[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]
[సులోచన క్లాసులో పాఠం చెబుతూంటుంది. ఒక అమ్మాయి నోట్స్ రాసుకోలేకపోతూంటుంది. దగ్గరకి వెళ్ళి చూస్తుంది. వాళ్ళ నాన్న ఆ అమ్మాయి చేతి మీద వాతలు పెట్టాడని మరో అమ్మాయి చెబుతుంది. చాలా బాధపడుతుంది సులోచన. విశ్రాంతి సమయంలో స్టాఫ్ రూమ్‍లో ఆ అమ్మాయి గురించి తోటి టీచర్లకి చెబుతుంది. అప్పుడు సోషల్ టీచర్, సీతాలు అనే ఆ అమ్మాయి గురించి చెప్పుకొస్తుంది. అసలు తండ్రి చనిపోగా, తల్లి మళ్ళీ పెళ్ళి చేసుకుందనీ, మారుటి తండ్రి సీతాలుని రకరకాలుగా హింసిస్తాడని చెప్తుంది. ఈ విషయంలో ఇక ఊర్కోకూడదు, పోలీస్ కంప్లయింట్ ఇద్దామని లెక్కల టీచర్ అంటాడు. మొత్తం వ్యవస్థలో మార్పు రావాలని తెలుగు టీచర్ అంటాడు. స్కూలు అయి ఇంటికి వెళ్ళాకా కూడా సీతాలు గురించిన ఆలోచనలు సులోచనని వదలవు. ఆమె పరధ్యానంగా ఉండడం చూసి కారణమడుగుతాడు సుందరం. జరిగినదంతా చెబుతుంది సులోచన. తన బాల్యం గురించి, తన తండ్రి గురించి గుర్తు చేసుకుంటుంది. తన తండ్రి హఠాత్తుగా చనిపోతే, తన తల్లి మళ్ళీ పెళ్ళి చేసుకోవడం, సవతి తండ్రి తనని తీవ్రంగా హింసించడం గుర్తొస్తాయి. ఓ రోజు సవతి తండ్రి తనని చితకబాదుతుంటే, ఎదురింటి లాయర్ గారు చూసి, అతన్ని బెదిరించి, అమ్మని ఒప్పించి, తనని ప్రేమ సమాజంలో చేర్చిన సంగతి జ్ఞాపకం చేసుకుంటుంది. – ఇక చదవండి.]
అధ్యాయం 31
ప్రేమ సమాజం ప్రాంగణం చాలా విశాలమైనది. చుట్టూ ప్రహారీ. మగపిల్లలు, ఆడపిల్లలు ఉండడానికి వేరు వేరు భవానాలు. ప్రార్థనా మందిరం, వంట ఇల్లు, భోజనాలు చేసే హాలు. మేనేజరు ఉండడానికి వేరే నివాసం. ప్రేమ సమాజంలో పిల్లలు చదువుకోడానికి విద్యా మందిరం, అందులోనే పూల తోట. అనాథ స్త్రీలు, అనాథ పురుషులు ఉండడానికి వేరే వేరే నివాస స్థావరాలు. అన్నీ అందులో ఏర్పాటు చేయబడ్డాయి. వైద్యశాల మరో ప్రక్క.
అనాథ పురుషులు, స్త్రీలు అంటే ఒక్క విషయం గుర్తుకు వస్తోంది. తరానికి తరానికి ఎన్నో మార్పులు. ఎన్నో మలుపులు. కాలం మారుతూ ఉంటే సమజాంలో వృద్ధుల జీవితాల్లో ఎన్నో మార్పులు.
మానవ జీవితంలో చరమదశ వృద్ధాప్యం. పూర్వం రోజుల్లో ఇళ్ళల్లో వృద్ధులకి ఎంతో గౌరవం లభించేది. వారి మాటలు ఇంట్లో అందరూ వినేవారు. వారి సలహాలు తీసుకునేవారు. కాలక్రమేనా ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి. చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి. ఒకే ఊరులోనే అన్నదమ్ములు వేరు వేరుగా ఉంటున్నారు. వృద్ధులైన తల్లిదుడ్రుల్ని వంతుల ప్రకారం తమ ఇంటికి తీసుకువెళ్తున్నారు.
చాలా కుటుంబాల్లో వృద్ధులైన తల్లిదండ్రుల్ని కొడుకులు ఒంటరిగా వదిలి వేసి వేరే చోటుకి వెళ్ళిపోతున్నారు. తమ ఇంట్లో వృద్ధులున్నా వాళ్ళను పట్టించుకోవడం లేదు. అందుకే వృద్ధులకి ఒంటరితనం శాపం అవుతోంది.
మరికొందరు తమ అవసరాలు నిమిత్తం వృద్ధుల్ని తమ ఇంట్లో ఉంచుకుంటున్నారు. వారికి కొన్ని బాధ్యతలు విశ్రాంతి తీసుకునే వయస్సులో అప్పగిస్తున్నారు. వృద్ధులు ఒంటరితనంతో బాధపడుతున్నారు. పిల్లలతో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తే చాదస్తం మనుష్యులని ఈసడించుకుంటున్నారు. తొలి తరంవారు తల్లిదండ్రుల్ని బాగా చూసుకునేవారు.
కాలంతోపాటు వస్తున్న మార్పులు వల్ల నేటితరం వారు తొలితరం వారిని పట్టించుకోవడం లేదు. వృద్ధ తల్లిదండ్రులు పడే బాధలు, అనారోగ్యం సమస్యలూ, మానసిక క్షోభ, సామాజిక అభద్రత, ఒంటరితనం శక్తిలేక ఇబ్బంది పెట్టే ఒత్తిడి ఇవన్నీ ఉంటాయి. వాళ్ళని సంతానం పట్టించుకోవటం లేదు. నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి వృద్ధాశ్రమాల వల్ల ఊరట లభిస్తోంది. ఏ వ్యవస్థ అయినా అందరినీ తృప్తిపరచలేదు.
ఇప్పుడున్న వృద్ధాశ్రమాల్లో చాలా మంది వృద్ధులకు పిల్లులుండి, వాళ్ళు బాగా సంపాదిస్తున్నా వాళ్ళు తల్లిదుడ్రుల్ని పోషించే ఓపిక, తీరిక లేక సహనం లేక వృద్ధాశ్రమాల్లో తల్లిదుడ్రుల్ని చేర్పిస్తున్నారు. విరాళమో నెల బిల్లో చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులే ఏదో కారణం వల్ల వాళ్ళంత వాళ్ళే వచ్చి చేరే పరిస్థితిని పిల్లలు కల్పిస్తున్నారు. ఆశ్రమాలకి డబ్బు చెల్లించే స్తోమత లేని వారు ప్రేమ సమాజంలో చేర్పిస్తున్నారు.
మొండి రోగాల్తో బాధపడ్తున్న వాళ్ళని ఈ వృద్ధాశ్రమాల్లో ఉంచుకోడానికి కొన్ని ఆశ్రమాలు ఇష్టపడవు. అప్పుడు వాళ్ళకి గుర్తుకు వచ్చేది ప్రేమ సమాజమే. ఎందుకంటే అక్కడ సహనంతో ఓర్పుతో సేవ చేస్తారు. ప్రేమను పంచుతారు. అందుకే దానికి ప్రేమ సమాజం అని పేరు వచ్చింది.
వృద్ధాప్యానికి కావల్సింది స్వతంత్రం. ప్రశాంతత. అవి ఉన్ననాడే మానసిక శారీరక ఆరోగ్యాలు బాగుంటాయి. మనిషి జీవితంలో ఆఖరి దశ వృద్ధాప్యం. దీన్ని శాపంగా భావించకుండా ఆనందాన్ని ఆరోగ్యాన్ని పెంపొందుకునే చర్యలను చేపట్టి మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఈ సమయంలో కావల్సింది మానసికానందం. శారీరక విశ్రాంతి.
వృద్ధులు కుంగిపోకుండా, నిరాశ పడకుండా కాలం వెల్లుబుచ్చాలి. పిల్లలు ఒంటరిగా వదిలి వేస్తే వృద్ధాశ్రమంలో ఉండటం మంచిది. ఈ వయస్సులో అక్కడ తమ వయస్సు వారితో కాలక్షేపం చేయడం మంచిదన్న దృడ నిశ్చయానికి లోబడి యుండాలి. వృద్ధాప్యాన్ని శాపంగా భావించకుండా విశ్రాంతి, ప్రశాంతను జీవితానుభవాలను నెమరు వేసుకునే వయస్సు అది అని తెలుసుకోవాలి.
చెప్పే విషయం ఏుటంటే ఇప్పుడు కాల మహిమ వల్ల. మనిషిలో వచ్చిన మార్పు వల్ల తల్లిదండ్రులు పిల్లల చేత నడిరోడ్డు విూదకు నెట్టి వేయబడుతున్నారు. లేకపోతే వృద్ధాశ్రమంలో దీనంగా బ్రతుకు బండి ఈడుస్తున్నారు. కన్నవాళ్ళ విూద పిల్లలకి అభిమానం తగ్గిపోతోంది.
మాతృదేవోభవ, పితృదేవోభవ అని తల్లిదండ్రుల్ని పూజించి గౌరవించే కాలం గతించి పోయింది. ముసలి తల్లిదండ్రులకు వృద్ధాశ్రమాలు, అనాధశ్రమాలే దిక్కు. వీటిలో డబ్బుతో దొరికే సౌకర్యాలు ఉంటాయి. కాని దిగులు ఊబి నుండి బయటకులాగే ఆత్మీయ హస్తం దొరకదు. గుప్పెడు మెతుకులు కాదు కరువైంది. చిటికెడు ప్రేమ అసలికి కరువైంది. ప్రేమరాహిత్యంలో బ్రతికే వృద్ధులు వార్ధక్య దీపంలో ఆవేదన వెలిబుచ్చుతున్నారు కొందరు. ఈ కొడిగడుతున్న దీపాలకి ఆలంబన ఎవరో చెప్పలేని పరిస్థితి. కావల్సింది వృద్ధులకు సదుపాయాలు కాదు; కాస్తంత ప్రేమ, ఊరట. వారిలో ఏదో కోల్పోయామన్న బాధ. వ్యథ వాళ్ళను వెంటాడుతుంది.
నేటి సమాజంలో పెద్ద వాళ్ళను తమ దగ్గర ఉంచుకోడానికి చాలామంది ఇష్టపడరు. సంతానంలో చెడ్డ సంతానం ఉండొచ్చు కాని చెడ్డ తల్లిదుడ్రులు మాత్రం ఉండరు.
ఇక ప్రేమ సమాజంలోని పిల్లలు విషయం తీసుకుంటే ఎన్నో వ్యథాభరితమైన రకరకాల కధలు, విషయాలు, పరిస్థితులు. రకరకాల నేపథ్యాలు. జీవన విధానం కూడా రకరకాలు. ప్రేమ, అనురాగం, ఆప్యాత అనురాగం వాత్సల్యం ఇవి జీవితంలో వాళ్ళకి ఎండమావే. ఏదో విధంగా సర్దుకుపోయి జీవితంలో రాజీపడ్తూ బ్రతికే బ్రతుకులు వాళ్ళవి.
తూనీగల్లా ఎగురుతూ తుళ్ళుతూ ఆహ్లాదంగా గడిపే బాల్యం వాళ్ళకి లేదు. ఆటపాటలకు అసలుసిసలైన వయసు పసిప్రాయం. ఆ వయస్సులో ఇక్కడ పిల్లలు ఆనందంగా జీవితం గడుపుతున్నారా అంటే చెప్పలేని పరిస్థితి. ఒత్తిడి, ఆంక్షలు వాటితోనే నలిగిపోతోంది వీరి బాల్యం. అక్కడ వారి ఆనందాల వేపు శ్రద్ధ చూపేవారు లేరు.
అమ్మ, నాన్నల ప్రేమ, అనుబంధం తెలియదు వాళ్ళకి, అమ్మ, నాన్నల వాత్సల్యం తెలియదు వారికి. అమ్మ నాన్నల అనురాగం తెలియదు వాళ్ళకి. నాన్న శిక్షణ, మార్గదర్శకత్వం, అతని గొప్పతనం, నిబద్ధత తెలియదు వాళ్ళకి. బాల్యంలోని అన్ని కోణాలలోనూ ప్రేమతో పెనవేసుకునేది అమ్మ అన్న విషయం వారికి తెలియదు. పేదరికంలో మగ్గినా సుఖాల్లో జీవించినా అమ్మ పిల్లల కోసం చేసే త్యాగం తెలియదు వారికి.
బయట సమాజంలో ఉన్న అందరి బాల్యాలూ సంతోషంగా ఆనందంగా ఉండవు. బాధలతో మగ్గిపోయిన వారుంటారు. వెట్టిచాకిరీ చేసిన వారుంటారు. చిత్తు కాగితాలు చెత్తలో ఏరుకునే వారుంటారు. యాచన చేసిన వారుంటారు. తల్లులు చేత చెత్త కుప్పల్లో, ముళ్ళపొదల్లో, మురికి కాలువల్లో వదిలి వేయబడిన వారుంటారు. ఆ తరువాత వాళ్ళు ఒకవేళ బ్రతుకుతే అనాథ ఆశ్రమాలకి, చేరుకునేవారు ఉంటారు. ఇలాంటి వాళ్ళ జీవితాలన్నీ వడ్డించిన విస్తరాకు కాదు. కొందరికి వడ్డించిన విస్తరయితే మరికొందరికి కప్పి వేసిన మట్టి దిబ్బ.
బాల్యం, ప్రతీ మనిషి జీవితంలో ఓ బంగారు పుష్పం. కాని ఇలా అనాథ ఆశ్రమాల్లో బ్రతుకుతున్న వాళ్ళకి మాత్రం కాదు. కొందరి పిల్లలా బాల్యంలో కాగితం పడవులు చేసి కాలువల్లో వదిలే అవకాశం వీళ్ళకి లేదు. కొబ్బరి భూరాలు చేసి ఊదడం, వీళ్ళకి లేదు. ఆకాశంలో గాలి పటాలు ఆనందంగా ఎగరేసే అవకాశం వీళ్ళకి లేదు. గోళీలు, దాగుడు మూత ఆటలూ వీళ్ళకి ఎండమావే.
బ్రతుకు పుస్తకంలో బాల్యం ఆనందాలు వీళ్ళకి మచ్చుకేనా ఉండవు. ఆహ్లాదకరమైన బాల్యం, అనుభూతుల జ్ఞాపకాలు వీళ్ళకి ఉండవు. ఇలాంటి బాల్యం అందరికీ ఉండకపోయినా కొంతమందికి మనసు పొరల్లో రంగు రంగుల దృశ్యాలు రూపాల్లో కదలాడుతూనే ఉంటుంది. బాల్యం ఎవరికేనా అపురూపమైన కానుకే. చెదిరిపోయిన మధుర స్వప్నమే.
అనాథ ఆశ్రమాల్లో మగ్గిన వాళ్ళకి ఆ బాల్య మధుర స్మృతులేంటో తెలియదు. చిరునవ్వులు, దరహాసాలూ, మందహాసం ఇవేవీ వారికి తెలియదు. అమాయకపు ప్రేమ వాళ్ళది. మనిషి జీవితంలో మధురమైనది బాల్యం అని చెప్పడమేకాని అది అనుభవించని వీరికి దాని గురించి చెప్తే ఏం అర్థమతువుంది?
బాల్యం జీవితానికి తొలిమెట్టు అని అంటారు. కాని మల్లె పూవులాంటి కొంతమంది బాల్యాలు బాల కార్మికులుగా అగుపిస్తున్నారు. అమ్మ ఒడిలో ఆడవలసిన వయస్సలోనే చెత్త కుప్పల్లో చెత్త, చిత్తు కాగితాలు ఏరుకుంటున్నారు. బడిబాట పట్టవల్సిన కాళ్ళు ఇటుక బట్టీలో మట్టి తొక్కుతున్నారు. దేశ ప్రగతికి తొలిమెట్టుయిన కొందరి బాల్యం ఇలా విలవిల్లాడుతోంది.
ఆట పాటలూ, అల్లరి. చదువు, సంధ్యల సాంగత్యంలో కథలు, కలలు మధ్య ఎదగవల్సిన బాల్యం తరగతి ఇరుకు గదుల్లో ఆటపాటలకు తావేలేకుండా యాంత్రిక యుగంలో క్లిష్టమైన విద్యా విధానం మధ్య నలిగిపోతోంది. తప్పుఒప్పులు తెలియని అమాయకపు వయస్సులో బాల్యానికి, ప్రపంచాన్ని శాసించే సైబరు, ఇంటర్నెట్ ఉచ్చులు వేసింది. మార్కెట్టు మాయాజులానికి బాల్యం ఎరచిక్కింది. రేపటి యువత నిస్తే జమవుతోంది. వారి భావి భవిష్యత్తు నిద్రాణమవుతోంది.
బాల్యం ఒక మల్లె పూల వనం. చిగురించిన ఆశాలతలెన్నో అల్లుకునే సమయం. ఇది సుఖ దుఃఖాలు సమ్మేళనను కడుపులో దాచుకునే కాలం. బాల్యంలో జాతి, మత కుల వర్గ భేదాలు తెలియవు. బాల్యానికి పాపం తెలియదు. పుణ్యం తెలియదు. ఎండ, వాన, కష్టం, సుఖం మాయమర్మం ఇవేవీ తెలియని వయస్సు అది. ఈర్ష్య, ద్వేషం, పగ ఇవేవీ తెలియని వయస్సు బాల్యం. నిర్వలత్వానికి, స్వచ్ఛతకు ఆదర్శంగా నిలిచినది బాల్యం. కష్టనష్టాలు లేనిది, కులగోత్రాలు తెలియనిది. డబ్బు లేనప్పుడు కుమిలిపోనిది. గర్వం, అహంకారం లేనిది. ఆనందంలో కొట్టుకుపోవడం, సంతోషంలో మునిగి తేలటం కల్తీలేని మేలిమి బంగారం బాల్యం.
ప్రేమ సమాజం గురించి వ్రాస్తున్నప్పుడు అందులో ఉన్న వృద్ధుల జీవితాల్ని, వారితోపాటు సమాజంలో కుంగుబాటుకి గురవుతున్న వృద్ధుల గురించి, డబ్బు ఉన్నా శాంతిలేని వృద్ధుల గురించి, ప్రేమ సమాజంలో ఉన్న పిల్లల బాల్య స్థితిగతులతో బాటు బయట ప్రపంచంలో కూడా కొంతమంది పిల్లల బాల్యం ఎలా ఉంది అని దాని గురించి, బాల్యంలోని అమ్మ, నాన్నల విలువ గురించి బయట బాల ప్రపంచం తీరు, ప్రేమ సమాజంలో బాల ప్రపంచం గురించి, సులోచన ఆలోచిస్తోంది భావోద్వేగంతో.
అధ్యాయం 32
ప్రేమ సమాజంలో దినచర్య ఇలా ఉంటుంది. ప్రతీ విద్యార్ధి, విద్యార్ధినిలు ఉదయం ఐదు గంటలకి లేస్తారు. కాలకృత్యాలు తీర్చుకుని యోగా క్లాసుకు వెళ్ళి వచ్చి, ఆరు గంటలకి ప్రార్థనా మందిరాకినికి వెళ్తారు. మందిరంలో భజన పాటలు పాడుతారు. ఆ తరువాత ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకూ చదువు.
ఆ తరువాత స్నానం చేసి టిఫిను చేయడానికి భోజనశాలకి వెళ్తారు. ఉండడానికి అబ్బాయిలకి, అమ్మాయిలకి వేరు వేరు భవనాలున్నప్పటికి ప్రార్థనాలయం, భోజనశాల అందరికీ కామన్.
టిఫిన్ చేసిన తరువాత విద్యాలయానికి వెళ్తారు. రిటైర్డ్ అయిన కొంతమంది ఉపాధ్యాయులు కొంతమంది పాఠశాలలో విద్యార్ధులకి పాఠాలు బోధిస్తారు. వారు సేవాభావంతో పాఠాలు చెప్పడానికి వచ్చినా వారికి నామ మాత్ర వేతనం ఇస్తారు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ప్రేమ సమాజంలో చదువుకున్న పూర్వ విద్యార్ధులు కూడా విద్యార్ధులకు పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులకు సహకరిస్తారు.
దాతలు, స్వచ్ఛంద సంస్థలు, అంతకు పూర్వం ప్రేమ సమాజంలో ఉండి చదువుకుని, ఉద్యోగస్తులయిన కొంతమంది కూడా తమ సహకారాలు అందిస్తారు. ప్రభుత్వ తరుపున కూడా సహాయం అందుతోంది.
మధ్యాహ్నం భోజనశాలకి అందరూ కంచాలు పట్టుకుని వస్తారు. సామూహిక భోజనం. పెద్దపిల్లలు వడ్డన చేస్తారు. భోజనాలు అయ్యాక తిరిగి పాఠశాలకి వెళ్ళి సాయంత్రం నాలుగున్నరకి తిరిగి వస్తారు. స్నాక్సు తిన్న తరువాత అరగంట రిలాక్సు అయి ఆటలు ఆడిన వాళ్ళు ఆటలు ఆడతారు. వ్యాయామం చేయాలనుకున్నవారు ఆ పనిలో ఉంటారు. మొక్కల సంరక్షణ చేసే వాళ్ళు ఆ పని చేస్తారు. తిరిగి ఆరు గంటల నుండి ప్రార్థనా మందిరంలో ప్రార్థన ఏడు గంటల వరకు. ఏడు నుండి ఎనిమిది వరకూ స్టడీ అవరు. ఆ తరువాత భోజనాలు. ఆ తరువాత కొంతసేపు రిలాక్సు అయి నిద్రకి ఉపక్రమిస్తారు. ఇదీ ఆ ప్రేమ సమాజంలో ఉన్న పిల్లల దిన చర్య.
ప్రేమ సమాజం అన్న తరువాత వృద్ధులకి సేవ చేయడం తప్పదు. స్కూలు నుంచి వచ్చాక కొంతమంది రోగులకు సేవ చేస్తారు. అదీ బ్యాచుల ప్రకారం ఉంటుంది. ఎవరి ఇంట్లోనేనా ఏవేనా వేడుకలు జరుగుతే ఆ రోజు భోజన ఖర్చు వాళ్ళు భరిస్తారు. వృద్ధులకి పండ్లు, బిస్కట్లు పంచిపెడ్తారు. అప్పుడప్పుడు ప్రేమ సమాజ నిర్వాహకులు పిల్లల్ని సమాజ సేవా కార్యక్రమాలకి కూడా తీసుకు వెళ్తూ ఉంటారు. మరో విషయం ఎప్పుడేనా అనాథ శవాలు అగుపడితే ప్రేమ సమాజం వారే వారి దహన సంస్కారాలు జరిపిస్తారు.
వారానికి ఒక రోజు నడవడిక సంబంధించి నీతి నియమాల గురించి విషయాల్ని పిల్లలకి చెప్తూ వారిలో మంచి విలువలు, నైతిక ప్రవర్తన తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరో విషయం ప్రేమ సమాజంలో పెరిగిన యువతీ యువకులు దాంపత్య జీవితంలో స్థిరపడిన వాళ్ళు కూడా ఉన్నారు.
సులోచనకి మొదట్లో కొంచెం ఇక్కడ వాతావరణం కొత్త అనిపించినా నెమ్మదిగా అలవాటుపడింది. ఒక విధంగా చూస్తే నరకంలో నుండి స్వర్గంలోకి వచ్చినట్లనిపించింది. ఇంట్లో రోజూ నరకం చూసేది. ఆ రోజులు తలుచుకోడానికే భయం వేస్తోంది.
“సులోచనా ఎప్పుడూ ఒంటరిగా కూర్చుని ఆలోచించి బాధపడ్తావు. దాని వల్ల ప్రయోజనం ఏంటి మన బాధ మరింత పెరగడం తప్ప. మనకి సుఖంలో ఎవరి సహకారం అక్కరలేకపోయినా దుఃఖంలో మాత్రం ఎదుటి వాళ్ళ సాంత్వన ఉండాలి” అన్నాడు సుందరం.
సుందరం అదే ప్రేమ సమాజంలో ఉంటున్నాడు. సులోచనని చూడగానే అతని హృదయం స్పందించింది. ఆత్మీయురాలిలా అనిపించింది. ఏదో భావోద్వేగం. మనిషి జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొంతమందిని చూస్తుంటే ఎన్నాళ్ళ నుండో తమకి పరిచయం ఉందనిపించింది.
సులోచనకి కూడా సుందరాన్ని చూడగానే అలాగే అనిపించింది. ప్రార్థనా సమయంలోనూ, భోజనాల దగ్గర సుందరాన్ని చూస్తు ఉంటుంది. కాని మాట్లాడుకోలేదు. మనిషి సంఘజీవి. ఒక దగ్గర ఉన్నప్పుడు ఒకరి మనోభావాలు మరొకరు తెలుసుకోవాలి. అది ఆడయినా సరే మగ అయినా సరే. మన సమస్యల్ని మనకి ఆత్మీయులన్న వారితో చెప్పుకుంటే హృదయం తేలిక పడుతుంది కూడా. సాంత్వన లభిస్తుంది.
కొంతమందికి మాటలంటే ఇష్టం. మౌనంగా ఉండడానికి ఇష్టపడరు. మనం ఇతరుల పట్ల సానుభూతిని మాటల్లో ప్రకటిస్తాం. మాటలు కాదు అవసరమైతే చేతల ద్వారా చూపించాలన్నది కొందిరి భావం.
‘‘చెప్పడానికి ఏం ఉంటుంది సుందరం గారూ! ఇక్కడ నున్న వాళ్ళ అందరి వెనుక ఏదో కథ. ఏదో వ్యథ. వాటినన్నింటిని మనసు అడుగు పొరల మాటున దాచేసుకుని పైకి మాత్రం నవ్వుతూ తిరగాలి. మరచిపోక పోయినా, మరిచి పోయినట్టు నటించాలి. చిన్నప్పటి నుండి నటననే జీవితంలో ఓ భాగంగా చేసుకోవాలి” సులోచన అంది.
‘‘ఎంత నగ్న సత్యాన్ని చెప్పారు,’’ అన్న సుందరం తను జీవితంలో అనుభవించిన చేదు జీవితాని చెప్పాడు. అతని జీవితాన్ని విన్న సులోచన గాఢంగా నిట్టూరు విడిచింది.
‘‘మనిద్దరి జీవితాలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. తేడా ఏంటంటే విూరు విూ మారుటి తల్లి వలన హింసను అనుభవిస్తే, నేను మా మారుటి తండ్రి వలన హింసను ఎదుర్కున్నాను” అన్న సులోచన తన జీవితాన్ని తను ఎదుర్కున్న సంఘటనలు సుందరం ముందు ఉంచింది. ఒకరికి మరొకరు తమ బాధలు చెప్పుకోవడం వలన మనస్సులు తేలికపడి సాంత్వనం పొందారు.
(ఇంకా ఉంది)
విజయనగరం వాస్తవ్యులైన శ్రీ గూడూరు గోపాలకృష్ణమూర్తి హిందీ ఉపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. వారు రాసిన కథలు వివిధ వార్తపత్రికల్లో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు సంకలనంగా వెలువడ్డాయి.