Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మలుపులు తిరిగిన జీవితాలు-1

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

అధ్యాయం 1

ఉదయం తొమ్మిది గంటల సమయం. స్కూలు వాతావరణం మహా సందడిగా ఉంది. స్కూలు వార్షిక పరీక్షలు ఆరంభమయ్యాయి. విద్యార్ధులు గంట శబ్దం వినగానే బిలబిలమంటూ వాళ్ళకి కేటాయించిన పరీక్ష హాలులోకి అట్టలు పెన్నులు పట్టుకుని ప్రవేశిస్తున్నారు. అంత వరకూ చదువుదామని తెచ్చిన పుస్తకాల్ని బయట వరండాలో పడవేసారు.

రామ్మూర్తి మాష్టారు ప్రశ్నాపత్రాలు, స్కూల్‌ స్టాంప్‌ వేసిన ఆన్సరు పేపర్లు పట్టుకుని వరండాలో నడుచుకుంటూ తనకి కేటాయించిన రూమ్‌ వేపు అడుగులు వేస్తున్నారు. అతని గురించి చెప్పుకోవాలంటే అతను సిన్సియారిటీని అభిమానించే సగటు మనిషి. సిన్సియారిటీకి మారు పేరు ఆయన.

‘యముడు వస్తున్నాడ్రా! ఏ రూమ్‌ వాళ్ళు చేసుకున్నారో పాపం, బుర్రలు పక్కకి తిప్పనీయడు. స్లిప్‌లు వ్రాయనీయడు’ భావి పౌరులైన విద్యార్ధులు గుసగుసలు.

తనకి కేటాయించిన రూమ్‌లోకి ప్రవేశించారు ఆయన. ‘చచ్చాంరా భగవంతుడా! ఈ చాదస్తం ముండా కొడుకు దాపురించాడు. ఈ రోజు మనం లేచిన వేళ బాగులేదు’. ఇలా మనస్సులోనే ఓ వేపు దిగులు, మరో ప్రక్క భయంతో అనుకుంటున్న విద్యార్థులు కొందరయితే బాగా చదివి పరీక్ష వ్రాస్తామన్న ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం ఉన్నవాళ్ళు మరికొందరు.

తనకి ఎవరి భావాలతో సంబంధం లేనట్లు చకచకా ఆన్సరు పేపర్లు పంచి ఆ తరువాత ప్రశ్నాపత్రాలు విద్యార్థులకి అందచేసిన ఆయన సంతృప్తిగా శ్వాస తీసుకున్నారు.

ప్రశ్నాపత్రం చదువుతున్న వారు కొందరయితే ఆన్సరు పేపరు మీద తమ నెంబరు, మిగతా వివరాలు వ్రాస్తున్నారు మరికొందరు. ప్రశ్నాపత్రం చదివిన వాళ్ళకి తాము చదివిన ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో ఉంటే సంతోషంగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటే, తాము చదివిన ప్రశ్నలు, జవాబులు ప్రశ్నాపత్రంలో లేకపోతే దిగులుతో అలా కూర్చున్న వాళ్ళు మరికొందరు. ఆన్సరు పేపరు మీద టైపు మిషను మీద టైపు చేస్తున్నట్లు చకచకా వ్రాసుకుపోతున్నారు బాగా చదివినవాళ్ళు.

పరీక్ష ఆరంభమయి అప్పుడే పదిహేను నిమిషాలు అయిపోయాయి. అప్పుడే గోపాలం తాను పరీక్ష వ్రాయబోయే రూమ్‌ వైపు పరుగు పరుగున వచ్చాడు. శరీరంతా చమటలు పట్టాయి. గుండెలు దడదడలాడుతున్నాయి. అందులోనూ, తను పరీక్ష వ్రాయబోయే రూమ్‌లో రామ్మూర్తి మాష్టరు గార్ని చూడగానే ఎక్కడిలేని నిస్సత్తువ అతడ్ని ఆవరించింది. నీరసం, నిస్పృహ, నిరాశ ఒక్కసారి గోపాలంలో చోటు చేసుకున్నాయి. రామ్మూర్తి మాష్టారి గురించి తెలిసిన అతను మరింత డీలా పడిపోయాడు.

కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర. ఎవరి కంట్లోనేనా కన్నీరు రానంత వరకూ వాళ్ళు బాగున్నట్టే, కంట్లో కన్నీరు వచ్చిందంటే వాళ్ళ కుటుంబ జీవిత పరిస్థితి బాగులేనట్టే, వాళ్ళకి కన్నీరు తెప్పించే సంఘటనలు ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలే కానీ డీలా పడకూడదు. గోపాలం మనస్సు హెచ్చరించింది.

వాచ్‌‌మన్‌ అప్పలస్వామిని ఎలాగో అలాగ బ్రతిమాలి గేటు తెరిపించి స్కూలు ప్రాంగణంలోకి అడుగుపెట్టి, హెడ్మాష్టరు గారి కళ్ళలో బడకుండా ఎలాగో అలాగ తను పరీక్ష హాలు దగ్గరికి చేరుకున్నాడు. కాని రామ్మూర్తి మాష్టారు వాచరుగా వచ్చేరు. అతడ్ని తప్పించుకోలేడు – గోపాలం అనుకున్నాడు. అతని ఆశ అనే నీటి బుడగ టప్పున పేలిపోయింది. పైపైకి పోతున్న నీటి ఆవిరి చందంగా ఆశ పైకి ఎగిరిపోయింది. వణకుతున్న చేతుల్తో దండం పెడ్తూ ద్వారం దగ్గర నిలబడ్డాడు గోపాలం.

“గోపాలం! ఎన్ని గంటలకి పరీక్షరా? నీవు వచ్చింది ఎన్ని గంటలకి?” రామ్మూర్తి గారి కంఠంలో కోపం కన్నా మార్దవమే ఉన్నా గోపాలం అలా వణికిపోతూనే ఉన్నాడు.

“సార్‌! అత్తమ్మ కూరలకని బజారుకి పంపిందండి.”

గోపాలం మాటలు వినగానే ‘చదువుకుంటున్న పిల్లల్ని అందులోనూ పరీక్షల సమయంలో ఇలా సామాన్లు తేవడానికి బజారుకి పంపించడమేుటి? ఈ పెద్దవాళ్ళకి బుద్ది లేదు’ రామూర్తి అంతరంగం ఆలోచిస్తోంది.

“పరీక్ష ఉందని చెప్పలేకపోయావా?”

“మామయ్యతో చెప్పి కొట్టిస్తుంది సార్‌!”

అలా అంటున్న సమయంలో గోపాలం కంఠం దుఃఖంతో పూడుకు పోయింది. కన్నీళ్ళు పైకుబకడానికి సిద్ధంగా ఉన్నాయి. అతడ్ని ఆ స్థితిలో చూస్తున్న రామ్మూర్తి గారి మనస్సు ఒక్కసారి కలుక్కుమంది. ఇలాంటి మాటలే చిన్నప్పుడు తను పరీక్ష సమయంలో తమ మాష్టారుతో అన్నాడు.

మరి మాట్లాడకుండా గోపాలాన్ని పరీక్ష హాలులోకి అనుమతి ఇచ్చి ఆన్సరు పేపరు, ప్రశ్నాపత్రం ఇచ్చాడు. అదృష్టవశాన్న ఇంకా హాజరు పట్టిక రాలేదు. గోపాలం చకచకా పరీక్ష వ్రాస్తున్నాడు.

గుసగుసలు వినిపిస్తున్నాయి రామ్మూర్తి మాష్టారు పరధ్యానంలో ఉండడం గమనించి. వెంటనే అతను జాగ్రత్తపడి ఇటు అటు పచార్లు చేయడం మొదలు పెట్టారు. తిరిగి పరీక్ష హాలులో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది.

గోపాలం గురించి తను కొన్ని విషయాలు విన్నాడు. గోపాలం తల్లిదండ్రులు నిరుపేదలు. ఈ పేదరికంలో గోపాలానికి మంచి భవిష్యత్తు ఈయలేమనుకున్న తల్లిదుడ్రులు గోపాలాన్ని వాళ్ళ మామయ్య ఇంటికి పంపారు. అయితే గోపాలానికి సెగలో నుండి పొగలోకి వచ్చినట్టయింది. మధురమైన బాల్యం అతనికి ఎండమావే.

మనిషి జీవితంలో మధురమైన దశ బాల్యం. ఆ దశలో తను అనుభవించిన ఆనందం పెద్దయ్యాక గుర్తుకు వచ్చి తిరిగి బాల్యదశ వస్తే ఎంత బాగుండును అని అనుకుంటాడు మనిషి. బాల్యంలో భావ కాలుష్యం లేని స్వచ్ఛమైన ఆనందం లభిస్తుంది. మనిషి జీవిత పర్యంతం గుర్తించుకునేది స్వచ్ఛమైన అనుభూతిలో లీలమయ్యేది బాల్యంలోని భావాలే.

తల్లి మమతానురాగాలు, తండ్రి ఆసరా, సహకారం అతని క్రమశిక్షణతో కూడిన అదుపాజ్ఞలు అన్నీ పిల్లల్ని ఉన్నతులుగా తీర్చి దిద్దుతాయి. తల్లిదండ్రులు పిల్లల కోసం చేసే త్యాగాలు అంతా ఇంతా కాదు.

అయితే అందరి బాల్యాలూ ఒకే విధంగా ఉండవు. కొందరి బాల్యాలు విషాదమయంగా ఉంటాయి. గోపాలం బాల్యం విషాదమయమే. ఒక విధంగా చూస్తే అతనిది బానిస బ్రతుకే. వీళ్ళు తమ కోరికలు, ఆశలు, ఆశయాలు మనస్సు అడుగు పొరల్లో దాచేసుకుని తనకి ఆశ్రయం ఇచ్చిన, ఆదుకున్న వారికి, బానిసలా సేవ చేయాలి. వారి ఆజ్ఞలు పాటించాలి. తమ వ్యక్తిత్వాన్ని చంపేసుకోవాలి.

రామ్మూర్తి మాష్టారి ఆలోచన్లు ఇలా సాగుతూ ఉంటే పరీక్ష హాలులో తిరిగి అలజడి. తిరిగి అతను చైతన్యంలోకి వచ్చి తిరిగి అటు ఇటు తిరగుతూ విద్యార్థుల్ని గమనిస్తున్నారు. తిరిగి నిశ్శబ్ద వాతావరణం పరీక్ష హాలులో.

ఆలస్యంగా వచ్చినా గోపాలం అందరి కన్నా ముందరే పరీక్ష పేపరు వ్రాయడం పూర్తి చేసి ఆన్సరు పేపరు రామ్మూర్తి మాష్టారు గారికి అంద చేస్తున్న సమయంలో గోపాలం కళ్ళలో కదలాడుతున్న కృతజ్ఞతా భావం రామ్మూర్తి మాష్టారు గమనించకపోలేదు.

గోపాలం క్లాసులో తెలివైన విద్యార్థి. స్కూల్లో ఉపాధ్యాయుల ఆధరాభిమానాలు చురగొన్న తెలివైన విద్యార్థి. వినయానికి ప్రతిరూపం గోపాలం. అలాంటి గోపాలానికి రామ్మూర్తి మాష్టారి దగ్గర భక్తి, గౌరవంతో పాటు భయం కూడా.

విద్యార్థులందరి దగ్గర ఆన్సరు పేపర్లు సేకరించిన రామ్మూర్తి మాష్టారు స్టాఫ్‌ రూమ్‌ వేపు అడుగులేసారు. “ఈయన వల్ల పరీక్ష వ్రాద్దామనుకుంటున్న వాళ్ళు కూడా పరీక్ష సరిగా వ్రాయలేకపోతున్నారు. నా ప్రైవేటు స్టూడెంట్సు ఉన్నారు. వాళ్ళకి సరియైన మార్కులు రాకపోతే తల్లిదండ్రులు నన్నే అడుగుతారు. తనే ఎంతో నిజాయితీపరుడు అనుకుంటాడు” లెక్కలు మాష్టారు అంటున్నారు.

“నిజమే చూసీ చూడనట్లు ఉండాలే కాని. ఈ రామ్మూర్తికి రోజు రోజుకి మరీ చాదస్తం లావయిపోతుంది. తనేదో ఊడ పొడిచేస్తున్నట్లు, మనమేదో చేతకాని వాళ్ళమన్నట్లు పెద్ద బిల్డప్‌!” సైన్సు మాష్టారి అక్కసు.

“రిజర్వుడుగా ఉంటూ తన చుట్టూ గిరి గీసుకుని కూచుంటాడు. అలా ఉంటే ఎలా? పట్టు విడుపూ ఉండాలి. సమాజంలో ఉన్నాక అందరితో కలిసిపోవాలి. మనిషి సంఘజీవి. తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అందరి అభిప్రాయాల్ని గౌరవించాలి. అంతేకాని నన్ను ముట్టుకోకు నా మాల కాకి అన్నట్లు ఉండిపోకూడదు,” సోషలు మాష్టారి గొంతు.

అప్పుడే స్టాఫ్‌ రూమ్‌ ద్వారం దగ్గర టక్కున ఆగిపోయి రామ్మూర్తి మాష్టారు వారి మాటల్ని విన్నారు. పిచ్చిగా నవ్వుకున్నారు. ఏంటో ఈ మనుష్యులు, వారి మనస్తత్వాలు.

“రామ్మూర్తీ! నీ సిన్సియారిటీని నేను మెచ్చుకోక ఉండలేకపోతున్నాను. నీలాంటి వాళ్ళే ఉపాధ్యాయులందరూ ఉంటే మన స్కూలు పేరు ప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి,” ప్రధానోపాధ్యాయుడు ముకుందం గారు తనని పొగుడుతారు. అతని మాటలకి తను పొంగిపోకూడదు. వీళ్ళ మాటలకి కృంగిపోకూడదు. మనిషి స్వభావమే అంత.

వాళ్ళు అన్నట్టు తను రిజర్వుడుగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే స్టాఫ్‌ రూమ్‌లో ఉపాధ్యాయుల సంభాషణలు వింటూ ఉంటే తనకి జుగుప్స కలుగుతుంది. ముఖం ముందు పొగిడిన వాళ్ళనే వాళ్ళ వెనకాల వాళ్ళను హేళన చేస్తూ మాట్లాడిన మాటలు తను విన్నాడు. ఇది తనకి నచ్చదు. అందుకే తను రిజర్వుడుగా ఉంటాడు. ఇలా సాగిపోతున్నాయి రామ్మూర్తి మాష్టారి ఆలోచన్లు.

అధ్యాయం 2

ఇంటికి వచ్చిన రామ్మూర్తి మాష్టగారి ఆలోచన్లు గోపాలం చుట్టూనే తిరుగుతున్నాయి. జీవితంలో చాలా సందర్భాల్లో అనుకున్నవి కాకుండా అనుకోనివి జరుగుతూ ఉంటాయి. జీవితంలో అనేక ఎత్తు పల్లాలు ఎదురవుతూ ఉంటాయి.

బ్రతుకు పుస్తకంలో బాల్యం ఒక కల. వర్తమానంలో రంగుల వల. ఇప్పటి మన కళ్ళలో బాల్యం కన్నీటి కల. ఎంతేనా బాల్యం నీడనిచ్చే గున్నమావి చెట్టు ఎంత ఎదిగినా ఎంత అందంగా కనిపించినా అది తన వేళ్ళను మరిచిపోదు. మనిషి ఎంత ఎదిగినా తన బాల్యాన్ని మరిచిపోడు. బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకోవడం అంటే మనిషి తనను తాను తెలుసుకోవడమే. బాల్యం ఒక బడి. అమ్మే గురువు. బాల్యాన్ని ప్రేమించగలిగినవాడే అమ్మను గౌరవించగలడు.

ప్రపంచీకరణ నేపథ్యంలో బాధ కలిగినప్పుడు బాల్యం గుర్తుకు వస్తుంది. ఆ జ్ఞాపకాల తడి ఇంకా ఆరనే ఆరలేదు. నేటి యాంత్రిక జీవితంలో మనిషికి కావల్సింది సాంత్వన. ఎడారిలో ప్రయాణిస్తున్న మనిషికి ఒయాసిస్సు కనిపిస్తే ఎలా ఉంటుందో అలాంటిదే బాల్యం. ఇలా బాల్యం గురించి నిర్వచనం చేస్తున్న రామ్మూర్తి మాష్టారికి ఒక్కసారి తన బాల్యం కళ్ళెదుట నిలిచింది.

భర్తను కోల్పోయి విధవరాలయిన శాంతమ్మ అన్నదమ్ముడు పంచన చేరింది తన కొడుకుతో సహా. అక్కడి వాతావరణం అక్కడ తమ జీవితం సరిగా లేకపోయినా సరిపెట్టుకుంటూ జీవితం గడిపెస్తోంది.

తల్లి శాంతమ్మకి పాఠం అప్పగిస్తున్నాడు రామం. “ఒరే రామిగా మీ మామయ్యకి ఈ భోజనం పొలానికి తీసుకెళ్ళి ఇయ్యాలి” అత్తమ్మ ఆజ్ఞ. తల్లికి పాఠం అప్పగిస్తున్న పాఠాన్ని ఆపు చేసి “అత్తమ్మా! నాకు రేపు పరీక్ష చదువుకోవాలి. రంగడిని తీసుకెళ్ళి ఇచ్చిరమ్మను,” అన్నాడు రామం.

“వాడు అసలే మొద్దు వెదవ. నీవు తెలివైనవాడివి. చదవకపోయినా పరీక్ష సరిగా వ్రాయగలవు. నీవే భోజనం తీసుకెళ్ళి ఇచ్చి రావాలి,” అత్తమ్మ కంఠంలో కరుకుతనం.

“నేను ససేమేరా వెళ్ళను. నేను చదువుకోవాలి” పరిస్థితుల్ని అర్థం చేసుకోడానికి, ఆలోచించడానికి అంత వయస్సు లేని రామం మొండిగా అన్నాడు. అతని కంఠంలో విసుగుదల గమనించింది అత్తమ్మ. ఆమె పేరు అనసూయ. పేరుకు తగ్గట్టు చాలా అసూయపరురాలు. ‘తమ దయాధర్మ భిక్ష వల్ల బ్రతుకుతున్న వాళ్ళకి తమ కాళ్ళ దగ్గర బానిసల్లా పడి ఉండాలే తప్ప ఇలా తమ ఆజ్ఞన్ని పాటించకపోవడమేుటి? తమ అభిష్టానికి వ్యతిరేకంగా మాట్లాడడమిటి? అలా జరగడానికి వీల్లేదు’ అనుకునే మనస్తత్వం అనసూయది. అందుకే రామం మాటలకి ఆమె మనస్సు కుతకుతలాడుతోంది. ఆమె మనస్సు భగ్గుమండుతోంది.

“అవునురా నీవు అలా అంటావని నాకు మొదటే తెలుసు. అలా మాట్లాడమని నిన్ను ఎవరు ప్రోత్సహిస్తున్నారో అది కూడా నాకు తెలుసు. మీలాంటి దిక్కులేని వాళ్ళందరిని తేరగా మేపడానికి పాతర వేసుకుని కూర్చోలేదు మేము. మిమ్మల్ని మేపడానికి ఇదేమీ ధర్మ సత్రవు కాదు” అక్కసుగా అంది అనసూయ. ఆమె మాటలకి శాంతమ్మ మనస్సు కలుక్కుమంది.

“తేరగా తిండి తింటున్న వాళ్ళు పని చేయవల్సిందే. మాకు ఎదురు చెప్పకూడదు,” అనసూయ కటువుగా అంది.

“రామూ! అత్తయ్య చెప్పనట్టు చేయవల్సిందే. మరో మాట నీ నోటి వెంబడి రాకూడదు,” శాంతమ్మ కొడుక్కి ఆజ్ఞ జారీ చేసింది. తల్లి ముఖంలో అగుపడ్తున్న కఠినత్వం వెనుక దీనత్వం లీలగా గుర్తించిన రామానికి అత్తమ్మ మీద కోపం వచ్చింది. తన బ్రతుకు మీద కూడా.

‘ఛీ!! ఎందుకొచ్చింది ఈ బానిస బ్రతుకు? తన బ్రతుకు మీద తనకే అసహ్యం’ అనుకుంటున్న అతనిలో వెను వెంటనే మరో భావం. వాళ్ళ దయాధర్మభిక్ష మీద బ్రతుకుతున్న వాళ్ళమి కదా! వాళ్ళ మాటలు, ఆజ్ఞలు పాటించవల్సిందే. అది తన తల్లిని దృష్టిలో పెట్టుకుని తల్లి తలంపు అతడ్ని విచలితుడ్ని చేసింది.

‘బాల్యంలోని అన్ని సందర్భాల్లో ప్రేమతో పెనవేసుకునేది అమ్మ. ఎన్ని కష్టాలు అనుభవించినా, పేదరికంలో మగ్గిపోయినా, తన పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమ్మ ఎవరికైనా ఆరాధ్య దైవమే. తను పస్తులున్నా పిల్లల ఆకలి తీర్చడానికి తపించి పోతుంది అమ్మ. పిల్లలకి దెబ్బలు తగిలినప్పుడు ఆమె మనస్సు తల్లడిల్లిపోతుంది. అంతగా తాను చదువు కోలేకపోయినా తనకున్న సంస్కార జ్ఞానంతో పిల్లల్ని తీర్చిదిద్దేది అమ్మే. తను బ్రతికి ఉన్నంత కాలం తన సంతానం కోసం తల్లడిల్లేది అమ్మే.’

తల్లి గురించి రామం వయస్సుకు మించిన ఆలోచన్లు ఇలా సాగిపోతున్నాయి. అందుకే తల్లి మాటను కాదనలేకపోతున్నాడు. అతను తల్లికిచ్చిన గౌరవం అది. అందుకే తల్లి మాటకు కట్టుబడి మామయ్యకి భోజనం పట్టుకుని పొలం వేపు బయలుదేరాడు. తల్లి కన్నీటితో నిండిన కళ్ళతో కొడుకు వెళ్ళిన వేపు చూస్తూ నిల్చుంది.

ఆమె మనస్సునిండా అనేక ఆలోచన్లు. ఒకానొక సమయంలో తను సంపన్న కుటుంబంలో పెద్ద కోడలు. ఏడు వారాల నగలు, అంతులేని సిరి సంపదల్తో నిండిన రాజభవనంలాంటి ఇల్లు. మామగారు చనిపోగానే అన్నదమ్ములు ఆస్తి పంపకాలు అవాలని పట్టుబడ్డారు. ఆస్తి పంపకాలు జరిగిపోయాయి.

తమకి వచ్చిన ఆస్తిని వ్యాపారంలో పెట్టాడు తన భర్త. కాలం కలిసి రాలేదు. వ్యాపారంలో దివాలా తీసిన తన భర్త ఆ దెబ్బకి తట్టుకోలేక పోయాడు. మంచం పట్టాడు. మనోవ్యాధికి మందు లేదు. చింతకి మందు లేదు. చితి నిర్జీవ శరీరాన్ని దహించి వేస్తే చింత జీవంలో ఉన్న శరీరాన్నే దహించి వేస్తుంది.

ఫలితంగా మృత్యువాత పడ్డాడు తన భర్త. కుటుంబ పరిస్థితులు తారుమారు అయ్యాయి. ఆర్థికంగా చితికిపోయిన తను ఏు చేయగలదు? కొడుకుని తీసుకుని పుట్టింటికి చేరుకుంది. ఇక్కడ తన జీవితం, కొడుకు జీవితం ఇలా సాగుతున్నాయి. అలా ఆలోచిస్తూ నిట్టూర్పు విడిచింది శాంతమ్మ.

ఇవతల రామం ఆలోచన్లు మరోలా ఉన్నాయి. తను ఒకానొకప్పుడు స్కూలులో ఓ తెలివైన విద్యార్ధి. ఉపాధ్యాయులందరూ తనని మెచ్చుకునేవారు, అభిమానించేవారు, ప్రేమగా చూసుకునేవారు. తన చదువు చక్కగా సాగిపోతున్న సమయంలో జీవితంలో ఓ అపశ్రుతి. పరిస్థితులు తారుమారు అయి ఇలా మామయ్య పంచన చేరి బానిస బ్రతుకు బ్రతికే పరిస్థితి.

కష్టంలో ధైర్యాన్ని బాధలో ఉపశమనాన్ని వైఫ్యలంలో ఓదార్పుని, నిరాశతో ఆశావాదాన్ని డోలాయమానంలో దిశానిర్దేశాన్ని పరిపూర్ణంగా అందించేది అమ్మ ఒక్కర్తే. అవి పుష్కలంగా తనకి అందించింది తన తల్లి. అమ్మ ప్రేమ హిమాలయమంత ఉన్నతమైనది. సముద్రమంత లోతయినది. ఆకాశమంత విశాలమైనది. ఆమెకి తన పిల్లల మీదున్న శ్రద్ధకు అంతే ఉండదు. ఆమె చిత్తశుద్ధికి తిరుగే ఉండదు.

ఆమె ఒక్కర్తే తనకి ఆత్మీయురాలు. మన బాధల్ని ఆత్మీయులతో పంచుకుంటే మనస్సు దూది పింజలా తేలిక అవుతుంది. బాధ పైకి ఎగిరిపోతుంది. ఆనందం రెట్టింపు అవుతుంది. మనల్ని ఇతరులతో పోల్చుకోకుండా, ఇతరుల నుండి ఏు ఆశించకుండా ఉంటే జీవితంలో సగం సమస్యలు తీరినట్టే. వయస్సుకు మించిన ఆలోచన్లతో పొలం గట్టు మీద నడుస్తూ ముందుకు సాగుతున్నాడు రామం.

ఆ ఆలోచన్ల ఫలితమే ఎదురుగా ఉన్న బండరాయిని ఢీకొట్టాడు. బోర్లా పడ్డాడు. భోజనం కేరియర్‌ క్రిందపడి భోజనం అంతా నేల పాలయింది. దూరంగా పేకాటలో మునిగి తేలుతున్న అతని మామయ్య ఇదంతా గమనిస్తున్నాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అది నేల పాలవడం అతను సహించలేకపోయాడు. అతనిలో కోపం తన్నుకొచ్చింది. పేక ముక్కలు గిరాటు వేసి వడివడిగా అడుగులు వేస్తూ వచ్చిన మామయ్య భుజంగరావు చేతి కర్రతో అతడ్ని బాదడం మొదలు పెట్టాడు. అతనిలో కసి కోపం చల్లారలేదు.

“తప్పయిపోయింది మామయ్యా.. తప్పయిపోయింది. కొట్టకు మామయ్యా కొట్టకు” ఏడుస్తూ అంటున్నాడు.

“ఏుటి బాబూ ఆ చిన్న పిల్లాడిని గొడ్డును బాదినట్టు బాదుతారు. శాంతించండి,” అక్కడున్న వాళ్ళు భుజంగరావు చేతిలో కర్రను తీసి దూరంగా విసిరేసారు.

“ఈ వెధవని కొట్టడం కాదు, చంపేసినా పాపం లేదు,” అన్నాడు.

ఎవరో చెప్పగా పరుగు పరుగున శాంతమ్మ అక్కడికి వచ్చింది. మామయ్య చేతిలో దెబ్బలు తిని కుమిలి కుమిలి ఏడుస్తున్న కొడుకుని చూసిన ఆమెకి బాధ సుడులు సుడులుగా తన్నుకొచ్చింది. కళ్ళల్లో కన్నీరు చిప్పిల్లాడింది. దెబ్బలు తిన్న కొడుకు శరీరాన్ని పొదివి పట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తోంది.

“వెధవలు, వెధవిల్లు. నా ఇంట్లోనే నాకు తిండి లేదు,” అంటూ చిందులు తొక్కుతూ బయటకు పోయాడు భుజంగరావు.

ఆ సంఘటన అంతటితో సమిసిపోలేదు. విషయం తెలుసుకున్న అనసూయ ఇంటికి వచ్చిన భర్త కోపాన్ని మరింత రెట్టింపు చేయడానికి ప్రయత్నిస్తోంది. “నేను చెబితే విన్నారా? మనమన్నా మన మాటన్నా అసలు వాళ్ళకి లక్ష్యమే లేదు. ఇంటిలో పెరిగిన కుక్కకి యజమానుల మీద విశ్వాసం ఉంటుంది. కాని ఈ ఇంట్లో మనుష్యులకి మాత్రం మన మీద విశ్వాసం లేదు.”

కొడుకు శరీరానికి మందు రాస్తున్న శాంతమ్మ బాధనంతా మనస్సు అడుగు పొరల్లో దాచుకుందే కాని అనసూయను పల్లెత్తు మాట అనలేదు. ఇదంతా తమ కర్మ అన్న మెట్ట వేదాంతంలో ఉంది. పరిస్థితులు సవ్యంగా లేనప్పుడు తాడే పామై కరుస్తుంది ఇదీ ఆమె భావన.

రామానికి శరీరానికి తగిలిన దెబ్బలు తగ్గు ముఖం పట్టాయి కాని మనస్సుకి తగిలిన గాయాలే పచ్చిగా ఉన్నాయి. జరిగిన సంఘటన మరిచి పోలేకున్నాడు. ఉన్నట్టుండి రామానికి బాగా జ్వరం వచ్చింది.

జ్వరం తగ్గకపోగా అంతకంతకు ఎక్కువవుతోంది. తల్లి మనస్సు తల్లడిల్లిపోయింది. “అన్నయ్యా! రామం పరిస్థితి ఏం బాగు లేదురా. డాక్టర్‍ని తీసుకొస్తే మంచిదనిపిస్తోంది” తన అన్నయ్యని ప్రాధేయపడ్తూ అంది శాంతమ్మ.

“ఆఁ..! అదే తగ్గిపోతుంది. మిరియాల కషాయం పట్టండి. డాక్టర్‌ని పట్నం వెళ్ళి తీసుకురావాలి. నా దగ్గర డబ్బేం మూలగటం లేదు,” అంటున్న భుజంగరావు గొంతుకలో కరుకుతనంతో పాటు విసుగుదల.

నిరాశగా, రెక్కలు తెగిన పక్షిలా మనస్సు విలవిల్లాడుతూ ఉంటే కొడుకు వేపు దీనంగా మూగ చూపులు చూస్తూ వెను తిరిగింది శాంతమ్మ. అలాంటి నిస్సహాయ స్థితిలో ఆమెకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఆశా, నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమె ఓ స్థిర నిర్ణయానికి వచ్చింది.

ఉన్న బంగారు వస్తువులన్ని హరించుకుపోగా భర్తకి గుర్తుగా మంగళసూత్రాల్ని తన పెట్టెల్లో భద్రంగా దాచుకుంది. అదో సెంటిమెంట్‌ శాంతమ్మది. ఈ విపత్కర పరిస్థితిలో వాటిని అమ్మేనా తన కొడుక్కి వైద్యం చేయించాలి. ఇదే ఆలోచన భర్తను ఎలాగూ పోగొట్టుకుంది. కొడుకుని చేజేతులారా పోగొట్టుకోలేదు.

ఆ మంగళసూత్రాల్ని భుజంగరావు చేతిలో పెట్టి వాటిని అమ్మి రామానికి వైద్యం చేయించమని స్థిర కంఠంతో చెప్పింది. కన్నీరు మున్నీరుగా విలపించింది.

కఠిన మనస్కుడయిన భుజంగరావు కూడా చెల్లెలు ఏడుపుకి కొద్దిగా చలించాడు. కరడుకట్టిన కఠినత్వం అతనిలో మంచులా కరిగిపోయింది. “అలాగే., అలాగే..!” అంటూ ఆమెను ఊరడించడానికి ప్రయత్నించాడు.

డాక్టరు వచ్చి రామానికి పరీక్షలు జరిపి మందులు ఇచ్చాడు. అవి ఎలా వాడాలో చెప్పాడు. కొడుక్కి సమయానికి మందులు ఇస్తూ తల్లిగా తన బాధ్యతను నెరవేరుస్తోంది శాంతమ్మ.

“నీ కొడుక్కేం పరవాలేదులే. గుండ్రాయిలా లేచి తిరుగుతాడు. నీవు పొద్దస్తమానం అలా కూర్చుంటే ఇంట్లో పనులు నేను ఒక్కర్తినీ చేయలేను” గాలిలో చేతులు తిప్పుతూ ముక్కు పుటాలు ఎగరేస్తూ కోపంతో పెదాలు అదుర్తూ ఉండగా అనసూయ శాంతమ్మతో అంది.

మారు మాట్లాడకుండా బాధనంతా మనస్సులోనే దాచుకుని చెల్లా చెదురుగా పడి ఉన్న అంట్ల పాత్రలు వేపు అడుగులు వేసింది శాంతమ్మ.

(ఇంకా ఉంది)

Exit mobile version