంటుంది. – ఇక చదవండి.]
అధ్యాయం 33
కాలం నిరంతరం జరిగిపోతూ ఉంటుంది. అది ఆగదు. దానికి నిలకడ లేదు. కదిలిపోయే కాలం వెనక్కి రాదు. అతి విలువైన కాలాన్ని వృథా చేసుకోకుండా జీవితాన్ని ఆస్వాదించాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలానికి అలుపు సొలుపు అనేవి ఉండవు. అందుకే అది ఎప్పుడూ పరిగెత్తుతూనే ఉంటుంది. గడిచిన కాలం తిరిగి రాదు. అది గోడకు కొట్టిన సున్నం లాంటిది. కాలం ఎవరి కోసం తరగదు, పెరగదు. ఆగదు. దానితో మనమే పరిగెత్తాలి. ఉన్న సమయంలోనే అన్ని పనులూ సకాలంలో పూర్తి చేసుకోగలిగితే ఈ పరుగులో మనం అలసిపోకుండా ఉంటాం.
వేగంగా పరిగెత్తున్న ప్రపంచంలో మనిషి మనుగడ సాగించాలంటే కాలంతో పోటీ పడి పరుగు తీయవల్సిన సమయం ఇది. తన పనులు చక్కబెట్టుకునేందుకు మనిషి ఉరుకులు పరుగులు తీయవల్సి వస్తోంది. మనిషి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు.
‘గతాన్ని మనం మరిచిపోలేము. భవిష్యత్తు కూడా పూర్తిగా మన చేతిలో ఉండదు. మనం నియంత్రించగలిగేది కేవలం వర్తమానాన్నే. అలా అని భవిష్యత్తుని కూడా ఆలోచించాలి. దృష్టిని మాత్రం వర్తమానం వైపే కేంద్రీకరించాలి. వర్తమానంలో మధురిమను మనిషి పూర్తి స్థాయిలో ఆస్వాదించాలి. అలా జరగటం లేదు. గతానికి చెందిన జ్ఞాపకాలు అతడ్ని వెంటాడుతూనే ఉన్నాయి. గతించిన దాన్ని గురించి మనిషికి ఆందోళన ఉండదు. గతం వర్తమానానికి, భవిష్యత్తుకి మార్గదర్శికం కావాలి. గతం నుంచి మనిషి ఎంతో నేర్చుకోవల్సి ఉంది. చేసిన తప్పులు తిరిగి దొర్లకూడదు. పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి లభిస్తే వాటిని చేజార్చుకోకూడదు,’ అని అనుకుంటారు కొందరు మారుతున్న కాలం పరిస్థితులు చూస్తూ.
కాలంతో బాటే మనిషి జీవితంలో ఎన్నో మార్పులు. ముఖ్యంగా బాల్యావస్థని దాటి కిశోరావస్థకి చేరుకున్న వాళ్ళలో అనేక మార్పులు శారీరకంగా మానసికంగా హర్మోన్ల ప్రభావం వలన వారిలో కలిగే అలజడలు, ఉద్విగ్నతా భావాలు తల్లిదండ్రులకి చెప్పుకోలేక సతమతమవుతారు. పెద్దలు కూడా గమనించలేకపోతున్నారు. గురువుల ముందు బయట పడలేని భావావేశం. సరికొత్త స్థితి. ఇలాంటి పిల్లల్ని తల్లిదండ్రులు తగిన సలహాలు సూచనలు ఇవ్వాలి. ప్రేమ సమాజంలో అయితే అక్కడి పెద్దలే వాళ్ళ భావోద్వేగాల్ని గమనించి సూచనలివ్వాలి.
ఈ కౌమార వయస్సు పిల్లలు ముఖ్యంగా పెంకిగా దురుసుగా ఎవరి మాట లెక్క చేయని విధంగా ఉంటారు. వాళ్ళలో ఏదో అలజడి. విలువలకి తిలోదికాలు ఇవ్వడం అవిధేయత, పొగరు, ఆడపిల్లల్ని వేధించడం, తెగింపు. తనని పెద్దవాళ్ళు తగిన విలువ ఇవ్వటం లేదని బాధ. ఆడపిల్లల్లో కూడా మార్పులు శారీరకంగా, మానసికంగా వచ్చినా చప్పున బయటపడరు కాని. కొందరి ఆడపిల్లల్లో కోపం, పట్టుదల, మూర్ఖత్వం కనిపిస్తాయి.
వాళ్ళకి పెద్దవాళ్ళు మార్గదర్శకంగా నిలవాలి. ఈ టీనేజ్ వాళ్ళు తనకు నష్టం కలిగించే లేక తనకి ఇష్టంలేని పనులను మొహమాటంతో చెయ్యకుండా వద్దు లేక కాదు అంటూ స్పష్టంగా చెప్పాలి. ఆడపిల్లల్లో వచ్చిన మార్పుల్ని వాళ్ళు కంగారు పడకుండా పెద్దవాళ్ళు విశదీకరించాలి. లేకపోతే ఈ వయస్సులో కుంగుబాటుకి గురయ్యే అవకాశం ఉంది.
బాలబాలికలు ఏ బరువూ బాధ్యతలూ లేకుండా హాయిగా, స్వేచ్ఛగా తిరిగే వాళ్ళు ఒక్కసారి పెద్దలుగా మారే మధ్య స్థితి ఇదే. కౌమర దశ పిల్లలు శారీరకంగా, మానసికంగా భావోద్వేగపరంగా సామాజికంగా వేగంగా అభివృద్ధి చెందుతూ కొత్త సామర్థ్యాల్ని పెంపొందిచుకుంటూ కొత్త పరిస్థితుల్ని ఎదుర్కొనే దశ ఇది. ఈ మార్పులు క్రమేపి జరుగుతాయి.
టీనేజ్లో ఇలాంటి మార్పులు సహజమే అంతే కాదు అమ్మాయి అబ్బాయి వేపు, అబ్బాయి అమ్మాయి వేపు ఆకర్షితులవుతారు. ఇదే ప్రేమ అని అనుకుంటారు. అది ప్రేమ కాదు. ఆకర్షణ మాత్రమే పరిపక్వత లేని వయస్సులో పై పై ఆకర్షణకి లోనై ఒక నిర్ధిష్టమైన జీవితాన్ని అనుభవించలేక ప్రేమ అనే ఉచ్చులో బిగుసుకుపోయి అది విఫలమైనప్పుడు ఆత్మహత్యలకి పూనుకుంటున్న వాళ్ళను చూస్తున్నాం.
పరస్పర అవగాహన లేక సరియైన కట్టుబాట్లు లేక ప్రేమ విఫలమవుతోంది. అయితే ఇది ఆకర్షణ వల్ల పుట్టిన కోరిక కామం మాత్రమే. నిజమైన ప్రేమ మాత్రం కాదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా జీవితంలో ఆర్థికంగా స్థిరపడిన తరువాతే ప్రేమించిన అమ్మాయి తల్లిదుడ్రులకి చెప్పాలి. అప్పుడే మనిషి మంచి చెడ్డలు వారు పూర్తిగా తెలుసుకోగలరు.
నేటి యువత స్నేహంగా ఉంటే దాన్నే ప్రేమ అని భ్రమపడ్తున్నారు. సినీమాలు చూసి అందులో టీనేజ్ ప్రేమల్ని నిజ జీవితంలో అమలు చేయాలని భ్రమపడుతున్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆధునిక కుటుంబాల్లో ఈ బాయ్ ఫ్రండ్, గర్ల్ ఫ్రెండు కల్చరు ఆమోదిస్తే అమోదించ వచ్చుకాని. ఈ విదేశీ సంస్కృతి మాత్రం మన భారతీయ సంస్కృతి సంప్రదాయం కాదు. ఈ కల్చరు ప్రభావం సంప్రదాయ కుటుంబ పిల్లల మీద కూడా పడి ఆ కుటుంబాల తల్లిదండ్రులకి చెడ్డ పేరు వస్తోంది. దీని వల్ల పిల్లల వ్యక్తిత్వం, జీవితమే కాదు, తమ పరువు ప్రతిష్ఠలకి కూడా చెడ్డ పేరే వస్తోందని తల్లిదండ్రుల భావన. మగ ఆడ పిల్లల మధ్య స్నేహం ఉన్నా అది వక్ర మార్గం పట్టకూడదు అనేదే నేటి తల్లిదండ్రుల భావన.
అయితే అమ్మాయిల కొంతమంది ఆలోచన వేరేగా ఉంది. మనకి ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కోడానికి బాయ్ ఫ్రెండ్ ఉండాలి. వాతావరణానికి తగ్గట్టు టీనేజ్లో బాయ్ ఫ్రెండ్ అవసరమే, మరికొందరు బాయ్ ఫ్రెండ్ని ప్రేమించడం తప్పేంటి? అనుకునే వారు ఉన్నారు. నేటి తరం అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్ను ప్రేమించి పెళ్ళి చేసుకోవడం సర్వసాధారణమయిపోయింది.
మరీ ముందు చూపున్న అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ ఉండటం మంచిది కాదు. టీనేజ్లో ఏర్పడేది నిజమైన ప్రేమ కాదు అనేవారున్నారు. వారి వల్ల ఎన్నో సమస్యలు, చివరికి అత్యాచారాలకి, హత్యలకి కూడా దారి తీస్తోంది ఈ కల్చరు అనేవారూ ఉన్నారు. టీనేజ్ దాటిన వాళ్ళు యవ్వన దశకి చేరుతారు.
యువతీ యువకులకు ఎంతో స్వేచ్ఛ లభిస్తోంది. ప్రేమించుకున్నాం అని భ్రమపడుతున్న వాళ్ళు ఆకర్షణను ప్రేమ అనుకుంటున్నారు. స్నేహం, ప్రేమ, ఆకర్షణ కోరిక అనే వాటి మధ్య వారికి వ్యత్యాసం తెలియటం లేదు. ఈ ఆకర్షణ వారి భవిష్యత్తుని ఎలా అతలాకుతలం చేస్తుందో అన్న విషయాన్ని మరిచిపోతున్నారు.
కొంతమంది పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమ్మాయి ప్రేమ తిరస్కరిస్తే ఉన్మాదిగా మారి తమ ప్రేమ తిరస్కరించిన అమ్మాయిని చంపుతున్నారు. ప్రేమ విఫలమై జీవితంలో పెళ్ళి చేసుకోకుండా ఉన్నవాళ్ళూ ఉన్నారు.
యవ్వనంలో వచ్చే ప్రేమ అనుకునే ఆకర్షణ నిజమైనది కాదు. అది నీటి బుడగలాంటిది అని తెలుసుకోలేరు. పిల్లలకి యవ్వన దశ రాకముందే జీవితం పట్ల పెద్దలు సరియైన దశ నిర్దేశం చేయాలి. ఆకర్షణ భౌతిక రూపాన్ని చూసి వచ్చేదయితే ప్రేమ మనస్సుని చూసి ఉద్భవించేది. ప్రేమ బంధంలో కలతలు తలెత్తవు. ఆకర్షణ వలన చివరికి మనకి దక్కేది విషాదం మాత్రమే. ప్రేమ వలన ఆత్మికమైన ఆనందాన్ని పొందుతాం. ఈ ఆనందం అనంతమైనది. ఆకర్షణకి కోరిక పునాది అయితే ప్రేమ అనుబంధానికి పునాది వేస్తుంది.
సమాజంలో ఉన్న కౌమార వయస్సు పిల్లలు, యవ్వనంలో అడుగుపెట్టిన యువతీ యువకుల భావోద్వేగాలు, భావోద్రేకాలు గురించి వారి జీవన విధానం ఇలా ఉంటుంది.
ఇక ఆశ్రమాల్లో ఉంటే పిల్లలకి కూడా ఇలాంటి భావోద్వేగాలు ఉంటాయి. మార్పులుంటాయి. అయితే బయట సమాజంలో ఉన్న కౌమార వయస్సు పిల్లల్లా దురుసుగా ప్రవర్తించలేరు. యువతీ యువకులు నైతికతను తప్పి ప్రవర్తించలేరు. ఎందుకంటే వారికి ఆ ఆశ్రమాల్లో పెద్దలు నైతిక విషయాలు కట్టుబాట్లను గురించి వారికి నూరిపోస్తారు.
ప్రేమ సమాజంలో ఆడపిల్లలకి అమృతమ్మ, మగపిల్లలకి దయా సాగర్ కూడా యువకులకి నైతిక విషయాలు గురించి అనేక విషయాలు చెప్తారు. హై స్కూలు విద్య వరకే ప్రేమ సమాజంలో చదువుకుందుకు అవకాశం ఉంది. ఆ తరువాత చదువు కోసం బయట కాలేజీల్లో చదువుతారు. బయటకు చదువుకు వెళ్ళినప్పటికీ ప్రేమ సమాజంలో పెరిగిన వారు నైతికతకు తిలోదికాలు ఇవ్వరు.
వయస్సు ప్రభావం వల్ల ఆ తరువాత వచ్చిన మార్పుల వల్ల సుందరం, సులోచన అంతకు పూర్వం ఉన్నట్లు ఉండలేకపోతున్నారు. అంతకు పూర్వం మాట్లాడుకున్నట్లు మాట్లాడుకోలేకపోతున్నారు. అది వయస్సు ప్రభావమే కాదు అమృతమ్మ చెప్పే నీతి బోధనలు. అక్కడ ఆడపిల్లల జీవితాన్ని ఓ మలుపు తిరుగుతుంది.
సులోచన కనిపిస్తే సుందరం ప్రేమగా ఆరాధనా పూర్వకంగా చూసి నవ్వితే ఆమె కూడా చిరు నవ్వుతో సరి పుచ్చుతోంది. లేకపోతే సుందరం సులోచనా ముక్తసరి మాటల్తోనే సరిపెట్టుకుంటున్నారు.
అధ్యాయం 34
జీవితంలో మనం ఏు కావాలనుకుంటామో దాని మీద దృష్టిని కేంద్రీకరిస్తాం. అదే మన ప్రయాణాన్ని గమ్యాన్ని నిర్దేసిస్తుంది. మనం కావాలని అనుకున్న దాని మీద మన కాలాన్ని వెచ్చిస్తాము. జీవితంలో అత్యంత ముఖ్యమైనది కాలం. మనం దేనినైనా తిరిగి పొందగలం కాని కాలాన్ని తిరిగి పొందలేం. అందుకు మనం జీవితంలో మనం ఏు సాధించదల్చుకున్నామో దాని మీదనే మన కాలాన్ని వెచ్చించాలి. దీన్నే లక్ష్యం అని కూడా అనచ్చు. జీవితం మనం కేంద్రీకరించిన దాన్ని బట్టి ఉంటుంది. దాన్ని పొందడానికి నిరీక్షించాలి. సమయం వెచ్చించాలి.
సుందరానికి బాల్యావస్థలోనే సులోచన పరిచయం అయింది. ఇద్దరూ తమ కష్టాల్ని, జీవితంలో తాము ఎదుర్కున్న ఒడిదొడుకులు చెప్పుకుని సాంత్వన పొందారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ శారీరకంగా మానసికంగా వచ్చిన మార్పుల వల్ల ఇద్దరూ అంత చనువుగా ఉండలేక పోయారు. తాము పెరుగుతున్న వాతావరణం కట్టుబాట్లకి లోబడి కేవలం ముక్తసరిగా మాట్లాడుకోవడంతో సరిపెట్టారే కాని మనస్సులో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది. అనురాగం ఉంది. అది వాళ్ళ హృదయాంతరాలలో అలాగే గుప్తంగా ఉండిపోయింది.
టీనేజ్ వాళ్ళు సాధారణంగా అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరి ఎడల ఒకరు ఆకర్షింపబడుతారు. అదే ప్రేమ అనుకుంటారు. అది ప్రేమ కాదు ఆకర్షణ అని తెలుసుకోలేరు. ప్రేమ శాశ్వతమైతే ఆకర్షణ క్షణికం.
అయితే సుందరం సులోచనల మధ్య ఉన్నది మూగ ప్రేమ, ఆరాధన. అది వెల్లడి అవడానికి కొంత సమయం పడుతుంది.
మనిషి జీవితంలో టీనేజ్లో పదహారు ఏళ్ళ వయస్సు ఉరికే జలపాతం. దూకుడెక్కువ ఆలోచనలు తక్కువ. భ్రమలెక్కువ. బాధ్యతలు తక్కువ. కోరికలు ఎక్కువుగా ఉంటాయి.
వయస్సు పెరుగుతుంది. ఇరవై ఐదు సంవత్సరాల వయస్సులో ఇంత వరకూ నిరాశావాదంతో ఉన్న జీవితంలో కొత్త మలుపు. ఆశావాదం ఆ నిరాశావాదాన్ని కప్పెస్తుంది. అప్పటి వరకూ పరిగెత్తి పరిగెత్తి విజయాన్ని సాధించినవాడు అక్కడ కొద్ది సేపు ఊపిరి పీల్చుకుని వేగాన్ని పెంచుకుంటాడు. ఈ వయస్సులో అంతకుమునుపున్న దూకుడు ఉండదు. ఆలోచన మాత్రం పెరుగుతుంది. అంత వరకూ ఉన్న కొన్ని భ్రమలు తొలిగిపోతాయి. కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. ఈ వయస్సు కేరీర్కి కూడలి. కొంతమందిని ఈ వయస్సులో ఎంతో కొంత విజయం లభిస్తుంది. మరికొందరికి వైఫల్యాలు బాదిస్తూ ఉంటాయి.
సుందరం డిగ్రీ పూర్తి చేశాడు. టీచరు ట్రైనింగు కూడా పూర్తి చేయడం ఉపాధ్యాయుడిగా ఉద్యోగం కూడా వచ్చింది. సులోచన డిగ్రీ పూర్తి చేసింది. అప్పుడు సుందరానికి సులోచన మీద తనకున్న ప్రేమను సమాజ పెద్దల దగ్గర వెల్లడి చేసే అవకాశం కూడా లభించింది. అయితే సులోచన అభిప్రాయం కూడా ఓసారి తెలుసుకోవాలనుకున్నాడు.
ఆ రోజు సులోచన ప్రేమ సమాజంలో చదువుకుంటున్న చదువులో వెనకబడ్డ పిల్లలకి చదువు చెప్పి బయటకు వస్తోంది. అప్పుడే సుందరం అక్కడికి వచ్చాడు. అతనికి తన మనస్సులో మాట ఎలా తెలియ చేయాలో తెలియటం లేదు. అయినా ఓ స్థిర నిర్ణయానికి వచ్చాడు.
కొందరు ఏ నిర్ణయం తీసుకోడానికైనా వెనకాడుతారు. ఎందుకంటే ఆ నిర్ణయం ఫలితంగా ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో అన్న సందిగ్ధత. ఇందు కారణం చాలా మందిలో చాలా విషయల్లో తగిన నిర్ణయం తీసుకోవడం పెద్ద సమస్యగా తయారవుతోంది. తక్షణం తీసుకోవల్సిన నిర్ణయాల విషయంలో సావకాశంగా తీసుకోవల్సిన నిర్ణయాలోనూ అదే అనిశ్చితి ఉంటోంది.
అయితే సుందరం ఈ అనిశ్చిత పరిస్థితికి తిలోదకాలిచ్చి వెంటనే తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలనుకున్నాడు. అందుకే సుందరం సులోచనతో “సులోచనా మీతో మాట్లాడాలి,” అని అన్నాడు.
ఇద్దరూ ఎదురుపడినా ముక్త సరిగా పలకరింపులే కాని సులోచనా సుందరం మనస్సు విప్పి ఇంత వరకూ మాట్లాడుకోలేదు. వాళ్ళకి ఒకరి మీద మరొకరికి ఉన్న ప్రేమను మనస్సు అడుగు పొరల్లో అలాగే దాచుకున్నారు.
“ఏంటి చెప్పండి,” సులోచన అడిగింది.
లేని ధైర్యం తెగింపు ఒక్కసారి సుందరంలో వచ్చాయి. “సులోచనా మన బాల్యంలో మిమ్మల్ని చూసాను. అప్పుడే నాకు మీరు ఓ ఆత్మీయురాలుగా అగుపించారు. బాల్యావస్థ, కిశోరావస్థ, దాటిపోయి యవ్వనావస్థకి చేరుకున్నాం. కిశోరావస్థలో ఉన్న ఆకర్షణా భావం కాదు నాది. యవ్వనావస్థలో పరిపూర్ణమైన ప్రేమా, ఆరాధనా భావం మీ మీద నాకున్నది. దాంపత్య జీవితంలో మనిద్దరం సమాజ పెద్దలు అనుమతి తీసుకుని ఒకటవుదామని” గడగడ పాఠం అప్పగించినట్టు అన్నాడు సుందరం.
సుందరం కన్నా సులోచన చిన్నది వయస్సురీత్యా. అయితే అనుభవం, అవగాహనలో అతని కన్నా ఎన్నో రెట్లు ఎక్కువే ఆమె. ఆడదానికి మగవాడికి ఉన్న తేడా అదే. తక్కువ వయస్సులోనే ఆమెలో మెచ్యూరిటీ ఎక్కువుగా ఉంటుంది.
అందుకే సుందరం వేపు ఓ పర్యాయం చూసింది సులోచన. “సుందరం గారూ! నాకు కూడా మీ మీద అటువంటి భావం ఉంది. అయితే మీరు మగవాళ్ళు కాబట్టి బయటపడ్డారు. ఆడదాన్ని కాబట్టి బయట పెట్టలేకపోయాను. ఇదే ఆడదానికి మగవాడికి ఉన్న తేడా!”
“నేను అదృష్టవంతుడ్ని” అన్నాడు సుందరం.
“అయితే మనిషి జీవితంలో దాంపత్య బంధంతో ఒకటయ్యేది అపూర్వమైనది. అయితే ఆడ మగ దాంపత్య జీవితంలో ఒకటవాలంటే నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. అవి నా అభిప్రాయాలు కావు. మా అమ్మ అభిప్రాయాలూ అవే. వాటిని నేను మీ ముందు ఉంచదల్చుకున్నాను,” అంటూ సులోచన దాంతప్య జీవితం గురించి తన తల్లి అభిప్రాయాల్ని సుందరం ముందుంచింది.
“నేనూ ఆ అభిప్రాయాల్తో ఏకీభవిస్తున్నాను,” అన్నాడు సుందరం.
అమృతమ్మ, దయా సాగర్ ఇద్దరూ సుందరాన్ని, సులోచనని పిలిపించారు వాళ్ళిద్దరి పెళ్ళి ప్రస్తావన విన్న తరువాత.
“బాల్యం నుండి ఇప్పటి వరకూ మీ ఇద్దర్నీ అమృతమ్మా, నేనూ గమనిస్తున్నాం. ఎప్పుడూ మీరిద్దరూ హద్దులు దాటలేదు. ఒకరి మీద మరొకరికి ప్రేమ ఉందని తెలుసు మాకు. ఆరాధన ఉంది అని తెలుసు అది వయస్సు వల్ల వచ్చిన ఆకర్షణ అనుకున్నాం కాని అది ఆకర్షణ కాదు. పవిత్రమైన ప్రేమ అని ఈ రోజు మేము తెలుసుకున్నాం. మీ ఇద్దరికి మేము పెళ్ళి చేసి మా ఆశీస్సులు అంద చేస్తాం,” అన్నారు దయా సాగర్ గారు. అతని మాటల్ని సమర్థించింది అమృతమ్మ.
అలా సుందరం, సులోచనా దంపతులయ్యారు పెద్దల ఆశీస్సుల మధ్య.
“సులోచనా నీ ఫ్లాష్ బాక్ ఎంత వరకూ వచ్చింది” సుందరం అన్నాడు నవ్వుతూ.
“మన పెళ్ళి అయ్యే వరకూ,” అంది సులోచన కూడా నవ్వుతూ. ఆలోచనా ప్రపంచం నుండి బయటపడ్తూ.
(ఇంకా ఉంది)
విజయనగరం వాస్తవ్యులైన శ్రీ గూడూరు గోపాలకృష్ణమూర్తి హిందీ ఉపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. వారు రాసిన కథలు వివిధ వార్తపత్రికల్లో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు సంకలనంగా వెలువడ్డాయి.