Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మళ్ళీ ఇక్కడికే!!

[సముద్రాల హరికృష్ణ గారు రచించిన ‘మళ్ళీ ఇక్కడికే!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

లా మేను వాల్చాను
ఇలా ఎగిరిపోయింది మనసు
వేగమె దాని బలం, ఆవేగం గుణం!
పుడమి, కడలి గిరి కొమ్ముల దాటి పైకి
అంతరిక్ష సీమలోకి, అమాంతం ఆ రోదసిలోకి!
***
మెరుపు ధనువు వెల్గు త్రాటిని తాకింది
ఉరుము భేరీల దభదభమంటూ మోదింది
వాన చుక్క పుట్టినూరు వేడుకతో చూసింది
విలాసంగ వియచ్చాప వీథులలో విహరణ చేసీ
తేలిపోయి, పై నేముందోనని ఊర్ధ్వగామి అయ్యింది!
***
జాబిలితో మేలమాడింది
వెన్నెల జలపాతాల స్నానమాడింది
గ్రహాల సుదీర్ఘ పరిధుల్లో గిరగిర తిరిగింది
తారాగణ లోకాద్భుత కాంతుల పరామర్శించి
తారాడిన దేవాకృతుల కన్నార్పక పదేపదే స్తుతించింది!
***
అటు పైన నాకానికి చేరింది
ఐరావత మెదురొస్తే ఓసరిల్లి మొక్కింది
కామితాల స్వర్ణపత్రం చదవటమే మరచింది
కల్పవృక్ష ఛాయల్లో పరవశాన నిదరోయి
నందన వన శీతామృత పవనంలో సేద తీరింది!
***
అలసి సొలసి కిందికొస్తూ
కడలి అడుగు రత్నాలను శోధించింది
కడుభీకర బడబానల కుశలమ్ముల నడిగింది
పాతాళపు భోగిరాజుతో తానే మాటమంతీ కలిపి
ఎంతైనా మా భూలోకమె నాకిష్టమని ఇలు మరలింది!
***
ఏది నా ఉరకల గోదారి
ఏది కృష్ణవేణి, ఆ కొండ పైని కనకదుర్గ
ఏది పోతన భాగవతం, త్యాగరాజు గానం
ఏరి మన వారందరు, మనసెరిగిన మంచి వారని
విదేశాల నుంచి తిరిగొచ్చిన రీతి, నాలోకే వచ్చి చేరింది!
***
ఏ బంధనానికి చిక్కని విహగం
సుధాకలశ మాశించి ఎగసే సుపర్వం
జలభాండమె దక్కినా సర్దుకునే సువినయం
అలల సంద్రం, కలల ఎనలేని కల్పనల మంత్రదండం
ఆకాశ సరసి బిస తంతులకై యత్నించే రాజమరాళం!
***
చేజిక్కని పాదరసం
చదరంలో పట్టనె పట్టని వృత్తం
వృత్తంలో ఏ పట్టున అమరని చదరం
ఊహల రెక్కలతో గగనాంతాల దాటే మహా జవం,
ఇహమును మరువలేని మమ తెరిగిన సౌగంధిక సుమం!

Exit mobile version