Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహతి-68

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[ఇందిరని మహతి కర్రావూరి ఉప్పలపాడు తీసుకువెళ్తున్నందుకు అల ఎంతో సంతోషిస్తుంది. మర్నాడు సెట్‍లో స్వీట్స్ పంచుతుంది. ఎందుకని ఎవరో అడిగితే, తెలుగు ‘ధీర’ 110 రోజులు ఆడినందుకు, ఇంకా ఆడుతున్నందుకని చెప్తుంది. అప్పుడు వినోద్, అమిత్ – హిందీ వెర్షన్‍ని ఇంకా బాగా తియ్యాలని అనుకుంటారు. తెలుగు, హిందీల మూల కథ ఒకటే అయినా, హిందీ వెర్షన్ రీచ్ వేరు అని కమల్‍జీత్ అంటారు. తరువాత తీయబోయే ఇంటిమేట్ సీన్‍ల రిహార్సల్స్ చేస్తారు వినోద్, అలా. ఆ సీన్‍లలో నటిగా కాక, ఓ స్త్రీగా తన్మయత్వం చెందుతుంది అల. తరువాత తీసిన షాట్‍లో ఆ సన్నివేశం అద్భుతంగా వచ్చిందని దర్శకుడు అమిత్ చెప్తాడు. నువ్వు వినోద్‍ని ప్రేమిస్తున్నావు కదూ అని తరుణి అడిగితే, అలాంటిదేం లేదంటుంది అల. షూటింగ్ అయ్యాకా, అందరూ కూర్చుని కాసేపు జీవితం గురించి, తృప్తి గురించి మాట్లాడుకుంటారు. తరువాత తన గదికి వెళ్ళి నిద్రపోడానికి సిద్ధమవుతుంది అల. అమ్మ జ్ఞాపకం వచ్చి, ఇంటికి ఫోన్ చేస్తుంది. అటువైపు తల్లే ఫోన్ ఎత్తుతుంది. ఇంట్లో వాళ్ళందరూ పక్కింట్లో డిన్నర్‌కి వెళ్ళారని చెప్పి కొన్ని ముఖ్యమైన విషయాలు కూతురికి చెబుతుంది. నీ జీవితం నీదే, నీకు నచ్చినట్టు ఉండు అని చెప్తుంది. జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. తల్లి పరిస్థితిని తలచుకుని బాధపడుతుంది అల. కాసేపు ధ్యానం చేసుకుని నిద్రపోతుంది. – ఇక చదవండి.]

మహతి-4 మహతి-అల-15

మహతి:

క వ్యక్తి మరో వ్యక్తిని కలుసుకోవాలని ఎందుకు ఉబలాటపడతాడు? అభిమన్యుని కలుసుకోవాలని నాకెందుకు అనిపిస్తోంది? కొన్నాళ్ళు మా ఇంట్లో ఉన్నాడు. కానీ, ఆ ఉండటం నా కోసం కాదు. ఊరి కోసం, మరి మనసు అతని గురించి ఎందుకు ఆలోచిస్తోందీ?

“మేడమ్.. విజయవాడ రాబోతోంది” అన్నాడు డ్రైవర్.

“నాన్నా..” అన్నాను వెనక్కి తిరగకుండా.

“బెంజ్ సర్కిల్‍లో దిగిపోతానమ్మా” అన్నారు. నాన్న గొంతులోని భావం నాకు అర్థం కాలేదు. బండి ఆగింది. నాన్న తలుపు తీసుకొని దిగారు. నేనూ దిగాను.

“అమ్మతో మేం ఉప్పలపాడు వెళ్ళామని మాత్రం చెప్పండి. మరేం చెప్పొద్దు” లోగొంతుకలో అన్నాను.

“సరేనమ్మా” అన్నారు. ఈలోగా డ్రైవర్ నాన్న సూట్‌కేసూ, బ్యాగూ డిక్కీ లోంచి తీసి కింద పెట్టాడు.

ఉదయం ఆరు గంటలకే ట్రాఫిక్ మొదలయింది. ఖాళీగా వెళ్తున్న ఆటోని పిలిచాను. నాన్న నా వంక తిరిగి, “సరేనమ్మా” అని ఆటోలో కూర్చున్నారు. ఇందిర నాన్న వంకే చూస్తున్నదని నాకు తెలుసు. ఆటో బయలుదేరే ముందు “వస్తాను ఇందిరా” అన్నారు నాన్న. ఇందిర తలాగిందింది. ఆటో బయలుదేరిపోయింది. నేను ఫ్రంట్ సీట్లోనే కూర్చొని మా ఊరి రూట్ చెప్పాను డైవర్‍కి. ఆ తరువాత, “ఆంటీ, కాఫీ ఏమైనా తాగుతారా?” అన్నాను వెనక్కు తిరిగి.

“నిజంగా నీరసంగా ఉంది.. కాఫీ తాగితే కొంచెం సత్తువ వస్తుందేమో” అన్నది. ఆమె మొహం చూస్తే అనిపించింది, తెల్లార్లూ ఒక్క క్షణం కూడా నిద్ర పోలేదని. ‘హోటల్ విజయవాడ’ (పేరు మార్చాను) దగ్గర కారు ఆపించాను. అక్కడ క్లీన్‍గా ఉంటుంది. బాత్ రూమ్స్ కూడా క్లీన్‌గా మెయిన్‌టైన్ చేస్తారు. అక్కడే ముఖం కడుక్కుని కూర్చున్నాం.

వేడివేడిగా ఇడ్లీలు, దోశలు ఉన్నాయన్నాడు సర్వర్. ముందు రెండు రెండ్లు ఇడ్లీ చెప్పాము. వేరుశనగ చట్నీ అద్భుతంగా ఉంది. అల్లం చెట్నీ టమోటా చెట్నీ, నల్ల కారప్పొడీ బెజవాడ స్పెషల్స్. ఒకప్పుడు కొబ్బరి చెట్నీ, అల్లం చెట్నీ ఉండేవి. ఇప్పుడు కొబ్బరి బదులు పల్లీ చట్నీ (వేరుశనగ పప్పు) రాజ్యమేలుతోంది. డ్రైవర్ మరో రెండు ఇడ్లీలు, మసాల దోశ తింటే శీలించ్, నేనూ ఇందిర గారూ తలో ప్లెయిన్ దోశ తిన్నాం. నేను బిల్లు చెల్లించి వచ్చే లోగా ఇందిర కుర్చీలో కూర్చునే ఉంది

“పదండి ఆంటీ” అన్నాను. మెల్లగా నా చెయ్యి పట్టుకుని నిలబడింది. అప్పుడు చూశా ఆమె చెయ్యి వణకటం. ముఖం చూస్తే ఏడుపుని బలవంతంగా ఆపుకుంటున్నట్టు తెలుస్తోంది.

నేను గమనించినా, గమనించనట్టుగా, “హాయిగా నిద్రపొండి. ఓ గంట పడుకుంటే కాస్త శక్తి వస్తుంది” అన్నాను. మెల్లగా తల ఊపి, వెనుక సీట్లో పడుకుంది. కాలంలా కారు పరిగెడుతోంది. చిత్రంగా నా మైండ్ బ్లాంక్ అయింది. ఏమీ ఆలోచించాలని లేదు. అటువైపు నాన్న తన దారిన వెళ్ళారు. ఇటు ఇందిర గారు తన దారిన పడుకుంది. అమ్మ పరిస్థితి ఏంటో తెలీదు. తాతయ్య ఏమంటారూ? బహుశా అర్థం చేసుకుంటారూ – కానీ, అవతల వైపు ఉన్నాది స్వయనా కూతురు.. ఇందిర పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కానీ వ్యక్తిగా accept చేస్తారా?

ప్రశ్నలు ఏన్నైనా ఉండొచ్చు. కానీ జవాబు గురించి ఆలోచించకుండా నేను తీసుకున్న నిర్ణయం ప్రకారం నడుస్తున్నాను. ఏమైనా అవ్వొచ్చు.

రియర్ వ్యూ మిర్రర్ నించి వెనక్కి చూశాను. ఇందిర పడుకున్నదే గాని నిద్రపోతున్న సూచనలు కనిపించలేదు. అన్నిటి కన్నా ఆశ్చర్యపరచిన విషయం నాన్న వెడుతో ‘వస్తాను ఇందిరా’ అనడం.

ఒక్కోసారి మనకి మనమే ‘అపరిచితుల’మవుతాము. మనని మనమే మనమెవరిమో అని మన కోసం మనమే వెతుక్కుంటాము. అసలు బ్రతుకంటేనే వెతుకులాటేమో!

తాతయ్యకి ‘ముందే’ ఫోన్ చేద్దామనుమని అనుకున్నా ఫోన్ చెయ్య లేదు. పరిస్థితి ఏదైనా అప్పటికప్పుడు ఎదుర్కోవడమే మంచిదినిపించింది.

డ్రైవర్ చాలా స్లోగా పోనిస్తున్నాదు. బహుశా ఇందిర గారి పరిస్థితి గమనించాడేమో!

‘నీతో నా పరిచయం ఓ
విరిసీ విరియని ఉదయ పుష్పం
నీతో నా స్నేహం ఓ
వ్రాసీ వ్రాయని మహా కావ్యం
నీతో నా కాసేపటి పయనం
నేనెన్నటికీ చేరలేని గమ్యం
అటు వైపు నువ్వు
ఎటు వైపో నడుస్తూ
ఇటు వైపు నేను
నీవైపే నడుస్తూ
ఏనాడో ఓనాడు
కాలం ఆగిపోతుంది
శ్వాసలా..
కలుస్తావా కనీసం
నిశ్వాసంలా!’ (పాదచారి)

సడన్‌గా అల జ్ఞాపకం వచ్చింది. ఓ పక్క షూటింగ్, మరోపక్క మ్యూజింగ్స్. నా ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తుంటుందేమో. అమ్మమ్మ ఉంటే బాగుండేదని అనేకసార్లు అనిపించింది. అమ్మమ్మ ప్రేమమయి. ఆవిడకి తన పర భేదాలు ఎప్పుడూ లేవు.

“మేడం.. కర్రావూరి ఉప్పలపాడు 3 మైళ్లు” అన్నాడు డ్రైవర్. ఓ సుదీర్ఘమైన నిట్టూర్పు అనుకోకుండా నా నాశిక నుంచి వెలువడింది.

‘Fight Baby Fight’ అనుకున్నాను, దీర్ఘంగా శ్వాస పీల్చుకుని.

***

అహల్య:

చూస్తున్నాను. “మహీ ఇందిరని ఉప్పలపాడు తీసుకెళ్ళింది” అని నాతో చెప్పి బాత్‍రూమ్‍కి వెళ్ళారు గౌతమ్. నేను తల ఎత్తి చూసే లోగా ఆయన బాత్‍రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు. పిల్లలింకా నిద్ర లేవలేదు. స్కూలుకి ఆ రోజు సెలవు గనక నేనూ వాళ్ళని లేపలేదు. లేచాను. రాత్రి తిన్నారో లేదో తెలియదు. తెలియాలంటే అడగాలి. మనసు స్తబ్ధుగా ఉండేప్పుడు అడగాలని అనిపించదు. మౌనంగా లేచి నాలుగు – బంగాళాదుంపలు ఉడకబెట్టడానికి స్టౌ మీద పెట్టాను. పూరీ పిండి కలిపే ప్రయత్నం చేశాను. పిల్లలకి పూరీ కూరా ఇష్టం. అదీ వేడివేడి పూరీలంటే మరీ ఇష్టం.

ఆయనకు ఉప్మా అంటే ఇష్టం. మగవాళ్ళు ఎక్కువగా ఇష్టపడే వంటకం అదే కావచ్చు. పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు తరిగి సిద్ధం చేశాను.

ఆయన బయటకు వచ్చేసరికి ఇరవై నిమిషాలు పట్టింది. ముందు కాఫీ ఇచ్చాను. మాట్లాడకుండా తీసుకున్నారు. ముఖం ఫ్రెష్‍గా ఉన్నా, ఓ అలసట నాకు కనిపించింది. నేనూ ఏదీ మాట్లాడలేదు.

నిజం చెబితే, అక్కడ ఏం జరిపిందీ అనే ప్రశ్న నాలో పుట్టలేదు. తెలుసుకోవాలన్న ఉత్సుకత నాకు లేశమంతైనా లేదు. ఒక వీణ తీగ తెగింది. దాన్ని అతుకు పెట్టలేము. ఆయన బాధ్యత ఉందో లేదో కూడా ఆలోచించాలని అనిపించలేదు.

ప్రతి వ్యక్తికీ ఓ స్వేచ్ఛ ఉంటుంది. ఉండాలి కూడా. పెళ్ళి అనే బంధం వ్యక్తి స్వేచ్ఛను హరించకూడడు. అలా అని వ్యక్తి స్వేచ్ఛే పరమ లక్ష్యమై, కుటుంబాన్ని దహించకూడదు. స్వేచ్ఛ ఎంత మేరకు ఉండాలో ఆలోచించాల్సింది ఎవరికి వారే.

కాఫీ తాగాకా కాఫీ కప్పు తీసుకుని సింక్‍లో పడేశా. ఆయన లుంగీ కట్టుకొని బెడ్ రూం లోకి వెళ్ళారు. “టిఫిన్ చేసి వెళితే బాగుంటుందేమో, రిలాక్స్‌డ్‌గా పడుకోవచ్చు” అన్నాను.

“సరే” అని సోఫాలో కూర్చున్నారు. పిల్లల ముఖాల వంక కూడా చూడలేదు. నా ముఖం వంక కూడా సూటిగా చూడలేదు. అది నిర్లిప్తతో, గిల్టీ ఫీలింగ్ అయి ఉండవచ్చని అనిపించింది. అయినా గిల్టీ ఫీలింగ్ ఉంటే ‘ఇలా’ ఉండరుగా!

ఓ పక్క ఉప్మా చేసి, మరో పక్క కూరా పూరీలు చేశాను. వేడి వేడిగా రెండూ ఆయన ప్లేట్‌లో సర్ది ఇచ్చాను. వేరుశనగ, అల్లం, ఉల్లిపాయ చెట్నీలు ఉప్మాకి, పూరీకి బంగాళాదుంప కూర సెపరేట్.

చాలా క్వయిట్‌గా తిన్నారు. అంతకు ముందు కనీసం ఓ ఇరవై ముఫ్పై మాటలైనా సాగేవి టిఫిన్ సెషన్‍లో. ఇప్పుడు మౌనం రాజ్యం ఏలుతోంది.

బహుశా ఆకలిగా కూడా ఉండి ఉంటుంది. ఇంకో రెండు పూరీలు, ఉప్మా పెట్టినా తిన్నారు.

తరువాత ‘పడుకుంటా’ అని బెడ్ రూం లోకి వెళ్ళారు. “తలుపులు వేసుకోండి. పిల్లలు లేస్తే వాళ్ళ హడావిడి వినిపిస్తుంది” అన్నాను. ఆయన తల ఆడించి తలుపులు వేసుకున్నారు.

బస్.. మొత్తం మూకీ సినిమాలా సాగింది.. అక్కడక్కడా నా మాటలు తప్ప. ఇదే పరిస్థితి రివర్స్ అయి, నా బావ కోసం నేను వెళ్ళి తిరిగొస్తే ఎన్ని వేల ప్రశ్నలూ, సందేహాలూ ఉండేవి? నాకు ‘బావ’ లేడు గనక ఆ విషయం నాకు తెలీదు. కానీ మౌనానికి మాత్రం కొద్దో గొప్పో అర్థం తెలుసు. మౌనానికి సమాధానం మాట కాదు. ఒక వేళ మాటే సమాధానం అయినా అది అన్ని వేళలా వర్తించదని అర్థమైంది.

***

ఒకప్పుడు పగలు రాత్రి కోసం, రాత్రి పగలు కోసం ఎదురు చూసేవి. ఇప్పుడు పగళ్ళూ రాత్రుళ్ళూ గడిచిపోతున్నాయి తప్ప ఎదురు చూడటం లేదు. ఆయన పడుకున్నారు.. లేచారు. భోంచేసి మళ్ళీ పడుకున్నారు. పిల్లల వంక చూసి నవ్వారు.. అంతే.. మరే విషయాలూ ఎత్తలేదు.

“నాన్న ఎలాగో ఉన్నారు కదమ్మా” మెల్లగా అన్నది కల్యాణి.

“అలసిపోయారు.. తెల్లవార్లూ ప్రయాణం కదా!” మెల్లగా అన్నాను.

“అవుననుకో,, అయినా!” అంది అవతలకి వెళుతూ. ఎవరన్నారు చిన్న పిల్లలకి గ్రహింపు ఉండదనీ! మరిన్ని ప్రశ్నలు వేయనందుకు సంతోషించా. ఒక నిర్ణయం తీసుకొని నేను ముందు రావడం వల్లా, నన్ను నేను మరుగు పరుచుకోవడం వల్లా అది అదే ప్రశ్నను నన్ను అడగలేదు. మాటకీ మౌనానికీ మధ్య వారధి ఏమిటి? మాటని మౌనం మింగేసిందా? మాటని మనసు మింగేసిందా? ఆ ఒడ్డు మౌనం, యీ ఒడ్డు మాట! మధ్యలో మనోప్రవాహం.

సాయంత్రం పిల్లలు ఏదో చెబుతున్నారు. ఆయన వింటున్నారు. వాళ్ళ గొంతులో ఉత్సాహం. ఆయన గొంతులో నిర్వికారం.

‘పాశాలు విసిరేదీ నువ్వే
బంధించేదీ నువ్వే
మౌనమనే ఖడ్గంతో మళ్ళీ
విడగొట్టేదీ నువ్వే
కాలమా
నువ్వెంత గడుసుదానివి’

ఇది మహతి రాసుకున్న కవిత. దానికి తెలీకుండా దాని కవితల్ని నేను చదివేదాన్ని. ఫరవాలేదు.. కవి అంటే, కాలాన్ని దర్శించగలవాడేగా. బాగానే దర్శించి వ్రాసింది. నవ్వుకున్నాను.

పిల్లల గదిలో పిల్లలు. బెడ్ రూంలో ఆయన. సోఫా మీద పడుకుని నేను.

‘చీకటి ప్రకాశాన్ని ప్రసవించితే
ప్రకాశం చీకటిని ప్రసవిస్తోంది
ఇరు సంధ్యలూ మంత్రసానులే..
కాలమనే ప్రసూతి గృహంలో.’

ఇదీ మహతి రాసిన కవితే. కవిత మనసును కాస్తా దారి మళ్ళించగలదు. ఇప్పుడు కావల్సింది అదే!

***

మహతి:

“తాతయ్యా, వీరి పేరు ఇందిర. మా నాన్న స్వంత మరదలు. అనారోగ్యంగా ఉన్నారు. నేను ఇక్కడికే తీసుకొచ్చాను” సంక్షిప్తంగా అన్నాను. ఆయన గ్రహించగలరనే నమ్మకంతో.

“నువ్వు అహల్యా గౌతమ్ వెళ్ళడం నాకు తెలుసుగా. అమ్మ తిరిగొచ్చాకా నేను ఇక్కడికి వచ్చేశాను. రామ్మా, లోపలికిరా.. చాలా ప్రయాణం చేసి వచ్చావుగా.. రా” అంటూ తాతయ్య ఇందిరని లోపలికి ఆహ్వానించారు,

డా. శ్రీధర్, డా. శారదా కూడా బయటికి వచ్చారు. పరిచయం అయ్యాకా, “వెల్‍కమ్ ఇందిర గారు. మీ ఆరోగ్యం సంగతి మాకు వదిలెయ్యండి. మేం చూసుకుంటాం” అని నవ్వుతూ భరోసా ఇచ్చారు కూడా.

‘సో ఫార్ సో గుడ్’ అనుకుని పనిమనిషికి వేడి నీళ్ళు పెట్టమని పురమాయించాను.

“అన్నీ రెడీగా ఉన్నై. స్నానం చేసి వచ్చే లోగా టిఫిన్లు రెడీ చేస్తాను” అన్నారు త్రిపుర గారు.

ఆవిడ దగ్గరకెళ్ళి కౌగిలించుకుని, “టిఫిన్లు దారిలో చేసేశాం” అని చెప్పి, ఇందిర గారిని నా గదిలోకి నడిపించి తీసుకెళ్ళా. “ఒక గంటలో చక్కగా మరో పక్క సిద్ధం చేస్తాను ఆంటీ” అని ఆవిడ్ని కూర్చోబెట్టాను.. నా మంచం మీద. ఆవిడ మెల్లగా మంచం విూద వాలి పడుతుంది. ముఖమంతా చిరు చెమట.

“ఆంటీ, ముందో గంట విశ్రాంతి తీసుకోండి. సరేనా” ఇందిర గారి చేయి పట్టుమని చెప్పి, తలుపులు దగ్గరగా వేసి బయటికి వచ్చాను. డా. శ్రీధర్‍కి ఆమె రిపోర్టులన్నీ ఇచ్చి “ప్రస్తుతానికి నీరసంగా పడుకున్నారు డాక్టర్” అని చెప్పాను.

“కంప్లీట్‌గా స్టడీ చేస్తాము ఇద్దరం. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకోవడమే బెటర్. కేస్ స్టడీ అయ్యాకే మందులు వాడుదాం. ప్రస్తుతానికి ఏ మందూ ఇవ్వద్దు. మధ్యాహ్నానికి నిర్ణయిద్దాం.. ఏవి వాడాలో ఏవి వద్దో” అన్నారు శ్రీధర్.

తాతయ్య దగ్గరికి వెళ్ళాను. “తాతయ్యా” అని అనగానే, “నాకు అర్థం అయిందమ్మా. నీ నిర్ణయం చాలా మంచిది. ముందు ఇందిరకి కావల్సింది మంచి తోడు. ఇందరం ఉన్నాంగా, ఆరోగ్యం కుదుటపడుతున్న కొద్దీ తను పుంజుకుంటుంది” అన్నారు.

“ఈ విషయాలన్నీ అమ్మ చెప్పిందా?” అనడిగాను.

“మీ అమ్మ తన ఆలోచనలని బయటపెట్టదని తెలుసుగా. ఇతరుల మీద ‘బరువు’ పెట్టడం తనకి ఇష్టం ఉండదు. కష్టమైనా సుఖమైనా తను చూసుకోవల్సిందే” నవ్వి అన్నారు తాతయ్య.

“మరెవరు చెప్పిందీ?” ఆశ్చర్యంగా అడిగాను.

“మీ నాన్న. ఆయనా లోతుగా ఏ విషయం చెప్పలేదు. మీరు కార్లో వస్తున్నారని చెప్పారు. జాగ్రత్తగా చూసుకోమని రిక్వెస్టు చేశారు” అన్నారు తాతయ్య. అదో చిన్న షాక్ నాకు.

పాకలో డ్రైవర్‌కి మంచం వేయించి బాత్‌రూమ్ చూపించాను. “హాయిగా స్నానం చేసి పడుకోండి. భోజనానికి నిద్ర లేపుతాను. రాత్రంతా శ్రమపడ్డారు” అని చెప్పి మళ్ళీ నా గదికి వెళ్ళాను. చాలా మెల్లగా తలుపులు తెరిచా, శబ్దమే లేకుండా.

ఇందిర కళ్ళు విప్పి పైకి చూస్తోంది. “ఆంటీ.. నిద్రపట్టటం లేదా?” అన్నాను.

“లేదు మహి.. లేదు. కొన్ని దశాబ్దాల పాటు నిద్ర లేదు. నిద్రపోయినా అది కలత నిద్రే. ఇక్కడకి వచ్చాను. ఎందుకొచ్చానో తెలీదు. ఏమౌతానో అంతకంటే తెలీదు. జీవితం ఇలా నన్నెందుకు శిక్షిస్తోందో అసలు తెలియదు” నిట్టూర్చింది ఇందిరగారు. ఆమె స్థానంలో నేను ఉన్నా అనుకునేది ఇదే. రాజభవనం లాంటి ఇంటిని వదులుకుని అపరిచితుల మధ్య గడపడానికి రావాలంటే మనసుకి ఎంత స్థైర్యం కావాలీ! నాకు చాలా బాధ వేసింది.

“ఆంటీ.. ఒక్కటి మాత్రం చెప్పగలను. ఇక్కడున్న వారంతా మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు. ఎంతో బాగా చూసుకుంటారు. మళ్ళీ మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులవ్వాలి. బిలీవ్ మీ” అన్నాను తన చేయి పట్టుకుని.

ఇందిర చిన్నగా నవ్వింది, “మహీ.. ఆశ సర్వ జీవ లక్షణం” అన్నది. అంతే, ఆ మాట దేనికన్నాదో నాకు అర్థం కాలేదు. కొన్ని మాటలు అర్థం కాకపోవడమే మంచిదని అనుకున్నాను. మరో రెండు నిముషాలు మౌనంగా కూర్చుని, స్నానానికి లేచాను.

(ఇంకా ఉంది)

Exit mobile version