Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పునర్వివాహం అంత సులభం కాదనే ‘మళ్ళీ పెళ్ళి కథలు’

[శ్రీ లాల లింగమూర్తి గారి ‘మళ్ళీ పెళ్ళి కథలు’ అనే కథాసంపుటిని పరిచయం చేస్తున్నారు డా. కాళిదాసు పురుషోత్తం.]

శ్రీ  లాల లింగమూర్తి గారి ‘మళ్ళీ పెళ్ళి కథలు’ పుస్తకంలోని నలభై నాలుగు కథల్లోను భార్యాభర్తల మధ్య చిన్నచిన్న అభిప్రాయ భేదాలు చిలికి చిలికి గాలివానగా మారి విడిపోయే వరకూ వస్తాయి. ప్రతి కథలోను ‘దుష్ట పాత్ర’ సత్యవతమ్మ. ఆమె, ఆమె పెనిమిటి చిరు కలహాలు – అంతటితో సమిసిపోకుండా దంపతులను రెచ్చగొట్టి – సాగర్, అరుణ మణికొండ విడిపోయేదాకా ఊరుకోరు.

సాగర్, అతని భార్య అరుణ మణికొండ ఇద్దరూ బ్యాంకులో ఉన్నత శ్రేణి ఉద్యోగులు. ఆమెది ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ, సాగర్‌ది హైదరాబాదు మణికొండ. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి ‘ప్రాంతీయ భావాలు’ లేకుండా ప్రేమ వివాహం చేసుకొంటారు. ఉద్యోగ జీవితంలో విపరీతమైన ఒత్తిడి. సాగర్ అక్క సత్యవతి చెప్పుడు మాటలు. అగ్నికి ఆజ్యం పాసినట్లయి ఆ దంపతులు విడిపోయి కొద్ది నెలల లోపే తప్పు గ్రహించి దగ్గరయ్యే సమయంలో దొంగలు ఆ దంపతులపై దాడి చేసి నగలూ, డబ్బు దోచుకొనిపోతారు. ఆ దాడిలో అరుణ మణికొండ అదృశ్యమవుతుంది.

అమె చనిపోయినట్లు నిర్ధారించుకుని సాగర్ ఆమె లాంటి సుగుణవతిని పెళ్ళి చేసుకోవాలనే ప్రయత్నాలే ఈ కథలన్నీ. “ప్రతి కథా యథార్థం” అని రచయిత ప్రకటించారు.

లింగమూర్తి రకరకాల రీతుల్లో కథను నడిపిస్తారు. కొంతభాగం ఉత్తరాల రూపంలో, కొంత ఫోన్ సంభాషణలు, మరికొంత సాగర్ తన ప్రకటనకు స్పందించిన యువతులను కలిసి సాగించిన సంభాషణ, ఆ పెళ్ళిచూపుల వంటి సంఘటన వివరాలు..

‘నిడదవోలు నిజం’ కథలో ప్రవళిక తన ప్రేమకు గుర్తుగా గిఫ్ట్‌గా ఇచ్చిన కర్చీఫ్ తన అజాగ్రత్త వల్ల పోగొట్టుకున్నట్టు సాగర్ ఆమెకు ఉత్తరంలో వివరిస్తాడు. అంతటితో వారి మధ్య సంబంధం తెగిపోతుంది.

‘అర విరిచిత కుసుమ్’ కథలో కుసుమను చూడదానికి సాగర్ విజయవాడ వెళ్తాడు. ఆమె తండ్రి సంగీత ప్రియుడు, కుమార్తెకు ‘రాగ కుసుమ్’ అని పేరు పెట్టుకొన్నాడు. కుసుమ్ – సాగర్ ఎదురుగా వేగంగా అటూ ఇటూ నడుస్తూ ఉంటే మనోహరంగా సౌందర్యం సాక్షాత్కరించినట్లుందని అతనికి అనిపిస్తుంది.

సాగర్, కుసుమ్ ఇష్టంగా మాట్లాడుకుంటూ ఉంటే ఆమె సోదరుడు దుర్గేశ్ సహించలేడు. టీ తాగే నెపంతో సాగర్‌ని బయటికి తీసుకొని వెళతాడు, వివేకవంతురాలు, ప్రభుత్వోద్యాగం చేస్తున్న కుసుమ్‌కు పెళ్ళి జరగడం దుర్గేశ్‌కు ఇష్టం లేదని సాగర్ గుర్తించగలిగినా, పాపం, కుసుమ్‌కు అవేవి గ్రహించేంత శక్తి లేదని సాగర్ కొద్ది నిమిషాల్లోనే గుర్తిస్తాడు. పెళ్ళిచూపుల పేరుతో ఈ నాటకం చాలాకాలం దుర్గేశ్ కొనసాగిస్తాడని పాఠకులకు అర్థమవుతుంది.

సాగర్ మరోసారి prospective bride ని కలవడానికి విజయవాడ సమీపంలోని కొండపల్లి వెళతాడు. రాజ శ్యామల అశ్లేష – రైల్వే ప్లాట్‌ఫామ్ పైనే ఒక బెంచీ మీద కూర్చుని మాట్లాడుకోవచ్చని సాగర్‌కి సూచిస్తుంది. ఒక్కో జీవితంలో ఒక్కో విషాదం, మళ్ళీ పెళ్ళికి ఆ యువతులు తయారయిన

పరిస్ధితులను కథలో సందర్భాన్ని అనుసరించి రచయిత సూచిస్తారు. ప్రతి జీవితంలోనూ ఏదో ఒక విషాద సంఘటనే.

‘వెనుకబాటు నమ్మకాలు’ కథలో సాగర్ రాజ శ్యామల అశ్లేష ఇద్దరూ రైల్వే ప్లాట్‌ఫామ్ మీద తెల్ల నందివర్దనం చెట్టు కింద సిమెంట్ చష్టా మీద కూర్చొని మాట్లాడుకుంటారు. అశ్లేష ముందుచూపుతో రెండు ప్లాట్‍ఫామ్ టికెట్లు కొని పెట్టి వుంటుంది. ఆమె పరిస్థితులను బట్టి అక్కడే మాట్లాడుకోవలిసి వస్తుంది. అతనికి హోటల్లో భోజనం పెట్టించి, తను వరంగల్ వస్తానని భరోసా యిస్తుంది. అన్నట్లే ఆదివారం అశ్లేష వరంగల్లులో దిగి, “ఎక్కడైనా ప్రశాంతంగా మాట్లాడుకుందామా?” అంటుంది. ఇద్దరూ హైవే మీద తంగేడు చెట్టు నీడన కూర్చుని సంభాషిస్తారు.

ఆమె భర్త ప్రవర్తనతో షాక్ అయి మూడో నాడే పుట్టిల్లు చేరుతుంది. ఆ యువతి కుటుంబంలో అంధవిశ్వాసాలు అధికం. ఇద్దరూ ఏకాంతంగా కూర్చుని ఉంటే పోలీసులు కాస్త సందేహిస్తారు నక్సలైట్లేమోనని.

నక్సలైట్ల సాయుధ పోరాటాలు, పోలీసుల దారుణ అణచివేత నేపథ్యంలో

“ఎప్పుడూ పొయ్యి మీద పెనం లాంటి బ్రతుకులే తమవి” అని ఆమె చివరి ఉత్తరంలో వివరిస్తుంది. రచయిత తరచూ కథలలో అక్కడక్కడ తెలంగాణ సాయుధ పోరాటాల ప్రస్తావన తెస్తూనే ఉంటారు.

కథల్లో తన పెళ్ళి, విడిపోవడం అన్నీ అవతలి వారికి రాస్తూ ఉంటాడు, ఆ యువతులు అతని అక్క సత్యవతమ్మ కుతంత్రాల వల్లే అతను విడిపోవలసి వచ్చిందని కరెక్టుగానే అర్థం చేసుకొని సాగర్ ఈడియాసిటీని ముఖం మీదే చెప్తారు. ‘మరో నీడను సైతం చూడలేను’ కథలో నీహారిక అతనికి ఇష్టమని ప్రత్యేకంగా బొబ్బట్లు చేసి పట్టుకొస్తుంది. ఆమె హావ భావాలు పున్నమి చంద్రుడిలా వెలిగిపోతున్నాయి. తమను ఎవరు గమనిస్తునారనే ధ్యాసే లేదు. చీర కుచ్చిళ్ళ పైకి పట్టుకొని గాలిలో నడుస్తున్నట్టుగా ఉంది. అలాంటి నీహారిక చిన్న అపోహతో స్టేషన్‌లో ఆ పెళ్ళి మాటలు సగంలో తెంచేసుకొని వెళ్ళిపోతుంది. అతను స్టన్నయిపోయి, ‘అరుణ మణికొండ ఇలాగే చేసేదా?’ అని దిగులు పడతాడు. ఆ కథ అంతటితో కంచికి పోతుంది.

ఈ ‘మళ్ళీ పెళ్ళి కథ’ల్లో నన్ను బాగా ఆకట్టుకున్న కథ ‘పవర్ ఫుల్ దేవత’.

పెళ్ళిచూపులకి గోదారాణి సాగర్‌ని కాచీగూడ శ్యామ్ మందిరంలో కలుసుకోమని ఫోన్ చేస్తుంది. మారేజ్ బ్యూరో వారే గోదారాణి వివరాలు అతనికి ఇచ్చారు. ఇద్దరు కాళ్ళు కడుక్కుని దర్శనం చేసుకొని గుడిలో ఒక చోట కూర్చున్నారు. ఆమె భర్త బాబుకు ఐదు సంవత్సరాల వయసులో కనపడకుండా పోయారు. ఎంతో వెదికారు. ఇప్పుడు అమె కుమారుడికి 14 సంవత్సరాలు. భర్త ఆచూకీ తెలియకుండా పోయి 9 సంవత్సరాలు గడిచాయి. ఆమెకు భర్త పట్ల ఉన్న పవిత్రభావం ఆమె వేషభాషల్లో ప్రతిఫలిస్తోంది. ఆమె ఆటో వద్దని అతన్ని తన ఇంటికి సిటీ బస్‌లో తీసుకొని వెళుతుంది. తాను ట్యూషన్లు చెబుతూ ఉన్న అద్దె ఇంటికి తీసుకొని పెడుతుంది. ఆమె గది నిండా దేవతల పటాలే గోడలకు.

తను వంట పూర్తి చేసేలోపు తన పెళ్లి ఆల్బమ్ చూడమని అతని చేతిలో పెడుతుంది.

‘వాళ్ళిద్దరూ అందమైన జంట, ఐదేళ్ళ బాబుని వదలి. ఆయన ఎలా వెళ్లగలిగారు?’ సాగర్‌కు ఆ ఫోటోలు చూస్తూంటే ఏదో తెలియని నిర్వేదం కలిగింది. ఆమె ఇల్లు, వాతావరణం, పద్దతులూ అన్నీ వాళ్ళు చాలా ఆచారపరులు, సంప్రదాయపరులు అని స్ఫురింపజేస్తున్నాయి. గోదారాణి జీవితంలో మరో విషాదం ఆమె 14 ఏళ్ళ కొడుకు తల్లికి చెప్పకుండా ఏటో పారిపోయి వారం పదిరోజులకి ఇంటికి తిరిగి వస్తాడు. గోదా తన ఆధ్యాత్మిక జీవితమే తనకు స్థైర్యంర్ ఇస్తోందని సాగర్‍తో అంటుంది. “మీ అక్కయ్య మిమ్మల్ని నమ్మించి అసుర విజయం సాధించారు.. మీలో ప్రేమించే తత్వం, మీ దయనీయ స్థితి.. మీపై ప్రేమను పెంచింది” అని సాగర్ సెలవు తీసుకొనే వేళ

గోదారాణి నిష్కల్మషంగా అంటుంది.

“ఇంతవరకు నా ఈ పడకగదిలోని ఏ పరాయి మగాడు రాలేదు. మీకు నా

పడకగది చూపించాలనిపించింది.. అది నా కోరిక!” అనేసి గోదారాణి మౌనంగా ఉండిపోయింది.

“..మరొక సహాయం కావాలి. అడగవచ్చా? రెండు నెలలుగా ట్యూషన్ ఫీజులు లేవు. దయచేసి ఐదు వందలు ఇవ్వండి. మీ మీద ప్రేమనే.. ధైర్యాన్నిచ్చింది..” అంది గోదారాణి వేగంగా.

“నేను ఆమెను నిలువెల్లా చూశాను. అదే పవిత్రత. ఎక్కడా పశ్చాతాప భావన లేదు..” ఆమె కుర్చీ లోంచి లేచింది. సాగర్ మంచం మీంచి లేచాడు. ఆమె అతనికి పూర్తి దగ్గరగా నించొని సాగర్‍ని ఆసాంతం చూసింది.

ఆమె ఉచ్ఛ్వాసనిశ్వాసాలలో వేగం పెరిగింది, కళ్ళు చెమర్చి ఉన్నాయి, కళ్ళలో కన్నీటి పొరలు, నిష్కల్మషమైన హృదయం నుంచి వస్తున్న కన్నీటిదార!

అతను ఆమె అడిగిన మొత్తం కుర్చీ మీద ఉంచి, చెమ్మగిల్లిన కన్నులతో నవ్వుతూ..,

“ఓకె, ఇక పోయొస్తా” అన్నాడు

“అదేంటి భోజనం చేయకుండా”- గోదారాణి.

ఒకవేళ తాను తినాలనుకుంటే వాటిని విస్తట్లో కట్టియ్యమంటాడు.

ఆమె అతను కోరినట్లే కట్టిస్తుంది. ఒక బాటిల్‌లో పాయసం కూడా పోసి ఇస్తుంది.

“క్షేమంగా వెళ్ళిరండి. మరోసారి మీరు మా ఇండ్లలోనే పుడతారు” అని వీడ్కోలు పలుకుతుంది గోదారాణి. అలా సాగర్ తిరిగి వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తే, ఆమె నుంచి జవాబు రాదు. చివరకు ఆమె ఇంటి ఓనర్‌కి ఉత్తరం రాస్తాడు, ఆయన సమాధానం రాస్తాడు.

“..మీరు ఇచ్చిన డబ్బుతోనే నాకు అద్దె కట్టింది. మీరు వచ్చే నాటికి ఆమె భర్తకై వెతుకుతున్నది. తర్వాత కొడుకై వెతికింది. ఒక రాత్రి తన సామానంతా.. మా ఇంటి ముందు కుప్పగా వదిలేసి ఎటో వెళ్ళిపోయింది..”

ఇట్లా రాస్తూ పోతే ఇందులో 44 కథలూ గురించి రాయాలనే లౌల్యం వదలదు, ‘మళ్ళీ పెళ్ళి కథలు’ కథలను తన స్వర్గీయ జీవన సహచరికి అంకితం చేస్తూ,  “ఇద్దరి మధ్యల సూదిని తీయడానికి క్రేన్‌లని తెచ్చాం! మనుషుల తీరు నీకూ తెలియదు, నాకూ తెలియదు!! కుళ్ళుకుట్రలకు అమాయకంగా బలైన అమాయకులం!!!” అని అంటారు లింగమూర్తి.

***

మళ్ళీ పెళ్ళి కథలు
రచన: లాల లింగమూర్తి
ప్రచురణ: చిట్టి పబ్లికేషన్స్‌
పేజీలు: 363;
ధర: ₹ 100/-
ప్రతులకు:
చిట్టి పబ్లికేషన్స్‌, ఫోన్‌: 89195 49274
~
తెలంగాణ పబ్లికేషన్స్, 7207379241
~
లాల లింగమూర్తి
9866456009
murthylalahelp@gmail.com

Exit mobile version