(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)
[అల షూటింగ్‍లో పాల్గొంటుంది. ఓ రోజు షాట్‍ల మధ్య విరామం దొరకటంతో సంగీతం గురించి, వాయువు గురించి అలకి వివరంగా చెప్తాడు సినిమాటోగ్రాఫర్ కమల్‍జీత్. ఆయన చెబుతుంటే కమేడియన్ జూలూ నాగర్ కాస్త వ్యంగ్యంగా మాట్లాడుతాడు. అతనికి జవాబిచ్చి, అల కోరిక మీద మరిన్ని వివరాలు చెప్తాడు కమల్‍జీత్. పంచ వాయువులు, ఉపవాయువుల పేర్లు, శరీరంలో అవి చేసే పనులను వివరిస్తాడు. వింటున్న తరుణీ కిద్వాయ్ ఆశ్చర్యపోతుంది. ఇవన్నీ ఇప్పటివి కావనీ, కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే భారతియ ఋషులు, గురువులు కనిపెట్టారనీ, మనం మాత్రం మన సంస్కృతినీ కించపర్చుకుంటున్నామని అంటాడు కమల్‍జీత్. ఓ షాట్‍లో అల చాలా బాగా చేసిందని మెచ్చుకుంటాడు డైరక్టర్ అమిష్ సక్సేనా. సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక అల మౌనంగా ఉండిపోతుంది. తాను పోషించే పాత్రల ప్రభావం తన మీద చాలా ఉందని అనుకుంటుంది. లంచ్ బ్రేక్‍లో కమల్‍జీత్‍తో కలిసి భోం చేస్తున్నప్పుడు – ఆయా పాత్రల్లో లీనమైపోయి నటించడం వల్ల ఆ పాత్రల ప్రభావం మనసుపై చాలా ఉంటుందని, దాన్ని దూరం చేసుకునేందుకు ప్రాణాయామం అత్యుత్తమని చెప్పి – వచ్చే ఆదివారం – షూటింగ్‍కి సెలవు రోజున నేర్పిస్తానంటాడు. అనుకోకుండా షూటింగ్‍కి బ్రేక్ రావడంతో మరికొన్ని సంగతులను ఆయన నుంచి అడిగి తెలుసుకుంటుంది అల. ఆ రాత్రి వినోద్‍తో కలిసి, కమల్‍జీత్ కాటేజీకి వెళ్ళి ప్రాణాయామం నేర్చుకుంటుంది. మర్నాడు షాట్ గ్యాప్‍లో జూలూ నాగర్ అలలో మాట్లాడతాడు. అల ముక్తసరిగా ఉండడం చూసి – తాను కమల్‍జీత్‍ని ఎగతాళి చేయడం అలకి నచ్చలేదని గ్రహిస్తాడు. ఇండస్ట్రీలో రాణించేందుకు ఎలా ఉండాలో చెప్తాడు. మీ సూచనలని గుర్తుంచుకుంటానని చెప్పి, అక్కడికి ఆ సంభాషణని ముగిస్తుంది అల. మర్నాడు షూటింగ్‍లో ఓ హాస్య సన్నివేశాన్ని చేయాల్సి వస్తుంది. అల కొద్దిగా భయపడితే, వినోద్ ధైర్యం చెప్పి కొన్ని హాస్య సన్నివేశాల వీడియోలు చూపించి, కామెడీకి టైమింగ్ ముఖ్యమని అంటాడు. అతనిచ్చిన స్ఫూర్తితో, ఆ సీన్‍ని బాగా చేస్తుంది అల. డైరక్టర్ అభినందిస్తాడు. జూలూ నాగర్ విస్తుపోతాడు. ఇక నీతో పోటీ అని అంటాడు అలతో. – ఇక చదవండి.]
మహతి-4 మహతి-అల-10
మహతి:
‘నవ్వడం ఒక భోగం’ అన్నారు పెద్దలు. కానీ అమ్మ నవ్వడం మర్చిపోయింది. అలాగని ఏడవడమూ లేదు. తన పని తాను యాంత్రికంగా చేసుకుపోతోంది. ఒకప్పుడు తను చేసే ప్రతి పని వెనకాలా ఓ అనంతమైన ప్రేమ, శ్రద్ధ, అనురాగం వుండేవి. ఇప్పుడు ఉన్నది నిర్లిప్తత, నిస్సహాయత.
కుటుంబంలోకి దూసుకొచ్చే ఒక వ్యక్తి వల్ల ఇంత అనర్థం జరుగుతుందా? జరుగుతుందనడానికి మా ఇల్లే ఓ రుజువు.
“ఎడారిలో ఓ
చిన్న మొలక మొలకెత్తింది
వృక్షమైంది..
ఇసుక తుఫాన్లని తట్టుకుని
చిత్రం!!
ఎడారి మొత్తం
నందనవవమైంది
పువ్వులు విరబూస్తున్నాయి
పక్షులు కలకల్లాడుతున్నాయి..” -పాదచారి.
“పచ్చని వనంలో
ఓ అగ్గిరవ్వ పడింది
వనాన్ని కాల్చేసింది
బూడిద మిగిలింది
నివురుగప్పిన జ్ఞాపకాలు” -పాదచారి.
ఈ రెండు కవితలు ఓ అనామక రచయితవి. ఒక్క మార్పు.. ఒకే ఒక్క మార్పు.. ఎడారిని సస్యశ్యామలం చేస్తే వనాన్ని బూడిద చేసింది. ఇందిర ఆగమనం ఏం చేస్తుందీ?
“డిశ్చార్జి చేస్తాను సరే. మళ్ళీ ఆవిడకి ఎవరూ లేరని చెబుతున్నారుగా. ఇక్కడే ఆత్మహత్యకి పాల్పడినది, ఒంటరిగా ఇంట్లో ఆత్మహత్యకి పాల్పడదని చెప్పలేముగా, కనీసం ఆవిడ ఆరోగ్యం బాగుపడేంత వరకైనా సంరక్షకులు ఎవరో ఒకరు ఉండాలి” అన్నాడు డాక్టర్.
అమ్మ బెజవాడ వెళ్ళిపోయిన నాలుగో రోజు యీ డిస్కషన్ జరిగింది. కల్యాణిగారు తన దగ్గర ఉంచుకుంటానని అన్నారు. ఇందిర ఒప్పుకోలేదు. నాన్నలో అశాంతి. అగ్నిపర్వతం పగిలినట్టు ఎప్పుడు ఆ గుండె పగలుతుందో అన్న భయం నాకే పట్టుకుంది. “నీ చావు నువ్వు చావు” అనేంత నిర్దయుడు కాదు మా నాన్న. అలాగే ఇందిరని తెచ్చి మా అమ్మని సజీవ సమాధి చేసే దుర్మార్గుడు కాదు. ఆయన నలిగిపోతున్నాడు.. మానసికంగా శారీరికంగా.
“మా కర్రావూరి ఉప్పలపాడుకి తీసికెళ్ళడం అనే మార్గం మాత్రం మిగిలింది” అన్నాను కల్యాణిగారితో.
“అలా చేస్తే మీ అమ్మగారు చాలా హర్టవుతారు” సాలోచనగా అన్నారు కల్యాణి.
“అవును. ఖచ్చితంగా హర్టవుతుంది. కానీ ఆత్మహత్య చేసుకోదు. పిల్లలు బాధ్యతలు తీరలేదు గనక. ఇందిర అలా కాదు. ఇందిర అలా కాదు కచ్చ తీర్చుకోడానికైనా సూసైడ్ ఎటంప్ట్ చేస్తుంది” అన్నాను.
“అది ముమ్మాటికీ నిజం. కానీ, మీ వూరికి రావడానికి ఇందిర ఒప్పుకుంటుందా” అన్నారు కల్యాణి.
“ఒప్పుకుంటుంది. మాతో ఉండటం అంటే నాన్నని ఓ విధంగా సాధించడమే. ఖచ్చితంగా ఒప్పుకుంటుంది” అన్నాను.
“ట్రై చేసి చూడు” అన్నారు కల్యాణి.
***
“నాన్న ఎవరికీ చెప్పుకోలేని మీ ఫ్రస్టేషన్ నాకు అర్థమైంది. ఇలా ఇది జరుగతున్నంత కాలం అందరి బుర్రలూ పాడవటం తప్ప ఒరిగేది ఏదీ ఉండదు. అందుకే ఎవరో ఒకరు ఓ నిర్ణయం తీసుకుతీరాలి.. యీ సమస్య ఓ కొలిక్కి రావాలంటే!” అన్నాను.
ఇంత డైరెక్టుగా నిర్మొహమాటంగా నాన్నతో మాట్లాడటం ఇదే మొదటిసారి. ఆయన కళ్ళెత్తి నా వంక చూశారు. ఆ కళ్ళల్లో చెప్పలేనంత అలసట. నా గుండె కలుక్కుమంది.
“చెప్పు నాన్నా. ఏం చేస్తే బాగుంటుంది?” అడగకూడదు అనుకుంటునే ప్రశ్న అడిగాను. ఆయన అగమ్య గోచర స్థితిలో ఉన్నట్టు నాకు తెలుస్తోంది. అటువంటి స్థితిలో ప్రశ్నలు సంధించడం అమానుషం అనీ తెలుసు. కానీ సమస్య కనీసం ఓ అడుగు ముందుకెళ్ళాలన్నా ఏదో ఓ నిర్ణంయం తీసుకోక తప్పదు.
మెల్లగా గొంతు సవరించుకుని “ఇదేదీ నేను కలలో కూడా ఊహించలేదు” అని మాత్రం అన్నాడు. ఆ ఒక్క మాట నాకు చెప్పింది.. ఆయన ఎవరికీ బాధ కలిగించ లేరనీ. బాధ భరించడానికే ఉన్నారాని.
“నాన్నా.. నా నిర్ణయం సరైందో నాకు తెలీదు. నేను ఇందిరగార్ని మన ఊరు తీసుకెళ్దామని అనుకుంటున్నాను. తన ఆరోగ్యం బాగుపడేంత వరకూ అక్కడే ఉంటుంది. డా. శ్రీధర్, డా. శ్యామలా మనింట్లోనే ఉన్నారు కదా. వాళ్ళు హెల్ప్ ఎలానూ వుంటుంది. తాతయ్య ఉండటం చాలా మేలవుతుంది. మాకూ ఇందిరకీ కూడా. మీరు అమ్మతో ఉంటే అమ్మకి కొంతగాక కొంత బాధ తగ్గొచ్చు!!” అన్నాను.
నా మాట వినగానే నాన్న మొహంలో చాలా రిలీఫ్ కానిపించింది. “మహీ..” అని నా తల నిమిరారు. అది చాలు, నా నిర్ణయాన్ని ఆయన ఆమోదించారనడానికి.
“అమ్మా.. ఎవరూ లేని ఒంటరితనం ఎంత ఘోరంగా ఉంటుందో నా చిన్నతనంలోనే తెలుసుకున్నా.. అందుకే..” మాట పూర్తి చేయలేదాయన. ఇందిర పరిస్థితిని ఎంత లోతుగా ఆయన పరిశీలించారో ఆ ఒక్క మాటా నాకు తెలియజేసింది. అప్రయత్నంగా నాన్నని కౌగిలించి, “అన్నీ నేను చూసుకుంటాను నాన్నా” అన్నాను. ఆయన కళ్ళల్లో నీళ్ళు.
***
“నేను రాను” మొండిగా అన్నది ఇందిర.
“మంచిది. ఇందిర ఆంటీ.. మంచిది. డాక్టర్ చెప్పారు. మీతో పాటు ఎవరో ఒకరు ఉంటే మంచిదని. మీ చుట్టాలెవరన్నా ఉంటే చెప్పండి. కబురు పెడతాను. మీ స్నేహితులు ఉన్నా వారి నంబరో అడ్రస్సు చెప్పి పిలిపిస్తాను. మేం వెళ్ళి తీరాలి. నాన్నగారికి ఆస్తులు లేవు. ఉద్యోగం చెయ్యక తప్పదు. వాళ్లు ఇన్నాళ్ళు పాటు శెలవు ఇవ్వడం కేవలం ఆయన మంచితనం వల్ల జరిగింది. ఇంకా పొడిగించమనడం మర్యాద కాదు. పిల్లలు, అంటే నా తమ్ముడు, చెల్లెలూ చదువుతున్నారు. అమ్మ వాళ్ళని చూసుకుంటే, నేను మా వూరులో మా తాతగారిని చూసుకోవాలి. అక్కడ మా ఇంట్లోనే ఇద్దరు డాక్టర్లు కాపురం ఉంటున్నారు. పచ్చని ఊరది. మీరు వస్తే ఏ లోటూ రాకుండా చూసుకుంటాను. మీ ఆరోగ్యం బాగయ్యాక మీకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు. మీరు నాతో మా వూరొస్తే నేను చాలా సంతోషిస్తాను” మెల్లగా స్పష్టంగా చెప్పాల్సిన మాట చెప్పాను.
“ఇందిరా, ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో అదే మంచిది” అన్నారు కల్యాణి.
“మీ ఊరు రావడం నా సమస్య పరిష్కారం కాదు” మొండిగా అన్నది ఇందిర.
“సమస్య సృష్టించింది ఎవరు? నేనా? మా నాన్నా? మా అమ్మనా? ఎవరు? సమస్య మేం సృష్టించకపోయినా, మీకు బాగోలేదని తెలిసి ఎందుకొచ్చింది? మీ మీద ప్రేమా, అభిమానమో, సానుభూతో ఉండబట్టే గదా? పోనీ సమస్య ఎలా పరిష్కరిస్తే బాగుంటుందో, ఏ విధంగా పరిష్కరిస్తే అందరికీ ఆమోదకరంగా ఇప్పుడు మిమ్మల్ని చెప్పమంటే చెప్పగలరా. ఒంటి చేత్తో ఎలా చప్పట్లో కొట్టలేమో ఒంటి మనస్సుతో కుటుంబ నిర్ణయాలూ తీసుకోలేము. మా నాన్న మేనమామా కూతురు మీరు. కొంత కాలం మా నాన్న మీ ఇంట్లో ఉన్నారు. అంతేగా. అయినా మేం మీరు చూపిన ఆదరానికి విలువిచ్చాం. విలువ ఇస్తాం కూడా.. కానీ, ఏ సమస్యని పరిష్కరించడానికైనా ఇది సమయము కాదూ సందర్భమూ కాదు. న్యాయం చెబితే అసలా సమస్య మాది కాదు. కానీ ఆంటీ మీరంటే నాకు గౌరవం ఉంది. ప్రేమ ఉంది. దయ చేసి నా మాట కాదనక రండి. ముందు మీరు సంపూర్ణ ఆరోగ్య వంతులవండి. ప్లీజ్” అన్నాను. ఇందిర చెయ్యి పట్టుకుని. ఇందిర నా వంక సూటిగా చూసి ఓ క్షణం తరవాత కళ్ళు మూసుకుంది. “No” అని చెప్పలేదు.
“ఆంటీ.. ఇవ్వాళే మేం వెళ్ళిపోతాం. నాన్న విజయవాడలో దిగిపోతారు. మేమిద్దరం కూర్రావురి ఉప్పలపాడు వెళ్తాం” అన్నాను కల్యాణిగారితో.
“ముందు ఇంటికి వెళ్ళాలి” అంది ఇందిర కళ్ళు మూసుకునే. సన్నగా తలపంకించి చిరునవ్వు నవ్వారు కల్యాణి గారు.
“అలాగే ఆంటీ, రైలు కంటే బస్సే బెటరనుకుంటా” అన్నాను.
“నిన్నూ మీ వాళ్ళనీ కార్లో పంపకపోతే ఫాలాక్ష నా బుర్ర పూటకోసారి తినేస్తాడు. అలకిచ్చిన కారు ఉందిగా. కారునీ డ్రైవర్నీ ఇప్పుడే పిలిపిస్తాను. నలుగురం కలిసే ఇందిర ఇంటికి వెళ్దాం. అన్నడ్నించీ నా కార్లో నేను ఇంటికి వెళ్తాను. మీరు మీ ఊళ్లో దిగాక కారు వెనక్కి పంపండి. అదీ వెంటనే కాదు.” మనసుకి చల్లగ అన్నారు కల్యాణి.
“థాంక్స్ ఆంటీ” కల్యాణిని గట్టిగా కౌగిలించుకుని అన్నాను.
ఒక పెద్ద భారం తొలగిపోయింది. ఇనుముని వంచటం వేడి మీదే వంచాలి. గబగబా ఓ సంచిలో ఇందిర బట్టలు అవి సూట్ కేసుల్లో సర్దేశాను. ఉన్నవి నా బట్టలు, నాన్న బట్టలు. అవి సూట్‍కేస్‍లోనే ఉన్నాయని కల్యాణికి చెప్పాను. ఆ తరవాత కనకకి ఫోన్ చేసి డ్రైవర్‌తో బాటు నా బట్టల్ని కూడా హాస్పటల్‌కి పంపించమన్నాను.
“యూ ఆర్ వెరీ ఫాస్ట్” అన్నది ఇందిర.
“ఫాస్ట్ కాదు ఆంటీ, హాస్పటల్‌లో ఉంటే ఎవరికైనా పిచ్చెక్కుతుంది. యీ ఫినాయిల్ వాసన నించి బయటపడితే, సగం ఆరోగ్యం అదే కుదుట పడుతుంది. మీరు అత్యంత త్వరగా కోలుకోవాలనే తొందర పెట్టేస్తున్నాను” నవ్వి, ఇందిర చెయ్యి పట్టుకుని అన్నాను.
“మరీ” ఏదో అనబోయారు కల్యాణి. “నో ఆంటీ. ఇవ్వాళ మంచి హోటల్ ఫుడ్ లాగిద్దాం” అన్నాను.
మళ్ళీ వంటా గింటా పెట్టుకుంటే ఇందిర మనసు మారచ్చు. మారేలోగానే కారు రోడ్డెక్కాలని నా అభిప్రాయం.
“యూ ఆర్ రైట్” నవ్వి అన్నారు కల్యాణి. నా ఉద్దేశ్యాలు ఆవిడ గ్రహించిందని నాకు అనిపించింది.
“బిల్ సెటిల్ చేసి వస్తా ఆంటీ, మీరిక్కడ కూర్చోండి” అని లేచాను.
“సారీ.. ప్రతి పైసా నాదే వాడాలి” – తల కింద నించి రెండు కట్టలు తీసి నా చేతిలో పెట్టి అన్నది ఇందిర.
“అలాగే. అలాగే” అని నేను బయటకి వెళ్ళాను. నాన్నతో యీ సంగతి చెప్పాలనే ఆత్రంతో.
ఇందిర ఒప్పుకుందనగానే నాన్న సంతోషానికి మేర లేదు. ముఖంలో వెనకటి వెలుగు కనిపించింది.
కానీ డబ్బు సంగతి కూడా చెప్పి బిల్ కట్టడానికి రిసెప్షన్‌కి వెళ్ళాను. అంతకు ముందు డాక్టర్‌తో చెప్పి వీలున్నంత త్వరగా డిశ్చార్జ్ చెయ్యమని అడిగాకే!
“మీ అమ్మకి చెప్పావా మహీ” నాన్న గొంతులో ఆదుర్దా.
“చెప్పలేదు నాన్నా. బయలుదేరి వెళ్ళిపోదాం. మీరు బెజవాడలో దిగిపోండి. మేము కర్రావురి ఉప్పలపాడు వెళ్ళిపోతాం. రేపు అక్కడ సెట్ చేశాక నేను వివరంగా మాట్లాడతాను. ఒకవేళ అమ్మ మిమ్మల్ని అడిగితే మహీ ఇందిరని ఊరికి తీసికెళ్ళిందని మాత్రం చెప్పండి” క్లియర్‌గా అన్నాను.
నా ఆలోచన ప్రకారం అమ్మ అడగదు. కేవలం ప్రశ్నలతో ఆమె సమాధన పడుతుందని నేను ఏనాడూ ఊహించను. అమ్మ ఆత్మాభిమానం ఎంతుందో నాకు తెలుసు. ఇప్పుడిప్పుడు రాజుకున్న ఆ మంట కూడా ఆరదని నాకు తెలుసు.
గొప్ప విషయం ఏమంటే అమ్మ కోపం ఆవిడ మౌనంలో ఉండటం. గాంధీగారికి సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అనేవి కస్తూర్పా నేర్పింది కూడా మౌనంతోనేగా.
“మహీ.. మళ్ళీ మీ ఫ్రెండ్‌తో ఎప్పుడైనా మాట్లాడిస్తావా?” అడిగాడు డాక్టరు గారు.
“ఖచ్చితంగా డాక్టర్. హాయిగా డిన్నర్ కూడా చేద్దాం, ఇంకోసారి” ఉత్సాహంగా అన్నాను.
ఇందిరకి ఏ ఏ మందులు ఎలా ఎప్పుడు ఇవ్వాలో క్లీన్‌గా ఓ తెల్ల కాగితం మీద చక్కగా నోట్ చేసుకున్నాను. ఒక పది రోజులకు కావల్సిన మందుల్ని కూడా విడివిడి కవర్లలో పేరు – ఉదయం – మధ్యాహ్నం- రాత్రి అని స్పష్టంగా రాయించి ఓ బండిల్‌గా కట్టించాను ఫార్మాసిలో.
డాక్టరు గారి పర్సనల్ నంబరు అడిగితే ఆయన ఆనందంగా ఇచ్చారు. ఎందుకైనా మంచిదని డ్యూటీ డాక్టర్ నంబర్లు కూడా తీసుకున్నాను. నర్సులకి ఆయాలకి ఇందిరగారి డబ్బుల్లోంచే ఇచ్చాను.. స్వీపర్లనీ సంతోష పెట్టాను. బిల్లు పూర్తి చేసి డిశ్చార్జ్ ఫైల్ చేతికొచ్చే సరికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది. అల కారు హాస్పటల్ బయట సిద్ధంగా ఉంది.
***
ఒకప్పటి మేడ. చాలా పెద్దది. రెండంతస్తులు. గేటు నుంచి లోపల బిల్డింగ్ వరకూ దాదాపు వంద గజాల చక్కని బాట ఉంది. అటూ ఇటూ పూల మొక్కలు. బాగా ఎదిగి ఇప్పుడు దాదాపు చెట్లయ్యాయి. పూలతో నిండుగా ఉన్నాయి. చక్కని చిక్కని నీడ నిస్తున్నాయి.
ప్రహారీ గోడే చాలా ఎత్తుగా బలంగా ఉంది. ఓ ముసలామె, మసలాయన ఎదురొచ్చారు. మమ్మల్ని గేటు దగ్గరే ఉండమని ‘దిష్టి తీసే’ సామాగ్రి తెచ్చి ఇందిరకి దిష్టి తీసి లోపలికి రమ్మన్నారు.
రెండతస్తుల మేడ లోపలికి వెళ్ళాం. నాన్న గేటు దగ్గరే నిలబడిపోయాడు. ఇందిర వెనక్కి తిరిగా “గౌతమ్.. దయచేసి లోపలికి రా. నిన్ను వెళ్ళగొట్టిన వాళ్ళు లోకాన్నే వదిలి పోయారు. నువ్వు లోపలికి రాకపోతే, నేనే బయటికొస్తా” అన్నది ఆవిడ గొంతులో చెప్పలేనంత నీరసం. వంద గజాలు నడిచే సరికే డస్సిపోయింది.
నేను వెనక్కి వెళ్ళి మెల్లగా “రా నాన్నా.. నువ్వు పెరిగిన చోటుని చూడాలని ఉంది. అంతే కాదు, ఇప్పుడు నువ్వు రాకపోతే మళ్ళీ ఆవిడ మొదటికొచ్చి రానంటుంది” అన్నాను.
నాన్న మాట్టడలేదు. కానీ ఆయనకి లోపలికి రావడానికి అయిష్టం అని తెలుస్తూనే ఉంది. నేనే నాన్న చెయ్యి పట్టుకుని లోపలికి నడిపించాను. ఈలోగా ఇందిర ఏం చెప్పిందో, మెట్ల ముందరే ముసలతను మమ్మల్ని ఆపి, మాకూ దిష్టి తీయించాడు.. మాతో పాటు కల్యాణి గారికి కూడా.
“బావా, దశాబ్ద కాలమైంది. మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించు. నా తల్లిదండ్రులు నీ ఆస్తి కాజేసి ద్రోహం చేశారు. బహుశా నేను కూడా ఏమైనా.. దయచేసి మళ్ళీ మన ఇంట్లో కాలు పెట్టు” అన్నది గోడకి ఆనుకుని. నిలబడ లేకపోతున్న విషయం ఆవిడ ముఖం మీద మెరుస్తున్న చిరు చెమట వల్ల తెలిసింది.
ఆమె మాటల్లోని ‘మన’ శబ్దాన్ని వత్త పలకడం నేను గుర్తించాను. కల్యాణి గారూ గుర్తించారు. నాన్న మొహంలో ఓ విషాదంతో కూడిన ఆశ్చర్యం.
“ఆంటీ.. ముందు లోపలికి పదండి. మీరు నీరసంగా ఉన్నారు” అని నాన్న చెయ్యి వదిలి ఇందిర చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి అక్కడున్న పెద్ద పెద్ద సోఫాల్లో ఒక దాని మీద కూర్చోబెట్టాను. కల్యాణి, నాన్న కూడా లోపలికొచ్చారు.
“గౌతమ్, ఇల్లంతా మహతికి నువ్వే చూపించాలి. అప్పటి నీ గది ఇప్పటికీ అలాగే ఉంది. ప్రతి రోజు శుభ్రం చేయిస్తూనే ఉన్నాను. అప్పటి నీ వస్తువులూ భద్రంగా ఉన్నాయి.”
అసలా హాలే చాలా పెద్దగా ఓ యాభై మంది విశ్రాంతిగా కూర్చోగలిగేంత విశాలంగా ఉంది. ఇందిర పోలికల్ని బట్టి గోడలకు వేలాడుతున్న ఇందిర అమ్మా నాన్నాల్ని గుర్తుపట్టాను. వారి తల్లిదండ్రులు ఫోటోలూ అక్కడే ఉన్నాయి. ఫర్నిచర్ పాతకాలందైనా చాలా చాలా విలువైందని అర్థమైంది. అసలా ఫ్రేములు ఇప్పుడు దొరకనే దొరకవు.
“చూపించు నాన్నా మీ గది” అన్నాను కుతూహలంగా.
“కల్యాణిగారూ, మీరు ఎంతో స్నేహాన్ని పంచారు. మీకు నేను ఇల్లు కూడా చూపించలేకపోతున్నా. దయచేసి బావతో కలిసి మీరూ ఇల్లు చూడండి” అన్నది ఇందిర.
నాన్న హాల్లోంచి లోపలికి నడిచి కుడి వైపుకున్న నాలుగు గదుల్లో ఆఖరి గది ముందు నిలబడి పోయాడు. ఏళ్ళ తరవాత తన గదిని చూస్తున్న ఎమోషన్ ఆయన ముఖంలో కనపడింది.
నేనే చనువుగా తలుపులు తీశాను. షాక్. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతూన్నారేమో. చాలా క్లీన్‌గా పొందిగ్గా ఉంది.
మంచం మీద ఇస్త్రీ చేసిన దుప్పటి తలగడతో సహా (గలేబులుతో సహా). టేబుల్ మీద మా నాన్న ఫోటో. బహుశా 18, 19 సంవత్సరాలు ఉంటాయామో. చాలా అందునా అచ్చు సురేన్‌లా ఉన్నాడు. అప్పుడప్పుడే వచ్చీ రానట్టున్న మీసాలు. షాక్ ఏమంటే ఇంకో పక్కన ఇందిర ఫోటో. అద్భుతమైన అందంతో.. 16, 17 ఏళ్ళ వయసు ఫోటో. రెండు జడలు. గులాబీ రేకుల్లా విచ్చుకున్న పెదాలు. అద్భుతమైన పలువరస. కల్యాణీ నేనూ కూడా ఆ అందాన్ని చూసి నిశ్చేష్టులయ్యాం. నాన్న వంక చూస్తే ఆయన గోడ మీదున్న ఫోటోలని చూస్తున్నారు. అది ఆయన తల్లిదండ్రులదని చెప్పకనే చెబుతోంది. తాతయ్య, నాన్నమ్మ చాలా చాలా అందంగా ఉన్నారు. తాతయ్య చాలా పొడగరి అని ఫోటో చూస్తేనే తెలుస్తోంది. నాన్న కళ్ళల్లో నీళ్ళు.
మా తాతయ్య నానమ్మల ఫోటో చూడ్డం నాకు మొదటి సారే. అంటే ఆ ఫోటో మా నాన్న దగ్గర కూడా లేదన్న మాట. ఆ ఫోటోకి గంధపు రేకుల మాల ఉంది.
టేబులు, చైరు, పుస్తకాల బీరువా, వాటన్నింటి నిండా ‘అప్పటి’ పుస్తకాలు, ఆ కాలం నాటి ఫౌంటేన్ పెన్నులు కూడా పెన్ స్టాండులో ఉన్నాయి, ఒక పెన్సిల్‌తో సహా. ఆయనకు వచ్చిన స్కేలు. జామెంట్రీ బాక్సులు కూడా ఏదుమ్ము లేకుండా శుభ్రంగా ఉన్నాయి. ఓ గోడకి బిగించిన బీరువా తెరచాను. అప్పటి బట్టలు ఇంకా ఉన్నాయి. తలుపులు తియ్యాగనే ‘నాఫ్తలిన్ బాల్స్’ స్మెల్. అంటే చెదలు పట్టకుండా వేస్తూనే ఉన్నరన్నమాట. ఓ పక్క ఓ చెప్పుల జత. లెదర్‌ది.
అంటే, మా నన్న కట్టుబట్టలతో బయటకొచ్చాడన్న మాట. గుండె కలుక్కుమంది. చెప్పులు కూడా తొడుక్కోలేదంటే ఎంత బాధపడి ఉండాలి?
నాన్న అన్నీ చూస్తూన్నాడు. ఆయన ముఖం నిర్వికారంగా ఉంది. చాలా సేపు మౌనంగా ఉండి బయటకి వచ్చాం.
“నారాయణా, అందరికీ అన్ని గదులూ చూపించు. వీలున్నంత త్వరగా వంట వండించు. మేం బయల్దేరాలి” ఇందిర మాట మాటలా లేదు. ఆజ్ఞలా ఉంది.
ఒక్కో గది ఒక్కో విధంగా ఉంది. అలంకరణ నించి ఫర్నీచర్ వరకూ. “అబ్బా.. బ్రహ్మాండమైన టేస్టు” అన్నారు కల్యాణి. వాళ్ళదే గొప్పగా ఉంటుంది. అలాంటిది ఆవిడ యీ ఇంటిని మొచ్చుకోవడం నాకు చాలా విచిత్రం అనిపించింది.
“అది మోడరన్ మహీ.. ఇది సంప్రాదాయ బద్ధం. అదే తేడా!” అన్నారు కల్యాణి నా మనసుని గ్రహించినట్లు.
మొత్తం విశ్రాంతిగా చూసి క్రిందకొచ్చేసరికి అరగంట. మా నాన్న తన గదిలోనే ఉన్నారు తప్ప ఏ గది లోకీ రాలేదని నేనూ కల్యాణి గారూ కూడా గమనించాం.
“అద్భుతంగా ఉంది ఇందిరా మీ ఇల్లు.” అన్నారు కల్యాణిగారు.
“మహీ.. నీకూ!” అన్నది ఇందిరగారు.
“చాలా చాలా బాగుంది ఆంటీ!” అన్నాను నేను సిన్సియర్‌గా.
“మీ నాన్న తన గదిని విడిచి ఏ గదికీ రాలేదు కదూ!” నవ్వి అన్నది.
“అవును. అది మీకెలా తెలుసు?” ఆశ్చర్యంగా అడిగాను.
చాలా పెద్దగా నిట్టూర్చి – “ఇప్పుడే కాదు, ఆయన ఎప్పుడూ తన గది తప్ప ఏ గదికీ వచ్చేవాడు కాదు. ఒక్కసారికి మాత్రం నా గదికి బలవంతంగా లాక్కుపోయా. అప్పుడూ ఆయన చుట్టూ ఏదుందో కూడా చూడలేదని చెప్పగలను” మరోసారి నిట్టూరుస్తూ అన్నది ఇందిర. ఆ గొంతులో బాధ. అయినా ఓ గాంభీర్యం. హాస్పటల్లో ఇందిర వేరు, యీ ఇందిర వేరు అనిపించింది. అక్కడ మూర్ఖంగా మొండిగా, ఇక్కడ ఠీవీగా రాజసంతో!
మా నాన్న వంక చూశా. ఆయన ముఖంలో ఓ బాధా వీచిక.
“ఇందిరా, ఏదేమైనా చాలా గొప్ప టేస్టుతో కట్టారు ఇంటిని. ఓహ్.. ఆ కాలంలోనే ఇంత అద్బుతంగా కట్టారంటే మీ తండ్రిగారికి గొప్ప విజన్ ఉండి ఉండాలి” అన్నారు కల్యాణి.
“విజన్ ఆయనది కాదు.. గౌతమ్ గారి తల్లిదండ్రులది. ఇల్లూ మాది కాదు. మా నాన్న గౌతమ్ తండ్రికి నమ్మకద్రోహం చేసి యీ ఇల్లు తన పేరున మార్చుకున్నాడు. నిజానికి యీ ఇల్లు మొత్తం గౌతమ్‌ది. అంతే కాదు నేను అనుభవిస్తున్న ఆస్తిలో మూడొంతులు గౌతమ్‌దే” అని నా వంక తిరిగి, “మహీ.. ఇప్పుడు తెలిసిందా.. ఇది మీది” అని అలసటగా కళ్ళు మూసుకుంది ఇందిర.
సూది పడితే బాంబు పేలినట్టు వినిపించేంత నిశ్శబ్దం అలుముకుంది అక్కడ.
(ఇంకా ఉంది)
భువన చంద్ర సుప్రసిద్ధ సినీ గేయ రచయిత. కథకులు. పలు హిట్ పాటలు రచించారు. “భువనచంద్ర కథలు”, “వాళ్ళు” అనే పుస్తకాలు వెలువరించారు.