[శ్రీ వీరేశ్వర రావు మూల రచించిన ‘మళ్లీ వసంతం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక – సాహితీ ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 ఉగాది వచన కవితల పోటీలో బహుమతి పొందిన కవిత.]
వసంతం వస్తుంది
ఏడాదికి ఒకసారి
మొక్క
కుండీలో ఉన్నా
టెర్రస్ గార్డెన్‌లో
ఎడారిలో ఉన్నా
రాతి గోడ నుంచైనా వసంతం
చీల్చుకు వస్తుంది!
కోయిల కవనాలు వనాల్ని దాటి
వీనులు చేరతాయి
మామిడి పుప్పోడి పలకరింపులు
బాట పక్కన పడి
వసంతం వచ్చిన ఆనవాలు
ఈ మనిషికి తెలియదు!
సెక్స్ లోనో
సెన్సెక్స్ లోనో
మునుగుతుంటాడు!
ఇచ్చి పుచ్చుకోవడాలు
ఇచ్చకాలు
మరిచి
మ్యూచువల్ ఫండ్‌లో
ములిగి తేలుతుంటాడు!
అంతర్వాణి ప్రబోధం వినడం మాని
చరవాణికే చెవుల్ని అంకితం
ఇస్తాడు!
చలన చిత్ర దేవుళ్ళని కొలుస్తాడు
చరమాంకానికే దారులు వేస్తాడు
కృత్రిమ మేధ అంటాడు
కృత్రిమంగా బతుకుతుంటాడు!
పామే నయం
నెలకొక సారి కుబుసం విడుస్తుంది
కానీ ఈ నరుడు మారనంటాడు.
పుడమి అందాలను వదిలి
పుడమి మీద ఆకాశ హర్మ్యాలు కట్టి
ధనాన్ని హరిస్తూ ఉంటాడు.
ఉగాది సెలవని
పంచాంగం పనిలేని వాళ్ళ
వ్యాసంగం అనుకుంటాడు!
గతం లోపల మిగిలిన మంచే
సాంప్రదాయం అని గ్రహించని వీడు
ఆధునికత మాస్క్‌తో తిరుగుతాడు.
మారని మనిషి కోసం
మళ్ళీ మళ్ళీ వసంతం వస్తుంది
ఆశే ధ్యాసగా ఉగాదిగా మారుతుంది