Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మళ్ళీ.. మళ్ళీ ఇదే ఉగాది

[ఇప్పగుంట సూర్యనారాయణ మూర్తి గారు రచించిన ‘మళ్ళీ.. మళ్ళీ ఇదే ఉగాది’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]

న దేశ సగటు ఆయుర్దాయం ప్రకారం
జన్మకో ఉగాది.. మరొకటి చూడడం అనుమానమే?
సనాతన ధర్మం బడుగులకే.. బరితెగిస్తే లేదుగా!
నేటి మొక్కుబడి చట్టాల ఉచ్చులోబడ్డ కాపురాలు
పూట గడవక సతమతమౌతూంటే..
కోట్లకు పడగలెత్తి కోరుకున్నది సాధిస్తున్న
సంఘ విద్రోహులు, మాఫియా ముఠాలు,
రాజకీయ కోణాలకు బాణీలు కట్టి
లంచాలు లాంఛనంగా ఒడిసిపడుతున్న
ప్రజాసేవక సంగీత సామ్రాట్టులు
నీటి గుంటలు, చెరువులు కబ్జాలు చేస్తూ
పౌరుల ప్రాణాలను బలికోరుతుంటే..
ఉగాదులెన్నొచ్చినా భక్తిభావం పూజ్యం
లయతప్పిన ఉగాదికి కోకిల సైతం దూరం
నగరం నాజూకు, పల్లె పచ్చీసు మధ్య
పండుగ మర్యాదకు నిరసనగా మారుతున్న
కుహనా సాంప్రదాయక నిర్వాకం
తరతరాల సంస్కృతిని నిరసించడమే
పల్లెల ప్రగతికి బాటవేసిన కంప్యూటరీకరణ మూలంగా
పట్నం తాలూకు పార్టీల మాయలోపడిన పల్లెవాసులు
చుట్టరికాలను కాదంటూ కక్షిదారులౌతూ,
పలకరింపుల పరిమళం వసివాడి, కులాల కుంపట్లు
గల్లీనుండి ఢిల్లీ దాకా.. పగల పొగలు వ్యాప్తి చేస్తున్నాయి
ఈ.. ఈ నేపథ్యంలో ఉగాది పచ్చడి అనిష్టమైంది ‘విశ్వావసూ’
పండుగొచ్చిందని చెప్పుకోడానికే.. ‘పర్వం సర్వం నాస్తి’
కానీ, మరో అరవై యేళ్ళకు రానున్న ‘పరాభవ’ నాటికి
ఎన్నిమార్పులొస్తాయో? ఎవరెక్కడుంటారో?

Exit mobile version