అభిరామ్‌ని ఒక సువర్ణావకాశం వరించింది. ప్రముఖ కవులు పాల్గొంటున్న కవి సమ్మేళనంలో తన స్వీయ కవితను చదవబోతున్నాడు. తన పేరును ఆహ్వానపత్రికలో చూచుకొని మురిసిపోయి, బ్రహ్మానందంతో స్నేహితులకు కూడా పంచాడు. వారిలో కొందరు అభిరామ్‌ను అభినందించారు.
ఇంకొందరు మాత్రం వ్యంగ్యాస్త్రాలు సంధించి “ఇదేమిటిరా! ఇంకా నీవు కవిత్వం, కాకరకాయలు రాస్తూనే ఉన్నావా! అయినా నువ్వేమైనా వేటూరి సుందరరామూర్తివి అనుకుంటున్నావా! లేక సిరివెన్నెల సీతారామశాస్త్రి అని కలగంటున్నావా!” అనేసరికి, “వాడు సినారెలా ఫీల్ అయ్యి ‘శివరంజనీ నవరాగిణి’ అని రాసి పడేయాలనుకుంటున్నాడు! పెద్ద దిగి వచ్చాడండీ అపరకాళిదాసు!” అదీ వాళ్ళ అసూయల దండకం.
వాళ్ళ సూటిపోటీ మాటలకు కృంగిపోయేవాడు పాపం అభిరామ్. ఎంతైనా మానవ మాత్రుడే కదా మరి! కాలేజీ వార్షికోత్సవ సభలో అభిరామ్ కవితలు చదువుతూ ఉంటే, “దిగిపో… దిగిపో…. చాలు చాలు” అంటూ వెటకారంగా స్లోగన్స్ ఇచ్చారు.
అయినా అభిరామ్ మటుకూ తన కిష్టమైన కవిత్వాన్ని ప్రేమిస్తూ ముందుకు వెళుతునే ఉన్నాడు. వివిధ వారపత్రికలలో అభిరామ్ కవితలను ప్రచురించారు. మంచినీళ్ళ కోసం, అద్వానంగా ఉన్న రోడ్లు మరమ్మత్తుల కోసం, దోమల నివారణ కొరకు దినపత్రికల లేఖావళి శీర్షికలో ప్రజాగళాన్ని తన కలం ద్వారా తెలియజేసినందుకు క్యాష్ ప్రైజులు కూడా ఎన్నో వచ్చాయి. అందుకే ముఖ్యంగా అమ్మాయిలు అభిరామ్‌కి అభిమానులుగా మారారు.
క్లాలకు వెళ్ళేటప్పుడు అమ్మాయిలు అభిరామ్‌తో తరచుగా మాట్లాడటం ధనేష్, హరిబాబు, అవినాష్, విజయ్ కుమార్‌లకు ఏ మాత్రం నచ్చటం లేదు!
వీడేవడురా? ఎవో కవితలు చెపుతున్నాడని వదిలేస్తే ప్రవల్లిక దగ్గర ఫోజులు కొడుతూ కవిరాజులా ఫీలైపోతున్నాడని అభిరామ్‌కి చెక్ పెట్టాలని ప్లాన్ వేశాడు ధనేష్,
అభిరామ్ వ్రాసిన పాటలను, కవితలను ముందుగా అమ్మకు వినిపించేవాడు. అమ్మకు కొడుకు సాహిత్యమంటే ఎంతో ఇష్టం. ఎవరెన్ని అన్నా, పట్టు విడువకుండా సాహిత్య కృషి చేయమని ప్రోత్సహించిన అమృతమూర్తి అమ్మ.
ఒకరోజు “పంచమి వెన్నెల” కవితను అమ్మకు విన్పిస్తుండగా అప్పుడే వచ్చిన నాన్న అవధాని ఉగ్రరూపుడై కొట్టబోయాడు. వెంటనే శరవేగంతో అభిరామ్ బయటకు పారిపోయాడు. “వాడిని బుద్ధిగా చదువుకోమని చెప్పకుండా, పైగా వాడు రాసిన చెత్త కవిత్వాన్ని మెచ్చుకుంటున్నావా?” అని భార్యపై ఆవేశపు అక్షింతలు వేశాడు.
ఆకలి దంచేస్తున్నా అభిరామ్ భోజనానికి ఇంటికి వెళ్ళలేదు. ఇంట్లో నాన్న వడ్డనలే ఎక్కువగా ఉంటాయని తెలుసు. ‘ఆ వెధవ సన్యాసిరాలేదేం?’ భార్య మౌనమే సమాధానం. ‘మొక్కగా ఉన్నప్పుడే వంచాలి, మానైపోతే వంగదు, అలాగే మన పిల్లల్ని కూడా! అంతేగాని వాళ్ళు తాన అంటే మనం తందాన అనే చందాన మారకూడద’ని గట్టిగా అరుస్తూ, భోజనం ముగించాడు అవధానిగారు.
కాలచక్రం మన గురించి ఒక్క నిముషం కూడా ఆగదు. ధర్మబద్ధంగా తిరుగుతూనే ఉంటుంది కాబట్టి, దానిని కాలచక్రం అన్నారు. అభిరామ్ బాగా చదువుతున్నాడు. ఇంటర్నల్ పరీక్షల్లో సెకెండ్ క్లాస్ మార్కులు వచ్చాయని తండ్రి మళ్ళీ క్లాస్ తీసుకున్నాడు. “పండిత పుత్రః పరమ శుంఠః” అంటే ఇదేరా! నీకు ఫస్ట్ క్లాస్ వచ్చి తీరాలి. అర్థమయ్యిందా!
ఇకనైనా వ్యాకరణం లేని కవిత్వాన్ని పక్కన పెట్టి, కుదురుగా చదివితే ఫస్ట్ క్లాస్‌లో ఫాస్ అవుతావు, అలాగే పెద్ద హోదా గల ఉద్యోగం వస్తుంది” అని కోపంగా హెచ్చరించి, ఏదో పనిమీద బయటకు వెళ్ళిపోయాడు. ఆ సమయంలో రేడియోలో నుండి “దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి” అనే పాట విన్పిస్తోంది.
కాలేజీ సావనీర్లో అభిరామ్ కవితలతోపాటు ఒక పాట కూడా ప్రచురించారు. కాలేజీ వార్షికోత్సవంలో అభిరామ్ పాడుతున్న పాటను మంత్రముగ్ధులై వింటున్నారందరూ.
కానీ ధనేష్, హరిబాబు, అవినాష్, విజయ్ కుమార్‌లు పైశాచికంగా కేకలేసి, అభిరామ్ పైకి కోడిగుడ్లు, టమాటాలు విసిరి రసవత్తంగా సాగుతున్న ప్రోగ్రాంను నాశనం చేశారు. అభిరామ్ తనకు జరిగిన అవమానాన్ని భరించలేక వేదిక దిగి వెళ్ళిపోయాడు.
ప్రిన్సిపల్ ఆదేశాలతో మళ్ళీ స్టేజ్ పైకి అభిరామ్‌ని తీసుకొచ్చారు. ఈసారి అభిరామ్ పాట ఇంకా శ్రావ్యంగా ప్రవహించింది. కరతాళ ధ్వనులతో ఆడిటోరియం మారుమ్రోగిపోయింది. కవులు, కళాకారుల ప్రదర్శనలను మనం ప్రోత్సహించాలిగానీ, అడ్డుకోవటం కుసంస్కారమని విద్యార్థులకు హితవు చెప్పాడు ప్రిన్సిపాల్.
అభిరామ్‌ని ప్రిన్సిపల్ శాలువాతో సత్కరించగా, సర్టిఫికేట్‌తోపాటు క్యాష్ అవార్డ్, జ్ఞాపిక బహుకరించారు అధ్యాపకులు. అందుకే దమ్మిడి ధనేష్ బ్యాచ్‌కి ఇంకా బి.పి. పెరిగిపోయి ఆవేశంతో పూలకుండీలను ధ్వంసం చేసిపారేశారు. కానీ కాలేజ్ క్యాంపస్ అంతా సి.సి.కెమెరా కవరేజ్ ఉందని ఊహించలేకపోయారు.
ఈ సంఘటనను తెలుసుకున్న ప్రిన్సిపాల్ ధనేష్ని ఏమీ చేయలేకపోయాడు. కారణం – ధనేష్ బిజినెస్ మాగ్నెట్ దినేష్ రాయుడి కొడుకు. పైగా కాలేజీకి ఎక్కువగా డొనేషన్ ఇచ్చిన ప్రప్రథముడు. అయినా ఏం లాభం? కొడుకు ధనేష్ మాత్రం శుద్ధ అధముడు. అన్నీ సున్నా మార్కులే.
అమ్మాయిల్ని టీజింగ్ చేయటం, ర్యాగింగ్‌లో రచ్చచేసి తద్వారా పైశాచికానందాన్ని పొందే శాడిస్ట్ ధనేష్. పేరుకే ధనేష్ కానీ వాడు దమ్మిడీకి కూడా పనికిరాని “దమ్మిడి ధనేష్” అనే టైటిల్ కూడా ఇచ్చేశారు.
సీరియస్‌గా అందరూ పరీక్షలు రాస్తున్నారు. అభిరామ్ డస్క్ లోపల కొన్ని స్లిప్పులు పట్టుకున్నారు స్పెషల్ స్క్వాడ్. అభిరామ్ ఆన్సర్ పేరును టాలీ చేశారు. స్లిప్పులతో మ్యాచ్ అవటంతో అభిరామ్‌ని డిబార్ చేశారు. అభిరామ్ కన్నీరు మున్నీరై రోదించాడు. ఇందులో ఏదో కుట్ర జరిగిందని గ్రహించాడు. కనీసం పాస్ అవుతాననుకున్నాడు. అభిరామ్ అలాంటివాడు కాడని చెప్పారు అధ్యాపకులు. అయినా వాళ్ళు ఎవరి మాట వినకపోగా, సంతకాలు తీసుకొని వెళ్ళిపోయారు.
ఈ అనూహ్య సంఘటనతో కాలేజీ మేనేజ్మెంట్ ఉలిక్కిపడింది. ఒక ఉత్తమ విద్యార్థిని బలి పశువుని చేసినందుకు అక్కడ శాడిస్ట్ దమ్మిడి ధనేష్ బ్యాచ్ అంతా పబ్‌లో బాగా మద్యం తాగారు. హుక్కా పీల్చారు. అది చాలదు అన్నట్లు డ్రగ్ ఇంజక్షన్లు తీసుకున్నారు. అర్ధరాత్రి సైకోల్లా అరుస్తూ డాన్సు చేసి అలసిపోయి మత్తుగా నిద్రపోయారు.
అప్పుడు కిరాయి రౌడీలు వచ్చి వాళ్ళ ఏటిఎమ్ కార్డులు కొట్టేసి, క్యాష్ మొత్తం దోచేసుకున్నారు. పోలీసులు రైడ్ చేశారు. పబ్‌లో రెడ్ హ్యండెడ్‌గా అరెస్టు చేసి, వారిని రిమాండ్‌కి పంపించారు. డ్రగ్ కేస్‌ని క్షుణ్ణంగా విచారించి ఋజువైంది కాబట్టి శిక్షలు కూడా ఖరారు చేసింది న్యాయస్థానం.
ప్రభుత్వం కాలేజీ గుర్తింపుని రద్దుచేసింది. ఆధునిక నాగరిక మానవులు అభివృద్ధి పేరుతో ప్రకృతిని సర్వనాశనం చేసిపారేశారు. వాడనిచ్చే చెట్లు కరువైపోయాయి. భూమి అంతా సిమెంట్ ప్లాస్టిక్‌తో మూసుకుపోయింది. ఇక వర్షం నీళ్లు భూమిలోకి ఎలా వెళతాయవి? వీధి చివర షాప్ మెట్ల మీద కూర్చుని ఆవేదన చెందుతున్నాడు అభిరామ్.
డిగ్రీ పరీక్షా ఫలితాలు వచ్చాయి. అభిరామ్ తెలుగుతో పాటు ఇంకొక పరీక్ష కూడా ఫెయిల్ అయ్యాడు. కనీసం తెలుగు సబ్జక్ట్లోనైనా పాస్ కానివాడు, తెలుగు రచయిత, కవి ఎలా అవుతాడు? డిబార్ చేసి మెమో ఇస్తే, వివరణ రాసి పంపించాడు. కొడుకుకి డిబార్ గండం తొలగిపోయిందనుకున్నాడు కాని ఇలా ఫెయిల్ అవటం ఏమిటని? ఇంటికొచ్చిన వాళ్ళకు సైతం పనికట్టుకొని తండ్రి చెపుతూ ఉంటే అభిరామ్ అవమానాన్ని భరించలేకపోయాడు.
“ఒరేయ్ అవధాని పిల్లల్ని సపరేట్గా ఇంట్లోనే మందలించాలి. అప్పుడు అవమానాల వ్యధలు, గొడవలు, పారిపోవటాలు ఉండవు” అని స్నేహితుడు పురుషోత్తం భయపడుతూనే చెప్పేవాడు. అదే వాళ్ళు మంచి పనిచేస్తే నలుగురిలో మెచ్చుకోవాలి. ఈ విషయాలన్నీ ఇంటి పెద్దలు, టీచర్లు తమ విధిగా పాటించాలి. ఇంట్లోంచి పారిపోదామనే ఆలోచనకు వచ్చేశాడు. కానీ అమ్మ మనసు తన కోసం అల్లాడిపోతుంది. అమ్మ మనసు నాన్న కుండదు ఎందుకనో!
స్నేహితుడి రూమ్‌కి వెళ్ళిపోయి, నాలుగు రోజుల తర్వాత ఇంటికొచ్చి అమ్మ ఇచ్చిన పరమాన్నం తింటూ టి.విలో చిత్రలహరి చూస్తున్నాడు. “చదువురానివాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమతలుంటే చదువులెందుకు?” ఆ పాటను చూస్తున్న కొడుకుని చూచిన అవధానికి కోపం రెట్టింపయ్యింది. “ఒరేయ్! అది సినిమాపాట, పాట కల్పితం. పాట వేరు మన జీవితం వేరు. ఊహలు, కలలు ఏనాటికీ నిజం కావు” అని మళ్ళీ తన విసిగించే ధోరణితో ఆగ్రహించాడు.
ఇది ఇల్లుకాదు! నరకం! రణరంగం! ఎప్పుడు చూసినా తిట్టడం, నిందించటం, దండించటమేకానీ సౌమ్యంగా మాట్లాడడం, నేర్చుకోలేదు వీళ్ళు. అభిరామ్ మానసికంగా విసిగిపోయి ఒక ధృఢ నిర్ణయాని కొచ్చేశాడు. అది తెలుసుకున్న ప్రవల్లిక ఒక స్వీటు బాక్స్ కొంత డబ్బును అభిరామ్‌కు ఇచ్చింది. బాధగా టాటా చెప్పింది రైల్వేస్టేషన్లో. అమ్మా, నాన్న చెల్లెలుతోపాటు స్నేహితులందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నందుకు బాధగానే ఉంది, అయినా తప్పదు. ఇది తప్పా! లేక రైటా! రైలు ప్రయాణ ఆవేదన ఆలోచనతో గాఢనిద్ర ఆవహించింది.
ఉదయం నిద్ర లేచేసరికి అభిరామ్ బ్యాగ్ మాయమైపోయింది. హాయిగా పడుకుంటే, దొంగ జాలీగా కొట్టేశాడు. తోటి ప్రయాణికుల్ని ఆరాతీసి లాభం లేకపోయింది. ఈ మహానగరంలో తను ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయగలను? ఎవర్ని కలవాలి? ఆకలి… ముందుగా ఏవైనా తినాలి అని జేబులు చూసుకుంటే చిరిగిపోయిన యాభై రూపాయల కాయితం, కొంత చిల్లర దర్శనమిచ్చాయి.
రెండు బన్నులు, రెండు చాయ్ లతో టిఫిన్ ముగించేసేసరికి శక్తిరానే వచ్చింది. 11 నెం. బస్ మీద రోడ్లన్నీ సర్వేచేసి, చివరికి ఒక పత్రిక ఆఫీసులోనికి దారితీశాడు. ఉద్యోగమేదైనా చేస్తానన్నాడు. కానీ ఎడిటర్ అభిరామ్‌ను తికమక పెట్టాడు. అనుభవం లేదని అవమానించినా, టీ ఆఫర్ చేశాడు. పోనీలే! ఆకలి వేయకుండా ఉంటుంది.
“ఇది నీ టాలెంట్‌కి పరీక్ష!” అని చెప్పి తెల్లకాగితాలు ఇచ్చి “ఈనాటి రాజకీయాలు- సినిమాలు” అనే అంశంపై ఆరు పేజీల వ్యాసం రాయించాడు. అభిరామ్‌కు ఇలాంటి విషయాలు రచించటమంటే ఆసక్తి ఎక్కువే కదా! అద్భుతమైన దస్తూరితో అదరగొట్టేశాడు. ఎడిటర్‌కి వ్యాసం బాగా నచ్చింది. దీనిని బాస్‌కి చూపిస్తే పెండింగ్‌లో వున్న తన స్పెషల్ ఇంక్రిమెంట్ ఇప్పుడు వచ్చి తీరుతుందని వెంటనే అభిరామ్ చేతిలో బహుమతిగా వంద రూపాయల నోటు ప్రెజెంట్ చేశాడు ఎడిటర్.
ఎడిటర్ అభిరామ్ అడ్రస్ అడిగాడు. “నాకు అడ్రస్ లేదు. ఇదుగో ఫోన్ నెంబర్…” అంటూ ఇచ్చాడు.
“మరి నా ఉద్యోగం సంగతి?”
“ఏవైనా ఖాళీ ఉంటే ఫోన్ చేస్తాను” అంటూ, చీఫ్ ఎడిటర్ కాబిన్ లోకి వెళ్ళిపోయాడు. ఆ మాట విన్న అభిరామ్ నీరసంగా బయటకొస్తుండగా, చూడటానికి సినిమా యాక్టర్ రావుగోపాలరావులా వున్న కళాధర్ ఎదురొచ్చాడు. తనకు తానే పరిచయం చేసుకొని, హోటల్‌కి తీసుకెళ్ళి ఫుల్‌గా టిఫిన్ పెట్టించాడు.
“ఆశ్చర్యపడకు మిష్టర్ అభిరామ్! నీకు అన్ని విషయాలు విపులంగా చెపుతాను. నా పేరు కళాధర్, సార్థక నామధేయుణ్ణి అన్నమాట, ఎంతటి కఠినాత్ములనైనా, నా మాటల గారిడితో కరిగించగలను, మెప్పించగలను. నన్ను మోసం చేసేవాళ్ళను బురిడీ కూడా కొట్టించగలను. ఈ భూమ్మీద నేను చేయలేని వ్యాపారమంటూ లేదు.
డ్రామాలు వేయిస్తాను. కాంట్రాక్టులు చేస్తాను. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగా సంపాదించాను. డిమాండ్ ఉందంటే నల్లపిల్లిని, తెల్లకాకుల్ని సైతం సప్లై చేయగల సత్తా వున్నవాడే నువు చూసున్న ఈ కళాధర్. అవసరమైతే వేషం ఏమైనా వేయగలను, మీసం తిప్పగలను.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పట్టున్న కథలు లేక, కదలలేక నిర్మాతలు, దర్శకులు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్లిష్టమైన సమయంలో, నీలాంటి టాలెంట్ వున్న “మహాకవి” అవసరం ఎంతైనా ఉంది” అని పవర్ ఫుల్ ఇంట్రడక్షన్ దంచికొట్టాడు.
ఉండటానికి రూమ్ ఏర్పాటుచేసి, “అద్దె మాత్రం నువ్వు ఇప్పుడు ఇవ్వక్కరలేదు. నువ్వు బాగా సంపాదించిన తరువాతే ఇద్దువుగాని! అనే భరోసా ఇవ్వటంతో అభిరామ్ మనసు కుదుటపడింది. ఆత్మబంధువులా కళాధర్ చేసిన సహాయానికి అభిరామ్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆపదలో వున్నప్పుడు మనిషి రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తాడురా! అని ఎప్పుడో అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
అభిరామ్ రాసిన కథకు యాభైవేలు ఇప్పించాడు కళాధర్. అలాగే ఇంకొక కథ, కొన్ని పాటలు కూడా రాయాలి నువ్వు. మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని ట్యూన్సు ఇచ్చి, వాటికి పాటలు కూడా వ్రాయమంటాడు. ఇక్కడ అంతా మనవాళ్ళే మహాకవీ. ఏంటి? అలా చూస్తున్నావ్? ఈసారి పేమెంట్ రెండు లక్షలకు పైగానే ఉంటుంది అని హడావిడిగా వెళ్ళిపోయాడు కళాధర్.
చేతినిండా పనితో పగలూ రాత్రీ తేడా లేకుండా బిజీగా మారిపోయాడు అభిరామ్. “అమీర్ పేటలో గరీబ్ గల్లి” కథ పూర్తి అయ్యింది.
అనుకున్న వేళలో కళాధర్ ఫోన్ చేశాడు. “చూడు! మహాకవీ నువ్వు రాసిన ఆ కథను అసిస్టెంట్ డైరెక్టర్ చక్రపాణికి అందజేయి. ఔను! చక్రపాణి నీ రూముకి వస్తున్నాడు. ఇది చాలా పెద్ద బడ్జెట్ సినిమా. అక్కడికి నువ్వు వెళ్ళలేవు! నీ కథకు నేను గ్యారంటీ ఇస్తున్నానుగా, భయపడకు” అని ఫోన్ కట్ చేశాడు.
మరొక ప్రక్క అమ్మాయిల కొత్త పరిచయాలు పెరిగిపోయాయి. వారిది నిజమైన ప్రేమా! కీర్తి ప్రేమా! డబ్బు కోసం ప్రేమా! లేక బ్లాక్మెయిల్ ప్రేమా! అనే అర్థంకాని అయోమయ ఆందోళనలు అభిరామ్‌ని వేధిస్తున్నాయి.
మాళవిక అలాంటి అమ్మాయి కాదు. ఆమె చూపుల్లో తనపై ఆరాధన, స్నేహ భావం గల స్వచ్ఛత, అభిరామ్ ని ఆకర్షించింది. మాళవిక తోడు కోసం తపించిపోతున్నాడు. ప్రేమ లాలన కోసం పరితపించటం ప్రకృతి సహజం. “అమీర్ పేటలో గరీబ్ గల్లీ” చిత్రం విడుదలై ఘన విజయాన్ని సాధించింది. కళాధర్ చెప్పినట్లుగా రెండు లక్షల పారితోషికం ఇచ్చాడు ప్రొడ్యూసర్, చిన్న రూము నుండి పెద్ద అద్దె ఇంటికి మారదాం అన్న మాళవిక ఇచ్చిన సలహా అభిరామ్‌కు నచ్చింది. చక్కని సొగసు, చల్లని మనసున్న ప్రియ మాళవిక తోడుతో మహాకావ్యాలు సృష్టిస్తున్నాడు అభిరామ్.
మాళవిక ప్రేమతోపాటు ఇల్లు మారిన వేళా విశేషం అన్నట్లు సినిమా విజయోత్సవ సభలో “మహాకవి” అవార్డు అందుకున్నాడు. తెలుగు వ్యాకరణంతో పనిలేదనీ, బూతుల్లేకుండా కథ, మాటలు, పాటల విరచిత ఇది అమ్మా నాన్నల విజయం అని అన్నాడు. అభిరామ్‌ని సహజకవి అని డైరక్టర్లు ప్రశంసించారు. వేదికపై తల్లిదండ్రుల తలపుతో ఆనంద భాష్పాలు వర్షించాయి.
ఇప్పుడు అభిరామ్ చేతినిండా పని, జేబునిండా డబ్బులే డబ్బులు అని అనుకున్నాడు. చక్రపాణి వచ్చి తను రాసిన కథలను తీసుకెళ్లిపోతున్నాడు. అతి తెలివిగా వాటిని జిరాక్సు కాపీ చేసి తిరిగి ఇచ్చేస్తున్నాడు. పైగా డైరక్టరుకు కథ నచ్చలేదంటూ పిట్ట కథలు చెప్పేవాడు చక్రపాణి. రాసిన కథలకు డబ్బులు రాకపోగా, మాళవికతో రోజువారీ విలాసాలు, పట్లు, క్లబు తిరగటం వలన సంపాదించిన డబ్బు హారతి కర్పూరమైపోతోంది.
అభిరామ్ తన తల్లిదండ్రులను తీసుకొస్తానన్నాడు. అంతే మాళవిక మూడిగా మారిపోయింది. అలిగింది, ఒక రోజంతా మాట్లాడలేదు. ఆమె ప్రేమ కోసం తపించిపోయాడు. ఇక నుండీ తన మాటే వినాలని ప్రామిస్ చేయించుకొని అభిరామ్‌ని ఇరకాటంలో పెట్టింది.
రెండోరోజు ఉదయాన్నే మాళవిక తల్లిదండ్రులతోపాటు చెల్లెలు సామాన్ల ట్రక్కుతో దిగిపోయారు. అభిరామ్‌కు కళ్ళు తిరిగాయి, కాళ్ళు వణికి సోఫాలో పడిపోయి ఏడుస్తున్నాడు. “నేను తప్పు చేశాను నాన్నా! నన్ను క్షమించు.” తనకు అర్థంకాని విషవలయాల చిక్కుముడులను ఛేదించే శక్తినీయమని ఆవేదనతో కాళికాదేవిని ప్రార్థించాడు. ఒకరోజు కళాధర్ వచ్చాడు. ఇంకొక కథ వ్రాయమన్నాడు.
కానీ రాసే స్థితిలో లేడు అభిరామ్. ఆగ్రహించాడు. అందుకే కదా! మాళవికను పావుగా పరిచయం చేసింది. ఇప్పుడు రాయనంటే ఎలా? తన ఆదాయం మొత్తం తగ్గిపోదనే కుటిలమైన ప్లాన్ వేశాడు. మాళవిక ద్వారానే త్రాగుడు అలవాటు చేశాడు. కానీ తాగిన మైకంలో అసలు రచనా వ్యాసంగం, కవిత్వం అటుకెక్కి కూర్చున్నాయి. మద్యానికి లొంగిపోయి, అక్షరాలు మరచిపోయాడు.
అభిరామ్ క్రమశిక్షణ నుండీ ప్రక్కదారి పట్టాడు. అయినా నేనెందుకు కథలు వ్రాయాలి? ఎవరి కోసం వ్రాయాలి? అనే స్థితికి వచ్చేశాడు. “మన అద్దె ఇంటికోసం, నిన్ను ప్రేమించావుగా! నా ప్రేమ కావాలనుకుంటే నీవు కథలు, పాటలు రాయాలి” అని మాళవిక అభిరామ్ బలహీనతల్ని క్యాష్ చేసుకుంటోంది. ఒకానొక సందర్భంలో కథ రాసి తీరాలని కొట్టింది కూడా.
మాళవిక మహాకవి అభిరామ్ ప్రేమ కలాపాల గురించి పత్రికల్లోనూ, మీడియాలోనూ ఎన్నో కథనాలు ప్రసారమయ్యాయి. కల్పిత కథనాలు ఎప్పటికీ వాస్తవాలు కాలేవని అభిరామ్ చెప్పటంతో, ఇంకా ఉధృతంగా బులిటెన్లు విడుదల చేస్తూనే ఉన్నారు.
మా పర్సనల్ విషయాలపై మీకు ఎందుకింత అసూయ, ఆతృత? అసలు ఎలాంటి వార్తలు వ్రాయాలో, ఎలాంటి దృశ్యాలు టీవీ ఛానళ్ళలో చూపించాలో మీకే తెలియదు. ఒక నాయకుడు చచ్చినా, మరొక సెలబ్రెటీ మరణించినా, శవాన్ని రోజుల తరబడి క్లోజప్ లో చూపిస్తూనే ఉంటారు. అంతటితో ఊరుకుంటారా! స్మశానాల్లో కూడా కెమెరాను తీసుకెళ్ళి అంత్యక్రియలు సైతం ప్రత్యక్షప్రసారం చేయటం ప్రజలకు అవసరమా! అని అభిరామ్ మీడియా మీద నిప్పులు కురిపించాడు.
అభిరామ్ కి అవకాశాలు లేవు. బలహీనుడయ్యాడు. జేబులో రూపాయి కూడా లేదు. ప్రేతకళతో ఒంటరిగా గడుపుతున్నాడు. మాళవిక చక్రపాణిని ఇంటికి తీసుకొచ్చింది. తన ఎదుటే వాళ్ళిద్దరూ సరసాలాడటం భరించలేకపోయాడు అభిరామ్. ఆ తీవ్రమైన బాధతో ఆ రోజు ఫుల్‌గా తాగిన అభిరామ్‌ను మెడబట్టి బయటకు గెంటేసింది మానవత్వం నశించిన మాళవిక.
కళాధర్ కు ఫోన్ చేస్తే నెంబరు మారిపోయిందన్న మెస్సేజ్ వచ్చింది. మహాకవి బిరుదు మా పార్టీ నుండీ ఇచ్చాం అని ఆనాడు గొప్పగా చెప్పుకున్న పార్టీయే ఈనాడు తిరిగి ఇచ్చేయమంటోంది. మహాకవి ఏమయ్యాడు? ఎక్కడ ఉంటున్నాడు? అసలు జీవించి ఉన్నాడా? అనే సమయంలో మహాకవి ఆత్మహత్య చేసుకున్న సూసైడ్ నోట్ ప్రెస్ కి రిలీజ్ చేశాడు కళాధర్.
తమ అభిమాన రచయిత, కవి చచ్చిపోయాడని తెలిసిన అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. కొడుకు చనిపోయాడని తెలిసిన తల్లిదండ్రులు, చెల్లెలు బాంధవి, ప్రవల్లిక సహాయంతో నగరానికి చేరుకొని వెతకటం ప్రారంభించారు.
“తిరునాళ్ళు” సినిమా షూటింగ్ లో మహాభక్తుడు వేషం వేసి కాళికాదేవి రథంలాగుతున్నాడు కళాధర్. సన్నాయి మేళతాళాలతో భక్తులంతా నృత్యం చేస్తూ రథయాత్రలో సాగిపోతున్నారు.
రామడోలు, డప్పు వాయిద్యాలు భక్తులకు ఉత్తేజానివ్వటంతో శివతాండవం ఇంకా రెట్టింపయ్యింది.
రథంపైనున్న కాళికాదేవి విగ్రహంపైకి నిమ్మకాయలు విసురుతున్నారు కొందరు. అడుగడుగునా కొబ్బరికాయలు కొడుతూ, రథాన్ని లాగుతూ జై కాళికామాత, జై దుర్గామాత రాగయుక్తంగా, ధ్వని ప్రధానంగా భజనలు చేస్తున్నారు భక్త జనసమూహం.
రథయాత్ర దాదాపు సముద్ర తీరానికి వచ్చేసింది. కళాధర్ అద్భుతంగా నటిస్తున్నాడు. ఉత్సవాలు బాగా చేస్తాడు కానీ, వచ్చిన దేవాలయ సొమ్మును దిగమింగిన దొంగ ఆలయ అధర్మకర్త. అందుకే కాళికాదేవి ఆగ్రహించింది. కాళికాదేవి చేతుల్లో ఉన్న త్రిశూలం జారి వేగంగా కళాధర్ గుండెల్లోకి దిగిపోయింది. ఇది అద్భుతంగా చాలా సహజంగాను వచ్చిందని డైరక్టర్ విజిల్ వేసి చప్పట్లు కొట్టాడు.
కన్పిస్తున్న అతి భీకరమైన దృశ్యం కల్పితమా! లేక నిజమా! ఎవరికీ అర్థం కావటం లేదు. ఇంకా డప్పులు, డోళ్ళు మ్రోగుతూనే వున్నాయి. అభిరామ్‌ని అన్వేషిస్తూ వచ్చిన ప్రవల్లిక సముద్రంలో అచ్చం అభిరామ్ లాగానే వున్న ఆకారాన్ని చూచింది. అభిరామ్ చేతులు మాత్రం కాపాడమన్నట్లు కన్పించాయి.
అభిరామ్‌కు కట్టిన తాడును విడిపించింది ప్రవల్లిక. అభిరామ్ బ్రతికే ఉన్నాడు. మహాకవి బ్రతికే ఉన్నాడు. కాళికాదేవి రక్షించింది అంటూ హుటాహుటిన హాస్పటలకు తీసుకెళ్లి వైద్యం చేయించారు.
“నేను ఆత్మహత్య చేసుకోలేదు. కవులు పిరికి వాళ్ళు కాదు. నన్ను కళాధర్ అనుచరులు హింసించి, చంపెయ్యాలనే కొట్టి తాళ్ళతో కట్టి సముద్రంలో పడేశారు. ఆ సూసైడ్ నోట్ నేను రాయలేదు” అని ప్రెస్ వాళ్ళకు చెప్పాడు.
ఇంతకాలమైనా వాత్సల్యంతో తనకోసమే ఎదురుచూసిన ప్రవల్లిక చేయిపట్టాడు మహాకవి.

11 Comments
Murali Jeevan
Heart touching story… కళ్ళు చెమ్మగిల్లాయి…కొండూరి కాశీవిశ్వేశ్వరరావు గారి కధ : ౹౹ మహాకవి ౹౹ : ఒక నవ కవి, ఒక నవ రచయిత ఎన్ని అవరోధాలు ఎదురు కోవాలో కళ్ళకు కట్టినట్టు వివరించారు.
ఒక కవి గా, ఒక రచయిత గా ఈ కధలోని పాత్ర అభిరామ్, ఎన్ని అడ్డంకులు వచ్చినా, చివరికి అతను సాధించిన విజయం అందరికి స్ఫూర్తిదాయకం.
Konduri Kasivisveswara Rao
Dhanyavadalu Rallapalli Murali garu
R.Ravi
Good Story
Writer padina kastalu..superb ga chupincharu..
From
R.Ravi
Vaalujada Madhavi
Really Heart touching story. Good take away especially for the parents. Dear parents, please encourage the talent your kid has. Ultimate goal for any human being is just not only money. There is lot more to achieve




Srinivas
అద్భుతః
Ahmed Ali Shaik
Vow.. A wonderful man and a poet… Great job… Climax is heart touching…. Dare and dashing poet and writer… Manasu poorvakamuga namasmanjali. Selavu
Konduri Kasivisveswara Rao
Thank you very much Day.sp Sir
for your valuable comments.
చిత్రవెంకటేష్.
చాల బాగుంది. రచయిత కాశీగారు నాకు మంచి మితృులు. మా ఫ్యామిలి ఫ్రెండ్ కూడా. ఇంతకుముందు ఆయన రచనలు చాల చదివాను. చాల బాగున్నాయి. ఈ కధ కూడా చాల బాగుంది. సరళమైన శైలిలో చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చక్కగా అర్దం అయ్యేలా చెప్పారు. ఇంకా ఆయన కలంనుంచి మంచి కధలు రావాలని మనసారా కోరుకుంటున్నాను.
కొండగుంట వెంకటేష్.
కధ చాల బాగుంది. సరళమైన భాషలో చెప్పదలుచుకున్న విషయాన్ని మనస్సుకు హత్తుకునేలా రాశారు. మీ కలం నుంచి మరి కొన్న మంచి కధలు రావాలని మనసారా కోరుకుంటున్నాను.
Konduri Kasivisveswara Rao
Aakula Raghava Garu Film Director/writer. Kadha chadivaanu, chaala baagundi ani mee amulyamaina abhiprayanni theliya chesinanduku dhanyavadalu.
Konduri Kasivisveswara Rao
Gampala Shankar rao
Story line is superb..and expecting good stories from you in coming days.Best wishes sir.