Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మలుపులు తిరిగిన జీవితాలు-10

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[రామ్మూర్తి, సుమతి పర్యాటక కేంద్రాలు చూసి తిరిగి గ్రామానికి బయలుదేరడానికి తయారవుతుంటారు. ముందు రోజు రాత్రి రెండు జంటలు వెన్నెల్లో కూర్చుని మాట్లాడుకుంటారు. భార్యాభర్తలు మసలుకోవాల్సిన తీరు గురించి సుందరం వివరిస్తాడు. భార్యాభర్తలిద్దరూ సఖ్యతగా ఉండాలని ఆ మాటల ద్వారా సుమతికి అర్థమవుతుంది. రామ్మూర్తి దంపతులకు బట్టలు పెడతారు సుందరం, సులోచన. తాము వాళ్ళకి బట్టలు తేనందుకు నొచ్చుకుంటాడు రామ్మూర్తి. మర్నాడు బస్‌స్టాండు వరకూ వచ్చి రామ్మూర్తిని, సుమతిని బస్సెక్కిస్తారు. బస్సులో రామ్మూర్తి, సుమతి ఎవరి ఆలోచనల్లో వారుండిపోతారు. రామ్మూర్తి దంపతులని బస్సెక్కించి, ఇంటికి వెళ్ళిన సుందరం, సులోచన – వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు. సుమతి ఆలోచనా ధోరణి తనకి విచిత్రంగా అనిపించిందనీ, అందుకు కారణం ఆమె పెరిగిన వాతావరణం కావచ్చని అంటుంది సులోచన. దాంపత్య జీవితంలో కావల్సింది నిదానమని అంటాడు సుందరం. తన కొలీగైన మరో టీచర్ గారి భర్త స్వభావం గురించి చెప్తుంది సులోచన. దంపతుల మధ్య మూడో మనిషి జోక్యం ఉండకూడదని సుందరం అంటాడు. భార్యాభర్తలిద్దరూ మానసికంగా స్థిరత్వం ఏర్పరుచుకుని సమస్య ఉత్పన్నం అవకుండా చూసుకోవాలని చెప్తాడు సుందరం. – ఇక చదవండి.]

అధ్యాయం 19

సంతోషంగా ఊర్లు తిరగడానికి వెళ్ళిన కూతురు, అల్లుడు గంభీరంగా తిరిగి రావడం చూసి భుజంగరావులో అనేక ఆలోచనలు. ‘ఈ తిక్కది ఇంకా మారలేదా? ఇలా లాభం లేదు. ఇద్దరి చేత కాపురం పెట్టించాలి. అలా అయినా నా కూతురులో మార్పు వస్తుందేమో’ అని అనుకున్నాడు.

అయితే సుమతి మునపటంత విముఖత రామ్మూర్తి మీద చూపకుండా అతనికి అవసరమైన పనులు అన్నీ మౌనంగా చేసుకుపోవడం ఒకింత సంతోషాన్ని కలిగించింది. తను ఇక్కడ వాతావరణం నుండి దూరంగా ఉంటే కూతురిలో తప్పక మార్పు వస్తుంది అని అనుకున్నాడు. అందుకే సుమతితో “అల్లుడు అక్కడ చేయి కాల్చుకుని కష్టపడుతున్నాడు. అందుకు మీరిద్దరూ ఒక దగ్గర ఉండడం మంచిది. ఇక్కడ నా తిప్పలు నేను పడతాను,” అన్నాడు.

తండ్రి మాటలు ఆ కూతురుకి సంతోషం కలిగించలేదు. అలా అని విచారాన్ని కలిగించలేదు. నిర్లిప్తంగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. మౌనం అర్థాంగీకారం అని అనుకున్నాడు ఆ తండ్రి ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాడు.

తన ఉద్దేశ్యాన్ని అల్లుడికి తెలియచేసాడు. “నీవు ఒక్కడివీ ఇక్కడ ఉండటం ఎందుకు? నీవూ మాతో వచ్చేయ్‌!” మామయ్యతో అన్నాడు. అల్లుడు మాటలు భుజంగరావు మనస్సులో అమృత వర్షాన్ని కురిపించాయి. పన్నీటి జల్లు కురిపించాయి. అతని వదనం సంతోషంతో వికసించింది. ఇన్నాళ్ళూ తను అనుభవించిన మానసిక క్షోభ ఉపశమనం లభించినట్టుయంది.

“లేదు.. లేదు. మొదట మీరిద్దరూ కాపురం పెట్టవల్సిందే. ఇప్పటికే ఆలస్యమయింది. సుందరం, సులోచన వస్తారు మీచేత కొత్త కాపురం పెట్టించడానికి. నీకు ఆప్తులు వాళ్ళే కదా!”

అయితే రామ్మూర్తిలో సందేహం. మామయ్య ఆలోచన బాగుంది కాని సుమతి మొదట దీనికి ఒప్పుకోవద్దూ?

“నీ భావం నాకు అర్థమయింది. సుమతి అంగీకరించవద్దూ అన్నదే నీ సందేహమయితే దాన్ని వెంటనే నీ మనస్సులో నుండి తీసేయ్యి. నేను సుమతితో మాట్లాడిన తరువాతే నీతో మాట్లాడుతున్నాను. అది ఎందుకు ఒప్పుకోదు? నీవు తాళి కట్టిన భార్య. పెళ్ళి అవనంత వరకే ఇక్కడ పిల్ల. పెళ్ళయిన వెంటనే అక్కడ ఇల్లాలు.

అంతేకాదు నా పరిస్థితీ చూస్తున్నావు కదా? నేను ఎన్నాళ్ళు బ్రతుకుతానో చెప్పలేను. నేను ఉన్నంత వరకూ పరవాలేదు. సుమతి మొండికేసి కూర్చుంటే తరువాత దాని పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచించే సుమతిని ఒప్పించాను. అంతేకాదు ఇక మీదట సుమతి మంచి చెడ్డలు. కష్టసుఖాలు అన్నీ నీవే చూసుకోవాలి. కొద్దిగా తిక్క పిల్ల కాని లేకపోతే మంచిదే. పరిసరాలు మారితే సుమతిలో మార్పు వస్తుందన్న ఆశ నాది. దానికి నేను నచ్చజెప్తాను” భుజంగరావు అన్నాడు.

తలుపు చాటు నుండి వింటోంది తండ్రి మాటలు సుమతి. ఇప్పుడు ఆమెలో వ్యతిరేక భావాలు లేవు. అన్నీ అనుకూల భావాలే. దానికి కారణం ఊరు నుండి వచ్చిన తరువాత సుందరం, సులోచన కాపురం చూసిన తరువాత ఆత్మవిమర్శ చేసుకుంది. యథార్థ స్థితిని గ్రహించింది. తను వివాహిత. వివాహిత స్థానం భర్త దగ్గర. మొండికేసి తను తండ్రి దగ్గరే ఉండిపోతాను అని పట్టుబడితే నష్టపోయేది తన జీవితమే. ఎందుకంటే తన తండ్రి జీవిత చరమాంకంలో ఉన్నాడు.

అంతేకాదు బావ కూడా ఎంత సహనపరుడు? పెళ్ళయినప్పటి నుండి ఇప్పటి వరకూ బ్రహ్మచర్యం పాటిస్తున్నాడంటే అతని వ్యక్తిత్వాన్ని మెచ్చుకోక తప్పదు. మనిషికి మంచి వ్యక్తిత్వమే ఆభరణం. బావ స్థానంలో మరెవరయినా ఉంటే బలవంతంగానైనా తన దారికి తెచ్చుకునేవాడు. అలా లేని పక్షంలో పెడదార్లు పట్టేవాడు. అలాంటిది ఏదీ లేకుండా నిగ్రహంగా ఉన్నాడంటే అతని వ్యక్తిత్వమే అలాంటిది. ఇలా అనుకుంటున్న సుమతి మనస్సులో స్నేహితురాండ్రు తలంపు రాగానే ఏదో అసంతృప్తి. తిరిగి నెగిటివ్‌ ఫీలింగ్సు, తిరిగి పాజిటివ్‌ దృక్పథం.

లాభం లేదు తను ఇక్కడ ఉంటే ఇలాంటి భావాలు రాక తప్పవు. ఈ పరిసరాలకి దూరంగా వెళ్ళిపోతే తన మానసిక స్థితిలో మార్పు వస్తుంది. తిరిగి ఆమె ఆలోచన ఇలా డోలాయమాన పరిస్థితిలో ఆమె మనస్సు ఊగిసలాడుతోంది.

రామం స్కూలుకి దగ్గరగా ఓ మోస్తరు ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. మంచి రోజు చూసుకుని పాలు పొంగించారు. రామ్మూర్తి సుమతి చేత సుందరం దంపతులు భుజంగరావు కూడా కూతురు, అల్లుడు కొత్త కాపురం చూడ్డానికి వచ్చాడు. అందరి ముఖాల్లో ఆనందం. పెదవులపై చిరునవ్వు.

తిరిగి వెళ్తున్న సమయంలో సులోచన సుమతితో “నీవు అసలే బోళా మనిషివి. అమాయకురాలివి. అందుకే అందరూ నీకు మంచి వాళ్ళలాగ అగుపిస్తారు. కాని మన చుట్టూ ఉన్న మనుష్యులు అందరూ మంచి వాళ్ళుండరు. అందరూ అలా ఉండకపోయినా, కొంతమంది ఇలాంటి వాళ్ళు మనకి తారసపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఇంటి విషయాలు వాళ్ళకి చెప్పకూడదు. మన గుట్టులాగడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు. అయినా మనం చలించకూడదు” ఇలా హితబోధ చేసింది. సుమతి అలాగే అన్నట్టు తలూపింది.

సుమతిలో ఇంత తొందరగా మార్పు వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు.

“ఇదంతా మీ దంపతులు పుణ్యమే” అంటాడు రామ్మూర్తి.

“లేదు.. లేదు.. నీలో ఉన్న సహన గుణమే దీనికంతటికి కారణం” అంటాడు సుందరం.

ఏది ఏమైతేనేమి రామ్మూర్తి జీవితం ఒక దారిని పడింది. అందుకే ఇది అందరికి ఆనందాన్ని కలిగించింది. సుందరం, సులోచన అలా వెళ్ళిపోతే రామ్మూర్తి భుజంగరావుని, సుమతిని తీసుకుని గ్రామానికి బయలుదేరాడు.

‘ఇక స్కూళ్ళు తెరుస్తారు. స్కూళ్ళు తెరిచే లోపు కావల్సిన సామాన్లు ఇంటికి అవసరమైనవి కొనాలి’ అనుకున్న రామ్మూర్తి ఆ ప్రయత్నంలో ఉన్నాడు. కావల్సినవి ఓ కాగితంపై వ్రాసి ఇచ్చింది సుమతి రామ్మూర్తికి.

అధ్యాయం 20

“మీరు ఆ ఇంట్లో దిగారు. కాని పక్కింటావిడ దగ్గర జాగ్రత్తగా ఉండాలి,” తెలిసిన వాళ్ళు రామ్మూర్తిని హెచ్చరించారు. వాళ్ళు చెప్పిన విషయం ఏుటంటే ఆ ఇంటి యజమానురాలు ధనమ్మ ఇంట్లో దిగిన వాళ్ళతో మొదట్లో వరసలు కలిపేసి చనువుగా మాట్లాడుతుంది. ఆమె భర్త ముకుందం చాలా మెతక మనిషి. రోజూ ఉదయం వెళ్ళిన మనిషి రాత్రి అయితే కాని రాడు. ధనమ్మ ఓ మహారాణిలా ఇల్లు ఇల్లూ, వీధి వీధి తిరిగి ఇంటికి వస్తుంది. మొగుడ్ని ఓ వాజమ్మను చేసి తిడుతుంది.

“నా పరువు తీయకే. నేను నీకు ఏం అడ్డొచ్చాను,?” అంటూ ఏకాంత సమయంలో భార్య కాళ్ళు పట్టుకుని బతిమాలుతాడు. ఆమె మరీ పెట్రేగి పోయి అతడ్ని పచ్చిగా తిడుతుంది. అది అలా ఉంచితే ఇంట్లో అద్దెకు దిగిన వాళ్ళతో మొదట వరసలు కలిపి చనువుగా మాట్లాడుతుంది. ఆ తరువాత చూసినవన్నీ అడుగుతుంది. అప్పులు అడుగుతుంది, తిరిగి తీర్చదు.

అద్దెకున్న వాళ్ళ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. వేలు చూపిస్తే మండమింగే రకం. అందుకే ఎవరూ ఎక్కువ రోజులు అక్కడ ఉండరు. మొదట సుమతితో చనువు పెంచుకుని ఆ తరువాత కాఫీ పొడి నుండి పంచదార వరకూ అన్ని వస్తువులు అప్పులడిగేది. తీర్చే ప్రసక్తే లేదు.

ఆ తరువాత వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుని కుటుంబ విషయాలు కూపీలాగేది. సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించేది. సుమతి మొదట్లో ఆమె ప్రభావంలో పడి కొన్ని విషయాలు చెప్పింది. రామ్మూర్తి హెచ్చరించడంతో జాగ్రత్త పడింది. అంతేకాదు సులోచన ఇచ్చిన సలహాలు, జాగ్రత్తలు జ్ఞాపకం వచ్చి ధనమ్మ దగ్గర మరింత జాగ్రత్తగా ఉండడం నేర్చుకుంది.

అందుకే మొదట ఎంతో ఆప్యాయత ఒలకపోసిన ధనమ్మ రాను రాను సుమతి మీద రుసరుసలాడేది. విసుక్కునేది. తగవులకు చూసేది. మొదట్లో ఆమె స్వభావం తెలియదు కాబట్టి సుమతి అన్ని విషయాలూ చెప్పేసేది. అందుకే సుమతి ఇప్పుడు జాగ్రత్తపడ్డం చూసి మంటగా ఉంది ధనమ్మకి.

రామ్మూర్తికి కూడా సుమతి ధనమ్మతో చనువుగా మొదట్లో ఉండటం నచ్చలేదు. ఎందుకంటే భర్త యడల ఆమె ప్రవర్తన, ఆమె స్వభావం తెలిసిన తరువాత, ఆమె అతిచనువు, మాటతీరు, బాగులేదనిపించింది. అసలే సుమతికి తనకి మధ్యనున్న సంబంధం అంత సజావుగా లేదు. ధనమ్మ మొగుడు దగ్గర ప్రవర్తించిన తీరు చూసి సుమతి కూడా అలాగే తయారవుతుందేమోనని అతని బాధ. అందుకే సుమతికి ధనమ్మతో అతి చనువు పెంచుకోవద్దని హెచ్చరించాడు.

పాలు పొంగించడానికి వచ్చినప్పుడు సులోచన కూడా ధనమ్మ స్వభావాన్ని చూచాయగా పసిగట్టింది. అందుకే సుమతిని మరింత హెచ్చరించి వెళ్ళింది. ఓ పర్యాయం జరిగిన సంఘటన రామ్మూర్తికి గుర్తుకు వచ్చింది. తనకి తెలియకుండా సుమతిని ధనమ్మ సుమతి వారిస్తున్నా సినిమాకు తీసుకు వెళ్ళింది. స్కూల్లో మీటింగు అవడం వల్ల తను ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. వేసిన తాళం తనని వెక్కిరించింది. తన కనుబొమ్మలు ఒక్కసారి ముడిపడ్డాయి. దవడ ఎముక ఒక్క క్షణం కదిలింది కోపానికి. కళ్ళలో ఎర్రటి జీర. అది తనకి ఎక్కువ కోపం వచ్చిందనడానికి చిహ్నం. మరోవంక తల నొప్పిగా ఉంది. మరోపక్క ఆకలిగా వుంది. వీధి గుమ్మంపై చతికిలిబడి కూర్చున్నాడు.

“తమ్ముడు గారూ! నేను మా మరదల్ని సినిమాకు తీసుకువెళ్ళాను. ఆమె తప్పు ఏం లేదు. ఆమెను ఏం అనకండి” అంది ధనమ్మ. తను మౌనం వహించాడు. చెప్పకుండా సినిమాకు వెళ్ళి వచ్చినందుకు సుమతి క్షమాపణ కోరుకుంటుందని తను అనుకున్నాడు. తాను ఆశించింది జరగలేదు. తన అహం దెబ్బతింది. మౌనంగా వెళ్ళి తలనొప్పి మాత్ర వేసుకుని ఇన్ని నీళ్ళు త్రాగి ఏం తినకుండా పడుకున్నాడు.

జరిగిపోయిన విషయాన్ని నెమరు వేసుకుంటున్న రామ్మూర్తి ‘మరి ఇక్కడుండడం శ్రేయస్కరం కాదు. ఇక్కడే ఉంటే కాపురాలు కూలిపోతాయి,’ అని అనుకున్నాడు. ‘ఎక్కడికి వెళ్ళినా ధనమ్మలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి’ తిరిగి అనుకున్నాడు.

మరి ఆలస్యం చేయకుండా ఇళ్ళు వేటలో పడ్డాడు. స్కూలు నుండి వచ్చాక అద్దె ఇల్లు కోసం వెతుక్కోడమే అతని పనిగా మారింది.

(ఇంకా ఉంది)

Exit mobile version