[మరింగంటి సత్యభామ గారు రచించిన ‘మళ్ళీ వచ్చిన బాల్యం’ అనే కవితని అందిస్తున్నాము.]
కాలయవనికలో.. బాల్యం
పసితనపు.. గురుతులు అవి
బాల్యపు మకరందాలే..! ప్రతివారికీ
అదో స్వర్గసీమ. ఆ సీమలో
అందాల హరివిల్లు. విరిజల్లుల,..
పరిమళాల గుబాళింపులు!
ఆ లోకానికి మనసు మళ్ళిందా!
మనసుకి మలయమారుతపు వీచికలు!
సన్నని వర్షబిందువుల సోనలు!
రంగురంగుల సీతాకోకచిలుకల..
పలకరింపులు. గులాబీబాల నవ్వులా!
బాల్యస్నేహాల జ్ఞాపకాల తూరీగల సడి..!
కాకెంగిలి తాయిలాల రుచి అంగిట్లో..!
ఆవకాయ ముక్కల చప్పరింతల గిలిగింత!
చెరువుకట్టల మీద ఆటపాటలు,
మనసులో ముద్రలు. మురిపిస్తూ,
చుట్టు చెలికత్తెలు సందడి..!
మడిలో వరి పైరులా!
రివ్వురివ్వుమనే.. సమీరంలా..!
మనసారా సిరినవ్వుల సరిగమలు!
కపటమెరుగని మమతల గుడి!
చెలిమిమది సవ్వడుల,
బారుపూలజడల.. సోయగం
ముసిముసి నవ్వులు!
తేటతెలుగుదనపు.. వెలుగు
అట్లతద్ది నాటి ఆటపాటలు
అరచేతి గోరింట.కెంపులా పండెనని
చెలికత్తెల.. దరహాస చంద్రికలు
వేకువనే.. ఆరగింపుల విందు
నోరూరించే.. గోంగూరపచ్చడి,
పప్పు పులుసన్నము. దధిఓదనమ్ము
అరిగేదాకా పరుగుల దొంగాటలే!
తెల్లవారుతూనేచెరువులోకిదిగి,
శివుని కోవెలలో స్నానాలు, కేరింతలు!
చెట్లకి కట్టిన ఊయలలూగు సంబరం!
పరమభక్తితో దర్శనాలు. ప్రసాదాలు.,
అమ్మ పెట్టిన అట్లు వెలగపచ్చడితో
ఓహో! ఎంత బాగుండేవో!
ఉదయం పాఠశాలలో శ్రీకారం!
ఎంతానందం ఆ రోజు!
ఎక్కాలు రాక తీసిన.. గుంజీలు!
పాత స్నేహితులు కనిపిస్తే,
అంతులేని కబుర్లు..!
ఓ బాల్యమా.! మరలా ఓసారి రాకూడదూ!
ఆ రోజుల్లోకి మళ్ళుతాం!
బాల్యం దాకా ఎందుకులే!
వార్ధక్యమూ బాల్యం లాంటిదే..!
తల్చుకో, ఆతలపుల్లో మునిగిపో!
వద్దనేవారెవరు?