[‘నన్ను ప్రభావితం చేసిన నా గురువు’ అనే శీర్షిక కోసం తమ గురువు శ్రీ తిగుళ్ల శ్రీహరిశర్మ గురించి వివరిస్తున్నారు శ్రీమతి సూర్యదీప్తి.]
మన వేలు పట్టి నడిపేది తప్పటడుగులు దిద్దేది కన్నవాళ్ళైతే తనవేలితో జగత్తును చూపించి జాగృతం చేసి తప్పటడుగులు వేయకూడదని హితబోధ చేసేవాడు గురువు…
సన్మార్గ సందర్శనకు సహకరించేవాడు గురువు.. పుస్తకగతమైన విజ్ఞానాన్నిమస్తకానికి ప్రసరింపజేసి వాస్తవజీవితానికి అనుప్రయుక్తం చేస్తూ సావధానంగా ప్రబోధ జేయడం గురుతరమైన కార్యం..
అటువంటి గురువుల ఆశీర్వాదం వల్ల ఉపాధ్యాయవృత్తిని చేపట్టిన నాకు తానే పరబ్రహ్మంగా ఎదుటనుండి తాత్విక పరమైన వ్యాఖ్యానం చేస్తూ పాఠ్యభాగాన్ని పలు ఉదాహరణలతో, విశేషమైన ఉపమానాలతో, శ్లోకాలతో, పద్యాలతో అనర్గళంగా ప్రతిరోజు బోధనాపరమైన విభాగాన్ని(పీరియడ్) సార్థకం చేయడములో కృతకృత్యడైనాడు నా పెదతండ్రి, ‘సంస్కృతాంధ్ర అష్టావధాని’, ‘గురుబ్రహ్మ’, ‘మహామహోపాధ్యాయ’ బిరుదాంకితులు.. బ్రహ్మశ్రీ శ్రీ తిగుళ్ల శ్రీహరిశర్మ గారు.
‘కర్మణ్యేకం మనస్యేకం వచస్యేకం మహాత్మనాం’ అన్న ఆర్యోక్తికి అలంకారం శ్రీహరిశర్మ గారు.
వారి శిష్యకోటిలోనేను పరమాణువునే అయినా ఈ పరమాణువును కూడా చూసినా, మాట్లాడినా అపరిమితమైన, అవ్యాజమైన ఆత్మీయతను ఆత్మ సంతృప్తిని వ్యక్తం చేసే వారి సమున్నతత్వానికి నేనేమివ్వగలను?? సహృదయంగా పాదాభివందనం చేయడం తప్ప..
వారు ప్రసంగానుసారంగా విద్యార్థులకు బోధించే విలువలు నిజజీవితానికి గౌరవాన్ని, ఉన్నతత్వాన్ని ఆపాదించే వలువలు..
వారి బోధన విన్న శిష్యులు జీవితాన్ని ఔపోసన పట్టినట్లే..
“నీలో తృప్తి చెందే సహజాత గుణం లేకుంటే స్వర్గవాసమైనా నరకతుల్యమే” అనే భావనాబలాన్ని నాలో జీర్ణం చేయించిన మహామహోపాధ్యాయులు..
45 నిముషాలు బోధనా విభాగాన్ని ఒక్కోరోజు ఒక్కోరకంగా విద్యార్థి కళ్ళలోకి చూస్తూ జ్ఞానకాంతుల్ని ప్రసరింపజేసేవారు.. వారు చెప్పిన ప్రతి పాఠ సారాంశాన్ని నేను ఇప్పుడు చెప్పలేనేమో కానీ వాస్తవ జీవనంలో నేను చూసి అనుభూతి చెందేది, ఆవేదన చెందేది, నాచే ఆనందాన్ని అనుభవింపజేసేది ప్రతీది వారి బోధనలో అంతర్భాగమే..
నేటికీ వారితో గడిపిన ఒక గంట నవోత్సాహ భరితం, నిత్య నూతనం.. వారి మోవి నుండి వెలువడిన ప్రతి మాటా సూక్తి సుభాషితం..
జీవితమంటే ఎత్తు పల్లాలని, కష్టసుఖాల సమహారం అని తెలియజేసారు.. అనాయాసంగా దక్కే గెలుపు అశాశ్వతమనీ విశదీకరించారు..
వేద వేదాంగాలు, పురాణేతిహాసాలు పుక్కిటపట్టిన గురువుగారు నా (విద్యార్ధి) స్థాయిని అంచనావేసి, నన్ను (విద్యార్ధిని) ఆకర్షతుణ్ణి చేసి వారు చెప్పిన అంశాన్ని అవలీలగా మన మేధలోనికి చొప్పింపజేసి వారనుభవించిన విషయానందాన్ని మాకు కల్గింపజేసేవారు..
బిరుదులు వారికి అలంకారప్రాయం..
సన్మానాలు వారిని పొందితేనే శోభయమానం..
వారి జ్ఞానగంగా తీర్థపానం చేసిన నేను ఒకింత గర్వపడుతున్నాను..
ఏ జన్మ పుణ్యఫలమో వారికి శిష్యురాలిగా ఈ జన్మ, ఏ పూజ ఫలితమేమో వారి నిష్కల్మష వాత్సల్యానికి పాత్రత..
నా పాలిట నడిచే దైవం..
నన్ను నడిపించిన వారి మార్గదర్శనం..
వారి కృపాకటాక్షవీక్షణాలలో నా జన్మ ధన్యం..
నమోవాకాలతో