ప్రభాకరం ఒక విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి, ఉద్యోగంలో ఉన్నంతకాలం చక్కగా విధి నిర్వహణ నిర్వహించి గౌరవంగా పదవీ విరమణ పొందాడు. ప్రభాకరం భార్య శాంతి, ఎంతో ప్రేమగా భర్తను చూసుకునేది, వాళ్ళ ఇద్దరి దాంపత్యం చాల అన్యోన్యంగా ఉండేది. వాళ్ల ప్రేమకు ప్రతి రూపంగా ఇద్దరు పిల్లలు. కొడుకు సురేష్ పెద్దవాడు, కూతురు స్వప్న, ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయి, పెద్ద చదువులు చదవటం వల్ల పెద్ద ఉద్యోగాలు వచ్చి విదేశాల్లో స్థిరపడ్డారు.
ప్రభాకరం పదవీ విరమణ అయిన రెండు నెలల తరువాత చాల హాయిగా సాగుతున్న, వాళ్ళ జీవితంలో పెను తుఫాన్, ప్రభాకరం భార్య శాంతి అకాల మరణం, పెద్ద అశనిపాతంలా తాకిన ఆ తాకిడికి, ప్రభాకరం మానసికంగా చాల కుంగిపోయాడు.
***
సౌందర్య, ప్రభాకరం కాలేజీ చదివే రోజుల్లో మంచి స్నేహితులు, ఒకరు అంటే ఒకరికి మంచి స్నేహబంధం ఉంది, కాలేజీ చదువులు అయిన తరువాత సౌందర్య పెళ్లి అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది, మళ్ళీ వీళ్ళు ఇద్దరూ కలవటానికి నాలుగు దశాబ్దాలు పట్టింది.
సౌందర్య పెళ్లి అయినా తరువాత, జీవితం ఏమీ సుఖంగా సాగలేదు. వ్యసనపరుడైన భర్త, అకాలమరణం చెందడం వల్ల, కూతురు మమతకు అన్నీ తానే అయి, ఎంతో కష్టపడి పెంచింది. ఉన్న ఒక్క ఆడపిల్ల ప్రేమించిన కారణంగా, ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి, అత్తవారింటికి పంపింది. కూతురు అత్తవారితో జరిగిన పెళ్లి ఒప్పందం కారణంగా కూతురు కాపురంలో మళ్ళీ అడుగుపెట్టకుండా దూరంగా ఒంటరిగా జీవితం సాగిస్తోంది.
ఇలాంటి నేపధ్యం గల రెండు భిన్న జీవితాల మధ్య ఒక అనుకోని సంఘటన వల్ల వచ్చిన మానసిక సంఘర్షణ..
ఈ నాటి కధ. అసలు సమస్య ఏమిటో, దాని పర్యవసానం ఏమిటో, పరిష్కారం ఏమిటో.. కనుక్కుందాం.. ఇక కథలోకి వెడదామా..
***
మధ్యాహ్నం సమయం సుమారు ఒంటిగంట అయ్యింది, ఒక కారు సర్రుమంటూ అపార్టుమెంట్ మధ్యలో ఉన్న పార్కింగ్ లో వచ్చి ఆగింది.
ప్రభాకరం, సౌందర్య ఇద్దరూ మెళ్ళో దండలతో దిగారు. వారికి వారి చిన్ననాటి స్నేహితుడయిన సుబ్రహ్మణ్యం, లక్ష్మి దంపతులు స్వాగతం పలికారు. అదే ఫ్లాట్స్‌లో ఉన్న జనం వాళ్ళ, వాళ్ళ కిటికీల్లోంచి వింతగా చూస్తూ, చెవులు కొరుక్కుంటుంటే, “వీళ్ళ వయసు చూస్తుంటే సుమారు అరవై పైన ఉండొచ్చు, ఇంత వయసులో వీళ్లకు పెళ్లి అవసరమా” అనుకుంటూ కొద్దిరోజులపాటు కాలక్షేపానికి మంచి సన్నివేశం దొరికినట్టు ఆనందం పడిపోతూ, తమకు తోచిన విధంగా ఊహించుకుంటుంటే, బాగా కావలిసిన వాళ్ళు వచ్చి శుభాకాంక్షలు చెబుతుంటే, సౌందర్య చేయి పట్టుకుని ప్రభాకరం తన ఫ్లాట్స్ దిశగా అడుగులు వేశాడు. అతన్ని అనుసరిస్తూ, సుబ్రహ్మణ్యం దంపతులు నడుస్తూ, ప్రభాకరం ఫ్లాట్ చేరుకున్నారు.
ఇంతలో లక్ష్మి “ఆగండి అన్నయ్యగారు” అంటూ ప్రభాకరంను ఆపి, ఇంట్లోకి వెళ్లి హారతి తెచ్చి, కొత్త దంపతులకు ఇచ్చి, లోపలకి సాదరంగా ఆహ్వానించింది. అలా తమ ఫ్లాట్ లోకి అడుగు పెట్టిన ప్రభాకరం, సౌందర్య చేయి పట్టుకుని తన మొదటి భార్య శాంతి ఫోటో దగ్గరకు తీసుకు వెళ్లి కంటి నిండా నీటితో నమస్కరిస్తూ, మూగగా అలా ఉండిపోయాడు. నెమ్మదిగా తేరుకుని, మెళ్ళో ఉన్న దండలు తీసి పక్కన పెట్టి, ఇద్దరూ అక్కడ ఉన్న సోఫాలో ఒదిగిపోయారు. ఇంతలో లక్ష్మి వాళ్ళ ఇంటినుండి తెచ్చిన భోజనం, డైనింగ్ టేబుల్‌పై ఏర్పాటు చేసి “రండి అన్నయ్య, వదిన గారిని తీసుకుని వచ్చి భోజనం చేయండి” అంటూ వడ్డించింది.
“ఒరేయ్ సుబ్బు, మీ దంపతులు ఇద్దరికీ ఇవ్వాళ మేము శ్రమ ఇచ్చాం, రేపటి నుండి మా సౌందర్య గరిట తిప్పుతుందిలే” అంటూ ప్రభాకరం భోజనానికి సిద్ధం అయ్యాడు. ఇలా వాళ్ళ నలుగురు భోజనాలు చేసేసి అన్నీ సద్దుకుని, అక్కడనుండి సుబ్రహ్మణ్యం దంపతులు వెళ్ళిపోతూ, “మీ ఇద్దరూ కాస్త విశ్రమించండి, రాత్రి భోజనం ఏర్పాట్లు అన్నీ మా ఇంట నుండే, మీరు ఏమీ ప్రయత్నం చేయకండి వదినమ్మా అర్థం అవుతోందా” అంటూ సౌందర్య బుగ్గపై చిన్న చిటిక వేసి నవ్వుతూ వెళ్ళిపోయింది లక్ష్మి.
ప్రభాకరం, సౌందర్య ఇద్దరూ చెరో కుర్చీలో కూర్చొని ఒకరికి ఒకరు చూసుకుంటూ నిశ్శబ్దంగా ఉండి, నెమ్మదిగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు పడిపోయారు.
ప్రభాకరం, సౌందర్య వైపు చూస్తూ ఆలోచిస్తూ, ‘ఎంత అందంగా ఉంది, వయసు వల్ల కూసంత వృద్ధాప్యపు ఛాయలు తప్ప, ఆ కళ్ళలో జీవం, కొంటెతనం ఇంకా ఏమీ పోలేదు, ఇన్నాళ్లు కష్టమైన జీవితం గడిపినా, ఆమె మనసు ధృఢత్వం వల్ల, ఇంకా ఆరోగ్యంగానే ఉంది’ అనుకున్నాడు. అలా ఏదో ఆలోచనలో తెలియని లోకంలో ఉన్న ప్రభాకరాన్ని, సౌందర్య తట్టి పలకరిస్తూ, “ఏమిటి ప్రభా! ఏదో ఆలోచనలో ఉన్నావ్” అంటూ చిన్నగా నవ్వింది.
“సౌందర్య! నిన్ను చూస్తే మళ్ళీ మన కాలేజీ రోజులు గుర్తుకు వచ్చాయి, నాకు తెలియకుండానే సుమారు నలభై రెండు వసంతాలు వెనక్కు వెళ్లాను. అమ్మాయి గారు ఎక్కడ మారలేదు, అదే నవ్వు, అదే నీ కళ్లలో ఉన్న కొంటెతనం దాన్నే ఆలోచిస్తున్నాను “ అంటూ చిలిపిగా నవ్వాడు ప్రభాకరం.
ప్రభాకరం మాట విన్న సౌందర్యకు ఆమెకు తెలియకుండానే సన్నటి సిగ్గుల దొంతర ముఖంపై పొడుచుకు వచ్చి వెంటనే మాయం అయ్యింది. “చాల్లే, అవకాశం వస్తే, ఇస్తే, ఇవే చిలిపి మాటలు చెబుతావ్, ఈ వయసులో మాట్లాడవలసిన మాటలేనా? అసలే భయం కొలుపుతూ ఆదుర్దా పెడుతున్న సమస్యను వదిలేసి, ఇప్పడా ఇలాంటి మాటలు? ” అంటూ ప్రభాకరం చేతిపై చిన్నగా కొట్టింది.
“ఏమిటో ఆ సీరియస్ మేటర్? నాకు తెలియక అడుగుతున్నా, తమరి ఇబ్బంది ఏమిటో తెలియచేస్తే, తమ భర్తగారు అదే ఈ ప్రభాకరం, తన భార్యగారి శంకను, భయాన్ని పోగొడతారు కదా” అంటూ నవ్వుతూ ఉన్న ప్రభాకరాన్ని చూస్తూ సౌందర్య..
“ప్రభా! మనం ఇలా పెళ్లి చేసుకోవటం మన పిల్లల నుండి ఎక్కడా అంగీకారం రాలేదు కదా, నీ పిల్లలు సురేష్, స్వప్నలు ఏమని అనుకుంటున్నారో? దూరంగా ఉన్న నా కూతురు, అల్లుడు ఎలా అనుకుంటున్నారో? అర్థం కావటం లేదు. మన ఇద్దరం ఇలా పెళ్లి చేసుకోవటం తప్పు అని అంటారేమో? ఏమైనా దెబ్బలాటలు వస్తాయేమో? అన్న ఊహలే చాల భయం కలిగిస్తున్నాయి”.
“సౌందర్య! అదా నీ భయం, దేనికి భయం, వాళ్లు అందరికి ఒక నెల ముందుగానే మన నిర్ణయాన్ని చెప్పాం. ఎవ్వరూ సమాధానం చెప్పకుండా, దాట వేస్తూ వచ్చారు. అంటే వాళ్ళ నిర్ణయం వచ్చే వరకు, మనం ఆగవలసిన అగత్యం ఏముంది? మన జీవితంలో మనకు పుట్టిన పిల్లలు, రెక్కలు వచ్చి ఎక్కడికో ఎగిరిపోయారు. వాళ్ళ జీవితం వాళ్ళది, మన జీవితం మనది. ఇందులో భయపడవలసిన కారణం ఏమీ లేదు.
బహుశా, నా అంచనా నిజమయితే ఈ రోజు రాత్రి లోపు మనకు ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ వస్తాయి. కంగారుపడకుండా నా పక్కన ఉండు. ఇప్పుడు మనం భార్యాభర్తలం. ఎవరి సమస్య అయినా మన ఇద్దరికీ చెందుతుంది. ఏది, ఏమైనా ఉమ్మడిగా ఎదుర్కొందాం. నా వరకు నేను తీసుకున్న ఈ నిర్ణయం పై నమ్మకం, విశ్వాసం ఉంది. ఎలా చెప్పాలో అలా చెబుతాను.
మనం ఈ రోజు కొత్తదంపతులం, సరదాగా మాట్లాడు, అంతే కానీ ఇలాంటి తలనొప్పి విషయాలు మనకు ఇప్పుడు ఎందుకు” అంటూ సౌందర్య తల నిమురుతూ అనునయంగా చెప్పాడు.
“ప్రభా! నీ మీద ఆ నమ్మకం ఉంది, నిన్ను నమ్మే నా జీవితంలో అతిపెద్ద అడుగు స్వతంత్రంగా వేసాను, కానీ ఏదో ఆదుర్దాగా ఉంది, నీ మాటలు వింటుంటే ధైర్యం వస్తోంది” అంటూ ప్రభాకరం చేయి గట్టిగా పట్టుకుంది. ఇద్దరూ అలా ఒకరి కొకరు ధైర్యం చెప్పుకుంటూ, ఒకరి చేతుల్లో ఒకరు విడువకుండా అలానే కూర్చున్నారు. అలా ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగానే సౌందర్య సెల్ ఫోన్ మోగటం మొదలు పెట్టింది.
మొబైల్ మోత వింటూనే వాస్తవంలోకి వచ్చిన సౌందర్య గబగబా ఫోన్ ఎత్తి “హలో! ఎవరు, నేను సౌందర్యను మాట్లాడుతున్నా” అని అనేలోపే అవతల కంఠాన్ని గుర్తుపట్టడానికి సౌందర్యకు పెద్ద సమయం పట్టలేదు. తన కూతురువైపు వియ్యాలవారు మాట్లాడుతున్నారని అర్థం అయింది.
“ఏమ్మా తల్లీ! వదినగారు! ఇలాంటి పరువు తక్కువ పని చేసారేమిటి? ఈ వయసులో మీకు పెళ్లి అవసరమా? ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు కనీసం మా పరువు, మర్యాద గురించి ఏమీ ఆలోచించారా? ఏదో మా వాడు మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు కదా అని తప్పలేదు కానీ, మీ లాంటి పరువు తక్కువ పనులు చేసే కుటుంబం నుండి సంబంధం చేసుకున్నందుకు మాకు తగిన శాస్తి జరిగింది.. నేను ఇన్ని మాటలు మాట్లాడుతుంటే, నువ్వేంటి ఉలకవు, పలకవు” అంటూ అటు వైపు వియ్యపురాలు నిగ్గ తీస్తుంటే సౌందర్యకు ఏం చెప్పాలో తెలియక భయంతో వణుకుతూ, ప్రభాకరం వైపు చూస్తూ తెలియకుండానే కాల్ కట్ చేసేసింది. సౌందర్య మోహంలో మార్పు, భయం పసికట్టిన ప్రభాకరం “ఏమైంది, సౌందర్య” అని అంటుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతూ భయంతో సౌందర్య..
“ప్రభా! నేను భయపడినదంతా అయ్యింది, మా వియ్యపురాలు నుండి ఫోన్, వాళ్ళ పరువు మంట కలిసిందట, చాల ఘోరం చేసేసానుట, నాకు ఏం చెప్పాలో, ఎలా మాట్లాడాలో అర్థంకాక ఫోన్ కాల్ కట్ చేసేసాను. మరి నా కూతురుకు ఏం కష్టాలు పెడతారో ఏమిటో?” అంటున్న సౌందర్యను చూచి
“సౌందర్య! ఈ సారి ఫోన్ వస్తే నాకు ఇవ్వు. అంతేగాని భయపడకు. ఇన్నాళ్లు నువ్వు ఒక్కదానివే, ఇవ్వాళ నుండి నేను నీకు తోడుగా ఉన్నాను. ఇక నుండి నీ సమస్యే, నా సమస్య. భయపడితే ఎలా? నేను చూచుకుంటాను” అని ప్రభాకరం చెబుతుండగానే మళ్ళీ అదే నెంబర్ నుండి ఫోన్ వచ్చింది, ఈసారి సౌందర్య ఫోన్ ఎత్తే లోపే, ప్రభాకరం ఫోన్ అందుకుని స్పీకర్లో పెట్టి కాల్ ఎత్తాడు.
“ఏవమ్మా! సమాధానం ఏమీ చెప్పకుండా ఫోన్ పెట్టేస్తున్నావ్” అంటూ అటువైపు రంకెలు మొదలు పెట్టిన వియ్యపురాలితో “అమ్మా! చెల్లెమ్మా!నేను మీ అన్నయ్యను, ప్రభాకరాన్ని, సౌందర్య భర్తను, మీ సమస్య ఏమిటో? నాకు చెప్పు” అన్న ప్రభాకరం మాటలు విని “మీరు ఎవరండీ? నేను సౌందర్యతో మాట్లాడాలి, ఫోన్ దానికి ఇవ్వండి” అంటూ హుకుం చేసింది.
“అమ్మా! చెల్లాయ్! సౌందర్య ఇప్పుడు నా భార్య, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అది మా ఇద్దరికి సంబంధించినదే, అందువల్ల నిస్సంకోచంగా నాతో నువ్వు మాట్లాడవచ్చు” అన్న ప్రభాకరంతో
“అవునండి, ఈ వయసులో మీరు ఇద్దరూ పెళ్లి చేసుకోవటం ఏమీ బాగోలేదు, మా పరువులు ఏమి కావాలి? సమాజం ఏమి అనుకుంటుంది? అన్న ఆలోచన ఏమీ ఉండక్కరలేదా? ఇవి అన్నీ సౌందర్యను అడుగుదామంటే మధ్యలో మీరు వస్తున్నారు” అంటూ వియ్యపురాలు కోపంతో ఊగిపోతోంది.
“అమ్మా! చెల్లాయి! ఇప్పుడు సౌందర్య నా భార్య, మేము ఇద్దరం ఇష్టపడి, పెళ్లి చేసుకున్నాం, అందులో సమాజానికి వచ్చిన ఇబ్బంది, కష్టం ఏమిటో? మీ కుటుంబానికి పరువు పోవటం ఏమిటో? నాకు అర్థం కాలేదు, మా పిల్లల్లకు మా నిర్ణయాన్ని ముందే చెప్పాం, వాళ్ళు సమాధానం ఇవ్వలేదు సరికదా దాటవేస్తూ వచ్చారు. అయినా వాళ్ళ అంగీకారంతో మాకు పని లేదు, మా నిర్ణయం మాది, మా జీవితం మాది, అందువల్ల మా నచ్చిన పని మేము కానిచ్చాం.
అదీ కాక మొన్నటిదాకా సౌందర్య ఒంటరిగా తన ఇంట్లోనే ఉండేది, తన తాహతుకు మించిన సంబంధం
కూతురుకు చేసిన పాపానికి, మీరు చేసుకున్న పెళ్లి ఒప్పందం ప్రకారం, కూతురు పెళ్లి అయిన దగ్గర నుండి ఒక్కసారి కూడా మీ ఇంటి గుమ్మం ఎక్కలేదు. తన కూతురు కాపురం కూడా చూడలేదు. ఇలాంటి పేద వియ్యపురాలు మీకు ఉందని, సమాజం ఏమి అనుకుంటుందో అని మీరు ఏనాడూ పిలవలేదు. మరి ఇన్నాళ్లు లేని ఆ పరువు ఇప్పుడు ఎక్కడ నుండి వచ్చిందో నాకు అర్థం కావటం లేదు? అందువల్ల మా ఈ పెళ్లి వల్ల, మీకు వచ్చిన సమస్య ఏమీ లేదు.
ఇకనుండి, సౌందర్య వదినే కాదు, ప్రభాకరం అన్నయ్య కూడా ఉన్నాడు. మమ్మలిని ఏమైనా పలకరించాలి అనుకున్నా, మాట్లాడాలి అనుకున్నా, పిలవాలన్నా, ఇద్దరం కలిసే వస్తాం, కలిసే మాట్లాడుతాం, కలిసే పరిష్కరించుకుంటాం, ఏమంటావు.. చెల్లెమ్మ!” అని అనగానే అవతల ఫోన్ కట్ అయిపోయింది.
ప్రభాకరం అలా చెప్పటం విన్న సౌందర్య భయపడుతూ ప్రభాకరాన్ని పట్టుకుని “ప్రభా! నా మీద కోపం, నా కూతురు కాపురం మీద ఏమీ చూపించరు కదా? దాని జీవితం చిక్కుల్లో పడదుగా?” అంటూ భోరున ఏడ్చేసింది.
“సౌందర్య! ఊరుకో.. నిన్నే! అలా ఏడవకు, నీ కూతురు జీవితానికి ఏమీ అవ్వదు. చదువుకున్న అమ్మాయి, తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని, అత్త వారింట్లో అందరిని ఎదిరించి నిలిచింది. మంచి అల్లుడు, ఆమె జీవితానికి ఏమీ సమస్య లేదు, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావ్. నీ కూతురుకు ఈ సమస్యను ఎదుర్కోవటం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. అయినా నువ్వు ఇవాళ కొత్త పెళ్లి కూతురివి, ఇలా ఏడిస్తే ఎలా? కాస్త ఊరుకో, నేను టీ పెట్టి ఇస్తా ఉండు, కాస్త సేద తీరు. అన్నీ సద్దుకుంటాయి.” అని అంటూ టీ కాచడానికి లేస్తున్న ప్రభాకరం చేయి పట్టుకుని ఆపింది.
“అంతేనంటావా.. ఇంక దేముడిదే భారం, అయినా నేను వచ్చాక ఇంకా నీకు వంటింట్లో పనేమిటి? నేనే టీ కాచి తీసుకువస్తాను” అంటూ ముఖం తుడుచుకుని టీ కాచడానికి వంటిట్లోకి అడుగు పెట్టింది. అలా ఇద్దరూ టీ తాగి యేవో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఒక గంట తరువాత సౌందర్యకు తన కూతురు నుండి ఫోన్ వచ్చింది.
“ప్రభా! నా కూతురు ఫోన్ చేస్తోంది, ఏదో భయంగా ఉంది, నేను ఇప్పుడు ఏమి మాట్లాడాలి? ఏమని చెప్పాలి? ఇందాక వాళ్ళ అత్తగారితో అలా మాట్లాడి తప్పు చేసావేమోనని భయంగా ఉంది” అంటున్న సౌందర్యకు “ఫోన్ తీయి, నీ కూతురితో మాట్లాడు, ఏమైనా ఇదివరకులా కాదు నేను ఉన్నాను. కానియ్యి” అంటూ ప్రభాకరం సైగ చేసాడు.
“హలో” అని సౌందర్య అనగానే “అమ్మా! ఫోన్‌లో స్పీకర్ ఆన్ చేయి” అంటూ అటువైపు నుండి కూతురు మమత మాట్లాడుతూ అంది. స్పీకర్ ఆన్ చేసి మళ్ళీ “హలో” అని సౌందర్య చెప్పగానే
“అమ్మా! నేను చెప్పేది శ్రద్ధగా మీరు ఇద్దరూ వినండి. ముందుగా మీ ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు, నేను, మీ అల్లుడు ఇద్దరం కలసి మనస్ఫూర్తిగా మీ నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం. నూతన వధూవరులకు ఇద్దరికీ శుభాభినందనలు.
అమ్మా! ఇన్నాళ్లకు నువ్వు జీవితంలో సరైన నిర్ణయం తీసుకున్నావ్. ఈ వయసులో నేను నిన్ను దగ్గరుండి చూసుకోవాలి, కానీ నా మెట్టినిల్లు పరిస్థితులు, నేను తెగించి ముందుకి రాకపోవటం వల్ల. ఇంతకాలం నీకు ఎంతో ద్రోహం చేసాను. ఏదో నా స్వార్థానికి నేను పెళ్లి చేసుకుని వెళ్లి పోయానే కానీ, నన్ను పెంచి పెద్ద దాన్ని చేసిన నిన్ను, పెళ్లి ఒప్పందం అన్న ఒక్క మాటలో ఎంతో దూరం చేసుకున్నా. నేనే సర్వస్వం అనుకున్న నిన్ను, ఒక అనాథలా దూరం పెట్టాం. ఇందాక మా ఇంట్లో, మా అత్తగారితో పెద్ద యుద్దమే జరిగింది.
ఇలా నీవు పెళ్లి చేసుకోవటం వల్ల, వాళ్ళ పరువు పోయిందట. నాకు ఎలాగో అర్థం కాలేదు, అసలు ఇన్నాళ్లు నువ్వంటూ ఒక్కరున్నారని, నీకూ విలువ ఉందని గుర్తించని వీళ్ళకు, నా నుండి నిన్ను విడతీసి దూరంగా పెట్టేసిన వీళ్లకు, అనుకోకుండా నీ మీద ప్రేమ పుట్టుకు వచ్చింది.
ఇంకా ఏవో అవాకులు, చెవాకులు పలుకుతూ ఉంటే, నేను మొదటిసారిగా వీళ్లకు ఎదురుతిరిగి సమాధానం చెప్పాను. ఇన్నాళ్లు నోరు విప్పని నా భర్త, అదే మీ అల్లుడు ఈ సారి నాకు బాసటగా వచ్చారు. కేవలం ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా ఇన్నాళ్లు ఈ దుర్మార్గాలను భరిస్తున్న నాకు, నేను ఎదురు చెప్పటం, దానికి నా భర్త తోడుగా రావటం వాళ్ళు ఇంక ఏమీ చేయలేక, ఊరకుండి పోయారు.
ఇక్కడ మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, ప్రభాకరం అంకుల్ ఎలాంటివారో, ఎంత మంచివారో, మీరు
ఎలాంటి మంచి స్నేహితులో నాకు తెలుసు. అమ్మయ్య. ఇన్నాళ్లకు నాకు నీ మీద ఉన్న దిగులు పోయింది, నా కాపురం గురించి ఏమీ బెంగ పడకు. నీకు తెలుసుగా నన్ను వదిలి ఈయన ఉండలేరుగా.. మేము చక్కగా ఉంటాం. ఇన్నాళ్లు ఎంతో కష్ట జీవితం అనుభవించావు. ఇకనైనా సుఖంగా ఉండు, ఈ వయసులో తోడు దొరకటం, మంచి జీవితం రావటం చాల అదృష్టం, దేమునికి ఇంకా నీ మీద మంచి మనసు ఉంది, చాల మంచి వ్యక్తి అయినా ప్రభాకరం అంకుల్.. సారీ, డాడీని నీకు ఇచ్చాడు.” అని అనటంతో సౌందర్య ఒక్కసారిగా ఆనందం తట్టుకోలేక ఏడ్చేసింది.
“అమ్మా! అమ్మా! అంటూ అటువైపు మమత అంటున్నా ఇంక ఏమీ మాట్లాడలేని సౌందర్య స్థితిని చూసి ప్రభాకరం ఆ ఫోన్ అందుకుని “ అమ్మా! మమత” అని పలకరించగానే అటు వైపు మమతకు కూడా కళ్ళ వెంట కన్నీళ్లు రాలాయి.
“డాడీ!.. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి, సంతోషంగా ఉండండి, ఇన్నాళ్లు నాకు ఉన్న బెంగ ఇంక తీరిపోయిన్నట్టే, నిజంగా చాల ఆనందంగా ఉంది, నేను, మా ఆయన మిమ్మల్ని చాల మనస్ఫూర్తిగా మా జీవితల్లోకి ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ మీ కూతురు ఉంది అన్నది గుర్తుపెట్టుకుని అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండండి. అన్నయ్య, అక్కలు ఈ సారి విదేశాల నుండి వచ్చినప్పుడు చెప్పండి, మేము కూడా వచ్చి మన కుటుంబం అంతా ఆనందంగా కొద్ది రోజులు గడుపుదాం. ఇంక ఉంటాను, అమ్మ జాగ్రత్త” అంటూ మమత ఫోన్ ముగించింది. వెయ్యి టన్నుల భారం దిగిపోయినట్టున్న సౌందర్య ముఖంలో చిరునవ్వులు విరిశాయి. చాలా ప్రశాంతతను చేకూర్చుకుని, ఏదో తెలియని ఆనందంలో, ప్రభాకరం చేయి గట్టిగా పట్టుకుని అతని భుజంపై వాలిపోయింది.
ఇలా సాయంత్రం అయ్యిందో లేదో సుబ్రహ్మణ్యం దంపతులు ఏవో సామానులు, రెండు బుట్టలను తీసుకువచ్చి నేరుగా లోపల పెట్టారు.
అవి అందుకుని లక్ష్మి లోపలకు తీసుకుని వెళ్లిపోయింది. “ఏంట్రా సుబ్బు, ఇంతకూ ఆ లోపలకు తీసుకువెళ్ళింది ఏమిటి?” అని ప్రభాకరం అనగానే, “ఏదో మీ చెల్లాయి తెమ్మంది, నేను తెచ్చాను, ఊరికినే సణుక్కోకు. ఆడవాళ్లు ఏం చేద్దాం అనుకున్నారో అది మనం చేసేయటమే మంచిది, జీవితం సుఖంగా ఉంటుంది. ఇక నుండి నువ్వూ అదే పాటించు, ఇన్నాళ్లు బలాదూర్‌గా తిరిగావు, ఏవమ్మా సౌందర్య.. అంతేనా” అంటున్న సుబ్బు మాటలకు అందరూ హాయిగా నవ్వేశారు.
“ఒరేయ్ సుబ్బు, ఇంతకూ ఆ లోపలకి తీసుకువెళ్ళింది, ఏమిటో చెప్పావు కాదు” అంటున్న ప్రభాకరంతో
“ఏమీ లేదురా, ఏవో కొద్దిగా పూలు, పండ్లు, స్వీట్లు, హాట్లు, కొత్త దంపతులు కదా.. ఏవో అచ్చట్లు, ముచ్చట్లు తీర్చుకుంటూ కానిస్తారని,.. కాదనకు” అని సుబ్రహ్మణ్యం చెప్పాడు.
“ఒరేయ్, ఇంకా ఏమిట్రా ఈ పిచ్చి? ఈ వయసులో ఇంకా?” అంటున్న ప్రభాకరాన్ని అపి, సుబ్బు ఇలా చెప్పసాగాడు.
“ప్రభా! జీవితంలో సుఖాలు, కష్టాలు అన్నీ కలిసే ఉంటాయి, కానీ ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలి. ఎక్కడో విన్నట్టు గుర్తు, రొమాంటిక్‌గా ఆలోచించే వాళ్ళ జీవితాల్లో పెద్దగా రోగాలు రావని, హాయిగా జీవిస్తారని. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండడంవల్ల వాళ్ళ శరీరానికి తగ్గ ఎంజైమ్‌లు వృద్ధి చెందుతాయని. అందువల్ల కాస్త జీవితాన్ని కొత్త దృక్కోణంలో చూస్తూ సాగించు. ఇంతకూ నీ పిల్లల నుండి ఫోన్, సమాచారం గానీ వచ్చిందా, కనీసం ఫోన్లో మెసేజ్ కూడా చెయ్యలేదా?” అని సుబ్రహ్మణ్యం అంటుంటే.
“లేదురా, ఇప్పుడే నా కొడుకు రాత్రి 7.30 కు ఫామిలీ కాల్ ఉందని, రెడీగా ఉండమని మెసేజ్ పెట్టాడు, పిల్లలను ఎలా సమాధాన పర్చాలో? అర్థం కాక కొంత విచిత్రమయిన పరిస్థితిలో ఉన్నా.” అంటూ సమాధానం ఇచ్చాడు ప్రభాకరం.
“సరే అలా అయితే, నీ ఫ్యామిలీ కాల్ అయినా తరువాత మేము డిన్నర్ ఏర్పాట్లు చేస్తాం. ఏమీ జరగదులే, అంతా సవ్యంగా ఉంటుంది, నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోకు, అన్నీ సద్దుకుంటాయి.” అంటూ సుబ్రహ్మణ్యం దంపతులు వెళ్లిపోయారు.
అలా అనుకున్నట్టుగానే రాత్రి, 7.30 కు ప్రభాకరం, సౌందర్య జంట laptop ఎదురుగా పెట్టుకుని ఫామిలీ కాల్ కోసం కూర్చున్నారు. అందరూ వీడియో కాల్ లోకి వచ్చేసిన తరువాత, ప్రభాకరం కొడుకు సురేష్ మాట్లాడటం మొదలు పెట్టాడు.
“నాన్నా, ఎలా ఉన్నావ్? నీ ఆరోగ్యం ఎలా ఉంది? మేము అందరం బాగానే ఉన్నాం. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి, మరి నీ దగ్గర సౌందర్య ఆంటీ ఉన్నారు.. ఆంటీ మీరు ఏమీ అనుకోకపోతే నాన్నతో ఏకాంతంగా మాట్లాడాలి” అన్న మాటలకు సౌందర్య అక్కడ నుండి లేచి వెళ్ళబోయింది, ఇంతలో ప్రభాకరం కలగచేసుకుని, సౌందర్యను వారిస్తూ, తన పక్కన కూర్చోపెట్టుకుని, “ఒరేయ్ అబ్బాయి, ఈమె ఇప్పుడు నాకు భార్య, మేము ఇద్దరం ఒక్కటే, నువ్వు ఏమి చెప్పదలుచుకున్న చెప్పు, మాకు ఏమీ అభ్యంతరం లేదు నువ్వు మాట్లాడు” అంటూ కొడుక్కి గట్టిగా చెప్పాడు.
“నాన్న! నువ్వు ఈ వయసులో చేసిన పని గొప్పగా ఏమీ లేదు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఈ వయసులో ఈ పెళ్లి మీకు అవసరమా? అమ్మను మరచిపోయావా? మేము అంతా లేమా? నువ్వు ఇక్కడకు వచ్చేస్తే మనం అంతా కలసి ఉండేవాళ్ళం కదా, నువ్వు ఒంటరివాడివి అని ఎలా అనుకున్నావ్? నా భార్య నిన్ను సరిగ్గా చూడలేదా? చెల్లి స్వప్నది ఇదే ఆలోచన. ఎందుకో మాకు గొప్పగా అనిపించలేదు, సౌదర్యం ఆంటీ ఇవి అన్నీ మీరు ఉండగా అడగటం బాగుండదనే, మిమ్మల్ని వెళ్లి పొమ్మన్నాను, కానీ నాన్న తన పక్కన మిమ్మల్ని కూర్చోపెట్టారు, ఏమీ అనుకోకండి.
సమాజం ఏమనుకుంటుంది? మన చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు ఏమి అనుకుంటారు, ఇలాంటి విషయాలు ఏమైనా ఆలోచించావా నాన్నా? పైగా మేము ఏమీ చెప్పకుండానే మీరు ఇవ్వాళ పెళ్లి చేసుకుని వచ్చేసారు. సారీ. నాన్నా! మీ నిర్ణయాన్ని ఎప్పుడూ మేము కాదనలేదు, ఈ సారి మాత్రం ఎందుకో సరిపెట్టుకోలేక పోతున్నాం., అందుకే మీకు వ్యతిరేకంగా మాట్లాడవలసి వస్తోంది. పైగా మన అమ్మ తరపు బంధువులు నాకు ఫోన్ చేసి మీ నాన్నేదో దేశాన్ని ఉద్ధరిస్తునట్టున్నాడు అంటూ అదో రకంగా మాట్లాడారు. వాళ్లకు ఏమి చెప్పాలో, నాకు తెలియక సిగ్గు పడుతున్నా. నాన్నా! మీరు తొందర పడ్డారేమో అని నా అభిప్రాయం, చెల్లి కూడా అలాగే అనుకుంటోంది” అంటూ తన ప్రసంగాన్ని, చాలా అసహనంగా ముగించాడు.
ఇంతలో కోడలు కలగ చేసుకుని, “ మామ్మయ్యగారు! నేను మిమ్మల్ని సరిగ్గానే చూసుకున్నాను కదా, మీకు అన్నీ సమయానికి ఇచ్చాను కదా, నన్ను అందరూ మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు, అందుకే మీరు ఇంకో పెళ్లి చేసుకున్నారు అంటూ ఆడిపోసుకోవటం మొదలు పెట్టారు. నా మీద కోపం ఏమైనా ఉందా?” అంటూ కాస్త దీర్ఘం తీసింది.
“నాన్నా! అన్న అడిగిన ప్రశ్నలు, అనుమానాలు అన్నీ నాకు ఉన్నాయి” అంటూ ఆగిపోయింది కూతురు స్వప్న.
ముఖమంతా ఎర్రగా కందిపోయి, ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటున్న సౌందర్య వైపు ప్రభాకరం చూసి నెమ్మదిగా తన చేయి పట్టుకుని తన దగ్గరకు లాక్కుని కంగారు పడవద్దు అన్నట్టుగా సైగ చేసాడు.
“అందరూ చెప్పవలసింది, అడగవలసింది అయ్యిందా, చెప్పదలుచుకున్నది ఇంతేనా.. స్వప్నా.. మీ ఆయన లేడా? మరి ఆయన ఏమీ అడగరా? మీ అందరూ మీ ప్రశ్నలు, సమస్యలు చెప్పుకోవటం అయిపోతే, నేను చెప్పటం మొదలు పెడతా” అని అనగానే
“నాన్నా! మా ఆయన మధ్యలో వస్తారు, మీరు మాట్లాడండి” అంటూ స్వప్న సెలవిచ్చింది.
“సరే అయితే. ఒరేయి అబ్బాయి!, స్వప్న, అమ్మా కోడలు.. నాకు నా భార్య శాంతితో సుమారు 40 సంవత్సరాలు దగ్గర అనుబంధం. ఎంతో అన్యోన్యంగా ఉండే వాళ్ళం, తాను నాకు నిజంగా అర్ధాంగి అంటే నా ఆలోచనలో సగం నిర్ణయం తనే తీసుకునేది, తాను లేనిదే నేను ఏ పని చేయలేని స్థితికి నన్ను తీసుకు వెళ్ళింది. ఇలా ఎంతో నా జీవితాన్ని చక్కదిద్దిన నా శాంతి అన్నీ బాగున్నాయి, ఇంక శేషజీవితాన్ని సరదాగా తిరుగుతూ అన్నీ చూస్తూ గడుపుదాం అని అనుకుంటుండగా తన అకాల మరణం, నా జీవితంలో ఎదుర్కొన్న పెద్ద తుపాన్. తాను లేని లోటు, నాకు అశనిపాతం, తనని మరచిపోలేని స్థాయికు వెళ్ళిపోయా. నా జీవితం శూన్యంగా అయిపోయింది.
పోనీ మీ దగ్గరకు వచ్చేసి ఉందామంటే నాకు అక్కడ ఏముంది, ఎవరున్నారు, కనీసం పలకరించే వాళ్ళు కూడా లేరు. మీరు అంతా ఉద్యోగాల్లో ఉంటారు, వారాంతంలో ఇంట్లో ఉన్నా, మళ్ళీ వారానికి తగ్గ పనులు సమకూర్చుకుంటూ ఉంటారు. మనుమడితో ఆడుదాం అని అనుకున్నా వాడి భాష వాడిది, వాడిది అంతా స్పీడ్ యుగం. కోడలు నన్ను చక్కగా చూచేది, ఏ విధంగానూ నాకు ఏ లోటు లేకుండా ఉంచేది, తన తండ్రిని ఎలా చూస్తుందో అలా చూసింది. నాకు బంగారం లాంటి కోడలు, అల్లుడు, నా పిల్లల కన్నా ఎక్కువగా నన్ను వాళ్ళే చూసేవారు. కానీ ఇవి అన్నీ భౌతిక అవసరాలు, మానసికంగా నాకు భార్య లేని లోటు బాగా కనిపించేది, ముఖ్యంగా రాత్రిళ్ళు, ఏమీ నిద్ర పట్టక పోతే తనను లేపేసి కబుర్లు చెప్పేవాడిని, తన స్పర్శలో ఏదో తెలియని ఒక మాయ ఉంది, నాకు ఏ బాధ, ఆనందం కలిగినా తన చెయ్యిలో చెయ్యి వేసి మాట్లాడితే కానీ ప్రశాంతతకు వచ్చేది కాదు.
ఇవి అన్నీ ఒక మగాడికి ఆడదానివల్లే, అదీ తనకు ఇష్టమయిన వారి వల్లే కుదుట పడతాయి అని నా అభిప్రాయం. అలా నా శాంతితో హాయిగా సాగిపోతున్న జీవితంలో తాను ఒక్కసారిగా లేకపోవటం నేను తట్టుకోలేక పోయను. ఎన్నో రాత్రులు ఏడుస్తూ, ఒంటరిగా ఉండిపోయా, ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలనిపించేది, మరి ఈ విషయాలు మీ దగ్గర ఎలా చెప్పేది? చెబితే మీరు ఎలా పరిష్కరించగలరు? నా భార్య శాంతి ఒక్క రెండు రోజులు పుట్టింటికి వెడితేనే, నేను ఉండలేక పోయేవాడిని. వెంటనే రమ్మని హడావిడి చేసేసేవాడిని. అలాంటిది ఇప్పుడు తాను పోయి రెండు సంవత్సరాలు అయ్యింది, కానరాని లోకాలకు వెళ్ళిపోయింది. తను కావాలి అంటే, నేను అక్కడకు వెళ్ళాలి తప్ప మరో మార్గం లేదు. ఎంతో అన్యోన్యంగా ఉండే నాకు ఇలా తన మరణం ద్వారా విడిపోవటం కలిగిన బాధ, మాటల్లో వర్ణించ లేని ఈ బాధను, మీకు ఎలా తెలపాలి?
ఈ వయసులో ఏదో శారీరక సుఖం కోసం కాదు, మానసిక సంతోషం కోసం ఇంకో తోడు అవసరం.అదీ భార్య స్థానంలో ఉండాలి. నేను నా శాంతి పోయిన తరువాత రెండేళ్లు, ప్రయత్నం చేశా, రెండురోజులు తన విరహం భరించలేని నేను, రెండేళ్లు ఎలా గడిపానో నాకే తెలియదు.. మీరు సరిగ్గా నన్ను చూడలేదని కాదు. మీ దగ్గరకు రావటం వల్ల నా ఒంటరితనం పెరిగిందే తప్ప ఏ మాత్రం తగ్గలేదు. మీరు నన్నుఎంత బాగా చూసుకున్నారో నాకు తెలుసు, కానీ కొన్ని అనుబంధాలు మాత్రం జీవిత భాగస్వామితోనే పంచుకోగలం.
మా సుమారు నలభై సంవత్సరాల జీవితంలో ఎన్నో సుఖాలు, మధుర క్షణాలు అనుభవించాం, ఈ వయసులో ఏదో శారీరక సుఖం కోసం కన్నా భార్య అన్నది మానసిక స్వాంతన కోసం ఉండాలి, బహుశా, నేను చెప్పే ఈ విషయం మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. జీవితం సాగేకొద్దీ, ఈ బంధం ఎలాంటిదో మీకే అర్థం అవుతుంది. నా భోజనం, రోజూ వారి అవసరాలు, ఆలనా పాలనా చూసేందుకు మీరు అంతా ఉన్నా, మరి మానసిక శాంతి తీర్చడానికి నాకు ఎవరున్నారు?
అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నా, అదీ కాక నేను, సౌందర్య చిన్ననాటి స్నేహితులం, కాలేజీలో చదివిన రోజుల్లో నేను ప్రేమించిన అమ్మాయి, ఆ విషయం తనకు ఇప్పటి దాకా చెప్పనేలేదు. ఏదో పరిస్థితులు కుదరక, కలిసిరాక నా ప్రేమను తెలియపరిచే అవకాశం, అవసరం రాకుండానే తను పెళ్లి అయి వెళ్ళిపోయింది.
నేను కూడా తరువాత వేరే విధంగా జీవితంలో స్థిరపడ్డాను. అదే సమయంలో శాంతితో నా జీవితం మొదలు అయ్యింది. నా శాంతికి కూడా నా ప్రేమ సంగతి తెలుసు, సౌందర్య చిన్న నాటి ఫోటో నా దగ్గర ఉండటం, అది చూపి తను సరదాగా అప్పుడప్పుడు ఆటపట్టించేది కూడా. కానీ ఇలాంటి అవసరం నా జీవితంలో వస్తుందని ఏనాడూ అనుకోలేదు. అలాగే సౌందర్య జీవితంలో నాలాగే ఒంటరి పక్షి కావటం, మలివిడతలో మా ఇద్దరినీ దేముడు ఇలా కలుపుతున్నడని ఆశించాం. అందుకే ఈ విధంగా పెళ్లి చేసుకున్నాం.
ఇంక లోకులు అంటావా, వాళ్ళు కాకులు, మన కష్టాలు, కన్నీళ్లతో వాళ్లకు పనిలేదు, వాళ్లకు కాలక్షేపంకు ఏదో ఒక సమస్య కావాలి, ఇవ్వాళ నేను, నా సమస్య. రేపో ఇంకోటి రాగానే మనది మరచిపోతారు. ఇంక అమ్మ ఇంటివైపు వాళ్ళు అంటావా, నా భార్య శాంతే ఇక లేదు. శాంతి మరణం తరువాత నుండి నన్ను చూడటానికి ఎవరు వచ్చారు? ఇలాంటి వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచించడం శుద్ధ దండగ.
సౌందర్య కూడా ఎన్నో కష్టనష్టాలతో జీవితం సాగించింది. తను ఒంటరిది, నేను ఒంటరివాడిని, మేము ఇద్దరం ఒక్కటి అయితే ఒకరికి, ఒకరు తోడు ఉంటాం. కలసి ఉంటే తప్పేంటి? భగవంతుడు ఇలా మాకు అవకాశం ఇచ్చాడు అని అనుకున్నా. మీరు ఎలాగూ విదేశాలనుండి రారు, నేను ఎలాగూ ఈ దేశం విడిచి రాలేను.
మేము మహా బాగా బతికితే ఇంకో 15 సంవత్సరాలు ఉంటాం, తరువాత చెప్పలేం, ఉన్నంతకాలం కావలిసినంత మానసిక శాంతితో మమ్మల్ని ఇలా ఉండనివ్వండి. మీకు ఈ విషయాలు గురించి ఇంత వివరణ కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ అందరిలాగానే, నా పిల్లలు కూడా అపోహపడతారని, మీ అపోహలు, సందేహాలు తీర్చాలి అను అనుకున్నా.
సౌందర్యా!.. నేను నిన్ను కాలేజీలో ప్రేమించిన మాట, నీతో జీవితం పంచుకోవాలని అనుకున్న మాట వాస్తవం, కలలు కన్నది నిజం, నీకు ఏనాడూ చెప్పే పరిస్థితి ఆ రోజుల్లో రాలేదు. ఇప్పుడు వచ్చింది, ఇన్నాళ్లకు నా ప్రేమ ఫలించింది. ఇప్పటికయినా నీవు నా జీవితాంతం నాతో కలసి ఉండు” అంటూ సౌందర్యను దగ్గరకు తీసుకుంటూ తన సుదీర్ఘ ప్రసంగం ముగించాడు ప్రభాకరం.
భయంకరమయిన నిశ్శబ్దం అక్కడ ఆవహించింది, కాసేపటికి ప్రభాకరం అల్లుడు, మరి ఎప్పుడు వచ్చి విన్నాడో తెలియదు కానీ, “శభాష్ మామయ్యా! మీ నిర్ణయం అమోఘం, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా సమర్ధిస్తున్నాను” అంటూ చప్పట్లు కొట్టాడు.
ఇంతలో తేరుకున్న ప్రభాకరం కొడుకు, సురేష్ నెమ్మదిగా లేచి, మోకాళ్ళ మీద నిలబడి దండం పెడుతూ “నాన్న! నిన్ను ఎంత ఇబ్బంది పెట్టాం, ఎంత మానసికంగా నలిగిపోతూ కుంగిపోయావో నాకు ఇప్పటికి అర్థం అయ్యింది, అసలు నువ్వు ఇన్నాళ్లు ఎలా ఉన్నావో? నాకు అర్థం కావటం లేదు. మేము నిన్ను అడిగిన తీరు చూస్తే మాకే సిగ్గు వస్తోంది. మీ నిర్ణయమే మా నిర్ణయం, మీ సుఖమే, మా సుఖం. మీరు సుఖంగా ఉంటే మాకు అంతకన్నా ఏమి కావాలి.
సౌందర్య ఆంటీ.. సారీ, అమ్మా! నాన్నను జాగ్రత్తగా చూసుకో. త్వరలో మేము అక్కడకు వచ్చి మిమ్మల్ని
అందరినీ కలుస్తాం. మిమ్మల్ని మా నాన్న జీవితంలోకే కాదు, మా జీవితంలోకి ‘అమ్మ’లా ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు చాల ఆనందంగా ఉంది” అంటూ తన ప్రసంగం ఆపేసాడు. అప్పటిదాకా ఉన్న గంభీర వాతావరణం ఒక్కసారిగా మారి పోయి, తుపాను తొలగి, చిరుజల్లులా మారి పోయింది, అందరూ యేవో మాటలు మాట్లాడుకుని సెలవు తీసుకున్నారు. అప్పటిదాకా ఉన్న ఏదో తెలియకుండా ఉన్న భయం, ఆదుర్దా ప్రభాకరం, సౌందర్య ముఖాలనుండి తొలగిపోయాయి. ఏదో తెలియని హాయితో, ఏంతో సంతృప్తిగా ఒకరికొకరు చూసుకున్నారు.
“ప్రభా! నన్ను నిజంగానే కాలేజీ రోజుల్లో ప్రేమించావా? మరి ఎప్పుడూ చెప్పలేదే? నా ఫోటో నీ దగ్గర ఉందా? ఏదీ చూపించు. నిజం చెప్పు. నువ్వు ప్రేమించావు అన్న తలపే, ఎంతో మధురంగా ఉంది, ఏదో తెలియని అనుభూతికి లోనవుతున్నా, మరి ఆ రోజుల్లో ఎందుకు ధైర్యం చెయ్యలేదు, ఒకవేళ చేసి ఉంటే మన జీవితం ఇంకోలా ఉండేది కదా.” అంటూ ప్రభాకరంను పట్టుకుని ఏడ్చేసింది.
“సౌందర్య! ఛ ఛా. ఏమిటా కన్నీళ్లు? ఈ పాటికయినా భగవంతుడు మనలని కలిపాడు, అందుకు ఆయనకు ఎంతో కృతజ్ఞతతో ఉండాలి, అయినా ఇవ్వాళ మన పెళ్లి రోజు, కొత్త జీవితానికి దారి చేసుకున్నాం. ఇలాంటి మంచి రోజున నీ కంట కన్నీరు అంత మంచిది కాదు” అంటూ సౌందర్య చెక్కిళ్ళ మీద ఉన్న కన్నీళ్లు తుడుస్తూ హత్తుకుపోయాడు ప్రభాకరం.
కాసేపటికి కాలింగ్ బెల్ శబ్దంతో ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళు ఇద్దరూ వెళ్లి తలుపు తీశారు. సుబ్రహ్మణ్యం, లక్ష్మి దంపతులు రాత్రి డిన్నర్ తీసుకు వచ్చారు. అందరూ కలసి డైనింగ్ టేబిల్‌పై కూర్చుని చక్కగా ఆరగించారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయం మరచిపోయి కడుపు నిండా తృప్తిగా తిన్నారు. సుబ్రహ్మణ్యం భార్య లక్ష్మి, సౌందర్యను తీసుకుని బెడ్ రూంలోకి వెళ్ళిపోయింది. ఈ లోపల ప్రభాకరం సౌందర్య కూతురితో, తన పిల్లల్తో జరిగిన సంభాషణ మొత్తం, వివరంగా చెప్పాడు. అది విన్న ఇద్దరి స్నేహితులు ఎంతో సంతోషంగా, హాయిగా సమస్య తీరిపోయిందన్న భావనతో మనసులు తేలిక చేసుకున్నారు.
కానీ సుబ్రహ్మణ్యం మాత్రం ఒక సందేహంతో కాస్త సతమతం అయి, ఇంకా ఆగలేక ప్రభాకరాన్ని అడిగాడు. “ఒరేయి ప్రభాకరం, నాకు ఒక సందేహం, నువ్వు కాలేజీ రోజుల్లో ప్రేమించింది మన క్లాసుమేట్ ‘ఉష’ను కదా, ఆమెతో జీవితం గడపాలని కోరుకున్నావు కదా, కనీసం ఆ అమ్మాయికి చెప్పకుండానే నీ ప్రేమ విఫలం అయ్యింది, పైగా తన ఫోటో కూడా దాచుకున్నావు కూడా, మరి ఇప్పుడీ సౌందర్య అంటావేమిటి? నువ్వు అలా ఎందుకు చెప్పావో నాకు అర్థం కావటం లేదు? లేక సౌందర్యను కూడా కాలేజ్ రోజుల్లో ఇష్టపడ్డావా ఏమిటి” అంటూ నెమ్మదిగా ప్రభాకరం చెవిలో అన్నాడు.
దానికి ప్రభాకరం నవ్వి “సుబ్బు, నువ్వు అన్నది అక్షరాలా నిజం. నేను కాలేజీ రోజుల్లో ప్రేమించింది, వెనుకబడింది, ఉష గురించే, అది గతించిపోయిన వాస్తవం. అది ఇంక ఎప్పటికి, ఎవ్వరికీ తెలియదు. ఒక్క నీకు, నాకు తప్ప. ఇంక ఎలాగూ నా జీవితంలో ఉష తిరిగిరాని వసంత కోయిల.
కానీ నేను మా పిల్లలకు సౌందర్య అని అబద్ధం చెప్పటంలో నా స్వార్థం కొంత ఉంది, నాకు ఇప్పటికి సాంత్వన కలిగించడానికి ఒక మనసు కావాలి, నేను ప్రేమించిన అమ్మాయి ఈ సౌందర్య అని చిన్న అబద్ధం చెప్పటంవల్ల నా పిల్లలు నాకు దగ్గర అయిపోయారు. వాళ్లకు ఎంతోకాలం నుండి నాన్న ఊహించుకున్న కల తీరుతోంది అన్న ఆనందంలో, నేను ఆనందంగా ఉంటాను అన్న ఆశతో తొందరగా ఒప్పేసుకున్నారు. ఇంక సౌందర్య కూడా వాళ్ళ ఎదురుగా అలా చెప్పటంతో తను నిజమే అని నమ్ముతూ నన్ను ఎంతో ఆరాధనగా చూస్తోంది. ఇలాంటి మధుర క్షణాలు దక్కాలి, మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆనందాలు పొందాలి అంటే, నేను చెప్పిన అబద్ధాన్ని నిజం చేయాలి. ఈ వయసులో ఇలాంటి మధురానుభూతి మనసుకు దక్కటం మామూలు విషయం కాదు, ఒక్క అబద్ధం నాకు నా కుటుంబాన్ని, నా సౌందర్యను దగ్గరకు చేర్చింది.
ఇంక నా సౌందర్య ప్రేమలో మునిగి తేలటమే తరువాయి, ఉక్కిరి బిక్కిరి అయ్యే క్షణాలు ఆసన్నమయ్యే తరుణం వచ్చింది.
రాని వసంతాన్ని కోరుకుంటూ జీవించటం కన్నా, ముందున్న పండు వెన్నెలను ఆస్వాదించడం మంచిది అని అనిపించింది. ఈ అబద్ధం ఈ జీవితంలో ఎంత అందంగా మలవాలో అలా మలుచుకుంటా. ఎలాగూ పడమటకు వచ్చేసింది మన జీవితం. ఈ వయసులో ఇలాంటి మధుర క్షణాలు గడుపుతూ కాలంలో కలిసిపోవటమే మన ప్రస్తుత కర్తవ్యం.
అందుకే నా సౌందర్యను మరిపించడానికి, ఉష చుట్టూ ఉన్న అప్పటి నా కథలు అన్నీ తిన చుట్టూ అల్లుతున్నా.ఆ విషయాలు తెలిసిన వాడివి కాబట్టి, నువ్వే నాకు తందానా తానా పాడు,” అంటూ సుబ్రమణ్యంను ఆనందంగా కౌగలించుకున్నాడు. ప్రభాకరం ఆనందం చూచి, సుభ్రమణ్యం కళ్లలో చిరు కన్నీటి పొర అంటుకుంటుంటే, ఇంతలో బెడ్ రూమ్ తలుపులు తెరుచుకుని లక్ష్మి వచ్చింది.
“అన్నయ్యా! మీరు ఈ చిన్న బెడ్ రూమ్‌లో త్వరగా ఫ్రెష్ అయ్యి ఈ మంచి జత తొడుక్కుని తొందరగా రండి,” అంటూ జత బట్టలు చేతిలో పెట్టేసింది.
ప్రభాకరం ఇంకా తటపటాయిస్తున్న సమయంలో సుబ్రహ్మణ్యం, ప్రభాకరాన్ని తోసుకుంటూ “ఒరేయ్! మేము చెప్పిన్నట్టు చేయి, పిచ్చి ప్రశ్నలు వేయకు, తొందరగా రా” అంటూ గదివైపు దారి చూపాడు.
సుమారు ఒక అరగంట తరువాత ప్రభాకరం తెల్లటి పంచె, తెల్లటి లాల్చీ వేసుకుని బయటకు వచ్చాడు. అక్కడే ఉన్న లక్ష్మి లోపల నుండి సౌందర్యను తీసుకు వచ్చి ప్రభాకరం పక్కనే నిలబెట్టింది. ‘ఎంత అందంగా ఉంది, వయసులో సంఖ్య అయితే వచ్చిందే కానీ వన్నె తగ్గని సౌందర్యం.. ఈ సౌందర్యది’ అని ప్రభాకరం కళ్ళతోనే అనుకుంటూ సౌందర్యతో కళ్ళతోనే మాట్లాడేస్తుంటే సౌందర్య సిగ్గుల దొంతర అయ్యింది. వాస్తవంలోకి వచ్చిన ప్రభాకరం సుబ్రహ్మణ్యం వైపు ఏదో చెప్పబోతుంటే..
“ఒరేయ్.. ప్రభా! నువ్వేం మాట్లాడకు, ప్రతీ నిమిషం, ఆస్వాదించాలి, ప్రతీ క్షణంలో మధురస్మృతులు వెతుక్కొమ్మని చెప్పేవాడివి కదా. ఇదీ అంతే. కొత్త దంపతులు కదా, మా సరదాలు, ముచ్చట్లు మాకు ఉంటాయి, గదిలో అన్నీ ఏర్పాట్లు చేసేసాం, మేము ఇంక వెడతాం, మీరు ఇద్దరూ తలుపులు వేసుకుని గదిలోకి పోయి విశ్రాంతి, తీసుకొని కొత్త జీవిత మధుర క్షణాల మాధుర్యాన్ని ఆస్వాదించండి. ఎన్నో సంవత్సరాల తరువాత ఇష్టపడ్డ ప్రియురాలు, నీ భార్యగా వచ్చింది. కాలేజీ రోజుల్లో ఆమె గురించి ఏమి రాసుకున్నావో, ఏమి తలచుకున్నావో ఇప్పుడు అవి అన్నీ నిజం అయ్యే వేళ అయ్యింది.
నాకు చాల ఆనందంగా ఉంది నా చిన్ననాటి ఇద్దరి స్నేహితులు ఇప్పుడు జీవిత భాగస్వాములు.. ఓహ్.. ఈ తలంపే మధురంగా ఉంది.మరి ఇంత ఆనందంలో మా లక్ష్మి నాకు ఏమి ఇస్తుందో నేను ఇంటికి వెళ్లి తెలుసు కోవాలి.” అంటూ తన భార్య వైపు కొంటెగా నవ్వుతూ ఇంక వెడదాం అన్నట్టు సైగ చేసాడు సుబ్రహ్మణ్యం.
“చాల్లెండి సంబరం” అంటూ సిగ్గు పడుతూ “ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది, ఇదిగో వదినా!.. ఇంకో రెండు రోజుల వరకు మా ఇంటినుండే మీకు భోజనం, ఫలహారం గట్రా. నీకు వంటింట్లో కష్టపడవలసిన పని ఏమీ లేదు. ఆ కష్టం ఇంక ఎక్కడయినా పడండి” అంటూ సౌందర్య వైవు కొంటెగా నవ్వి దంపతులు ఇద్దరూ వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్ళగానే ప్రభాకరం ముందుగుమ్మం తలుపులు వేసుకుని వెనుకకు తిరగగానే సౌందర్య ఏదో తెలియని ఆత్రుత, అనురాగాల భావాలతో ఎదురుగా నుంచుని, ప్రభాకరం చేతులు పట్టుకుని అలా కళ్ల వెంబటే నీళ్లు కారుతూ ఉంటే “ప్రభా! ఇన్నాళ్లు ఎందుకు దూరం అయ్యావ్? ఇంత ప్రేమ నీలో ఎలా దాచుకున్నావ్? ” అని అంటుంటే..
“సౌందర్య! ఏమిటి ఇది? ఇందాకే చెప్పానుగా, ఇప్పటికయినా నా మొర ఆలకించి దేముడు మనల్ని కలిపాడు. ఉన్నంతకాలం సంతోషంగా, ఒకరినొకరు ఇష్టపడుతూ సరదాగా ఉందాం” అంటూ సౌందర్య చేయి పట్టుకుని తన గదివైపు అడుగులు వేసాడు.
అలా ఇద్దరూ గదిలోకి వెళ్లగానే, గది అంతా పూలతో, పళ్లతో అలంకరింపబడి, సెంటు వాసనలతో గుబాళిస్తోంది. అది చూసిన ప్రభాకరం, “సౌందర్య ! ఏమిటీ ఇది, ఇంత హడావిడి ఎవరు చేసారు? ” అని అంటుంటే
“ఇంకెవరు, ఆ సుబ్బు దంపతులు, నాకు చాల ఆనందంగా ఉంది, నా ఫ్రెండ్ ప్రేమ ఫలించింది అంటూ, ఆ ఆనందంలో ఏదో కుర్ర జంటకు శోభనం ఏర్పాట్లు చేసినట్టు మనకు చేశారు”. అంటూ లోపలికి దారి తీసింది సౌందర్య.
అలా ఇద్దరూ గదిలోకి వెళ్లి మంచం మీద కూర్చోగానే సౌదర్యం ప్రభాకరం గుండెలపై వాలి పోయింది. “ప్రభా!.. నాకు ఇందాకటి నుండి మనసు మనసులో లేదు, నిజంగా నువ్వు నన్ను అంత ప్రేమించావా? నా గురించి అంత వెంటపడ్డావా? ఈ రోజు మన కాలేజీ రోజుల్లో నా వెంట పడ్డ కథలు అన్నీ నాకు చెప్పవలసిందే” అంటూ ఆమె అడగటం, ప్రభాకరం తన కాలేజీ రోజుల్లో ఉషపై ఊహించుకున్న, వెంటపడిన విషయాలు అన్నీ సౌందర్య పేరుతో మార్చి చెప్పడం, అలా వాళ్ళు ఇద్దరూ మాటల్లో మమేకం అయిపోయారు. సౌందర్య ప్రేమలో ప్రభాకరం పూర్తిగా మునిగి కరిగిపోయాడు. అలా రాత్రి ఎప్పుడు గడిచిందో, ఎప్పుడు తెల్లవారిందో తెలియకుండానే జరిగిపోయింది.అలా మిగతా రెండు రోజులు వాళ్ళు అందరూ హాయిగా గడిపేశారు. సుబ్రహ్మణ్యం దంపతులు భోజనం తేవటం, అందరూ కలిసి చక్కగా తిని సరదాలు పోవటం, కాలం వేగంగా పరిగెత్తింది.
“ఒరేయ్ సుబ్బు! ఇవ్వాళ మా ఇంట్లో భోజనం, మా సౌందర్య మీకు మంచి పార్టీ ఇస్తుందట, మా కొత్త కాపురానికి మీరే మొదటి అతిథులు, వంట బాగా చేస్తాను అని చెబుతూ ఉంటుంది, నాకు కూడా తెలియదు, తొందరగా వచ్చేయండి అందరం కలసి ఓ పట్టు పడదాం.” అంటూ చెప్పిన ప్రభాకరం పిలుపు మేరకు సుబ్రహ్మణ్యం దంపతులు వచ్చి హాయిగా, సౌందర్య పెట్టిన మంచి షడ్రసోపేత మయిన వంటకాలు తిని, చాల సేపు కబుర్లు చెప్పుకున్నారు.
వీలు కుదిరినప్పుడల్లా సుబ్రహ్మణ్యం, ప్రభాకరం కాలేజ్ రోజుల్లో సౌందర్యను ఎలా ప్రేమించేవాడు, ఎలా వెంట పడేవాడు అన్న విషయాలన్నీ సౌందర్య ముందు ఏకరవు పెట్టేసాడు, సౌందర్య చిన్నగా నవ్వుకుంటూ ఉంటే అందరూ ఆనందంగా గడిపి అందరూ వెళ్లిపోయారు.
ప్రభాకరం ఏదో బయట పని ఉంది అంటూ బజారుకు వెళ్ళిపోయాడు. ఇంతలో సుబ్రహ్మణ్యం మళ్ళీ తన ఇంటి నుండి వెనక్కు వచ్చాడు. “సౌందర్య! మా ఆవిడ లక్ష్మి తన సెల్ ఫోన్, ఛార్జింగ్ కోసం లోపల పెట్టి మరచి పోయి మా ఇంటికి వచ్చేసింది, అది తీసుకుని వెళ్ళడానికి వచ్చాను.” అంటూ తన భార్య సెల్ ఫోన్ తీసుకుని వెళ్లబోతుంటే
“సుబ్బు! నీకు ఒక విషయం చెప్పాలి. ఈ ఫొటోలో ఉన్నది ఎవరు? మన క్లాసుమేట్ ‘ఉష’ కదూ.. ప్రభాకరం ప్రేమించింది ఈమెనే కదా” అని అనగానే సుబ్రహ్మణ్యం నోట మాట రాలేదు. ఏదో తడబడుతూ “అదేం కాదు, నిన్నే ఇష్టపడ్డాడు, అసలు ఈ ఫోటో ఎలా వచ్చింది ఇక్కడకు” అంటూ ఏదో దాట వేయడానికి ప్రయత్నం చేసాడు.
“సుబ్బు! ఒక్క నిమిషం, ప్రభాకరం కాలేజీ రోజుల్లో ప్రేమించింది.. ‘ఉషను’.. నాకు అర్థం అయ్యింది. ఈ ఉష స్థానంలో నన్ను, నా పేరు పెట్టి నాకు అబద్ధం చెపుతున్నారు. కానీ నాకు ఈ అబద్ధం చాలా నచ్చింది. తన ప్రేమతో, పాత జ్ఞాపకాలతో నన్ను ఎంతో సంతోష పెట్టాలని ప్రభాకరం చేస్తున్న ప్రతీ ప్రయత్నం నాకు చాలా నచ్చింది. తను నన్ను సంతోషపెట్టటానికి, దక్కించుకోవటానికి ఆడిన ఒక చిన్న అబద్ధం గురించి, దాన్ని వాస్తవంగా మలచడానికి ప్రభాకరం చేసే ప్రయత్నం నాకు చాల ఆనందంకలిగిస్తోంది. నేను ఈ విషయం ప్రభాకరంకు చెప్పను, నువ్వూ చెప్పకు.
నన్ను సంతోష పెట్టాలని ప్రభాకరం పడుతున్నఈ తపన ఇలాగే ఉండిపోనీ. బహుశా, ఈ ఫోటో చూసే అవకాశం, అవసరం లేకుండా నేను నా ప్రేమలో ముంచివేస్తాను. తన తపన చూస్తే, ఎంత ముద్దుగా ఉందంటే.. మాటల్లో చెప్పలేను. ఈ నిజం ఎవ్వరికీ తెలియకుండానే సమాధి చేసేద్దాం. ఉన్న ఈ కొద్దీ జీవితం అమృతంగా, అద్భుతంగా ప్రతీ క్షణం ప్రేమానురాగాలతో పూర్తిగా మార్చుకుంటా. మీ ఇద్దరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను.” అంటూ సన్నటి కన్నీటి పొర సౌందర్య కళ్ళల్లో కమ్ముతుంటుంటే, సుబ్రహ్మణ్యం చలించి పోతూ.. ఏదో చెప్పబోయాడు.
“సుబ్బు! ఇది నా బాధ కాదు, ప్రభాకరం ప్రేమను తలుచుకుని వచ్చిన ఆనందం, ఇంక నీ ప్రభాకరం జీవితం అంతా మధుర క్షణాలే, అమృత రాత్రులే.. ఆ గారంటీ నాది.” అంటూ చిన్నగా నవ్వింది. పెద్ద నిట్టూర్పు నిట్టూర్చి ఆనందంగా సుబ్రహ్మణ్యం వెళ్లిపోతుంటే.. సౌందర్య సెల్ ఫోన్ రింగ్ అయ్యింది. కొత్త రింగ్ టోన్ ‘జీవితమే సఫలమూ,రాగ సుధా భరితము’ అంటూ మోగుతోంది.
ఎవరా అని చూస్తే ప్రభాకరం..
సౌందర్య కావాలని ఫోన్ ఎత్తలేదు. కాసేపు ప్రభాకరాన్ని టీజ్ చేయాలని అనుకుంటూ కొంటె ఆలోచనలతో నవ్వుకుంటూ ఇంటి లోపలకి వెళ్లి పోయింది.