[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]
[ఊర్లు తిరగడానికి సంతోషంగా వెళ్ళి, గంభీరంగా తిరిగొచ్చిన కూతురు అల్లుడిని చూసి, తన కూతురు ఇంకా మారలేదా అని అనుకుంటాడు భుజంగారావు. అయితే రామ్మూర్తి మీద ఇది వరకటి విముఖత చూపకపోవడం ఒకింత ఊరట కలిగిస్తుంది. వాళ్ళిద్దరిని ఒకచోట ఉంచితే, కూతురిలో మార్పు వస్తుందనే ఉద్దేశంతో, వాళ్ళని రామ్మూర్తి పనిచేస్తున్న ఊర్లోనే విడిగా ఇల్లు తీసుకుని ఉండమంటాడు. సుమతి ఏమంటుందో అని రామ్మూర్తి సంశయిస్తే, కూతురు ఒప్పుకుందని భుజంగరావు చెప్తాడు. దాంతో స్కూలుకి దగ్గరగా ఓ మోస్తరు ఇల్లు అద్దెకు తీసుకుంటాడు. మంచి రోజు చూసుకుని రామ్మూర్తి సుమతి చేత సుందరం దంపతులు పాలు పొంగిస్తారు. భుజంగరావు కూడా కూతురు, అల్లుడు కొత్త కాపురం చూడ్డానికి వస్తాడు. అందరూ సంతోషిస్తారు. సులోచన సుమతికి – చుట్టూ ఉన్నవాళ్ళతో ఎలా నడుచుకోవాలో హితబోధ చేస్తుంది. రామ్మూర్తి, భార్యని మామయ్యని తీసుకుని తిరిగి గ్రామానికి వెళ్తాడు. మళ్ళీ వచ్చి స్కూళ్ళు తెరిచే లోపు ఇంటికి కావల్సినవన్నీ కొనుక్కుంటారు. వారు దిగిన ఇంటి యజమానురాలి స్వభావం మంచిది కాదని చుట్టుపక్కల వాళ్ళంతా రామ్మూర్తిని హెచ్చరిస్తారు. అప్పులు చేస్తుందని, ఇంట్లోని వస్తువులు పట్టుకుపోతుందని, ఎదురుతిరిగితే, మన మీదే అరుస్తుందని చెప్తారు. కొద్ది రోజుల పాటు సుమతి అమాయకంగా ఆమె చెప్పుడు మాటలకి లొంగినా, తరువత గ్రహించి ఆమెను దూరం పెడుతుంది. దాంతో ఆమె వేధింపులు ఎక్కువ అవుతాయి. మరో ఇల్లు వెతుక్కోవాలని అనుకుంటారు రామ్మూర్తి దంపతులు. – ఇక చదవండి.]
అధ్యాయం 21
రామ్మూర్తి అద్దె ఇల్లు మార్చాడు. ఇప్పుడు కొంత ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు తీసుకున్న అద్దె ఇల్లు పేచీపూచీ లేనిది. వీళ్ళు ఒక్కళ్ళే ఆ ఇంట్లో ఉంటున్నారు. సుందరం వాళ్ళ విషయాలు తెలుస్తున్నాయి. “రామూ! నేను తండ్రినయ్యాను. మరి నీ సంగతేుటి? ఏమైనా పోగ్రస్సు ఉందా?” సుందరం అడిగాడు. “లేదు” అని సమాధానం చెప్పడం రామ్మూర్తి అలవాటుగా మారింది.
ఆ రోజు ఆదివారం. సెలవు రోజు. బద్దకంగా పడుకుంది సుమతి నిద్ర లేవకుండా. ఆదివారం అందుకే అలా పడుకుంది అని అనుకున్నాడు రామ్మూర్తి. అయితే చాలా సేపటి వరకూ సుమతి లేవలేదు.
“సుమతీ లే.. లే..! ఎనిమిది గంటలు దాటింది. బయట చాలా ఎండగా కూడా ఉంది,” అన్నాడు రామ్మూర్తి.
“నీరసంగా ఉంది. వాంతి వస్తున్నట్లు ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి” అంది సుమతి. ‘వెంటనే హాస్పటల్‌కి తీసుకెళ్ళాలి. కావల్సివస్తే ఏ హోటల్‌లోనూ నాలుగు మెతుకులు కతికి ఇంటికి వచ్చేయ వచ్చు,’ రామ్మూర్తి అనుకున్నాడు.
ఆసుపత్రిలో చెకెప్ చేసిన డాక్టరమ్మ “మీరు తండ్రి అవుతున్నారండి,” అంది రామ్మూర్తితో. వెంటనే సుమతి ముఖం పాలిపోయింది. మౌనంగా ఉండిపోయింది. హోటల్‌లో భోజనం అయిన తరువాత.
“నాకు ఇష్టం లేదు,” అంది.
“ఏంటి?”
“ఇప్పుడప్పుడే పిల్లలు పుట్టడం. పెళ్ళయిందన్న మాటే కాని ఇప్పటికే సరదాలు తీరలేదు. నాకనుకున్న జీవితం నాకు లభించలేదు. ఇక పిల్లలు పుట్టుకొస్తే ఇప్పుడున్న సమస్యలకి తోడు మరిన్ని సమస్యలు. అందుకే అబార్షను చేయించుకుంటాను,” సుమతి నిక్కచ్చిగా అంది.
కిటికీ రెక్క మీద చేయి వేసి బయటకు చూస్తున్న రామ్మూర్తి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. అతని కనుబొమ్మలు ఒక్కక్షణం ముడిపడ్డాయి. పళ్ళు బిగించి వచ్చిన కోపాన్ని దిగ మ్రింగుతున్నాడు. సుమతి మతి ఉండి మాట్లాడుతోందా? మాతృత్వం ఎంత గొప్పది? ఎంతమందో పిల్లలు కావాలని నోములూ, వ్రతాలూ, పూజలు చేసినా పిల్లలు పుట్టటం లేదు. పిల్లలు పుట్టని వాళ్ళని గొడ్రాలు అని ముద్ర వేసి అందరూ చులకనగా మాట్లాడుతూ ఉంటే పిల్లలు పుట్టని ఆడవాళ్ళు ఎంతగానో కుమిలి పోతున్నారు.
పిల్లలు అక్కర్లేదని మరో ఆడది అంటోంది. అబార్షను అంటే ఏంటి? కడుపులో ఊపిరి పోసుకుంటున్న మరో జీవిని హత్య చేయడం. ఇది ఎంత పాపం? పిల్లలకు ఆర్థిక పరిస్థితులకు లంకె పెట్టడం రామ్మూర్తికి నచ్చలేదు. ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు అంత సవ్యంగా లేకపోయినా తిరిగి సవ్యంగా మారవచ్చు కాని ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పుడే పిల్లలు పుట్టాలంటే ఎలా?
“అబార్షను చేయించడం మాత్రం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఒక జీవిని చంపుకోవడం చాలా నికృష్టమైన పని. చాలా పాపమైనది కూడా.”
“ఇక్కడ పాపం, పుణ్యం అన్న ప్రశ్న కాదు. ఏక పక్ష నిర్ణయం మంచిది కాదు. శాశ్వతంగా పిల్లలు వద్దని నేను అనటం లేదు కదా. ప్రస్తుతం వద్దంటున్నాను” సుమతి అంది.
“నీలాగే సులోచన వుంటే సుందరానికి కొడుకు పుట్టి ఉండేవాడా?సులోచనకి మాతృత్వంలో ఉన్న విలువ తెలుసు.”
“నాకు తెలియదనా? పిల్లలు కావాలని ఆమె కోరిక. అంతే కంది ఆమె. ఇప్పుడప్పుడే అక్కర్లేదు నేను అనుకుంటున్నాను. ఇది నా కోరిక.”
“నీది వ్యక్తిగత కోరిక. సమిష్టి అభిమతం కాదు. ఒక్క విషయం పిల్లలే వద్దంటే నీ పుట్టుక ఉండేది కాదు. నా పుట్టుక ఉండేది కాదు. మీ నాన్న మా నాన్న పుట్టుక ఉండేది కాదు.”
“పిల్లలు వద్దని నేననలేదు. కొన్నాళ్ళు ఆగాలంటున్నాను.”
“ఇప్పుడు అనుకుని ప్రయోజనం లేదు. ఈ విషయం వినగానే సంతోషపడవలసిన సమయాన్ని మూర్ఖపు ఆలోచన్లతో బాధ కలిగిస్తున్నావు. మనకి పెద్ద దిక్కు మామయ్య సలహా కూడా తీసుకోవాలి ఈ విషయంలో” రామ్మూర్తి అన్నాడు.
ఈ మాటలు వినగానే సుమతిరి సర్రున కోపం వచ్చింది. “ఇది మనిద్దరి మధ్యా ఉన్న సమస్య. మనిద్దరమే ఓ నిర్ణయానికి రావాలి కాని మూడో వ్యక్తిని ఈ సమస్యలోకి తీసుకురావద్దు. కుక్కలూ – పందులు కంటాయి డజన్ల కొద్దీ పిల్లల్ని. కని వీధిలో వదిలెస్తాయి. మన పిల్లల్ని అలా వదిలి వేయలేము కదా! పిల్లలకి కావల్సిన అవసరాలు తీర్చలేని పరిస్థితి ఉంటే మనకి పిల్లలెందుకు?”
“అదే నీవు పొరబడుతున్నావు. ఎంత సేపూ అవసరాలూ అవసరాలు అంటావు. ఏుటా అవసరాలు. డబ్బున్న వాళ్ళ పిల్లల్లా దర్జాగా పెంచలేక పోయినా మనకి తగ్గ విధంగా మనం పెంచుకోగలం. మనం మధ్య తరగతి మనుష్యులం అన్న విషయం మరిచి పోతున్నావు. నా పిల్లల్ని చక్కగా పెంచుకోగలను అన్న ఆత్మవిశ్వాసం నాకు ఉంది. మన కన్నా ఉన్నవాళ్ళను దృష్టిలో పెట్టుకోకుండా మన కన్నా లేని వాళ్ళను దృష్టిలో పెట్టుకోవాలి. తృప్తిపడాలి.”
“నాకు ఎలాగూ ఏ ముద్దూ ముచ్చట తీరలేదు. అలాగే నా పిల్లల జీవితం అలాగే ఉంటుందా అన్నదే నా బాధ.”
“కోరికలన్న వాటికి అంతే ఉండదు. కోరికలు అందరిలోనూ ఉంటాయి. గుడిసెల్లో ఉన్న వాళ్ళకీ ఫుట్‌పాత్‌ల మీద బ్రతుకు వెళ్ళబోస్తున్న వాళ్ళకీ కోరికలు లేవంటావా? అయితే అవి నెరవేరే ఆశ లేనప్పుడు పరిస్థితుల్తో రాజీపడి బ్రతికేస్తున్నారు. మనకున్న దాన్తో తృప్తిపడి భగవంతుడు ఈ మాత్రమేనా మనకిచ్చాడు అని తృప్తిపడ్డం నేర్చుకోవాలి.”
“అయితే నేనూ నా పిల్లలు కోరికలు చంపేసుకుని బ్రతకమనా.”
“అలా ఉండమని నేను అనడం లేదు. మనకున్న దాన్తో తృప్తిపడ్డం నేర్చుకోవాలని అంటున్నాను.”
“నేను కనుక సర్దుకుంటున్నాను. నా స్థానంలో మరెవరేనా ఉన్నా ఒక్క క్షణం ఉండకుండా నీకో దండం, నీ ఇంటికో దండం అని వచ్చిన మూడో రోజే వెళ్ళిపోయి ఉండేది,” ఉక్రోషంగా అంది సుమతి.
“లేదు.. లేదు..! సవ్యంగా కాపురం చేసుకునేది. మొగుడ్ని చక్కగా చూసుకునేది. మనకి లేనివాటి కోసం అర్రులు జాచకుండా ఉన్న దాన్తో తృప్తిపడేది. కట్టుకున్నవాడిని సుఖపెట్టేది. నీవు చేయమన్న పనని ఎవ్వరూ హర్షించరు. రామూ కనక. ఇంకా సహనంగా ఉన్నాడు. ఇదే మరోకడు అయితే నిన్ను ఇంటి నుండి గెంటేసేవాడు,” అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన భుజంగరావు అన్నాడు.
“మామయ్యా!”
“నేను వచ్చి చాలాసేపయింది. మీ ఇద్దరి మాటలూ వింటున్నాను. తాతను కాబోతున్నాను అనే సంతోషం కన్నా నా కూతురి మూర్ఖత్వానికి సిగ్గుపడ్తున్నాను. బాధపడుతున్నాను. కొంతమంది వాళ్ళు సుఖపడలేరు. ఎదుటి వాళ్ళని సుఖపెట్టలేరు. ఆ కోవకు చెందిందే నా కూతురు. రంగుటద్దాలు మాటున ప్రపంచాన్ని చూడకుండా వాస్తవిక ప్రపంచాన్ని చూస్తుందని మీ చేత వేరే కాపురం పెట్టించాను. అయినా నా కూతురిలో ఏ మార్పులేదంటే నాకు ఏు చేయాలో బోధపడటం లేదు. కనిపించకుండాపోయిన కొడుకుని తలుచుకుని బాధపడాలా ఉన్న కూతురి మూర్ఖత్వానికి చింతించాలో తెలియటం లేదు. ఈ వయస్సులో నా జీవితం ఇలా అశాంతిగా గడిచిపోవల్సిందే,” భుజంగరావు బాధగా అన్నాడు.
“మామయ్యా! ఆవేశపడకు,” రామ్మూర్తి అతడ్ని శాంతపరచడానికి ప్రయత్నిస్తున్నాడు.
“ఇది ఆవేశం కాదు. బాధ నా మనసులో ఇన్నాళ్ళూ గూడు కట్టుకుపోయిన బాధ ఈ రోజు సుడులు సుడులుగా బయటకు వస్తోంది. ముఖ్యంగా వాళ్ళమ్మ, నేను ఇద్దరం దాన్ని ఇంత మూర్ఖురాలిగా మొండిదానిగా చేశాము. ఇప్పుడు బాధపడవల్సి వస్తోంది. మీరిద్దరూ సుఖంగా ఉన్నారన్న భ్రమతో ఇక్కడికి వచ్చిన నాకు మిగిలింది అసంతృప్తే.”
“సుమతీ! తండ్రిగా నిన్ను ఆదేశించటం లేదు, బ్రతిమాలుతున్నాను. ఇలాంటి తప్పుడు పనులు చేయమని అల్లుడితో చెప్పకు,” భుజంగరావు ఆవేదనగా అన్నాడు.
ఉన్న ఆస్తినంతా తగల బెట్టి తమ జీవితాల్ని నట్టేట ముంచిన తండ్రి మీద సుమతికి భక్తి గౌరవం కంటే కోపం, జుగుప్స. అయితే తండ్రి కళ్ళలో అగుపడుతున్న కన్నీటి తెరను చూసిన తరువాత ఆమె కొద్దిగా చలించింది. ఫలితమే తన మనస్సు మార్చుకుంది.
వాతావరణంలో ప్రశాంతత చోటు చేసుకుంది. పెద్దగండం గడిచినట్టు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అధ్యాయం 22
కాలం నిరంతరం జరిగిపోతూ ఉంటుంది. అది ఆగదు, దానికి నిలకడలేదు. కదిలిపోయే కాలం వెనక్కి మళ్ళదు. అతి విలువైన కాలాన్ని వృథా చేయకుండా జీవితాన్ని ఆస్వాదించాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతే కాదు కాలం నదీ ప్రవాహంలాంటిది. అది వింటిని వదిలిన బాణంలా గతం నుండి వర్తమానం గుండా భవిష్యత్తు వైపుకు పయనిస్తుంది. దాని గతి ఏ కారణంగా మారదు. అయితే ఆ ప్రవాహం ఏక రీతిగా సాగదు. అది మలుపులు తిరుగుతుంది. వేగంగా సాగుతుంది.
గతించిన జీవితంలో మాధుర్యం లేకపోయినా చిన్న చిన్న ఆనందాలను సైతం పెద్దవి చేసుకుని అనుభవాలను గొప్పగా ఇతరులతో పంచుకుంటూ ముందుకు సాగాలి.
కాలంతో పాటే మనిషి జీవితంలో అనేక మార్పులు. భుజంగరావు మరణం రామ్మూర్తిని మరింత బాధకి గురి చేసింది. పుట్టిన కొడుక్కి మామయ్య పేరును కొద్దిగా మార్చి శేషు అని పేరు పెడుతే కూతురికి తల్లి పేరు శాంతి అని పెట్టాడు. అవతల సుందరానికి కూడా ఒక్కడే కొడుకు సుధాకర్.
సుమతి ప్రవర్తన అలాగే ఉంది. ఒకసారి బాగానే ఉంటుంది. మరో సమయంలో ఏదో అసంతృప్తి. ఆ అసంతృప్తి సమయంలోనే చిరుబిర్రులు పుల్లవిరుపు మాటలు. ఆ మాటల్లో వ్యంగ్యమే ఎక్కువ. అక్కడికి సైక్రియాటిష్ట్‌కి చూపించమని సుందరం చెప్తే తీసుకు వెళ్ళి చూపించాడు.
“ఆవిడ ఏదో అసంతృప్తితో బాధపడ్తున్నారు. ఆవిడికి కావల్సినవి కనుక్కుని సంతృప్తిగా ఉంచడానికి ప్రయత్నించండి” సైక్రియాటిష్ట్ చెప్పాడు. అప్పటికి రామ్మూర్తి సుమతిని సంతోషంగా ఉంచడానికి ఎన్నో విధాల ప్రయత్నించేవాడు. సులోచన కూడా సుమతికి సలహాలు ఇయ్యడం మానేసింది. తన సలహాలు ఆవిడ పాటించదు కదా తన మీద వ్యతిరేక భావం ఏర్పడుతుందని.
రామ్మూర్తికి పిల్లలంటే ప్రాణం. వాళ్ళు నవ్వుతూ ఉంటే వాళ్ళ నవ్వుల్లో తనలోని బాధను మరిచిపోవడానికి ప్రయత్నించేవాడు. పిల్లలకి కూడా తండ్రి అంటే ఎంతో అభిమానం. ఆడపిల్లకి తల్లి మీద కంటే తండ్రి మీదే అభిమానం ఉంటుంది అంటారు. అది సహజం. అయిదే కొడుకు శేషు కూడా ఒక్క క్షణం తనని వదిలిపెట్టి ఉండేవాడు కాదు. స్కూలు నుండి వచ్చిన తరువాత రామ్మూర్తి కాలక్షేపం వాళ్ళతోనే.
అమ్మా అనే పిలుపుకి బదులు ఎప్పుడూ “నాన్నగారూ.. నాన్నగారూ!” అంటూ అతని చుట్టూనే తిరిగేవారు. ఇది సుమతికి నచ్చేది కాదు. ఈర్ష్య భావం కలుగుతోందా సుమతిలో అని రామ్మూర్తి అనుకునేవాడు. ఎందుకంటే ఇంత చాకిరీ వాళ్ళకి నేను చేస్తూ ఉన్నా అమ్మ కంటే వాళ్ళకి నాన్నే ఎక్కువ. వీళ్ళు అమ్మ పిల్లలు కాదు నాన్న పిల్లలు అనేది.
శేషుకి చిన్నప్పుడు అనారోగ్యం చేస్తే కంపౌండరు ఇంజక్షను చేయడానికి వస్తే తండ్రిని గట్టిగా పట్టేసుకుని ఏడ్చేవాడు. వాడు అలా ఏడుస్తూ ఉంటే రామ్మూర్తికి కూడా ఏడుపు వచ్చేసేది. తమాయించుకునేవాడు. తండ్రీ పిల్లల మధ్య ఇంత అనుబంధం ఉండేది. రాత్రి సమయంలో కూడా వాళ్ళు తండ్రి ప్రక్కనే పడుకునేవారు.
రోజులు గడుస్తున్నాయి. పిల్లల వయస్సులు పెరుగుతున్నాయి. వాళ్ళ అవసరాలు పెరుగుతున్నాయి. వాళ్ళ ఆలోచనా ధోరణి మారుతోంది. వాళ్ళలో ఏదో అసంతృప్తి భావం అసహనం గమనించాడు. “మన నాన్నగారు ఇంత పిసినారిగా తయారవుతారని నేను అనుకోలేదు. మా క్లాసు వాళ్ళందరూ ఐస్ క్రీమ్‌లు కొనుక్కుని తింటూ ఉంటే నోరు వెళ్ళ బెట్టి చూడ్డమే నా పని. వాళ్ళలా దర్జాగా ఉండక్కర్లేదు. మన చిన్న చిన్న కోరికలు కూడా తీరటం లేదు” చెల్లెలు దగ్గర తన అసంతృప్తి వెళ్ళడి చేసేవాడు శేషు.
“నా పరిస్థితి అంతే. మా క్లాసులో నీరజ అనే అమ్మాయి ఉంది. దానికి చాలా పొగరు. గొప్పింటి వాళ్ళ అమ్మాయి కదా. రోజూ నన్ను ఆటపట్టిస్తూ ఉంటుంది. చులకనగా మాట్లాడుతూ ఉంటుంది. నీకు వేరే డ్రెస్‌లు లేవా? ఎప్పుడూ ఇవే డ్రస్సులు వేసు కొస్తావు అని అంటుంది. నాకు చాలా బాధ వేస్తుంది,” శాంతి అంటోంది.
పిల్లలు మాటలు అతనికి బాధ కలిగించాయి. ‘వీళ్ళు ఇలా ఉండడానికి కారణం ఇదా?’ అని అనుకున్నాడు. తన భావోద్వేగాలు సుందరంతో పంచుకోవాలి. లేకపోతే తన మనస్సు తేలికపడదు. అందుకే తను ఒక్కడే సుందరాన్ని కలవడానికి వెళ్ళాడు ఓ ఆదివారం నాడు.
సుందరం కొడుకు సుధాకర్ మాట తీరు, ప్రవర్తన రామ్మూర్తిని కట్టిపడేసాయి. “సుందరం నీవు మంచి తండ్రి వయ్యావు కాని నేను మంచి తండ్రిని కాలేకపోయాను” బాధగా అన్నాడు.
‘ఏదో జరిగింది లేకపోతే రామూ ఇంత భావోద్వేగానికి లోనవ్వడు,’ అని అనుకుంటూ ఉండగానే సులోచన ఇద్దరికీ టీ, స్నాక్సు ఇచ్చి కుశల సమాచారాలు అడిగింది. అన్యమనస్కంగానే సమాధానమిచ్చాడు. ఇతని మనసేమీ బాగులేదనిపిస్తోంది. ఆ ఇంట్లో ఇది సహజమే అనుకున్న సులోచన అక్కడి నుండి లోనికి వెళ్ళింది.
“ఏుటి విషయాలు?” సుందరం అడిగాడు. విషయం అంతా వివరించాడు రామ్మూర్తి. గాఢంగా నిట్టూర్పు విడిచాడు సుందరం.
“రామూ! ఒక్క విషయం. మనిషి మనసుకు నచ్చని ఏ విషయమైనా బాధగా మారుతుంది. మనిషి మనిషికీ ఇష్టాఇష్టాలు మారుతూ ఉంటాయి. కాలం మారుతోంది మనుష్యుల జీవితాలు మారుతున్నాయి. ఆలోచనలు, అభిరుచులు మారుతున్నాయి. మన కాలం వేరు. మన జీవన విధానం వేరు. నీవు మీ మామయ్య దగ్గర పెరిగావు. నేను ప్రేమ సమాజంలో పెరిగాను. మనం అనేక సమస్యలు ఎదుర్కున్నాం. స్కూల్లో పిల్లలు అన్నీ కొనుక్కుంటూ ఉంటే మనం కూడా అలాగే కొనుక్కుని తినాలనే కోరిక. నీకూ అలాగే అనిపించి ఉండచ్చు. అయితే మాకు డబ్బులు ఇచ్చే వాళ్ళు లేరు. నీకూ మీ మామయ్య ఇయ్యలేదు. మనం మన కోరికల్ని మనసులోనే దాచేసుకున్నాం, అవునా కాదా!”
“అవును, నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చెప్పావు.”
“నేను అటువంటి బాధను అనుభవించేను కాబట్టి మా అబ్బాయికి నెలనెలా పాకట్ మనీగా ఇస్తాను. లగ్జరీ జీవితాలు గడిపే పిల్లలు తల్లిదుడ్రుల్లా ఈయకపోయినా, ఎంతో కొంత ఇయ్యాలి.”
“అదే నేను చేసిన పొరపాటు. నా పిల్లల్లో ఇలాంటి నెగిటివ్ ఆలోచన్లు రావడానికి కారణం నేనే,” బాధగా నుదురు కొట్టుకున్నాడు రామ్మూర్తి.
“బాధ పడకు. ప్రేమ సమాజంలో ఉండటం వలన చాలామంది వ్యక్తులు వచ్చేవారు. వాళ్ళ ఇళ్ళకి మమల్ని తీసుకెళ్ళి భోజనాలు పెట్టేవారు. అందుకే అందరి మనస్తత్వాలు మాకు తెలిసినంతగా నీకు తెలియవు. ఎంతసేపూ గ్రామంలోనే పెరిగావు. గ్రామ జీవితం ప్రభావం నీ మీద ఉండటం వలన సమాజంలో వున్న మనుష్యులు వారి తీరు తెన్నులు చూసే అవకాశం నీకు కలగలేదు. ఈ లోకజ్ఞాన విషయాలు ఏ పుస్తకంలో ఉండవు. మనం వున్న పరిసరాల నుండి బయటకు వస్తే అప్పుడు తెలస్తాయి. కొన్ని విషయాలు గ్రామ వాతావరణం నుండి బయటకు వచ్చిన తరువాత నీకు తెలిసే ఉంటాయి కాని అవి చాలదు,” సుందరం అన్నాడు.
అతను చెప్తున్న ప్రతీ విషయం అక్షర సత్యం. ఇన్నాళ్ళూ తను గిరిగీసుకుని కూర్చుని తన పరిధిలోనే ఉండిపోయాడు. సుమతితో ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం వల్ల తన మెదడు కూడా విస్తృతంగా ఏ విషయాన్ని ఆలోచించకుండా మొద్దుబారిపోయింది.
ఇప్పటి తండ్రులు తన పిల్లల్ని మంచి పౌరులుగా మలచడానికి జీవితాన్నే సమిధగా మారుస్తున్నారు. వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళు తమ కాళ్ళపై తాము నిలబడే దాకా అదే జీవితంలో స్థిరబడే దాకా తమ సహాయం అందిస్తున్నారు. పిల్లల సుఖ సంతోషాల కోసం క్రొవ్వొత్తిలా కరిగిపోతున్నారు. పిల్లల మెదడులో పుట్టిన చెడు భావాలు తొలగించి మంచి భావాలు కలగచేయడానికి ప్రయత్నిస్తున్నాడు తండ్రి. పిల్లలు సమస్యలను దూరం చేస్తున్నాడు తండ్రి. అక్రమ మార్గంలో నడిచే తన పిల్లల్ని సక్రమ మార్గంలో నడిపించే మార్గదర్శకుడు అవుతున్నాడు తండ్రి. వాళ్ళ వెన్ను తండ్రి తట్టి వాళ్ళను విజయ పథంలో నడిపిస్తున్నాడు.
ఓటమి పొంది నిరాశతో కుమిలిపోతున్న పిల్లల్లో నిరాశను పారద్రోలి ఆశా జ్యోతిని వెలిగిస్తున్నారు. పిల్లల్ని గమ్యం చేర్చడానికి అలుపెరుగని రథసారథి తండ్రి. చూపులతోనే తన దూరంగా ఉన్న పిల్లలకు ఎదగడం నేర్పిస్తున్నాడు తండ్రి. పిల్లలు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే నిచ్చెనలా నిలబడతాడు తండ్రి. అతను పైకి కఠినాత్ముడుగా అగుపడినా పిల్లల రేపటి భవిష్యత్తు కోసం ఆయన పడే తపన ఇంతా అంతా కాదు.
పిల్లలకి కష్టం కలిగినప్పుడు కంటి పాపై అవసర సమయంలో తన ఆపన్న హస్తం అందిస్తూ అనుక్షణం తన పిల్లల క్షేమానికి ఆరాటపడతాడు. వాళ్ళకి ఆత్మస్థైరాన్ని నేర్పిస్తాడు తండ్రి. వాళ్ళకి బతుకు పోరాటంలో తండ్రి వారి తప్పులను సరిచేసి వాళ్ళను విజయపథంలో నడిపిస్తాడు. ఉద్యోగం రాలేదని నిరాశతో కొట్టుకుపోతున్న పిల్లవాడికి ఆశ అనే గడ్డిపోచ అయి ఒడ్డుకు లాగుతాడు. సుడిగుండంలో కొట్టుకుపోతున్న పిల్లవాడిలో ఆత్మస్థైరాన్ని కలిగించే వాడే తండ్రి.
తండ్రీకి పిల్లలకి మధ్య అనుబంధం అంతా ఇంతా కాదు. పిల్లల జన్మకి కారకుడు తండ్రి. జీవన ప్రదాత. పిల్లలు ఉన్నతికి ఆధారం తండ్రి. తండ్రిలేని ఇల్లు సింహ ద్వారం లేని కోట లాంటిది. తన శక్తిని డబ్బుగా మార్చి పిల్లల భవిష్యత్తుకి వినియోగిస్తాడు. తనుపడ్డ కష్టాలు పిల్లలు పడకూడదు అని అనుకుంటాడు. అయితే కొడుకు కన్నా కూతురికే తండ్రి మీద ప్రేమ ఎక్కువుగా ఉంటోంది. అయినా మగపిల్లవాడి మీద కూడా తండ్రికి ప్రేమ ఉంటుంది.
తండ్రి మమకారం బాల్యంలో చవి చూసిన పిల్లలు పెద్దయ్యాక తండ్రి పట్ల అంత గౌరవంతో మెలగలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో తండ్రీ కొడుకుల మధ్య అనురాగ బంధం ఉన్నా కొన్ని చోట్ల ఆటు పోట్లకి గురవుతోంది. డబ్బుకి ప్రాధాన్యత పెరిగిపోయి బంధాలు ఆర్థిక సంబంధాలుగా మారి విలువలకి తిలోదికాలు ఇస్తున్నారు. వృద్ధులైన తల్లిదుడ్రుల్ని వృద్ధాశ్రమాల్లో విడిచి పెడ్తున్నారు.
మరో విషయం కుటుంబ వాతావరణంలో భార్యా భర్తలిద్దరూ భాగస్వాములే. సంసారం అనే బండీకి ఇద్దరూ రెండు చక్రాలులాంటి వాళ్ళు భార్యాభర్తలు. బండికి ఉన్న రెండు చక్రాల్లో ఏ ఒక్క చక్రం విరిగి పోయినా ఆ బండి వొరిగి పోతుంది. అస్తవ్యస్తంగా తయారవుతుంది సంసారమనబడే బండి.
మీ భార్యాభర్తల మధ్య నున్న కలతలే పిల్లల జీవితాల మీద ప్రభావం చూపుతుంది. ఇటువంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు శారీరకంగా ఎదుగుతారు కాని మానసికంగా కుంగుబాటుకి గురవుతారు. ఇటువంటి వాతావరణం ఆరోగ్య ప్రదం కాదు.
మీ పిల్లలు, మా పిల్లాడు కౌమార దశలో ఉన్నారు. వారిలో శారీరకంగా మానసికంగా మార్పులు సహజం. భావోద్వేగపరంగా సామాజికంగా వేగంగా అభివృద్ధి చెందుతూ కొత్త సామర్థ్యాన్ని పెంపొందదించుకుంటూ కొత్త పరిస్థితుల్ని ఎదుక్కొనే దశ ఇది. మానసికంగానే కాదు శారీరక మార్పులు, భావోద్వేగపరమైన ఒత్తిడి, అలసట ఇవన్నీ కాక చిరాకు, భయం ఆందోళన, స్థిమితం లేకపోవడం మొదలైన లక్షణాలు అగుపడ్తాయి.
చిన్న విషయాలకు అప్రదానమైన అంశాలకు భావోద్వేగపరంగా చలించిపోవడం ఈ వయసు వారిలో సహజం. తాము చిన్న పిల్లలం కాదని పెద్ద వాళ్ళమయ్యామన్న భావన వాళ్ళలో ఉంటుంది. అందుకే పెద్ద వాళ్ళ మాట వినడానికి ఇష్టపడరు. స్వంత నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. అందరూ తమని గుర్తించాలనుకుంటారు.
తల్లిదండ్రుల్ని ఎదిరించి మాట్లాడ్డం. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వారి మాటలను లెక్క చేయకపోవడం జరుగుతుంది. కొంతమందికి చదువు మీద శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపకాల మీదే మక్కువ. కొంతమందిలో గ్రహణ శక్తి అధికంగా ఉంటుంది. వీరు ఇతరులు మీద ఆధారపడకుండా స్వతంత్రంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తారు. కొన్ని నైపుణ్యాలు నేర్చుకుంటారు. కొంత వయసు వచ్చాక స్నేహితుల సంబంధాలలో మార్పులు వస్తాయి. తక్కువు మంది స్నేహితులతో స్నేహం చేస్తారు. కొంతమందిలో శాడిష్టు మెంటాల్టీ కలిగి ఉండి ఎదుటి వాళ్ళుని బాధపెట్టి వాళ్ళు బాధపడ్తూ ఉంటే పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు.
ఈ కౌమార దశలో ఏర్పరుచుకున్న ప్రవర్తనారీతులు కొన్ని మారుతాయి. కొన్ని జీవితాంతం కొనసాగుతాయి. వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్ని చెడు అలవాట్లకి ఈ వయసు వారు బానిసలయిన వారూ ఉన్నారు. ఈ దశలో జీవన నైనుణ్యాలు అధికంగాను, సునిశితంగానూ అభివృద్ధి అవుతాయి. ఈ దశలో స్నేహితుల ఒత్తిడితో అనేక అలవాట్లు నేర్చుకునే అవకాశం ఉంది అవి మంచివైనా, చెడ్డవైనా.
అందుకే తల్లిదుడ్రుల పర్వవేక్షణ ఎక్కువుగా ఉండి వాళ్ళను మంచి వేపు నడిపించడానికి ప్రయత్నించాలి” సుందరం పెద్ద లెక్చరిచ్చినట్టు అన్నాడు. వింటున్నాడు రామ్మూర్తి.
‘చిన్నప్పుడు తన స్కూలు నేచరల్ సైన్సు మాష్టారు ఈ కౌమార దశ అదే టీనేజ్ గురించి వివరించారు. ఇప్పుడు సుందరం వివరించాడు,’ రామ్మూర్తి అనుకున్నాడు.
(ఇంకా ఉంది)
విజయనగరం వాస్తవ్యులైన శ్రీ గూడూరు గోపాలకృష్ణమూర్తి హిందీ ఉపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. వారు రాసిన కథలు వివిధ వార్తపత్రికల్లో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు సంకలనంగా వెలువడ్డాయి.