Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మలుపులు తిరిగిన జీవితాలు-13

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]

[పిల్లలకి తన మీదున్న వ్యతిరేక భావాలు కొన్నైనా తగ్గించుకోవాలనుకున్న రామ్మూర్తి, సుందరం సూచించినట్లు, పాకెట్ మనీ ఇవ్వడం మొదలుపెడతాడు. అయినా కొడుకు శేషు వ్యంగ్యం మాటలు ఆపడు. తల్లి ప్రభావం ఆ అబ్బాయిపై చాలా ఉంటుంది. కోపం వచ్చినా, సుందరం మాటల్ని గుర్తు చేసుకుని, అణచుకుంటాడు రామ్మూర్తి. కూతురు శాంతి మాత్రం తండ్రి బాధని, తల్లి స్వభావాన్ని గ్రహిస్తుంది. ఓ రోజు శేషు వచ్చి బూట్లు కొనమంటాడు. వద్దంటాడు రామ్మూర్తి. అంతే, శేషు, సుమతి రామ్మూర్తిని తిట్టుకుంటారు. జీతాలొచ్చాకా, శేషుకి బూట్లు, శాంతికి సుమతికి బట్టలు తీసుకుంటాడు. అయితే ఆ నెలలో శేషు పుట్టినరోజు ఉందని, కొడుక్కి కూడా బట్టలు కొనాలని గుర్తు రాదు రామ్మూర్తికి. ఇంటికి వెళ్ళాకా, మళ్ళీ మాటలు పడతాడు. కొడుకు మాట తూలడంతో కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపొమ్మంటాడు. కాసేపటికి గొడవ సర్దుమణుగుతుంది. కొద్ది రోజులకు కూతురు పుష్పవతి అవుతుంది. ఫంక్షన్ ఆడంబరంగా చెయ్యద్దని రామ్మూర్తి చెప్పినా సుమతి వినదు. తప్పక అప్పు చేస్తాడు. కార్యక్రమం ఆర్భాటంగా చేస్తుంది సుమతి. తనని ఎవరూ అర్థం చేసుకోవడం లేదని బాధపడతాడు రామ్మూర్తి. సుమతి మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా భర్తని దెప్పుతూనే ఉంటుంది. పిఎఫ్ లోన్ తీసుకుని అప్పులు తీర్చేయాలని అనుకుంటాడు రామ్మూర్తి. – ఇక చదవండి.]

అధ్యాయం 25

“ఒరే అన్నయ్యా! ఈ లెక్క అర్థం కావటం లేదు చెప్పవూ!” శేషును అడుగుతోంది శాంతి.

“అబ్బా ఉండవే! నేను చదువుకోవాలి.”

“మా మంచి అన్నయ్యవి కదూ! మా అన్నయ్య నా మాట వింటాడు,” బతిమాలుతున్నట్టు అడిగింది.

“నన్ను పొగిడి నీ పని కానిచ్చుకుంటావు. కాని నీవనుకున్నంత అమాయకుడ్ని కాను నేను.” వస్తున్న నవ్వును ఆపుకుంటూ అన్నాడు శేషు.

“నా పని పూర్తి అయ్యే వరకు ఇక్కడి నుండి కదలను,” తిష్ఠ వేసింది శాంతి అక్కడ.

“ఊఁ.. రా! నీ పని అయిన తరువాత చదువుకుంటాను,” శాంతికి లెక్కలు చెప్పడం అరంభించాడు.

‘పోనీ నా మీద అభిమానం లేకపోయినా శేషుకి చెల్లెలంటే అభిమానం ఉంది. కనీసం చెల్లెలు మీదయినా అభిమానం ఉంది చాలు’ అనుకున్నాడు తండ్రి రామ్మూర్తి.

“అన్నయ్యా! నిన్నటి రోజున క్లాసులో ఏంటయింది అనుకున్నావు?” శాంతి అన్నయ్య వేపు చూసి అంది. ‘ఏంటయింది’ అన్నట్లు శేషు శాంతి వేపు చూసాడు.

“మాష్టారు ‘నిన్న నేనిచ్చిన లెక్కలన్నీ చేసిన వాళ్ళు నిలబడండి’, అన్నారు. అప్పుడు ఏంటయింది అనుకున్నావూ? నేను తప్ప ఎవరు నిలబడలేదు. అప్పుడు మాష్టరు గారు ‘చూడండి శాంతిని చూసి బుద్ధి తెచ్చుకోండి’ అన్నారు. పాపం మాష్టరు గారికి తెలియదు. నేను చేసిన లెక్కలు వెనుక మా అన్నయ్య హస్తం ఉంది అని” చిరునవ్వుతూ అంది శాంతి.

“శాంతీ! ఎన్ని కథలల్లుతావే! నీ పొగడ్తలకు పొంగిపోను కాని ఆ లెక్కలు నోట్‌ బుక్‌ ఇలా ఇయ్యి” అన్నాడు శేషు.

‘శాంతీ! నీవు చాలా తెలివైనదానివే. నీ తెలివితేటలు సార్థకం అయ్యే ఇంటి వాతావరణం అవసరం,’ అనుకుంటున్నాడు శేషు మనసులో.

“శాంతీ! ఎప్పుడూ చదువు.. చదువూ అంటావేంటి? టిఫిను చేసిన తరువాత కూర్చో. నీ ఆకలిని గూర్చి నీవు పట్టించుకోపోతే ఎలా?” శాంతి వేపు అభిమానంగా చూస్తూ అంది సుమతి.

ఆ కూతురు తల్లి వంక ఓ పర్యాయం చూసింది. తన తల్లిలో మంచితనం ఉంది. కాని అది మరగున పడుతుంది ఒక్కొక్క పర్యాయం. తనకి ఏ కష్టం వచ్చినా సహించలేదు. తనకి అమ్మ, నాన్నల ఆప్యాయత లభిస్తుంది. కాని తల్లి ప్రవర్తన ఒక్కొక్క పర్యాయం మరీ బాధాకరంగా ఉంటుంది. అదీ తండ్రి మీద. అది చూసి తనకు బాధ వేస్తుంది.

తన తల్లి ప్రవర్తన తండ్రి యడల ఎందుకలా ఉంటుంది? ఆమె ప్రవర్తనకి, ఉదాసీన ప్రవర్తనకు కారణం ఏంటి? కుటుంబ జీవితంలో అదే ఇంట్లో ఇప్పటి వరకూ వాళ్ళిద్దరూ సరదాగా గడిపిన క్షణాలు తను చూడలేదు. ఇప్పటి వరకూ తను చిన్నపిల్ల కాబట్టి పరిస్థితుల్ని అర్థం చేసుకోలేకపోయింది. తనకీ ఆలోచనా జ్ఞానం వచ్చింది. అందుకే ఇలా ఆలోచిస్తోంది.

‘వారి మనసులు కలవవా? మానసికంగా ఒకరికి మరొకరు చేరువ కాలేరా? పరివర్తన వాళ్ళలో రాదా?’ పిచ్చిగా పరిపరి విధాల ఆలోచిస్తోంది శాంతి. ఆమెవి వయస్సుకి మించిన ఆలోచన్లు.

“ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే స్కూలుకి వెళ్ళక్కరలేదా? స్కూలుకి టైము అవుతోంది తెములు. ఆ తరువాత ఉరకలు పరుగులు పెడ్తావు” సుమతి అంది కూతురుతో.

“ఈ రోజు స్కూలుకి వెళ్ళను.”

“ఎందుకు?”

“సెలవు కదా!” పకపక నవ్వుతూ అంది శాంతి.

“అయితే చదువుకో!” సుమతి కూతురితో అంది.

పెరట్లో పూలమొక్కల దగ్గర ఎండా నీడలో కూర్చుని మొక్కలు వేపు తదేకంగా చూస్తోంది శాంతి. చెల్లెలు అలా కూర్చుని ఆలోచిస్తూ కూర్చోడం శేషుకి ఆశ్చర్యం కలిగించింది.

“ఏంటే ఆ దీర్ఘాలోచనలు?” శేషు చెల్లెల్ని అడిగాడు. ఒక్కసారి తృళ్ళిపడి ఆలోచనా ప్రపంచం నుండి బయటపడింది శాంతి.

“ఆ చెట్లకి విరభూసిన పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో తెలుసా?”

“ఏం ఈ మధ్య ప్రకృతి పర్యవేక్షణ అలవాటు చేసుకున్నావా?”

“అలాని కాదు. ఆ గులాబీని చూశావా? ఎంత అందంగా ఉందో? ఆ పువ్వు మనలకి ఏం సూచిస్తుందో తెలుసా? ముళ్ళ మధ్య ఉన్నా నేను ఆనందంగా ఉన్నాను అని. అలాగే మనిషి కూడా కష్టాలు మధ్య ఉన్నా గులాబీ పువ్వులా ఆనందంగా ఉండాలని.”

“ఈ రోజు నీకు ఏటయిందే? అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు.”

“పిచ్చి కాదు. ప్రకృతి మీదున్న ప్రేమ,” అంది శాంతి.

“నీ పేరులాగే నీ మనస్సును కూడా శాంతమయంగా ప్రశాంతంగా ఉంచుకోడానికి ప్రయత్నిస్తావు,” శేషు అన్నాడు.

***

డి.యి.ఓ. ఆఫీసుకు అవదాని మాష్టారు వెళ్తే రామ్మూర్తికి పి.ఎస్‌లోను శాంక్షను అయిన విషయం చెప్పారు. అది చెప్పడానికి రామ్మూర్తి మాష్టారి దగ్గరకు వచ్చారు, అవదాని మాష్టారు, అతనికి మజ్జిగ తీసుకు వచ్చి ఇమ్మనమని కూతురుతో చెప్పాడు రామ్మూర్తి.

శాంతి వెంటనే తండ్రి చెప్పినట్టు చేసింది. రెండు గ్లాసుల నిండా మజ్జిగ తీసుకు వచ్చి ఒక గ్లాసు మాష్టారికి మరో గ్లాసు తండ్రికి ఇచ్చింది. స్కూలులో రామ్మూర్తిని హేళనగా మాట్లాడిన వాళ్ళలో అతను కూడా ఉన్నారు. అందుకే రామ్మూర్తి మాష్టారు “అవదాని గారూ! స్కూల్లో అందరూ నా గురించి ఏు అనుకుంటున్నారో నాకు తెలుసు. అయితే నా స్వభావమే వేరు. ఎప్పుడూ ఏకాంతంగా ఉండాలి. అనవసర ప్రసంగాలకి పోకూడదు అని అనుకుంటాను నేను. నా స్వభావాన్ని అందరూ మరోలా అర్థం చేసుకుంటున్నారు. అదే నాకు బాధనిపిస్తోంది” అన్నాడు.

అలా రామ్మూర్తిని హేళన చేసిన వాళ్ళలో తనూ ఉన్నాడు అనుకున్న ఆయన దాన్ని కప్పి పుచ్చుతూ “మీరు చెప్పింది నిజమే ఈ లోకంలో అందరి స్వభావాలూ, అందరి ఆలోచన్లూ ఒక్కలాగ ఉండవు. ఒక తల్లికి పుట్టిన పిల్లలే అందరూ ఒకే విధమైన స్వభావం కలిగి ఉండదు. ఎవరి అభిరుచులు వాళ్ళవి. ఎదుటివాళ్ళ అభిరుచుల్ని గౌరవించడం మొదట నేర్చుకోవాలి,” అవదాని మాష్టారు అన్నారు. అతను అలా మాట్లాడ్డం రామ్మూర్తికి ఆశ్చర్యం కలిగించింది.

“నాకన్నా మీరు అదృష్టవంతులు. నా సంగతే తీసుకుంటే మా పెద్దబ్బాయి చెడు సావాసాల్తో పూర్తిగా పాడైపోయాడు. రెండోవాడికి కళ్ళు కనిపించవు. అమ్మాయిని చూస్తే దానికి చదువు అబ్బలేదు. నా భార్యకి ఓపిక లేదు. పైకి ఇంత గంభీరంగా కనిపిస్తాను కాని మనస్సులో రోజు రోజుకి కుమిలిపోతున్నాను. మీలాంటి నిర్మల మనస్కులకు నా బాధలు చెప్తే కొంతయినా బాధ తగ్గుతుంది. అందరిలాగే నేనూ మిమ్మల్ని చులకనగా మాట్లాడేను,” పశ్చత్తాపపడ్తూ అన్నాడు అవదాని.

అతని వంక ఆశ్చర్యంగా సానుభూతిగా చూశాడు రామ్మూర్తి. ‘అవదాని మనస్సులో కూడా ఇంత బాధ ఉందా?’ అనుకున్నాడు.

“క్షమించండి అవదాని గారూ! నేను తప్పుగా ఏమైనా అన్నానా?”

“లేదు.. లేదు..! నేనే మిమ్మల్ని బాధపెట్టాను.”

“లేదు. ప్రస్తుత సమాజంలో కలిసిపోవాలని నాకు హితబోధ చేశారు. నాకు మంచే చెప్పారు కాని చెడు చెప్పలేదు కదా?”

“మరి నేను వెళ్తాను” అంటూ అవదాని గారు లేస్తే అతడ్ని సాగనంపాడు రామ్మూర్తి.

అవదాని మాష్టరు గారి మనస్సులో ఇంత బాధ గూడుకట్టుకుని ఉందా? సమాజంలో కొంతమందితో తమ బాధ బయటకు వ్యక్తం చేయకుండా మనస్సులోనే దాచుకుంటారు. పాపం అతని జీవితం ఏంటో అని ఆలోచిస్తున్న సమయంలో తన జీవితం అతనికి కళ్ళెదుట నిలిచింది. తన భార్య కొడుకు ప్రవర్తన కళ్ళెదుట నిలవగా గాఢంగా నిట్టూర్పు విడిచాడు.

తనది అవదాని అనుకున్నంత సుఖమైన జీవితం కాదు. ఎగుడు దిగుడు దారిలా ముందుకు సాగిపోతున్న జీవితం తనది. ఆ జీవిత ప్రయాణంలో పయనిస్తున్న బాటసారి తను. కష్టాల్ని, కన్నీల్ని బాధల్ని సుఖసంతోషాల కంటే సమస్యల్ని కూడా భాగంగా తీసుకుని జీవన మార్గంలో ముందుకు సాగుతున్నాడు.

ఇటువంటి భావుకత భావాలు అతడ్ని చుట్టుముడ్తున్నాయి. తన జీవితంలో బాల్యం నుండి ఇప్పటి వరకూ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు దుఃఖాన్నే చవిచూశాడు. కూతురు వచ్చి భోజనానికి పిలవగానే అతను ఆలోచనా ప్రపంచం నుండి బయటపడి కూతురు వెనకాలే బయలుదేరాడు.

అధ్యాయం 26

పి.యఫ్‌. లోను వచ్చింది. శాంతి పుష్పవతి అయిన సమయంలో వేడుకలకి అప్పు తీసుకున్న అప్పు తీర్చేసాడు రామ్మూర్తి మాష్టారు. లేకపోతే పాపం పెరిగినట్టు వడ్డీతో సహా అప్పు పెరిగి పోతుందని.

అంతకు మునుపు జిమ్‌కి వెళ్తానని ఒకసారి, స్విమ్మింగ్‌ నేర్చుకుంటానని, క్రికెట్‌ నేర్చుకుంటానని శేషు తండ్రిని డబ్బు అడిగాడు. అయితే రామ్మూర్తి డబ్బు ఈయలేదు. వాటి అన్నింటికన్నా చదువుకు డబ్బు ఖర్చు పెడ్తానంటే తల తాకట్టు పెట్టేనయినా చదివిస్తానని అన్నాడు రామ్మూర్తి.

శేషుకి తనతో చదువుకుంటున్న వాళ్ళందరూ నేర్చుకుంటూ ఉంటే తనూ నేర్చుకోవాలన్న ఆరాటం. తండ్రి మాటలు అతని ఉత్సాహం అంతా నీరుకార్చాయి. నిరాశ, నిరుత్సాహం కలిగాయి.

అతనిలో నెగిటివ్‌ భావోద్వేగాలు. కోపం, బాధ, అన్ని భావాలు ఒకసారి కలిగాయి. తల్లి వలన చాలా సంవత్సరాల నుండి ద్వేషం కూడా పెంచుకున్నాడు. ‘ఇతను నన్ను కన్నాడే కాని ఏ కోరికలూ తీర్చలేదు. ఏ సరదాలూ తీర్చలేదు జీవితంలో. నా కన్నా తన స్నేహితుల జీవితాలే బాగున్నాయి’ అసంతృప్తితో రగిలిపోతూ ఒక్కొక్క పర్యాయం అనుకునేవాడు.

‘లోను తీసుకున్న డబ్బులున్నాయి. ఈసారి వదలకూడదు. తాడో పేడో తేల్చుకోవాలి. రోజూ కాలేజీకి వెళ్ళడానికి కష్టమవుతోంది బైకు కొనమనాలి నాన్నని’ శేషు అనుకున్నాడు.

“కాలేజీకి వెళ్ళడానికి బైక్‌ కొనండి,” అని అన్నాడు.

“బైక్‌ అవసరం అంతగా లేదు. సైకిల్‌ మీద వెళ్ళవచ్చు.”

రామ్మూర్తి మాటలకి శేషుకి పిచ్చి కోపం వచ్చింది. పళ్ళు పటపట లాడించాడు. “అవును ఎవడో దారిన పోయే దానయ్య మీ స్కూలు పిల్లాడు గోపాలంకి నెల నెల ట్యూషను ఫీజు ఇయ్యడానికి డబ్బులుంటాయి కానీ, కన్న కొడుకుని, రక్తం పంచుకుని పుట్టిన కొడుక్కి ఇయ్యడానికి ఏమీ ఉండదు. నిజంగా నేను మీ కన్న కొడుకునేనా? మీరు నా కన్న తండ్రేనా?” శేషు రోషంగా అన్నాడు.

“ఇప్పుడే చెప్తున్నాను. మనిద్దరి మధ్యా ఏ సంబంధం లేదు. ఏ రక్త సంబంధం లేదు.” మళ్ళీ అన్నాడు శేషు.

శేషు మాటలు రామ్మూర్తి గుండెల్లో తూట్లు పొడుస్తున్నాయి. బాధతో గుండెలు బరువు ఎక్కుతున్నాయి. మనస్సులో బాధంతా కన్నీటి రూపంలో పైకుబుకుతోంది.

“శేషూ!!!” బాధగా అన్నాను.

“నేను అన్న మాటలకే మీరంత బాధపడుతున్నారే. మీ చేతలు నాకు ఎంత బాధ కలిగిస్తున్నాయో!”

“గోపాలం చాలా పేదవాడు. చాలా తెలివైనవాడు. తండ్రి కూలీ నాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొడుకుని చదువు ఆపేయ్యమని తండ్రి అంటే నేను నా కొన్ని ఖర్చులు తగ్గించుకుని ట్యూషను ఫీజు గోపాలంకి ఇస్తున్నాను.”

“మీరు ఖర్చులు తగ్గించుకోవడం కాదు. మా కోరికలు చంపేసి ఆ అబ్బాయికి డబ్బు ఇస్తున్నారు. మీలాంటి తండ్రి కడుపున పుట్టిన నేనూ ఒక విధంగా పేదవాడినే.” శేషు మాటలు మరింత మనస్తాపానికి గురి చేస్తున్నాయి. అగ్నికి గాలి తోడయినట్టు సుమతి మాటలు మరింత అతడ్ని బాధకి గురి చేస్తున్నాయి.

“మీ నాన్నగారింతేరా! అతని లాంటివాడే ఇంటిని చీకటిమయం చేసి గుడిలో దీపం వెలిగించడానికి వెళ్ళాడుట. అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లోనుట. ఇంటికి ఇత్తడి పొరుక్కి పుత్తడి. మీ నాన్నగారికి అయిన వాళ్ళు పరాయి వాళ్ళు. పరాయి వాళ్ళు ఆయన వాళ్ళు,” సుమతి పుల్ల విరుపు మాటలు.

జీవితంలో ఎవరు ఎన్ని విధాలా మనల్ని బాధ పెట్టినా దాన్ని ఆమోదించటం అలవాటు చేసుకోవాలి. ఆమోదిస్తే క్షమించడం అవుతుంది. మనల్ని బాధపెట్టిన వాళ్ళని. ఆమోదించకపోతే రక్త సంబంధీకుల మధ్య పగ ద్వేషం పెరుగుతాయి. ఏదైనా విషయాన్ని ఆమోదించి వ్యవహరిస్తే అది పాజిటివ్‌ భావోద్వేగం అవుతుంది. అందుకే ప్రతీ విషయంలోనూ తటస్తంగా రాజీపడి జీవించడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా మన పిల్లల యడల అనుకునే వాడు రామ్మూర్తి.

సుందరం మాటలు గుర్తుకు వస్తున్నాయి. పదహారు సంవత్సరాల తరువాత వయస్సు చేసే హాని అంతా ఇంతా కాదు. ఈ వయసులో మార్గం తప్పితే మనస్సు క్షోభపడితే అన్నీ గాయాలే. ఈ వయస్సులో వాళ్ళకి కోరుకున్నది దక్కకపోతే తన చుట్టూ ఉన్న ప్రతీ ఒక్కరూ భయంకరంగా అనిపిస్తారు. ఎవరూ తమను అర్ధం చేసుకోలేదని అనుకోవడం సహజం. ఫలితంగా వాళ్ళలో ఒక విధమైన ఒత్తిడి.

ఒకానొక సందర్భంలో తన వాళ్ళే శత్రువుల్లా అగుపిస్తారు. కారణం తమను తాము సరిగ్గా అంచనా వేసుకోలేకపోవడం సమస్యలన్నీ తమవే అని అనుకోవడం వలన. అలగడానికి, కోపతాపాలు ప్రదర్శించడానికి తమ వాళ్ళే ఎరలవుతారు. అలక చిన్నపాటిదే అవచ్చు. కోపం అంత గాఢమైనది కాకపోవచ్చు కాని అటువంటి సమయంలో సంయమంతో వారికి సహకరించాలి.

శేషు కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నాడు. వాడు అన్న మాటలు మనస్సును నులిపెడ్తున్నా తమాయించుకున్నాడు రామ్మూర్తి. వెంటనే లోనికి వెళ్ళి బ్యాంకు అకౌంట్‌ పుస్తకం తెచ్చి “ఇదిగో చూడు. ఇది నీ భవిష్యత్తు గురించి నెలనెలా కొంత డబ్బు దాస్తున్న పుస్తకం. కేవలం డిగ్రీ చేసినంత మాత్రాన్న సరిపోదు. డిగ్రీ తరువాత ఎం.బి.ఏ చేస్తే ఏదైనా ఉద్యోగం వస్తుందని. అది నీ చదువు నిమిత్తమే పొదుపు చేస్తున్నాను. నన్ను పిసినారి అనుకున్నా మరేదేనా మీ తల్లి కొడుకు అనుకున్నా నేను బాధపడను కాని నీ జన్మకి కారకుడైన తండ్రిని ఇద్దరి మధ్యా ఏ సంబంధం లేదనడం చాలా బాధ కలిగిస్తోంది,” పుస్తకం కొడుకు దగ్గర విసిరి పైకుబికి వస్తున్న కన్నీటిని వత్తుకుంటూ అన్నాడు రామ్మూర్తి.

శేషు పుస్తకం తెరిచి చూశాడు. అతని ముఖంలో అనేక భావాలు, పశ్చాత్తాపం, బాధ! గబగబా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

మనిషి ఎదుటి వాళ్ళకి బాధ కలిగించే మాటలు అంటాడు. వాటి పర్యవసానం ఆలోచించడు. ఎదుటి వాళ్ళు ఎంత బాధను అనుభవిస్తారో అనుకోడు. పదునైన మాట అన్న తరువాత దాన్ని వెనక్కి తీసుకోవడం కష్టం.

రామ్మూర్తి మనస్సు అశాంతిగా ఉంది. మనస్సు అడుగు పొరల్లో ఇన్నాళ్ళు అణచిపెట్టుకుని ఉన్న ఆవేదన పైకి తన్నుకొస్తోంది. ఏకాంతం కోరుకున్న అతను పార్కుకి వెళ్ళి ఓ నిర్జన ప్రదేశంలో కూర్చున్నాడు. తన మనోవేదన తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అలాగయినా మనస్సులో బాధంతా కన్నీటి రూపంలో వచ్చేసి మనస్సు తేలిక పడుతుందని అతని భావన.

(ఇంకా ఉంది)

Exit mobile version