Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మలుపులు తిరిగిన జీవితాలు-15

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]

[తండ్రి విసిరేసిన బ్యాంక్ పాస్‍బుక్ చూస్తాడు శేషు. అందులో ప్రతి నెలా రామ్మూర్తి దాస్తున్న డబ్బుల వివరాలు కనబడతాయి. తన తండ్రి గురించి మొదటిసారిగా సానుకూలంగా ఆలోచిస్తాడు శేషు. తండ్రి స్వభావాన్ని, తల్లి గుణగణాలని పోల్చి చూసుకుంటాడు. తల్లి తన మనసుని ఎంతలా విషపూరితం చేసిందో గ్రహిస్తాడు. తన తప్పులను కూడా గ్రహిస్తాడు. తానెంత మూర్ఖంగా ప్రవర్తించినా, తనని ఏమీ అనని తండ్రి మీద గౌరవం పెరుగుతుంది. చీకటి పడ్డాకా పార్కు నుంచి ఇంటికి వస్తాడు రామ్మూర్తి. అన్నం తినాలనిపించదు. ఏదో నాలుగు మెతుకులు కతికి, కలత చెందిన మనసుతో మంచమెక్కుత్తాడు. మధ్యరాత్రి మెలకువ వస్తుంది తన గుండెల ఎవరో చేతులు వేసి పడుక్కోవడం కనిపిస్తుంది. పక్కకి తిరిగి చూస్తే, అది శేషు. కొడుకుని మెల్లగా పిలుస్తాడు. ఏమయింది, ఇక్కడ పడుకున్నావని అడుగుతాడు. ఏమవలేదంటాడు శేషు. తండ్రికి మనస్తాపం కలిగించిన తన ప్రవర్తనకి క్షమించమంటూ ఏడుస్తాడు. రామ్మూర్తికి కూడా దుఃఖం వస్తుంది. కాసేపు రోదించాకా, ఇద్దరి మనసులు తేలికపడతాయి. సుమతి పిన్ని దుర్గమ్మ తన భర్త సాంబయ్య, కొడుకు సుకుమార్‌తో రామ్మూర్తి ఇంటికి వస్తుంది. పాత విషయాలన్నీ గుర్తు చేస్తూ, సుమతితో మాట్లాడుతూ – శాంతిని తన కొడుకు సుకుమార్‌కిచ్చి పెళ్ళిచేయమని అడుగుతుంది. సుమతి భర్త ఇంట్లోనే ఉన్నాడని, అతనిని సంప్రదించాలన్న ఆలోచన అయినా లేకుండా సరేనంటుంది. శేషు అడ్డు చెప్పబోతే, కసురుకుంటుంది. భార్య తనని పట్టించుకోనందుకు, తన ప్రమేయం లేకుండా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు రామ్మూర్తి బాధపడతాడు. పిల్ల చదువయ్యాకా, పెళ్ళి చేస్తనంటుంది సుమతి. సరే, మీరు మాట తప్పకూడదంటుంది దుర్గమ్మ. – ఇక చదవండి.]

అధ్యాయం 29

సులోచన క్లాసుకి వెళ్ళింది. బోర్డు మీద వ్రాసిన దాన్ని విద్యార్ధులు నోట్‌ పుస్తకాలు మీద వ్రాసుకోమని చెప్పింది. ఎవరు ఏం వ్రాస్తున్నారో అని ఆమె ఒక్కొక్కరి పుస్తకం పరీక్షిస్తోంది, బెంచీ బెంచీకి వెళ్ళి. పాపం ఓ అమ్మాయి వ్రాసుకోలేక పోతోంది.

“ఏం అమ్మాయి! వ్రాసుకోలేక పోతున్నావా?” అని అడిగింది.

“అవును టీచర్‌” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.

“వీళ్ళ నాన్న చేతి మీద వాతలు పెట్టాడుట టీచర్‌!” మరో అమ్మాయి అంది.

వెంటనే సులోచన మనస్సు అదోలా అయిపోయింది. ‘పాపం చిన్నపిల్ల ఎంత బాధపడి ఉంటుందో?’ ఆలోచిస్తోంది సులోచన. పిరియడు అయ్యే వరకూ అలా ఆలోచిస్తూనే ఉంది.

విశ్రాంతి సమయంలో స్టాఫ్‌ రూమ్‌లో సాటి ఉపాధ్యాయులందరూ మాట్లాడుకుంటున్న సమయంలో ఈ విషయం ప్రస్తావించింది సులోచన.

“అయ్యో! ఈ విషయం మీకు తెలియదా? ఆ అమ్మాయి సీతాలుకి పురాణకాలంలో సీతమ్మకి ఉన్నంత సహన గుణం ఉండబట్టే ఇంట్లో ఆ తండ్రి అనేవాడు పెట్టే బాధలు భరిస్తోంది. సవతి తల్లి తన సవతి పిల్లల్ని బాధలు పెట్టడం విన్నాం కాని మారుటి తండ్రి సవతి పిల్లల్ని బాధలు పెట్టడం ఇప్పుడే వింటున్నాం,” అంది సోషలు టీచరు.

“అంటే?”

“అంటే ఏమిటి? ఆ సీతాలు తండ్రి చనిపోయాడు. సీతాలు తల్లికి ఇద్దరు పిల్లలు. తల్లి తిరిగి పెళ్ళి చేసుకోకుండా సహజీవనం చేస్తోంది. తల్లి ఏ వ్యక్తితో సహజీవనం చేస్తోందో ఆ వ్యక్తి పిల్లల్ని ఇలా హింసిస్తూ ఉంటాడు. తల్లిది ఏం అనలేని పరిస్థితి. అందుకే మరీ రెచ్చిపోతున్నాడు.”

ఈ విషయం వినగానే సులోచన మనస్సు కలుక్కుమంది. ఏవేవో జ్ఞాపకాలు నీలి నీడలు ఆమెను చుట్టు ముడ్తున్నాయి. సరిగ్గా తన జీవితంలాగే ఉంది సీతాలు జీవితం అని అనుకుంటోంది సులోచన.

“ఇలా ఊరుకుంటే లాభం లేదు. ఇవాళ ఇలా చేతుల మీద వాతలు పెట్టాడు. రేపొద్దున్న పాపం ఆ పసిదాని మీద అత్యాచారం చేయడానికేనా వెనకాడడు. రోజులు అలా ఉన్నాయి. ఆడది కనిపిస్తే చాలు. వాళ్ళు చిన్నా పెద్దా అని లేదు, వావీ వరసులు లేవు. ఈ మానవ మృగాలకి ఎంతకయినా తెగిస్తున్నారు. మనం అందరం వెళ్ళి పోలీసు కంప్లైంట్‌ ఇచ్చి ఆ అమ్మాయికి అండగా ఉండాలి,” లెక్కలు టీచర్‌ అన్నారు.

“ఈ రోజు సీతాల్ని మనం రక్షించగలమేమో కాని సమాజంలో, దేశంలో సీతాలు లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళ అందరి సంగతి ఏుటీ? మొత్తానికి వ్యవస్థ పాడయిపోయింది. సమాజంలో నైతిక విలువలు దెబ్బతిన్నాయి. నేడు సమాజంలో వివాహ బంధాలు విచ్ఛిన్నమయి విడాకులు ఎక్కువుగా అవుతున్నాయి. అందువల్ల కూడా సహజీవనానికి యువత మొగ్గు చూపుతోంది. యువతులు చాలామంది భాగస్వామి నుంచి రక్షణనను అనుబంధాన్ని స్థిరమైన జీవితాన్ని కోరుకుంటున్నారు, కాని ఈ సహజీవనాన్ని మాత్రం కాదు. అయితే కొంతమంది మాత్రం దీన్ని కోరుకుంటున్నారు. అయితే ఈ సహజీవనంలో ఇరు కుటుంబాలు సహకారం లభించదు. ఇరుగు పొరుగు వారి సహకారం లభించదు. అన్నీ సమస్యలూ ఇద్దరే ఎదుర్కోవలసి వస్తుంది. పుట్టే పిల్లలకి కూడా ఇరు కుటుంబాల సహకారం అందదు. ఇరుగు పొరుగు వారి సహకారం లభించదు. అన్ని సమస్యలూ ఇద్దరే ఎదుర్కోవలసి వస్తుంది. ఇరు కుటుంబాలకు ఆప్యాయతానురాగాలు లభించవు” తెలుగు టీచరు అంటున్నారు.

అందరి మాటలూ వింటూ సులోచన ఆలోచిస్తోంది. ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా ఎవరి బతుకుల్లో ఏదో ఆపద వాటిల్లుతూ ఉంటుంది. అంతిమ విజయం సహనం ఉన్నవారికి మాత్రమే లభిస్తుంది. అందరూ సహనవంతులుగా ఉండగలరా?

సీతాలు తల్లి మీద కూడా కోపం వచ్చింది సులోచనకి. మరుక్షణం జాలి. పాపం నేడు సమాజంలో అభద్రత. ఒంటరితనం ఉన్న మహిళలు, కట్న కానుకలు ఇచ్చుకోడానికి ఇష్టపడనివారు, ఇచ్చుకోలేనివారు ఆధునిక మహిళలు ఈ సహజీవనానికి ఇష్టపడుతున్నారు. అయితే ఈ సహజీవన బంధం బలహీనతగా మారి విడిపోవడానికి కారణమవుతోంది. కొంతమంది యువకులు కూడా తమ జీవిత భాగాస్వామి కన్యగా ఉండాలని భావిస్తారు. ఇది కాస్తో కూస్తో చదువు సంస్కారం గల వారి విషయంలో.

మరి సీతాలు తల్లిలాంటి కొద్దిపాటి చదువుకున్న వారి విషయం చూస్తే సీతాలు తల్లి ఎవరితోనో సహజీవనం చేస్తోంది. ఆ వ్యక్తి తనను ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాడో అన్న అభద్రతా భావానికి గురవుతోంది. ఆ వ్యక్తి కోపగించుకుని వెళ్ళిపోతే తను తిరిగి ఒంటరి అవుతుంది. ఒంటరి అయిన ఆడదానికి సమాజంలో రక్షణ లేదు. అందుకే తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి తన పిల్లల్ని హింసిస్తున్నా కిమ్మనకుండా ఉంటోంది. ఎవరి బలహీనతలు వాళ్ళకి ఉన్నాయి.

అయితే ఈ సహజీవనం చేయడానికి ముందు చూపు ఉండాలి. నేర్పుతో బాటే సమాజాన్ని అర్ధం చేసుకునే పరిపక్వత ఉండాలి. సహనం ఓర్పు ఉండాలి. వివాహ వ్యవస్థను, సహజీవనం ప్రత్యామ్నాయం కాదు. ఇద్దరి మధ్యా అనుబంధాలు పటిష్టంగా ఉండాలి. పరస్పర అవగాహన ఉండాలి. ఆర్థిక సంబంధాల విషయంలో ఇద్దరూ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలగాలి. గృహ అవసరాలు, ఇంటి పని, సమాన బాధ్యతలు స్వీకరించగలగాలి. ఒకవేళ పిల్లలు పుడుతే తల్లిదుడ్రులుగా తమ అనురాగాన్ని వాళ్ళకి పంచి బాధ్యతను సంతోషంగా స్వీకరించేందుకు సిద్ధపడాలి.

తెలుగు టీచరు చెప్పిన విషయాలతో తను ఏకీభవిస్తోంది పూర్తిగా జీవితంలో వచ్చిన ఆటుపోటులన్నీ, సమస్యలన్నీ సహజీవనం చేస్తున్నవాడు  ఒంటరిగా భరించాలి. వీరికి ఇల్లు లభించదు. సమాజం వీరిని చిన్న చూపు చూస్తుంది. సహజీవనం చేస్తున్నప్పుడు పుట్టిన పిల్లలకు, సహజీవనం చేస్తున్న ఆడదానికి ఆస్తి విషయంలో ఎటువంటి హక్కు ఉండదు. సహజీవనం చేస్తున్న ఆడదానికి రక్షణ ఉండదు. ఇది మన భారతీయ సంస్కృతి కాదు. ఇది విదేశీ సంస్కృతి.

విదేశీయులు మన సంస్కృతిని గౌరవిస్తూ ఉంటే, మనం మాత్రం విదేశీ సంస్కృతిని అనుకరిస్తున్నాం. సరదా కోసమో, కాలక్షేపం కోసమో, సహజీవనం చేస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. సహజీవనం వలన పుట్టిన ఆడపిల్లలు పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. మగ పిల్లలు కూడా హేళనకి గురి అవుతారు. ఆ తరువాత సంఘ విద్రోహక శక్తులుగా మారిపోతారు.

సహజీవనం గురించి ఆలోచిస్తూ ఉంటే మనస్సు కలత బారింది సులోచన మనస్సు. ఏవోవో ఆలోచన్లు ఎన్నో జ్ఞాపకాలు. అన్యమనస్కంగా ఇంటికి బయలుదేరింది సులోచన స్కూలు అయిన తరువాత.

అధ్యాయం 30

“సులోచనా! ఏుటో ఇవాళ చాలా పరధ్యానంగా ఉన్నావు. ఆర్‌ యూ ఓకే?” అన్నాడు సుందరం. “ఊఁ!!!” అంది కాని ఆమె మనస్సు మాత్రం నిలకడగా లేదు. గతం తాలూకా జ్ఞాపకాలు ఆమె కళ్ళెదుట నిలుస్తున్నాయి.

మల్లె పందిరి క్రింద కుర్చీ వేసుకుని కూర్చింది. పిండారబోసినట్లు ఉంది వెన్నెల. ఆకాశం మీద చంద్రుడు తన వెన్నెల కిరణాలు సమూహాన్ని వసుద పైకి విసురుతున్నాడు. నక్షత్రాలు ఆకాశంలో మిణుకు మిణుకు మంటున్నాయి సులోచన ఆలోచనా ప్రపంచంలో విహరిస్తోంది.

తన తండ్రి బతికి ఉన్నప్పుడు తమని ఎంత బాగా చూసుకునేవాడు? ఒక్క క్షణం తమ్ముడ్ని తనని విడిచి పెట్టి ఉండేవాడు కాదు. అడిగినవన్నీ విసుక్కోకుండా కొని తెచ్చి ఇచ్చేవాడు. వాన రాక ప్రాణం పోక తెలియదన్నట్లు తండ్రి చనిపోవడంతో తన కుటుంబం వీధిన పడింది. తను ఏడ్చింది. తన తమ్ముడికి అంత జ్ఞానం లేదు. కాబట్టి తండ్రి చనిపోయినా వాడు అంతగా చలించలేదు. తండ్రి చనిపోవడంతో లోకమంతా శూన్యం చెందినట్లయింది.

తండ్రి జ్యూట్‌ మిల్లులో పని చేసేవాడు. డ్యూటీలో ఉండగా చనిపోయాడు. ఆ మిల్లు యాజమాన్యం ఇచ్చిన డబ్బు ఎన్నాళ్ళు వస్తుంది. ఒక వేపు డబ్బు అయిపోతోంది. మరో వేపు సమాజంలో ఒంటరి ఆడదానికి భద్రత కరువవుతోంది. తన తల్లికి అభద్రతా భావం పట్టుకుంది. ఇప్పుడు ఆమెకి లైంగికానందం ముఖ్యం కాదు రక్షణ ఉండాలి. అందులోనూ పిల్లలు కూడా ఉన్నారు. రక్షణ కల్పించే మగతోడు ఉండాలి. అది అక్రమ సంబంధం కాకుండా ఉండాలి.

దాంపత్య జీవితం తిరిగి కావాలి అనే ఆలోచనతో భార్య మరణించి ఇద్దరు పిల్లలుతో తంటాలు పడుతున్న ముకుందరావు తిరిగి పెళ్ళి చేసుకుంది తన తల్లి. అతని ఇద్దరు పిల్లల్ని తనని, తమ్ముడ్ని ఇలా నలుగురిని సాకాలి తన తల్లి.

ఆమె భావాలేంటంటే దాంపత్య జీవితంలో భార్యాభర్తలు సమాజంలో తమ బాధ్యతల్ని తెలుసుకుని మెలగాలి. ఒకర్ని మరొకరు అర్ధం చేసుకోవాలి. పిల్లలకి రక్షణ కలిపించాలి. మంచి నడవడిక కలిగి ఉండాలి. ఒకరి లోపాలను మరొకరు సరిదిద్దుకుని ముందుగా సాగాలి. ఒకరి బలహీనతలు మరొకరు పోగొట్టుకోవాలి. అంతే కాని బలహీనతల్ని ఆధారం చేసుకుని ఒకర్ని మరొకరు అణగద్రొక్కకూడదు. అప్పుడే జీవితం సక్రమంగా ముందుకు సాగుతుంది. నీవు తక్కువ, నేను ఎక్కువ అనే భావాలకి చోటు ఇవ్వకూడదు. సర్దుకుపోయే గుణం అవసరానికి తగ్గట్టు నడుచుకోవాలి. అప్పుడే ఆ కుటుంబం పది కాలాలు బాటు నిలిచి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకోడానికి భార్యాభర్తలు చేదోడు వాదోడుగా ఉండాలి.

తన తల్లి మనస్సులో దాంపత్య జీవితం గురించి అటువంటి విశాలమైన భావాలున్నాయి. కాని ఆమెను పెళ్ళి చేసుకున్న మనిషి అటువంటి విశాలమైన భావాలు కలవాడు కాదు. అతనిలో అటువంటి భావాలు మచ్చుకేనా వెతికినా కానరావు. అతని మనస్సు ఇరుకు.

అతని పిల్లల్ని తన తల్లి కన్న పిల్లల్లా చూసుకుంటోంది. వాళ్ళకి తన మాతృప్రేమ అందిస్తోంది. కాని అతను మాత్రం తనని, తన తమ్ముడ్ని ఓ తండ్రిలా ఎప్పుడూ చూడలేదు. అతనిది సంకుచిత స్వభావం. తను అంత చిన్న వయస్సులోనే తను అనుకునేది.

ఇది తన ఒక్కదాని సమస్యకాదు. సమాజంలోని తనలాంటి వాళ్ళందరి సమస్య కూడా. సమాజం తీరుతెన్నులే అలా ఉన్నాయి. సవతి పిల్లల్ని కొంతమంది ఆడవాళ్ళు తమ స్వంత పిల్లల్లా చూసుకుంటారు. మాతృత్వ ప్రేమ అందిస్తారు. అదే మగవాడు తన భార్యకి మొదటి భర్త వల్ల పుట్టిన పిల్లల్ని అంతగా అభిమానించలేరు. ఆదరించలేరు. అంతే కాదు కొంతమంది మగవాళ్ళు తాము రెండవ పెళ్ళి వాడయినా, అతనికి పిల్లలున్నా విధవరాల్ని, లేక పిల్లలున్న ఆడదాన్ని పెళ్ళి చేసుకోడానికి ముందుకురారు. పెళ్ళి కాకుండా వయస్సు మీరిన కన్నె పిల్లల్నే కోరుతారు. ఏుటో ఈ విచిత్రం.

తన మారుటి తండ్రి తనని చీటికీ మాటికీ తిట్టేవాడు. కొట్టేవాడు. చావబాదే వాడు. ఓ పర్యాయం అతని కొడుకు తనని తిట్టాడు. తను వాడ్ని తిట్టింది. కొట్టింది. వాడు పెద్ద రభస రభస చేసాడు. దానికి బదులు మారుటి తండ్రి తనని బెల్టుతో చావబాదాడు.

“కొట్టకండి నాన్నగారూ.. కొట్టకండి,” అంటూ తను ఏడ్చింది. అతడ్ని నాన్నగారూ అని పిలవడం ఇష్టం లేకపోయినా ఈ మధ్యనే తన తల్లి మందలించడం వల్ల అలా పిలవడం అలవాటు చేసుకుంది తను. అతను అలా కొడ్తూ ఉంటే ఏు అనలేని పరిస్థితి తన తల్లిది. ఎందుకంటే తన తల్లికి అతని అండ అవసరం.

మారుటి తండ్రి రోజూ తనని అలా కొట్టడం తన ఇంటి ఎదురుగా  ఉన్న లాయరు విశ్వనాధం గారు చూశారు. పోలీసు కంప్లైంట్‌ ఇస్తానని తన మారుటి తండ్రిని బెదిరించారు. లాయర్లతో పెట్టుకుంటే తలనొప్పి అని అనుకుని ఉంటాడు తన మారుటి తండ్రి. అందుకే గమ్మున ఊరుకున్నాడు.

లాయర్‌ విశ్వనాధం గారు తన తల్లిని పిలిపించారు. ఆవిడతో లాయరు గారు “అమ్మా నీవు నీ భర్త చనిపోయిన తరువాత నీ భద్రత దృష్ట్యా మారు మనవి చేసుకున్నావు. నీకయితే భద్రత లభించింది కాని నీ పిల్లలకు మాత్రం భద్రత కరువైంది. అందులోనూ ఆడపిల్లకు మరీను.

రోజూ నీ భర్త నీ కూతుర్ని చీటికీ మాటికీ కొడ్తూ ఉంటే వారించలేని పరిస్థితి నీది. ఇప్పుడే ఇలా ఉంటే ఆ అమ్మాయి పెరిగి పెద్దదయిన తరువాత ఆ అమ్మాయి పరిస్థితి ఏుటి? ఎందుకంటే కన్న తండ్రే కన్న కూతురి మీద అత్యాచారం చేస్తున్న రోజులివి.

నేను రోజూ నీ భర్త ఆ చిన్న పిల్లను ఎలా కొడ్తున్నాడో, తిడుతున్నాడో చూస్తున్నాను. ఎటూ చెప్పలేని పరిస్థితి నీది. అందుకే నేను ఈ అమ్మాయిని ప్రేమ సమాజంలో చేర్పిస్తున్నాను. ప్రేమ సమాజంలో ఉండేది దిక్కూ మొక్కూ లేనివాళ్ళు మాత్రమే అని అనుకోవద్దు. అక్కడ ఉంటే నీ కూతురికి మంచి భవిష్యత్తు ఉంటుంది. చాలా ఉత్తమ గుణాలు నీ కూతురికి అలావాటు అవుతాయి” అన్నారు.

బాగా ఆలోచించిన తరువాత తన తల్లికి కూడా తన కూతురు ప్రేమ సమాజంలో ఉండటమే మంచిదనిపించింది. వెంటనే అంగీకరించింది. అంగీకార పత్రం కూడా వ్రాసి ఇచ్చింది. ఈ విధంగా లాయరు గారు తనని ప్రేమ సమాజంలో చేర్పించారు. తను ప్రేమ సమాజంలో చేరింది.

(ఇంకా ఉంది)

Exit mobile version