Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-98: బ్రాహ్మణుల మహిమ

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

బ్రాహ్మణుల మహిమ

ర్మరాజు బ్రాహ్మణుల మహిమని తెలుసుకోవాలని ఉందని అడిగాడు. మర్కండేయమహర్షి “ధర్మరాజా! పూర్వకాలం హైహయ వంశానికి చెందిన దుంధుమారుడు అనే రాజకుమారుడు అడవిలో తిరుగుతూ జింకచర్మాన్ని ఉత్తరీయంగా ధరించి పొదలచాటున ఉన్న ఒక యువకుణ్ని చూశాడు.

పొదలచాటున ఉండడం వల్ల జింక అనుకుని బాణాన్ని వేశాడు. తరువాత దగ్గరికి వెళ్లి చూశాడు. అక్కడ ఒక బ్రాహ్మణుడి మృతదేహం కనిపించింది. ఎంతో దుఃఖపడ్డాడు. రాజధానికి వెళ్లి పెద్దవాళ్లకి విషయం చెప్పి వాళ్లని తీసుకుని వచ్చి మృతదేహన్ని చూపించాడు.

వచ్చిన పెద్దలందరూ దగ్గరలో ఉన్న తర్ క్ష్యుడు అనే మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. ఆ మహర్షిని చూడడానికి దేవతలు, మహర్షులు, సిద్ధులు కూడా ఎదురుచూస్తూ కూర్చునేవాళ్లు. అటువంటి గొప్ప మహర్షి తర్ క్ష్యు మహర్షి.

తన దగ్గరికి వచ్చి నమస్కరించిన హైహయపెద్దల్ని చూసి వాళ్లకి అతిథిమర్యాదలు చెయ్యడానికి తన శిష్యుల్ని నియమించాడు.

హైహయులు ఆ మహర్హికి సాష్టాంగ నమస్కారం చేసి “మహాత్మా! చిన్నవాడైన ఈ రాజకుమారుడు వేటమీద ఉండే ఇష్టంతో జింకచర్మం ధరించి పొదలమాటున ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న బ్రాహ్మణ కుమారుణ్ని జింక అనుకుని బాణంతో కొట్టాడు. ఆ బ్రాహ్మణ కుమారుడు మరణించాడు.

అందువల్ల మేమందరము మహాపాతకులమయ్యాము. మీరు చేసే ఈ అతిథి సత్కారాలు పొందే అర్హత మాకు లేదు. ఈ మహా పాపానికి పరిహారాన్ని చూపించండి. దయచేసి మమ్మల్ని అనుగ్రహించండి” అని చెప్పుకున్నారు.

మహర్షి చిరునవ్వు నవ్వుతూ “నేను చెప్పేది వినండి. ఈ ఆశ్రమంలో ఏప్పుడూ, ఎవరికీ భయం, రోగం, చావు, బంధింపబడడం, వీటి వల్ల కలిగే బాధలు ఉండవు. ఇది మూడు లోకాల్లోవాళ్లకి ఆశ్చర్యం కలిగించే విషయం” అని చెప్పి గొప్ప తపస్సంపన్నుడైన తన కుమారుణ్నిచూపించాడు.

తరువాత హైహయుల్ని అడిగాడు “ఇతడేనా మీ రాజకుమారుడితో చంపబడినవాడు?” అని అడిగాడు.

ఆ బ్రాహ్మణకుమారుడు ఇంతకు ముందు తాము చూసిన చనిపోయిన బ్రాహ్మణ కుమారుడే అని తెలుసుకుని ఆశ్చర్యంతో “మహానుభావా! ఇతడు మరణించి మళ్లీ బతికాడు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత గొప్ప మహిమ మీకు కలగడానికి కారణమేమిటో దయచేసి వివరించండి” అని ప్రార్థించారు.

మహర్షి “ఈ ఆశ్రమంలో మేము కొన్ని నియమాల్ని నిష్ఠతో ఆచరిస్తాము. ఇక్కడ మేము ఎప్పుడూ కాలాన్ని దుర్వినియోగం చెయ్యము. ఆహారాన్ని పరిశుభ్రంగా ఉంచుతాము. అతిథుల్ని పూజిస్తాము. సత్యవ్రతాన్ని పాటిస్తాము. శాంతి, బ్రహ్మచర్యం మాకు గొప్ప అనుష్ఠానాలు.

ఇటువంటి నియమాలు పాటించడం వల్ల మాకు మృత్యుభయం లేదు. అలాగే భయాలు, ఆందోళనలు మాకు ఉండవు. ఇది మా మహిమ. ఇంక మీకు పాపం వస్తుందనే భయం లేదు. మీరు వెళ్లిపోవచ్చు” అన్నాడు.

క్షత్రియ స్వభావము

హైహయులు ఆ మహర్షి దగ్గర సెలవు తీసుకుని తమ ఇళ్లకి వెళ్లిపోయారు. బ్రాహ్మణుల మహత్మ్యం ఇలా ఉంటుంది అని చెప్పి బ్రాహ్మణుల క్షత్రియుల స్వాభావాల్ని వివరించే మరొక కథ కూడా చెప్తాను ప్రశాంతంగా వినండి” అని మార్కండేయ మహర్షి ధర్మరాజుకి మరో కథ చెప్పాడు.

మహానుభావుడైన అత్రి అనే బ్రాహ్మణశ్రేష్ఠుడు తపస్సు చేసుకోడానికి వెడుతూ భార్యతో “నేను తపస్సు చేసుకోడానికి అడవికి వెడుతున్నాను నువ్వు నాతో వస్తావా? నీ కొడుకుల దగ్గర ఉంటావా?” అని అడిగాడు.

అత్రిమహర్షి భార్య “మహానుభావా! కుటుంబ బరువుని ఎలా భరించాలో.. ఎటువంటి ఏర్పాట్లు చేసుకోవాలో.. ఏది అవసరమో పిల్లలకి వివరంగా చెప్పాలి.

జీవించవలసిన విధానము, కట్టుబాట్లు ఏవీ పిల్లలకి చెప్పకుండానే గృహస్థాశ్రమం వదిలిపెట్టి వానప్రస్థానానికి వెళ్లడం మీవంటి వాళ్లకి ధర్మం కాదు.

వైన్యమహారాజు అడిగినవాళ్లకి కావలసినంత ధనం దానం చేస్తాడు. ఆ ప్రభువుని అడిగి అవసరమైన ధనాన్ని సంపాదించి కొడుకులకి ఇచ్చి తరువాత అడవికి వెళ్లవచ్చు” అని చెప్పింది. అత్రిమహర్షికి భార్య చెప్పిన మాటలు ధర్మంగా ఉన్నట్లు అనిపించింది.

కొంతసేపు ఆలోచించి ఆయన వైన్యమహారాజు దగ్గరికి వెళ్లాడు. ఆ సమయంలో వైన్యమహారాజు అశ్వమేధయాగం చేస్తూ బ్రాహ్మణులకి అంతులేని ధనాన్ని దానం చేస్తున్నాడు.

అత్రిమహర్షి ఆ మహారాజు దగ్గరికి వెళ్లి ఆశీర్వదించి “మహారాజా! నువ్వే బ్రహ్మదేవుడివి, నువ్వే ఇంద్రుడివి, అన్ని ధర్మాలు తెలిసినవాడివి. నీతో సమానులైన మహారాజులు ఈ భూప్రపంచంలో ఎవరూ లేరు. మహానుభావులైన గొప్ప ఋషులు నిన్ను ఎప్పుడూ ప్రశంసిస్తూ ఉంటారు” అన్నాడు.

అత్రి మహర్షి మాటలు విని అక్కడే ఉన్న గౌతమమహర్షి కోపగించి “అత్రీ! నువ్వు ధనం మీద ఆశతో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మహారాజు నిజంగా బ్రహ్మదేవుడా? ఇంద్రుడా? శివుడా? ఒక మనిషిని భయం లేకుండా ఇంత గొప్ప చేసి పొగడడం ఎందుకు?” అని అడిగాడు.

అత్రి, గౌతమమహర్షుల సంవాదము

గౌతమమహర్షి మాటలకి అత్రిమహర్షి “ఏది తగినదో.. ఏది తగనిది కాదో.. ఆంతర్యంలో విచారించకుండా నువ్వు అర్థంలేని అధిక ప్రసంగం చేస్తున్నావు. రాజే అన్ని ధర్మాలకి నెలవు.

రాజే స్వచ్ఛమైన నీతి, శౌర్యాలతో లోకాల్ని పరిపాలించే ప్రభువు. ధర్మ రక్షణకి, పరిపాలనకి ఆధారమైన రాజు గొప్పదనాన్ని గుర్తించి ప్రశంసించడం నాకు తగదా?” అని అడిగాడు.

అత్రి మహర్షితో గౌతమమహర్షి “వయసు మళ్లి తలవెంట్రుకలు తెల్లబడగానే నీకు జ్ఞానం వచ్చేస్తుందా? పాండిత్యంలో గొప్పవాడి మాటలే సభలో రాణిస్తాయి. పండితులు జ్ఞానంలో వృద్ధులైనవాళ్ల మాటలే అంగీకరిస్తారు కదా!” అన్నాడు.

వాళ్లిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ పెద్ద గొడవగా మారింది. అక్కడ ఉన్న కశ్యపుడు అనే మహర్షి లేచి “వీళ్లిద్దరి వాదం మనం తీర్చలేము. అన్ని ధర్మాలు తెలిసిన సనత్కుమారుణ్ని అడిగితే ఆయన తగిన విధంగా తీర్పు చెప్తాడు” అన్నాడు.

సభలో ఉన్నవాళ్లు అందరు కలిసి సనత్కుమారుడి దగ్గరికి వెళ్లారు. అత్రి గౌతమమహర్షుల మధ్య జరుగుతున్న వివాదాన్ని వివరించి చెప్పారు.

సనత్కుమారుడు వాళ్లు చెప్పింది విని “అత్రిమహర్షి సరిగ్గానే వాదించాడు. అతడి వాదన నిజమైంది, ధర్మంగా ఉన్నది. ఈ భూమండలాన్ని సమర్థవంతమైన తన భుజాలమీద మోసే నిజమైన క్షత్రియుడు అందరినీ కాపాడే ప్రభువు, శత్రువుల్ని సంహరించేవాడు కనుక ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు అని చెప్పడం తగినదే.

ప్రజల్ని పరిపాలించే ప్రభువు ప్రజలందరితో ఆరాధించ తగినవాడు. శాసించగలిగిన అతడి ఆజ్ఞలవల్లే మంచివాళ్లు, ఋషులు మంచిమార్గంలో నడుస్తారు. ఎవరూ అతడి మాట జవదాటరు.

పరాక్రమంతో భూమి మీద ఉండే ప్రజల్ని రక్షించే ప్రభువు గొప్పతనాన్ని ఏ విధంగా వర్ణించగలం? గొప్పదైన పరిపాలనా దక్షత కలవాడు, గొప్ప ప్రభువు, అదృష్టవంతుడు, నిజాన్ని కాపాడడానికి ఆగ్రహావేశాల్ని ప్రదర్శించేవాడు, ప్రజల్ని క్రమశిక్షణతో నడిపించేవాడు, ధర్మ మార్గంలో నడిచేవాడు అనే అర్థాలతో వేదాలు రాజుని అభివర్ణించాయి.

పూర్వకాలంలో అధర్మం పెరిగిపోతుందేమో అనే భయంతో బ్రాహ్మణులు తమ శక్తి యుక్తుల్ని రాజుల్లో దాచిపెట్టారు. అప్పటి నుంచి బ్రాహ్మణుల తేజస్సు, క్షత్రియుల గొప్పతనం ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉన్నాయి.

క్షత్రియబలం లేని బ్రాహ్మణశక్తి, బ్రాహ్మణశక్తి లేని క్షత్రియుల బలం రాణించవు. క్షత్రియుడు బ్రాహ్మణుల్ని పూజించడం వల్ల తేజస్సుని పొంది సూర్యుడు చీకటిని పోగొట్టినట్టు పాపాల్ని పోగొట్టగలడు. అందువల్ల క్షత్రియుడు అందరికంటె గొప్పవాడు. ఇది నిజం” అని తీర్పు చెప్పాడు.

ఆ తీర్పు విని మహర్షులు వైన్యమహారాజు దగ్గరికి వెళ్లి చెప్పారు. వైన్యమహారాజు అత్రిమహర్షిని గౌరవించి “మహర్షీ! నువ్వు నన్ను అందరికంటే గొప్పవాడినని పొగిడావు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నీకు కోటి ద్రవ్యాల్ని దానంగా ఇస్తున్నాను తీసుకుని వెళ్లు” అని చెప్పాడు.

వైన్యమహారాజు ఇచ్చిన ధనాన్ని తీసుకుని ఇంటికి వెళ్లి దాన్ని కొడుకులకి పంచి పెట్టి అత్రిమహర్షి తపస్సు చేసుకోడానికి అడవికి వెళ్లాడు అని చెప్పాడు” మార్కండేయ మహర్షి.

సరస్వతీ గీత

తరువాత ధర్మరాజుతో “నేను సరస్వతీగీత అనే ఇతిహాసం వినిపిస్తాను. దానిలో అనేక ధర్మసూక్ష్మాలు ఉన్నాయి. నువ్వు వాటిని తెలుసుకోవడం అవసరం. పూర్వకాలంలో తర్ క్ష్యుడు అనే మహర్షి ఉండేవాడు. అతడు సరస్వతీదేవిని గురించి తపస్సు చేశాడు. ఆ దేవి అతడికి ప్రత్యక్షమయింది.

అతడు సరస్వతీదేవితో “దయవుంచి నేను అడుగుతున్న ప్రశ్నలకి సరయిన సమాధానాలు చెప్పు. మనిషి పాటించవలసిన ధర్మం ఏమిటి? మనిషి పుణ్యగతులు ఎలా పొందగలుగుతాడు? ఆ పుణ్యం శాశ్వతంగా ఎలా నిలబడుతుంది? నువ్వు చెప్పే సమాధానాలు నా మనస్సుకి హత్తుకుని ఉండేలా చెప్పు!” అన్నాడు.

సరస్వతీదేవి అతడికి “దీక్షతో నాలుగు వేదాలు పఠించి అనేక యాగాలు చేసి పుణ్యం గడించిన బ్రాహ్మణుడు మరణించిన తరువాత స్వర్గలోకానికి చేరుతాడు. అక్కడ అప్సరసలతో అనేక సంవత్సరాలు సంతోషంగా గడుపుతాడు.

మంచి దూడతో ఉండి ఎక్కువ పాలు ఇస్తున్న మొదటి చూలు ఆవుని యోగ్యుడైన బ్రాహ్మణుడికి దానమిచ్చిన పుణ్యాత్ముడు స్వర్గలోకానికి చేరతాడు. ఆ ఆవు దేహం మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో ఉంటాడు.

బరువు మొయ్యగల బలం కలిగిన కోడె ఎద్దుని బ్రాహ్మణుడికి దానం చేసినవాడు పది ఆవులు దానం చేసిన పుణ్యఫలాన్ని పొందుతాడు. వస్త్రదానం చేసినవాడు చంద్రలోకానికి వెడతాడు. బంగారాన్ని దానం చేస్తే స్వర్గలోకాన్ని పొందుతాడు.

ఎప్పుడూ పవిత్రంగా ఉంటూ అగ్నిహోత్రంలో మానకుండా హవిస్సులు వేల్చి దేవతల్ని తృప్తి పరిచినవాడు చాలాకాలం గోలోకం చేరుకుని సుఖాలు అనుభవిస్తాడు.

అగ్నిహోత్రం నా స్వరూపానికి సంబంధించింది. అన్ని యజ్ఞాలకోసం సమకూర్చుకునే వస్తువులన్నీ నాకు సంబంధించినవే. నేను అగ్నిహోత్రుడి ముఖంలోంచి పుడతాను.

ఆత్మను గురించి పరిజ్ఞానం కలిగిన విద్వాంసులు అందరికి అన్ని సందేహాల్ని తీర్చగలను. ఎప్పుడూ వేదవేదాంగాలు పారాయణ చేస్తూ దానధర్మలు చేసి దుఃఖాలకి అతీతంగా బ్రతికే మహాత్ములు ఉండేచోటే నా గొప్పస్థానం.

తేనె, పాలు, చక్కెర, మాంసం, పిండివంటలు పుష్కలంగా సమర్పించి యజ్ఞాలు చేసి దేవతలకి తృప్తి కలిగించే గొప్పవాళ్లు మరణించిన తరువాత నా లోకానికి చేరతారు” అని చెప్పింది.

ఆమె చెప్పినది విని తర్ క్ష్యుడు భక్తితో నమస్కరించి స్త్రోత్రం చేసి తనను మన్నించమని అడిగి ధన్యుడయాడు” అని చెప్పాడు.

వైవస్వతుడు వృత్తాంతము

తరువాత ధర్మరాజు “మార్కండేయమహర్షీ! వైవస్వతమనువు అంత గొప్పమహిమని ఎలా పొందగలిగాడు? దయచేసి వివరించండి” అని అడిగాడు.

మార్కండేయమహర్షి “ధర్మరాజా! పుణ్యాత్ముడు, సాటిలేని ధైర్యం కలిగిన వైవస్వతుడు చాక్షుషువు అనే మనువు కాలంలో ఆహారం తీసుకోకుండ పదివేల సంవత్సరాలు తీవ్రతపస్సు చేశాడు. చేతులు పైకి ఎత్తి నమస్కరిస్తూ ఒంటికాలిమీద నిలబడి బదరికాశ్రమంలో అనేక సంవత్సరాలు తప్పస్సు చేశాడు.

ఒకరోజు స్నానం చేసి చెరువుగట్టు మీద ఉన్న వైవస్వతుడి దగ్గరికి ఒక చేప వచ్చి “అయ్యా! నేను చాలా చిన్న చేపని. ఈ చెరువులో ఎన్నెన్నో పెద్దపెద్ద జంతువులు ఉన్నాయి. అవి నన్ను సులభంగా తినెయ్యగలవు.

పెద్ద చేపలంటే నాకు చాలా భయం వేస్తోంది. దయచేసి నన్ను వేరే చోటికి తరలించి నన్ను కాపాడు. ఇందుకు ప్రతిగా నేను నీకు ఉపాకారం చేస్తాను” అని అడిగింది.

చేప మాటలు విని వైవస్వతుడు ఆశ్చర్యపోయి ఆ చేపని తీసుకుని వెళ్లి ఒక నూతిలో పడేశాడు. అప్పుడప్పుడు వెళ్లి దాని యోగక్షేమాలు అడిగేవాడు. కొంతకాలానికి ఆ చేప పెద్దగా ఎదిగింది.

వైవస్వతుడితో “మహానుభావా! నువ్వు చేసిన ఉపకారం వల్ల నా శరీరం పెరిగి పెద్దదైంది ఈ నూతిలో స్థలం నాకు తిరగడానికి సరిపోవట్లేదు. నన్ను దయచేసి మరో అనువైన ప్రదేశానికి తీసుకుని వెళ్లు!” అని అడిగింది.

చేప మాటలు విని వైవస్వతుడు దాన్ని చిన్న నూతినుంచి తీసుకుని వెళ్లి పెద్ద నూతిలో విడిచిపెట్టి మళ్లీ దాని యోగక్షేమాలు చూస్తున్నాడు. చేప అక్కడ కూడా రోజురోజుకీ పెరిగిపోయి ఇంక అక్కడ ఉండలేనంది.

దాన్ని తీసుకుని వెళ్లి గంగ మడుగులో వదిలిపెట్టాడు. ఆ చేప పెరిగి పెరిగి గంగమడుగు సరిపోలేదు. వైవస్వతుడు చేపని ఎత్తుకెళ్లి సముద్రంలో విడిచిపెట్టాడు.

చేప మహర్షితో “గొప్పగుణాలు కలిగిన మహర్షీ! నువ్వు దయకలవాడివి. మంచి మనస్సుతో నాకు ఉపకారం చేశావు. నీకు మేలు చెయ్యాలని అనుకుంటున్నాను. నేను చెప్తున్న మాటలు సావధానంగా విను. త్వరలో ప్రళయం రాబోతోంది. అప్పుడు ఈ సృష్టిలో సజీవంగాను, నిర్జీవంగాను ఉన్నపదార్థాలన్నీ నాశనం అవుతాయి. సముద్రాలన్నీ పొంగిపొరలి అన్నీ కలిసిపోయి ప్రవహిస్తాయి. దీన్ని పెద్దలు ‘మన్వంతరసంధి’ అని చెప్తారు.

ప్రళయకాలం వస్తోంది కనుక నువ్వు ఒక ఓడని ఏర్పాటు చేసుకో. ఆ ఓడ గట్టి తాడుతో కట్టబడి చాలాకాలం వరకు పాడవకుండా ఉండాలి. అందులో అన్ని రకాల విత్తనాల గింజల్ని సేకరించి పెట్టు.

నువ్వు సప్తమహర్షులతో కలిసి ఆ ఓడ ఎక్కి సముద్రాన్ని చేరేటప్పుడు నన్ను తలుచుకో. నేను పెద్ద కొమ్ము కలిగిన పెద్ద చేప ఆకారంతో కనిపించి నీకు మేలు చేస్తాను” అని చెప్పింది.

వైవస్వతుడు చేప చెప్పినట్టు ఓడని నిర్మించుకుని సప్తర్షుల్ని ఓడ ఎక్కించుకుని సముద్రంవైపు వెడుతూ చేపని స్మరించుకున్నాడు. వెంటనే చేప అక్కడికి వచ్చింది. పొడవైన కొమ్ము, పెద్ద అకారము కలిగిన ఆ చేప చెప్పినట్టు చాలా పొడవైన తాటిని చేపకున్న పొడుగు కొమ్ముకి కట్టాడు. ఆశ్చర్యం కలిగించేలా చేప ఓడని సముద్రం మధ్యలోకి ఈడ్చుకుని పోయింది.

వైవస్వతుడు సప్తర్షులు ఓడ ఎక్కి సముద్ర మధ్యభాగానికి చేరగానే సముద్రాలన్నీ పొంగిపోయి ఒక్కసారిగా మహాభయంకరంగా విజృంభించి అన్ని ప్రదేశాల్ని ముంచేశాయి.

చెలియలికట్టల్ని తెంచుకుని సముద్రజలాలు మిట్టపల్లాల్ని ఏకం చేసి పైకి ఉబుకుతున్న నీళ్లతో దిక్కులన్నింటినీ ఆక్రమించి లోకాలన్నింటినీ ఏకం చేశాయి. ప్రపంచమంతా ఒకే ఒక సముద్రంగా మారిపోయింది. చేప ఆ నీటి మధ్యభాగంలో అనేక వేల సంవత్సరాలు ఓడను లాగింది.

ఆ వరద తగ్గుముఖం పట్టాక ఓడని హిమాలయపర్వత శిఖరానికి చేర్చి వైవస్వతుడితోను, సప్తర్షులతోను చేప “వైవస్వతా! మహర్షులారా! ఈ పర్వతశిఖరానికి ఓడని కట్టండి” అని చెప్పింది. వాళ్లు చేప చెప్పినట్టు చేశారు. అప్పటినుంచి ఆ శిఖరానికి ‘నౌబంధనం’ అనే పేరు వచ్చింది.

చేప వైవస్వతుడితోను, మహర్షులతోను “ఈ ప్రళయకాలంలో ప్రమాదం రాకుండా మిమ్మల్ని నేను రక్షించాను. నేను ఈ సమస్త విశ్వాన్ని సృష్టించి, పాలిస్తున్న ఏకైక ప్రభువుని. కేవలం మీమీద నాకు కలిగిన వాత్సల్యంవల్ల చేప రూపంలో ఇన్ని విధాలుగా ప్రవర్తించాను.

ఇంక భయం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు జీవించండి. ఈ వైవస్వతమనువు ఇంక చరాచరజగత్తుని సృష్టిస్తాడు. నా వల్ల అతడికి పరమజ్ఞానం కలుగుతుంది” అని చెప్పి చేప మాయమయింది.

వైవస్వతుడు గొప్పతపస్సు చేసి దేవతలు, రాక్షసులు, మనుషులు కలిగిన జగత్తుని సృష్టించాడు. వైవస్వతమన్వంతుడి కథ చాలా గొప్పది. గొప్ప విజ్ఞానం కలిగిస్తుంది. భక్తితో విన్నవాళ్లకి చదివినవాళ్లకి పాపాలన్నీ నశించి ఇహపరసౌఖ్యాలు కలుగుతాయి” అని చెప్పాడు.

మార్కండేయుడు చెప్పిన కథ విని ధర్మరాజు “దేవతలు, మహర్షులతో నమస్కరింపబడిన పాదాలు కలిగిన మార్కండేయమహర్షీ! నువ్వు బ్రహ్మదేవుడితో సమానమైనవాడివి. నీ తపస్సు మహిమ పొగడతగినది. నీ గొప్పతనం చాలా ఆశ్చర్యకరమైనది.

ఈ సృష్టిలో జగత్తులన్నీ నశించిపోతున్న ప్రళయకాలంలో కూడా నువ్వు నశించకుండా బ్రతికి ఉంటావు. ప్రళయానికి తరువాత లోకాలన్నీ పుట్టినప్పుడు కూడా నువ్వు కేవలం సాక్షిగా ఉండి ఉంటావు.

మహర్షీ! ఈ సృష్టి మొత్తం చరాచర ప్రకృతితో సముద్రంలో మునిగిపోయినప్పుడు నువ్వు మనోహరమైన పద్మపీఠంలో ప్రకాశించే బ్రహ్మదేవుడిని ఆరాధించిన పుణ్యవంతుడివి. సృష్టికి ఆధారభూతుడైన ప్రభువు నిన్ను అనుగ్రహించి ఇంతటి గొప్పతనాన్ని ప్రసాదించాడు.

మహానుభావా! మూడులోకాలతో పొగడబడే నువ్వు జగత్తులన్నింటినీ అంతం చేసే యముడి తలని నీ ఎడమ కాలితో తన్ని భయంకరమైన ముసలితనం నుంచి, వ్యాధులనుంచి విముక్తిని పొందావు.

ఇంతటి గొప్పతనం నీకు మాత్రమే సాధ్యమైంది. ఈ చరాచర సృష్టి స్థితి లయల విధాలు అనేకసార్లు ఆవృత్తాలుగా నువ్వు చూశావు. ఇవి పుట్టడం, ఉండడం, గిట్టడం నీకు అనుభవాలే. కనుక ఈ ప్రశ్నలు నిన్నే అడుగుతున్నాను ప్రళయకాలంలో లోకాలు ఏ విధంగా ఉంటాయో వివరంగా చెప్పు” అని అడిగాడు.

Exit mobile version