[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]
[ఇల్లు మారతాడు రామ్మూర్తి. కొత్తింట్లో కాస్త ప్రశాంతంగా ఉంటుంది. సుందరానికి కొడుకు పుట్టాడని తెలుస్తుంది. ఓ రోజు సుమతికి నలతగా ఉందని డాక్టర్ దగ్గరకి తీసుకువెళ్తే, పరీక్షించి, తల్లి కాబోతోందని చెప్తుంది. రామ్మూర్తి సంతోషించగా, సుమతి బాధపడుతుంది. ఇంటికి వచ్చాకా, తనకి అప్పుడే పిల్లల్ని కనాలని లేదని భర్తతో వాదిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల మధ్య పిల్లల్ని పెంచలేనని అంటుంది. ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాడు రామ్మూర్తి. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఊర్నుంచి వచ్చిన భుజంగరావు వాళ్ళ మాటలన్నీ వింటాడు. కూతురికి బుద్ధి చెప్తాడు. తండ్రి కన్నీరుని చూసిన సుమతి మనసు మార్చుకుంటుంది. కాలం సాగిపోతుంది. భుజంగరావు మరణిస్తాడు. రామ్మూర్తికి మొదట కొడుకు పుడతాడు. శేషు అని పేరు పెడతాడు. కొన్నాళ్ళకి కూతురు పుడుతుంది. శాంతి అని పేరు పెట్టుకుంటారు. సుమతి ప్రవర్తనలో ఏ మార్పు ఉండదు. పిల్లలు పెరిగి పెద్దవుతుంటారు. తండ్రి తమకు అందరిలా డబ్బు ఇవ్వకపోవడం పిల్లలకి నచ్చదు. ఇద్దరూ అసంతృప్తితో ఉంటారు. వాళ్ళ మాటలు విన్న రామ్మూర్తి బాధపడతాడు. వెళ్ళి సుందరాన్ని కలుస్తాడు. అక్కడ సుందరం కొడుకు సుధాకర్ ప్రవర్తన చూసి అబ్బురపడతాడు. తన బాధనంతా మిత్రుడికి చెప్పుకోగా, సుందరం మంచి సలహాలు చెప్పి పంపుతాడు. – ఇక చదవండి.]
అధ్యాయం 23
సుందరం చెప్పినట్లు నడుచుకుంటే పిల్లలకి తన మీదున్న వ్యతిరేక భావాలు కొన్నయినా సమసిపోతాయనుకున్న రామ్మూర్తి పిల్లలకి నెలనెల జేబు ఖర్చులకని డబ్బు ఈయడం ఆరంభించాడు. దీనిలోని అతనికి వ్యంగ్యమే ఎదురయింది.
“అబ్భో ఇతనికి ఇన్నాళ్ళకి ఈ మంచి బుద్ధి పుట్టిందేుటో?” శేషు అన్న మాటలు గుండెల్ని తూట్లు పొడుస్తున్నట్లు అనిపించింది. ముఖం పాలిపోయింది. వెంటనే సుందరం అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. కౌమార వయస్సులోనున్న వారి ప్రవర్తన వ్యతిరేకంగా ఉంటుందని, వచ్చిన కోపాన్ని, మనస్సుకి తగిలిన బాధను ఎంతో సహనంతో అణచుకున్నాడు. ఇన్నాళ్ళ వరకూ తనని ఎంతో పిచ్చిగా అభిమానించిన కొడుకు నోటి వెంబడేనా ఈ మాటలు వస్తున్నాయి. తల్లి ప్రభావం కొంత అయినా కొడుకు మీద పడుతోంది అనుకున్నాడు.
ఎంత కోపం వచ్చినా సుందరం మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే పాలపొంగులా ఆవేశమంతా తగ్గిపోతుంది.
‘అమ్మ ఎప్పుడూ చిటపటలాడ్తూ తండ్రితో ఎందుకు వాదనకి దిగుతుంది?’ ఇంటి పరిస్థితులు తెలిసిన వయస్సుకి మించిన ఆలోచన్లతో అనుకుంది శాంతి.
“ఇతని దగ్గర అమ్మ అలా ఉండటమే మంచిది. లేకపోతే పీనాసితనం. ఏది కొనమన్నా కొనరు. ఏది అడిగినా ఇయ్యరు. నా తోటి వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు? ఎంత మంచి జీవితం గడుపుతున్నారు? వాళ్ళ కోరికలు తండ్రి తీరుస్తూ ఉంటే ఈయనేుటో అదో రకం మనిషి పిల్లల అవసరాలు గుర్తుండవు. రూపాయి ఖర్చు పెడ్తామన్నా ఆలోచనే,” శేషుకి తండ్రి మీదున్న భావం ఇది.
శాంతి స్వభావమే వేరు. తండ్రి పరిస్థితిని అర్ధం చేసుకునే పిల్ల. తన స్నేహితురాళ్ళు తనని ఎంత హేళన చేస్తున్నా తండ్రిని ఎప్పుడూ తనకి ఇది కావాలి అది కావాలి అడగనే అడగలేదు.
ఓ పర్యాయం శేషు తచ్చాడుతున్నాడు. ‘వీడెందుకు ఇలా తచ్చాడుతున్నాడు?’ రామ్మూర్తి అనుకున్నాడు.
“ఏంటిరా అలా తచ్చాడుతున్నావు? నాతో ఏమైనా మాట్లాడాలా?”
“మాట్లాడాలనే ఉంది అయితే అవనిదానికి ఎందుకు మాట్లాడ్డం అని తిరిగి అనుకుంటున్నాను.”
“ఏంటి కావాలి?”
“బూట్లు” కావాలి. స్కూలు బూట్లు పాడయ్యాయి.”
“కొనే వరకు చెప్పులు వేసుకో!”
“అలా అంటారని నాకు మొదటే తెలుసు,” శేషు పుల్లవిరుపు మాటలు.
“లేదు, తప్పకుండా కొంటాను.”
“జీతాలందాక ఎన్నని కొనగలరు? ఇంటి ఖర్చులకే సరిపోతుంది మీ జీతం. మీకన్నా నా స్నేహితుడు శ్రీకాంత్ వాళ్ళ నాన్నే నయం. వాడు అడిగినవన్నీ కొంటారు. మరీ పీనాసి అయిపోతున్నారు. ఈ బుద్దులు ఎప్పుడు పోతాయో?” గొణుక్కుంటూ అచట నుండి వెళ్ళిపోయాడు శేషు.
“ఏం చేస్తాం? ఏ జన్మలోనో పాపం చేసుకుని ఈ ఇంట్లో పుట్టారు. ఈ ఇంట్లో పుట్టిన వాళ్ళకి ఏ అచ్చటా ముచ్చటా తీరదు,” సుమతి కొడుక్కి వత్తాసు పలుకుతోంది. ‘సుమతి ఇలా సమర్థిస్తూ ఉంటే అది అలుసుగా తీసుకుని శేషు మరీ మొండివాడిలా తయారవుతున్నాడు. సుమతికి కూడా బుద్ధిలేదు. పిల్లల దగ్గర తనని చులకన చేస్తోంది,’ రామ్మూర్తి ఇలా బాధపడుతూ అనుకుంటున్నాడు.
జీతాలు అందిన వెంటనే శేషుకి కొత్త బూట్లు తీసుకున్నాడు. శాంతికి, సుమతికి బట్టలు తీసుకున్నాడు. కొంత డబ్బు కట్టి, మిగతాది వాయిదా పద్ధతిలో ఇస్తానని చెప్పాడు. ‘ఈ నెల అదనంగా ఇంత ఖర్చు అయింది. అనవసరమైన కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలి,’ అని అనుకున్నాడు. అక్కడికి, స్కూలుకి తను సైకిలు మీద వెళ్తాడు. పిల్లల్ని ఆటోలో పంపిస్తాడు.
‘తను తీసుకున్న వస్తువుల్ని చూసి కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో’ అని అనుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నాడు రామ్మూర్తి ఎంత ఉత్సాహంతో వచ్చాడో అంత నీరసపడిపోయాడు.
“ఈ నెలలోనే శేషు పుట్టిన రోజు. వాడికి బట్టలే తేలేదా?”
“అతనికి నేను ఎందుకు గుర్తుంటానమ్మా!” శేషు మాటలకి చివుక్కుమంది మనస్సు రామ్మూర్తికి.
“నిజంగా గుర్తుకు రాలేదు.”
“పిల్లలు అంత గుర్తుకు రాకపోతే ఎందుకు కన్నట్టు?” శేషు మాటలకి మ్రాన్పడిపోయాడు. ఓ తరం కంటే మరో తరంలో ఎంత మార్పు? ఈనాటి కొడుకు తండ్రిని మా కోరికలు తీర్చలేని వాడివి ఎందుకు కన్నావు అని అడుగుతున్నాడు. చిన్నవాడికి ఇంత పెద్ద పెద్ద మాటలా? తల్లి దీని కంతటికి కారణం అనుకుంటున్న రామ్మూర్తికి పట్టరానంత కోపం వచ్చింది.
“అవును నిన్ను కనడం, నీ జన్మకి కారకుడవడం నాదే తప్పు. నా తప్పుల్ని వేలెత్తి చూసినవాడు ఈ ఇంటిలో ఉండ అవసరం లేదు. నీకు ఇష్టం లేకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపో.. వెళ్ళిపో!” గట్టిగా అరిచాడు.
“వెళ్ళిపో.. వెళ్ళిపో! అంటున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతాను”
అలా అంటున్నప్పుడు శేషు ముఖంలో బేలతనం అగుపించింది. అది చూడగానే రామ్మూర్తి కోపం పాలపొంగులా చల్లారిపోయింది.
మనస్సులో చాలా బాధపడ్డాడు. నేనేంటి ఈ రోజూ ఇంత సహనం కోల్పోయాను. శేషు కనక అలా అన్నాడు కాని. మరెవరైనా పౌరుషం కలవాడయితే ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. లేక ఆత్మహత్య అయినా చేసుకుంటాడు. ఇలా ఊహించడమే తను భరించలేకపోతున్నాడు. అయినా వాడు ఎక్కడకి వెళ్ళిపోతాడు? వాడ్ని ప్రయోజకుడ్ని చేయడం, వాడికి మంచి జీవితం ఈయడం తన బాధ్యత. ఇలా ఆత్మ విమర్శ చేసుకున్నాడు రామ్మూర్తి.
“మీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడమేనా? శేషు ఎంత బాధపడుతున్నాడో? వాడి మాటల్లో నాకేం తప్పు కనిపించలేదు,” సుమతి మాటలు మరింతగా బాధపెట్టాయి రామ్మూర్తిని. ఇలాంటి సంఘటన జరగడం మంచికాదు. దీనికి పరిష్కారం కావాలి, రామ్మూర్తి మనస్సు ఘోషిస్తోంది. అతని మనస్సు అశాంతిగా ఉంది.
తిండి తినబుద్ధి వేయలేదు. తిండి తినకుండా పడుకుని దిండులో ముఖం పెట్టుకుని నిశ్శబ్దంగా ఏడుస్తున్నాడు. అశాంతిమయమైన వాతావరణంలో తనకి సంబంధం లేనట్లు కాలం కరిగిపోతోంది. ఆ రాత్రి ఎవ్వరూ తిండి తినలేదు. అశాంతిగా గడిచిపోయింది ఆ రాత్రి.
మర్నాడు కూడా భోజనం చేయకుండా స్కూలుకి బయలుదేరి వెళ్ళాడు. నీరసంగా ఉంది.
“వొంట్లో బాగులేదా?” తెలుగు మాష్టారు అడిగారు.
“నీరసంగా ఉంది.”
“సెలవు పెట్టలేకపోయారా?”
“పరవాలేదు.”
ఇంతలోనే వడలి వాడిపోయిన ముఖంతో కనిపించిన కూతురు శాంతిని చూడగానే పరిస్థితి అర్ధమయింది. వెంటనే సెలవు పెట్టి ఇంటికి బయలుదేరాడు.
“మీరు ఎవరు భోజనం చేయలేదా?”
“ఊ.. ఊ..!” అంది శాంతి.
“ఎందుకు తినలేదు?”
“మీరు తినలేదని. అందరం తినలేదు.” ఈ విషయం వినగానే అతని మనస్సులో బాధ.
“అందరూ ఈ రోజు నేను చెప్పినట్టు చేయాలి. నేను వడ్డిస్తాను. అందరూ కూర్చోండి,” అంటూ శాంతి అందరికీ భోజనం వడ్డించింది. తండ్రికి తినిపిస్తూ తను తింది. తుఫాను వచ్చి వెలిసినట్టనిపించింది అందరికీ.
అధ్యాయం 24
“ఆడదానివి నీకు ఆ మాత్రం తెలియదా అని తరువాత అందరూ నన్నే అంటారు. అందుకే చెప్తున్నాను శాంతి పుష్పవతి అయింది. బజారుకు వెళ్ళి ఏవేవి కొనాలో చెప్తాను తీసుకురండి,” సుమతి అంది.
“ప్రతీ దానికీ నన్ను అపార్థం చేసుకోకుండా నేను చెప్పింది శాంతంగా ఆలోచించు. ఇలాంటి ఆడంబరాలు నాకు నచ్చవు. మా అమ్మ శ్రాద్ధ కర్మ కూడా నేను ఎంటువంటి ఆర్భాటాలకి పోకుండా జరిపించాను. ఇటువంటి ఆచారాలు కొంతమంది జరిపిస్తున్నా చాలామంది మానుకుంటున్నారు. స్త్రీకి ప్రసవం ఎలాంటి సహజమో ఆడపిల్ల పుష్పవతి అవడం కూడా అంతే సహజం నా దృష్టిలో.”
రామ్మూర్తి మాటలకి సుమతి అసహనంగా అటు నుండి ఇటు తిరిగింది. “ఏ వయస్సులో జరిపించవల్సిన ముచ్చట్లను ఆ వయస్సులో జరిపించాలి. మనకే పదిమంది ఆడపిల్లలు లేదు కదా! ఒకర్తే ఆడపిల్ల. ఈ విషయంలో నేను మీ మాట వినదల్చుకోలేదు. ఇది ఆడవాళ్ళు జరిపించే వేడుక. మగవాళ్ళకి డబ్బు ఖర్చు చేయడమే తప్ప ఏ సంబంధం లేదు,” అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది సుమతి.
ఈ వేడుక జరిపించాలంటే చాలా ఖర్చు అవుతుంది. చేతిలో డబ్బు లేదు. మాటిమాటికి అప్పులు చేయడం రామ్మూర్తికి ఇష్ఠంలేదు. సుమతితో వాదించడం కూడ ఇష్ఠంలేదు. ఓ నిర్ణయానికి వచ్చిన తరువాత సుమతి నిర్ణయం మార్చటం చాలా కష్టమని రామ్మూర్తికి తెలుసు. స్కూల్లో గుర్నాధం మాష్టారు వడ్డీకి అప్పులు ఇస్తూ ఉంటారు. చివరికి ఓ నిర్ణయానికి వచ్చిన రామ్మూర్తి చెప్పు లేసుకుని బయటకు నడిచాడు. అప్పు చేయడమంటే ప్రాణం పోయినంత పని అతనికి.
మనకి ఉన్నదాన్తోనే సర్దుకుపోవాలన్న మనస్తత్వం రామ్మూర్తిది. అతనికి వ్యతిరేకమైన మనస్తత్వం సుమతిది. అప్పో సొప్పో చేయి అయినా పబ్బం గడుపుకోవాలనే ఆలోచన ఆమెది.
గుర్నాధం మాష్టగారి దగ్గర నోటు వ్రాసి ఇచ్చి రామ్మూర్తి అప్పు తీసుకున్నాడు. మన కన్నా పైస్థాయిలో ఉన్న వాళ్ళతో మనల్ని పోల్చుకోనంత వరకు మనం శాంతిగా జీవించగలం. పైస్థాయి వాళ్ళతో పోల్చుకుంటేనే అశాంతి మనల్ని వెంటాడుతుంది. మన కన్నా తక్కువ వారితో మనల్ని పోల్చుకుని తృప్తిపడాలి. ఇదే రామ్మూర్తి భావన. సిద్ధాంతం కూడా.
ఓ సందర్భంలో సుమతి రామ్మూర్తితో “మీరు అన్ని విషయాల్లో ఆదర్శ పురుషుడుగా మిగిలి పోవాలనుకుంటారు. ఎవరికి కావాలి ఆదర్శం. ప్రతీ ఒక్కరికీ కావల్సింది లౌక్యం. ఆదర్శాన్ని పట్టుకుని ప్రాకులాడిన వాళ్ళందరూ చివరికి అడుక్కునే పరిస్థితి వస్తుంది. మీరు ఆదర్శంగా ఉందామను కుంటారు. దానికి ఊరా, పేరా? మీ ఆదర్శం ఎవరికి కావాలి?” అంది. ఒక్కొక్క పర్యాయం సుమతి క్లాసుపీకేది. ఆమె మాటల్లో యథార్ధం ఉండొచ్చు. వ్యంగ్యం కూడా ఉండేది.
“ఒకరు చెప్పుకుంటారని మనం నటించలేము. ఆచరించలేము కూడా. ప్రతీ ఒక్కరి మనస్సులో స్వతహాగా ఉండాలి. ఇటువంటి భావన.” సుమతి, మాటలకు సమాధానంగా అనేవాడు రామ్మూర్తి.
“మిమ్మల్ని అందరూ ఆదర్శవంతులు అని అందరూ అనుకుంటారను కుందాం. దానివల్ల మీకు వచ్చే లాభమేుటి? మన బాధలు కష్టాలు తీరుతాయా?” ఇలా వితండ వాదం చేస్తూ అతని సహనాన్ని పరిక్షించేది. అతనిలో సహనం సన్నగిల్లిపోతూ ఉన్నా సహనం వహించేవాడు రామ్మూర్తి. ఎన్ని సార్లు “మనకన్నా పైస్థాయిలో ఉన్నవాళ్ళతో మనల్ని సరిపోల్చుకోకుండా మనకన్నా క్రింద స్థాయి వాళ్ళతో మనల్ని సరిపోల్చుకోవాలి” అని నచ్చజెప్ప చూశాడు. అయినా లాభం లేకుండా పోతోంది.
“అది మీలాంటి వాళ్ళకి సాధ్యమవుతుందేమో కాని నాలాంటి వాళ్ళకి సాధ్యం కాదు. అందరి మనస్తత్వాలూ ఒక్కలాగే ఉండవు కదా!”
సుమతి మాటలకి సమాధానంగా రామ్మూర్తి. “అప్పుడప్పుడు పరిస్థితులకు అనుకూలంగా మార్చుకోవాలి,” అనేవాడు కాని తన మాటలు ప్రభావం భార్య మీదపడదు అన్న విషయం అతనికి కూడా తెలుసు.
గుర్నాధం మాష్టారి దగ్గర అప్పు తీసుకుని వస్తూ ఆలోచిస్తున్నాడు రామ్మూర్తి. జీవితంలో మొదటి సారిగా చేసిన అప్పు అది అతని ప్రాణాలు గిలగిల గింజుకుంటున్నాయి. తన మెడకు ఉరి త్రాడు బిగించినట్టుగా బాధపడిపోతున్నాడు. అతనితో కన్నా, అతని భావాల్తో కన్నా అందరికీ సంబంధం ఉండేది అతని తెచ్చిన డబ్బుతోనే.
ఆ డబ్బు వలనే అనేక సమస్యలు అదంతా ఎందుకు పి.ఎఫ్. లోను పెడ్తే మన డబ్బు మనకి ఇవ్వడానికి కూడ గుమస్తాలకి లంచం ఇవ్వాలి. ప్రతీ పనికీ లంచమే. మొత్తానికి సమాజ వ్యవస్థే అలా ఉంది. అవనీతి, లంచగొండి తనం. ఎక్కడ చూసినా అక్కడ అన్యాయం. దాన్ని తొలగించడానికి కూడా సాధ్యం కానంత దృఢంగా నాటుకుపోయి ఉంది. లంచం తీసుకుంటున్న వాళ్ళకి ప్రస్తుతం బాగుండవచ్చు. ఏదో రోజున వారి జీవితంలో సమస్యలు రావచ్చు.
ఇదంతా తను ఎందుకు ఆలోచిస్తున్నాడంటే పి.ఎఫ్. లోను తీసుకుని అప్పు తీర్చెయ్యాలి. లోను పెట్టడానికి ఇన్ని తంటాలు.
(ఇంకా ఉంది)
విజయనగరం వాస్తవ్యులైన శ్రీ గూడూరు గోపాలకృష్ణమూర్తి హిందీ ఉపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. వారు రాసిన కథలు వివిధ వార్తపత్రికల్లో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు సంకలనంగా వెలువడ్డాయి.